Thursday, June 8, 2023

మంత్ర శాస్త్రం

మంత్ర శాస్త్రం 


మంత్రాలు రెండు రకాలు. 
1. దీర్ఘమంత్రాలు, 
2. బీజ మంత్రాలు. 

మనకు తెలిసిన వాటిలో ఎక్కువ భాగం ఓంకారం వంటి హ్రస్వబీజాలు ఉంటాయి. 

 ఈ మంత్రాలు ఓం, హూం, శ్రీం వంటి మూల శబ్దాలను కలిగి ఉంటాయి. ఈ విధమైన మూల శబ్దాల నుంచే సంస్కృత భాష రూపుదిద్దుకుంది.

దీర్ఘమంత్రాలు వేదపాఠాల వలే ...గాన రూపములో ఉంటాయి. వీటిలో గాయత్రీ మంత్రం ముఖ్యమైనది.

గాయత్రీ మంత్రం మూడు పాదములు కలదెై, 
ఇరవెై నాలుగు అక్షరాలతో, 
ఇరవెై నాలుగు చంధస్సులెై, 
ఇరవెై నాలుగు తత్వాలకు సంకేతంగా భాసిస్తోంది. 

గాయత్రీ మంత్రం లోని మూడు పాదాలు ఋగ్, యజుర్, సామవేదాల నుంచి గ్రహించబడి,
‘ఓం’కారంలోని అకార, ఉకార, మకారాలకు ప్రతిరూపమై భాసిస్తున్నాయి.

‘గాయత్రీ’ మంత్ర ద్రష్ట అయిన విశ్వామిత్రుడు మంత్రానుష్ఠాన ప్రభావంవల్ల జితేంద్రియుడవడమే కాక, రాజర్షిత్వాన్ని వదలి బ్రహ్మర్షిత్వాన్ని పొందాడు. అంతేకాక, ప్రతి సృష్టి చేయగల సామర్థ్యాన్ని పొందాడు. 

అందుకే చాలా మంది సంధ్యా వందనాది సమయాల్లో గాయత్రీ మంత్రమును జపిస్తుంటారు. గాయత్రీ మంత్రాన్నీ ఎవరు క్రమం తప్పకుండా జపిస్తారో, వారు కోటి జన్మలలో చేసిన పాపాల నుంచి విముక్తులవుతారన్నది వాస్తవం.

" హ్రస్వ బీజమంత్రం " మరింత విస్తారమైన అర్థాన్ని కలిగి ఉంటాయి. 

దీర్ఘమంత్రాలు, వాటి అర్థాలపట్ల మనకుగల అవగాహనలపై ఆధారపడి ఉంటాయి.

ఈ మంత్ర సృష్టి ఎలా జరిగింది? అన్న ప్రశ్న మనకు కలుగవచ్చు.

అందుకు సమాధానం, త్రికాల వేదులెైన ఋషులు, జగత్ కళ్యాణం కోసం అందించిన
సత్యోపదేశాలే ‘మంత్రాలు’. 

అదే విధంగా ‘మంత్రసిద్ధి’ ఎన్ని రోజులకు కలుగుతుందన్న ప్రశ్న కూడా ఉదయిస్తుంటుంది.

 ఏకాగ్రతతో మంత్రాన్ని సాధన చేస్తే త్వరితంగా ఆయా మంత్రసిద్ధిని పొందవచ్చు. మంత్రానికి బీజాక్షరాలు ప్రాణ ప్రదాలు. వాటి ఉచ్ఛారణతో సంకల్పాలు సిద్ధిస్తాయి.

అయితే మంత్రానుష్ఠానంలో అశ్రద్ధ, లోపాలు చేయకూడదు, ఫలితంగా చెడు ఫలితాలు ఎదురయ్యే అవకాశముంది.

ప్రతి మంత్రాన్ని ఒక ఋషి, చంధస్సు, దేవత, బీజం, శక్తి, కీలకం,అంగన్యాస, కరన్యాసాలనే సప్తాంగాలతో క్రమం తప్పకుండా ధ్యానించాలని చెప్పబడింది.

1. ఋషి:
మంత్ర ప్రవర్తకుడు ఋషిని శిరస్సులో లయింపజేసి ధ్యానించాలి. ఏ మంత్రం ఎవరిచేత ఆవిష్కరింపబడిందో, ఎవరిచేత సిద్ధి పొందిందో, అతనినే ఆ మంత్రానికి కర్తగా (ఋషిగా) భావించాలి.

2. ఛందస్సు:
శరీరాన్ని కప్పిన వస్త్రంలా ఆత్మను కప్పు తున్న దానికి ఛందస్సు అని పేరు. ఈ ఛందస్సులు మంత్రాలను రక్షించగలవు. దేవతలు తమను తాము కాపాడు కొనేందుకు గాయత్రీ వంటి మంత్రాలను ఆచ్ఛాదనలుగా చేసుకొన్నారు.

3. దేవత:
ప్రతి మంత్రానికి ఒక అధిష్టాన దేవత ఉంటుంది. ప్రతి మంత్ర ప్రవర్తకుడు మంత్రానికి తగిన అధిష్ఠాన దేవతను హృదయ కమలంలో నిలుపుకొని ధ్యానించాలి.

4. బీజం:
మంత్రానికి ప్రత్యేకశక్తిని కలుగజేసే మంత్రసారమే బీజం అని పేరు. ఈ బీజాన్ని గుహ్యంలో నిలిపి ధ్యానించాలి.

5. శక్తి:
మనం మంత్రశక్తిని వహించినప్పుడే, అందుకు తగిన మంత్రశక్తి కలుగుతుంది. మంత్ర ప్రవర్తకుడు మంత్రశక్తిని పాదాలలో నిలిపి ధ్యానించాలి.

6. కీలకం:
మంత్రశక్తిని మనలో నిలిపి ఉంచేందుకు సాయపడే బిరడా వంటిది కీలకం. మంత్ర ప్రవర్తకుడు కీలకాన్ని నాభియందు నిలిపి ధ్యానం చేయాలి. అప్పుడు సాధకుడు ఉపాసనామూర్తిని దర్శించి,  సర్వసిద్ధులను పొందుతాడు.

7. అంగన్యాసం:
అంగన్యాస క్రియలు ఆచరించకుండా చేసిన మంత్రాలు నిష్ర్పయోజనమవుతాయి. 

శరీరశుద్ధికోసం న్యాసాలు తప్పనిసరిగి చేయాలి. సాధకులు న్యాసాలు చేసుకొని మంత్రజపాన్ని చేయాలి. న్యాసములు ఆచరించకుండా సాధకునికి మంత్రాధికారం లేదు.

8. వినియోగం:
చతుర్విధ పురుషార్థాలకై లేక ఏదో ఒక సంకల్ప సిద్ధికై మంత్రాన్ని ఉపయోగించడమే వినియోగం అని అంటారు. 

ప్రతి మంత్రానికి మంత్రాధిష్థాన దేవతను వర్ణించే ధ్యాన శ్లోకం ఉంటుంది. మంత్రానికి సంబంధించిన దేవతా స్వరూపాన్ని, సాధకుడు మనసులో నిలుపుకొని ఆ మంత్రజపం చేయాలి. శుచి, మనోనిగ్రహం, మంత్రార్థ చింతనం, విచార రహితములు మంత్రోపాసనకు చాలా ముఖ్యం. 

పండుగ సమయాలలో గ్రహణ సమయాలలో
అమావాస్యలలో మంత్రోచ్ఛారణ అధికంగా చేయాలి. 

"మంత్రాలు కర్మార్థమై జనించాయి".

 ఒకే మంత్రాన్ని కొంతకాలం పాటు సక్రమ రీతిలో జపించడం వలన ఆ
మంత్రానికి సంబంధించిన దెైవరూపం మనోనేత్రానికి స్పష్టంగా కనిపిస్తుంది. 

మంత్రశక్తి వలన ఎన్నో అద్భుతాలను సాధించవచ్చు.
 ఉదాహరణకు..హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుని ఎన్ని హింసలకు గురిచేసినప్పటికీ, నారాయణ’ అనే మంత్ర జపం ఆ బాలుని ఏమీ చేయలేకపోయాయి. 

భక్తహనుమ ‘రామ’ నామజపంతో ఉత్తేజితుడెై సముద్రాన్ని దాటి లంకను చేరాడు.
గాయత్రీ మంత్ర జపం వలన విశ్వామిత్రుడు రాజర్షిత్వాన్ని వదలి బ్రహ్మర్షిత్వాన్ని పొందాడు.

మహాత్ములు కొన్ని ప్రాథమిక మంత్రాలను సూచించారు. అవి:

" ఓం "...
సమస్త మంత్రాలసారంగా ‘ఓం’కారం చెప్పబడింది. ఇది సాక్షాత్తు బ్రహ్మస్వరూపం. సమస్త వేదాల సారమైన ‘ఓం’ కారం మంత్రాలన్నింటిలోకి ఉత్కృష్టమైనది. 

అకార, ఉకార, మకారాలు అనే మూడు శబ్దాల సమన్వయం 'ఓం’కారం. ఈ మూడు భాగాలు జాగృత, స్వప్న, గాఢ సుషుప్తి స్థితులకు, సత్వ - రజో - తమో గుణాలకు ప్రాతినిధ్యం వహిస్తాయి. బ్రహ్మాండం యొక్క సృష్టి, స్థితి, లయ అనే విభిన్న పాత్రలను పోషించే ఏకేశ్వరుని త్రిరూపాలెైన బ్రహ్మ, విష్ణు, శివమూర్తులు వీటికి అధినేతలు. 

వేదం ఓంకారరూపం...

ఋగ్వేదం నుండి ‘అ’ కారం, 
యజుర్వేదం నుండి ‘ఉ’ కారం,
సామవేదం నుండి ‘మ’ కారం 
పుట్టి, వాటి నుండి ఓంకార రూపం ఉద్భవించింది. ఓం కారానికి మూలం నాదం. ఆ నాదం భగవద్రూపం.

శ్రీం:...

అమ్మ వారికి చెందిన మంత్రం. ఐశ్వర్యాన్ని, సకల అభీష్టసిద్ధిని కలిగిస్తుంది.

హూం:...

సృష్టిలోని వ్యతిరేక శక్తులను నాశనం చేసే దెైవిక క్రోధం యొక్క శబ్దం "హూం "... 

ఓంకారం ఆత్మను అనంత ఆత్మలో కలిపే శబ్దమైతే, హూంకారం అనంత పరమాత్మ ఏకాత్మలో ప్రకటితమవుతుంది.

రం:...

ఇది దివ్య తేజోబీజం. శాంతిని కలిగిస్తుంది.

ఐం:...
జ్ఞాన బీజం. ఏకాగ్రత, శక్తులను ప్రసాదిస్తుంది.

మాం:...
మాతృబీజం. అగ్నిబీజాలకు ఆద్యం.

సోహం:.
శ్వాస యొక్క స్వాభావిక బీజం.
 
‘సో’ ఉచ్ఛ్యాసం, 
‘హం’ నిశ్శ్వాసం. 
సోహం నుండి హల్మ శబ్దాలను వేరు చేస్తే ఓంకారం.
 
‘సో’ శక్తి ‘హం’ శివుడు.

గాయత్రీ మంత్రం:...

గాయత్రి ఓం కారం నుండి జనించింది. మన వేదాలలో, ఉపనిషత్తులలో, బ్రహ్మ సూత్రాలలో, పురాణాలలో... గాయత్రీ దేవత సగుణ, నిర్గుణ, స్వరూప స్వభావములు సవిస్తరంగా వివరించబడ్డాయి. గాయత్రీ దేవిని ... గాయత్రీ మంత్రాలతో ధ్యానించే వారికి ముక్తి లభిస్తుంది. ఎవరు గాయత్రీని జపిస్తారో వారు కోటి జన్మలలో చేసిన పాపాల నుండి విముక్తులవుతారు.

ఏకాక్షర మంత్రం – ‘ఓం’.

అన్ని మంత్రాలలోకి శక్తివంతమైన ఏకాక్షర మంత్రం ‘ఓం’. దీనినే ‘ప్రణవం’అని కూడా అంటారు. మంత్రోచ్ఛారణ జీవునికి, పరమాత్మ అనుగ్రహాన్ని సులభతరం చేసే ఒక సాధన. 

ఉదా..బిడ్డ తన తల్లిని ‘అమ్మా’ అని పిలువగానే, ఆ తల్లి ఎన్ని పనులతో సతమతమవుతున్నప్పటికీ ఆప్యాయంగా పరిగెత్తుకొని వచ్చి, ఆ బిడ్డను గుండెకు హత్తుకుంటుంది కదా!

 అలాగే సకల దేవతా మూర్తులు, మంత్రోచ్ఛారణతో మనం మననం చేయగానే మనపట్ల ప్రసన్నులవుతున్నారు. 

మహా శక్తివంతమైన మంత్రాలను మన ఋషులు, అమోఘ తపశ్శక్తితో భగవదావేశంలో పలికిన వాక్యాలే మంత్రాలు. "ఐం, శ్రీం, హ్రీం, క్లీం " అనే ఏకాక్షర బీజమంత్రాలను ఆయా దేవతల పేర్లతో కలిపి జపించినప్పుడు శక్తివంతమైన మహామంత్రాలవుతాయి. 

ఇష్టదేవతలను ప్రసన్నం చేసుకోవడమే మంత్ర లక్ష్యం.

సమస్త మంత్రాలసారంగా ‘ఓం’కారం చెప్పబడింది.

సాధారణంగా మంత్రాలు మూడు విధాలు..

1. తామస మంత్రం: తామస భావంతో ఉచ్ఛారణ చేసేవి.

2. రాజస మంత్రం: యుద్ధంలో గెలుపు కోసం చేసేవి.

3. సాత్విక మంత్రం: ఆధ్యాత్మిక సాధనకై చేసేవి.

చంధోబద్ధంగా ఉన్న మంత్రాలు ‘ఋక్కులు’ అని గద్యాత్మకంగా ఉన్న మంత్రాలను ‘యజస్సులు’ అని అంటారు. 

ఓంకారం ఆ సర్వేశ్వరుని నుంచి ఒక జ్యోతిగా ప్రారంభమై, దాన్నుంచి ఒక నాదం ధ్వనిస్తుంది. ఋగ్వేదం – ‘అ’ కారం, యజుర్వేదం నుండి ‘ఉ’ కారం, సామవేదం
నుండి ‘మ’ కారం కలసి ‘ఓం’ కారం ఏర్పడింది.

లోకా సమస్తా సుఖినో భవంతు..!!

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS