Thursday, January 4, 2024

పంచ ప్రయాగల వైశిష్ట్యం*

_*పంచ ప్రయాగల వైశిష్ట్యం*_



ప్రయాగ అంటే సంగమం. రెండు లేదా అంతకంటే ఎక్కువ నదులు సంగమించే (కలిసిపోయే) పవిత్ర స్థలం.

*కేదార్ నాథ్, బదరీ నాథ్ వెళ్ళే మార్గంలో పంచ ప్రయాగలు అని పిలువబడే అయిదు పవిత్ర సంగమ స్థానాలు ఉన్నాయి.*
 అవి

1) విష్ణు ప్రయాగ,
2) నంద ప్రయాగ,
3) కర్ణ ప్రయాగ, 
4) రుద్ర ప్రయాగ,
5) దేవ ప్రయాగ.

*ఈ ఐదింటిని కలిపి పంచ ప్రయాగలు అని పిలుస్తారు. ఈ క్షేత్రాలు మోక్షప్రదాలని నమ్మకం.*

*🌺విష్ణు ప్రయాగ* బదరీనాథ్‌కి దక్షిణంగా 38 కి.మీ., దూరంలో విష్ణు ప్రయాగ ఉన్నది. విష్ణు ప్రయాగకు తూర్పుగా కొంతదూరంలో *'నితి'* అనే లోయ ఉంది. *ఆ లోయలో ఉన్న కొండశిఖరాల మీది మంచు కరిగిన నీరు, ఒక నదీ ప్రవాహంగా మారి ధౌలి గంగ* (ధవళ గంగ) *అనే పేరుతో పడమటి దిక్కుగా ప్రవహిస్తూ వచ్చి విష్ణు ప్రయాగ దగ్గర అలకనంద నదిలో కలిసిపోతుంది.* విష్ణుమూర్తి వీర నారాయణ రూపం ధరించి, తపస్సు చేయడానికి బదరికావనం వెళుతూ, ఈ సంగమం దగ్గర కొంతకాలం తపస్సు చేశాడట. *అందువల్ల ఈ పవిత్ర ప్రదేశానికి విష్ణు ప్రయాగ అనే పేరు వచ్చింది. ఇక్కడ శ్రీ మహావిష్ణువుకి సంబంధించిన ఒక పురాతన ఆలయం ఉంది.*

*🌺నంద ప్రయాగ* బదరీనాథ్‌కి దక్షిణ దిశలో సుమారు 106 కి.మీ. దూరాన నంద ప్రయాగ ఉన్నది. ఇక్కడకు ఈశాన్యంగా సుమారు 75 కి.మీ దూరంలో నందాదేవి పర్వత శిఖరం ఉన్నది. ఆ శిఖరం చుట్టూ ఉన్న పర్వతాల మధ్య, ఒక మంచులోయ ఉన్నది. ఆ లోయలో నుండి, నందాకిని అనే చిన్న నది పడమటి దిక్కుగా ప్రవహిస్తూ వచ్చి, అలకనందలో కలుస్తుంది. *నందాదేవి శిఖర ప్రాంతంలో జన్మించిన కారణంగా ఇది నందాకిని అని పిలవబడుతుంది.* ఈ నది పేరు మీద ఈ సంగమ ప్రదేశం నంద ప్రయాగగా ప్రసిద్ధి చెందింది. *పూర్వం నందుడు అనే ఒక చక్రవర్తి ఈ పవిత్ర సంగమం దగ్గర గొప్ప యజ్ఞాన్ని చేశాడట. అందుచేత ఆయన పేరు మీద ఈ ప్రదేశానికి నంద ప్రయాగ అనే పేరు వచ్చిందని మరొక ఐతిహ్యం కూడా ఉంది.*


*🌺కర్ణ ప్రయాగ*
 నంద ప్రయాగ తర్వాత అలకనంద నది యొక్క దిశ కొంత నైఋతి దిక్కుగా మారుతుంది. నంద ప్రయాగ తర్వాత సుమారు 22 కి.మీ., దూరంలో, *అంటే బదరీనాథ్ నుండి 128 కి.మీ., దూరంలో కర్ణ ప్రయాగ ఉన్నది.* ఇక్కడికి తూర్పుగా సుమారు 100 కి.మీ, దూరంలో ఉన్న ఒక మంచు లోయలో నుండి *'పిడరగంగ'* అనే నది ప్రవహిస్తూ వచ్చి, అలకనందలో కలుస్తుంది. ఈ రెండు నదుల సంగమం వద్ద మహాభారత కథలోని కర్ణుడు సూర్యభగవానుని గూర్చి గొప్ప తపస్సు చేసాడని స్థలపురాణం. *ఆ కారణంగా ఈ సంగమానికి కర్ణ ప్రయాగ అనే పేరు వచ్చింది.* ఇచ్చటనే ఉమాదేవికి చక్కని ఆలయం ఉన్నది.

*🌺రుద్ర ప్రయాగ*
 కర్ణ ప్రయాగకి నైఋతి దిశలో సుమారు 31 కి.మీ. దూరంలో, *అంటే బదరీనాథ్‌కి 159 కి.మీ., దూరంలో రుద్ర ప్రయాగ ఉన్నది.* హరిద్వార్ - ఋషీకేష్‌ల నుండి వచ్చే రోడ్డు మార్గం రుద్రప్రయాగ దగ్గర రెండుగా చీలి, ఒక మార్గం కేదార్ నాథ్ వైపుకు, మరొకటి బదరీనాథ్ వైపుకు సాగిపోతాయి. కేదార్ నాథ్ వెనుక ఉన్న కొండలలో జన్మించిన మందాకిని నది, దక్షిణంగా ప్రవహిస్తూ అలకనందలో కలిసే ప్రదేశమే రుద్రప్రయాగ అటుపైన ఇక మందాకిని నది ఉనికి ఉండదు అనే చేప్పాలి. కేవలం మందాకిని నదితో కలిసిన అలకనంద మాత్రమే ముందుకు సాగిపోతుంది.
 *ఈ రుద్ర ప్రయాగలో నారద మహర్షి కొంతకాలం తపస్సు చేశాడని స్థలపురాణం చెబుతుంది.* ఈ ఊరిలో చాలా పురాతన కాలం నాటి జగదాంబ దేవి అనే అమ్మవారి ఆలయమూ, రుద్రనాథ్ అనే శివాలయం ఉన్నాయి. 
*ఈ స్వామి పేరున ఈ ఊరు రుద్రప్రయాగ అని ప్రసిద్ధి చెందింది.*

*🌺దేవ ప్రయాగ* ఉత్తరాఖండ్‌లో టెహ్రీ గర్వాల్ జిల్లాలో సముద్రమట్టానికి 2723 అడుగుల ఎత్తులో ఉన్న ఒక ప్రసిద్ధ పట్టణం దేవప్రయాగ. ఉత్తరాంచల్ రాష్ట్రంలోని హృషికేష్ నుండి 70 కి.మీ., దూరంలో బదరీనాథ్ వెళ్ళే దారిలో ఈ క్షేత్రం ఉంది. ఈ పట్టణానికి ఇక్కడ నివసించిన ఒక ప్రఖ్యాత హిందూ యోగి దేవ్ శర్మ పేరు పెట్టారు. *108 దివ్య తిరుపతులలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రంలో కేదార్‌నాథ్‌లో పుట్టిన మందాకినీ నది, బదరీనాథ్, కొండల్లో వచ్చిన అలకనందా నది, గంగోత్రిలో పుట్టిన గంగానది మూడు నదులు ఇచ్చట కలుసుకుంటాయి. "త్రివేణి సంగమంగా పవిత్రమైన ఈ పుణ్యక్షేత్రం శ్రాద్ధ కర్మలకు ప్రసిద్ధి చెందినది".* బ్రహ్మచర్య వ్రతంతో నాలుగు నెలల కాలం ఇక్కడ అష్టాక్షరీ మంత్రాన్ని జపిస్తే మోక్షప్రాప్తి కల్గుతుందని శివుడు నారదునితో చెప్పినట్లు స్కాంద పురాణం వివరిస్తుంది. 
*ఈ దేవ ప్రయాగ దగ్గర, గంగోత్రి నుండి వచ్చిన భాగీరథీ నది గంగానదిలో కలిసిపోతుంది.*

దేవ ప్రయాగ తర్వాత ఉండే ప్రవాహం గంగానది అనే పేరుతో పిలవబడుతుంది. *అటు భాగీరథి, ఇటు అలకనంద నదులు ఈ రెండు తమ ఉనికిని ఈ దేవ ప్రయాగతో కోల్పోతాయి.* దేవ ప్రయాగ ఊరు కొండ ఏటవాలులో, వరుసలుగా మెట్లు మెట్లుగా ఉంటుంది. *పురాణాల ప్రకారం శ్రీరాముడు మరియు అతని తండ్రియైన దశరథ మహారాజు ఇక్కడే తపస్సు చేశారు.* పాండవులు కూడా ఈ క్షేత్రాన్ని దర్శించి ఈ నదిలో స్నానం చేసి స్వామివారిని దర్శించారని ప్రతీతి. ఇచ్చట సీతారాముల ఆలయం ఉంది. భక్తులు స్వామిని *"రఘునాథ్‌జీ"* గా కొలుస్తారు. ఈ ఆలయానికి వెనకవైపున హనుమాన్ ఆలయం కూడా ఉన్నది. ప్రధాన దేవాలయంలోని *"నీలమేఘ పెరుమాళ్"* ఆనాడు భరద్వాజ మహర్షికి ప్రత్యక్షమైనట్లు, *స్వామిని పెరియాళ్వార్, తిరుమంగై ఆళ్వార్ కీర్తించినట్లు స్థలపురాణం ద్వారా తెలుస్తుంది*

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS