కొన్ని విశిష్టమైన శివ క్షేత్రాలు:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోగల 'ప్రకాశం' జిల్లా కొత్తపల్లి గ్రామానికి 5 కి.మీ. నడక దూరంలో ఈ క్షేత్రము కలదు. ఎక్కడ చూసినా కోనేరులు, శివ లింగాలు కనిపించే ఈ కొనలో ఒకే రాతిలో చెక్కబడిన 8 శివాలయాలు క్రీ.శ. 7, 8 శతాభ్దాలలో నిర్మించబడినట్లు చరిత్ర. పురాణాలలో వర్ణించిన శివుడు తన 8 రూపాలకు సంకేతంగా శశినాగ, రుద్ర, విశ్వేశ్వర, నగరికేశ్వర, భర్గేశ్వర, రామేశ్వర, మల్లిఖార్జున, పక్షఘాతక లింగాల రూపంలో దర్శనమిస్తాడు.
ధర్మస్థల ::
కర్నాటక రాష్ట్రంలో గల 'ఉడిపి' నుండి 120 కి.మీ. దూరంలో ఈ క్షేత్రం కలదు. ఇది మంగుళూరు నుండి 75 కి.మీ. దూరంలో ఉన్నది. నేత్రావతి నదీ తీరంలోనున్న ఇచ్చటి ఆలయం పేరు 'మంజునాథేశ్వరాలయం'. క్రీ.పూ. 10వ సంవత్సరంలో ఈ ఆలయం నిర్మించబడింది.ఈ ఆలయంలో అసత్యం పలికే విపత్తు కలుగుతుందనే నమ్మకం వలన కోర్టులో తెగని కేసులు స్వామి ఎదుట పరిష్కారం పొందుతారు. ఆలయంలో మూలవిరాట్ ను జైనులు ప్రతిష్ఠించారు. 800 సంవత్సరాల నుండి నిత్యాన్నదానం ఇచ్చట జరుగుతుంది.
తంజావూరు ::
తమిళనాడు రాష్ట్రంలో గల 'చెన్నై' నుండి 335 కి.మీ. దూరంలో గల 'తంజావూరు' అద్భుత క్షేత్రం. ఇచ్చటి ఆలయం పేరు బృహదీశ్వరాలయం. ఇది 10వ శతాబ్దంలో రాజరాజచోళుడు అనే చక్రవర్తిచే నిర్మించబడినది. ప్రపంచంలోని ఏ ఆలయానికి ఇంత ఎత్తయిన ప్రాకారాలు లేవని అంటారు. ఈ ప్రాకారం పొడవు 793 అడుగులు, వెడల్పు 393 అడుగులు, 13 అంతస్తులుగా నిర్మించిన 216 అడుగుల ఎత్తుగల ఆలయ గోపురం పై 80 టన్నుల రాయిని శిఖరాగ్రంగా ఆ రోజుల్లో 4 మైళ్ళ దూరం నుండి ఏటవాలు రాళ్ల వంతెనపై దొర్లించుకొచ్చి నిలిపారట. ఆలయం లోపల ఎత్తయిన వేదికపై 13 అడుగుల ఎత్తుగల శివలింగం ఉంటుంది. ఆలయానికి కొంచెం దూరంలో రాజరాజచోళుని కుమారుడు నిర్మించిన గంగైకొండ చోళపురంలో శివాలయం అద్భుత శిల్పకళతో ఈ ఆలయంతో పోటీ పడుతుంది. ఈ ఆలయం 'యునెస్కో' వారిచే ప్రపంచ సంస్కృతీ చిహ్నంగా గుర్తింపు పొందినది.
దుగ్ధేశ్వరనాథ్ ::
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గల 'గోరఖ్ పూర్-బటని' మార్గంలోనున్న 'గౌరీబజార్' స్టేషన్ నుండి 15 కి.మీ. దూరంలో గల ఈ క్షేత్రం రుద్రపురం అనే గ్రామంలో ఉంది. ఈ ఆలయంలోని శివలింగము 12 జ్యోతిర్లింగాలలో ఒకటయిన ఉన్నయినిలోని మహాకాళేశ్వర లింగానికి ఉపజ్యోతిర్లింగం. ఆలయంలోని శివలింగం అప్పుడప్పుదు తనకు తానుగా కదులుతుంది. ఒక్కక్కసారి రోజంతా కదులుతుంది. హఠాత్తుగా ఆగిపోతుంది. అప్పుడు లింగాన్ని గట్టిగా పట్టీ ఉంచినప్పటికీ కదలిక లేకపోవటం ఆశ్చర్యం.
తలకాడు ::
(1)
కర్నాటక రాష్ట్రంలో గల 'మైసూర్' నుండి 60 కి.మీ. దూరంలో గల క్షేత్రం ఇది. కావేరీ నదీ తీరంలోనున్న ఇచ్చటి ఆలయం పేరు 'వైద్యేశ్వరాలయం'. 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయం ఇసుకతో కప్పబడి 1978, 1999, 2002 సంవత్సరాలలో కార్తీకమాసం 5 సోమవారాలలో దర్శనం ఇచ్చింది. మరలా పునర్దర్శనం క్రీ.శ. 2014లో అంటున్నారు. ఈ విధంగా ఇచ్చటి లింగాకారం 12 సంవత్సరాల కొకసారి కార్తిక మాసంలో 5 సోమవారాలు పడినపుడు మాత్రమే దర్శనం ఇస్తుంది. అప్పుడు జరిగే 'పంచలింగ దర్శనం' అనే మహోత్సవానికి లక్షల కొలదీ జనం వస్తారు.
(2)
కర్ణాటక రాష్ట్రంలోని 'మైసూర్' నుండి 600 కి.మీ. దూరంలో గల క్షేత్రం 'తలకాడు'. ఈ ఆలయం పేరు 'పాతాళేశ్వరాలయం'. క్రీ.శ. 1004 వరకు పాలించిన గంగవంశ రాజుల కాలం నుండి ఈ ఆలయ ఉంది. కాల ప్రవాహంలో ఇసుకతో కప్పబడింది. పురావస్తు శాఖవారి దయ వలన బయటపడింది. నేల మట్టంకన్నా చాలా లోతుగా ఉన్న ఆలయంలోని శివలింగం ఉదయం ఎరుపు, మధ్యాహ్నం నలుపు, సాయంకాలానికి తెలుపు రంగులోకి మారుతూ కనిపిస్తుంది.
మహేశ్వర్ ::
మధ్యప్రదేశ్ రాష్త్రంలో 'ఇండోర్' నుండి 100 కి.మీ. దూరంలో గలదు ఈ క్షేత్రం. ఇచ్చటి ఆలయంపేరు 'రాజరాజేశ్వరాలయం'. పురాణాలలో 'మాహిష్మతి'గా పిలువబడే ఈ క్షేత్రం అనడు కార్తవీర్యార్జునుని రాజధాని. అయన సహస్ర బాహువులకు ప్రతీకలుగా 'సహస్రధార'గా నర్మదానది ప్రవహిస్తుంది. ఇండోర్ రాణి అహల్యాబాయి నిర్మించిన ఏకశిలా నిర్మిత ఆలయాల సముదాయం 'అహల్యేశ్వరాలయం' చూడవలసినది. అనేకమైన ప్రాచీన మందిరాలు విభిన్న దేవతలకు ఉన్నాయి. 108 దేవీ పీఠాలలఓ ఒకటైన 'స్వాహాదేవి' మందిరం ఉంది. రాజరాజేశ్వరాలయంలో పెద్ద శివలింగంతో పాటు 8 లోహాలతో నిర్మించబడిన శివపార్వతుల విగ్రహం ఉంది. వాటికీ ఎదురుగా 1000 సంవత్సరాల క్రిందటి అఖండదీపం దర్శనం ఇస్తుంది.
కోటప్పకొండ ::
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 'గుంటూరు' నిల్లాలోని నరసరావుపేట నుండి 11 కి.మీ. దూరంలో ఈ క్షేత్రం కలదు. శివుని దక్షిణామూర్తి రూపానికి గల ఏకైక ఆలయం. కనుక ఇచ్చట అమ్మవారు ఉండరు. స్వామికి ఉత్సవాలు ఉండవు. త్రికూట క్షేత్రంలో స్వయంభూ శివలింగం. కొండమీద ఆలయం ఉంది. ఆలయం వరకు బస్సు సౌకర్యం కలదు. బ్రహ్మ, విష్ణు, రుద్ర శిఖరాలు మూడింటిమీద 3 శివాలయాలు ఉన్నాయి. వేలకొలది ప్రభలు మొక్కుబడిగా శివరాత్రికి వస్తాయి.
సురుటుపల్లి :
:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా నందు గల 'సత్యవేడు'కు దగ్గరలో గల క్షేత్రం ఇది. అరుణానదీ తీరంలో గల ఈ క్షేత్రంలోని ఆలయం పేరు 'పల్లికొండేశ్వరాలయం'. శివశైవ క్షేత్రంగా ఇది ప్రసిద్ధి చెందినది. ఈ క్షేత్రంలో గరళం త్రాగిన శివుడు పరుండి యుంటే బయట ఏకాంతంగా నంది ఉంటుంది. స్వయంభూ శివలింగంతో పాటు స్వయంభూ గణపతి విగ్రహం కలదు. స్కాంద పురాణ శివరహస్య ఖండంలో శివుడు హాలాహలం మ్రింగి విశ్రమించి నందున 'కాలకూటానన'క్షేత్రంగా ఇది వర్ణించబడింది. నిదురించే శివుని చుట్టూ బ్రహ్మాది దేవతలు అందరూ ఉన్నారు.
పోండా ::
గోవా రాష్ట్ర రాజధాని 'పానాజీ' నుండి 22 కి.మీ. దూరంలో గల ఈ క్షేత్రంలో ఆలయం పేరు మంగేష్ ఆలయం. ఈ ఆలయం 16వ శతాబ్దంలో పునఃప్రతిష్ఠ చేయబడింది. అందమైన సరస్సు తీరానున్న ఈ ఆలయం బంగారు కలశంతో ధర్శనమిస్తుంది. ఇండో-పోర్చుగీసు-ఇస్లాం నిర్మాణ శైలీ విన్యాసాలు ఈ ఆలయంలో గోచరిస్తాయి. ప్రతి సభా మంటపం, దీప స్తంభం ఆలయ శోభను ఇనుమడింపజేస్తాయి. గర్భాలయంలో రజత తోరణం మధ్య మంగేష్ స్వర్ణ ప్రతిమ కిరీటంపై నరసింహ స్వామి ఉగ్రరూపం దర్శనమిస్తుంది. శాలువాలతో, ఆభరణాలతో, పుష్పాలతో, స్వర్ణ ప్రతిమను నిత్యం అలంకరిస్తారు. ఆలయంలోని ఈ ప్రాచీన శివలింగం క్రీ.శ. 1560 వరకు 'కుశస్థలి'లో గల ఆలయంలో పూజలందుకునేది.
ఖాట్మండు ::
(1)
నేపాల్ దేశ రాజధాని అయిన 'ఖాట్మండు' క్షేత్రంలోని ఒక ఆలయం పేరు 'విశ్వరూప మందిరం'. ఇది ప్రసిద్ధి చెందిన పశుపతినాథ దేవాలయానికి దగ్గరలో ఉంది. ఈ మందిరానికి వెళ్ళే దారిలో ఎడమవైపున 11 శివాలయాలు ఉన్నాయి. అతి ప్రాచీనమైన ఈ ఆలయం విశాలమైన ప్రాంగణం కలిగి, గర్భాలయ, అంతరాలయాలను కలిగి ఉంది. అంతరాలయం చుట్టూ ఎత్తైన గోడ కలిగి ప్రదక్షిణానికి అనుకూలంగా ఉంది. ప్రధానాలయంలో శివుడు వేయి చేతులతో పార్వతిని ఆలింగనం చేస్తున్నట్లు సుమారు 50 అడుగు విగ్రహం ఉంది. ఈ ఆలయాన్ని ఉ. 5.00 గం.లకు, సాయంకాలం 7.00 గం.లకు మాత్రమే తెరుస్తారు. ఆ సమయంలో సుమారు అరగంట మాత్రమే దర్శనం ఉంటుంది.
(2)
శివుని అష్టమూర్తి క్షేత్రాలలో యాజమాన లింగంగా ప్రసిద్ధినొందినది పశుపతినాథలింగం నేపాల్ లోని ఖాట్మండులో కలదు. నేపాల్ లోని అత్యంత పవిత్రమైన 'ఖాట్మండు' ప్రదేశం;హిందూధర్మానికి, సంస్కృతికి పట్టుకొమ్మగా నిల్చింది. ఇచ్చటి దేవత పశుపతినాథ్, అమ్మవారు గుహ్యేశ్వరి (పార్వతి). ఖట్మాడులో విరాజిల్లుతున్న ఈ జ్యోతిర్లింగం 'పశుపతి' అనే నామంతో ప్రసిద్ధి పొందినది. ఇది శివుని అష్టమూర్తులలో 'యాజమాన' మూర్తిగా కూడా కొలువబడుతున్నది. మహేశ్వరునకు ఉన్న అనేక నామములలో పశుపతి ఒకటి.
తిరువల్లం ::
తమిళనాడు రాష్ట్రంలో 'రాణిపేట'కు మరియు చిత్తూరుకు దగ్గరలో ఉంది. ఈ క్షేత్రంలోని ఆలయం పేరు 'బిల్వనాథేశ్వరాలయం'. దీనిని 5వ శతాబ్దంలో పల్లవరాజులు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. 1500 ఏళ్ళనాటిదిగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలోని విగ్రహం క్రీ.పూ. 794లో రూపొందించబడినదని శాసనం. పల్లవ రాజులు 850 బి.సి. లో గర్భగుడిపై విమాన గోపురాన్ని నిర్మించారు. చోళుల కాలంలో 1000 స్తంభాల మండపం నిర్మించబడింది. ఇక్కడ ఉన్న బిల్వవృక్షంలోని ఆకులతో శివుని విగ్రహానికి నిత్యపూజలు చేస్తారు. ఆ ఆకులను తింటే రోగాలు నయమవుతాయని స్థానికుల నమ్మకం.
నత్తరామేశ్వరం ::
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లా 'అత్తిలి' నుంది 6 కి.మీ. దూరంలో గల క్షేత్రమిది. గొనని నదీ తీరాన ఉన్న ఈ క్షేత్రంలోని ఆలయం పేరు 'రామలింగేశ్వరాలయం'. ఆలయంలోని శివలింగాన్ని పరుశురాముడు ప్రతిష్టించినట్లు చరిత్ర. ఈ ఆలయంలోని లింగం ఎప్పుడూ నీటిలో మునిగి నత్తల సంపుటితో కుడి ఉంటుంది. లింగంపై వ్రేలి ముద్రలుగా నిలువు చారలు ఉంటాయి.
కాళేశ్వరం ::
అంధ్రప్రదేశ్ రాష్త్రంలో 'కరీంనగర్' జిల్లా కేంద్రం నుండి 130 కి.మీ. దూరంలో గల క్షేత్రం ఇది. గోదావరి, ప్రణీత, సరస్వతుల త్రివేణీ సంగమంలో ఉన్న ఈ క్షేత్రంలోని ఆలయం పేరు 'కాళేశ్వరాలయం'. వేంగి రాజైన విష్ణువర్ధనుడు నిర్మించినట్లు చరిత్ర. ఇచ్చటి ఆలయంలో ఒక స్వయంభూ లింగం ముక్తీశ్వరుడు, రెండవది శివుని ఆదేశం ప్రకారం యమధర్మరాజే లింగంగా వెలిసిన కాళేశ్వరుడు అనే రెండు లింగములు ఒకే పానవట్టంపై ఉండటం విశేషం. ఈ ఆలయంలో ప్రాకారం క్రింద వివిధ దిక్కులలో వివిధమైన ఆలయాలుంటాయి. ఆలయం పరిసరాలలో ఉన్న 'యమకోణం' చూచి తీరవలసింది.
పృధుదక్ ::
హర్యానా రాష్త్రంలో కురుక్షేత్రం నుండి 50 కి.మీ. దూరంలో గణ పిహోవా స్టేషను నుండి 4 కి.మీ. దూరంలో ఈ క్షేత్రం కలదు. ఇక్కడి ఆలయం పేరు 'సంగమేశ్వరాలయం'. దీనిని 'అరుణాయి మందిరం' అని కూడా పిలుస్తారు. భూగర్భంలో ఎంతలోతు వరకుందో తెలియని స్వయంభూ లింగం గల ఈ ఆలయం అరుణ, సరస్వతి నదుల సంగమ స్థలంలో ఉంది. ఈ ఆలయంలోని శివలింగంను చుట్టుకొని ఎప్పుడూ ఒక సర్పం ఉంటుంది. శివశక్తే అలా సర్పరూపంలో ధర్శనమిస్తుందని భక్తుల విశ్వాసం. ఆ సర్పం ఇప్పటి వరకు ఎవరికీ హాని చేహలేదని చెబుతారు.
గార్హముక్తేశ్వర్ ::
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని 'ఢిల్లీ-మొరాదాబాద్' లైనులో గల 'బ్రజ్ ఘాట్' నుండి 6 కి.మీ. దూరంలో గల క్షేత్రం ఇది. ఒక సిద్ధుని ద్వారా ఇచ్చటి ఆలయానికి చేరిన శివలింగం తెల్లని స్ఫటికంతో నిర్మితమై సప్త వర్ణాలను వెదజల్లుతుంది. ఏడాదికొకసారి పెద్ద శివలింగం నుండి చిన్న శివలింగం పుడుతుంది. బహు ముఖాలతో కూడిన శివలింగం నుండి అనేక భాగాలు విడివడిన సంగతి బాగా పరిశీలిస్తే తెలుస్తుంది. ఇంతకు పూర్వం చిన్న లింగం వెలువడిన స్థానంలో నుండి మరొకటి బయటపడుతోంది.
శివగంగ ::
కర్ణాటక రాష్ట్రంలోని 'బెంగళూరు' నుండి 60 కి.మీ. దూరంలో ఈ క్షేత్రం ఉంది. ఇచ్చటి ఆలయం పేరు 'గంగాధరేశ్వరాలయం'. గుహలోపల ఉన్న 2-1/2 అడుగుల ఎత్తుగల శివలింగానికి పసుపుగా ఉన్న నెయ్యిని మర్దిస్తే అది చూస్తుండగానే తెల్లటి వెన్నగా మారుతుంది. కాదని తొలచి చేసిన ఓ విశాలమైన గుహలో ఉన్న ఈ శివలింగాన్ని చేరుకోవాలంటే దాదాపు 200 మెట్లు ఎక్కి వెళ్ళాలి. అర్చన టికెట్ తో పాటే నెయ్యి కూడా ఇస్తారు. యూరోపియన్ హేతువాదులు తపదేశం నుండి (మనల్ని నమ్మక) నెయ్యిని తెచ్చి లింగానికి రుద్ది వెన్నగా మారే వాస్తవాన్ని అంగీకరించారు. ఈ వెన్నని బాధా నివారణ మందుగా వాడుతుంటారు.
కాంచీపురం ::
ఏకామ్రేశ్వరుడుగా (క్షితిలింగం) పరమశివుడు పృథ్వీలింగంగా వెలసి అనంత మహిమలతో భక్తులను తరింపజేసేదే ఈ కాంచీ క్షేత్రం. 'ఏక' అంటే ఒక, 'అమ్ర' అంటే మామిడి. ఈశ్వరుడు అంటే శివుడు. (ఏక+అమ్ర+ఈశ్వరుడు) అంటే మామిడి చెట్టు క్రింద వెలసిన స్వామి వారు గనుక ఈ స్వామికి ఏకామ్రేశ్వరుడు అనే పేరు ఏర్పడినట్లు చెప్పబడింది. ఈ ఆలయాన్ని 'పెద్దపడి' అని పిలుస్తారు. దీనినే 'తిరువేంకంబం' అని 'తిరుకుచ్చి ఏకంబం' అని 'తిరు ఆలయం' అని తమిళులు పిలుస్తారు. శివకంచి ఏకమ్రేశ్వరస్వామి ఆలయం విశాలమైన మూడు ప్రాకారాలతో, ఎత్తైన గోపురంతో అద్భుతమైన శిల్పకళావైభవోపేతంగా ఉంటుంది.
పంచరామాలు ::
ఈ పంచారామ క్షేత్రాలు ఆంధ్రరాష్ట్రంలో మూడు జిల్లాలలో వెలసినవి. అవి - గుంటూరు జిల్లాలోని అమరావతిలోను, పశ్చిమ గోదావరి జిల్లాలోని గునుపూడి భీమవరంలో ఒకటి, పాలకొల్లులో ఒకటి, తూర్పుగోదావరి జిల్లాలోని ద్రాక్షారామంలోని ఒకటి, సామర్లకోట కుమారారామ భీమేశ్వరంలో ఒకటి వెలసి భక్తుల పూజలందుకొంటున్నాయి. ఇక ఆలయ విశేషాలు పరిశీలిస్తే శివుని లింగాకృతిలో విచిత్రమైన విభేదాలు - అమరారామంలో 36 అడుగుల ఎత్తులో 9 అడుగులు మాత్రమే దర్శిస్తాము. ద్రాక్షారామంలో 14 అడుగులు, సామర్లకోటలో 12 అడుగులు ఎత్తుగల శిలింగం. భీమవరం, పాలకొల్లులో రెండడుగుల ఎత్తు ప్రమాణం గల శివలింగం దర్శిస్తాము. అమరారామంలో బాలరాముండేశ్వరి సహిత అమరేశ్వరస్వామిగాను, ద్రాక్షారామంలో మాణిక్యాంబ సహిత భీమశ్వరునిగాను, కుమారారామంలో బాలాత్రిపుర సుందరి సమేత సోమేశ్వరునిగాను, సోమారామంలో పార్వతి, అన్నపూర్ణసమేత సోమేశ్వరునిగానూ, క్షీరామంలో పార్వతి సహిత శ్రీరామలింగేశ్వరునిగాను పూజింపబడుతున్నారు. ఈ పంచారామ క్షేత్రాలైదింటిలోను ద్రాక్షారామానికి ప్రత్యేక విశిష్టత కలదు. ఇక్కడి అమ్మవారు మాణిక్యాంబదేవి అష్టాదశపీఠాలలో 12వ శక్తిపీఠంగాను, భీమేస్శ్వర స్వామి ద్వాదశ జ్యోతిర్లింగ ఉపలింగంగాను ప్రసిద్ధి చెందినది.
చిదంబరం :
:
పరమశివుని పంచభూతాల్లో అయిదవది, శివుని అష్టమూర్తి స్వరూపాల్లో ఒకటైనది -- ఆకాశరూపంలో కొలువుతీరిన చిదంబరం క్షేత్రం తమిళనాడు రాష్ట్రంలో చెన్నై నగరానికి సుమారు 250 కి.మీ. దూరంలో దక్షిణ ఆర్కాట్ జిల్లాలో ఉంది. నటరాజస్వామి ఆనంద తాండవం చేసే చిదంబరాన్ని ప్రాచీనకాలంలో తిల్లయ్-వనం, వ్యాఘ్రపురం, పొన్నాంబళం, పురియార్, పుండరీకపురం, భూలోక కైలాస్ అనే పేర్లు ఉండేవి. కాలక్రమంలో ఈ స్థలానికి చిదంబరం అనే పేరు వ్యాప్తిలోకి వచ్చి స్థిరపడింది. చిదంబరం అంటే చిత్ + అంబరం, చిత్ అంటే జ్ఞానము, అంబరం అంటే అనంతమైన ఆకాశం. చిదంబరంలో (చిత్ సభ, కనుక సభ, దేవసభ, నృత్యసభ, రాజసభ) పంచ సభలకి ప్రాధాన్యం ఉంది గనుక ఆ పేరు వచ్చింది. 'తిల్లయ్' అనే వృక్షాలు అధికంగా ఉండడం వాళ్ళ ఈ క్షేత్రానికి 'తిల్లయ్' వనం అనే పేరు వచ్చింది. ఇక్కడి అమ్మవారి పేరు "శివకామసుందరి'.
తిరువణ్ణామలై ::
'తిరు' అంటే పెద్దది, 'అణ్ణా' అంటే అగ్ని 'మలై' అంటే కొండ అని అర్థం. ఎత్తైన కొండపై వెలసిన స్వామి అరుణగిరి రూపంలో అవతరించిన శివమహాదేవుని మహిమాన్వితమైన జ్యోతిస్వరూపమే అణ్ణామలయ్యార్ స్వామి. ఇక్కడ పర్వతమే శివ స్వరూపం. ఇదికాక లింగరూపంగా ఆలయంలో కొలువున్నారు. అమ్మవారి పేరు 'అపీతకుచాంబ'. తిరువణ్ణామలై క్షేత్రం తమిళనాడులోని (ఉత్తర ఆర్కాట్ జిల్లా) ప్రస్తుతం సంబురాయర్ జిల్లాలో ఉంది. ఈ పట్టణం తాలూకా కేంద్రం విల్లిపురం. కాత్పాడి రైలు మార్గంలో చెన్నైకి 226 కి.మీ. దూరంలో ఉంది.
శ్రీకాళహస్తి ::
శ్రీకాళహస్తీశ్వర స్వామి స్వయంభువుగా బిల్వకావనములో సువర్ణముఖీ నదీ తీరంలో వెలిశాడు. 'శ్రీ' అంగ సాలెపురుగు, 'కాళీ' అనగా పాము, 'హస్తి' అనగా ఏనుగు, ఈ మూడు జంతువులు శివభక్తి వలన సాయుజ్యమంది శివునిలో లీనమైపోయాయి. అందువలన ఇచ్చటి స్వామివారికి శ్రీకాళహస్తీశ్వరుడని, ఈ పురమునకు శ్రీకాళహస్తి అని పేరు వచ్చింది. ఇచ్చట అమ్మవారు జ్ఞానప్రసూనాంబ. క్షేత్రపాలకుడు కాలభైరవుడు. కృతయుగంలో ఇక్కడ స్వామి వాయురూపంలో ఉండి మహాయోగులను స్పర్శ మాత్రమునే గ్రహింపదగియుండేవారట. త్రేతాయుగంలో స్వర్ణ రూపంగా, ద్వాపరయుగంలో రజిత రూపంగా, ప్రస్తుత కలియుగంలో శ్వేతశిలా రూపం పొంది తన సహజ వాయుతత్వ నిదర్శనంగా గర్భాలయంలో స్వామికి కుడి ప్రక్కనున్న దీపములను రెండింటిని ఎల్లప్పుడూ చలింపజేస్తూండటం గమనించదగినది. ఇక్కడి జగదంబ 'జ్ఞానప్రసూనాంబ'.
శీర్కాళి :: వైదీశ్వరన్ కోయిల్ ::
చిదంబరానికి, కుంభకోణానికి మధ్యలో ఉన్న వైదీశ్వరన్ కోయిల్, శీర్కాళ్ గొప్ప క్షేత్రాలు. వైదీశ్వరన్ కోయిల్, శీర్కాలి రెందు, కేవలం 8 కి.మీ. దూరం ఉన్న ప్రక్క ప్రక్క ఊళ్ళు. వైదీశ్వరన్ కోయిల్ ఉత్తర తమిళనాడు వారికి చాలా ముఖ్యమైన పవిత్రస్థలం. ఒకానొక ముని తనకు గొప్ప జబ్బు చేయగా పరమేశ్వరుని గూర్చి ఎంతో భక్తితో తపస్సు చేయగా శంకరుడు ఒక వైద్యుని రూపంలో ప్రత్యక్షమై, అతని జబ్బు నయం చేశాడమొ స్థల పురాణం. ఈ ప్రాంతం వారు ఇంట్లో ఎవరికీ ఏ జబ్బు చేసినా, ఈ వైదీశ్వరునికి మొక్కుకుంటారు. ఊరు మాత్రం అతిచిన్న పల్లెటూరు. అయినా దేవాలయం మాత్రం ఎన్నడూ భక్తులతో నిండి ఉంటుంది. ఈ మధ్య ఈ ఊరికి చెందిన 'నాడీగ్రంథ' జ్యోతిష్కులు అన్నిచోట్ల వెలియడంతో ఈ ఊరికి జ్యోతిషం చెప్పించుకుంటానికి వచ్చేవారు ఎక్కువ అయ్యారు. వైదీశ్వరన్ కోయిల్ కు శీర్కాలి మధ్యదూరం కేవలం ఐదు మైళ్ళు. తమిళులందరికి శిర్కాలి చాలా పవిత్రమైన యాత్రాస్థలం. తమిళులకు ఈ దేవాలయం సంస్కృతిక కేంద్రం లాంటిది. ఈ ఊరిని గూర్చి వారందరూ ఎంతో పవిత్రంగా భావిస్తారు. గొప్ప శివభక్తాచార్యుడు 'జ్ఞాన సంబంధర్' ఈ శిర్కాలిలోనే జన్మించారు. ఈ సంబందర్ పసికూనగా ఉన్నప్పుడు పార్వతీదేవి స్వయంగా తన స్తన్యమిచ్చి ఆ పిల్లవాని ఆకలి తీర్చింది. ఆ తరువాత నుంచి ఆ పిల్లవాడు అమిత జ్ఞానవంతుదై చిన్నతనం నుండే గొప్ప శివభక్తుడై శివతత్వాన్ని అందరకూ ప్రభోదిస్తూ కేవలం పదహారు సంత్సరాలు మాత్రమే జీవించి, తనువూ చాలించారు. అయితే, ఆ పదహారు సంవత్సరాల లోపునే అయన అనేక వేల కీర్తనలు రచించారు. అందులో దాదాపు నాలుగు వందల కృతులు.
పిల్లాడి రుద్రయ్య