Saturday, May 2, 2020

శ్రీమత్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి వారి 327 వ ఆరాధన గురుపూజా మహోత్సవ స్వామివారు సజీవ సమాధి నిష్ట వహించిన పవిత్ర పర్వదినం, వైశాఖమాసం శుద్ధదశమి తిథి

శ్రీమత్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి వారి 327 వ ఆరాధన గురుపూజా మహోత్సవ స్వామివారు సజీవ సమాధి నిష్ట వహించిన పవిత్ర పర్వదినం, వైశాఖమాసం శుద్ధదశమి తిథి

ఓం నమో విశ్వకర్మణే
ఓం నమో వీరబ్రహ్మణే శ్రీ మద్విరాట్ పోతులురి వీరబ్రహ్మేంద్ర స్వామి సంగ్రహ చరిత్ర శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి లీలామానుషవిగ్రహుండై యోగులలో యోగిగను, సంసారులలో సంసారిగను,ముముక్షువుల పెన్నిదియు ,పండిత పామర భక్తజన వంద్యుడును,దివ్యఙ్ఞాన ప్రసాదంబగు కాలఙ్ఞాన తత్వోపదేష్టయు, జీవ సమాధి నిష్టితుండు,మహిమాన్వితుండు అస్పృశ్యతా నివారణ జీవహింసా నిరోధన మౌఢ్యభావనా నిర్మూలన భక్తి,ఙ్ఞాన,వైరాగ్యాది సుప్రభోధలు గావించు పరమాత్మ స్వరూపం శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి అట్టి మహామహుని అట్టి పరంజ్యోతి స్వరూపుని అట్టి స్వయం నిర్ణయ సూత్రధారుని సంగ్రహ చరిత్రంబును కూర్పు గావించుచుంటి కొరతలున్న ప్రాఙ్ఞులు మన్నింతురుగాక. కలియుగము 4936 సంవత్సరమున అనగా 15వ శతాబ్దమున శ్రీ పరిపూర్ణ సిద్దలింగాచార్యులు వారిసతీమణి చంద్రశేఖర ప్రకృతాంబకు శ్రీ వీరబ్రహ్మేంద్రులవారు జన్మించిరి ఆ పుణ్య దంపతులు యోగసాధనమున తమ శరీరములను త్యజించుటచే బ్రహ్మేంద్రులవారు సరస్వతీ నదీ తీరమున గల అత్రి ముని ఆశ్రమము నందు దిన దిన ప్రవర్ధమానముగా ఆ బాలకుడు నొప్పారుచుండె కొంత కాలమునకు నందికొండవాసులు బ్రహ్మకులీనులు వీరభోజయాచార్య దంపతులు సంతానరహితులై దేశాటనము చేయుచూ దివ్య స్దలంబులను గాంచుచూ సరస్వతీ నదీ తీరమునందున్న అత్రి ముని ఆశ్రమమునకు వచ్చిరి అప్పుడు అత్రిముని ఆశ్రమ అధిష్టాత వారిని గాంచి దివ్యదృష్టిచే కాగల విషయమును తెలిసుకొని తమ వద్ద నున్న బ్రహ్మేంద్ర బాలుని వారికొసంగి ఈతడు అవతార పురుషుడనియూ, బ్రహ్మేంద్రనాముడనియూ ముందితడు లోకోద్దారకులుగా పోవుచున్నాడనియూ ఇది పరిమళా శ్రమానికి చెప్పి పంపెను. పిమ్మట నందికొండకు భోజేంద్ర దంపతులు వచ్చిరి బ్రహ్మేంద్రుడు పెరుగుచూ ద్వాదశ వత్సరముల ప్రాయుండయ్యెను. అప్పుడాబాలుడు తనపై మహామోహాంధకారమున సంచరించు పాపాంబగారికి జ్ఞానోపదేశం చేసి దేశాటనమునకు అనుజ్ఞకొని రామేశ్వరాధి దివ్యస్థలంబులను గాంచుచూ హరిహర పురంబుచేరి ఆనంద భైరవయోగి రాకకై ఎదురుచూచుచుండెను. ఇంతలోఅవతారుడగు ఆనంద భైరవయోగి కాశీ క్షేత్రము నుండి తాము నీరంబు గ్రోలు ఆవును రక్షింప పులికి ఎక్కుపెట్టిన బాణము ఆవుకు తగిలి అయ్యేది కూలుటచే వచ్చిన గోహత్యకు చింతించుచూ బ్రహ్మేంద్ర దర్శనము కొరకు హరిహర పురంబు వచ్చి బ్రహ్మేంద్రునితో విన్నవించు కొనెను. బ్రహ్మేంద్రుడు ఆ వృత్తాంతము దివ్య దృష్టి చే గ్రహించువాడగుటచే ఆనంద భైరవయోగిని నూరడించి విధి బలీయ్యమని సూచించి ఇట్టు తప్పిదంబునకు దూదేకుల కులములో ముడుమాలలో పుట్టి తనకు శిష్యుడగునట్లున్ను వరమిచ్చి పంపిరి. తరువాత బ్రహ్మేంద్రుడు అచ్చటి నుండి బలగానపల్లికి అరిగి అందు వశించు రెడ్డి కులస్తులు గరిమిరెడ్డి అచ్చమ్మ గారి గృహము జొచ్చి అచ్చోట వశించుచూ వారి గోపాలనము చేయుచూ క్షీరాదిక ఆహారము తీసుకొనుచూ ఆవులనట కొండ సమీప ప్రదేశము నందు గిరిలో నిలిపి బిలంబున తపము చేసుకొనుచూ కాలజ్ఞానము రచించుచూ కాలం బుచ్చుచుండెను. ఇట్లుండా గోపాలురు కొందరు ఈ గిరి గీచి ఆవుల నిల్పు వృత్తాంతమును అప్పుడప్పుడు రెడ్డి దంపతులకు ఎరిగించుచుండు ఒకనాడు చూచి వచ్చు తలంపున రెడ్డి దంపతులు అచ్చోటకేగి నిజము తెలుసుకొని బిలమున తపముగావించున్న బ్రహ్మేంద్రులను చూచి దంపతులు పరమేశ్వర స్వరూపంబుగా భావించి అప్పటి నుండి ఒక మఠంబు కట్టించి అందుల నుండచేసి సేవించుచుండిరి. ఇట్లు జరుగుచుండగా దేవావతారమగు అన్నాజి రాయుడు భక్తి జ్ఞాన వైరాగ్యములను పెంపొంది. దేశాటనము చేయుచూ పుణ్యస్థలంబులను గాంచుచూ బనగానపురి కరుదెంచి శ్రీబ్రహ్మేంద్ర సందర్శనమున కృతార్ధుడై వ్రాయు కాలజ్ఞానమును వినుచూ నుపదేశము పొంది కొంత కాలము అట నివసించుచుండెను. బ్రహ్మేంద్రులు అచ్చట నుండు కాలము పరిసమాప్త నుందులచే ఆ మఠాధిపత్యము నన్నాజీని వహింపచేసి కాలజ్ఞానమును భూస్థాపనమునొనర్చి రెడ్డి దంపతులకు చెప్పవలసిన సర్వస్వము చెప్పి కుముద్వతీ తీరమున వీరభద్రున్ని నిర్మించి దువ్వూరు నుండి కందిమల్లయ్యపురి చేరిరి. కంది మల్లయ్యపల్లిలో ఏకాంబరయోగి మిత్రుడయ్యెను. అచ్చట కొందరు రోగులను ఉద్దరించుచూ అనేక భక్తులకు జ్ఞానబోధచేయుచూ వచ్చిరి. పెదకోమెర్లలో తమ యాజ్ఞచే శివకోటయ్య దంపతులకు పుట్టి గోవిందమ్మను పేర పెరుగుచున్న కన్యకను పెళ్ళాడి నిరాడంబరముగా, సుఖంబుగా కాలంబుచ్చుచుండిరి. అద్వైత తత్వముల రచించిరి పోలేరి శిలను బాలికను చేసి సభలో మాట్లాడించిరి. సర్పదష్టుడై ప్రాణంబుల గోల్పోయిన బాలుని బ్రతికించిరి. క్రమక్రమముగా లింగాచార్యులు, గోవిందస్వామి, శివరామయ్య, ఓంకారయ్య, పోతులూరయ్య అను యేవురు పుత్రులను ఒక కుమార్తెను గాంచిరి. వారందరికీ వైవాహికంబులను గొనర్చిరి. మఠంబును పూర్తిచేసుకొనిరి. ఇంతలో సిద్దయ్య జన్మించి పెరిగి పెద్దవాడై బ్రహ్మేంద్ర భక్తుడై మత కట్టుబాట్లు సైతం వదలి, అల్లా వారి ఆజ్ఞాను సారంబుగ జననీజనకుల సెలవంది గురు కటాక్షమునకు బ్రహ్మేంద్ర వద్దకు చేరి నమస్కరించి కటాక్షమునివ్వమని కోరెను. అప్పుడు వద్ద నున్న గోవింద స్వామి పోతులూరయ్య చార్యులు ఏకాంబర యోగి గార్లు శిద్దని మనసు అరయ గోరి పైకి అనుగ్రహించుటకు వీలుకాదనిరి. తరువాత వాని మనోభావమునకు సమ్మతించిరి. కటాక్షము ఇప్పించిరి అది మొదలు అయ్యగారి ఆజ్ఞచే శిద్దడు ముడుమాల నుండి వచ్చుచూ పోవుచుండెను. ఇట్లు కొంత కాలం జరుగు సిద్ధుడొకనాడు సిద్ధవట సమీపమున మార్గంబున ఒక కొలను వద్ద అనుష్టానము గావించుకొనుచుండ సిద్దవట రాజభటులు నమస్కరింప ప్రతి నమస్కారము చేయని కారణమున నాతని తాళ్ళతో బంధించి నవాబు దగ్గరికి తీసికొని పోయిరి. నవాబు ఈ వృత్తాంతమునంతయు తెలుసుకొని సిద్దున్ని నీవేల నమస్కరింపలేదన శిద్దడు నా నమస్కారంబు మీరు భరింపలేరనిరి. అందుపైన నవాబు ఏల భరింపలేరనగా ఒకరాతిని తెప్పింపుడని శిద్దడు అద్దానికి నమస్కరింప తాళ్ళు తెగుటయే కాక రాయి బద్దలయ్యెను. అప్పుడు అందరూ ఆశ్చర్యపడిరి. నవాబు గారు సిద్దని మహిమయే ఇంత కలదు. ఇక వీరి గురుని మహిమ ఎంత కలదో చూచెదమని సిద్ధయ్యని బ్రహ్మేంద్రున్ని తోడ్కొనిరమ్మని పంపగా అంతక్రితమే తుది సంచారము ఒనర్పదలచుకొన్న బ్రహేంద్రుడు అందుకు సమ్మతించి రేపే బయలుదేరుదమని మంత్రినినంపివేసెను. మరునాడు శిద్దయ్యతో ఏకాంభరయోగి ఇత్యాది శిష్యులతో బ్రహ్మేంద్రుడు ప్రయాణమై శిద్దవటమును బోవుటకు మార్గమధ్యమున పుష్పగిరి అను అగ్రహారము వీధి గుండా అధ్యయనము చెప్పుకొనుచూ నడచుచుండ అగ్రహారీకులు ఎదురై వాదమోనర్చి భంగ పడిరి. బ్రహ్మేంద్రునకు శిష్యులయ్యిరి. పిమ్మట బ్రహ్మేంద్రులు శిద్దవటముబోగా నవాబు ప్రతుర్ధానమోనర్చి నమస్కరించి ఉచిత ఆసనముపై కూర్చుండచేసి స్వామి! పరబ్రహ్మము సాకారుడా నిరాకారుడా పునర్జన్మ కలదా, లేదా కులములందు కొన్ని కులములు తక్కువ కొన్ని కులములు ఎక్కువ గలవా? అని ప్రశ్నించిరి. అందులకు బ్రహ్మేంద్రుడు గుణములన్నీ ఒక్కటే అని బోధ గావించెను అంతట నవాబు గారు లేచి స్వామి తమ బోధ మిక్కిలి బాగున్నది. నా మనవి నాలించి తాము విందు ఆరగింపవలెనని కోరెను బ్రహ్మేంద్రుడు సరే కానీండని తెచ్చిన పదార్ధ పళ్లెముపై జలమను ప్రోక్షించి ఫలపుష్పాదులుగా మార్చిరి. అంతట అప్పుడు అందరూ ఆశ్చర్యపడిరి. నవాబును మిక్కిలి స్తోత్రము మొనర్చి తాము మాదేశంలో ఉండవలెననియూ ఇట్టి మహిమ ఎప్పుడూ కనలేదనియూ తమ శిష్యులందు నన్నొక్కనిగా జేర్పవననియూ పేర్కొని కొంత భూమిని జాగీరుగా వ్రాసి ఇచ్చి సన్మానించిరి. బ్రహ్మేంద్రులు అందుకు సమ్మతించి నవాబునకు ఉపదేశించి వెడలిరి. అచ్చట నుండి జ్ఞానబోధ చేయుచూ కళ్యాణనగరము, హంపి, విరూపాక్షము లోనగు అనేక దివ్యస్థలంబుల తుది సంచారమోనర్చి లోకంబు జ్ఞానమయంబుగా మార్చిరి. చేయవలసిన కృత్యంబులు తుదముట్టుటచే అవతార ప్రయోజనంబు తీరుటచే సమాధి నిష్ట వహింప తలంచి ప్రకటించిరి. అది వైశాఖమాసం శుద్ధ నవమి దివసమునాడు గోవిందస్వామి తండ్రి ఆదేశమును శిరసావహించి వలయు పరికరంబులు అన్నియూ సమకూర్చుటకు నియమించి శిద్దని పూజకు కావలసిన పుష్పంబులను తీసుకొనిరాయని బలగానిపల్లెకు పంపెనాతడు మధ్యాహ్నం వెడలిపోయెను. మరునాడు శుద్ధ దశమి అగుటచే మహాజనులు, భక్తులు, సాధులు మహోత్సవము జరిపిరి. అంతట బ్రహ్మేంద్రుడు సమాధి వద్ద నిలిచి ఇంటి వారికి, భక్తులకు మొదలగు వారి చెప్పవలసిన ఎంతో ఉపన్యాసము చెప్పి ముగించి సమాధినలంకరించిరి. పిమ్మట భక్తాదులు టెంకాయలు కొట్టి కర్పూర హారతి వెలిగించి నమస్కారములు గావించి సమాధి మూసి పైన శ్రీ వారి ఇత్తడి శిర ప్రతిష్ట గావించిరి. భక్త సమారాధన జరిగెను. ప్రొద్దుగూకె అప్పుటికి అనేక బాధలు పడుచూ శిద్దడు పుష్పములు గైకొనివచ్చి సమాధిని చూచి దుఃఖించి శ్రీవారి దర్శనంబుకై అరయోగంబును బూని నిర్వికల్ప సమాధి చెందియుండెను. రెండు దినములు ఇట్లు జరిగే. మూడవరోజు శిష్యుని ప్రభావతాపాగ్ని సోకుటచే బ్రహ్మేంద్రుడు లింగోద్భవ కాలమున ప్రత్యక్షమై శిద్దనికి చెప్పవలసిన సర్వస్వము చెప్పి విశ్వరూప సందర్శనము చూపి అవతార కారణంబులు సూచించి నీవిక ముడమాల చేరుమని బోధించి తాము అదృశ్యులయ్యిరి. మంగళము మంగళము మంగళము మాతృ గోవిందమాంబేశ | మంగళంబు మంద హాసముఖాంభోజ | మంగళంబు మధుర రసయుత వాగ్గాల | మంగళంబు మంగళ ప్రద బ్రహ్మేంద్ర | మంగళంబు శ్రీ వీర బ్రహ్మేంద్రుని సంగ్రహ చరిత్రను ఎవ్వారలు చదివినా,వినినా,పారాయణముచేసినా అఖిలైశ్వర్యములు కలిగి పరమేశ్వర సాయిజ్యము పొందుదురు ...శుభం నమో విశ్వకర్మణే - నమో వీరబ్రహ్మణే సంకలనం ...ఇంకొల్లు మధుసూదనాచార్య.

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS