Thursday, July 12, 2018

తెలుగు వివాహంలో ముఖ్యమైన సంప్రదాయములు

తెలుగు వివాహంలో ముఖ్యమైన సంప్రదాయములు
పెళ్లి అంటే నూరేళ్ళ పంట అని మనకు వూహ తెలిసిన దగ్గర నుంచి మనం అంటున్న- వింటున్న మాట ….
అసలు పెళ్లి అంటే ఎలా ఉండాలి ఎలా జరగాలి ? ఆ పెళ్లి సంప్రదాయం గురించి తెలుసుకుందామా !!
తాటాకులతో పందిరి వేయాలి …
మామిడి ఆకులతో తోరణాలు కట్టాలి …
అరిటాకుల్లో భోజనాలు పెట్టాలి …
పెళ్ళంటే జన్మకి ఒకే సారి జరిగే పండుగ …
రెండు మనసులు జీవితకాలం కలిసుండటానికి వేసే తొలి అడుగు ….
రెండు కుటుంబాలు జీవిత కాలం రక్త సంబంధీకుల్లా కలిసి పోయే ఒక మహత్తర ఘట్టం …
కొన్ని వేల మంది బంధుమిత్రులు  దశాబ్దాల తర్వువాత ఈ వేడుకలో కలిసి చెప్పుకునే ఆత్మీయ ముచ్చట్లు ….
ఇది కదా నిజమయిన తెలుగింటి పెళ్లి అంటే
మరి ఇప్పుడు మళ్ళీ ఆ పెళ్ళిళ్ళ పండుగ సీజన్ వచ్చేసింది .అదేనండి శ్రావణమాసం వచ్చేసింది మరి పెళ్లిలో జరిగే కొన్ని ముఖ్యమైన అంశాలు మనకు ఎంతవరకు తెలుసు ఇంతకు పెళ్ళిలో ఎన్ని ముఖ్యమైన ఘట్టాలు ఉంటాయి !…
అందులో కొన్ని మనం తెలుసుకుందాం …
తెలుగు వివాహం లోని ముఖ్యమైన అంశాలు :-
1) పెళ్ళి చూపులు 2) నిశ్చయ తాంబూలాలు 3) స్నాతకం 4) కాశీ యాత్ర 5) వర పూజ-ఎదుర్కోల్లు 6) గౌరీ పూజ 7) మంగళ స్నానాలు 8) కన్యా వర్ణం 9) మధుపర్కాలు 10) యజ్నోపావితాధారణ 11) మహసంకల్పం 12) కాళ్ళు కడగటం 13) జీలకర్ర బెల్లం నెత్తిన పెట్టటం 14) కాళ్ళు తొక్కించడం 15) కన్యాదానం 16) స్వర్ణజలాభి మాత్రాణం 17) యోక్త్ర బంధనం 18) మంగళ సూత్రధారణ 19) తలంబ్రాలు 20) బ్రహ్మ ముడి 21) ఉంగరాలు తీయడం 22) సప్తపది-పాణిగ్రహణం 23) ప్రధాన హోమం 24) సన్నికల్లు తొక్కడం 25) లాజా హోమం 26). స్థాలిపాకం 27). నాగవళ్లి 28). సదస్యాం 29). నల్లపూసలు కట్టడం 30). అరుంధతి దర్శనం 31) ఉయ్యాల-బొమ్మని అప్పచెప్పటం 32) అంపకాలు 33) గృహప్రవేశం 34) భాసికాలు 35) మెట్టెలు ధారణ.  పైన ఉన్న వాటిలో కొన్ని ముఖ్యమైన అంశాలను తెలుసుకుందాం. 
పెళ్ళి చూపులు:
పెళ్ళికి మొట్ట మొదటి అడుగే ఈ పెళ్ళి చూపులు. ఈ పెళ్ళి చూపులు హిందు మత సాంప్రదాయం ప్రకారం చూపులు అమ్మాయి వాళ్ళ ఇంటి వద్ద జరుగుతాయి. పెళ్ళి కొడుకు తరుపువారు 3 లేదా 5 మందితొ అమ్మాయి వాళ్ళ ఇంటికి వస్తారు. అమ్మాయి ని తయారు చేసి అబ్బాయి తరుపున వారికి చూపిస్తారు. తరువాత ఇద్దరికి అమ్మాయికి అబ్బాయికి నచ్చితే పెద్దవారు కట్న, కానుకలు మాట్లాడతారు. ఈ కట్నాలు కూడ కుదిరిన పిదప తరువాత పెళ్ళి జరగడానికి తొలి అడుగు పడుతుంది.
నిశ్చితార్థం :
వివాహంలో ముఖ్యమైన ఘట్టాలలో మొదటిది వాగ్ధానం. అంటే పెళ్ళి ఖాయపరచుకోవడం (నిశ్చితార్థం). తర్వాత వర-వరణం. అంటే: వరుడిని లాంఛనప్రాయంగా అంగీకరించడం. నిశ్చితార్థానికే మరోపేరు “నిశ్చయ తాంబూలం”. వైదిక మంత్రాల మధ్య వివాహ ప్రక్రియకు పెద్దల ఆశీస్సులు తీసుకోవడానికే ఈ కార్యక్రమం. అందరికీ ఆమోదయోగ్యమైన శుభ ముహూర్తంలో పురోహితుడు బంధుమిత్రుల సమక్షంలో పెళ్ళి ముహూర్తాన్ని లగ్న పత్రికగా రాయించిన తదుపరి, వధూవరుల తల్లి-తండ్రులు లగ్న పత్రికలు, తాంబూలాలు మార్చుకుంటారు. పెళ్ళి ఒప్పందం లాంటి ఈ వేడుక వధువు ఇంటిలోగాని, వారేర్పాటుచేసుకున్న వసతి గృహంలోగాని జరుగుతుంది. దీన్నే ఆంగ్లంలో “ఎంగేజ్ మెంట్” అంటున్నారు. కొందరు ఇటీవలి కాలంలో ఈ తంతును పెళ్లికంటే ఘనంగా జరుపుకుంటున్నారు. నిశ్చితార్థం రోజున అమ్మాయి, అబ్బాయి ఉంగరాలు మార్చుకోవటంతో సగం పెళ్ళి జరిగినట్టు గానే భావిస్తారు. సాంప్రదాయ బద్ధంగా, వధూవరుల తల్లితండ్రుల మధ్యన ఇచ్చి-పుచ్చుకోవడాలు అందరి ఇళ్లల్లో ఒకే రకంగా వుంటాయి.
స్నాతకం :
పెళ్లిరోజుకు ఒకరోజు ముందర “స్నాతకం” అనే ముఖ్యమైన కార్యక్రమం జరుపుకోవడం ఆచారం. పెళ్ళి కుమారుడి ఇంటిలో గాని, కళ్యాణ మండపంలో గాని లేదా విడిదిలో గాని పురోహితులు స్నాతక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. విఘ్నేశ్వర పూజతో మొదలుపెట్టి, అన్ని ప్రాయశ్చిత్తాల కోసం, శరీర శుద్ది కోసం బ్రాహ్మణులు వరుడితో గోత్ర ప్రవరలు చేయిస్తారు. స్నాతకం అనే ఈ “సంస్కారం”, ప్రధానంగా, వరుడిని “బ్రహ్మచర్యం” నుండి “గృహస్థాశ్రమం” స్వీకరించడానికి సిద్ధంచేస్తున్న కార్యక్రమం. గురువు (ఇక్కడ పురోహితుడు) ఆదేశంతో-అంగీకారంతో “గృహస్థాశ్రమం” స్వీకరించే ఏర్పాటిది. ఆ సమయంలో గురువు చేయాల్సిన హిత బోధ తైత్తిరీయోపనిషత్తులోని “సత్యాన్న…” అన్న ఒక శ్లోక రూపంలో వుంటుంది. “సత్యం విషయంలోను, ధర్మం విషయంలోను, తెలివితేటల విషయంలోను, పొరపాటు పడవద్దు” అన్న ఆదేశం అది. తల్లిని, తండ్రిని, అతిథిని దేవుడులా భావించాలని చెప్తారు. సమాజ శ్రేయస్సే ధ్యేయంగా జీవించమని, దానం చేసేటప్పుడు శ్రద్ధగా చేయమని, తాహతుకు మించి దానం చేయొద్దనీ-ఇంతకంటె ఎక్కువ దానం చేయలేకపోతున్నందుకు సిగ్గుపడుతున్నానని భావించమనీ బోధిస్తాడు పురోహితుడు. పెద్దవారి నుంచి ధర్మ సూక్ష్మాలను తెలుసుకొని-వారనుసరించిన మార్గాన్ని ఎంచుకోమని అంటూ, “వరుడికి శుభం కలుగుగాక” అని ఆశీర్వదించి గురువు వరుడిని గృహస్థాశ్రమానికి సిద్ధం చేస్తాడు.
జీలకర్ర, బెల్లము :
శుభముహూర్త సమయమున వధూవరుల మధ్య తెరతొలగిస్తారు. ఒకరినొకరు చూసుకున్న తరువాత జీలకర్ర, బెల్లము కలిపిన ముద్దను ఒకరి తలపై ఒకరు నిలిపి చేతితో తాకుతారు. పూర్వకాలములో పదార్ధ విజ్ఞాన శాస్త్రవేత్తలు జీలకర్ర బెల్లము కలిపి నూరినా, నలిపినా ధన సంజ్ఞక విద్యుత్తు ఉత్పత్తి అగునని వర్ణించారు. జీలకర్ర బెల్లముతో ఘర్షణ చేస్తే అలాగే జరుగునని నిరూపించ బడింది. వేద కల్పము తెలిసిన పెద్దలు దీనిని గ్రహించి వధూవరుల పరస్పర జీవశక్తుల ఆకర్షణకు తోడ్పడునట్లుగా జీలకర్ర బెల్లము తాకుట ఒక ఆచారముగా చేసారు. దీనివలన దృష్టి కలుపుట, మనస్సు సంకల్పించుట సంభవించునని తెలుస్తుంది. అలాగే శ్రాస్త్రరీత్యా ఈ మీశ్రమానికి బ్రహ్మరంద్రాన్ని తెరిపించే శక్తి ఉంతుందట!.
మంగళసూత్రధారణ :
వివాహ సమయం నుండి స్త్రీలు మంగళ సూత్రం ధరించడం భారతీయ సంప్రదాయం. ఈ ఆచారం ఈనాటిది కాదు. పెళ్ళినాడు వరుడు వధువుకు తాళికట్టే సాంప్రదాయం ఆరో శతాబ్ధంలోనే ఆరంభమయింది. మంగళ సూత్రం అనే శబ్దం సంస్కృతం నుండి పుట్టింది. సంస్కృతంలో ‘మంగళ’ అంటే శోభాయమానం, శుభప్రదం అనే అర్ధాలు కలవు. సూత్రం అంటే తాడు, ఆధారమైనది అని అర్ధాలు కలవు. సాధారణంగా మంగళసూత్రాన్ని 108 సన్నని పోగులు, దారాలు కలిపి దానికి పసుపు రాసి తయారు చేస్తారు. ఇలా కలపబడిన తొమ్మిది లేదా పదకొండు కలిపికూడా కొందరు తాళిని తయారు చేస్తారు.
తలంబ్రాలు :
మంగళ సూత్రధారణ పూర్తి అయిన తరువాత తలంబ్రాల అక్షతలు తల మీదుగా పోసుకొంటారు. దీనినే అక్షతారోహణం అంటారు. ‘క్షత’ అంటే విరుగునది- ‘అక్షత’ అంటే విరగనిది. అనగా విడదీయరాని బంధము కావలెనని భావము. తలన్+బ్రాలు అంటే తల నుండి క్రిందికి జారునవి అని అర్ధం….
బాసికం :
వివాహంలో సుముహర్తం ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. సరిగ్గా ఈ ముహూర్త సమయంలో వధువు కనుబొమ్మల స్థానాన్ని వరుడు చూడాలి. అలాగే వధువు కూడా అంతే చేయాలి. అయితే పెళ్లి సంబరంలో ఉంది మరిచిపోతారు. అందుకే అది గుర్తు ఉండే లాగ వరుడు, వధువు నుదుట ఈ బాసికాలు కడతారు.
మెట్టెలు :
కాలి బొటనవేలు పక్కనున్న వేలు స్త్రీలకు ఆయువుపట్టు వంటిది. దాని నుండి విద్యుత్ ప్రవహిస్తూ ఉంటుంది . కాబట్టి ఆ వేలు నేలకు తగలడం మంచిది కాదు. అలా తగలకుండా ఉండడానికే మెట్టెలు పెట్టుకునే సంప్రదాయం ఏర్పడిందని పండితులు అంటారు. దీనికంతా కారణం ఓ పురాణ గాధ. దక్ష ప్రజాపతి తన అల్లుడైన శివుడిని అవమానిస్తాడు. తన భర్తకు జరిగిన అవమానాన్ని చూసి కోపముగా మారిన ద్రాక్షాయని, తన కాలి వేలుని భూమిపై రాసి నిప్పు పుట్టించి, అందులో తాను దహనమయ్యిందని పురాణాలు చెబుతున్నాయి. అప్పటి నుండి ఈ మెట్టెల సంస్కృతి మొదలయ్యిందని అనుకుంటూ ఉంటారు 
ఏడడుగులు :
మొదటి అడుగు అన్నవృద్ధికి, రెండవ అడుగు బల వృద్ధికి, మూడవ అడుగు ధన వృద్ధికి, నాలుగవ అడుగు సుఖ వృద్ధికి, ఐదవ అడుగు ప్రజా పాలనకు, ఆరవ అడుగు దాంపత్య జీవితానికి, ఏడవ అడుగు సంతాన సమృద్ధి కి వేస్తారు. ఈ ఏడడుగుల ఘట్టం పెళ్లి వేడుకలో చాలా ముఖ్యమైనది

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS