ఇదే పంచాక్షరీమహా మంత్రం, ఈ మంత్రం యజుర్వేదం రుద్రాధ్యాయం లోనిది.
అన్ని కోర్కెలనూ నెరవేర్చే కల్పవృక్షం ఈ మంత్రం.
దీని ఉచ్చరణ వల్ల చిత్తశుద్ధి, జ్ఞానప్రాప్తి లభిస్తాయని పురాణాల్లో తెలిపారు.
ఈ మంత్రంలో ‘ఓం’తో సహా ఆరు అక్షరాలున్నాయి. ప్రతి మంత్రానికి ముందు ఓం ఉంటుంది.
కాబట్టి, దాన్ని వదిలేసి లెక్కిస్తే ఐదక్షరాలే. అలా అని ఓంకారాన్ని వదలరాదు.
‘న, మ, శి, వ, య. మంత్రం’ ‘ఓం’ కారంతో ప్రారంభం అవుతుంది. ఓం... మహాబీజాక్షరం.
దీని నుంచే మిగిలిన అక్షరాలన్నీ ఆవిర్భవించాయని చెబుతారు. ఈ మంత్రంలో ఉన్న అక్షరాలకు ‘అర్థం, పరమార్థం’ రెండూ ఉన్నాయి.
‘న’ అనేది భగవంతునిలోని కాంతిని తెలియచేస్తున్నా ఈ పంచాక్షరాలను పంచభూతాలు అని కూడా అంటారు.
న అంటే భూమి,
మ అంటే నీరు,
శి అంటే నిప్పు,
వ అంటే గాలి,
య అంటే ఆకాశం అని ఈ మంత్రంలో ఉన్న అక్షరాలకు నిర్వచనం చెప్పారు.
ఈ మంత్రం ఆధ్యాత్మికతకు ఉపయోగపడుతుందని, ఈ మంత్రోచ్చారణ వల్ల నాడులు పరిశుభ్రమై, మనసులో ప్రశాంతత నెలకుంటుందని పండితులు చెబుతారు.
దీనిని పదేపదే ఉచ్చరించడం వల్ల మనిషిలో ఉండే తమో, రజోగుణం పోయి ఆధ్యాత్మిక భావన పెరుగుతుందని కూడా ఆధ్యాత్మికవేత్తలు బోధిస్తున్నారు.
ఈ మంత్రం వెనుక ఎంతో పరమార్థం ఉంది.
మానవ శరీరం పంచభూతాత్మకం.
నమశ్శివాయ అనే అయిదు అక్షరాలను పలికినప్పుడు పంచ భూతాలతో నిండిన శరీరం శుభ్రమవుతుంది.
ఒక్కో అక్షరం ఒక్కో భూతాన్ని శుభ్రం చేస్తుంది.
‘న’ భూమికి సంబంధించిన భాగాలను,
‘మ’ నీటికి సంబంధించిన భాగాలను,
‘శి’ అగ్నికి సంబంధించిన భాగాలను,
‘వ’ గాలికి సంబంధించిన భాగాలను,
‘య’ ఆకాశానికి సంబంధించిన భాగాలను పరిశుభ్రం చేస్తాయి.
మనసు, శరీరం పరిశుభ్రంగా లేనంతవరకు మనిషిలో ఆధ్యాత్మిక భావన స్వచ్ఛంగా నిలబడదు.
అందువల్లే ఓం నమశ్శివాయ అనే పదాన్ని పదేపదే ఉచ్చరిస్తే, మానసిక ప్రశాంతత ఏర్పడుతుందనడంలో ఏ మాత్రం సందేహం అక్కర్లేదని పౌరాణికులు చెబుతారు.
భగవంతుడి నామాన్ని అర్థం తెలియకపోయినా భక్తితో ఉచ్చరించినా తగినంత ఫలం లభిస్తుంది.
శివభక్తుడైన సౌనందగణేశ ముని ఒకసారి యమలోకానికి వెళ్లగా యమధర్మరాజు ఆయనను సత్కరించి, వచ్చిన కారణమేంటని అడిగాడు.
తాను యమలోకంలోని విశేషాలను చూడడానికి వచ్చినట్లు ముని చెప్పారు.
దీంతో తన లోకంలో నరకయాతనలు అనుభవిస్తున్న పాపాత్ములను యముడు ఆ మునికి చూపించాడు.
వారి పరిస్థితికి జాలిపడిన ఆ మహర్షి.. ఓ జనులారా! ఇది ‘ఓం నమశ్శివాయ’ అనే మంత్రం దీనిని ఉచ్చరిస్తే మీ యాతనలు పటాపంచలవుతాయని తెలిపారు.
ముని ని చెప్పగా వారంతా పంచాక్షరిని జపించారు.
దీంతో వారికి నరక విముక్తి లభించి, అంతా కైలాసం చేరుకున్నారట.
ఆ మహర్షి వారికి పంచాక్షరి మంత్రానికి అర్థం బోధించలేదు. కానీ భక్తితో ఉచ్చరించినంతమాత్రానే వారికి కైలాసం లభించింది.
అర్థయుక్తంగా ఉచ్చరిస్తే ‘అధికస్య అధికం ఫలమ్’ అన్నట్టు అధికంగా ఫలం లభిస్తుంది.
*మాస శివ రాత్రి*
ప్రతి నెలా వచ్చే మన శివుని పండుగ, శివుని జన్మ తిథిని అనుసరించి ప్రతి నెలా కృష్ణ పక్షం చతుర్దశి నాడు ఆ భోళా శంకరుని ఉద్దేశించి చేసుకునే పూజ. ఈ రోజున ఉపవాసం, ప్రదక్షిణాలు ప్రత్యేకముగా, విశిష్టముగా ఉంటాయి.
చంద్రమా మనసో జాతః అని పెద్దలు చెపుతూ ఉంటారు.
అంటే చంద్రుడు మన మనస్సుకు కారకుడు. చంద్రుడు క్షీణ దశలో ఉన్నప్పుడు కేతువు ప్రభావము ఎక్కువగా ఉంటుంది.
కోపం, చికాకు, దుడుకుతనము, జీర్ణ శక్తి మందగించడము, నిర్ణయాలు తీసుకునే సామర్ధ్య లోపం ఇలాంటివి తలెత్తే సమయము.
అందుకే ఆ చంద్రుడిని తల పైన పెట్టుకున్న వానిని శరణు వేడతాము.
భోళా శంకరుడు. నాలుగు చుక్కల నీరు పోసి, మూడు దళాలు ఉన్న బిల్వ దళం మనసారా పెడితే సంతోషించి వరాలనిచ్చే వరదుడు. కస్టపడి ఏ పూజ చేయవలసిన పని లేదు.
ఏవేవో వస్తువులు సేకరించి పెట్టుకోవలసిన పని లేదు.
జీవ యాత్ర చాలించిన జీవిని అందరు వదిలేసినా కూడా నేనున్నాను నీకు తోడు అంటూ స్మశానంలో సదా నివసిస్తూ ఉండే మార్గ బంధువు.
లోకాలలో ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ ముందుకు వచ్చి కాపాడిన పరమాత్ముడు.
అధికార గర్వముతో దుర్వాస మహర్షిని అవమానించిన దేవేంద్రుడు ఆ మహానుభావుని శాప కారణంగా తన సమస్త సంపదలు సముద్రం పాలు అవ్వడం చూస్తూ ఉండి పోయాడు.
ఆ తరువాత తిరిగి వాటిని పొందడం కొరకు దానవుల సహకారముతో మందర పర్వతమును కవ్వముగా, వాసుకిని తాడుగా చేసుకుని క్షీర సాగరమును మధించినప్పుడు ముందుగా లోకాలన్నిటినీ భస్మం చేస్తుందా అని అనిపించేలా ఉగ్రతతో హాలాహలం పుట్టింది.
దేవతలంతా వెళ్లి ఈ తండ్రికి మొరపెడితే ఆయన సాభిప్రాయంగా తన ఇల్లాలైనసర్వమంగళాదేవి వంక చూడగా ఆ తల్లి
మ్రింగెడిది గరళమనియు
మ్రింగెడివాడు విభుండని మేలని ప్రజకున్
మ్రింగుమనియె సర్వమంగళ
మంగళ సూత్రమునెంత మంది నమ్మినదో.


.jpg)





.jpg)