Saturday, February 9, 2019

హనుమంతుని ప్రసిద్ధ అవతారములలో "శ్రీ పంచముఖ ఆంజనేయ స్వరూపం " చాలా ప్రసిద్ధ మైనది.

హనుమంతుని ప్రసిద్ధ అవతారములలో "శ్రీ పంచముఖ ఆంజనేయ స్వరూపం " చాలా ప్రసిద్ధ మైనది.
ఇందు :
1. పూర్వవదనం-వానర వదనం(శత్రునాశనం)
2. దక్షిణవదనం- నారసింహ వదనం(భయనాశనం)
3. పశ్చిమవదనం- గరుడ వదనం(సర్వరోగనాశనం)
4. ఉత్తరవదనం - వరాహ వదనం(అన్న,సంప దప్రదాయకం)
5. ఊర్ధ్వవదనం- హయగ్రీవ వదనం( సర్వ విద్యాదాయకం)
ఇపుడు,ఈ పంచవదనములను పూర్వవదనం నుండి ఉత్తరవదనం వరకు "సవ్యదిశ"లో (in clockwise direction )23 వ చౌపాయి నుండి 26 వ చౌపాయి కి సంధానించుతూ, 27 వ వదనమును "హయగ్రీవవదనం" కు సంధానించితే, ఈ 5 - చౌపాయిల్లో , స్వామి వారి "పంచముఖతత్వము"ను దర్శింప వచ్చు...
23. పూర్వవానరరూపం:
"ఆపన తేజ సమ్హారో ఆపై! తీనోఁ లోక హాంకఁతే కాంపై!!"
నీ యొక్క అద్భుతమైన తేజోరూపము మూడు రకములు గా భాసిస్తుంది. ఒకటి, సూక్ష్మరూపము.
ఇది నీవు, ఏ సూక్ష్మవానరరూపం తో సీతాదేవి కి ప్రధమదర్శనం ఇచ్చావో, అది నీ "సూక్ష్మరూపం".
రెండు, ఒక పాదం ఉదయాద్రి పై,ఇంకొక పాదం పశ్చిమాద్రి పై నుంచి, సూర్యునివద్ద వేదవేదాంగములు అభ్యసించినావో అది నీ " మధ్యమరూపం".
ఇక నీ మూడో రూపం, సాగారోల్లంఘన సమయం లో, 10-యోజనముల వెడల్పు, 30 -యోజనములు ఎత్తు వున్న నీ
"భీమరూపం " తృతీయ రూపం. ఇట్టి నీ 3-రూపములు తో శోభిల్లు నీ దివ్య వానరరూపం చూచి ముల్లోకాలు కంపించి పోయినాయి".
అట్టి నీ సుందర "పూర్వవానరవదనం "
నకు  నమస్సులు...
24.  దక్షిణనారసింహరూపం:
"భూత పిసాచ నికట నహిఁ ఆవై! మహాబీర జబనామ సునావై!!"
" పాదములలో చక్ర,శంఖ,నాగలి, వజ్రాయుధం,మీనం"వంటి దేవతా చిహ్నములతో, ఐరావత తొండముల వంటి ఊరువులతో,విశాల వక్షస్థలం తో, శంఖ,చక్ర, గద,ఖడ్గముల వంటి ఆయుధములు దాల్చిన అనేక బాహువులతో, వజ్రదేహ,వజ్రకవచ,వజ్రతుండ,వజ్రనఖ,వజ్రముఖ,వజ్రవాల,వజ్రరోమ, వజ్రనేత్ర,వజ్రశిర,వజ్రపాదములతో,ఎర్రని నాలుకతో,నాసిక నుండి వచ్చే వేడి నిట్టూర్పులతో ఉన్న నీ ఘోర "దక్షిణనారసింహ
వదనం"సమస్త భూత,ప్రేత,పిశాచ,బ్రహ్మరాక్షస,బేతాళ,మహామారీత్యాదులనుండి మమ్ము రక్షించుగాక!!!
25. పశ్చిమగరుడవదనము:
"నా సై రోగ హరై సబపీరా!జపత నిరంతర హనుమతబీరా!!"
కాంచనవర్ణముతో,సుపర్ణములతో శోభిల్లుతున్నవాడు,సమస్తఛందోమయుడు,
హరివాహనుడు,మహాబలుడు, అరుణానుజుడు,నాగ కులాంతకుడు,మహాతేజోవంతుడు,అమృతకుంభమును హస్తములందు దాల్చిన వాడు, వినతానందనుడు,మాతృదాస్యవిమోచకుడు,వాయువేగముతో సంచరించగలవాడు,
వైనతేయుడు, ఖగపతి అయిన " పశ్చిమగరుడవదనము"  మమ్ములను వాత జ్వర,పిత్తజ్వర, కఫజ్వర,గ్రహజ్వర, విషజ్వర, శీతజ్వరములనుండి రక్షించు గాక!!!
26.ఉత్తర వరాహవదనము :
"సంకటతేఁ హనుమాన ఛుడావై!మనక్రమ బచన ధ్యాన జోలావై!!"
వరాహవదనం తో విరాజిల్లు ఓ ఆంజనేయా! నీవు యజ్ఞస్వరూపుడవు,యజ్ఞకర్తవు,యజ్ఞభోక్తవు, యజ్ఞ ఫలప్రదాతవు, యజ్ఞరక్షకుడవు,యజ్ఞాధిపతివి,వేదమూర్తివి,నీ చర్మం నుండి సమస్త వేదాలు జనియించాయి, నీ రోమకూపాలనుండి యజ్ఞాజ్ఞులు ఉద్భవించి నాయి, నీ కన్నులనుండి యజ్ఞద్రవ్యంగా నెయ్యి,ముట్టె నుండి "స్రుక్కు", ముక్కు నుండి "సృవము", ఉదరం నుండి "ఇడాపాత్రము", చెవులనుండి,ముఖం నుండి "చమసం", " ప్రాశ్రితం" అనే యజ్ఞపాత్రలు పుట్టాయి, నీవు యజ్ఞాదినాధుడవు!,యజ్ఞవరాహమూర్తివి!, ఓ వేద మయా! విదియనాటి చంద్రరేఖ లా నీ తెల్లని దంష్ట్రలపై భూమండలమును ధరించి,ఉద్ధరించిన ఓ భూరమణా! మమ్ము  సమస్త సంకటముల నుండి రక్షించి ఉద్ధరించు!
27.  ఊర్ద్వహయగ్రీవవదనము:
"సబ పర రామతపస్వీ రాజా!తినకే కాజ సకలతుమ సాజా!!"
"ఓ ఆంజనేయా! నీవు జ్ఞానానందమయుడవు,సర్వవిద్యలకు ఆధారమైన విద్యా స్వరూపుడవు,హయవదనుడవు, విశుద్ధ విజ్ఞానమునకు ఘనస్వరూపుడవు,వాగీశ్వరుడవు,పుస్తకధరుడవు,తపస్వులకు ప్రభువైన శ్రీరాముడు అనే
"రామపరబ్రహ్మం" లో మా బాహ్య,అంతఃప్రవృత్తులు లీనమగు "బ్రహ్మజ్ఞానం" నీ వల్ల మాకు కలుగుగాక!!!
◆ ఈ విధం గా ,స్వామి వారి విరాడ్విశ్వరూపం ను దర్శించి న పిదప,ఈ 5-అవతారముల గురించి, వాల్మీకి రామాయణం లో  కవివాల్మీకి సూటిగా ఎక్కడా ఉటంకించకుండా, స్వామివారి అవతార లీలల్లో మర్మగర్భంగా ,గుప్తం గా ప్రస్తావించటం గమనార్హం...
# పుట్టినది వానరరూపం
# రాక్షసుల సంహారం లో నరసింహుడు
# వేగం లో గరుత్మంతుడు
# శోకసముద్రం లో మునిగిన భూపుత్రిక అయిన సీతమ్మను ఉద్ధరించిన వరాహమూర్తి
# వేద, జ్యోతిష్య,సాముద్రిక,సాహితీ శాస్త్ర విద్యల్లో హయగ్రీవుడు.
◆ తూర్పు, దక్షిణ,పశ్చిమ,ఉత్తర దిక్కులకు చూసే స్వామి  వానర,నారసింహ, గరుడ,వరాహ వదనములు త్రిగుణములతో సర్వవ్యాపితమయం అయిన "సగుణతత్త్వం" కు సంకేతమయితే,శూన్యంగా ఆకాశ దిక్కు వైపు చూసే ఊర్ధ్వహయగ్రీవవదనం "నిర్గుణతత్వము"నకు సంకేతం...
◆  పంచభూతాలతో, పంచవదనములతో,పంచతత్వాలతో,పంచత న్మాత్రలతో సృష్టి నడుపు పరమేశ్వరుడి పంచవదనములు ,రుద్రాంశ సంభూతు డైన
హనుమంతుని వదనములతో క్రింది విధం గా శాస్త్రములు సంధానించినాయి:
1. వానర వదనం- సద్యోజాత
2. నరసింహ- వామదేవ
3. గరుడ- అఘోర
4. వరాహ- తత్పురుష
5. హయగ్రీవ-ఈశాన
" కపివదనాయ,నరసింహాయ,వీరగరుడాయ, ఆదివరాహాయ,హయగ్రీవాయ...
ఆంజనేయాయ నమో నమః!!!
జై హనుమాన్!!!

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS