Thursday, July 12, 2018

మూకశంకరులు - మూకపంచశతి




మూకశంకరులు - మూకపంచశతి
జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ ఆది శంకర భాగవత్పాదాచార్యుల వారు దిగ్విజయములను పూర్తి చేసిన తరువాత మోక్షపురి అయిన కాంచీపురం లో సర్వజ్ఞ పీఠం స్థాపించారు, అదే మన కంచి కామకోటి పీఠం. ఆది శంకరుల తరువాత ఈ పీఠమును అధిష్టించిన వారు శ్రీ సురేశ్వరాచార్యుల వారు. వారి తరువాత ఉత్తరాధికారం శ్రీ సర్వజ్ఞాత్మన్ సరస్వతి స్వామి వారు నిర్వహించారు. ఆనాటి నుండి ఈనాటి వరకు నిరంతర జగద్గురు పరంపర కొనసాగుతూనే ఉంది.
ఆ గురుపరంపర లో మనకు తెలిసిన ప్రఖ్యాతి గాంచిన జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ కృపా శంకరులు, శ్రీ శ్రీ శ్రీ మూక శంకరులు, శ్రీ శ్రీ శ్రీ అభినవ శంకరులు, శ్రీ శ్రీ శ్రీ పరమశివేంద్ర సరస్వతి, శ్రీ శ్రీ శ్రీ భోధేంద్ర సరస్వతి మరియు ఈ తరములో ఉన్న మనందరికీ తెలిసిన అరవై ఎనిమిదవ పీఠాధిపతి నడిచే దేవుడు, పరమాచార్య శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు. శ్రీ పరమాచార్య తరువాత ప్రస్తుత తరములో ఉన్న జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి వారు మరియు శ్రీ శ్రీ శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి వారు.
ఈ ఆచార్య పరంపరలో 20 వ పీఠాధిపతి గా ఉన్న వారు శ్రీ శ్రీ శ్రీ మూక శంకరేంద్ర సరస్వతి స్వామి వారు. వీరినే మనం మూక శంకరులు అని అంటాము. వీరు క్రీస్తు శకం 398 నుండి 437 వరకు పీఠాధిపతిగా ఉన్నారు. వీరి తండ్రి గారి పేరు శ్రీ విద్యావతి, వారు ఒక ఖగోళ జ్యోతిష్యుడు. మూక శంకరులు పుట్టుకతోనే మూగ-చెవుడు ఉన్నవారు. అందుచేతనే వీరిని మూక కవి అనేవారు. కానీ అమ్మ వారి కటాక్షం ఉంటే, పుట్టుకతో మాటలు రాని వాడు మాట్లాడతాడు అనడానికి మూక శంకరుల జీవితమే నిదర్శనం.
ఒక రోజు మూక శంకరులు కామాక్షీ అమ్మ వారి ఆలయంలో కూర్చుని ఉన్నారు. వారితో పాటు వేరొక సాధకుడు కూడా అమ్మని ధ్యానిస్తూ కూర్చున్నారు. కామాక్షీ అమ్మ వీరిని అనుగ్రహించదలిచి, కర చరణాదులతో ఒక స్త్రీ రూపంలో కదలి వచ్చింది. అలా వచ్చిన అమ్మ వారు తాంబూల చర్వణం చేస్తూ, అమ్మ నోటిలోంచి ఆ తాంబూలం ముద్ద (పిడచ) కొంచెం తీసి మూక శంకరుల ప్రక్కన ఉన్న సాధకుడికి ఇచ్చింది. ఆయన పాపం అమ్మ యొక్క ఆగమనం గుర్తించలేక, మామూలు ఒక స్త్రీ అనుకుని, ఎంగిలి అనే భావముతో అమ్మ ఇచ్చిన తాంబూలం స్వీకరించ లేదు.
కామాక్షీ అమ్మ వెంటనే ఆ తాంబూలమును మూక శంకరుల చేతికి ఇచ్చింది. మహా ప్రసాదంగా తీసుకుని కళ్ళకద్దుకుని నోట్లో వేసుకున్నారు మూక శంకరులు. అంతే తక్షణమే కామాక్షీ అమ్మ వారి అనుగ్రహముతో మూక శంకరులకి మాట వచ్చింది. మాట రాగానే, ఆయనలో కవితా ప్రవాహం పెల్లుబికింది, వెంటనే కామాక్షీ అమ్మ వారిని చూస్తూ ఆశువుగా ఐదు వందల శ్లోకాలు చెప్పారు మూక శంకరులు. ఈ ఐదు వందల శ్లోకాలను కలిపి మూక పంచశతి అంటారు. ఇందులో అమ్మ వారి యొక్క గొప్ప తనం వివరిస్తూ నూరు శ్లోకములు (దీనిని ఆర్యా శతకము అంటారు), అమ్మ వారిని స్తుతి చేస్తూ నూరు శ్లోకములు స్తుతి శతకము), అమ్మ వారి కన్నులు చూస్తూ నూరు శ్లోకములు (కటాక్ష శతకము), అమ్మ వారి నవ్వును స్తుతిస్తూ నూరు శ్లోకములు (మందస్మిత శతకము) & అమ్మ వారి యొక్క పాదములు స్తుతి చేస్తూ నూరు శ్లోకములు (పాదారవింద శతకము), ఇలా మొత్తం కలిపి ఐదు వందల శ్లోకములు చేశారు.
కామాక్షీ అమ్మ అనుగ్రహముతో మాట వచ్చిన మూక శంకరులు భక్తి పారవశ్యంతో చేసిన స్తోత్ర రత్న మాలయే "మూక పంచ శతి". ఇవి ఐదు శతకాలుగా ఉంటాయి.
1. ఆర్యా శతకం
2. స్తుతి శతకం
3. కటాక్ష శతకం
4. మందస్మిత శతకం
5. పాదారవింద శతకం
ఈ పంచశతి సాక్షాత్తు కామాక్షీ అమ్మవారే చెప్పారు అంటారు పెద్దలు. అమ్మయే మూక శంకరులలో ప్రవేశించి, భావి తరాల వారు ఉద్ధరింపబడాలని ఇంత అద్భుతమైన శ్లోకములను కటాక్షించింది జగన్మాత కామాక్షీ అమ్మ.
అమ్మ అనుగ్రహముతో మాటలు వచ్చి, ఐదు శతకములతో అమ్మని స్తోత్రం చేసిన తరువాత కామాక్షీ అమ్మ ఏమి వరం కావాలి అని అడిగింది. అప్పుడు మూక శంకరులు "అమ్మా, నోరు లేనివాడి చేత ఇంత స్తోత్రం చేయించి అనుగ్రహించావు, ఏ నోటితో నీ స్వరూపమును కీర్తించగలిగానో, ఆ నోటితో ఇక వేరే మాటలు మాట్లాడలేనమ్మా, కాబట్టి నన్ను మళ్ళీ మూగ వాడిని చెయ్యి" అని వేడుకుంటారు. అమ్మ అనుగ్రహించి మళ్ళీ మూక శంకరుల యొక్క మాట్లాడే శక్తిని తీసివేసింది.
ఈ విషయం తెలుసుకున్న అప్పటి కామకోటి పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ మార్తాండ విద్యా ఘనేంద్ర సరస్వతి స్వామి వారు వీరి తల్లి తండ్రులకు కబురు పంపారు. ఈ పిల్లవాడికి పీఠం యొక్క ఉత్తరాధికారం ఇవ్వాలని ఉంది, మీరు అనుమితిస్తే సన్యాసం ఇస్తాను ఈ పిల్లవాడికి అని అడిగారు. తల్లి తండ్రులు సంతోషంతో అంగీకరించడంతో, వారు తరువాత పీఠాధిపతి అయ్యారు. ఉజ్జయినీ సామ్రాజ్యం పాలించిన విక్రమాదిత్యుడు, కాశ్మీర్ రాజు ప్రవరసేనుడు, మాత్రుగుప్తుడు మొదలగు వారు మూక శంకరాచార్యుల వారిని అనన్య భక్తితో సేవించారు.
ఈ విధంగా కామాక్షీ అమ్మ వారి సేవలో తరించిన మూక శంకరులు శ్రీ ధాతు నామ సంవత్సరములో శ్రావణ పౌర్ణమి నాడు, మన గోదావరీ నదీ తీరంలోనే ముక్తిని పొంది, కామాక్షి-ఏకాంబరేశ్వరులలో ఐక్యం అయ్యారు.
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS