కాశీలో ఉన్న ప్రధానఆలయాలు
గౌరీ కేదారేశ్వర మందిరం సోనాపుర కేదార్ ఘాట్ వద్దనున్న గౌరీ కేదారేశ్వరాలయం వారణాశిలో అత్యంత ముఖ్యమైన ఆలయం. వారణాశిలోని ఈఆలయం యొక్క ప్రాముఖ్యత, ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్‌నాథ్‌తో పోల్చబడింది. కేదారేశ్వరాలయం వారణాశిలోని పురాతన ఆలయం. ఆలయంలో కల రాతి శివలింగం స్వయంభూఃగా వెలసినట్లు చెబుతారు. ప్రతిరోజు వేలాదిమంది భక్తులు మంత్రముగ్ధులై చేయు ప్రార్థనలు నివాళులతో ఆలయం సందడిగా కనిపిస్తుంది. కేదార్ ఘాట్, మానసరోవర్ ఘాట్ లతో జతపరచబడిన కేదారేశ్వర్ ఆలయం వారణాశిలో భక్తులు సందర్శించు ఉత్తమమైన ప్రదేశాలలో ఒకటి. భక్తులు వారణాశిలో కేదారేశ్వర్ ఆలయం ఏ రోజునైనా ఉదయం నుండి సాయంత్రం వరకు సందర్శించవచ్చు.
పరమేశ్వరుని ఈస్వయంభూః లింగాన్ని శ్రీ కేదారేశ్వర్ లేదా కేదార్జీ అని పిలుస్తారు. ఈశివలింగం శివుడు, పార్వతి, విష్ణు, లక్ష్మి మరియు అన్నపూర్ణాదేవి అను అయిదుగురు దేవతల తత్త్వం యొక్కఫలితం.గౌరీకేదారేశ్వర ఆలయకధనం సత్యయుగం నాటికథ. ఆసమయంలో హిమాలయ పర్వతప్రాంతంలో మాంధాత మహారాజు గౌరవనీయుడు, అతని విజయాలు కీర్తి పురాణాలలో వర్ణించ బడ్డాయి. మాంధాత అయిదుగురు దేవతల తత్త్వంకల శివలింగంకోరి శివునీకోసం నిరంతర తపస్సు చేయగా పరమశివుడు సంతోషించి, కాశీకి వెళ్లి తపస్సు చేయమని అతనిని ప్రేరేపించాడు.. మహారాజు మాంధాత కాశీవచ్చి తపస్సు చేయడం ప్రారంభించాడు. పుష్యమాసం నెల ఆరంభంలో, సంక్రాంతి పండుగరోజున, అతను అన్నాన్ని సృష్టించి, ఒక భాగం అతిథికి మరియు మరొకటి తనకోసం రెండుభాగాలుగా చేశాడు. అప్పుడు, అతిథిగా, పూజ్యుడైన శివుడు స్వయంగా దర్శనమిచ్చాడు., రాజు ఆశ్చర్యపోయి నప్పుడు శివుడు రాయిలా మారిపోయాడు. రాజుకు అతిథి రూపాన్ని వదలి శివుడు కనిపించాడు- ఆపాషాణం (రాయి) శివలింగంగా మారింది. సత్య యుగంలో నవరత్న, త్రేతా యుగంలో స్వర్ణమయి, ద్వాపర యుగంలో వెండి, మరియు కలి యుగంలో శివలింగంగా నాలుగు యుగాలలో నాలుగు రూపాలతో దర్శనంఇచ్చింది. కేదారేశ్వర శివలింగం పైభాగం రెండుభాగాలుగా దర్శనమిస్తూ గౌరీశంకరుల కలయికతో మంగళకరమైన అనుభూతి ఇస్తుంది. కేదారేశ్వర దర్శనంతో అన్నపూర్ణాదేవి ఎప్పుడూ భక్తుల ఇంట్లోనే ఉంటుంది అని భక్తుల నమ్మకం.
తిలభాండేశ్వర్ మందిరం వారణాశినందు కాశీవిశ్వనాధ్ మందిరమునకు నైరుతిగా 1.5 కి.మీ దూరంలో గంగానదికి తూర్పు దిక్కుగా 500 మీటర్ల దూరంలోనూ బెంగాలీతోటను చేర్చి బెలాపూర్ పాండే హవేలీనందు శివుడు కొలువున్న పురాతన ఆలయము తిలాభాండేశ్వర్ మందిరము. ఆలయం నందలి శివలింగము 2500 సం.ల క్రిందట స్వయంభూః గా ఉద్భవించినట్లు నువ్వుగింజ ప్రమాణములో ప్రతిసంవత్సరము వృద్ధిచెందుచున్నట్లు కధనము. లింగము అడుగుభాగము 3అ వ్యాసము కలిగి 3.5 అ ఎత్తుకలిగిఉన్నది. శివలింగం తాకితే మృదువుగా ఉంటుంది అని శారదాదేవి (సరస్వతీదేవి) కొద్ది రోజులు ఆలయంనందు గడిపినట్లు నానుడి.
కర్కోటక (నాగేశ్వర) మహదేవ్ ఆలయం టౌను రైల్వేస్టేషన్ వద్ద జైత్ పూరానందు ఒకచెరువులోని పురాతన బావినందు పురాతన శివలింగముకలదు. శ్రావణమాసమునందు పౌర్ణమికి అయిదవరోజుఅయిన నాగపంచమిరోజు మాత్రమే ఈశివలింగదర్శనము లభిస్తుంది. దీనికి శివనగరం అని స్థానిక నామం. శివలింగము సంవత్సరానికి ఒకసారే కనపడుట విశేషమైతే ఈబావినుండి నాగలోకమునకు దారిఉన్నదిఅనుట ఇంకనూవిశేషము. నాగపంచమిరోజున ఈశివలింగము దర్శనము చేసుకున్నట్లు అయిన కాలసర్పదోషమునుండి ఉపశమనం పొందుతారు అనినానుడి. ఈబావి ఏడాదిపొడవునా నీటిలో మునిగి నాగపంచమిరోజు బావిలోనినీరు తొలగించడంద్వారా శివలింగం దర్శనమిస్తుంది. నాగకుండంలో నాగులు ఉంటాయిఅని ఇప్పటికీ ప్రజలు విశ్వసిస్తారు. నాగకుండ్ వద్దఉన్నఈబావిని ధర్మశాస్త్రంలోకూడా వర్ణించారు. పతంజలిమహర్షి చిత్తశుద్ధితో ఈశివలింగము స్థాపించి కుండాన్నినిర్మించినట్లు చెపుతారు. నాగపంచమికి ముందుగా ఈకుండంలోని నీటిని శుభ్రంచేసి శివలింగానికి పూజలుచేస్తారు. నాగపంచమితరువాత ఈనాగకుండం మరలా నీటితోనిండిపోతుంది. నాగకుండంనుండి నాగలోకం వెళ్లడానికి ఒకమార్గము ఉందనినానుడి. నాగపంచమి రోజున ఉదయంనుండి సందర్శకుల వరుసలుఉంటాయి. శివలింగ దర్శనమునకు ప్రజలు చాలాదూరమునుండి వస్తారు. నాగకుండం చూడటముతోనే కాలసర్పయోగంనుండి స్వేచ్చలభించుటయేకాక జీవితంలో అన్నిఅడ్డంకులు తొలగిపోతాయి. నాగకుండం పరమేశ్వరునికి ప్రత్యేక నివాసస్థానం. భక్తులు ఆలయందర్శించి శివుని పూజించిన ఏవిధమైన విష ప్రయోగము వలన హాని సంభవించదని నమ్ముతారు. శివుడు ఢమరుకము మ్రోగించి నప్పుడు చెడు వణుకుతుంది మరియు మంచిమేలుకొంటుంది. నాగపంచమి రోజు భక్తులు శ్రద్ధతో శివుని కొలుస్తారు.
చింతామణి గణపతి ఆలయం అభిజీత్ అను రాజునకు సంపద కలిగిఉన్ననూ వారసులు లేరు. వైశంపాయన మహర్షి సూచనప్రకారం రాజదంపతులు దీర్ఘ తపస్సుచేసి గణఅను కుమారుని పొందారు. తరువాత ఆతను గణరాజు అని పిలువ బడ్డాడు. .గణరాజు ధైర్యవంతుడు మరియు ప్రతిభా వంతుడు కానీ చాలా దూకుడుస్వభావం కలవాడు. గణరాజును కపిలమహర్షి వారిఆశ్రమాన్ని సందర్శించమని ఆహ్వానించాడు. కపిలమహర్షి అతిధి విధేయుడు. ఆయన తనవద్ధకల చింతామణి అను విలువైన రత్నం సహాయంతో గణరాజుకు ఉత్తమమైన ఆహారం అందించ గలిగాడు. గణరాజు ముగ్ధుడై రత్నాన్ని కోరుకున్నాడు. కపిలమహర్షి నిరాకరించడంతో, రాజు రత్నాన్ని బలవంతంగా అతనినుండి తీసుకున్నాడు. దుర్గాదేవి కపిలమహర్షిని గణేశుని సహాయం కోరమని సలహా ఇచ్చింది. .గణేశుడు కపిలమహర్షి ప్రార్ధనకు సంతసించి కదంబ వృక్షంక్రింద గణరాజుతో యుద్ధంచేసి కపిలముని రత్నాన్ని తిరిగి మహర్షికి అందచేశాడు. కానీ కపిలమహర్షి చింతామణిపై కోరికను కోల్పోయి రత్నాన్ని గణేశుడికి సమర్పించాడు.. కపిలమహర్షి చింతామణి రత్నాన్ని గణేశుని మెడలోకట్టాడు. అందువలన గణేశునికి చింతామణి గణపతి అని పేరువచ్చింది.
పితామహేశ్వర్ ఆలయం వారణాశి (కాశీ)లో సుమారు 3000 శివలింగములు కలవని భావిస్తారు. ప్రతివీధిలోనూ ప్రతి వీధిలోనూ ఒక్కో శివలింగం కన పడుతుంది. పితా మహేశ్వర్ ఆలయం వారణాశిలోని పవిత్రమైన మరియు గుప్త దేవాలయాలలో ఒకటి. మొఘలుల పాలనయందు ధ్వంశంకాకుండా కాపాడబడిన ఆలయములలో పితామహేశ్వర్ ఆలయంకూడా ఒకటి. పితా మహేశ్వర్ శివుని స్వయంభూః లింగమని వ్యాస విరచిత పద్దెనిమిది ఇతిహాసములలో ఒకటైన స్కంధపురాణంనందు ప్రస్తావనఉన్నట్లు తెలియుచున్నది. సింధియాఘాట్ సమీపంలోని సిద్దేశ్వరి ఆలయంనుండి సీట్లా వీధిలో ఒకసందు ద్వారానడచి పితామహేశ్వర ఆలయం చేరవచ్చు. ఆలయంముందు గంట కట్టబడి ఉంటుంది. స్కంధ పురాణంలోని కాశీఖండంనందు శివపార్వతుల కుమారుడైన సుబ్రహ్మణ్యస్వామి కాశీలోని అత్యంతముఖ్యమైన శివలింగాలలో పితా మహేశ్వర్ ఒకటిగా అభివర్ణించాడు.భూమినుండి సుమారు 40 అ దిగువన స్థాపించబడిన పితామహేశ్వర్ శివలింగం అత్యంత శక్తివంత మైనదని నమ్ముతారు.సంవత్సరంఅంతటా ప్రత్యక్ష దర్శనంఉండదు. భూమిపైకల రంధ్రంద్వారా శివలింగాన్ని దర్శించవచ్చు. ఆలయం వర్షాకాలంలో సోమవారాలు మరియు శివరాత్రి, ఏకాదశి మొదలైన పవిత్రమైన రోజులలోమాత్రమే తెరిచిఉంచుతారు. భక్తులు సాధారణ రోజుల్లో నేలపైఉన్న రంధ్రం ద్వారా మాత్రమే శివలింగాన్ని దర్శించుకోవడానికి అనుమతిస్తారు. పితామహేశ్వర శివలింగ దర్శనం తరతరాలకు మోక్షాన్ని ఇస్తుందని నమ్ముతారు.
ఆదికేశవ ఆలయం వారణాశి రాజ్‌ఘాట్ సమీపంలో గంగ మరియు వరుణనదుల సంగమంవద్ద ఆదికేశవ దేవాలయం ఉంది. ఆదికేశవ దేవాలయం గురించి కాశీఖండం మరియు మత్స్య పురాణం లింగపురాణంలలో వరుణ సంగమఘాట్ వద్దఉన్నట్లు ప్రస్తావనఉంది, శివుని అనుజ్ఞతో, విష్ణువు కాశీనందు ఈప్రదేశంలో తన మొదటిపాదం వేశాడని పిమ్మట పాదాలను కడిగి స్నాన ఘట్టముపై తనవిగ్రహం స్థాపించి పాదముద్రలను వదిలివేసాడని నమ్ముతారు. ఆలయ సముదాయంలో ఆదికేశవ, జ్ఞానకేశవ, పంచదేవత మరియు సంగమేశ్వర అను నాలుగు ఆలయాలు కనిపిస్తాయి. ఆలయ మండపం ఎర్రరాతి స్తంభాలతో నిర్మించబడింది. గర్భగుడిలో ఆదికేశవుడు దర్శనమిస్తాడు. రెండవ ఆలయంలో జ్ఞానకేశవ, మూడవ ఆలయంలో సంగమేశ్వర మహాదేవ్ మరియు నాల్గవ ఆలయంలో పంచదేవత దైవాలుగా పూజించబడుతున్నవి. ఆదికేశవ ఆలయంలో కేవలం ఆరాధన చేయడంవల్ల పునర్జన్మ ఉండదని నమ్ముతారు. సాధారణరోజుల్లో ఈప్రదేశంనందు శాంతి మరియు ప్రశాంతత కనపడుతుంది. ప్రత్యేక జాతరలలో ఆలయానికి వేలాదిమంది భక్తులు వస్తారు. యాత్రికులు సంగమస్నానం చేసి ఆలయంలో ఆదికేశవ దర్శనం చేసుకొంటే తమకోరికలు నెరవేరుతాయని భావిస్తారు.
బిందుమాధవ ఆలయం బిందుమాధవ ఆలయం వారణాశిలో పంచగంగా ఘాట్ వద్దఉన్న చిన్న దేవాలయం. భక్తులు భైరోనాథ్ నుండి నడక ద్వారా ఆలయం చేరుకోవచ్చు. లేదా పంచగంగా ఘాట్‌కు పడవద్వారా చేరుకుని మెట్లుఎక్కి చేరవచ్చు. పంచగంగా ఘాట్‌ని పంచగంగా తీర్థం అనికూడా అంటారు. పురాణాల ప్రకారం, కాశీవిడిచి వెళ్ళమని రాజు దివోదాస్ లేదా దివోదాసేశ్వర్‌ను ఒప్పించడానికి శివుని ఆదేశానుసారం విష్ణువు కాశీకి వచ్చాడు. వచ్చినపని పూర్తయిన తర్వాత, విష్ణువు కాశీ పట్టణసౌందర్యాననికి మరియు కాశీలో తీర్థాలుచూసి సంతోషించాడు.
విష్ణువు పంచనాధ తీర్థంవద్ద తపస్సుచేస్తున్న ఋషులను చూశాడు.విష్ణువు తన దివ్యరూపంలో అగ్నిబిందువు అను మహర్షిముందు ప్రత్యక్షమయ్యాడు. మహర్షి విష్ణువుకు సాష్టాంగపడి స్వామిని స్తుతించాడు.మహర్షి విష్ణువును వివిధ నామాలతో జపిస్తూ, తులసితో భగవంతుడిని పూజించిన భక్తుడు విష్ణువు అనుగ్రహాన్ని పొందుతాడని కొనియాడాడు. అతని ప్రశంసలకు సంతోషించిన విష్ణువు వరం కోరుకోమన్నాడు. పంచ నాధ తీర్థంలో శాశ్వతంగా నివసించమని మహర్షి విష్ణువును కోరాడు.
విష్ణువు అంగీకరించి కాశీలో నివసిస్తానని వాగ్దానం చేసాడు. కాశీనగరం శివుని త్రిశూలంపైన ఉండటంవల్ల మహా జలప్రళయం కూడా కాశీనగరాన్ని ఎటువంటి విధ్వంసానికి గురిచేయలేదని తెలిపాడు. మహావిష్ణువు తన నామంతో పంచనాధ తీర్ధంలో నివసించ వలసింది గాను, తీర్ధంలో స్నానంచేసి బిందుమాధవుని పూజించిన భక్తులకు ఐశ్వర్యం పిమ్మట మోక్షాన్ని ప్రసాదించమని ఋషి కోరాడు. శ్రీమహా విష్ణువు అంగీకరించాడు. అప్పటినుండి ఆలయంలో దైవం బిందుమాధవ పేరుతో పిలువబడింది.
నవదుర్గ ఆలయాలు దుర్గాదేవి తొమ్మిది రూపములు శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కంధమాత, కాత్యాయిని, కాలరాత్రి, మహాగౌరి, సిద్ధధాత్రి ఆలయములతో పాటు దుర్గాదేవి ఆలయం దేశము నందు కలిగిఉన్న ఏకైకపుణ్యక్షేత్రం వారణాశి (కాశీ). 1.శైలపుత్రి:వారణాసినందు జలాలిపుర ప్రాంతంలో
మార్హియా ఘాట్ వద్ద A-40/11 నందు
నవదుర్గలలో మొదటి అవతారమైన
శైలపుత్రి ఆలయం ఉంది. 2.బ్రహ్మచారిణి: నవదుర్గలలో రెండవది బ్రహ్మచారిణి
మాతఆలయం వారణాశినందు పంచగంగ
ఘాట్ ఘాశీతోట నందు కలదు. 3. చంద్రఘంట:నవదుర్గరూపములలో శైలపుత్రి,
బ్రహ్మచారిణి తరువాత అవతారం
మరియు నవరాత్రులలోమూడవరోజు
పూజించబడు చంద్రఘంట ఆలయం
వారణాశిలో జైత్ పూరా డిగియ రోడ్
నందుఉన్నది. 4.కూష్మాండ: కూష్మాండాదేవి ఆలయం మధ్య
ప్రదేశ్ లో కాన్పూర్ మరియు వారణాశిలో
ఆనందభాగ్ దుర్గాకుండ్ వద్ద ఉన్నాయి 5.స్కంధమాత:స్కంధమాత ఆలయం వారణాశి నందు
జైత్ పూరానందు జైత్ పూరాపోలీసుస్టేషనుకు
సమీపంలో నున్నది.
6.కాత్యాయిని: కాత్యాయినిదేవి ఆలయం ఉత్తరకర్ణాటక
కార్వార్ నకు 10 కి.మీ దూరములో ఆవేర్సా
నందు కలదు. వారణాశిలో కాత్యాయనీదేవి
ఆలయం సింధియా ఘాట్ వద్ద ఆత్మవీరేశ్వర్
ఆలయ ప్రాంగణలో ఉంది . . 7.కాలరాత్రి కాలరాత్రిదేవి ఆలయం వరణాశినందు
బెంగాలితోటనందు ఉన్నది. 8.గౌరీదేవి: గౌరీ దేవి ఆలయాలు హరిద్వార్ సమీపం
లోని కంఖాల్‌లో, పంజాబ్‌లోని లూథియాన
లోనిశ్రీమహాగౌరీ మందిరం మరియు మూడవది
విశ్వనాధ దేవాలయం సమీపంలో లహరితోట
నందు ఉన్నాయి 9.సిద్ధేశ్వరి:సిద్ధేశ్వరీదేవిఆలయం వారణాశినందు
సిద్దేశ్వరి మోహల్లానందు ఉన్నది. ఆలయం
చేరడానికి ఆటోనందు ప్రయాణించి కొద్దిదూరం
నడవవలసి ఉంటుంది. 10.దుర్గాదేవి: దుర్గాదేవిఆలయము వారణాశినందు
బెలాపూర్ ఆనందభాగ్ దుర్గాకుండ్ రోడ్డు
నందు ఉన్నది.
గంగా హారతి వారణాశినందు ప్రతిరోజూ గంగానదికి ఇచ్చేహారతి ముఖ్యమైనది. మనోహరమైనది. వేలాదిమంది భక్తులు మరియు సందర్శకులు దశాశ్వమేధ ఘాట్ నందు సాయంత్రం జరిగు ఈహారతిని తప్పక దర్శించెదరు. అయిదుగురు లేదా ఆరుగురు పూజారులు ఏకరూప ధోవతి కుర్తాధరించి పెద్దరుమాలు శరీరమునకు కట్టుకొని పరిమళ భరితమైన అగరవత్తులు, సాంభ్రాని ధూపముతో, పూవులతో విధ్యార్ధుల గంభీరమైనగొంతులతో వేదములు ఉపనిషత్తులు చదువుచుండగా అయిదు పెద్దపెద్ద ఇత్తడి దీపపుకుందెలతో గంగానదికి హారతిఇచ్చేదరు. కొన్నివేలమంది భక్తులు హరహర మహాదేవ అనిస్తుతించుట చూడవలసినదే కానీ వర్ణించ సాధ్యం కాదు.గంగాహారతి సాయంత్రం 6.00 గంటలకు ప్రారంభమై 45 నిమిషములు సాగుతుంది.. ఇంతేకాక వారణాశిలో ముఖ్యమైన అష్టవినాయక ఆలయాలు, సంకట మోచనఆలయం, నేపాలీఆలయం, భరతమాత మందిరం, తులసీ మాత మందిరం, కర్ధమహేశ్వర మందిరం, మాతృదేవ్ మందిరం, శుక్రేశ్వరఆలయం, కామేశ్వరఆలయం పదకొండు కాశీ భైరవ ఆలయాలు, పన్నెండు ఆదిత్య ఆలయాలతో పాటుగా సుమారు 3000 ఆలయములు కలవు. ఘాట్ల నందు ప్రముఖమైన 64 ఘాట్లుకలవు.
విశ్వేశ్వర దర్శనం ముక్తిప్రదం
గమనిక: మేము తెలిపినట్లు కాశీలో ఆలయాలుఅన్ని
దర్శించాలి అంటే 9 నెలలు కాసీవాసం చేయ
వలసి ఉంటుంది. ప్రస్తుత రోజుల్లో అది సాధ్యం
కాదు కావున 9 రోజులు కాశీ వాసం చేసి
ముఖ్య ఆలయాలు, ఇతర ఆలయాలు చూద
వచ్చు. కాశీవాసం చేయడాని ఒక నిర్ధిష్టమైన
విధానం ఉన్నది. త్వరలో కాశీవాసం విధి
విధానం తెలుపుచూ కాసీవాసం చేయడానికి
అనువైన వసతి సదుపాయం వివరాలు
తెలియచేస్తాము. ఆశక్త కలవారు కార్తీక
మాసం నందు కాసీవాసం చేయవచ్చు.
Indian Pilgrim Tours

No comments:
Post a Comment