Thursday, November 27, 2025

క్రొత్తగా ఉజ్జయినీ వెళ్ళే వారు చీరాల,ఒంగోలు, విజయవాడ నుంచి ఎలా వెళ్ళాలి


క్రొత్తగా ఉజ్జయినీ వెళ్ళే వారు చీరాల,ఒంగోలు, విజయవాడ నుంచి ఎలా వెళ్ళాలి ఏట్టైన్ కి వెళ్ళాలి,రూమ్,మరియు దర్శనం వివరాలు నాకు తెలిసిన మేరకు ఆకురాతి వెంకట అశ్వని అనే నేను ఈ పోస్ట్ లో వ్రాస్తున్నాను.చాలా కష్టపడి వ్రాసా ,దయచేసి పోస్ట్ కాపీ పేస్ట్ చేయెుద్దు, షేర్ చేయండి.నా కష్టానిక్ ప్రతిఫలం ఉంటుంది. మరి కొన్ని క్షేత్రాల వివరాలు వ్రాయటాని నాకు  ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది.

1.అహల్యనగర్ ట్రైన్ ఆదివారం ఉదయం 4 గంటలకు చీరాలలో ప్రారంభమై మరుసటి రోజు ఉదయం ఉజ్జయినీ చేరుతుంది.

2.రైల్వే స్టేషన్ నుంచి రూం కి తీసుకెళ్ళమంటే ఆటో వాళ్ళు తీసుకువెళ్తారు.లేదా ఆన్లైన్లో ఐన బుక్ చేసుకోవచ్చు.హోటల్ రూం లు నాన్ AC 700/- నుంచి 1500/-వరకు ఉంటుంది.AC 3500/-ఉంటుంది.గుడి దగ్గరలో రేట్లు ఎక్కువగా ఉంటుంది.గుడికి దగ్గరలో నాన్ AC 2000/- ,AC 4000/- వరకు ఉంటుంది.

3.దేవస్తానం రూం లు బుక్ చేసుకోవచ్చు.ప్రస్తుతం దేవస్థానం సైట్ పనిచేయటం లేదు.

4.అదే ఓంకారేశ్వర జ్యోతిర్లింగం నుంచి ఐతే ప్రైవేటు బస్సులు ఉజ్జయినీ కి డైరెక్ట్ బస్లు ఉంటాయి.ఒక్కొక్కరికి 220/- రూపాయలు వసూలు చేస్తారు.

5.బస్స్టాండ్ నుంచి రూం కి చేరుకోవచ్చు.ఆటోకి రూం దూరం బట్టి  ఒక్కొక్కరికి 20/- వసూలు చేస్తారు.

6.ఉజ్జయునీ మహకాళేశ్వర్ దర్శనానికి 2 రకాలుగా వెళ్ళొచ్చు.అందులో మొదటిది 250/- దర్శనం ,మహకాళేశ్వర్ని కొద్దిగా దగ్గర గా చూడొచ్చు.
రెండవది ప్రీ దర్శనం.

7.మహకాళేశ్వర్ జ్యోతిర్లింగం లో భస్మ హరతి దర్ళనం  3నెలల ముందే ఆనెలైన్ లో బుక్ చేసుకోవాలి.లేదా ఆఫ్లైన్ లో ఐతే ప్రతి రోజూ రాత్రి11 గంటల నుంచి త్రివేణి సంగమం దగ్గర జనాలు క్యూ లో ఉంటారు.ఉదయం 8 గంటలకి 500 మందికి మాత్రమే టోకెన్ ఇస్తారు.ముందుగా ఫాం ఫిల్ చేసి ఆ లైన్లో ఇస్తే అదే రోజు రాత్రి మన ఫోన్కి మెసేజ్ వస్తుంది.ఆ మెసేజ్ని కౌంటర్ లో ఆ రోజు సాయంత్రం చూపిస్తే మరుసటి రోజు ఉదయం భస్మ హారతికి టికెట్స్ ఇస్తారు.టికెట్ ధర ఒక్కొక్కరికి 100/- ఉంటుంది.

8.దర్శనం ఐపోయాక ఆలయ ప్రాంగణంలో ఉన్న వివిధ రకాల గుడులు అందులోని దేవతా మూర్తుల ను దర్శించండి.

9.దర్శనం ఐపోయాక బయటకి వచ్చేప్పుడు EXIT గేట్ ప్రక్కనే మహకాళేశ్వర అన్నప్రసాదానికి టోకెన్లు ఇస్తారు.

10.బయటకి వచ్చి భారత మాత టెంపుల్ మరియు గుడి కారిడార్ ,మహంకాళి వన్ ,లేజర్ షో, మ్యూజియం మొదలైనవి చూడవచ్చు.

11.గుడి నుంచి బయటకు వచ్చాక అన్నఅప్రసాదానికి 
2 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళవచ్చు.

12.లోకల్ టెంపుల్ కోసం ఆటో మాట్లాడుకుని మెుదట మంగళ్ధామ్ (అంగారకుడి గుడి - బుధుడు MARS) దర్శనం చేసుకోవచ్చు. ఈ గుడికి పైనే అంతరిక్షంలో అంగారక గ్రహం ఉంటుంది.ఇక్కడ వివిధ రకాల శాంతి పూజలు కూడా జరుగుతాయి. (షేర్ ఆటో ఐతే ఒక్కొక్కరికి 150/ - వసూలు చేస్తారు.)

13.తర్వాత అదే ఆటోలో సాందీపని ఆశ్ర‌మం చేరుకోవచ్చు.శ్ర‌ీ కృష్ణ భగవానుడు తన గురువు ఐన సాందీపని ముని దగ్గర 64 కళలు విధ్యాభ్యాసం చేసింది ఈ ప్రదేశం లోనే.ఇక్కడ సాందీపని గుడి, కృష్ణ భగవానుడు గుడి, మ్యూజియం, కృష్ణడి 64 కళలకి సంబంధించిన ఫోటోలు చూడవచ్చు.ఇక్కడ గోముఖ కుండ్ ఉంటుంది.శ్ర‌ీకృష్ణుడు తన గురువు సాందీపని కోసం సకల పుణ్య తీర్థాలలో జలాన్ని ఇక్కడికి తెచ్చారంట.

14.తర్వాత అదే ఆటోలో ఉజ్జయినీ క్షేత్ర పాలకుడైన కాళభైరవుని దర్శనం కి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు.

15.ఆ తర్వాత  అదే ఆటోలో ఘడ్ కాళీ మాత (శక్తి పీఠాలలో ఒకటైన ఉజ్జయినీ మహంకాళి అమ్మ) దర్శనం చేసుకోవచ్చు.మహాకవి కాళిదాసు నాలుక మీద భీజాక్షరాలు ఖాళీ అమ్మ ఇక్కడే వ్రాసారు .

16.ఆ తర్వాత అదే ఆటోలో ముక్తిధాం గుడి చూడవచ్చు.

17.ఆ తర్వాత అదే ఆటోలో చింతా హర్ గణేష్ దర్శనం చేసుకోవచ్చు. ఈ గణేషుడి దర్శనం మాత్రానే మనలో ఉన్న చింతలు తొలగిపోతాయి అంటారు.

18.అక్కడ నుంచి మధ్యాహ్నం రూం కి చేరుకొని భోజనం చేసి కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవచ్చు.

19.సాయంత్రం 4 గంటలకు మళ్ళీ మహకాళేశ్వర్ దర్శనం చేసుకొని హర్సిద్ధి మాతా గుడికి నడుచుకుంటూ వెళ్ళవచ్చు.

20.దర్శనానంతరం సాయంత్రం 6:30 కి హరతి సేవా ఉంటుంది. ఈ సేవలో బయట ఉన్న 2 ధ్వజస్తంభాలో దీపాలు వెలిగిస్తారు?చూడటానికి చాల బాగుంటుంది.

21.ఆ తర్వాత అతి పురాతనమైన రాం ఘాట్ చూడవచ్చు.దశరధ మహారాజు కాలం చేశాక రాముల వారు ఆయన శ్ర‌ద్దాకర్మలు నిర్వహించిన తర్వాత ఇక్కడకి వచ్చి స్నానం చేశారట.అందుకేదీన్ని రాంఘాట్ అంటారు. 

22.ప్రతి 12 సంవత్సరాలకొక సారి మహ కుంభమేళా నిర్వహించే 4 ప్రదేశాలలో ఇది ఒకటి.ఇక్కడ షిప్రానది ప్రవహిస్తుంటుంది.

23. ఆ తరువాత మహకాళ్ లోక్ ఎంట్రస్ చేరుకోవచ్చు.
ఇది 2 కిలోమీటర్లు ఉంటుంది.నడవలేని వారు బ్యాటరీ వెహికల్ ఉంటుంది.ఈ సర్వీస్ పూర్తిగా ఉచితం.
 
Written by 
Akurati venkata aswani
Kruthi Founation founder&chairman 


Wednesday, November 26, 2025

శాస్త్రవేత్తలకు అంతుచిక్కని రహస్య విశిష్టత, మహిమాన్వితమైన శివాలయాలు.

శాస్త్రవేత్తలకు అంతుచిక్కని రహస్య విశిష్టత, మహిమాన్వితమైన శివాలయాలు..


🔸 మహానంది శివలింగ అడుగునుండి వచ్చే నీటితో కొన్నివేల ఎకరాలు పంటభూమి పండుతున్నది. బయట ఉండే కొనేరులో గుండుసూది వేసినా కనపడుతుంది
ఎంత చలికాలంలో కూడా కొనేరులో నీరు గోరు వెచ్చగా ఉంటుంది.

🔸 ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం (కందుకూరు కనిగిరి మధ్య ) కె. అగ్రహారంలోని కాశివిశ్వేశ్వర దేవాలయం లోని శివలింగం క్రిందనుండి నీరు ఊరుతూ ఉంటుంది. ఈ నీరు 14 గ్రామాలకు తాగునీరుగా వాడుతున్నారు.

🔸 ఆదిలాబాద్ జిల్లాలోని శ్రీ బుగ్గ రామేశ్వరాలయం. ఈ ఆలయంలో శివలింగంనుండి నీరు ఊరుతూ ఉంటుంది.

🔸 కరీంనగర్ జిల్లాలో కాళేశ్వరము దేవాలయంలో నంది ఉత్తరాయణంలో ఉత్తరముఖంగాను దక్షిణాయణంలో దక్షిణ వైపు తిరుగుతారు.ఇది వండర్

🔸 అలంపూర్ బాల బ్రహేశ్వర లింగానికి ఎన్ని నీళ్ల ట్యాకులతోనైనా అభిషేకం చెయ్యండి, కానీ ఆనీరు ఎటుపోతుందో ఎవ్వరికీ తెలియదు.

🔸 వరంగల్ జిల్లా వెయ్యిస్తంభాల గుడి, ఇక్కడ సంగీత స్తంభాలు గలవు. ఇక్కడ నందిని మీటితే కంచు శబ్దం వస్తుంది.

🔸 ద్రాక్షారామం ఈ శివలింగం పై ఉదయం సాయత్రం సూర్య కిరణాలు పడతాయి.

🔸 భీమవరంలో సోమేశ్వరుడు, ఇక్కడ శివలింగం అమావాస్యకు నల్లగా పౌర్ణమికి తెల్లగా రంగులు మారతారు

🔸 కోటప్పకొండ ఎటుచూసినా 3 శిఖరాలు కనిపిస్తాయి, ఇక్కడికి కాకులు అసలు రావు

🔸 గుంటూరు జిల్లా చేజర్ల ఇక్కడ స్వామిపేరు కపోతేశ్వర స్వామి. లింగానికి దక్షిణ భాగంలో ఉన్న రంద్రంలో నీళ్లుపోస్తే శవంకుళ్లిన వాసన వస్తుంది. ఉత్తరభాగంలో నీరుపోస్తే అవి ఎక్కడికి పోతాయో ఎవ్వరికీ తెలీదు.

🔸 బైరవకొన ఇక్కడ కాకులు రావు. అలాగే ఇక్కడ ఉన్న కొనేరులో ఎంత నీరు వరదలా వచ్చినా గుడిలోకి నీరురాదు.

🔸 యాగంటి ఇక్కడ రోజురోజుకు నంది పెరుగుతూ ఉంటాడు

🔸 శ్రీశైలం భ్రమరాంబిక దేవాలయము వెనుక ఒకప్పుడు "జుం"తుమ్మెద శబ్దం వినపడేదట

🔸 కర్నూలు జిల్లా సంగమేశ్వరం లో వేపచెట్టు మొద్దు ఇక్కడ శివలింగంగా మారింది. 6నెలలు ఈ దేవలయం నీటిలో మునిగి ఉంటుంది. 6 నెలలు బయటకు కనిపిస్తుంది.

🔸 శ్రీకాళహస్తి లో వాయురూపములో శివలింగం ఉంటుంది.

🔸 అమర్ నాద్ శ్రావణ మాసంలో ఇక్కడ స్వయంగా మంచు శివలింగం ఏర్పడుతుంది.

🔸 కర్ణాటకలోని శివగంగ ఇక్కడ శివలింగంపై నెయ్యి వుంచితే వెన్న అవుతుంది. ఇక్కడ ఒక్క మకర సంక్రాంతి రోజు మాత్రమే గంగాజలం ఉద్బవిస్తుంది. మిగిలిన రోజులలో ఒక్క చుక్క కూడా కనిపించదు.

🔸 మహారాష్ట్రలో కోపినేశ్వర్ అనే దేవాలయంలో ప్రతి సంవత్సరము శివలింగము పైకి పెరుగుతుంది. నంది విగ్రహము శివలింగం వైపు జరుగుతూ ఉంటుంది.

🔸 కంచి ఇక్కడ మామిడి చెట్టు వయస్సు 4000 సంవత్సరాలు.

🔸 తమిళ నాడు తిరు నాగేశ్వరము ఇక్కడ పాలతో అభిషేకం చేస్తే నీలంగా మారుతాయి.

🔸 చైనాలో కిన్నెర కైలాసము ఇక్కడ ఉన్న శివలింగము ఉదయం తెల్లగా,మధ్యాహ్నం పసుపుగా, సాయంత్రం తెలుపుగా, రాత్రి నీలంగా మారుతాడు.

🙏 హర హర మహాదేవ 🙏

పుణ్యక్షేత్రాలు

పుణ్యక్షేత్రాలు

*చిత్తూరు జిల్లా*
కాణిపాకం, తిరుపతి, తిరుమల, తిరుచానూరు, శ్రీనివాస మంగాపురం, నారాయణ వనం, నాగలాపురం, కార్వేటినగరం, అరగొండ, అప్పలాయగుంట, శ్రీ కాళహస్తి, మొగలి, గుడిమల్లం, తలకోన, బోయకొండ, కైలాస నాథ కొండ, యోగి మల్లవరం. 
*కర్నూలు జిల్లా*
అహోబిలం, మహానంది, నవ నందులు, శ్రీశైలం, మంత్రాలయం, ఓంకారం నంది, యాగంటి, ఉరుకుంద, రణమండలం, కొలను భారతి, కాలువ బుగ్గ, సంగమేశ్వరం, బనగానపల్లి, పెదపాడు. 
*వైయస్ఆర్ జిల్లా*
అత్తిరాల, ఒంటిమిట్ట, గండి క్షేత్రం, తాళ్ళపాక, దానవులపాడు, దేవుని కడప, నందలూరు, పుష్పగిరి, వెల్లాల, బ్రహ్మంగారి మఠం, మాధవరావ దేవాలయం గండికోట. 
*అనంతపురం జిల్లా*
లేపాక్షి, ధర్మవరం, పుట్టపర్తి, కదిరి, తాడిపత్రి, అహోబిలం, పెనుగొండ, 
*నెల్లూరు జిల్లా*
వరి కొండ, తల్పగిరి, గొలగమూడి, జొన్నవాడ, నరసింహ కొండ, సూళ్లూరుపేట, పెంచలకోన, సోమశిల, నర్రవాడ నల్ల గొండ, ఘటిక సిద్ధేశ్వరం, కలిగిరి, వింజమూరు, రామతీర్థం. 
*ప్రకాశం జిల్లా*
మార్కాపురం, సింగరకొండ, అద్దంకి, పావులూరు, త్రిపురాంతకం, మాలకొండ, భైరవకోన, నెమలిగుండ్ల, సత్యవోలు, చీరాల, పెదగంజాం, చినగంజాం, కనుపర్తి వేటపాలెం, మోటుపల్లి, ఉప్పగుండూరు.
*గుంటూరు జిల్లా*
మంగళగిరి, కోటప్పకొండ, మాచర్ల, పొన్నూరు, అమరావతి, కాకాని, బాపట్ల, చేబ్రోలు, చేజెర్ల, కారంపూడి, భట్టిప్రోలు, బుద్ధాం, అనుపు, నాగార్జున సాగర్, నాగార్జున కొండ, ఉండవల్లి, అల్లూరు, కొండవీడు, గుత్తికొండ బిలం, కొండపోటూరు, చందోలు, పొన్నూరు.
*కృష్ణ జిల్లా*
విజయవాడ, యనమలకుదురు, మాచవరం,రామవరప్పాడు, పెనుగంచిప్రోలు, వేదాద్రి, మోపిదేవి, ఘంటసాల, కొల్లేటికోట, నెమలి, పెదకల్లెపల్లి, ఆగిరిపల్లి, గొల్లపల్లి (నూజివీడు), పుట్రెల, తిరుమల గిరి,అంబారుపేట, సింగరాయపురం, మంటాడ (ఉయ్యూరు), కైకలూరు.
*పశ్చిమ గోదావరి జిల్లా*
ఏలూరు,ద్వారకా తిరుమల, జంగారెడ్డి ఈ గూడెం, భీమవరం, పాలకొల్లు, అత్తిలి, జిత్తిగ, గురువాయ గూడెం, కాళ్ళకూరు, పట్టిసీమ, కొవ్వూరు, పెనుగొండ, సిద్ధాంతం, జగన్నాధపురం, రాట్నాలకుంట, కోట సత్తెమ్మ, మినిమించిలిపాడు, (పోడూరు మండలం), కొత్తపల్లి అగ్రహారం (పెరవలి మండలం)
*తూర్పుగోదావరి జిల్లా*
అంతర్వేది, గొల్లల మామిడాడ, ద్రాక్షారామం, పిఠాపురం, అప్పనపల్లి, మురముళ్ళ, వాడపల్లి, జగ్గంపేట, దివిలి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, కోటిపల్లి, ర్యాలీ, పలివెల, మందపల్లి, బిక్కవోలు, అయినవిల్లి, శివకోడు, నెలకోట రాయదుర్గం, కృష్ణ తీర్థం, తలుపులమ్మ లోవ, పెద్దాపురం, కోరుకొండ, ద్వారపూడి
*అనకాపల్లి జిల్లా*
పంచదార్ల, చోడవరం, నూకాలమ్మ.
*విశాఖపట్నం జిల్లా*
వెంకటేశ్వర స్వామి, కనక మహాలక్ష్మి, సింహాచలం, భీమునిపట్నం, పద్మనాభం,ఉప్మాకగ్రహారం.
*విజయనగరం జిల్లా*
పైడితల్లి, రామతీర్థం, కుమిలి, జమ్మి వృక్షం,బొబ్బిలి, సరిపల్లి, పుణ్య గిరి, బలిజిపేట, నారాయణ పురం, సాలూరు.
*శ్రీకాకుళం జిల్లా*
శ్రీముఖలింగం, అరసవిల్లి, సింగు పురం, శ్రీకూర్మం, మందన, మహేంద్రగిరి, రావి వలస, శాలిహుఊ, సంఘం, తర్లకోట, వావిలవలస.

Tuesday, November 25, 2025

ఏ పనీ అవ్వక విఘ్నాలు వస్తూన్నా ఎదో పోగొట్టుకున్నట్టు అనిపిస్తున్నా..ఇలా చేయండి

ఏ పనీ అవ్వక విఘ్నాలు వస్తూన్నా ఎదో పోగొట్టుకున్నట్టు అనిపిస్తున్నా..ఇలా చేయండి......!!

ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉన్నట్లు అనిపిస్తుందా? 
ఐతే త‌రిమి కొట్టండిలా... సంతోషాలు నింపండి.
ప్రతి ఒక్కరు సుఖసంతోషాలతో ఉండాలనే అనుకుంటారు. 

తల్లితండ్రులు, అన్నదమ్ములు, అక్కాచెల్లెలు, భార్య, పిల్లలు.... ఇలా ఓ చక్కటి కుటుంబంతో ప్రశాంత జీవితాన్ని గడపాలనే కోరుకుంటారు. 
అంతా బాగానే ఉంది అనుకునే సమయానికి ఏదో ఒక గొడవ వచ్చి పడుతుంది. 
అప్పటివరకు సంతోషంగా ఉన్నవారంతా ఒక్కసారిగా ఆనందాన్ని కోల్పోతారు. 
మీ ఇంట్లో ఉన్న పద్ధతులే ఇలా జరగడానికి కారణమై ఉండచ్చు. 
మీ నిర్లక్ష్యమే మీ ఇంట్లో జరుగుతున్న పరిణామాలకి కారణమై ఉండవచ్చు. 
ఇలాంటి నెగటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి రాకుండా ఉండాలంటే ఏం చేయాలో చూడండి. 
మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉన్నట్టు అనిపిస్తుందా? 
అయితే ఇవి పాటించండి!!

ఇంట్లోవారు మిమ్మల్ని విమర్శించడం లేదా 
మీరు ఒకరిని విమర్శించడం లాంటివి జరిగితే 
మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉన్నట్టే.

అన్నిటికి తప్పుబడుతున్నారా? 
మీ ఇంట్లోవారు ఏ పని చేసినా అందులో తప్పులు వెతకడం.. లేదా మీపై ఎవరైనా ఇలా చేయడం లాంటివి జరిగితే మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉన్నట్టే.

తరచుగా ఎవరో ఒకరిపై చిన్నచిన్న వాటికి కంప్లైంట్ చేయడం లాంటివి జరిగితే మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉన్నట్టే.

మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ నిండటానికి కారణాలు ఏంటో చూడండి:

ఇంట్లో వస్తువులు గాని, బట్టలు గాని ఎలాపడితే అలా వదిలేయకూడదు. 
వాటిని సక్రమంగా అమర్చుకోవాలి. 
ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి.

మీ ఇంట్లో ఎవరైనా స్వీట్స్ ఇస్తే వాటిని వెంటనే తినేయండి. 
చేతులో పట్టుకొని అటూఇటూ తిరిగితే నెగటివ్ ఎనర్జీ వస్తుంది.

మురికి బట్టలు ధరించకూడదు. 
వీటివల్ల క్రిములు రావడమే కాకుండా వాస్తు ప్రకారం 
ఈ బట్టలు నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి.

ఇంట్లోని దేవుళ్ళ విగ్రహాలను ఎదురుబొదురుగా అస్సలు ఉంచకూడదు. 
వీటిని ఎల్లప్పుడూ వేరువేరుగా ఉంచాలి. 
పక్కపక్కన పెట్టచ్చు గాని ఎదురుబొదురుగా పెడితే నెగటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి.

నెగటివ్ ఎనర్జీని ఎలా తరిమికొట్టాలో చూడండి:

ఓ గుప్పెడు రాయి ఉప్పు లేదా దొడ్డు ఉప్పుని అన్ని రూమ్ మూలలలో పెట్టండి. 
48 గంటల తరువాత దాన్ని తీసేయండి. 
నెగటివ్ ఎనర్జీ తరిమికొట్టడంలో రాయి ఉప్పు 
బాగా పనిచేస్తుంది. 
కుదిరితే ఈ ఉప్పులో కాస్త కుంకుమ కలపండి.

ఇంటిని, ఇంట్లో వస్తువులని పైపైన దులపడం కాకుండా పరిశుభ్రంగా ఉంచుకోండి. 
మీ బెడ్ షీట్స్, బ్లాంకెట్స్, కార్పెట్స్.. ఇలా అన్నిటిని కనీసం రెండు వారాలకొకసారైనా శుభ్రపరుచుకోండి.

పాత పుస్తకాలు, దుస్తులు లాంటివి ఉంచుకోకండి. కుదిరితే ఎవరికైనా దానం చేయండి. 
ఎంత తక్కువ వస్తువులు ఉంటే అంత పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది.

నిశ్శబ్దంగా ఉంటే చాలామందికి నచ్చుతుంది. 
కాని అప్పుడప్పుడు ఫుల్ సౌండ్‌తో పాటలు వినడం 
లేదా సినిమా చూడడం లాంటివి చేస్తే నెగటివ్ ఎనర్జీ అక్కడనుండి పారిపోతుంది.

తరచుగా మీ ఇంటి కిటికీలను తెరుస్తూ ఉండాలి. ఈగలొస్తాయి. దోమలొస్తాయి అని అలా చేయకుండా ఉండకండి. 
ఇంట్లోకి ఫ్రెష్ గాలి వస్తే దానితో పాటు పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది.

మెడిటేషన్ చేస్తే కేవలం మన శరీరమే కాదు... 
మన ఆలోచనలు కూడా శుభ్రపడతాయి. 
దీంతో మీ ఇంటిపై కూడా మంచి ప్రభావం ఉంటుంది. ఇంట్లో సూర్యకాంతి పడే మంచి స్థలం చూసుకొని 
అక్కడ మెడిటేషన్ చేస్తే పాజిటివ్ ఎనర్జీ నిండుతుంది.

ఇంట్లో అప్పుడప్పుడు సెంటెడ్ కాండిల్స్ వెలిగిస్తూ ఉండాలి. 
ఇది మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని ఆహ్వానిస్తుంది.

మీ ఇంట్లో ఉన్న ఫర్నీచర్ ఎల్లప్పుడు ఒకే దగ్గర పెట్టకుండా వీలైతే మరొక చోటకి మార్చండి. 
సోఫాల పైన ఉన్న క్లాత్‌ని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి.

హాల్‌లో ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకుంటే ఇల్లంతా ఫ్రెష్‌గా అనిపిస్తుంది. 
ఇంట్లో చెట్లని చూస్తే మీ ఆలోచనలు కూడా ఫ్రెష్‌గా ఉంటాయి.

ఇంట్లో అక్కడక్కడ వెల్లులి రెమ్మలను తగిలించండి. ముఖ్యంగా మెయిన్ డోర్‌కి తగిలిస్తే ఆత్మలు, దెయ్యాలు లాంటివి రాకుండా ఉంటాయి.

క్రిస్టల్స్‌ని  కిటికీలు, తలుపులు, మెట్లు, మూలల్లో వేలాడతీయండి. 
ఇవి నెగటివ్ ఎనర్జీని రాకుండా చేస్తాయి..!

సర్వే జనా సుఖినోభవంతు..!!

Monday, November 24, 2025

ఏ పనీ అవ్వక విఘ్నాలు వస్తూన్నా ఎదో పోగొట్టుకున్నట్టు అనిపిస్తున్నా..ఇలా చేయండి

ఏ పనీ అవ్వక విఘ్నాలు వస్తూన్నా ఎదో పోగొట్టుకున్నట్టు అనిపిస్తున్నా..ఇలా చేయండి

ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్‌
ప్రతి మనిషి దైనందిన జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొంటుంటాడు. వివిధ సమస్యలతో సతమతం అవుతుంటారు. అలాంటి వారిని గ్రహ బాధలు పట్టి పీడిస్తుంటాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్తుంటారు.
అయితే గ్రహబాధల నుంచి బయట పడేందుకు జపాలు, తపాలు, పూజలు చేయమంటారు. అవన్నీ ఖర్చుతో కూడుకున్నవి. కొన్ని సందర్భాలలో లక్షలు ఖర్చు పెట్టి పూజలు చేయాల్సి వస్తుంది. అయితే వేలకు వేలు ఖర్చు పెట్టలేని మధ్య తరగతి వారి కోసమే పరిహార శాస్త్రంలో సింపుల్‌ రెమిడీస్‌ ఈ కథనంలో తెలుసుకుందాం.

సూర్యుడు: ఎవరి జాతకం చక్రంలో అయితే రవి బలహీనంగా ఉంటాడో వారికి అనారోగ్య ము, అధికారుల నుండి వేధింపులు, తండ్రి లేదా పుత్రుల నుండి వ్యతిరేకత, నేత్ర, గుండె సంబంధిత వ్యాధులు, తండ్రి తరుపు బంధువులతో పడకపోవుట, ఏదైనా సాధించాలనే పట్టుదల లేకపోవుట, ఆత్మ విశ్వాసం లేకపో వుట వంటి సమస్యలు ఎదుర్కొంటారట. ఇలాంటి వారు సమస్యల పరిహారం కోసం ప్రతిరోజు సూర్య నమస్కారం చేయటం. ఆదిత్య హృదయం పారాయణ చేయటం. అలాగే గోధుమలతో తయారు చేసిన ఆహార పదార్థములు దానం చేయాలట.

మంత్రం:రవి గ్రహ అనుగ్రహం కోసం ఓం హ్రాం హ్రీం హ్రౌం సః సూర్యాయ నమః అనే బీజ మంత్రాన్ని ఉదయం వేళలో జపించాలట.

చంద్రుడు: జాతక చక్రంలో చంద్రుడు బలహీనంగా ఉన్నప్పుడు మనస్సు నిలకడగాలే పోవుట, భయం, అనుమానం, విద్యలో అభివృద్ధి లేకపోవుట, తల్లిగారి యొక్క ఆరోగ్యం సరిగా లేకపోవుట, స్ర్తీలతో విరోధము, మానసిక వ్యాధులు, రాత్రులు సరిగా నిద్రపట్టక పోవుట, అధికమైన కోరికలు, శరీరం యొక్క ఎదుగుదల సరిగా లేకపోవుట, బరువు తక్కువగా ఉండుట, స్ర్తీలకు గర్భాశయ వ్యాధులు మొదలగు సమస్యలు ఏర్పడతాయట. ఈ సమస్యల పరిష్కారం కోసం బియ్యం దానం చేయుట. పాలు, మజ్జిగ చిన్నపిల్లలకు పంచి పెట్టాలట. అలాగే శివునికి అవుపాలతో అభిషేకం చేయించాలట.

చంద్ర మంత్రం: ఓం శ్రాం శ్రీం శ్రౌం సః చంద్రాయ నమః అనే బీజ మంత్రాన్ని సంధ్యా సమయంలో జపించాలట.

కుజుడు: జాతకచక్రంలో కుజుడు బలహీనంగా ఉండడం వల్ల ధైర్యం లేకపోవుట, అన్నదమ్ములతో సఖ్యత నశించుట, భూమికి సంబంధించిన వ్యవహారాల్లో నష్టాలు, కోర్టు కేసులు, రౌడీల వలన ఇబ్బందులు, అగ్నిప్రమాదాలు, వాహన ప్రమాదాలు, పోలీసుల వల్ల వేధింపులు అప్పులు తీరకపోవుట, ఋణదాతల నుండి ఒత్తిడి లాంటి సమస్యలు ఎదుర్కోంటారట. కుజ గ్రహ అనుగ్రహం కోసం సుబ్రహ్మ ణ్యస్వామి, ఆంజనేయ స్వామిని పూజించాలి. హనుమాన్‌ చాలీసా పారాయణ చేయడం. కందులు దానం చేయడం, పగడం, ఉంగరం ధరించడం, మంగళవారం రోజున నియమంగా ఉండటం లాంటి పరిహారాలు చేయాలట.

కుజమంత్రం: ఓం క్రాం క్రీం క్రౌం సః భౌమాయ నమః అనే మంత్రాన్ని ప్రతి రోజు రెండు గంటల పాటు జపించాలట.

బుధుడు: జాతక చక్రంలో బుధుడు బలహీనంతగా ఉన్నట్లయితే.. నరాల బలహీనత, జ్ఞాపకశక్తి లేకపోవటం, చదువులో అభివృద్ధి లేక పోవడం, నత్తిగా మాట్లాడడం, వ్యాపారాల్లో నష్టాలు, సరైన సమయానికి సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం, తెలివితేటలు లేకపోవడం, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, అనుమానం, తరుచూ ధననష్టం మొదలగునవి జరుగు చున్నప్పుడు బుధ గ్రహ దోషంగా గుర్తించాలని పండితులు చెప్తున్నారు. అయితే బుధ గ్రహా అనుగ్రహం కొరకు విష్ణు సహస్రనామం పారాయణ చేయడం, వేంక టేశ్వరస్వామిని, విఘ్నేశ్వరుడిని ప్రార్థించాలి. అలాగే ఆవుకు పచ్చగడ్డి, తోటకూర లాంటివి ఆహారంగా ఇవ్వాలట.

బుధమంత్రం: బుధ గ్రహ అనుగ్రహం కోసం ఓం బ్రాం బ్రీం భ్రౌం సః బుధాయ నమః అనే మంత్రాన్ని రోజుకు 5 గంటల పాటు జపించాలట.

గురువు: జాతకంలో గురువు బలహీనంగా ఉన్నచో జీవితంలో సుఖము, సంతోషం లేకపోవుట, దైవం పై నమ్మకం లేకపోవుట, పెద్దల యందు గౌరవం లేకపోవుట, ఉన్నత విద్యకు ఆటంకాలు, నియంతగా ప్రవర్తించుట, ధనమునకు ఇబ్బందులు కలుగుట, ఎన్ని పూజలు, వ్రతాలు చేసినా ఫలితం లేకపోవుట లాంటి సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు గురు గ్రహం దోషంగా గుర్తించాలట. గురు గ్రహం అనుగ్రహం కోసం గురు చరిత్ర పారాయణ చేయుట. దైవ క్షేత్రములు సందర్శించడం. శనగలు దానం చేయడం. పంచముఖి రుద్రాక్ష ధారణ చేయడం. కనక పుష్కరాగం ధరించాలి.

గురుమంత్రం:గురు గ్రహ అనుగ్రహం కోసం ఓం గ్రా౦ గ్రీం గ్రౌం సః గురవే నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు సంధ్యా సమయంలో జపించాలట.

శుక్రుడు:జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉన్నప్పుడు స్ర్తీలకు అనారోగ్యము కలుగుట. వాహన సౌఖ్యము లేకపోవుట. భార్యా భర్తల మధ్య అన్యోన్యత లేకపోవుట. వ్యసనముల యందు ఆసక్తి, వివాహం ఆలస్యం అగుట, కిడ్నీ వ్యాధులు, వ్యభిచారం, మత్తుపానీయాలు సేవించుట, కుటుంబంలోని స్ర్తీలకు అనారో గ్యము సరిగా లేనప్పుడు శుక్ర గ్రహ దోషము గా గుర్తించాలి. శుక్ర గ్రహ అనుగ్రహం కొరకు లక్ష్మీ అమ్మవారిని పూజించుట, లక్ష్మీ స్తోత్ర ము పారాయణం చేయుట, బొబ్బర్లు దానం చేయుట, స్ర్తీలను గౌరవించుట. సప్తముఖి రుద్రాక్షను ధరించాలి.

శుక్రమంత్రం: ఓం ద్రాం ద్రీం ద్రౌంసః శుక్రాయనమః అనే బీజ మంత్రాన్ని ప్రతిరోజు సూర్యోదయ సమయంలో జపించాలి.

శని: ఆయు కారకుడు అయిన శని దేవుడు జాతకంలో నీచ స్థితిలో ఉన్నప్పుడు ఆ జాతకునికి బద్దకము, అతినిద్ర, దీర్థకాలిక వ్యాధులు, సరయిన ఉద్యోగము లేకపోవుట, జన సహకారం లేకపోవుట, ఎముకలు, తల్లిదండ్రులలో విరో ధములు, కుటుంబమును విడిచి అజ్ఞాతముగా జీవించుట లాంటి సమస్యలు ఉంటాయి. శని గ్రహ అనుగ్రహం కోసం శివునికి అభిషేకము చేయుట. విష్ణు సహస్ర నామాలు పారాయణం చేయాలి. ఆంజనేయస్వామిని ఆరాధించాలి. హనుమాన్‌ చాలిసా పారాయణం చేయాలి.

శని మంత్రం: ఓం ప్రాం ప్రీం ప్రౌంసః శనైశ్చరాయ నమః అనే బీజ మంత్రాన్ని ప్రతి రోజు సాయంత్రం పూట జపించాలట.

రాహువు: రాహువు జాతక చక్రంలో బలహీనంగా ఉన్నప్పుడు చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేయుట, నీచ స్ర్తీలతో సహవాసము, కుష్టు లాంటి వ్యాధులు, జైలు శిక్షలు అనుభవించడం. విద్యార్థులు విద్య మధ్యలో మానివేయడం. లాంటి సమస్యలు వస్తాయి. ఈ దోష నివారణకు కనక దుర్గ అమ్మవారిని పూజించాలి. దేవి భాగవతం పారాయణం చేయాలి. ఎనిమిది ముఖములు గల రుద్రాక్షను ధరించాలి.

రాహువు మంత్రం: ఓం భ్రాం భ్రీం బ్రౌంసః రాహవేనమః అనే బీజ మంత్రాన్ని రాత్రి సమయంలో జపిచాలి.

కేతువు: కేతువు జాతకంలో బలహీనంగా ఉన్నపుడు మానసిక బలహీనతలు, అతిభక్తి, జీవితం మీద విరక్తి, ఎకాంతంగా ఉండాలనే కోరిక, లేనివి ఉన్నట్లు ఊహించుకోవడం, తనలో తానే ఊహించుకొనుట, తనని తాను దేవుడిగానో.. దేవతగానో ఊహించుకోవడం లాంటి సమస్యలు ఉంటాయి. ఈ గ్రహ అనుగ్రహం కొరకు నలుపు తెలుపు రంగులో ఉన్న కంబళి దానం చేయుట. ఆలయాల నిర్మాణానికి విరాళములు ఇవ్వాలి. పిచ్చి ఆస్పత్రిలో రోగులకు సేవలు చేయాలి. అనాథ పిల్లలను చేరదీసి వారికి భోజన సదుపాయం ఏర్పాటు చేయాలి.

కేతు మంత్రం:ఓం స్త్రాం స్త్రీం సౌం సః కేతవేనమః అనే బీజ మంత్రాన్ని రాత్రి సమయంలో జపించాలి.

ఇలా ఏసమస్య ఉందో తెలుసుకుని ఆ సమస్యకు కారణమైన గ్రహానికి సంబంధింయిన పరిహారాలు చేసుకోవాలి. అలాగే తెల్లవారు జామునే నిద్ర లేచి స్నానం చేసుకుని దగ్గరలో ఆలయానికి వెళ్లి దైవదర్శనం చేసుకోవడం. ప్రతి రోజు సూర్య నమస్కారం చేసుకోవడం లాంటి చేయడం వల్ల కూడా ఎటువంటి గ్రహదోషాలు దగ్గరకు రావట.

హర హర మహాదేవ శంభో శంకర 
శివ సంకల్పమస్తు శుభమస్తు

Sunday, November 23, 2025

మంత్ర_జప_ప్రారంభ విధానం గురించి స్వామి వారు చాలా చక్కగా అర్థమయ్యే విధంగా వివరించారు...

మంత్ర_జప_ప్రారంభ విధానం గురించి స్వామి వారు చాలా చక్కగా అర్థమయ్యే విధంగా వివరించారు...



◆ #జప_సంకల్పం :
ముందుగా ఉద్ధరిణ, పంచపాత్ర తీసుకుని...

1. ఓం కేశవాయ స్వాహా 2. ఓం నారాయణాయ స్వాహా 3. ఓం మాధవాయ స్వాహా..
అని మూడు సార్లు ఆచమనం చేసి, ఆ తరువాత ప్రాణాయామం చేసి.....

మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ మహావిష్ణో రాజ్ఞయా ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే _ _ _ దేశే భగవత్సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన _ _ _ సంవత్సరే _ _ _ ఋతౌ _ _ _ మాసే _ _ _ పక్షే _ _ _ తిథౌ _ _ _ వాసరే _ _ _ నక్షత్రే _ _ _ శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం _ _ _ గోత్రోద్భవస్య _ _ _ అహం శ్రీ _ _ _ పరదేవతా ప్రీత్యర్ధం పురశ్చరణ/ప్రయోజిత పూర్వక. శ్రీ _ _ _ మంత్ర జపం కరిష్యే...

అని సంకల్పం చెప్పుకుని ఉంగరం వేలితో పంచపాత్రలో నీటిని తాకవలెను. తరువాత మనసారా _ _ _ స్వామి/మాతకి నమస్కారం చేసుకుని జపానికి ఏ విఘ్నాలు కలుగకుండా ముందుగా...

◆ #శ్రీగణపతి_ప్రార్థన :
∬ వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా  
నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా ∬

అని గణపతికి ముందుగా నమస్కారం చేయండి.

★★★ #గమనిక : పురశ్చరణ కోసం చేసే సంకల్పంలో తమ కోరికలు చెప్పుకోకూడదు, కేవలం దేవతా ప్రీతికొరకే సంకల్పించాలి.

◆ #గురు_వందనం :
∬ గురు బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః 
గురుస్సాక్షాత్ పరంబ్రహ్మ తస్మై శ్రీ గురవేనమః  ∬

అని మీకు మంత్రదీక్ష ఇచ్చిన గురువుకి ముందుగా నమస్కరించండి....

☛【మంత్ర జపానికి ముందుగా ఇష్ట దేవతా పరిపూర్ణ అనుగ్రహం కోసం కవచ, స్తోత్రాలని పఠించండి.】

◆ #మంత్ర_దేవతాన్యాసము :
【న్యాస పద్ధతి ఏమంత్రమునకు ఆ మంత్రమునకు తెలిసికొని చేయవలెను.】

◆ #కరన్యాసం :
1. _ _ అంగుష్ఠాయ నమః
2. _ _ తర్జనీభ్యాం నమః 
3. _ _ మధ్యమాభ్యాం నమః
4. _ _ అనామికాభ్యాం నమః
5. _ _ కనిష్ఠికాభ్యాం నమః
6. _ _ కరతల కరపృష్టాభ్యాం నమః

◆ #అంగన్యాసము :
1. _ _ హృదయాయ నమః
2. _ _ శిరసే స్వాహా
3. _ _ శిఖాయై వషట్
4. _ _ కవచాయ హుం
5. _ _ నేత్రత్రయాయ వౌషట్
6. _ _ అస్త్రయ ఫట్

భూర్భువస్సువరోమితి దిగ్బంధః...

◆ #ధ్యాన_శ్లోకం :
【ఏ మంత్రమునకు ఆ మంత్ర దేవత ధ్యాన శ్లోకం
తెలిసికొని చేయవలెను.】

◆ #లమిత్యాది_పంచపూజలు :
పంచపాత్రలో నీటిని ఉద్ధరిణతో తీసుకుని శ్రీ _ _ పరదేవతాయై పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనం సమర్పయామి, అంటూ అరివేణం (పళ్ళెం)లో పోయాలి.

#లం పృథివీ తత్వాత్మికాయై శ్రీ _ _ పరదేవతాయై గంధం ధారయామి.
#హం ఆకాశతత్వాత్మికాయై శ్రీ _ _ పరదేవతాయై పుప్బైః పూజయామి.
#యం వాయుతత్వాత్మికాయై శ్రీ _ _ పరదేవతాయై ధూపం అఘ్రాపయామి.
#రం తేజస్తత్వాత్మికాయై శ్రీ _ _ పరదేవతాయై దీపం దర్శనయామి.
#వం అమృతతత్వాత్మికాయై శ్రీ _ _ పరదేవతాయై అమృత నైవేద్యం సమర్పయామి.

అని చెపుతూ ఉద్ధరణితో నీటిని ఐదు సార్లు అరివేణం (పళ్ళెం)లో వేయాలి.

◆ #జపమాల_మంత్రం :
మంత్ర జపాన్ని ప్రారంభించటానికి ముందు సాధకుడు జపమాలను చేతితో తీసుకుని కళ్ళకు అద్దుకుని మనసులో.......

∬ ఓం మాం మాలే మహామాయే సర్వమంత్ర స్వరూపిణి..
చతుర్వర్గ స్వయిన్యస్త సస్మాన్మే సిద్ధిదా భవ ∬

అని మనసులో తలచుకుని భక్తి పూర్వకంగా నమస్కరించి జపం చేయటం ప్రారంభించాలి.

◆ #గురు_మంత్రం :
మీకు దీక్షనిచ్చిన గురువు ద్వారా #గురుమంత్రోపదేశాన్ని పొంది ఆ మంత్రాన్ని మీ మూల మంత్రానికి ముందుగా ఒక మాలని, అలాగే జపం పూర్తయిన తరువాత ఒక మాలని జపం చేయాలి....... తద్వారా గురువు అనుగ్రహం లభించి దేవతా మంత్రసిద్ధి మీకు త్వరగా కలుగుతుంది.

➤ #మూల_మంత్రం :
【గురువు ఉపదేశించిన దేవతా మంత్రం.】

మూల మంత్రాన్ని శ్రద్ధా భక్తులతో మౌనంగా మనస్సులో జపం చేయండి.

◆ #జపాంత_విధి : [దిగ్విమోచనం]
#సువర్_భువర్_భూరితి_దిగ్విమోకః.....

అని దిగ్విమోచనం చేసి, మరల దేవత ధ్యాన శ్లోకం చదివి, ఈ క్రింది విధంగా చెపుతూ జపసమర్పణ చేయాలి.

◆ #జప_సమర్పణ :
పై తెలిపిన విధంగా ప్రతిరోజూ నియమిత సంఖ్యలో జపం చేయటం పూర్తయిన తరువాత, తిరిగి మూడు సార్లు ఆచమనం చేసి కొన్ని నీళ్ళు చేతిలో తీసుకుని...

అనేన మయాకృతేన శ్రీ _ _ _ పరదేవతా మంత్ర జపేన శ్రీ _ _ _ పరదేవతా సుప్రీతా సుప్రసన్నా వరదా భవతు. శ్రీ _ _ _ పరదేవతా సంపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్యర్ధం ఏతత్ జపఫలం శ్రీ _ _ _ పరదేవతా చరణారవిందార్పణమస్తు... తత్సత్ బ్రహ్మార్పణమస్తు....

అనీ ఆ నీటిని అరివేణం (ఒక పళ్ళెం)లో విడవాలి. అలా విడిచిన నీటిని మూడు సార్లు తీర్ధంగా తీసుకోవాలి.
【మీరు జపం చేసే అన్ని రోజులూ ఇదే విధంగా చేయాలి.】...🙏

➽ #జప_ప్రాశస్త్యం :
పైన తెలిపిన నియమాలను ఆచరిస్తూ అచంచల భక్తి విశ్వాసాలతో జపాన్ని చేస్తే ఎన్నో శుభఫలితాలు కలుగుతాయి.

∬ జపేన దేవతా నిత్యం స్తూయమానా ప్రసీదతి
ప్రసన్నా విపులాన్ఫోగాన్ దద్యాన్ముక్తించ శాశ్వతీం
యక్ష రక్షః పిశాచాశ్చ గ్రహాస్సర్వాశ్చ భీషణా:
జాపినం నోపసర్పంతి భయభీతా స్సమంతతః
యావంతః కర్మయజ్ఞానుస్స్యుః ప్రతిష్టాశ్చ తపాంసి చ
సర్వే తే జపయజ్ఞస్య కలాం నార్హంతి షోడశీం
మాహాత్యం వాచకస్మైత జ్ఞపయజ్ఞస్య కీర్తనం ∬

భావం:: జపం చేయటం ద్వారా స్తుతించబడ్డ #దేవతలు నిత్యం సాధకుడికి ప్రసన్నమై వుంటారు.......... వారికి #శాశ్వత_భోగ_మోక్షాల్ని ప్రసాదిస్తారు. యక్ష, రక్షః పిశాచాలు, దుష్టగ్రహాలు, జపంచేసే వాడిని చూసి భయపడతాయి.

తపస్సులు, కర్మయజ్ఞాలు, జపయజ్ఞంలో పదహారో భాగానికి కూడా సరిరావు...... ఈ చెప్పిన #జప_మహాత్మ్యం వాచికంగా చేసే జపానికే, దీనికి శతాధికంగా ఉపాంశు జపానికి, సహస్రాధికంగా మానసిక జపానికి మాహాత్మ్యం అధికమని శాస్త్రం చెబుతుంది...
🌹🙏🌹

Saturday, November 22, 2025

భారతీయులకు ముఖ్యమైన జ్యోతిర్లింగాలు మరియు+ పంచభూత లింగాలు + పంచారామాల క్షేత్ర స్థానాల వివరణ

భారతీయులకు ముఖ్యమైన జ్యోతిర్లింగాలు మరియు+ పంచభూత లింగాలు + పంచారామాల
 క్షేత్ర స్థానాల వివరణ

 *ఈ క్షేత్రాలు ఉద్భవించడానికి

సంబంధించిన ముఖ్యమైన పౌరాణిక కథ శివపురాణం మరియు కొన్ని ఇతర పురాణాలలో వివరించబడింది క్లుప్తంగా తెలుసుకుందాం*

* జ్యోతిర్లింగ ఉద్భవ కథ*
జ్యోతిర్లింగం అనేది శివుడు కాంతి రూపంలో (జ్యోతి స్వరూపంలో) స్వయంగా భూమిపై వెలసిన ప్రదేశాన్ని సూచిస్తుంది.

*బ్రహ్మ-విష్ణువుల వాదన*
సృష్టికి సంబంధించిన కాలంలో, బ్రహ్మ (సృష్టికర్త) మరియు విష్ణువు (పోషకుడు) తమలో ఎవరు గొప్ప అనే విషయంపై వాదించుకున్నారు. ఈ వాదన తీవ్రరూపం దాల్చింది.

*అగ్ని స్తంభం ఆవిర్భావం*
వారి మధ్య ఉన్న వివాదాన్ని పరిష్కరించడానికి, పరమశివుడు అకస్మాత్తుగా వారి మధ్య అంతులేని అగ్ని స్తంభం (జ్యోతిర్లింగం) రూపంలో సాక్షాత్కరించాడు.

శివుడు వారితో, "ఈ స్తంభం యొక్క ఆది (మొదలు) మరియు అంతం (తుది) కనుగొన్నవారే మీ ఇద్దరిలో గొప్పవారు" అని ప్రకటిస్తాడు.

*అంతులేని అన్వేషణ*
బ్రహ్మ వెంటనే హంస రూపం ధరించి స్తంభం ఊర్ధ్వ భాగం (పై భాగాన్ని) కనుగొనడానికి ఆకాశంలోకి ఎగురుతాడు.

విష్ణువు వరాహ (పంది) రూపం ధరించి స్తంభం అధో భాగం (కింది భాగాన్ని) తెలుసుకోవడానికి భూమిలోకి వెళ్తాడు.

వారిద్దరూ ఎన్ని యుగాలు ప్రయత్నించినా, ఆ అగ్ని స్తంభం యొక్క మొదలు, తుది కనుగొనలేకపోయారు. ఆ స్తంభం యొక్క కాంతి, శక్తి అంతులేనివిగా ఉన్నాయి.

*సత్యం, శాపం*
విష్ణువు అన్వేషణ విఫలమైందని, తన ఓటమిని అంగీకరించి శివుడికి నమస్కరిస్తాడు.
బ్రహ్మ మాత్రం, తాను కేతకి పువ్వు (మొగలి పువ్వు) సాక్ష్యంగా ఆది భాగాన్ని చూశానని అబద్ధం చెబుతాడు.

అబద్ధం చెప్పినందుకు శివుడు ఆ అగ్ని స్తంభం నుండి ప్రత్యక్షమై, బ్రహ్మకు భూలోకంలో పూజార్హత ఉండదని శపిస్తాడు. అదేవిధంగా, అబద్ధానికి సాక్ష్యమిచ్చిన కేతకి పువ్వును తన పూజకు ఉపయోగించరాదని ప్రకటిస్తాడు.

*12 జ్యోతిర్లింగాలు వెలయడం*
ఈ దివ్యమైన అగ్ని స్తంభం యొక్క తేజస్సు భూమిపై పన్నెండు చోట్ల స్వయంభువుగా లింగరూపంలో వెలసింది. ఈ పన్నెండు పవిత్ర స్థలాలనే మనం ద్వాదశ జ్యోతిర్లింగాలుగా పూజిస్తాం.

ఈ కథ శివుడే అత్యంత శక్తిమంతుడని, సృష్టికి మూలమని తెలియజేస్తుంది. జ్యోతిర్లింగాలు నిరాకారమైన శివుని కాంతికి ప్రతీకలు.

ద్వాదశ జ్యోతిర్లింగాలు మరియు వాటి స్థానాలు
ఈ పన్నెండు జ్యోతిర్లింగాలు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో ఉన్నాయి

ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం
సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునమ్ |
ఉజ్జయిన్యాం మహాకాలం ఓంకారమమలేశ్వరమ్ ||
పరల్యాం వైద్యనాథం చ డాకిన్యాం భీమశంకరమ్ |
సేతుబంధే తు రామేశం నాగేశం దారుకావనే ||
వారణాస్యాం తు విశ్వేశం త్రయంబకం గౌతమీతటే |
హిమాలయే తు కేదారం ఘృష్ణేశం చ శివాలయే ||
ఫలశ్రుతి:
ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః |
సప్తజన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి ||

​1. సోమనాథుడు (సౌరాష్ట్ర)
సౌరాష్ట్రదేశే విశదేఽతిరమ్యే జ్యోతిర్మయం చంద్రకళావతంసమ్ |
భక్తిప్రదానాయ కృపావతీర్ణం తం సోమనాథం శరణం ప్రపద్యే ||

​2. మల్లికార్జునుడు (శ్రీశైలం)
శ్రీశైలశృంగే వివిధప్రసంగే శేషాద్రిశృంగేఽపి సదా వసంతమ్ |
తమర్జునం మల్లికపూర్వమేకం నమామి సంసారసముద్రసేతుమ్ ||

​3. మహాకాళేశ్వరుడు (ఉజ్జయిని)
అవంతికాయాం విహితావతారం ముక్తిప్రదానాయ చ సజ్జనానమ్ |
అకాలమృత్యోః పరిరక్షణార్థం వందే మహాకాలమహాసురేశమ్ ||

​4. ఓంకారేశ్వరుడు (మధ్యప్రదేశ్)
కావేరికా నర్మదయోః పవిత్రే సమాగమే సజ్జనతారణాయ |
సదైవ మాంధాతృపురే వసంతం ఓంకారమీశం శివమేకమీడే ||

​5. వైద్యనాథుడు (పరలి/దేవఘర్)
పూర్వోత్తరే ప్రజ్వలికానిధానే సదా వసంతంగిరిజాసమేతమ్ |
సురాసురారాధితపాదపద్మం శ్రీవైద్యనాథం తమహం నమామి ||

​6. భీమశంకరుడు (డాకిని - మహారాష్ట్ర)
యం డాకినీశాకినికాసమాజే నిషేవ్యమాణం పిశితాశనైశ్చ |
సదైవ భీమాదిపదప్రసిద్ధం తం శంకర్ం భక్తహితం నమామి ||

​7. రామేశ్వరుడు (తమిళనాడు)
శ్రీ తామ్రపర్ణీజలరాశియోగే నిబధ్య సేతుం విశిఖైరసంఖ్యైః |
శ్రీరామచంద్రేణ సమర్పితం తం రామేశ్వరాఖ్యం నియతం నమామి ||

​8. నాగేశ్వరుడు (దారుకావనం - గుజరాత్)
యామ్యే సదంగే నగరేఽతిరమ్యే విభూషితాంగం వివిధైశ్చ భోగైః |
సద్భక్తిముక్తిప్రదమీశమేకం శ్రీనాగనాథం శరణం ప్రపద్యే ||

​9. విశ్వేశ్వరుడు (వారణాసి)
సానందమానందవనే వసంతం ఆనందకందం హతపాపబృందమ్ |
వారాణసీనాథమనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే ||

​10. త్రయంబకేశ్వరుడు (నాసిక్)
సహ్యాద్రిశీర్షే విమలే వసంతం గోదావరీతీరపవిత్రదేశే 
యద్దర్శనాత్ పాతకమాశు నాశం ప్రయాతి తం త్ర్యంబకమీశమీడే ||

​11. కేదారేశ్వరుడు (హిమాలయాలు)
మహాద్రిపార్శ్వే చ తటే రమంతం సంపూజ్యమానం సతతం మునీంద్రైః |
సురాసురైర్యక్ష మహోరగాద్యైః కేదారమీశం శివమేకమీడే ||

​12. ఘృష్ణేశ్వరుడు (ఎల్లోరా)
ఇలాపురే రమ్యవిశాలకేఽస్మిన్ సముల్లసంతం చ జగద్వరేణ్యమ్ |
వందే మహోదారతరస్వభావం ఘృష్ణేశ్వరాఖ్యం శరణం ప్రపద్యే ||
*ఫలశ్రుతి*
జ్యోతిర్మయ ద్వాదశలింగకానాం శివాత్మకానాం ప్రోక్తం ఇదం క్రమేణ |
స్తోత్రం పఠిత్వా మనుజోఽతిభక్త్యా ఫలం తదలోక్య నిజం భజేచ్చ ||
*శివోహం శివోహం శివోహం*

సంఖ్య జ్యోతిర్లింగం పేరు రాష్ట్రం ప్రదేశం/నది ఒడ్డున

1. సోమనాథేశ్వరుడు గుజరాత్ సౌరాష్ట్ర, ప్రభాస్ పట్నం (సముద్ర తీరం)

2. మల్లికార్జునుడు ఆంధ్రప్రదేశ్ శ్రీశైలం (నల్లమల కొండలు)

3. మహాకాళేశ్వరుడు మధ్యప్రదేశ్ ఉజ్జయిని (క్షిప్రా నది ఒడ్డున)

4. ఓంకారేశ్వరుడు మధ్యప్రదేశ్ ఓంకారేశ్వరం (నర్మదా నది ఒడ్డున)

5. కేదారేశ్వరుడు ఉత్తరాఖండ్ హిమాలయ పర్వతాలు, కేదార్‌నాథ్

6. భీమశంకరుడు మహారాష్ట్ర సహ్యాద్రి పర్వతాలు

7. విశ్వేశ్వరుడు ఉత్తరప్రదేశ్ వారణాసి/కాశీ (గంగా నది ఒడ్డున)

8. త్రయంబకేశ్వరుడు మహారాష్ట్ర నాసిక్ దగ్గర (గౌతమీ/గోదావరి నది తీరాన)

9. వైద్యనాథేశ్వరుడు జార్ఖండ్ దేవ్‌ఘర్ (లేదా 
మహారాష్ట్రలో కూడా ఒక వాదన ఉంది)

10. నాగేశ్వరుడు గుజరాత్ ద్వారక దగ్గర/దారుకావనం

11. రామేశ్వరుడు తమిళనాడు రామేశ్వరం (సముద్ర తీరం)

12. ఘృష్ణేశ్వరుడు మహారాష్ట్ర ఔరంగాబాద్ దగ్గర
వీటిలో కొన్ని రెండు ప్రదేశాలు అని వాదన ఉన్నవి

************
*పంచభూత లింగాల వివరణ*
ప్రకృతిలోని ఐదు మూలకాలైన భూమి, నీరు, అగ్ని, గాలి మరియు ఆకాశం (లేదా అంతరిక్షం) రూపంలో పరమశివుడు వెలసిన ఐదు ప్రదేశాలనే పంచభూత లింగాలు అంటారు.

ఈ ఐదు ఆలయాలు కూడా భారతదేశంలోని దక్షిణ భారతదేశం (ముఖ్యంగా తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్) లో ఉన్నాయి.

*ఏకామ్రేశ్వర పృథివి లింగ ధ్యానo*

ఏకామ్రమూలే నిజలింగమూర్తిం
ఏకాంతభక్తాం చ దధాతి నిత్యం |
ఏకామ్రనాథం భువనైకనాథం
ఏకాంతభక్త్యా శరణం ప్రపద్యే ||

*జంబుకేశ్వర జల లింగ ధ్యానం*

అంభోమయం యం జగదేకనాథం
జంబ్వాఖ్యవృక్షస్య తలే నిషణ్ణమ్ |
శ్రీజంబుకేశం ప్రణమామి మూర్ధ్నా
వందే సదాహం జగదీశ్వరం తమ్ ||

*అరుణాచలేశ్వర అగ్ని లింగ ధ్యానం*

అరుణాద్రినివాసాయ అరుణాచలశంభవే |
అపీతకుచనాథాయ అరుణేశాయ మంగళమ్ ||
(లేదా)
సమస్త జగదాధారం జ్యోతిర్లింగ స్వరూపిణమ్ |
అరుణాచలనాథం తం స్మరామి హృది సంతతమ్ ||

*శ్రీ కాళహస్తి లింగేశ్వర వాయు లింగ ధ్యానం*

శ్రీకాళహస్తీశ్వర మాశ్రయంతి
యే భక్త్యా ప్రయాతాః పరిణమ్య చిత్తమ్ |
తేషాం న కింలభ్యమిహ త్రిలోక్యాం
ముక్తిశ్చ హస్తే స్థిత ఏవ సత్యమ్ ||

*శ్రీ చిదంబరేశ్వర ఆకాశ లింగ ధ్యానం*

కృపాసముద్రం సుముఖం త్రినేత్రం
జటాధరం పార్వతి వామభాగమ్ |
సదాశివం రుద్రమనంతరూపం
చిదంబరేశం హృది భావయామి ||

*క్షేత్ర స్థానములు*

1. పృథ్వీ లింగం భూమి ఏకాంబరేశ్వరాలయం కంచి, తమిళనాడు

2. జల లింగం నీరు జంబుకేశ్వరాలయం తిరుచ్చిరాపల్లి, తమిళనాడు

3. తేజో లింగం అగ్ని అరుణాచలేశ్వరాలయం తిరువణ్ణామలై, తమిళనాడు

4. వాయు లింగం గాలి శ్రీకాళహస్తీశ్వరాలయం శ్రీకాళహస్తి, ఆంధ్రప్రదేశ్

5. ఆకాశ లింగం ఆకాశం నటరాజ స్వామి ఆలయం (చిదంబర రహస్యం)

పంచభూత లింగాల చరిత్ర మరియు ప్రాముఖ్యత
ఈ ప్రతి లింగం వెనుక ఒక ప్రత్యేకమైన పురాణ కథ మరియు ప్రత్యేకత ఉంది

1. ఏకాంబరేశ్వరాలయం (భూమి లింగం - కంచి)
పార్వతీ దేవి భూలోకానికి వచ్చినప్పుడు, కంచిలోని మామిడి చెట్టు కింద ఇసుకతో శివలింగాన్ని (పృథ్వీ లింగం) తయారు చేసి పూజించింది, శివుడు తనను పరీక్షించడానికి వరద సృష్టించినప్పుడు, పార్వతి ఆ లింగాన్ని కాపాడుకోవడానికి గట్టిగా కౌగిలించు కుంటుంది, అందుకే ఇక్కడ శివుడిని 'ఏకాంబరనాథుడు' లేదా 'తొండైమాన్' అంటారు. ఇక్కడ లింగం ఇసుకతో చేసినట్లు ఉంటుంది. ఆలయ ప్రాంగణంలో ఆ పురాతన మామిడి చెట్టు ఇప్పటికీ ఉంది.

2. జంబుకేశ్వరాలయం (జల లింగం - తిరుచ్చి)
 ఒకసారి పార్వతీ దేవి కైలాసం నుండి భూమికి వచ్చి, శివుడిని పూజించడానికి నదీతీరాన తెల్లని నారద వృక్షం (జంబు వృక్షం) కింద లింగాన్ని ప్రతిష్టించింది. ఇక్కడ శివుడిని అఖిలాండేశ్వరి (పార్వతి) పూజించింది.

ఈ ఆలయంలోని గర్భగుడిలో, లింగం కింద ఎల్లప్పుడూ నీటి ఊట ఉంటుంది. అంటే లింగం నీటిలో నిలబడి ఉంటుంది. ఈ ఆలయంలో ఎప్పుడూ తేమ ఉంటుంది, ఇది జల మూలకాన్ని సూచిస్తుంది.

3 అరుణాచలేశ్వరాలయం (తేజో లింగం - తిరువణ్ణామలై)
 జ్యోతిర్లింగాల ఆవిర్భావ కథ ఇక్కడ కూడా సంబంధం కలిగి ఉంది. బ్రహ్మ మరియు విష్ణువుల మధ్య తగాదా వచ్చినప్పుడు, శివుడు అగ్ని స్తంభంగా (అరుణాచలం పర్వతం) వెలసి, జ్ఞానాన్ని ప్రసాదించాడు .

ఇక్కడ పర్వతాన్నే శివుడిగా పూజిస్తారు. ఈ పర్వతం స్వయంగా అగ్ని స్తంభం. కార్తీక పౌర్ణమి నాడు, కొండ శిఖరంపై మహా దీపం వెలిగిస్తారు, ఇది తేజస్సు (అగ్ని) మూలకాన్ని సూచిస్తుంది.

4. శ్రీకాళహస్తీశ్వరాలయం
 (వాయు లింగం - శ్రీకాళహస్తి)

ఒకసారి, శివుడిని సాలీడు (శ్రీ), పాము (కాళ), ఏనుగు (హస్తి) తీవ్రంగా పూజించాయి. సాలీడు గూడు కట్టింది, పాము మణిచ్చింది, ఏనుగు జలంతో అభిషేకించింది. వారి భక్తికి మెచ్చి శివుడు ఇక్కడ లింగంగా వెలిశాడు.

 గర్భగుడిలో ఉన్న లింగానికి దీపం యొక్క జ్వాల స్థిరంగా ఉండకుండా ఎప్పుడూ గాలికి కదులుతూ ఉంటుంది. ఇది వాయు (గాలి) మూలకాన్ని సూచిస్తుంది. ఈ లింగానికి అభిషేకం చేసి పూలమాలలు అలంకరిస్తారు.

5. చిదంబరం నటరాజ స్వామి ఆలయం (ఆకాశ లింగం - చిదంబరం)
ఇక్కడ శివుడు తన నటరాజ (నృత్యం చేసే రాజు) రూపంలో ఆనంద తాండవం చేశాడు. ఈ నాట్యం సృష్టికి మూలమైన శక్తి (ఆకాశం/అంతరిక్షం) ను సూచిస్తుంది.

 ఈ ఆలయంలో గర్భగుడిలో లింగం ఉండదు ,ఒక ఖాళీ స్థలం ఉంటుంది, దానిని చిదంబర రహస్యం అంటారు. ఈ ఖాళీ స్థలాన్ని ఒక తెరతో కప్పి ఉంచుతారు. శివుడు నిరాకారుడు (ఆకారం లేనివాడు), ఆకాశం లాంటివాడు అని సూచించడానికి ఈ ఏర్పాటు చేశారు ,

ఈ ఐదు లింగాలు శివుడు విశ్వంలోని ప్రతి మూలకంలో అంతర్లీనంగా ఉన్నాడని తెలియజేస్తాయి. ఈ ఐదు ఆలయాలను దర్శించడం ఒక పవిత్ర పుణ్యయాత్ర.

************
*పంచారామ క్షేత్రాల చరిత్ర*
పంచారామ క్షేత్రాలు అంటే ఐదు పవిత్రమైన రామాల అని అర్థం , ఈ ఐదు శివాలయాలు కూడా ఆంధ్రప్రదేశ్‌లో (ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలలో) ఉన్నాయి.

*పంచారామ క్షేత్రాల ఉద్భవ కథ*
ఈ ఐదు ఆలయాల ఉద్భవానికి మూలమైన కథ త్రిపురాసుర సంహారానికి సంబంధించినది.
త్రిపురాసుర సంహారం
పూర్వం, త్రిపురాసురులు అనే ముగ్గురు రాక్షసులు (తారకాసురుడి కొడుకులు) తమ అపారమైన శక్తితో దేవతలను, లోకాలను పీడించేవారు. వారిని సంహరించడానికి శివుడు స్వయంగా రంగంలోకి దిగాడు.

*శివలింగం విచ్ఛిన్నం*
త్రిపురాసుర సంహార సమయంలో, శివుడు ఉపయోగించిన దివ్యమైన అస్త్రం వలన, రాక్షసులకు బలం చేకూర్చే తాను ధరించిన శివలింగం కొన్ని కథల ప్రకారం, ఇది తారకాసురుడు తన మెడలో ధరించిన ఆత్మలింగం యొక్క శకలం ఐదు ముక్కలుగా విడిపోయింది.

*దేవతల ప్రతిష్ట*
ఆ లింగం యొక్క ముక్కలు భూమిపై పడినప్పుడు, దేవతలు, ముఖ్యంగా కుమారస్వామి (శివుడి కుమారుడు), వాటిని పవిత్రంగా భావించి, ఆ ముక్కలు పడిన ఐదు ప్రదేశాలలో వాటిని ప్రతిష్టించారు.

ఈ ఐదు ప్రదేశాలలో, ఆ లింగ శకలాలు వెలసిన శివాలయాలనే పంచారామ క్షేత్రాలు అంటారు. ఈ లింగాలలో ఇప్పటికీ ఆ నాటి రాక్షసుల/అసురుల శక్తి నిక్షిప్తమై ఉంటుంది ,అందుకే ఈ క్షేత్రాలు శక్తివంతమైనవి.

|| శ్రీ పంచారామ క్షేత్ర స్తోత్రం ||

1. పంచారామ స్మరణ (ముఖ్య శ్లోకం)
అమరారామం కుమారారామం భీమారామం చ పాలనమ్ |
క్షీరారామం సోమారామం పంచారామాన్ స్మరేన్నరః ||

ఒక్కొక్క క్షేత్ర ధ్యాన శ్లోకాలు
1. అమరారామం (అమరావతి)

అమరావతీ పురే రమ్యే అమరేశ్వర సంజ్ఞకమ్ |
నమామి శిరసా దేవం సర్వపాప ప్రణాశనమ్ ||

2. భీమారామం (ద్రాక్షారామం)

శ్రీమద్దక్షపురీవాసం భీమేశ్వరమభీష్టదమ్ |
వందే మాణిక్యసంయుక్తం సర్వలోకైక నాయకమ్ ||

3. కుమారారామం (సామర్లకోట)

స్కంద స్థాపిత లింగాయ కుమారారామ వాసినే |
భీమేశ్వరాయ దేవాయ త్రిపురసుందరీ ప్రియాయ నమః ||

4. క్షీరారామం (పాలకొల్లు)

శ్రీరామకర సంజాతం క్షీరారామ నివాసినం |
పార్వతీశం పరంజ్యోతిం రామలింగం నమామ్యహమ్ ||

5. సోమారామం (భీమవరం - గునుపూడి)

చంద్రప్రతిష్ఠితం దేవం సోమేశ్వరమాది కారణమ్ |
రాజరాజేశ్వరీ సమేతం భీమవరక్షేత్రే భావయే ||

*ఫలశ్రుతి*
పంచారామ కృతాని లింగాని యః పఠేత్ శివసన్నిధౌ 
శివలోక మవాప్నోతి శివేన సహ మోదతే ||

* ఐదు పంచారామ క్షేత్రాలు*
పంచారామ క్షేత్రాలు, వాటి స్థానాలు మరియు ప్రత్యేకతలు ఈ విధంగా ఉన్నాయి

సంఖ్య క్షేత్రం (శివుడి పేరు) లింగం ఎత్తు స్థలం (జిల్లా) ప్రత్యేకత

1. అమరారామం (అమరేశ్వరుడు) 15 అడుగులు అమరావతి, పల్నాడు జిల్లా (గుంటూరు దగ్గర) లింగానికి ఎప్పుడూ పూజ చేస్తూ ఉంటారు. ఇంద్రుడు ప్రతిష్టించాడు.

2. క్షీరారామం (క్షీరారామలింగేశ్వరుడు) సుమారు 12 అడుగులు పాలకొల్లు, పశ్చిమ గోదావరి జిల్లా ఇక్కడ శివుడిని ఉపమన్య మహర్షి ప్రతిష్టించినట్లు చెబుతారు.

3. ద్రాక్షారామం (భీమేశ్వరుడు) 14 అడుగులు ద్రాక్షారామం, కోనసీమ జిల్లా ఇక్కడ శివలింగాన్ని సూర్యుడు ప్రతిష్టించినట్లు, లింగంపై ఇప్పటికీ నీటి ఊట ఉంటుందని చెబుతారు.

4. సోమారామం (సోమేశ్వరుడు) లింగం భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా ఈ లింగం పౌర్ణమి నాడు తెలుపు రంగులో, అమావాస్య నాడు గోధుమ రంగులో మారుతుందని ప్రతీతి. చంద్రుడు ప్రతిష్టించాడు.

5. కుమారారామం (కుమార భీమేశ్వరుడు) 14 అడుగులు సామర్లకోట, కాకినాడ జిల్లా

సాధారణ పెద్ద లింగాలు ఈ ఐదు క్షేత్రాలలోనూ లింగాలు చాలా ఎత్తుగా ఉంటాయి. అందువలన, ఈ లింగాలకు నిత్య పూజ కోసం మెట్లు లేదా పీఠాలు ఏర్పాటు చేస్తారు.

 ప్రతి క్షేత్రం చివర 'ఆరామం' (తోట) అనే పదం ఉంటుంది, ఇది ఆ ప్రదేశం పవిత్రతను సూచిస్తుంది.
ఈ క్షేత్రాలను దర్శించడం వలన మహాపాపాలు తొలగి, శివానుగ్రహం లభిస్తుంది.

ఇలా శివాలయాలు అసంఖ్యాక చిన్న ఆలయాలు
శివలింగాన్ని ప్రతిష్టించి పూజించే చిన్న గుడులు, నదీ తీరాల వద్ద ఉన్న ఆలయాలు మరియు వ్యక్తిగత పూజా మందిరాలు లెక్కకు మించినవిగా ఉన్నాయి. 

వీటిలో చాలా వరకు ప్రభుత్వ రికార్డుల్లో లేదా పర్యాటక జాబితాలలో నమోదు కావు.

కాలక్రమేణా, యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా నాశనమైన లేదా శిథిలమైన వేలాది ప్రాచీన ఆలయాలు ఉన్నాయి.

 శివుడిపై ఉన్న భక్తి కారణంగా, ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో (ముఖ్యంగా భారతదేశం, నేపాల్, శ్రీలంక, ఆగ్నేయాసియా మరియు ఇతర ప్రాంతాలలో) నిరంతరం కొత్త శైవాలయాలు నిర్మించబడుతూనే ఉన్నాయి. పురాతనమైనవి కనుగొంటున్నారు భౌతిక శాస్త్రవేత్తలు.

అయితే, చరిత్ర మరియు పురాణాల ప్రకారం ప్రాముఖ్యత పొందిన శివాలయాలను కొన్ని పవిత్ర సమూహాలలో విభజించి చూడవచ్చు

పవిత్ర సమూహం సంఖ్య స్థానం
*ద్వాదశ జ్యోతిర్లింగాలు 12 భారతదేశం
*పంచభూత లింగాలు 5 దక్షిణ భారతదేశం
*పంచారామ క్షేత్రాలు 5 ఆంధ్రప్రదేశ్
*సప్త మోక్షపురాలు (కాశీ, ఉజ్జయిని మొదలైనవి) కొన్ని ప్రముఖ ఆలయాలు

ప్రపంచవ్యాప్తంగా శివుడిని ఆరాధించే ప్రాంతాలలో ఉన్న చిన్న, పెద్ద శైవ క్షేత్రాల సంఖ్య కోట్లలో ఉండవచ్చు. కానీ, మనకు తెలిసిన అత్యంత పవిత్రమైన మరియు ముఖ్యమైన ఆలయాలు మాత్రం పైన చెప్పిన సమూహాలలో లెక్కించబడ్డాయి.
శ్రీ గోవింద నారాయణ మహాదేవ 🙏 
*రాళ్ళబండి శర్మ*

ఈ శ్లోకాన్ని పఠించడం అంటే, సృష్టిలోని ఈ దివ్య శక్తులు మరియు కర్మ ఫలితాలను నియంత్రించే కాల స్వరూపాలు మనకు అనుకూలంగా మారి, మన జీవిత ప్రయాణంలో శాంతిని మరియు సాఫల్యాన్ని ఇవ్వాలని కోరుకోవడం.



ఈ శ్లోకాన్ని పఠించడం అంటే, సృష్టిలోని ఈ దివ్య శక్తులు మరియు కర్మ ఫలితాలను నియంత్రించే కాల స్వరూపాలు మనకు అనుకూలంగా మారి, మన జీవిత ప్రయాణంలో శాంతిని మరియు సాఫల్యాన్ని ఇవ్వాలని కోరుకోవడం.

✴️మన జీవితంలో కాలచక్రం మరియు కర్మల వల్ల కలిగే కష్టాలు, ఇబ్బందులు, బాధలు (అశాంతి) తొలగిపోయి, ఆత్మజ్ఞానం మరియు మానసిక ప్రశాంతత (శాంతి) లభించాలని కోరుకోవడం ఈ ప్రార్థన యొక్క అంతిమ ఉద్దేశం.

​🌟 వివరణాత్మకమైన లోతైన అర్థం (Detailed Deep Meaning)
​ఈ శ్లోకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం త్రిమూర్తులను మరియు నవగ్రహాలను ప్రార్థించడం.
🟢​త్రిమూర్తుల ప్రస్తావన: శ్లోకంలో మొదటగా బ్రహ్మ, విష్ణువు, శివుడుల పేర్లను చెప్పడం ద్వారా, ఈ ముగ్గురు దేవతల యొక్క శక్తిని, వారి ఆశీర్వాదాన్ని కోరుతున్నారు. వీరు లోక పాలకులు, కాబట్టి వీరి ఆశీస్సులతో గ్రహాల ప్రభావం కూడా శుభప్రదంగా మారుతుందని విశ్వసిస్తారు.
🟢​నవగ్రహాల ప్రస్తావన: సూర్యుడు మొదలుకొని కేతువు వరకు ఉన్న తొమ్మిది గ్రహాల పేర్లను పేర్కొంటున్నారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈ గ్రహాలు మనిషి జీవితంలో శుభ, అశుభ ఫలితాలను ఇస్తుంటాయి.
♦️​ముఖ్య ప్రార్థన: "సర్వే గ్రహాః శాంతికరా భవంతు" అనే చివరి వాక్యం ఈ శ్లోకానికి కీలకం. అంటే, నవగ్రహాలన్నీ మాకు శాంతిని, శుభాన్ని కలిగించుగాక! అని వేడుకోవడం.
​గ్రహాల వల్ల కలిగే దుష్ఫలితాలు, బాధలు తొలగిపోయి, జీవితంలో సుఖం, సంపద, ఆరోగ్యం, ప్రశాంతత కలగాలని ఈ శ్లోకం ద్వారా భగవంతుడిని మరియు గ్రహాలను ప్రార్థిస్తారు.
​శని, రాహువు, కేతువు వంటి గ్రహాల చెడు దృష్టి తగ్గడానికి, మిగిలిన గ్రహాల అనుగ్రహం పెరగడానికి ఈ స్తుతిని పఠిస్తారు.
​సంక్షిప్తంగా, ఇది సకల గ్రహాలనూ, త్రిమూర్తులనూ స్మరించుకొని, మా జీవితంలో అన్ని కష్టాలూ తొలగిపోయి, శుభం, శాంతి కలగాలని కోరుకునే శక్తివంతమైన ప్రార్థన.

ala #tirupati

Friday, November 21, 2025

పూజలు నిర్వహించే బ్రాహ్మణ గురువులను ఎలా పిలవాలి*????

పూజలు నిర్వహించే బ్రాహ్మణ గురువులను ఎలా పిలవాలి*????


 **మన భారతీయులు ప్రతీ శుభకార్యం వేదాల్లో చెప్పబడిన విధంగా అనుసరిస్తూ దేవతా అనుగ్రహం పొందుతాం ఈ క్రమం లో మన బ్రాహ్మణ పురోహితులు లేకుండా ఏ శుభకార్యం ముందుకువెళ్ళము వారిని ఎలా పిలవాలి అనే అంశం చూద్దాం ***

*పూజారి అంటే ఏమిటి?*
*పూజకు - అరి*  పూజలకు అడ్డు వచ్చే వారు ఇదేంటి ఇలా ఉంది ఈ సందేశo*

 *బ్రాహ్మణ గురువులను గౌరవంగా పిలవడానికి ఉపయోగించే గౌరవ సంబోధనలు తెలుసుకుందాం*

గౌరవ గురువులు / గురువు గారు 'గురువు' అనేది సాధారణంగా వాడే అత్యంత గౌరవప్రదమైన పదం. 'గారు' అనేది గౌరవ సూచకం.

*స్వామి*
 మతపరమైన లేదా ఆధ్యాత్మిక గురువులను, పీఠాధిపతులు సన్యాసులను  స్వామి లేక గురువుగారు అని పిలవడానికి ఉపయోగిస్తారు.

*ఆచార్య* / ఆచార్యుల వారు వేదాలు, శాస్త్రాలు, మత కర్మలలో నిపుణులను, లేదా ఉన్నత విద్యను 
బోధించే వారిని సంబోధించడానికి వాడతారు.

*వేదపండితులు * / పండితుల వారు అని
వేదం ఘనాన్తం ఘనపాఠి 
క్రమాంతం క్రమపాఠి
మూలం అయిన వేద పండితులు అని 
ద్వివేది,త్రివేది,చతుర్వేది సలక్షణం పండితులు అని
వేదశాస్త్రాలలో, ధర్మంలో గొప్ప జ్ఞానం కలవారిని పిలుస్తారు.

*శాస్త్రి: శాస్త్రి గారు 
ధర్మశాస్త్రాలలో విశేష పాండిత్యం కలవారికి ఇచ్చే బిరుదు.

*సిద్ధాంతి*
పంచాంగ గణన చేయు వారిని సిద్ధాంతి గారని పిలవాలి ,జ్యోతిష శాస్త్రం వారిని శాస్త్రి గారు అని

వేదమూర్తి: వేదమూర్తులు 
వేదాలను బాగా అభ్యసించిన వారిని గొప్ప గౌరవంతో పిలవడానికి ఉపయోగిస్తారు.

అశ్వమేధం సోమయగం ,ఇంకా వివిధ యజ్ఞములు చేసిన వారిని
యజ్వ , యాజులు గారని (సోమయాజులు గారని)
చేయనం చైయన్లు గారని అంటారు.

ప్రత్యేక సందర్భాలలో / హోదాలను బట్టి పిలవాల్సి ఉంటుంది 

*పురోహితులు* 
శుభకార్యాలు, పూజలు నిర్వహించే వారిని పిలుస్తారు.

*శ్రోత్రియ / శ్రోత్రియులు*
వేదాధ్యయనంలో, కర్మకాండలలో నిష్ణాతులైన వారిని పిలవడానికి వాడే సాంప్రదాయ పదం.

*దీక్షితులు*
యజ్ఞం చేయాలనే సంకల్పంతో 'దీక్ష' తీసుకున్న యజమానిని 'దీక్షితులు' అని కూడా అంటారు. వీరు యజ్ఞం పూర్తయ్యే వరకు కఠినమైన నియమాలు పాటిస్తారు దీక్షితులు ఎక్కువ కాలం దీక్ష జప అనుష్ఠానం లో ఉండేవారు దేవతామంత్ర యజ్ఞములు నిర్వహించేవారు 

*అర్చకులు*
దేవాలయాలలో పూజలు నిర్వహించే అర్చకులను కొన్ని ప్రాంతాలలో పిలుస్తారు. 
(ఇది సంప్రదాయాన్ని బట్టి ఆచార్యులుగా మారుతుంది)

ముఖ్యంగా*****
ఒక బ్రాహ్మణ గురువును సంబోధించేటప్పుడు వారి పేరు చివర 'గారు', 'శర్మ', 'శాస్త్రి' వంటి గౌరవ సూచకాలు జోడించడం భారతీయ సంప్రదాయం.
*ఉదాహరణకు*
గోపాల కృష్ణ గారిని: గోపాల కృష్ణ శర్మ గారు అని.
రామలింగ శాస్త్రి గారిని: రామలింగ శాస్త్రి గారు లేదా శాస్త్రి గారు అని విశేషం.

****ఈ కాలం లో అందరూ పూజారని , పంతులు
లేక పంతులుగారు అంటారు ఇది శుద్ధ తప్పు****

***************
ఇక ఉత్తరాది పండాలు అనేది హిందూమతం లోని ఉపకులము మరియు కర్మకాండాలు చేసేవారి బిరుదు.

ఈ పదం యొక్క నిర్దిష్ట మూలాన్ని వివరించడానికి నేను ప్రయత్నిస్తాను.

***'పంతులు గారు' పదం మూలం***
'పంతులు' అనే పదం ప్రధానంగా దక్షిణ భారతదేశంలోని (ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) బ్రాహ్మణులను మరియు విద్యావంతులను గౌరవంగా సంబోధించడానికి వాడుకలోకి వచ్చింది. దీని వాడుక వెనుక రెండు ప్రధాన సిద్ధాంతాలు ఉన్నాయి

1. సంస్కృత మూలం (పండితుడు)
పండితుడు (Pandit) 'పంతులు' అనే పదం సంస్కృతంలోని 'పండిత' (Pandita) అనే పదం నుండి ఉద్భవించిందని బలంగా నమ్ముతారు.

అర్థం: 'పండితుడు' అంటే వేదాలు, శాస్త్రాలు, మత కర్మలు, లేదా ఏదైనా ఒక రంగంలో గొప్ప జ్ఞానం, పాండిత్యం కలవారు.

ఇది రూపాంతరం 'పండిత' అనేది ప్రాంతీయ భాషల్లోకి (ముఖ్యంగా తెలుగులోకి) వాడుకలో వచ్చినప్పుడు, ఉచ్చారణ సౌలభ్యం కోసం క్రమంగా 'పంతులు'గా మారింది.

పూర్వకాలంలో బ్రాహ్మణులు సాంప్రదాయ విద్యలో, గణితంలో, భాషలో నిష్ణాతులుగా ఉండేవారు. అందువల్ల వారిని జ్ఞానవంతులుగా గుర్తించి, 'పండితులు' అనే పదం యొక్క రూపాంతరమైన 'పంతులు' అనే గౌరవ సంబోధనతో పిలిచేవారు.

వృత్తిపరమైన మూలం (కలెక్టర్, గుమాస్తా)
వృత్తి: ఈ పదం కేవలం పూజారులు, గురువులకే కాక, బ్రిటిష్ పాలనా కాలంలో ఉద్యోగులకు కూడా వర్తించింది.

మున్షిపల్, రెవెన్యూ పంతులు ( पंत,పంత్,panth ) పూర్వం ప్రభుత్వ కార్యాలయాల్లో లేదా పెద్ద భూస్వాముల వద్ద కలెక్టింగ్, గుమాస్తా (clerks), లెక్కలు చూసే ఉద్యోగాలు చేసేవారిని కూడా 'పంతులు' అని పిలిచేవారు.

ఆ కాలంలో ప్రభుత్వ ఉద్యోగాలు, లెక్కలు నిర్వహించడం వంటి విద్యకు సంబంధించిన వృత్తులను అధికంగా బ్రాహ్మణులే నిర్వహించేవారు. ఈ వృత్తిని బట్టి కూడా ఈ సంబోధన వచ్చింది.

'గారు' చేరిక గౌరవంగా 'పంతులు' అనే పదానికి గౌరవాన్ని సూచించే 'గారు' అనేది చేరి, 'పంతులు గారు' (Mr. Pantulu) గా మారింది. ఇది సామాజికంగా వారికి ఉన్న గౌరవాన్ని, పెద్దరికాన్ని సూచిస్తుంది.

 'పంతులు గారు' అనే పదం 'పండితులు' అనే సంస్కృత పదం నుండి ఉద్భవించి, ఆ తర్వాత విద్యావంతులను, లెక్కలు చూసే వారిని లేదా కర్మకాండలు చేసే బ్రాహ్మణులను గౌరవంగా సంబోధించడానికి తెలుగు సమాజంలో స్థిరపడింది.
****************
విద్యా బోధన లో వేరు వేరు స్థాయి ఉదాహరణగా చూడండి 
ఉపాధ్యాయులు , అధ్యాపకులు+ ఆచార్యులు
Teacher+ lecturer+ professor 

*Teacher ఉపాధ్యాయుడు/గురువు పాఠశాల (School) - ప్రాథమిక, ఉన్నత పాఠశాల. విద్యార్థులకు ప్రాథమిక అంశాలు, క్రమశిక్షణ, సబ్జెక్టుల పునాదులు నేర్పడం.

*Lecturer అధ్యాపకుడు/ఉపన్యాసకుడు కళాశాల (College) - జూనియర్, డిగ్రీ, ఇంజనీరింగ్ మొదలైనవి. నిర్దిష్ట సబ్జెక్టుపై ఉపన్యాసాలు ఇవ్వడం, పరీక్షలు నిర్వహించడం. పరిశోధన బాధ్యత తక్కువగా ఉంటుంది.

*Professor ఆచార్యుడు/ప్రాధ్యాపకుడు విశ్వవిద్యాలయం (University) - అత్యున్నత బోధనా స్థాయి. ఉన్నత స్థాయి బోధన (Higher-level Teaching), పరిశోధన పర్యవేక్షణ (Research Supervision) (Ph.D./M.Tech), పాలనా బాధ్యతలు (Administrative roles).**************

*ఇలానే పై వేదవర్గాల్లో అనేక విధాలుగా ఉంటారు*
        ****** సారాంశం ఇక్కడ********
*దైవానుగ్రహం మన ఇంటి గురువును అనుసరించే  అనుగ్రహం కానీ లోoకo లోని వాడుక పదాలతో ఆ ఫలితం ఉండకపోవచ్చు *

 *వైదికంగా అలా పూజారి కానీ పంతులు పదాల సంబోధన నిషిద్ధం అవుతుంది*

****పై విషయాలు అంత అవగాహన లేకపోయినా పర్వాలేదు కేవలం గురు శబ్దం శాశ్వతంగా విశేషమైనది****

*గురువుగారు అనే పదమే ultimate గా గొప్ప పదం* ఇలా పిలిస్తే ఇంటి (బ్రహ్మ అదే) పురోహితుల  
*సంబోధన దోషం లేకుండా* పూజలు చేసే వారికి దోషం లేకుండా *ఫలితం ఉంటుంది*.
                            ఓం
గురుర్బ్రహ్మా గురుర్విష్ణు: గురుర్దేవో మహేశ్వర:
గురు సాక్షాత్ పరం బ్రహ్మా తస్మై శ్రీ గురవే నమః

*అవగాహన కోసం మాత్రమే ఎవరిని నిందించడం కోసం కాదు సాoప్రదాయంగా ఉందాం ధర్మాలన్ని తెలుసుకుందాం*
శ్రీ గోవింద నారాయణ మహాదేవ 🙏 
*రాళ్ళబండి శర్మ*

RECENT POST

ఆర్ధిక పరిస్థితి మెరుగుపడి , అఖండ ధన రాజయోగం కోసం మీకోసం.

ఆర్ధిక పరిస్థితి మెరుగుపడి , అఖండ ధన రాజయోగం కోసం మీకోసం.............!!  కుబేర మంత్రం : (ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యదీప్తాయै ధనధాన్య...

POPULAR POSTS