Thursday, July 12, 2018

కాలభైరవారాధన:


కాలభైరవారాధన:
గ్రహబలాలను అధిగమించి అదృష్ట జీవితాన్ని, సంకల్ప సిద్ధిని పొందడం భైరవ ఉపాసనతో సాధ్యమని శాస్త్రాలు చెబుతున్నాయి. కాలభైరవుడిని కాశీ క్షేత్ర పాలకుడిగా కీర్తించారు. ఏది సాధించాలన్నా ముందుగా ఆయన అనుమతి తీసుకోవాలని కాశీక్షేత్ర మహిమ చెబుతుంది. సాక్షాత్తు శివుడే కాలభైరవుడే సంచరించాడని శాస్త్రాలు చెబుతున్నాయి. హోమ కార్యాలలో అష్టాభైరవులకు ఆహుతులు వేసిన తరువాతే ప్రధాన హోమం చేస్తారు. భక్తులకు అనుగ్రహాన్ని, అతీంద్రమైన శక్తులను ఆయన ప్రసాదిస్తారు. దేవాలయంలో ఆయనకి గారెలతో మాల వేస్తారు. కొబ్బరి, బెల్లం నైవేద్యంగా పెడతారు. ఈశ్వరుడు ఆయుష్షుని ప్రసాదిస్తాడు. ఆయనకు పరమ విధేయుడైన కాలభైరవుడిని ఆరాదిస్తే ఆయుష్షు పెరుగుతుందని ప్రతీతి.
*కాలభైరవం భజే:*కాలభైరవుడు పరమేశ్వరుని అపరాంశ.రౌద్రస్వరూపుడు. రక్షాదక్షుడు. దుష్టగ్రహబాధలు నివారించగల శక్తి మంతుడు. కాలభైరవుడు అనగానే హేళనగా కుక్క అనేస్తాం. కుక్కను వాహనంగా చేసుకుని తిరిగే వాడే తప్ప ఆయనే కుక్క కాదు. కుక్క అంటే విశ్వసనీయతకు మారుపేరు. రక్షణకు కూడా తిరుగులేని పేరు. సమయోచిత జ్ఞానానికి ప్రతీక. కాలస్వరూపం ఎరిగిన వాడు. కాలంలాగే తిరుగులేనివాడు. ఎంత వ్యయమైనా తరిగిపోని వాడు. శాశ్వతుడు, నిత్యుడు. కాలభైరవుడు మన పురాణాల ప్రకారం అసితాంగ భైరవుడు, రురు భైరవుడు, చండ భైరవుడు, క్రోథ భైరవుడు, ఉన్మత్త భైరవుడు, కపాల భైరవుడు, భీష్మ భైరవుడు, శంబర భైరవుడు అని 8 రకాలు. వీరు కాక మహాభైరవుడు, స్వర్ణాకర్షణ భైరవుడు మరో ఇద్దరు కనబడతారు. స్వర్ణాకర్షణ భైరవుడు చూడడానికి ఎర్రగా ఉంటాడు. బంగారు రంగు దుస్తులు ధరిస్తాడు. తలపై చంద్రుడు ఉంటాడు. 4 చేతులు ఉంటాయి. ఒక చేతిలో బంగారు పాత్ర ఉంటుంది. స్వర్ణాకర్షణ భైరవుడు సిరి సంపదలు ఇస్తాడని చెబుతారు. ఇతర భైరవుల విషయానికి వస్తే సాధారణంగా భైరవుడు భయంకరాకారుడుగా ఉంటాడు. రౌద్రనేత్రాలు, పదునైన దంతాలు, మండే వెంట్రుకలు, దిగంబరాకారం, పుర్రెల దండ, నాగాభరణం ఉంటాయి. నాలుగు చేతులలో పుర్రె, డమరుకం, శూలం, ఖడ్గం ఉంటాయి. కాలభైరవుని భక్తిశ్రద్ధలతో కొలిచే వారు ”ఓం కాలాకాలాయ విద్మహే కాలాతీతాయ ధీమహే, తన్నో కాలభైరవ ప్రచోదయాత్‌” అని ప్రార్థిస్తారు. మన దేశంలో కాలభైరవ ఆలయాలు ఎక్కువగా లేకున్నా కాలభైరవ క్షేత్రాలు చాలా ఉన్నాయి. ఈ క్షేత్రాలలో ఉండే కాలభైరవుని క్షేత్రపాలకుడు అంటారు. నేపాల్‌, ఇండోనేసియా, థాయ్‌లాండ్‌ దేశాలలో కాలభైరవ పూజ విశేషంగా జరుగుతుంది. ఇక్కడ ఆలయాలలో కాలభైరవుడు ప్రధాన దైవతంగాఉంటాడు. నేపాల్‌ దేశానికి జాతీయ దైవంగా కాలభైరవుడుపూజలందుకుంటున్నాడు.

మూకశంకరులు - మూకపంచశతి




మూకశంకరులు - మూకపంచశతి
జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ ఆది శంకర భాగవత్పాదాచార్యుల వారు దిగ్విజయములను పూర్తి చేసిన తరువాత మోక్షపురి అయిన కాంచీపురం లో సర్వజ్ఞ పీఠం స్థాపించారు, అదే మన కంచి కామకోటి పీఠం. ఆది శంకరుల తరువాత ఈ పీఠమును అధిష్టించిన వారు శ్రీ సురేశ్వరాచార్యుల వారు. వారి తరువాత ఉత్తరాధికారం శ్రీ సర్వజ్ఞాత్మన్ సరస్వతి స్వామి వారు నిర్వహించారు. ఆనాటి నుండి ఈనాటి వరకు నిరంతర జగద్గురు పరంపర కొనసాగుతూనే ఉంది.
ఆ గురుపరంపర లో మనకు తెలిసిన ప్రఖ్యాతి గాంచిన జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ కృపా శంకరులు, శ్రీ శ్రీ శ్రీ మూక శంకరులు, శ్రీ శ్రీ శ్రీ అభినవ శంకరులు, శ్రీ శ్రీ శ్రీ పరమశివేంద్ర సరస్వతి, శ్రీ శ్రీ శ్రీ భోధేంద్ర సరస్వతి మరియు ఈ తరములో ఉన్న మనందరికీ తెలిసిన అరవై ఎనిమిదవ పీఠాధిపతి నడిచే దేవుడు, పరమాచార్య శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు. శ్రీ పరమాచార్య తరువాత ప్రస్తుత తరములో ఉన్న జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి వారు మరియు శ్రీ శ్రీ శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి వారు.
ఈ ఆచార్య పరంపరలో 20 వ పీఠాధిపతి గా ఉన్న వారు శ్రీ శ్రీ శ్రీ మూక శంకరేంద్ర సరస్వతి స్వామి వారు. వీరినే మనం మూక శంకరులు అని అంటాము. వీరు క్రీస్తు శకం 398 నుండి 437 వరకు పీఠాధిపతిగా ఉన్నారు. వీరి తండ్రి గారి పేరు శ్రీ విద్యావతి, వారు ఒక ఖగోళ జ్యోతిష్యుడు. మూక శంకరులు పుట్టుకతోనే మూగ-చెవుడు ఉన్నవారు. అందుచేతనే వీరిని మూక కవి అనేవారు. కానీ అమ్మ వారి కటాక్షం ఉంటే, పుట్టుకతో మాటలు రాని వాడు మాట్లాడతాడు అనడానికి మూక శంకరుల జీవితమే నిదర్శనం.
ఒక రోజు మూక శంకరులు కామాక్షీ అమ్మ వారి ఆలయంలో కూర్చుని ఉన్నారు. వారితో పాటు వేరొక సాధకుడు కూడా అమ్మని ధ్యానిస్తూ కూర్చున్నారు. కామాక్షీ అమ్మ వీరిని అనుగ్రహించదలిచి, కర చరణాదులతో ఒక స్త్రీ రూపంలో కదలి వచ్చింది. అలా వచ్చిన అమ్మ వారు తాంబూల చర్వణం చేస్తూ, అమ్మ నోటిలోంచి ఆ తాంబూలం ముద్ద (పిడచ) కొంచెం తీసి మూక శంకరుల ప్రక్కన ఉన్న సాధకుడికి ఇచ్చింది. ఆయన పాపం అమ్మ యొక్క ఆగమనం గుర్తించలేక, మామూలు ఒక స్త్రీ అనుకుని, ఎంగిలి అనే భావముతో అమ్మ ఇచ్చిన తాంబూలం స్వీకరించ లేదు.
కామాక్షీ అమ్మ వెంటనే ఆ తాంబూలమును మూక శంకరుల చేతికి ఇచ్చింది. మహా ప్రసాదంగా తీసుకుని కళ్ళకద్దుకుని నోట్లో వేసుకున్నారు మూక శంకరులు. అంతే తక్షణమే కామాక్షీ అమ్మ వారి అనుగ్రహముతో మూక శంకరులకి మాట వచ్చింది. మాట రాగానే, ఆయనలో కవితా ప్రవాహం పెల్లుబికింది, వెంటనే కామాక్షీ అమ్మ వారిని చూస్తూ ఆశువుగా ఐదు వందల శ్లోకాలు చెప్పారు మూక శంకరులు. ఈ ఐదు వందల శ్లోకాలను కలిపి మూక పంచశతి అంటారు. ఇందులో అమ్మ వారి యొక్క గొప్ప తనం వివరిస్తూ నూరు శ్లోకములు (దీనిని ఆర్యా శతకము అంటారు), అమ్మ వారిని స్తుతి చేస్తూ నూరు శ్లోకములు స్తుతి శతకము), అమ్మ వారి కన్నులు చూస్తూ నూరు శ్లోకములు (కటాక్ష శతకము), అమ్మ వారి నవ్వును స్తుతిస్తూ నూరు శ్లోకములు (మందస్మిత శతకము) & అమ్మ వారి యొక్క పాదములు స్తుతి చేస్తూ నూరు శ్లోకములు (పాదారవింద శతకము), ఇలా మొత్తం కలిపి ఐదు వందల శ్లోకములు చేశారు.
కామాక్షీ అమ్మ అనుగ్రహముతో మాట వచ్చిన మూక శంకరులు భక్తి పారవశ్యంతో చేసిన స్తోత్ర రత్న మాలయే "మూక పంచ శతి". ఇవి ఐదు శతకాలుగా ఉంటాయి.
1. ఆర్యా శతకం
2. స్తుతి శతకం
3. కటాక్ష శతకం
4. మందస్మిత శతకం
5. పాదారవింద శతకం
ఈ పంచశతి సాక్షాత్తు కామాక్షీ అమ్మవారే చెప్పారు అంటారు పెద్దలు. అమ్మయే మూక శంకరులలో ప్రవేశించి, భావి తరాల వారు ఉద్ధరింపబడాలని ఇంత అద్భుతమైన శ్లోకములను కటాక్షించింది జగన్మాత కామాక్షీ అమ్మ.
అమ్మ అనుగ్రహముతో మాటలు వచ్చి, ఐదు శతకములతో అమ్మని స్తోత్రం చేసిన తరువాత కామాక్షీ అమ్మ ఏమి వరం కావాలి అని అడిగింది. అప్పుడు మూక శంకరులు "అమ్మా, నోరు లేనివాడి చేత ఇంత స్తోత్రం చేయించి అనుగ్రహించావు, ఏ నోటితో నీ స్వరూపమును కీర్తించగలిగానో, ఆ నోటితో ఇక వేరే మాటలు మాట్లాడలేనమ్మా, కాబట్టి నన్ను మళ్ళీ మూగ వాడిని చెయ్యి" అని వేడుకుంటారు. అమ్మ అనుగ్రహించి మళ్ళీ మూక శంకరుల యొక్క మాట్లాడే శక్తిని తీసివేసింది.
ఈ విషయం తెలుసుకున్న అప్పటి కామకోటి పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ మార్తాండ విద్యా ఘనేంద్ర సరస్వతి స్వామి వారు వీరి తల్లి తండ్రులకు కబురు పంపారు. ఈ పిల్లవాడికి పీఠం యొక్క ఉత్తరాధికారం ఇవ్వాలని ఉంది, మీరు అనుమితిస్తే సన్యాసం ఇస్తాను ఈ పిల్లవాడికి అని అడిగారు. తల్లి తండ్రులు సంతోషంతో అంగీకరించడంతో, వారు తరువాత పీఠాధిపతి అయ్యారు. ఉజ్జయినీ సామ్రాజ్యం పాలించిన విక్రమాదిత్యుడు, కాశ్మీర్ రాజు ప్రవరసేనుడు, మాత్రుగుప్తుడు మొదలగు వారు మూక శంకరాచార్యుల వారిని అనన్య భక్తితో సేవించారు.
ఈ విధంగా కామాక్షీ అమ్మ వారి సేవలో తరించిన మూక శంకరులు శ్రీ ధాతు నామ సంవత్సరములో శ్రావణ పౌర్ణమి నాడు, మన గోదావరీ నదీ తీరంలోనే ముక్తిని పొంది, కామాక్షి-ఏకాంబరేశ్వరులలో ఐక్యం అయ్యారు.
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం

నృసింహ మంత్రం


నృసింహ మంత్రం
                                                       ఉగ్రం వీరం మహా విష్ణుం
                                                       జ్వలంతం సర్వతో ముఖం,
                                                         నృసింహ బీషణం భద్రం,
                                                       మృత్యు మృత్యుం నమామ్యహం.
            
                  నరసింహ స్వామి  అపత్కాలములలో రక్షించగల ఏకైక దైవశక్తి .
శ్రీ ఆది శంకరాచార్యులు సైతం తాను మంటలలో కాలిపోతున్నపుడు తన ఇష్టదైవాన్ని కాక, నరసింహ స్వామినే ప్రార్దించి రక్షణ పొందుతాడు. అలా ఆ సమయంలో చెప్పబడిందే "మమ దేహీ కరావలంబ" స్తోత్రం. అలాగే అన్నమాచార్యులు సైతం ఈ స్వామిని ప్రార్థన చేసియే ఆపదసమయంలో గట్టేక్కాడు. అందుకే ఆపదలు బాపటానికి నరసింహ శక్తికి మించిన శక్తి "న భూతో న భవిష్యతి".
               
                                       
సంక్లిష్ట పరిస్తితుల్లో ఉన్నప్పుడు మనసులొ నరసింహ స్వామిని తలుచుకొని పైన చెప్పిన మంత్రమును  రోజుకు 108 సార్లు జపిస్తూ "నాకు కల్గిన ఆపద నుండి నేను రక్షింపబడతాను "అని నమ్మకంతో ఉన్న యెడల మీరు తప్పక అట్టి  సంక్లిష్ట పరిస్తితుల్ని అదిగమించగలరు.

అతి ప్రాచీన, కార్త్యవీర్యార్జున పునః ప్రతిష్టిత దత్తక్షేత్రం ఎత్తిపోతల బాహ్య ప్రపంచానికి అంతగా తెలియని అతి గొప్ప విశేషమైన మహిమగల దత్తక్షేత్రమిది.

శ్రీ దత్తాత్రేయ దేవాలయం...ఎత్తిపోతల.
అతి ప్రాచీన, కార్త్యవీర్యార్జున పునః ప్రతిష్టిత దత్తక్షేత్రం ఎత్తిపోతల
బాహ్య ప్రపంచానికి అంతగా తెలియని అతి గొప్ప విశేషమైన మహిమగల దత్తక్షేత్రమిది.
సహజసిద్ధ ఎత్తిపోతల జలపాతంతో పాటు దిగువ భాగంలో ఉన్ష్న వందల సంవత్సరాల నాటి దేవాలయం దత్తాత్రేయ దేవాలయం.
నాగార్జునాసాగర్ నుంచి  15 కి.మీ దూరం లొ మాచర్ల జిల్లా లో ఉంది.
ఎత్తిపోతల దత్తక్షేత్ర ప్రత్యేకత.
యతి – తపః – తలం (ఎత్తిపోతల) త్రివేణి సంగమ దత్తక్షేత్ర ప్రదేశం. ఇక్కడ (ఎత్తిపోతల) కృష్ణానది ఉప-ఉప నదులైన మూడు ఉప-ఉప (వంకలు) నదులు
చంద్రవంక,
అగ్నివంక మరియు
సూర్యవంక నదులు
ఒకదానికొకటి సంగమిస్తాయి. ఈ మూడు నదులు ఎత్తిపోతల జలపాతం వద్ద కలిసి ఒకటిగా ఏర్పడి ఆ మొత్తం ‘మధువంక’ గా మారి అది కృష్ణానదిలో కలవడం జరుగుతుంది.
అందువల్లనే ఎత్తిపోతల జలపాతం వద్ద సంగమేశ్వర దేవాలయాన్ని (ప్రస్తుతం జీర్ణ స్థితిలో కలదు) మనం చూడవచ్చు, మరియు ఈ మూడు వంకలు కలిసి పైనుండి క్రిందకు పడేచోట గల ప్రదేశం చూచుటకు గోవు యొక్క కర్ణం (ఆవుచెవి) మాదిరిగా ఉండడమూ మరియు మూడు వంకలు కలిసి ( చంద్రవంక, అగ్నివంక మరియు సూర్యవంక) ‘మధువంక’ గా దత్తాత్రేయుని శక్తి స్వరూపిణి అయిన మధుమతీదేవి యొక్క నేత్రముల ఎదురుగా జరుగుతుండడం వల్ల ఈ క్షేత్రాన్ని ‘త్రివేణి మధు గోకర్ణ’ గా ఒకప్పుడు పిలిచేవారు.
ఇక్కడగల పరిసర ప్రదేశాల్లో మధుమతీ సమేత దత్తాత్రేయుని ఆవాసంవల్ల ఇక్కడ యతులు తపస్సు చేసుకోవడానికి అధిక ప్రాముఖ్యత ఇచ్చేవారు. ఫలితంగా ‘త్రివేణి మధు గోకర్ణ’ కాస్తా ‘యతి – తపః – తలం’ గా తదుపరి ‘ఎత్తిపోతల’ గా మారింది.
ఎత్తిపోతల దత్తాత్రేయుడు స్వయంభూ దత్తాత్రేయుడు. కొండగుహలో ఉన్న స్వయంభూ దత్తాత్రేయమూర్తిని పునః ప్రతిష్టించాడు ‘హైహయ’ వంశరాజైన కార్త్యవీర్యార్జునుడు.
హైహయ వంశరాజైన కార్త్యవీర్యార్జునుడు ఈ క్షేత్రానికి దగ్గర లోగల మహీష్పతి నగరాన్ని(నేటి మాచర్ల) రాజధానిగా పరిపాలన సాగించేవాడు. అందువల్ల ఇక్కడే కార్త్యవీర్యార్జునుడు ముఖ్య పర్వదినములలో తప్పని సరిగా అనఘాస్టమీ వ్రతాలను ఆచరించేవాడు.
ఈ క్షేత్ర మహిమ తెలుసుకున్న. పరుశురాముడు (కార్త్యవీర్యార్జునుడి సంహరించినవాడు మరియు రేణుకామాత – జమదగ్నిల కుమారుడు) కార్త్యవీర్యార్జునుడి తదుపరి ఈ ఆలయాన్ని ఎంతగానో అభివృద్ధి చేసాడు.
ప్రపంచంలోని ఏకైక సింధూరలేపన దత్తాత్రేయుడు ఇక్కడ కనిపిస్తాడు, అలాగే ప్రపంచంలోని ఏకైక ‘నాగకిరిటాభారణ’ (నాగుపామును కిరిటంగా ధరించిన) దత్తాత్రేయుడు ఏకముఖ, చతుర్భుజుడుగా కనిపిస్తాడు. విష్ణురూప, అలంకారప్రియ, చిద్విలాస మరియు నామధారి (నామమును ధరించిన) దత్తాత్రేయుడు.
భక్తులు ఇక్కడి దత్తాత్రేయుడుని దర్శించుకోవడానికి వచ్చినప్పుడు కార్త్యవీర్యార్జున విరచిత దత్తస్తోత్రాలను చదివితే మిక్కిలి ప్రీతి చెందుతాడట. అలాగే కష్టాలలో ఉన్నవారు వారి కస్టాలు తీరిన తరువాత ఇక్కడి ’ఝెండా ప్రాంగణం’ లో ఝెండాలను కడతారు.
మధుమతీ దేవి దత్తాత్రేయుని శక్తి స్వరూపిణి. మధుమతి అనగా ‘తేనెవంటి హృదయం’ గలది అని అర్ధం. మధుమతీ దేవి కుడా స్వయంభూ గానే ఉద్భవించారు.
దత్త శిల..
‘దత్త శిల’ ఎత్తిపోతల ప్రధాన ద్వారం నుండి దత్తాత్రేయ దేవాలయానికి వెళ్ళే మెట్ల మార్గంలో పెద్ద పుట్టకు సమీపంలో కుడివైపున ఉంటుంది. దత్తాత్రేయుడు ఈ రాయి మీద కుర్చుని విశ్రాంతి తీసుకునేవాడని అనేక మంది మహర్షులు చెప్పేవారు.
ఒక్కోసారి ఈ శిల మీదే దత్తాత్రేయుడు కల్లు త్రాగువాని వలె కుర్చుని కల్లు తాగుతూ కనిపిస్తాడట. నడి రాత్రిలో ఈ దత్త శిలకు శిరస్సును ఆనించి దత్తాత్రేయుడిని ధ్యానించి ఈ శిలకు దరిదాపుల్లోనే నిద్రిస్తే వారికి తప్పని సరిగా దత్తదర్శనం కలుగుతుంది. జై గురుదత్త.



రావి చెట్టును పూజించుట వలన కలుగు ఫలితములు


రావి చెట్టును పూజించుట వలన కలుగు ఫలితములు 
అశ్వత్ధ వృక్షంలో సర్వదేవతలూ ఉంటారు. దాని మహాత్మ్యం గురించి బ్రహ్మాండపురాణము లో నారదుడు వివరించెను. అశ్వత్ధమే నారాయణస్వరూపము. ఆ వృక్షం యొక్క:
మూలము – బ్రహ్మ
దాని మధ్య భాగమే – విష్ణువు
దాని చివరి భాగము – శివుడు
కనుక దానిని పూజిస్తే త్రిమూర్తులను పూజించి నట్లే. ఈ త్రిమూర్తులు దక్షిణ, పశ్చిమ, ఉత్తర దిక్కులలోని కొమ్మలలో ఉంటారు. తూర్పు దిక్కునగల కొమ్మలలో ఇంద్రాదిదేవతలు, సప్తసముద్రాలు, అన్ని పుణ్యనదులు ఉంటాయి. దాని వేర్లలో మహర్షులు, గోబ్రాహ్మలు, నాలుగువేదాలు ఉంటాయి. అశ్వత్ధ వృక్షాన్ని ఆశ్రయించి అష్టవసువులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశాదిపతులు, దిక్పాలకులు ఎల్లప్పుడు ఉంటారు.అశ్వత్ధ వృక్షం మూలములో ‘అ’ కారము, మానులో ‘ఉ ‘ కారము, అదిఇచ్చే పళ్ళలో ‘మ’ కరము, వెరసి ఆ వృక్షమంతా ప్రణవస్వరూపమే .అశ్వత్ధ వృక్షం సాక్షాత్తు కల్పవృక్షము.
 *ప్రదక్షణ మరియు పూజించు విధానము :*
ముందుగా అశ్వత్ధ వృక్షాన్ని దర్శించి దానిని చేతితోతాకి( శనివారం మాత్రమే తాకాలి) ఈ క్రింది అశ్వత్ధ వృక్ష స్తోత్రమును పఠించాలి.
 *అశ్వత్ధవృక్ష స్తోత్రం*
*మూలతో బ్రహ్మరూపాయ*
*మధ్యతో విష్ణురూపిణే*
*అగ్రత శ్శివరూపాయ*
*వృక్షరాజయతే నమః*
అశ్వత్ధ వృక్ష ప్రదక్షిణ చైత్ర, ఆషాడ, పుష్య మాసాలలో చేయరాదు. గురు,శుక్ర మౌడ్యాలలో చేయరాదు. కృష్ణపక్షం లో అశ్వత్ధ వృక్ష ప్రదక్షిణ ప్రారంబించరాదు. ఆది,సోమ,శుక్రవారాలలో, గ్రహణ మరియు సంక్రమణ సమయాల్లో, నిషిద్ధ సమయాల్లో, రాత్రి భోజనముచేసి యీ వృక్షాన్ని సేవించరాదు. మౌనంగా లేదా గురునామము లేదా విష్ణుసహస్రనామమును చదువుతూ నెమ్మదిగా ప్రదక్షణలు చేయాలి. ప్రతి ప్రదక్షణానికి ముందు అలాగే చివర అశ్వత్ధ వృక్షానికి నమస్కారించాలి.
 *అశ్వత్ధ వృక్ష పూజా ఫలము :*
అశ్వత్ధ వృక్షానికి రెండులక్షల ప్రదక్షణాలు చేస్తే సర్వపాపాలూ నశించి నాలుగుపురుషార్ధాలు సిద్ధిస్తాయి.
బిడ్డలు కలగాలన్న సంకల్పముతో ప్రదక్షణలు చేస్తే తప్పక కలుగుతారు. శనివారంనాడు అశ్వత్ధ వృక్షాన్ని చేతితోతాకి మహామృత్యుంజయ మంత్రమును జపిస్తే మృత్యుభయం పోతుంది. అలాగే శనివారంనాడు అశ్వత్ధ వృక్షాన్ని చేతితోతాకి ఈ క్రింది శనైశ్చర స్తోత్రమును పఠించిన శనిదోషం తొలగిపోతుంది.
అశ్వత్ధ వృక్షం క్రింద చెప్పవలసిన శనైశ్చర స్తోత్రం
 *కోణస్థ: పింగళో బభ్రు: కృష్ణో రౌద్రాంతకోయమః*
*శౌరీ శ్శనైశ్చరో మందః పిప్పిల దేవ సంస్తుతః*
గురువారం, అమావాస్య కలసి వచ్చినరోజున అశ్వత్ధ వృక్షం క్రింద వేదవిప్రునికి భోజనము పెడితే కోటిమంది బ్రాహ్మణులకు సమారాధనచేసిన ఫలితముంటుంది. గురువారం, అమావాస్య కలసి వచ్చినరోజున అశ్వత్ధ వృక్షనీడ లో స్నానమాచరించిన మహాపాపములు తొలగును. అశ్వత్ధ వృక్షం క్రింద చదివిన గాయత్రి మంత్రజపం నాలుగువేదాలు చదివిన ఫలితాన్నిఇస్తుంది. అశ్వత్ధ వృక్షాన్ని స్థాపిస్తే నలభైరెండు తరాలవారికి స్వర్గం లభిస్తుంది.
 జై శ్రీమన్నారాయణ 


పాదరస ఆంజనేయ స్వామిని ఎలా పూజించాలి....!!

పాదరస ఆంజనేయ స్వామిని ఎలా పూజించాలి....!!
త్రేతాయుగంలో ధర్మస్థాపన కొరకు విష్ణుమూర్తి, శ్రీరామచంద్రునిగా అవతరించాడు. మహాశివుడేమో ఆంజనేయునిగా అవతరించి, శ్రీరామునికి ప్రతి పనిలో, ప్రతి క్షణమూ సహకరించాడని పురాణాలు చెప్తున్నాయి. హనుమంతుడు అత్యంత బలవంతుడు. తనను నమ్మిన భక్తులను ఆపదల నుండి రక్షించే దయాహృదయుడు.
ఆంజనేయుని ఏ రూపంలో అయినా ఆరాధించవచ్చు. ఆంజనేయుని ఇతర రూపాల కంటే పాదరస హనుమంతుని రూపం మరింత పవిత్రమైనది. మంగళవారం లేదా శనివారం హనుమంతునికి ప్రీతికరమైన రోజు కనుక ఆ రెండురోజుల్లో ఏదో ఒక రోజున పాదరస హనుమంతుని పూజించినట్లయితే శుభం కలుగుతుంది. అక్షయ తృతీయ కూడా పాదరస హనుమంతుని పూజకు శ్రేష్టమని పురోహితులు చెబుతున్నారు.
* పాదరస హనుమంతుడికి ఎలాంటి పూజ చేయాలంటే.....?
పాదరస హనుమంతునికి పూజ చేద్దామనుకుంటే, ముందు రోజు రాత్రిపూట తలస్నానం చేయాలి. పూజకు సిద్ధం చేసుకున్న గదిని రాత్రి పూటంతా మూసి వుంచకండి. అలా తెరిచి ఉంచిన గది గడపమీద ఎర్రటి వస్త్రం పరచి, పాదరస హనుమంతుని ఉంచాలి. మనసులో భక్తిగా హనుమంతుని స్మరించుకోవాలి. ధ్యాన, ఆవాహనాది విధులతో పూజించాలి. ఆంజనేయ అష్టోత్తర శతనామావళి చదువుతూ, పూవులు, అక్షింతలు, సింధూరం జల్లుతూ భక్తిశ్రద్దలతో పూజ చేయాలి. ధూప దీప నైవేద్యాలు, తాంబూలం సమర్పించాలి.
'' ఓం నమో హనుమతే రుద్రావతరాయ
పరయంత్ర మంత్ర తంత్ర తాటక నాశకాయ
సర్వ జ్వరచ్చేద కాయ, సర్వ వ్యాధి నికృంతకాయ
సర్వభయ ప్రశమనాయ, సర్వ దృష్టి ముఖ స్తంభనాయ
దేవ దానవ యక్ష రాక్షస భూతప్రేత పిశాచ
ఢాకినీ శాకినీ దుష్టగ్రహ బంధనాయ
సర్వ కార్య సిద్ధిప్రదాయ రామ దూతాయ స్వాహా..''
అనే మంత్రాన్ని జపించాలి.
మంత్రజపం ముగిసిన తర్వాత, క్షమామంత్రం చదివి, పూజలో ఉంచిన అక్షింతలు భక్తిగా తలపై జల్లుకోవాలి. పాదరస పూజ పూర్తయిన తర్వాత భోజనం చేసి బ్రహ్మచర్యం పాటించాలి.
గడప మీద ఉంచిన ఆంజనేయ విగ్రహాన్ని ఆ రాత్రి అలాగే ఉంచాలి. దీపం రాత్రంతా వెలుగుతూ ఉండాలన్న నియమం ఏమీ లేదు. ప్రమిదల్లో నూనె ఉన్నంతవరకూ వెలుగుతూ ఉంటాయి. ఇక మరుసటి రోజు మంగళవారం లేదా శనివారం లేదా అక్షయ తృతీయ అనుకోండి... ఆవేళ పొద్దున్నే లేచి, స్నానం చేసి ఆంజనేయుని ముందు దీపారాధన చేయాలి. ముందురోజు రాత్రి చేసినట్లే షోడశోపచారాలతో భక్తిగా పూజ చేయాలి.
ఇంతకుముందు స్మరించిన
''ఓం నమో హనుమతే రుద్రావతరాయ "
మంత్రాన్ని 108 సార్లు జపించాలి.
ఏ దుష్ట శక్తులు మన దరికి చేరకూడదని, ఆపదలుండ కూడదని, సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని భక్తిగా ప్రార్థించాలి. చివరికి శాంతి మంత్రాన్ని చదువుకోవాలి. పూజలోని అక్షింతలు శిరస్సుపై జల్లుకుని, ఆంజనేయునికి ఉద్వాసన చెప్పి, గడపపై నుండి ఆంజనేయుని విగ్రహాన్ని తొలగించి, పూజామందిరంలో ప్రతిష్టించుకోవాలి.
పాదరస ఆంజనేయుని విగ్రహాన్ని పూజా మందిరంలో స్థాపించిన రోజు నుండి, రోజూ చేసే నిత్య పూజ తర్వాత ఇందాక చెప్పుకున్న ''ఓం నమో హనుమతే రుద్రావతరాయ....'' మంత్రాన్ని ప్రతిరోజూ 11 సార్లు జపించుకోవాలి. ఇలా కనుక చేస్తే ఇక ఏ భయాలూ, భీతులూ మన చెంతకు రావు. మనసు నిబ్బరంగా ఉంటుంది. జీవనం సుఖంగా, సంతోషంగా గడుస్తుంది.

14.07.2018 ఆషాఢమాసం ఆషాఢ మాస ప్రాముఖ్యత

14.07.2018ఆషాఢమాసం
ఆషాఢ మాస ప్రాముఖ్యత

పూర్వాషాడ నక్షత్రం లో కూడిన పౌర్ణమి ఉన్న నెలను ఆషాడ మాసం గా చెప్పబడింది. ఆషాడ మాసాన్ని శూన్య మాసం అని అంటారు. వర్షఋతువు కూడా ఈ మాసం లోనే ప్రారంభమవుతుంది. ఈ మాసం లో చేసే స్నానం, దానం, జపం , పారాయణలు, విశేష ఫలితాన్నిస్తాయి. ఆషాడం లో చేసే సముద్ర నదీస్నానాలు ఎంతో ముక్తిదాయకాలు . ఆషాఢమాసం లో పాదరక్షలు, గొడుగు, ఉప్పు దానం చేయడం మంచి ఫలితాలనిస్తుంది. ఆషాడ మాసం లోనే దక్షిణాయనం ప్రారంభమవుతుంది. కర్కాటకం లోనికి సూర్యుడు ప్రవేశించడం తోనే దక్షిణాయనం ఆరంభమవుతుంది. అంటే సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుండి తిరిగి మకర రాశిలో ప్రవేశించే వరకు దక్షిణాయనం అంటారు. ఈ ఆయనం లో సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణం గా సంచరిస్తాడు. దక్షిణాయనం పితృదేవతలకు ప్రీతికరమని కూడా చెప్పబడింది.
ఈ మాసం లోనే త్రిమూర్తి స్వరూపుడైన గురువుని ఆరాధించే పర్వదినం గురు పూర్ణిమ కూడా. దీనినే వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు.
ఆషాడ శుద్ద విదియ నాడు పూరీ జగన్నాధ, బలభద్ర, సుభద్ర రథయాత్ర కన్నుల పండుగ గా జరుపుతారు.
ఆషాడ శుద్ద పంచమి స్కంధ పంచమి గా చెప్తారు. సుబ్రమణ్య స్వామి ని ఈ రోజు అత్యంత భక్తి శ్రద్దలతో పూజిస్తారు. ఆషాడ షష్ఠి ని కుమార షష్ఠి గా జరుపుకొంటారు
ఆషాడ సప్తమి ని భాను సప్తమి గా చెప్పబడింది. ఉత్తరం నుంచి దక్షిణ దిశకు పయనిస్తున్న ప్రభాకరుడు మూడు నెలలు తర్వాత మధ్యకు చేరుకుంటాడు. ఆ రోజున పగలు, రాత్రి, నిమిషం ఘడియ విఘడియల తేడా లేకుండా సరిమనానం గా ఉంటాయి.
ఆషాడ శుద్ద ఏకాదశి ని తొలి ఏకాదశి అని శయన ఏకాదశి అని అంటారు. ఈరోజు నుండి చాతుర్మాస వ్రతం ఆరంభమవుతుంది. దీనినే మతత్రయ ఏకాదశి అని అంటారు.
ఆషాడ మాసంలోనే తెలంగాణా ప్రాంతం లో సంప్రదాయబద్దమైన బోనాల ఉత్సవాలను భక్తి శ్రద్దలతో జరుపుకొంటారు. మహంకాళి అమ్మవారి కోసం తయారు చేసే భోజనాన్ని బోనం గా చెప్తారు( భోజనానికి వికృతి పదమే బోనం) . దీనిని అమ్మవారికి నివేదన చేసే పర్వదినాన్నే బోనాలు అంటారు.
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతం లో ఈ పండుగ అత్యంత వైభవం గా జరుపుకొంటారు. సమస్త జగత్తుకు కారణమైనటువంటి అమ్మవారిని భక్తి శ్రద్దలతో పూజిస్తారు. అన్నం, బెల్లం, పెరుగు, పసుపు నీళ్ళు, వేపాకులు ఈ బోనం లో ఉంటాయి. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి హానికలిగించే వ్యాదుల నుండి ఉపకరించేవి. ఈ సమయం లో ప్రకృతి లో జరిగే మార్పుల వలన అనారోగ్యాలపాలు కాకుండా ఇవి ఎంతో మేలు చేస్తాయి.
ఆషాడం అనారోగ్య మాసం అని కూడా మనందరికీ తెలుసు. విపరీతమైన ఈదురుగాలుల తో పుల్లచినుకులు పడే సమయం ఈ ఆషాడమాసమే. కాలువలోను, నదులలోను, ప్రవహించే నీరు పరిశుభ్రంగా ఉండదు. చెరువుల లోనికి వచ్చి చేరిన నీరు మలినం గా ఉండి మనుషుల ఆరోగ్యాలకు హాని కలిగిస్తుంది.
మనది వ్యవసాయ ఆధారిత దేశం. పొలం పనులన్నీ ఈ మాసం లోనే మొదలు పెడతారు రైతులు. చైత్ర వైశాఖ మాసాలలో వ్యవసాయపు పనులు ఉండవు. కాబట్టే ఈ సమయం లోనే వివాహాది శుభముహూర్తాలు ఎక్కువగా ఉంటాయి , ఈ రోజుల్లో కొత్తగా పెళ్లి అయిన యువకులు ఆరు నెలల కాలం అత్తా గారి ఇంట్లో ఉండే సంప్రదాయం ఉండేది. కష్టపడి వ్యవసాయపు పనులు చేయవలసిన యువకులు అత్తవారింట్లో కూర్చొని ఉంటే, సకాలం లో జరగాల్సిన పనులు జరగవు. వర్షాలకు తగినట్లుగా విత్తనాలు చల్లుకొనే రోజులు అవి. ఇప్పటి లాగ కాలువల ద్వారా నీరు లభించేది కాదు. సరైన సమయం లో విత్తనాలు చల్లక పొతే సంవత్సరమంతా దారిద్ర్యం తో బాధ పడవలసిందే. అందుకే కొత్త కోడలు పుట్టింట్లోనే ఉండాలి . అల్లుడు అత్తవారింటికి వెళ్ళ కూడదు అనే నియమం విధించారు పెద్దలు. ఇంటి ద్యాస తో పనులు సరిగా చేయరని ఆషాడమాస నియమం పెట్టారు. అంతే కాకుండా, అనారోగ్య మాసం ఆషాడం. కొత్త నీరు త్రాగటం వల్ల చలి జ్వరాలు, విరోచనాలు, తల నొప్పి మొదలైన రోగాలు వచ్చే సమయం, స్త్రీలు గర్భం ధరించడానికి మంచి సమయం కాదు, అనారోగ్య దినాలలోను అశుభ సమయాల లోను, గర్భధారణ జరిగితే ఉత్తమ సంతానం కలగదనే నమ్మకం కూడా ఉంది. ఇన్ని కారణాల వల్ల ఆషాడమాసాన్ని కొన్ని పనులకు నిషిద్దం చేసారు మన పెద్దలు.


గో సేవ కదా అని చెప్పి గోమాతకి అన్నం ఎక్కువగా పెట్టేయ వద్దు...అసలు ఆవుకి అన్నం పెట్టకూడదు

గో సేవ కదా అని చెప్పి గోమాతకి   అన్నం ఎక్కువగా పెట్టేయ వద్దు...అసలు ఆవుకి  అన్నం పెట్టకూడదు ...ఆవు యొక్క జీర్ణాశయం అనేది అన్నం అరిగించుకోవడానికి వీలుగా తయారవ్వలేదు ...! ఒక వేల ఎక్కువగా  అన్నం పెడితే అన్నం జీర్ణం కాక ,కాళ్ళకి పట్లు వచ్చి , పొట్ట ఉబ్బి పోయి ,ర్యూమెన్ అసిడోసిస్ వచ్చి గుండె , కాలేయం పని చేయడం ఆగిపోయి ఆవు చనిపోతుంది ..! మొదటి ఎనిమిది గంటల్లో గుర్తించి ట్రీట్మెంట్ ఇవ్వలేకపోతే ఆవును వంద శాతం కాపాడుకోలేము ...అసలు దీనిని మొదటి స్థాయిలో గుర్తు పట్టడం చాలా కష్టం ...! 
మీ యొక్క పెళ్ళిళ్ళు పేరంటాలు లలో మిగిలిన అన్నాన్ని  ఆవులకి పెట్టేసి అదేదో పుణ్యకార్యం వెలగపెట్టేసాము  అనుకోకండి ....మీరు కూడా తెలిసి తెలియకుండా గోహత్యలో భాగస్వాములు అవుతున్నారు ...ఆలోచించండి ...
గోమాతకు పెట్టాల్సినవి...
పచ్చ గడ్డి  , ఎండు గడ్డి  , దానా  , పెసర పొట్టు , మినప పొట్టు , రాగుల పొట్టు  , గంట్లు , చెరుకు గడ్డి , అరటిపండు( ఎక్కువగా కాదు  మితంగా  పెట్టాలి )  , అరిసెలు  , బెల్లం
పెట్టకూడనివి...
అన్నం( ఎక్కువ మోతాదులో పెట్టకూడదు  ,పూజ చేయగా ఉన్న ప్రసాదం  కొంచెం కొంచెం పెట్టవచ్చు ) ...  ,  పచ్చి  బియ్యం  , నానపెట్టిన బియ్యం  , గోధుమలు , జొన్న మొక్క మొలకలు  , చాక్లెట్ , బిస్కెట్  మొదలగునవి ...కాస్త గమనించగలరు ...
గోమాత జననం  ఆవు పుట్టుక గురించి శతపథ బ్రాహ్మణంలో ఉంది.
దక్ష ప్రజాపతి ప్రాణి సృష్టి చేసిన పిమ్మట కొంచెము అమృతమును త్రాగారు.
త్రాగిన తరువాత వారు ప్రసన్నమయ్యారు.
ఆ సమయములో వారి శ్వాస ద్వారా సుగంధము వెలువడి అంతటా ప్రసరించినది.
ఆ శ్వాస నుండి ఒక్క ఆవు జన్మించినది.
సుగంధము ద్వారా జన్మించుట వలన దక్షప్రజాపతి దానికి ‘సురభి’అని పేరు పెట్టారు.
సురభి నుండి అనేక ఆవులు జన్మించాయి.
అందుకనే సురభిని గోవంశమునకు మాతగా, జననిగా పరిగణిస్తారు.
ఋగ్వేదంలో వేదంలో 4వ కాండలో 12వ సూక్తం గోసూక్తంగా గోమాత యొక్క మహత్యం వివరించబడింది.
శ్రీసూక్తం, పురుష సూక్తం, మన్యు సూక్తం లాంటి పవిత్ర సూక్తాలతోపాటు గోసూక్తం కూడా చెప్పబడింది.
గోవు రుద్రులకు తల్లిగా, వసువులకు పుత్రికగా, ఆదిత్యులకు సోదరిగా, నెయ్యి రూపాన అమృతంగా చెప్పబడింది.
 ఋగ్వేదంలో ఆవును ‘‘అఘణ్య’’ అన్నారు.
సముద్ర మధనము నుండి దేవతల కార్యసిద్ధికై, సాక్షాత్తు సురభి బయల్వెడలినది.
సంతోషముగా ఉన్నది, కపిల వర్ణముగలది, పొదుగు బరువు చేత నెమ్మది, నెమ్మదిగా అలలపై నడుస్తూ వచ్చుచున్న కామధేనువును చూచిన దేవతలంతా గొప్పకాంతిగల ఆ ఆవుపై పుష్పములు కురిపించిరి.
అపుడు అనేక విధములు వాధ్యములు, తూర్యములు మ్రోగింపబడినవి.
లోకములో గోసంతతి వ్యాపించడానికి ఆమెయే ఆధారం.
ఆ సురభిరోమకూపాల నుంచి కొన్ని లక్షల సంఖ్యలో గోవులు పుట్టాయి.
వాటి మగ సంతతి వృషభాలు.
*‘‘గావః విశ్వస్య మాతరః గవా మాంగేషు తిష్ఠంతి భువనాని చతుర్దశ’’*
ఆవు విశ్వజనులందరికీ తల్లి వంటిది.
గోవు నందు చతుర్దశ భువనాలున్నాయని వేదం చెబుతుంది.
అంటే గోవు పృథ్వీ రూపమని అర్థం.
క్షీర సాగరమధన సమయంలో నంది, శుభద్ర, సురభి, సుశీల, బహుళ అనే అయిదు గోవులు ఉద్భవించాయని భవిష్యపురాణం తెలియజేస్తుంది.
వీటినే కామధేనువులు అంటారు.
వంద గోవుల చేత కూడివున్న ఆ ధేనువు, సురభిని నీటి మధ్య నుండి తీసుకొని వచ్చిరి.
ఆ గోవులు దట్టమైన నీలిరంగులోనూ, నలుపు రంగులోనూ, ధూమ్రవర్ణములోను,
బభ్రు వర్ణములోను,
శ్యామ వర్ణములోనూ, ఎరుపు రంగు,
పింగళ (చిత్ర) వర్ణములోనూ ఉండినవి.  స్కాంద పురాణము.
గోశబ్దము స్వర్గమునకు, బాణమునకు, పశువునకు, వాక్కునకును, వజ్రాయుధమునకును, దిక్కునకును, నేత్రమునకును, కిరణమునకును, భూమికిని, నీళ్ళకును పేరు.
‘‘ధేనునా మస్మి కామధుక్" అని గీతలో శ్రీకృష్ణుడు నేనే గోవునని చెప్పుకున్నాడు.
గోవు లక్ష్మీ స్వరూపం.
దీనికి ఒక పురాణ గాధ ఉంది.
దేవతలందరూ వచ్చి గోవుతో తల్లీ మేమందరం నీ శరీరంలో నివసించడానికి కొంచెం భాగం ఇవ్వమని ప్రార్థిస్తే గోవు దేవతలందరికి భాగం ఇవ్వడం జరిగింది.
సురభి ఒక్కసారి తపస్సునారంభించనది.
బ్రహ్మ దేవుడు ఆ తపస్సునకు మెచ్చి సంతుష్టుడయ్యారు.
సురభికి అమరత్వమును ప్రసాదించారు.
త్రిలోకముల కన్నా పైన ఉండే స్వర్గమును వరముగా ఇచ్చారు.
దీనిని స్వర్గ గోలోకమనే పేరుతొ పిలుస్తారు.
గోలోకములో సురభి నిత్యమూ నివసిస్తుంది, ఈమె కన్యలు, సుకన్యలు భూలోకములో నివసిస్తారు.
ఈ గోలోకమునకు అధిపతి గోవిందుడు అనగా శ్రీ కృష్ణుడు.
శ్రీకృష్ణ పరమాత్ముడు ‘గోప్రేమికుడు’ అని అంతటా ప్రాచుర్యమైనదే!
స్పర్శ మాత్రము చేత గోవులు సర్వ పాపముల నుండి మానవులను విముక్తులను చేస్తాయి.
ప్రతి దినమూ స్నానం చేసి గోవును స్పృశించినవాడు సర్వపాపాల నుండి విముక్తుడౌతాడు.
గోమయములో లక్ష్మీ దేవి, గోమూత్రములో గంగాదేవి నివాసముంటారు.
గోమూత్రము, గోమయాలతో నేల పరిశుద్ధము, పరిపుష్ఠము అవుతుంది.
గోమయమును అగ్నితో శుద్ధి చేసిన యెడల ఆ భస్మమే విభూతి యగును.
ప్రతిదినము ఆవులకు నీరు త్రాగించి గడ్డిని మేతగా తినిపించేవారికి అశ్వమేధ యజ్ఞం చేసినంత చేసిన పుణ్యం వస్తుంది.
‘‘ఒక గోవు తన జీవితకాలంలో సగటున 25వేల మందికి ఆకలి తీరుస్తుందని చెబుతూ గోవును వధిస్తే ఆ రాజ్యంలో అరాచకం పెరిగి ప్రజలు నశిస్తారని చెప్పారు.
మనం తల్లిగా భావించే ఈ గోవుతో రోజు కొన్ని క్షణాలు వాటికి మేత పెట్టడం, వాటితోపాటు కొంత సమయం గడపటంవల్ల, మన శరీరంలో వున్న అనారోగ్యాన్ని, ఆ గోవు ముక్కులోవున్న ఒక గ్రంథి ద్వారా గ్రహిస్తుంది, తరువాత మేతకు వెళ్ళినప్పుడు మన రోగ నివారణకు కావలసిన మూలికలను, గడ్డిని తిని, అందుకు తగిన విధంగా పాలు ఇస్తుంది, ఆ పాలు తాగడంవల్ల మన వ్యాధి నయం అవుతుంది.
గోమాత - కీర్తనం శ్రవణం దానం, ధర్మం, గోరక్షణం, గోరక్షణ ప్రోత్సాహం, గోరక్షణ ప్రోత్సాహక ప్రేరణం… అన్నీ పుణ్యప్రదమైనవే.
       జై గోమాత జైజై గోమాత
గోమాత పాదాలకు శతకోటి వందనాలు


వాస్తుదోషం ఉన్నట్లు ఎలా గుర్తించాలి.....?

వాస్తుదోషం ఉన్నట్లు ఎలా గుర్తించాలి.....?
ఇల్లు చూస్తే వాస్తు శాస్త్ర ప్రకారం ఏ దోషం కనబడదు.  కానీ ఆ ఇంట్లోకి మారిన దగ్గరనుంచీ  అకారణ చికాకులూ, అనారోగ్యాలూ, లేనిపోని టెన్షన్లూ, యాక్సిడెంట్లూ ఇలా ఏదో ఒకటి జరుగుతూ వుండవచ్చు.  వారి జాతకం ప్రకారం ఏ దోషం లేని సమయంలో కూడా ఇలాంటివి జరుగుతూంటే ఆ ఇంటి వాస్తులో లోపం వున్నదని చెప్పుకోవచ్చు.  మన శరీరంలో అయస్కాంత శక్తి వుంటుంది.  మనకి సరిపడని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఆ ప్రభావం మన శరీరం మీద పడి తల తిరగటం, తలనొప్పి, చికాకు మొదలయినవి బాధపెడతాయి.
అలాగే పెంపుడు కుక్క అస్తమానం ఒకే దిశకి తిరిగి అరవటంకూడా ఒక సూచనే.  ఇంట్లోకి పాములు, గబ్బిలాలు రావటం, కాకులు ఎక్కువగా వాలటం, ఆ ఇంటి చట్టూ మాత్రమే కాకులు ప్రదక్షణ చేయటం కూడా కనబడని వాస్తు లోపాలకి సూచనలు.
కొన్ని ఇళ్ళు చూడటానికి కళావిహీనంగా కనబడతాయి.  అలాగే కొన్నిచోట్లకి వెళ్ళగానే అకారణ భయం వేస్తుంది. కొన్ని ఇళ్ళల్లో ఆత్మ హత్యలో, హత్యలో జరిగి వుండవచ్చు  అలాంటి సంఘటనలు జరిగినచోట కొన్ని ఇబ్బందులుపడవలసి రావచ్చు.  అంటే ఆ పిశాచాలు అక్కడ తిష్ట వేసుకు కూర్చున్నాయనికాదు, అవి లేకపోయినా కొన్ని చికాకులు వుంటాయి.  ఆ ఇంట్లో అంతకు ముందు జరిగిన సంఘటనలు మనకు తెలిసే అవకాశం వుండదు.  అయినా మనలో అంతర్లీనంగా వున్న శక్తులు కొన్ని మనకి సూచిస్తాయి.
అయితే వంశపారంపర్యంగా వచ్చిన ఇళ్ళని ఇలాంటి చికాకులవల్ల వదిలి వెళ్ళలేము.  అందుకని శాస్త్రజ్ఞులకు చూపించి, లోపాలేమిటో తెలుసుకుని తగిన శాంతి చేయిస్తే సరిపోతుంది.  కొత్త ఇల్లు కట్టుకోబోతున్నా, కొనుక్కోబోతున్నా ముందే సరైన పరీక్షలు చేయిస్తే తర్వాత ఏ ఇబ్బందీ పడక్కరలేదు.
అయితే మన దశ బాగా లేనప్పుడు ఎంత మంచి ఇంట్లోవున్నా మన జాతక దోషాలవల్ల వచ్చే చికాకులు మనమే అనుభవించాలి...వాస్తు శాస్త్రాన్ని నిందించి లాభం లేదు.
మనలో చాలామంది ఇల్లు కట్టుకున్న తర్వాతో, ఫ్లాట్ కొనుక్కున్న తర్వాతో వాస్తు దోషాలున్నాయేమోనని వాస్తు శాస్త్రజ్ఞుల్ని సంప్రదిస్తాము.  అది సరికాదు.  అసలు వాస్తు దోషాలు ఏర్పడటానికి ముఖ్యంగా మూడు కారణాలు చెప్తారు.
మొదటిది భూమి కొనే ముందే అన్ని కోణాలలో భూమి పరీక్ష చేయించాలి.  ఎందుకంటే లూజ్ సాయిల్  అయితే ఇల్లు కట్టుకోవటానికి అనువైందికాదు.  కట్టడం బలంగా వుండదు.  అలాగే నేల అడుగున దేవాలయాలు, జల నాడులు, శల్యాలు, దుష్ట శక్తుల ఆవాహన వున్న ప్రదేశాలలో కూడ ఇల్లు కడితే సుఖంగా వుండలేరు.  అలాగే చుట్టుపక్కల ఎలా వుంది, ఇరుగూ, పొరుగూ కూడా చూసుకోవాలి.
రెండవది యజమాని నామ నక్షత్రాన్ని బట్టి ఇంటికి సింహ ద్వారాలు ఎక్కడ వుండాలి, ఎన్ని గుమ్మాలు వుండాలి, ఎక్కడెక్కడ వుండాలి, కిటికీలు ఎక్కడ వుండాలి వగైరాలన్నీ ముందే వాస్తు శాస్త్రజ్ఞులను సంప్రదించి నిర్ణయించుకోవాలి.  ఆ నమ్మకం లేనివారు  శాస్త్రజ్ఞులను సంప్రదించాలి.
ఇవ్వన్నీ చూపించినా కొన్నిసార్లు ఆ ఇంట్లో నివసించిన తర్వాత వాస్తు బాగాలేదనుకుంటారు.  దానికి కారణం మన ప్రవర్తనవల్ల వచ్చింది.  ఏ ఇంట్లో అయితే స్త్రీలకు అన్యాయం జరుగుతుందో, ఏ ఇంట్లో అనర్ధాలు జరుగుతాయో, ఆక్రందనలుంటాయో ఆ ఇంటికి వాస్తు దోషం వుంటుందంటారు.-  జీవ హింస జరిగే ఇంట్లో, తల్లిదండ్రులు, వృధ్ధులు,  బాధపడే ఇంట్లో వాస్తు దోషం వున్నట్లే.  అంటే ఆ ఇంట్లో నివసించే వారికి సుఖశాంతులు వుండవు.  సర్ప, దేవతా, ఋషి శాపాలు వున్న ఇంట, పసిపిల్లలకు అన్యాయం జరిగే ఇంట వాస్తు దోషం వున్నట్లే.  ఇవ్వన్నీ భూమి ఎంచుకునేటప్పుడు, ఇల్లు కట్టుకునేటప్పుడు వచ్చిన దోషాలుకాదు.  మన ప్రవర్తనవల్ల వచ్చిన దోషాలు.  అలాగే కొందరు ఇల్లు కట్టాక వాస్తుకోసమని కొంత భాగం పడగొట్టి మార్పులు చేర్పులు చేస్తూవుంటారు.  అలా చెయ్యటంకూడా వాస్తుదోషమేనట.
భూమిలోను, ఇంట్లోను దోషాలుంటే ఆ ఇంటిని మారిస్తే సరిపోతుంది.  మన ప్రవర్తనలో దోషం వుంటే మనం ఏ ఇంటికెళ్ళినా ఆ ప్రవర్తన మారకపోతే తిప్పలు తప్పవు.  ఎంత బాగా వాస్తు ప్రకారం కట్టిన ఇల్లయినా కలసిరాదు.  అందుకే ముఖ్యంగా మన ప్రవర్తనని సరి చేసుకోవాలి.  అప్పుడు ఏ ఇంట్లోనైనా సంతోషంగా వుండవచ్చు.

తెలుగు వివాహంలో ముఖ్యమైన సంప్రదాయములు

తెలుగు వివాహంలో ముఖ్యమైన సంప్రదాయములు
పెళ్లి అంటే నూరేళ్ళ పంట అని మనకు వూహ తెలిసిన దగ్గర నుంచి మనం అంటున్న- వింటున్న మాట ….
అసలు పెళ్లి అంటే ఎలా ఉండాలి ఎలా జరగాలి ? ఆ పెళ్లి సంప్రదాయం గురించి తెలుసుకుందామా !!
తాటాకులతో పందిరి వేయాలి …
మామిడి ఆకులతో తోరణాలు కట్టాలి …
అరిటాకుల్లో భోజనాలు పెట్టాలి …
పెళ్ళంటే జన్మకి ఒకే సారి జరిగే పండుగ …
రెండు మనసులు జీవితకాలం కలిసుండటానికి వేసే తొలి అడుగు ….
రెండు కుటుంబాలు జీవిత కాలం రక్త సంబంధీకుల్లా కలిసి పోయే ఒక మహత్తర ఘట్టం …
కొన్ని వేల మంది బంధుమిత్రులు  దశాబ్దాల తర్వువాత ఈ వేడుకలో కలిసి చెప్పుకునే ఆత్మీయ ముచ్చట్లు ….
ఇది కదా నిజమయిన తెలుగింటి పెళ్లి అంటే
మరి ఇప్పుడు మళ్ళీ ఆ పెళ్ళిళ్ళ పండుగ సీజన్ వచ్చేసింది .అదేనండి శ్రావణమాసం వచ్చేసింది మరి పెళ్లిలో జరిగే కొన్ని ముఖ్యమైన అంశాలు మనకు ఎంతవరకు తెలుసు ఇంతకు పెళ్ళిలో ఎన్ని ముఖ్యమైన ఘట్టాలు ఉంటాయి !…
అందులో కొన్ని మనం తెలుసుకుందాం …
తెలుగు వివాహం లోని ముఖ్యమైన అంశాలు :-
1) పెళ్ళి చూపులు 2) నిశ్చయ తాంబూలాలు 3) స్నాతకం 4) కాశీ యాత్ర 5) వర పూజ-ఎదుర్కోల్లు 6) గౌరీ పూజ 7) మంగళ స్నానాలు 8) కన్యా వర్ణం 9) మధుపర్కాలు 10) యజ్నోపావితాధారణ 11) మహసంకల్పం 12) కాళ్ళు కడగటం 13) జీలకర్ర బెల్లం నెత్తిన పెట్టటం 14) కాళ్ళు తొక్కించడం 15) కన్యాదానం 16) స్వర్ణజలాభి మాత్రాణం 17) యోక్త్ర బంధనం 18) మంగళ సూత్రధారణ 19) తలంబ్రాలు 20) బ్రహ్మ ముడి 21) ఉంగరాలు తీయడం 22) సప్తపది-పాణిగ్రహణం 23) ప్రధాన హోమం 24) సన్నికల్లు తొక్కడం 25) లాజా హోమం 26). స్థాలిపాకం 27). నాగవళ్లి 28). సదస్యాం 29). నల్లపూసలు కట్టడం 30). అరుంధతి దర్శనం 31) ఉయ్యాల-బొమ్మని అప్పచెప్పటం 32) అంపకాలు 33) గృహప్రవేశం 34) భాసికాలు 35) మెట్టెలు ధారణ.  పైన ఉన్న వాటిలో కొన్ని ముఖ్యమైన అంశాలను తెలుసుకుందాం. 
పెళ్ళి చూపులు:
పెళ్ళికి మొట్ట మొదటి అడుగే ఈ పెళ్ళి చూపులు. ఈ పెళ్ళి చూపులు హిందు మత సాంప్రదాయం ప్రకారం చూపులు అమ్మాయి వాళ్ళ ఇంటి వద్ద జరుగుతాయి. పెళ్ళి కొడుకు తరుపువారు 3 లేదా 5 మందితొ అమ్మాయి వాళ్ళ ఇంటికి వస్తారు. అమ్మాయి ని తయారు చేసి అబ్బాయి తరుపున వారికి చూపిస్తారు. తరువాత ఇద్దరికి అమ్మాయికి అబ్బాయికి నచ్చితే పెద్దవారు కట్న, కానుకలు మాట్లాడతారు. ఈ కట్నాలు కూడ కుదిరిన పిదప తరువాత పెళ్ళి జరగడానికి తొలి అడుగు పడుతుంది.
నిశ్చితార్థం :
వివాహంలో ముఖ్యమైన ఘట్టాలలో మొదటిది వాగ్ధానం. అంటే పెళ్ళి ఖాయపరచుకోవడం (నిశ్చితార్థం). తర్వాత వర-వరణం. అంటే: వరుడిని లాంఛనప్రాయంగా అంగీకరించడం. నిశ్చితార్థానికే మరోపేరు “నిశ్చయ తాంబూలం”. వైదిక మంత్రాల మధ్య వివాహ ప్రక్రియకు పెద్దల ఆశీస్సులు తీసుకోవడానికే ఈ కార్యక్రమం. అందరికీ ఆమోదయోగ్యమైన శుభ ముహూర్తంలో పురోహితుడు బంధుమిత్రుల సమక్షంలో పెళ్ళి ముహూర్తాన్ని లగ్న పత్రికగా రాయించిన తదుపరి, వధూవరుల తల్లి-తండ్రులు లగ్న పత్రికలు, తాంబూలాలు మార్చుకుంటారు. పెళ్ళి ఒప్పందం లాంటి ఈ వేడుక వధువు ఇంటిలోగాని, వారేర్పాటుచేసుకున్న వసతి గృహంలోగాని జరుగుతుంది. దీన్నే ఆంగ్లంలో “ఎంగేజ్ మెంట్” అంటున్నారు. కొందరు ఇటీవలి కాలంలో ఈ తంతును పెళ్లికంటే ఘనంగా జరుపుకుంటున్నారు. నిశ్చితార్థం రోజున అమ్మాయి, అబ్బాయి ఉంగరాలు మార్చుకోవటంతో సగం పెళ్ళి జరిగినట్టు గానే భావిస్తారు. సాంప్రదాయ బద్ధంగా, వధూవరుల తల్లితండ్రుల మధ్యన ఇచ్చి-పుచ్చుకోవడాలు అందరి ఇళ్లల్లో ఒకే రకంగా వుంటాయి.
స్నాతకం :
పెళ్లిరోజుకు ఒకరోజు ముందర “స్నాతకం” అనే ముఖ్యమైన కార్యక్రమం జరుపుకోవడం ఆచారం. పెళ్ళి కుమారుడి ఇంటిలో గాని, కళ్యాణ మండపంలో గాని లేదా విడిదిలో గాని పురోహితులు స్నాతక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. విఘ్నేశ్వర పూజతో మొదలుపెట్టి, అన్ని ప్రాయశ్చిత్తాల కోసం, శరీర శుద్ది కోసం బ్రాహ్మణులు వరుడితో గోత్ర ప్రవరలు చేయిస్తారు. స్నాతకం అనే ఈ “సంస్కారం”, ప్రధానంగా, వరుడిని “బ్రహ్మచర్యం” నుండి “గృహస్థాశ్రమం” స్వీకరించడానికి సిద్ధంచేస్తున్న కార్యక్రమం. గురువు (ఇక్కడ పురోహితుడు) ఆదేశంతో-అంగీకారంతో “గృహస్థాశ్రమం” స్వీకరించే ఏర్పాటిది. ఆ సమయంలో గురువు చేయాల్సిన హిత బోధ తైత్తిరీయోపనిషత్తులోని “సత్యాన్న…” అన్న ఒక శ్లోక రూపంలో వుంటుంది. “సత్యం విషయంలోను, ధర్మం విషయంలోను, తెలివితేటల విషయంలోను, పొరపాటు పడవద్దు” అన్న ఆదేశం అది. తల్లిని, తండ్రిని, అతిథిని దేవుడులా భావించాలని చెప్తారు. సమాజ శ్రేయస్సే ధ్యేయంగా జీవించమని, దానం చేసేటప్పుడు శ్రద్ధగా చేయమని, తాహతుకు మించి దానం చేయొద్దనీ-ఇంతకంటె ఎక్కువ దానం చేయలేకపోతున్నందుకు సిగ్గుపడుతున్నానని భావించమనీ బోధిస్తాడు పురోహితుడు. పెద్దవారి నుంచి ధర్మ సూక్ష్మాలను తెలుసుకొని-వారనుసరించిన మార్గాన్ని ఎంచుకోమని అంటూ, “వరుడికి శుభం కలుగుగాక” అని ఆశీర్వదించి గురువు వరుడిని గృహస్థాశ్రమానికి సిద్ధం చేస్తాడు.
జీలకర్ర, బెల్లము :
శుభముహూర్త సమయమున వధూవరుల మధ్య తెరతొలగిస్తారు. ఒకరినొకరు చూసుకున్న తరువాత జీలకర్ర, బెల్లము కలిపిన ముద్దను ఒకరి తలపై ఒకరు నిలిపి చేతితో తాకుతారు. పూర్వకాలములో పదార్ధ విజ్ఞాన శాస్త్రవేత్తలు జీలకర్ర బెల్లము కలిపి నూరినా, నలిపినా ధన సంజ్ఞక విద్యుత్తు ఉత్పత్తి అగునని వర్ణించారు. జీలకర్ర బెల్లముతో ఘర్షణ చేస్తే అలాగే జరుగునని నిరూపించ బడింది. వేద కల్పము తెలిసిన పెద్దలు దీనిని గ్రహించి వధూవరుల పరస్పర జీవశక్తుల ఆకర్షణకు తోడ్పడునట్లుగా జీలకర్ర బెల్లము తాకుట ఒక ఆచారముగా చేసారు. దీనివలన దృష్టి కలుపుట, మనస్సు సంకల్పించుట సంభవించునని తెలుస్తుంది. అలాగే శ్రాస్త్రరీత్యా ఈ మీశ్రమానికి బ్రహ్మరంద్రాన్ని తెరిపించే శక్తి ఉంతుందట!.
మంగళసూత్రధారణ :
వివాహ సమయం నుండి స్త్రీలు మంగళ సూత్రం ధరించడం భారతీయ సంప్రదాయం. ఈ ఆచారం ఈనాటిది కాదు. పెళ్ళినాడు వరుడు వధువుకు తాళికట్టే సాంప్రదాయం ఆరో శతాబ్ధంలోనే ఆరంభమయింది. మంగళ సూత్రం అనే శబ్దం సంస్కృతం నుండి పుట్టింది. సంస్కృతంలో ‘మంగళ’ అంటే శోభాయమానం, శుభప్రదం అనే అర్ధాలు కలవు. సూత్రం అంటే తాడు, ఆధారమైనది అని అర్ధాలు కలవు. సాధారణంగా మంగళసూత్రాన్ని 108 సన్నని పోగులు, దారాలు కలిపి దానికి పసుపు రాసి తయారు చేస్తారు. ఇలా కలపబడిన తొమ్మిది లేదా పదకొండు కలిపికూడా కొందరు తాళిని తయారు చేస్తారు.
తలంబ్రాలు :
మంగళ సూత్రధారణ పూర్తి అయిన తరువాత తలంబ్రాల అక్షతలు తల మీదుగా పోసుకొంటారు. దీనినే అక్షతారోహణం అంటారు. ‘క్షత’ అంటే విరుగునది- ‘అక్షత’ అంటే విరగనిది. అనగా విడదీయరాని బంధము కావలెనని భావము. తలన్+బ్రాలు అంటే తల నుండి క్రిందికి జారునవి అని అర్ధం….
బాసికం :
వివాహంలో సుముహర్తం ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. సరిగ్గా ఈ ముహూర్త సమయంలో వధువు కనుబొమ్మల స్థానాన్ని వరుడు చూడాలి. అలాగే వధువు కూడా అంతే చేయాలి. అయితే పెళ్లి సంబరంలో ఉంది మరిచిపోతారు. అందుకే అది గుర్తు ఉండే లాగ వరుడు, వధువు నుదుట ఈ బాసికాలు కడతారు.
మెట్టెలు :
కాలి బొటనవేలు పక్కనున్న వేలు స్త్రీలకు ఆయువుపట్టు వంటిది. దాని నుండి విద్యుత్ ప్రవహిస్తూ ఉంటుంది . కాబట్టి ఆ వేలు నేలకు తగలడం మంచిది కాదు. అలా తగలకుండా ఉండడానికే మెట్టెలు పెట్టుకునే సంప్రదాయం ఏర్పడిందని పండితులు అంటారు. దీనికంతా కారణం ఓ పురాణ గాధ. దక్ష ప్రజాపతి తన అల్లుడైన శివుడిని అవమానిస్తాడు. తన భర్తకు జరిగిన అవమానాన్ని చూసి కోపముగా మారిన ద్రాక్షాయని, తన కాలి వేలుని భూమిపై రాసి నిప్పు పుట్టించి, అందులో తాను దహనమయ్యిందని పురాణాలు చెబుతున్నాయి. అప్పటి నుండి ఈ మెట్టెల సంస్కృతి మొదలయ్యిందని అనుకుంటూ ఉంటారు 
ఏడడుగులు :
మొదటి అడుగు అన్నవృద్ధికి, రెండవ అడుగు బల వృద్ధికి, మూడవ అడుగు ధన వృద్ధికి, నాలుగవ అడుగు సుఖ వృద్ధికి, ఐదవ అడుగు ప్రజా పాలనకు, ఆరవ అడుగు దాంపత్య జీవితానికి, ఏడవ అడుగు సంతాన సమృద్ధి కి వేస్తారు. ఈ ఏడడుగుల ఘట్టం పెళ్లి వేడుకలో చాలా ముఖ్యమైనది

ఉపనయనము

ఉపనయనము
ఉపనయనము హిందువులలో అబ్బాయిల వేదాభ్యాసానికి ముందుగా చేసే ప్రక్రియ. ఉపనయనాన్ని ఒడుగు అని కూడా అంటారు. ఇది అధికంగా పురుషులకు చేస్తారు. బాల్యావస్థ నుండి బ్రహ్మచర్యావస్థకు మారే సమయాన ఇది చేయడం ఆనవాయితీ. అప్పటి వరకు నియమ నిష్ఠ లతో పనిలేకుండా సంచరించే బాలుడు నియమ నిష్ఠలతోకూడిన జీవితంలో ప్రవేశించడానికి చేసే శాస్త్రీయమైన ప్రక్రియ ఇది. ఉపనయనానికి ముందు ఒక జన్మ తరువాత ఒక జన్మగా కూడా వ్యవహరించడం వలన ఉపనయనానికి అధిక ప్రాముఖ్యతను ఇచ్చే బ్రాహ్మణుని సమాజంలో ద్విజుడు అని నామాంతరంతో వ్యవహరిస్తుంటారు.
క్షత్రియులు, వైశ్యులు ఇప్పటికీ దీనిని ఆచరిస్తున్నా, అధిక ప్రాముఖ్యతతో నిర్దిష్ట విధులతో బ్రాహ్మణులు దీనిని అధికంగా ఆచరిస్తున్నారు. మిగిలినవారిలో ఇది ఒక ఆనవాయితీగా మారింది. వివాహపూర్వం ఒక తంతుగా మాత్రం దీనిని ఇప్పుడు ఆచరిస్తున్నారు. పూర్వకాలం గురుకులాభ్యాసం చేసే అలవాటు ఉన్న కారణంగా ఉపనయనం చేసి గురుకులానికి బాలురను పంపేవారు. అక్కడవారు విద్యను నేర్చుకుని తిరిగి స్వగృహానికి వచ్చి గృహస్థాశ్రమంలో ప్రవేశించేవారు.
ఉపనయనము అయ్యేవరకు పురుషుడు స్వయంగా ఎటువంటి ధర్మకార్యం నెరవేర్చటానికి అర్హుడుకాడు. యజ్ఞయాగాది క్రతువులు నెరవేర్చటానికి ఉపనయనము చేసుకున్న తరువాతే అర్హత వస్తుంది. క్షత్రియులకు ధర్మశాస్త్రాలభ్యసించడం అత్యవసరం కనుక ఉపనయన క్రతువు జరిపించి, విద్యాభ్యాసం ఆరంభించేవారు. పితరులకు కర్మకాండ, తర్పణం లాంటి కార్యాలు చేయడానికి ఉపనయనం అత్యవసరం. కొన్ని సందర్భాలాలో తల్లి తండ్రులు మరణావస్థలో ఉన్న సమయాలలో అత్యవసరంగా ఉపనయనం జరిపించి, కర్మకాండ జరిపించే అర్హతనిస్తారు. సన్యసించడానికి ఉపనయనం ప్రధానమే. కనుక హిందూ ధర్మంలో ఉపనయనం అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న ఒక ప్రక్రియ. హిందూ ధర్మంలో ఇది బ్రాహ్మణులకు, క్షత్రియులకు, వైశ్యులకు తప్పక నిర్వహించవలసిన బాధ్యత.
ఉపనయన ప్రాముఖ్యం
ఉపనయనము హిందువులలో కొన్ని కులాలలో మాత్రమే జరిగే ప్రక్రియ. ఇది సాధారణంగా బ్రాహ్మణులకు, వైశ్యులకు మరియు క్షత్రియులకు జరుగుతుంది. ఉపనయనం జరిగిన రోజున బాలుని తండ్రి బాలునికి చెవిలో గాయత్రీ మంత్రం ఉపదేశిస్తాడు. ఉపనయనం జరిగిన నాటి నుండి వటువు ప్రతి నిత్యం గాయత్రిని పూజిస్తూ బ్రహ్మచర్యం పాటించాలి. వేదాభ్యాసానికి ముందు తప్పనిసరిగా ఉపనయనం చేయవలెను. వివాహానికి ముందు బ్రహ్మచర్యాన్ని స్నాతక ప్రక్రియ ద్వారా వదిలి, గృహస్థాశ్రమంలోనికి ప్రవేశిస్తాడు వరుడు.
శ్లోకము
ఉపనయమనం విద్యార్థస్యశ్రుతిత్ స్సగ్గ్ స్కారః అప. ధర్మసూత్రం.
అనగా వేదాధ్యాయనౌ కొరకు శ్రుతి మంత్రములచేత చేయబడు సంస్కారమే ఉపనయనము. అనబడును.
శ్లో
అగ్ని కార్య త్పరిభ్రష్టాః తే సార్వే వృషలాస్మృతాః.||. పరాశర స్మృతి వేదాద్యయనము చేయై బ్రాహ్మణునకు 'వృష్లుడు.' అని పేరు. వృషలుడు అనగా శూద్రుడు లేక పాపాత్ముడు అని అర్థము. కనుక బ్రాహ్మణ బ్రాహ్మచారులకు వేదాధ్యయనము నిత్యమైనది.,. అవశ్యకమైనదీ కూడాను.
ఉపనయన ముహూర్తము
ఉపనయనము ఉత్తరాయణ కాలంలో మాత్రమే చేయవలెను. ఉపనయన ముహూర్తము తండ్రి జన్మ నక్షత్రం మరియు బాలుని జన్మ నక్షత్రంపై ఆధారపడుతుంది.
విధులు
ఉపనయన విధులు బ్రాహ్మణులకు, క్షత్రియులకు మరియు వైశ్యులకు వేరు వేరుగా ఉంటాయి.
బ్రాహ్మణులకు 5 సంవత్సరాలవయసులో ఉపనయనం చేసినట్లు అయితే "బ్రహ్మ వర్చస కామం పంచమ వర్షే" అథవా గర్బాష్టకంలో బ్రాహ్మణులకు ఉపనయనం చేయాలి. క్షత్రియులకు 11 సంవత్సరాల వయసులో, వైశ్యులకు 12 సంవత్సరాల వయసులో ఉపనయనము చేయడం ఉచితమని శాస్త్రనిర్ణయం. ఉపనయన సమయంలో బ్రాహ్మణులు నార వస్త్రాన్ని అంగవస్త్రంగా ధరించి, జింకతోలును ఉత్తరీయంగా ధరించాలి. అలాగే బ్రాహ్మణుడు ముంజకసవుతో పేనిన మొలత్రాడును ధరించాలి. ముంజ కసవు దొరకనప్పుడు దర్భ గడ్డిని నీటితో తడిపి ఒక ముడివేసి ధరించవచ్చు. మొలత్రాడు విధిగా ముప్పేటగా ధరించాలి. నూలుతో కట్టిన తొమ్మిది పోగుల యజ్ఞోపవీతాన్ని ధరించాలి. అలాగే బిల్వము లేక మోదుగ దండాన్ని కేశమువరకు ఉండేలా చేసుకుని ధరించాలి. ఉపవీతుడైన పిమ్మట భవతీ బిక్షాక్షాం దేహిఅని యాచించాలి. గురుకులానికి వెళ్ళిన బ్రాహ్మచారి యాచనతో దొరికిన ఆహారాన్ని గురువుకు సమర్పించి, తరువాత గురువు అనుమతితో భుజించాలి. అవశిష్టాన్ని పరిశుద్ధుడై తూర్పుముఖంగా కూర్చుని భుజించాలి. భుజించిన పిదప చేతులు శుభ్ర పరచుకుని ఆచమనం చేసి శరీరావయాలను నీటితో శుభ్రపరచుకోవాలి. ఆ తరువాత వస్త్రంతో అవయవాలను తుడుచుకోవాలి. ముందుగా తల్లిని కానీ, సోదరిని కానీ తల్లి వైపు సోదరిని కానీ యాచించడం ఉత్తమం. అవమానించని వారిని యాచించడం ఉత్తమమని అంతరార్ధం. ఈ మాదిరి బ్రహ్మచారి యాచించడం మధూకరం అంటారు. ఇందుకు పేద గొప్పా తారతమ్యం లేదు. అందరూ గురు శుశ్రూషలో సమానమే. ఉపనయనమునకు బ్రాహ్మణులకు చైత్ర వైశాఖ మాసాలు ఉత్తమం.
అలాగే క్షత్రియులకు వెల్వెట్ వస్త్రాన్ని అంగవస్త్రంగా ధరించి కురుమృగ చర్మాన్ని ఉత్తరీయంగా ధరించాలి. ముర్వ కసవుతో చేసిన మొలత్రాడును అది లభించని పక్షంలో నీటితో తడిపిన రెల్లుని మూడు ముడులు వేసి ధరించాలి. జనపనారతో చేసిన తొమ్మిది వరసలుగల యజ్ఞోపవీతాన్ని ధరించాలి. యజ్ఞోపవీతానికి జంద్యం అనే మరో పేరుకూడా ఉంది తమిళనాట ప్రతి సంవత్సరం జంద్యాల పండుగ జరుపుకుంటారు. తమిళనాట ఈ పండుగను ఆవణి ఆవట్టం అంటారు. వివాహానంతరం మొదటిసారిగా ఈ పండుగ అత్తవారింట జరుపుకోవడం ఆనవాయితే. యజ్ఞోపవీతాన్ని భుజంపై నుండి రెండవ చేతి క్రిందిగా ధరించాలి. శుభకార్యాలకు సవ్యంగానూ కర్మక్రియలు లాంటి పితృ కార్యాలు జరిపేటప్పుడు అపసవ్యంగా ధరించడం ఆనవాయితీ. అలాగే మర్రి లేక చండ్ర కొమ్మను కానీ నొసటి వరకు ఉండేలా దండాన్ని ధరించాలి. తరువాత బిక్షాం భవతి దేహి అని యాచించాలి. యాచించే ముందు సూర్యోపాసన చేసి అగ్నికి ప్రదక్షిణ చేసి యాచించాలి. క్షత్రియులకు జ్యేష్ట ఆషాఢాలు ఉపనయము చేయడానికి ఉత్తమమని భావన.
అలాగే వైశ్యులు ఉన్ని బట్టను అంగవస్త్రంగా ధరించి గొర్రెతోలును ఉత్తరీయంగా ధరించాలి. వైశ్యుడు జనపనారతో చేసినది అది లభ్యం కానిచో తుంగతో చేసిన మొలత్రాడును ముప్పేటగా చేసి అయిదు ముడులు వేసి ధరించాలి. మేక బొచ్చుతో చేసిన తొమ్మిది పేటల యజ్ఞోపవీతాన్ని ధరించాలి. జమ్మి లేక మేడి కొమ్మను ముక్కు వరకు ఉండేలా ధరించాలి. దండం వంకర లేనిది అగ్నిలో కాలనిది పైపట్టతో కూడినదై ఉండాలి. ఆశ్వయుజ, కార్తీక మాసాలు వైశ్యులకు ఉత్తమ ఉపనయన కాలమని పెద్దల భావన.
ఉపనయన విధానం
ఉపనయనం చేయించే అధికారం ముందుగా తండ్రికి లేనిచో అన్నకు అదికూడా లేనిచో దాయాదులకు అంటే సగోత్రికులకు ఉంటుంది. ఉపనయనం చేయించే వ్యక్తిని ఆచార్యుడుగా వ్యవహరిస్తారు. ఉపనయన సమయంలో వటువునకు ఆచార్యుడు గాయత్రీ మంత్రోపాసన చేస్తాడు. యజ్నోపవీత ధారణ సమయంలో అయిదుగురు బ్రహ్మచారులను పూజించి పసుపు బట్టలను ఇవ్వడం ఆచారం. బ్రహ్మ దేవునకు సహజంగా లభించిందీ మొదట పుట్టినదీ అయిన ఈ పవిత్ర యజ్ఞ ఉపవీతాన్ని నేను ధరిస్తున్నాను ఈ యజ్ఞ ఉపవీతం నాకు తేజస్సు, బలం, దీర్ఘాయువు, నిర్మలత్వం మరియు పుష్టిని ఇచ్చుగాక అని వటువు మంత్రయుక్తంగా చెప్పి ధరిస్తాడు. యజ్ఞోపవీత ధారణ వటువునకు ఆశ్రమ వాసాధికారం, కామ్యసిద్ధి, విద్యాధ్యయనం, వేదాధ్యయనం, సంపద, యశస్సు, ఆయుష్షు మరియు ధర్మాచరణాధికారం ఇస్తుంది.
అగ్నిహోత్రమునకు ఉత్తర దిక్కుగా ఆచార్యుడు కూర్చుని దక్షిణ దిశగా సన్నికల్లు ఉంచి వటునిచే అతిష్టేమ మంత్రం చెప్పి తొక్కించాలి. రాయివలెనే నీవు బ్రహ్మచర్య వ్రతములో స్థిరుడవై ఉండాలని దీని అర్ధం. ఆ రాతి మీదనే వస్త్రాలను అభిమంత్రించి వటువునకు ధరింపచేయవలెను, దేవతా వస్త్రాలను ధరించి ఐశ్వర్య వంతుడవై ఆర్తులను ఆప్తులను ఆదుకుంటూ నిండునూరేళ్ళు జీవించమని ఆశ్వీర్వదిస్తూ ఈ వస్త్రధారణ జరుగుతుంది. ఆ తరువాత మొలత్రాడు కట్టి యజ్ఞోపవీతాన్ని ధరింపచేసి మంత్రోపాసన చేయించాలి. వటువు ఆచార్యునకు గోదానం ఇచ్చి దండధారణ చేయించి అగ్నికి ప్రదక్షిణచేసి భిక్షాటనకు బయలు దేరాలి.
ఉపనయనమునకు ముఖ్య కాలము
శ్లో: గర్భా-ష్టమేషు బ్రాహ్మణ ముష్నయీత.' ( ఆపస్థంబ సూత్రం) అనగా తల్లి గర్భములో ఉన్న 9 మాసములను కలిపి లెక్క చూచినతో వటువునకు 8 వ సంవత్సరం రావలెను. అనగా 7 సంవత్సరాల 3 నెలలు 9 గర్భమాసములు కలిపినచీ 8 వ సంవత్సరం వచ్చును. దీనినే ఘర్భాష్టమ సంవత్సస్రం. అని అంటారు. ఇదియే సరైన కాలము.
బ్రహ్మచర్య ధర్మాలు
ఉపనయనము తరువాత వటువు కనీసం 12 సంవత్సరాలు ఒక వేదమునైనా అభ్యసించాలి. అలాగే ఒక్కో వేదానికి ఒక్కో 12 సంవత్సరాలు బ్రహ్మచర్యం అవలంబించవచ్చు. కానీ అది తప్పని సరికాదు. కలియుగములో ఎక్కువకాలం బ్రహ్మచర్యం మంచిదికాదని ఋషి భావన. ఆ తరువాత స్నాతకం చేసి వివాహ జీవితంలో ప్రవేశపెట్టడం శాస్త్రసమ్మతం.
బ్రహ్మచారికి నియమ నిష్ఠలు అనేకం ఉంటాయి. సుగంధ ద్రవ్యాలను వాడరాదు, పగటి నిద్ర పనికి రాదు, అలంకరణ చేసుకోరాదు, కామక్రోధ మద మాత్సర్యాలకు దూరంగా ఉండాలి, స్త్రీలయందు మౌనం సాధించాలి, సంగీత నృత్య వాద్యాలకు దూరంగా ఉండాలి, దుర్జన సాంగత్యం చేయకూడదు, చన్నీటి స్నానం మాత్రమే చేయాలి, వాహనాన్ని అదిరోహించకూడదు, వివేకం వీడకూడదు. దంతధావనానికి సుగంధాలను ఉపయోగించరాదు, అతిగా ఉద్రేకం, సంతోషం లాంటివి దరిచేరనీయకూడదు. అద్దములో ముఖమును చూడరాదు. మధువు, మాంసము తీసుకొనకూడదు. ఉప్పు, కారం లేని సాత్విక భోజనమే భుజించాలి. గురువు ఆజ్ఞను శిరసావహించాలి. ఇలా అనేక నియమ నిస్ఠలతో బ్రహ్మచర్యాన్ని కొనసాగించాలి. విద్యాభ్యాస సమయంలో బ్రహ్మచారి గురువునకు ఏమీ ఇవ్వనవసరం లేదు. కానీ విద్యాభ్యాసం పూర్తి చేసుకుని గురువును అడిగి అతను కోరినది గురుదక్షిణగా సమర్పించడం ఆచారం.          యస్.ఉమామహేశ్వరశర్మ

పుట్టినరోజు ఎలా జరుపుకోవాలి


పుట్టినరోజు ఎలా జరుపుకోవాలి
కాల విభాగంలో తప్పకుండా గుర్తు పెట్టుకొని తాను జరుపుకోవలసినవి కొన్ని ఉంటాయి. అందులో పుట్టినరోజు ఒకటి.
నేను నా పుట్టినరోజు చేసుకోనండీ అనకూడదు. తన పుట్టినరోజు తాను చక్కగా జరుపుకోవాలి. ఆ జరుపుకోవడానికి శాస్త్రం ఒక విధిని నిర్ణయించింది.
పుట్టినరోజు జరుపుకొనే వ్యక్తి ఆ రోజు తెల్లవారు ఝామున నిద్రలేచి అభ్యంగన స్నానం చేయాలి. ఒంటికి నూనె రాసుకుంటే అలక్ష్మి పోతుంది.
నూనె అలదుకొని తలస్నానం చేస్తారు. చేసేముందు పెద్దవాళ్ళు తలమీద నూనె పెట్టి ఆశీర్వచనం చేయడం, వెన్నుపాము నిమరడం, ఆచారంగా వస్తోంది.
స్నానం చేసిన తర్వాత ఇష్టదేవతారాధన చేయాలి. ఇంట్లో కులదైవం, ఇష్టదైవం ఉంటారు. వారిరువురినీ ఆరాధన చేయాలి.
తర్వాత ఆవుపాలలో బెల్లంముక్క, నల్ల నువ్వులు, కలిపిన పదార్థాన్ని మౌనంగా తూర్పు దిక్కుకు తిరిగి మూడుమార్లు చేతిలో ఆచమనం చేస్తే ఎలా తీసుకుంటామో అలా మూడుమార్లు లోపలికి పుచ్చుకోవాలి.
ఇలా ఆ పదార్థాన్ని మూడుమార్లు పుచ్చుకుంటే వచ్చే పుట్టినరోజు లోపల ఏదైనా గండకాలం ఉంటే అది తొలగిపోతుంది .
ఆ తర్వాత ఏడుగురు చిరంజీవులు - పుట్టుకతోనే చిరంజీవిత్వాన్ని పొందారు, ఇంకొంతమంది చిరంజీవిత్వాన్ని సాధించుకున్న వాళ్ళున్నారు.
పుట్టుకతో చిరంజీవులైన వాళ్ళు
- అశ్వత్థామ బలిర్వాసో హనూమాంశ్చ విభీషణః!
కృపః పరశురామశ్చ సప్తైతే చిరజీవినః!!..
ఈ ఏడుగురు పేర్లు మనసులోనన్నా స్మరించాలి. పైకన్నా చెప్పాలి. ఆరోజున తల్లిదండ్రులకి, గురువుగారికి తప్పకుండా నమస్కారం చేసి వాళ్ళ ఆశీర్వచనం అందుకోవాలి.
ఇంటికి దగ్గరలో ఉన్న దేవాలయాన్ని దర్శనం చేయాలి. చక్కగా మృష్టాన్న భోజనం చేయవచ్చు. రాత్రి మాత్రం బ్రహ్మచర్యాన్ని పాటించాలి. తన శక్తికొలదీ దానధర్మాలు నిర్వహించాలి.
తనకి ఐశ్వర్యం ఉందా? దానం చేస్తాడు. ఐశ్వర్యం లేదు - గోగ్రాసం అంటారు. చేతినిండా కాసిని పచ్చగడ్డిపరకలు పట్టుకెళ్ళి ఒక ఆవుకి తినిపించి ప్రదక్షిణం చేసి నమస్కరిస్తే చాలు.
ఇవి పుట్టినరోజు నాడు తప్పకుండా జ్ఞాపకం పెట్టుకొని చేయవలసిన విషయాలు. వీటికి విరుద్ధంగా పుట్టినరోజును చేసుకోకూడదు.
పుట్టినరోజు సరదాకోసం, వినోదం కోసం చేసుకొనేది కాదు. ఆయుర్దాయ సంబంధమైనటువంటిది. ఆరోజు దీపం చాలా ప్రధానం. పొరపాటున అక్కర్లేని విషయాలు పిల్లలకి నేర్పితే అవే విశృంఖలత్వాన్ని పొందుతాయి రేపు ప్రొద్దున.
ఎన్నో పుట్టినరోజు చేసుకుంటున్నాడో అన్ని కొవ్వొత్తులు వెలిగించడం ఉఫ్ అని ఊదుతూ దీపాలార్పేయడం పరమ అమంగళప్రదమైన విషయం.
దీపాలు ఆర్పి చేతితో కత్తి పట్టుకొని ఏదో నిన్నరాత్రో మొన్నరాత్రో తయారుచేసిన ఒక పదార్థం, ఎవడు చేసిన ఆశీర్వాదమో అర్థం కాదు రంగురంగులుగా వ్రాసిన Happy Birthday, అర్థం లేకుండా అందరూ నిలబడి కొడుతున్న తప్పట్లు, వీటి మధ్యలో కత్తితో కోసి నిర్లజ్జగా భార్య నోట్లో సభాముఖంగా పెట్టడం, ఇలాంటి పిచ్చపనులు చేయమని శాస్త్రాలలో లేదు.
దీపాన్ని గౌరవించు, దీపం వెలిగించు. దీపం దగ్గర మట్టుమీద అక్షతలో, ఒకపువ్వో వేసి నమస్కారం చెయ్యి. అది నీ ఇంట కాంతి నింపుతుంది.జీవితాన్ని నిలబెడుతుంది.
గురువుగారికి, తల్లిదండ్రులకి, పెద్దలకి నమస్కారం చెయ్యి. వాళ్ళనోటితో వాళ్ళు ఆశీర్వదించాలి..
"శతమానం భవతి శతాయుః పురుషశ్శతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతితిష్ఠతి" అని.
చక్కగా దేవాలయానికి వెళ్ళి నీపేరు మీద పూజ చేయించుకో. ఈశ్వరుడి అర్చన చెయ్యి. అపమృత్యు దోషం కబళించకుండా ఉండడానికి నల్లనువ్వులు, బెల్లం, ఆవుపాలు కలిసిన పదార్థాన్ని మూడుమార్లు పుచ్చుకో. సప్తచిరజీవుల పేర్లు మనస్సులో స్మరించడం, లేదా పైకి చెప్పడం, అదీ పుట్టినరోజు జరుపుకొనే విధానం.
సేకరణ. :  శ్రీ శరవణభవ..

ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు లేక ఏ నిర్ణయం తీసుకోవాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నప్పుడు మనసు దుర్భలం గా ఉన్నప్పుడు ఒక్కసారి ఈ జయమంత్రాన్ని నమ్మకం తో పఠించి

జయమంత్రము
ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు లేక ఏ నిర్ణయం తీసుకోవాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నప్పుడు మనసు దుర్భలం గా ఉన్నప్పుడు ఒక్కసారి ఈ జయమంత్రాన్ని నమ్మకం తో పఠించి స్వామి కి ఒక్క కొబ్బరి కాయ పంచదార ను నివేదించి నిర్భయంగా ముందుకు వెళ్ళండి ఒక్క సారిగా మీ మనసు తేలిక పడి యధార్థమైన త్రోవ భోధ పడుతుంది!! మీ మనసు తేలిక పడిన తరువాత చిన్న పిల్లల కు పానకం వడపప్పు పంచండి చాలు ఉప్పొంగిపోతారు మారుతి!!
ఇది సుందరకాండ లో స్వామి హనుమ ఇక్ష్వాకు వంశాన్ని మన తండ్రి రామయ్య నూ లక్ష్మణుడు ని సుగ్రీవుడిని కీర్తిస్తూ సీతమ్మ కి నమ్మకాన్ని కలిగించి లంకాదహనం చేసినప్పుడు ఆనందంగా తన స్వామి వైభవాన్ని కొనియాడుతూ పని పూర్తి చేసుకొచ్చిన అద్భుత మంత్రం ఇది!!
జయత్యతి బలో రామః
లక్ష్మణస్య మహా బలః !
రాజా జయతి సుగ్రీవో
రాఘవేణాభి పాలితః !!
దాసోహం కౌసలేంద్రస్య
రామస్యా క్లిష్ఠ కర్మణః !
హనుమాన్ శత్రు సైన్యానాం
నిహంతా మరుతాత్మజః !!
నరావణ సహస్రం మే
యుధ్ధే ప్రతిబలం భవేత్ !
శిలాభిస్తు ప్రహారతః
పాదపైశ్చ సహస్రశః !!
అర్ధయిత్వాం పురీం లంకాం
మభివాద్యచ మైథిలీం !
సమృధ్ధార్థ్యో గమిష్యామి
మిషతాం సర్వ రక్షసాం !!
హనుమాన్ అంజనాసూనుః
వాయుపుత్రో మహాబలః
రామేష్ఠ ఫల్గుణః స్సఖా
పింగాక్షోమిత విక్రమః
ఉదధిక్రమణశ్చైవః సీతా శోక వినాశకః
లక్ష్మణః ప్రాణదాతాశ్చ దశగ్రీవశ్చ దర్పః
ద్వాదశైతాని నామాని
కపీంద్రశ్చ మహాత్మనః
స్వాపకాలే పఠేన్నిత్యం
యాత్రాకాలే విశేషతః
తస్యమృత్యు భయంన్నాస్తి
సర్వత్ర విజయీ భవేత్!!
(ఈ హనుమంతుని ద్వాదశనామాలను
విశేషించి యాత్రలకు వెల్లేటప్పుడు లేదా
ఏదైన ముఖ్యమైన పనులకోసం వెల్లేటప్పడు
పఠించండి సర్వత్రా విజయాన్ని పొందండి)
అర్థం : మహాబల సంపన్నులైన శ్రీరామునకు జయము. మిక్కిలి పరాక్రమశాలియైన లక్ష్మణస్వామికి జయము. శ్రీరామునకు విధేయుడై, కిష్కింధకు ప్రభువైన సుగ్రీవునకు జయము. అసహాయ శూరుడు, కోసలదేశ ప్రభువైన శ్రీరామునకు నేను దాసుడను, వాయుపుత్రుడను. నా పేరు హనుమంతుడు.
శత్రుసైన్యములను రూపుమాపువాడను. వేయిమంది రావణులైనను యుద్దరంగమున నన్నెదిరించి నిలువ జాలరు. వేలకొలది శిలలతోను, వృక్షములతోను, సకల రాక్షసులను, లంకాపురిని నాశన మొనర్చెదను. రాక్షసులందరును ఏమియూ చేయలేక చూచుచుందురుగాక. నేను వచ్చిన పనిని ముగించుకొని సీతాదేవికి నమస్కరించి వెళ్ళెదను.
ఇది పఠించిన వారికి జయం తధ్యం !!
జయశ్రీ రామ!! శుభమ్ భూయాత్!!
#నారాయణనారాయణనారాయణ!!

గంధర్వపురం (గాణుగాపురం) ఉత్తమమైన క్షేత్రము.

గంధర్వపురం (గాణుగాపురం) ఉత్తమమైన క్షేత్రము. అక్కడ ఎన్నో తీర్థాలు ఉన్నాయి. అచ్చటి దేవతలు సులభంగా వరాలిస్తారు. అక్కడ భీమా - అమరజా నదీ సంగమము ఉన్నది. అచ్చటి అచ్చటి అశ్వత్థవృక్షం సాక్షాత్తు కల్పవృక్షమే. దానికి ఎదురుగా నృసింహ తీర్థము, దానికి తూర్పున పాపనాశ తీర్థము, దాని ప్రక్కనే రుద్రపాద తీర్థము, చక్రతీర్థము, తర్వాత కోటి తీర్థము, మన్మథ తీర్థము ఉన్నాయి. ఇక్కడనే 'కల్లేశ్వరుడు' ఉన్నాడు. గంధర్వపురం సాటిలేని సిద్ధ భూమి గనుక, అక్కడ త్వరగా అభీష్టాలు నెరవేరుతాయి. ఈ సంగమం ప్రాంతం అంతా ప్రయాగ తో సమానమైన మహాత్మ్యం గలది. ఇచ్చటి షట్కూల తీర్థాన్ని మించినది వేరొకటి లేదు. ఇది ప్రయగను కూడా మించినది. ఈ భీమా - అమరజా సంగమము గంగా - యమున సంగమము కంటే గూడ ఎక్కువ పవిత్రమైనది. ఇక్కడ స్నానం చేయడం వలన కలిగే పుణ్యం యింతింత అని చెప్పలేము. ఇక్కడ పవిత్రమైన తీర్థాలు ఎనిమిది ఉన్నాయి.
భీమా - అమరజా తీర్థములో స్నానము చేసినవారి సర్వ పాపాలు తొలగిపోతాయి. ఇందులో భక్తి విశ్వాసాలతో స్నానం చేసినవారికి అపమృత్యు భయం ఉండదు. ఇది అన్ని బాధలను, వ్యాధులను, బ్రహ్మ హత్యాది పాపములను తొలగించడంలో త్రివేణి సంగమం తో సమానమైనది.
మనోరథ తీర్థములో స్నానం చేస్తే నిశ్చయంగా మనోరథములు అన్నీ నెరవేరుతాయి.
పాప వినాశన తీర్థములో స్నానం చేస్తే సర్వ పాపాలు భస్మం అవుతాయి. ఇందులో ఒక్కొక్క స్నానంకి ఏడు జన్మల పాపం నశించిపోతుంది.
కోటి తీర్థములో స్నానం చేస్తే సర్వ తీర్థములలో స్నానం చేసినంత ఫలితం వస్తుంది. ఇక్కడ చేసిన స్నానంకి కోటి గోవులు దానమిచ్చిన ఫలితం ఉంటుంది. ఇక్కడ చేసిన దానానికి గూడా కోటి రెట్లు ఫలితం ఉంటుంది.
రుద్రపాద తీర్థములో గయలోలాగే, కర్మ చేసి రుద్రపాద స్వామిని పూజించాలి.
చక్ర తీర్థములో స్నానం చేస్తే జ్ఞానం కలుగుతుంది
కల్లేశ్వరుని దగ్గర ఉన్న మన్మథ తీర్థములో స్నానం చేసి, ఈశ్వరుణ్ణి పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. 
ఈ విధముగా 'గంధర్వపురం క్షేత్రము కోసం శ్రీ నృసింహ సరస్వతి మహరాజ్ తెలియచేసారు.
జై గురుదేవ దత్త
దిగంబర దిగంబర శ్రీ పాద వల్లభ దిగంబర

తిధులలో చేయవలసిన దేవతావ్రతాలు.పూజలు

తిధులలో చేయవలసిన దేవతావ్రతాలు.పూజలు
ఏ దేవతలను ఏ తిథినాడు ఆరాధిస్తే ఎంత మంచి పుణ్య ఫలం కలుగుతుంది? అనే ప్రశ్న చాలా మందికి ఉదయిస్తుంటుంది. ఈ ప్రశ్నకు సమాధానం వరాహ పురాణంలో కనిపిస్తుంది. అందులో వరాహమూర్తిగా ఉన్న శ్రీమహావిష్ణువు స్వయంగా తిథుల విశేషాలను భూదేవికి వివరించి చెప్పాడు.
పాడ్యమి..
దేవతలలో ముందు పుట్టిన వాడు అగ్ని.
కనుక తిథులలో మొదటిదైన..పాడ్యమి నాడు అగ్నిని ఆరాధిస్తే పుణ్య ఫలం దక్కుతుంది. భక్తులు ఆ రోజున పాలు మాత్రం తాగి ఉపవాసం ఉండి అగ్నిని ఆరాధించాలి.
విదియ..
విదియ నాడు అశ్వనీ దేవతలను ఆరాధించాలి.
ఈ తిథి నాడే అశ్వనీ దేవతలు జన్మించారు. సంవత్సర కాలం పాటు ఆ దేవతలను ఉద్దేశించి విదియ వ్రతం నియమ నిష్టలతో చేస్తే అందమైన రూపం కలుగుతుంది.
తదియ..
తదియ నాడు గౌరీ దేవిని ఆరాధించాలి. ఇది ప్రత్యేకంగా స్త్రీల కోసం ఏర్పాటైంది. తదియ నాడు గౌరీ కల్యాణం జరిగిన కారణంగా గౌరీ దేవికి ఈ తిథి అంటే ఎంతో ఇష్టం.
చవితి..
చవితి వినాయకుడు పుట్టిన తిథి. ప్రత్యేకంగా వినాయక చవితి నాడే కాక ప్రతి శుద్ధ చవితి నాడు వినాయక పూజ చేయవచ్చు.
పంచమి..
పంచమి నాడు నాగులు జన్మించాయి. అందుకే నాగ దేవతకు పంచమి తిథి అంటే ఎక్కువ ఇష్టం. ప్రతి పంచమి నాడు పుట్టలో పాలు పోసి సంవత్సర కాలం పాటు నాగులను పూజిస్తూ ఆ పంచమి నాడు పులుపు లేని భోజనం చేస్తే నాగుల వల్ల భయం ఉండదు. నాగుల చవితి, నాగ పంచమి అనేవి రెండూ నాగదేవతకు ఇష్టమైనవే.
షష్టి...
షష్ఠి కుమారస్వామి జన్మ తిథి. ఆనాడు అర్చన చేస్తే కుమార స్వామికి ప్రీతికరం.
సప్తమి..
సప్తమి సూర్యుడి జన్మ తిథి. రథ సప్తమి నాడే కాక ప్రతి శుద్ధ సప్తమి నాడు సూర్యుడిని ఆరాధించి క్షీరాన్నాన్ని నివేదిస్తే ఆయురారోగ్యాలు కలుగుతాయి.
అష్టమి..
అష్టమి దుర్గా దేవి నుంచి అష్టమాతృకలు ఆవిర్భవించిన తిథి అష్టమి. అందుకే ఆనాడు అష్ట మాతృకలను, దుర్గా దేవిని ఆరాధిస్తే ఎక్కువ పుణ్య ఫలం దక్కుతుంది. శివుడు అంధకాసురుడితో పోరాడేటప్పుడు లోక కల్యాణం కోసం ఆయనకు సహకరించేందుకే అష్ట మాతృకల ఆవిర్భావం జరిగింది. అష్టమి నాడు కేవలం మారేడు చివుళ్ళను తిని అష్ట మాతృకలను పూజిస్తే ఆ తల్లులు కష్టకాలంలో ఆదుకుంటారు.
నవమి..
నవమి కూడా దుర్గా దేవికి ఇష్టమైనదే. ఆ రోజున దుర్గను పూజించి ఉపవాసం ఉండి కేవలం పిండిని మాత్రమే స్వీకరించి పూజ చేస్తే సంపదలు కలుగుతాయి.
దశమి..
దశమి నాడు దిక్కుల సృష్టి జరిగింది. ఇంద్రాది దేవతలు ఈ దిక్కులకు పాలకులు. దిక్పాలకుల పూజ దశమి నాడు చేస్తే పాపం నశిస్తుంది.
ఏకాదశి..
ఏకాదశి కుబేరుడు పుట్టిన తిథి. ఆ రోజున కుబేర పూజ చేస్తే ఐశ్వర్య ప్రదం.
ద్వాదశి..
ద్వాదశి విష్ణు ప్రీతికరమైన తిథి. ఈ తిథినాడే విష్ణుమూర్తి వామనుడై జన్మించాడు. ద్వాదశి నాడు ఆవు నెయ్యిని మాత్రమే స్వీకరించి వ్రతం చేస్తే పుణ్య ఫలం దక్కుతుంది.
త్రయోదశి..
ధర్ముడు పుట్టిన తిథి త్రయోదశి. ఈ తిథి నాడు ఉపవాసం ఉండి ఎవరికి నచ్చిన దైవాన్ని వారు ధర్మబద్ధంగా, శాస్త్రబద్ధంగా పూజ చేస్తే అధిక పుణ్య ఫలం దక్కుతుంది.
చతుర్దశి..
చతుర్దశి రుద్రుడి జన్మ తిథి. ఈనాడు చేసే రుద్రార్చన గొప్ప పుణ్య ఫలితాన్ని ఇస్తుంది. యవ, గోధుమల అన్నాన్ని మాత్రమే స్వీకరించి రుద్రార్చన చేయాలి.
కృష్ణ_చతుర్దశి నాడు మాస శివరాత్రి వస్తుంది. ఈ తిథి శివుడికి ఎంతో ప్రీతికరం.
అమావాస్య..
అమావాస్య పితృ దేవతలకు ఎంతో ఇష్టమైన తిథి. ఈరోజున దర్భలు, నువ్వులు నీళ్ళతో పితృదేవతలకు తర్పణమిస్తే పితృదేవతలు ఎంతో సంతోషించి ఆ తర్పణ మిచ్చిన వారికి సంతాన సౌఖ్యం అనుగ్రహిస్తారు.
పౌర్ణమి..
పూర్ణిమకు చంద్రుడు అధిపతి. పూర్ణిమ నాడు పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి చంద్రుడిని పూజ చేసిన వారికి ధన ధాన్యాలు, ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలు ప్రాప్తిస్తాయి.
ఇలా తిథులలో ఒక్కో తిథికి ఓ ప్రత్యేకత ఉంది.
ఆయా దేవతలను ఆరాధించి ప్రత్యేకమైన కోర్కెలు సాధించాలనుకున్న వారు ఆయా తిథులలో పూజలు, వ్రతాలను చేస్తే విశేష ఫలితం ఉంటుందని ఈ కథా సందర్భంలో శ్రీ మహా విష్ణువు భూదేవికి వివరించి చెప్పాడు. ఒక క్రమ పద్ధతిలో అర్చనలు, పూజలు, వ్రతాలు జరగడానికి ఇదెంతో ఉపయుక్తం అనిపిస్తుంది..
స్వస్తి..!
లోకా సమస్తా సుఖినోభవంతు..!!
                         శ్రీ మాత్రే నమః

కలి దోష నివారణ. లలితా సహస్ర నామ స్తోత్ర పారాయణం.

కలి దోష నివారణ.
లలితా సహస్ర నామ స్తోత్ర పారాయణం.
శ్రీవిద్యాం  జగతాం  ధాత్రీం  సర్గ స్థితి లయేశ్వరీమ్,
నమామి  లలితాం  నిత్యాం మహా త్రిపుర సుందరీమ్.

శ్రీవిద్య అనబడే బాలా, నవాక్షరి, పంచదశి, షోడశీ మంత్ర రూపిణిగా వుండేది, ఈరేడు లోకాల నన్నింటిని ధరించి వుండేది, సృష్టి స్థితి లయాలనే త్రికార్యములను నిర్వర్తించేది, నిత్యా అనే కళా స్వరూపిణిగా విలసిల్లుతున్నది..త్రిపుర సుందరి రూపిణీ అయిన లలితాదేవి.
బ్రహ్మాండ పురాణమున శ్రీవిష్ణు స్వరూపులైన హయగ్రీవులు లలితా దేవి యొక్క చరిత్రను అద్భుతముగా చెప్పి వున్నారు. శ్రీదేవి పుట్టుక, శ్రీపుర వర్ణన, శ్రీవిద్యా మంత్రముల విశిష్టత, అంతర్యాగ, బహిర్యాగ క్రమము, జప లక్షణము, హోమ ద్రవ్యములు, శ్రీచక్రము, శ్రీ విద్య, గురు శిష్యుల సంబంధము పలు స్తోత్రములు చెప్పివున్నారు.
లలితా దేవి యొక్క సహస్రనామములు వినడానికి నాకు యోగ్యత లేదా మరి ఎందువలన నాకు సెలవియ్యలేదు, అని ఎన్నో సంవత్సరముల నుంచి ప్రాధేయపడుచున్న  తపోధనుడైన అగస్త్యుడిని చూచి
హయగ్రీవులు ఇలా అన్నారు..
లోపాముద్రకు పతివైన ఓ అగస్త్యా...
లలితా సహస్రనామములు అతి రహస్యాలు. (అంటే ఆషామాషిగా చెప్పబడేవి కావు), అతి శక్తిమంతమైనవి, భక్తిప్రపత్తులతో అడుగుతున్నందువలన నీకు ఉపదేశము చేస్తున్నాను.
ఇవి శఠునికి, దుష్టుడికి, విశ్వాసహీనుడికి ఎప్పుడూ చెప్పకూడదు. శ్రీ మాతృ భక్తిలో పూర్ణ భక్తి గల వారికి, శ్రీవిద్య ఎరిగిన వారికి, శ్రీ దేవీ ఉపాసకులకు మాత్రమే యీ సహస్రనామములు చెప్పవలెను.
మంత్రములలో శ్రీవిద్య ఎలా ముఖ్యమైనదో,
శ్రీవిద్యలలో ఎలా కాదివిద్య ముఖ్యమో,
పురములలో శ్రీపురం ఎలా ప్రధానమైనదో,
శక్తులలో లలితాదేవి ఎలాగో,
శ్రీవిద్యోపాసకులలో పరమ శివుడు ఎలా గొప్పవాడో,
అలా సహస్రనామాలలో యీ లలితా సహస్రనామాలు బహు శ్రేష్టాలు.
ఈ నామాలు పఠించటం చేత శ్రీ లలితాదేవి బహు ప్రీతి నొందును. శ్రీచక్ర రాజములో లలితా దేవిని బిల్వ దళాలతోగాని, పద్మాలతో గాని, తులసి పత్రములతో గాని, ఈ సహస్రానామాలతో ఎవడు పూజిస్తాడో అతడికి లలితా దేవి వెంటనే మేలు చేకూర్చును.
చక్రరాజమైన శ్రీచక్రమును పూజించి, పంచదశాక్షరీ మంత్రాన్ని జపించి, తరువాత ప్రతి దినము
ఈ సహస్రానామాలతో కీర్తించవలెను. జప పూజాదులు నిర్వర్తించలేనప్పుడు కనీసం సహస్రనామ పారాయణం చేయాలి. ప్రతిదినము నిత్యకర్మల మాదిరి యీ లలితా సహస్రనామములు చేయవలెను.
శ్రీలలితా దేవి ఆజ్ఞ చేత వశిన్యాది దేవతలు యీ లలితా సహస్రనామములను స్తోత్రము చేసిరి.
సకల రోగాలను పోగొట్టి..
సకల సంపదలను..
ఇచ్చేఈ స్తోత్రమునకు సమానమైన స్త్రోత్రము ఇంతవరకు లేదు.
ఇది సమస్త అకాల మరణములను పోగొట్టి, అపమృత్యువుని దరి చేరనీయకుండా,
సకల జ్వరాలను, రోగాలను శమింపజేసి,
దీర్గాయుస్సును అందజేస్తుంది.
పుత్ర భాగ్యం లేనివారికి పుత్రులను ఇస్తుంది.
ధర్మార్ధ కామ మోక్షాలనే నాలుగు పురుషార్ధములను చేకూరుస్తుంది.
లలితాదేవి పూజాతత్పరులు ప్రతిదినం ప్రయత్న పూర్వకముగా శ్రీవిద్యా జపము చేసి, శ్రీచక్రార్చన చేసి, ఈ నామములను చదువ వలెను.
గంగ మొదలైన నదులలో కోటి జన్మలు స్నాన మాచరిస్తే ఏ ఫలం కలుగుతుందో,
కాశీ క్షేత్రంలో కోటి లింగాలను ప్రతిష్ట చేస్తే ఏ ఫలం కలుగుతుందో,
కురుక్షేత్రములో సూర్య గ్రహణ సమయంలో కోటిమార్లు దానాలు చేస్తే ఏ ఫలం దక్కుతుందో,
గంగా తీరంలో కోటి అశ్వమేధ యాగాలను చేస్తే ఏ ఫలం దక్కుతుందో..
అంతటి పుణ్యానికి కోటి రెట్లు అధిక పుణ్యము యీ సహస్ర నామాలలో ఒక్కటి పఠించినా కూడా లభిస్తుంది.

నిత్య కర్మలు చెయ్యకపోవటం చేత, నిషిద్ధ కర్మలు చెయ్యటం చేత కలిగే పాపాలు కూడా సమసిపోవటం నిశ్చయం.
సమస్త పాపాలను పోగొట్టడంలో ఒక్క సహస్రానామానికి వుండే శక్తి ఎలాంటిది అంటే, ఈ పద్నాలుగు లోకాలలోని వారంతా కలిసి చేసే మొత్తం పాపాలు కూడా యీ సహస్రనామ శక్తికి తీసికట్టే. దాని శక్తికి మించినవి ఏ మాత్రం కావు.
ప్రతి రోజు చేయక పోయినా..
పుణ్య దినములలో..
తన భార్య, తన బిడ్డల జన్మ నక్షత్రము వచ్చే రోజులలో, అష్టమి,
నవమి,
చతుర్దశి,
పౌర్ణమి,
శుక్రవారములలో ముఖ్యముగా పఠించవలెను.
పౌర్ణమి నాడు చంద్రుడిలో లలితాదేవిని ధ్యానించి పంచోపచారముల చేత పూజ చేసి, సహస్ర నామములను పఠిస్తే సమస్త రోగములు పోయి, దీర్గాయుస్సు కలుగుతుంది. ఇది కామ్య ప్రయోగ విధి.
పిల్లలు లేని గొడ్రాలకి వెన్నను ఈ నామ పారాయణ చేత మంత్రించి యిస్తే గ్రహ పీడలు తొలగి పుత్రులు కలుగుతారు.
ఈ సహస్ర నామ పారాయణుని పై ఎవరైనా అభిచారాది దుష్ట ప్రయోగములు చేస్తే, ప్రత్యంగిరా దేవి ఆ ప్రయోగములను తిరుగ గొట్టి, ఆ ప్రయోక్తలను సంహరిస్తుంది.

శ్రీదేవీ ఉపాసకులను..
ఎవరైనా దూషించినా..
నిందించినా..
అనరాని మాటలు అనినా..
అగౌరవపరచినా..
అవమానపరచినా..
క్రూర దృష్టితో చూచినా..
వాదించినా..
వాడి ధనమును దోచినా..
కృతఘ్నత చూపినా..
వాడ్ని క్షేత్రపాలకుడు అయిన శివుడు చంపుతాడు. నకులేశ్వరి వాడి నాలుకను తెగకోయును.
వాక్ స్థంభనము చేయును.
ఎవడు భక్తితో ఈ నామములను ఆరు నెలలు చేస్తాడో, అతడి యింట లక్ష్మీదేవి స్థిరముగా ఉండును.
ఎవరు శ్రీవిద్యను ఉపాసన చేస్తారో..
ఎవరు నిత్యం శ్రీచక్రాన్ని అర్చిస్తారో..
ఎవరు యీ నామాలను కీర్తిస్తారో..
వారికి దానం ప్రయత్న పూర్వకముగా ఇవ్వవలెను.
దానం చెయ్యాలను కొనేవారు, పరీక్షించి శ్రీవిద్య తెలిసిన వారికే దానం చెయ్యవలెను.
లోక వాక్యాలకంటే విష్ణు సంకీర్తనం ముఖ్యం.
అలాటి విష్ణు సహస్ర నామముల కంటే గొప్పది ఒక్క శివ నామము.
శివ సహస్ర నామాలకన్నా దేవీ నామం ఒక్కటి ఎంతో మహిమ గలది
దేవీ సహస్ర నామాలలో పది విధాలైన సహస్ర నామములు ప్రధానమైనవి. అవి..
గంగ..
భవాని..
గాయత్రీ..
కాళి..
లక్ష్మి..
సరస్వతి..
రాజ రాజేశ్వరి..
బాల..
శ్యామల..
లలిత..
వీటిలో లలితా సహస్ర నామములు అతి శ్రేష్ఠమైనవి.
అందు చేత కలి దోష నివారణ నిమిత్తం వీటిని నిత్యం పారాయణ విధిగా చేయవలెను..స్వస్తి..!!
లోకా సమస్తా సుఖినోభవంతు..!!
                        శ్రీ మాత్రే నమః

RECENT POST

జాతకంలో 12 రకాల కాలసర్ప యోగాలు - పోరాటాలను అధిగమించి విజయం సాధించే సూత్రం............!! ​మనలో చాలా మంది 'కాలసర్ప దోషం' అనే పదాన్ని వ...

POPULAR POSTS