Thursday, July 12, 2018

తిధులలో చేయవలసిన దేవతావ్రతాలు.పూజలు

తిధులలో చేయవలసిన దేవతావ్రతాలు.పూజలు
ఏ దేవతలను ఏ తిథినాడు ఆరాధిస్తే ఎంత మంచి పుణ్య ఫలం కలుగుతుంది? అనే ప్రశ్న చాలా మందికి ఉదయిస్తుంటుంది. ఈ ప్రశ్నకు సమాధానం వరాహ పురాణంలో కనిపిస్తుంది. అందులో వరాహమూర్తిగా ఉన్న శ్రీమహావిష్ణువు స్వయంగా తిథుల విశేషాలను భూదేవికి వివరించి చెప్పాడు.
పాడ్యమి..
దేవతలలో ముందు పుట్టిన వాడు అగ్ని.
కనుక తిథులలో మొదటిదైన..పాడ్యమి నాడు అగ్నిని ఆరాధిస్తే పుణ్య ఫలం దక్కుతుంది. భక్తులు ఆ రోజున పాలు మాత్రం తాగి ఉపవాసం ఉండి అగ్నిని ఆరాధించాలి.
విదియ..
విదియ నాడు అశ్వనీ దేవతలను ఆరాధించాలి.
ఈ తిథి నాడే అశ్వనీ దేవతలు జన్మించారు. సంవత్సర కాలం పాటు ఆ దేవతలను ఉద్దేశించి విదియ వ్రతం నియమ నిష్టలతో చేస్తే అందమైన రూపం కలుగుతుంది.
తదియ..
తదియ నాడు గౌరీ దేవిని ఆరాధించాలి. ఇది ప్రత్యేకంగా స్త్రీల కోసం ఏర్పాటైంది. తదియ నాడు గౌరీ కల్యాణం జరిగిన కారణంగా గౌరీ దేవికి ఈ తిథి అంటే ఎంతో ఇష్టం.
చవితి..
చవితి వినాయకుడు పుట్టిన తిథి. ప్రత్యేకంగా వినాయక చవితి నాడే కాక ప్రతి శుద్ధ చవితి నాడు వినాయక పూజ చేయవచ్చు.
పంచమి..
పంచమి నాడు నాగులు జన్మించాయి. అందుకే నాగ దేవతకు పంచమి తిథి అంటే ఎక్కువ ఇష్టం. ప్రతి పంచమి నాడు పుట్టలో పాలు పోసి సంవత్సర కాలం పాటు నాగులను పూజిస్తూ ఆ పంచమి నాడు పులుపు లేని భోజనం చేస్తే నాగుల వల్ల భయం ఉండదు. నాగుల చవితి, నాగ పంచమి అనేవి రెండూ నాగదేవతకు ఇష్టమైనవే.
షష్టి...
షష్ఠి కుమారస్వామి జన్మ తిథి. ఆనాడు అర్చన చేస్తే కుమార స్వామికి ప్రీతికరం.
సప్తమి..
సప్తమి సూర్యుడి జన్మ తిథి. రథ సప్తమి నాడే కాక ప్రతి శుద్ధ సప్తమి నాడు సూర్యుడిని ఆరాధించి క్షీరాన్నాన్ని నివేదిస్తే ఆయురారోగ్యాలు కలుగుతాయి.
అష్టమి..
అష్టమి దుర్గా దేవి నుంచి అష్టమాతృకలు ఆవిర్భవించిన తిథి అష్టమి. అందుకే ఆనాడు అష్ట మాతృకలను, దుర్గా దేవిని ఆరాధిస్తే ఎక్కువ పుణ్య ఫలం దక్కుతుంది. శివుడు అంధకాసురుడితో పోరాడేటప్పుడు లోక కల్యాణం కోసం ఆయనకు సహకరించేందుకే అష్ట మాతృకల ఆవిర్భావం జరిగింది. అష్టమి నాడు కేవలం మారేడు చివుళ్ళను తిని అష్ట మాతృకలను పూజిస్తే ఆ తల్లులు కష్టకాలంలో ఆదుకుంటారు.
నవమి..
నవమి కూడా దుర్గా దేవికి ఇష్టమైనదే. ఆ రోజున దుర్గను పూజించి ఉపవాసం ఉండి కేవలం పిండిని మాత్రమే స్వీకరించి పూజ చేస్తే సంపదలు కలుగుతాయి.
దశమి..
దశమి నాడు దిక్కుల సృష్టి జరిగింది. ఇంద్రాది దేవతలు ఈ దిక్కులకు పాలకులు. దిక్పాలకుల పూజ దశమి నాడు చేస్తే పాపం నశిస్తుంది.
ఏకాదశి..
ఏకాదశి కుబేరుడు పుట్టిన తిథి. ఆ రోజున కుబేర పూజ చేస్తే ఐశ్వర్య ప్రదం.
ద్వాదశి..
ద్వాదశి విష్ణు ప్రీతికరమైన తిథి. ఈ తిథినాడే విష్ణుమూర్తి వామనుడై జన్మించాడు. ద్వాదశి నాడు ఆవు నెయ్యిని మాత్రమే స్వీకరించి వ్రతం చేస్తే పుణ్య ఫలం దక్కుతుంది.
త్రయోదశి..
ధర్ముడు పుట్టిన తిథి త్రయోదశి. ఈ తిథి నాడు ఉపవాసం ఉండి ఎవరికి నచ్చిన దైవాన్ని వారు ధర్మబద్ధంగా, శాస్త్రబద్ధంగా పూజ చేస్తే అధిక పుణ్య ఫలం దక్కుతుంది.
చతుర్దశి..
చతుర్దశి రుద్రుడి జన్మ తిథి. ఈనాడు చేసే రుద్రార్చన గొప్ప పుణ్య ఫలితాన్ని ఇస్తుంది. యవ, గోధుమల అన్నాన్ని మాత్రమే స్వీకరించి రుద్రార్చన చేయాలి.
కృష్ణ_చతుర్దశి నాడు మాస శివరాత్రి వస్తుంది. ఈ తిథి శివుడికి ఎంతో ప్రీతికరం.
అమావాస్య..
అమావాస్య పితృ దేవతలకు ఎంతో ఇష్టమైన తిథి. ఈరోజున దర్భలు, నువ్వులు నీళ్ళతో పితృదేవతలకు తర్పణమిస్తే పితృదేవతలు ఎంతో సంతోషించి ఆ తర్పణ మిచ్చిన వారికి సంతాన సౌఖ్యం అనుగ్రహిస్తారు.
పౌర్ణమి..
పూర్ణిమకు చంద్రుడు అధిపతి. పూర్ణిమ నాడు పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి చంద్రుడిని పూజ చేసిన వారికి ధన ధాన్యాలు, ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలు ప్రాప్తిస్తాయి.
ఇలా తిథులలో ఒక్కో తిథికి ఓ ప్రత్యేకత ఉంది.
ఆయా దేవతలను ఆరాధించి ప్రత్యేకమైన కోర్కెలు సాధించాలనుకున్న వారు ఆయా తిథులలో పూజలు, వ్రతాలను చేస్తే విశేష ఫలితం ఉంటుందని ఈ కథా సందర్భంలో శ్రీ మహా విష్ణువు భూదేవికి వివరించి చెప్పాడు. ఒక క్రమ పద్ధతిలో అర్చనలు, పూజలు, వ్రతాలు జరగడానికి ఇదెంతో ఉపయుక్తం అనిపిస్తుంది..
స్వస్తి..!
లోకా సమస్తా సుఖినోభవంతు..!!
                         శ్రీ మాత్రే నమః

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS