Thursday, August 17, 2023

శుక్రవారం – అష్ట లక్ష్మీప్రదం

శుక్రవారం – అష్ట లక్ష్మీప్రదం


🌺అమ్మ అనే శబ్దానికి ఫలానా రూపాన్ని ఇవ్వమంటే ఏమని చెప్పగలం? అమ్మ మోసే బాధ్యతలు ఏమిటి అని స్పష్టంగా చెప్పమంటే ఏమని నిర్వచించగలం? అమ్మంటే అమ్మే! బిడ్డ అవసరాన్ని బట్టి ఆమె వివిధ రీతులుగా స్పందిస్తుంది. బిడ్డకు తీర్చే కోరికను బట్టి వివిధ రీతులుగా కనిపిస్తుంది.

🌺 ఆదిశక్తి అయిన అమ్మవారు కూడా ఇంతే. ఆమెను భక్తులు ఒకటి కాదు రెండు కాదు... వేనవేల రూపాలలో పూజించుకుంటారు. 

వాటిలో ముఖ్యమైన రూపాలను అష్టలక్ష్ములుగా కొలుచుకుంటారు. ఆ అష్టశక్తుల వివరం ఇదిగో...

🌺1.  *ఆదిలక్ష్మి...*
మహాలక్ష్మిగా కూడా కొలవబడే ఈ తల్లి అమ్మవారి ప్రముఖ రూపం. ఒక చేత పద్మాన్నీ, మరో చేత తెల్లటి పతాకాన్నీ ధరించి. మరో రెండు చేతులలో అభయ, వరద ముద్రలని ఒసగే తల్లి.
పాలకడలిపై నారాయణుని చెంత నిలిచి లోకాలను కాచుకునేది ఈ ఆదిలక్ష్మే!

🌺2.   *ధాన్యలక్ష్మి...*
హైందవులకు వ్యవసాయం కేవలం ఒక వృత్తి మాత్రమే కాదు... ఒక జీవన విధానం కూడా! అందుకే మన సంస్కృతి యావత్తూ వ్యవసాయాన్ని అల్లుకుని ఉండటాన్ని గమనించవచ్చు.
ఆ వ్యవసాయం, దాంతోపాటు మన జీవితాలూ కూడా సుభిక్షంగా ఉండేలా కాచుకునే తల్లి- ధాన్యలక్ష్మి. 
అందుకు ప్రతీకగా ఆమె ఆహార్యం యావత్తూ ఆకుపచ్చ రంగులో ఉంటుంది.
చేతిలో చెఱకుగడ, అరటిగెల, వరికంకులు కనిపిస్తాయి.

🌺3.   *ధనలక్ష్మి...*
భౌతికమైన జీవితం సాగాలంటే సంపద కావల్సిందే! ఆ సంపదని ఒసగి దారిద్ర్యాన్ని దూరం చేసేదే ధనలక్ష్మి. అందుకే ఆమె చేతిలో దానానికి చిహ్నంగా బంగారు నాణేలు, సమృద్ధికి సూచనగా కలశము దర్శనమిస్తాయి.

🌺4.   *గజలక్ష్మి...*
రాజసానికి ప్రతినిధి! సంపదను అనుగ్రహించడమే కాదు... ఆ సంపదకు తగిన హుందాతనాన్నీ, ప్రతిష్టనూ అందించే తల్లి.
గౌరవం కలిగించని సంపద ఎంత ఉంటేనేం? గజలక్ష్మి సాక్షాత్తూ ఆ ఇంద్రుడు కోల్పోయిన సంపదను సైతం క్షీరసాగరమథనంలో వెలికి తెచ్చిందని ప్రతీతి. అటూఇటూ ఏనుగులు ఆమెను అభిషేకిస్తూ ఉండగా...
గజలక్ష్మి అభయవరద హస్తాలతోనూ, రెండు పద్మాలతోనూ విలసిల్లుతూ కనిపిస్తుంది.

🌺5.   *సంతానలక్ష్మి...*
జీవితంలో ఎన్నిసిరులు ఉన్నా, సంతానం లేకపోతే లోటుగానే ఉంటుంది. 
తరం తమతో నిలిచిపోతుందన్న బాధ పీడిస్తుంది.
ఇలాంటివారి ఒడిని నింపే తల్లే- సంతాన లక్ష్మి! ఒక చేత బిడ్డను పట్టుకుని, మీకు సంతానాన్ని అనుగ్రహించేందుకు సిద్ధంగా ఉన్నానని సూచిస్తూ ఉంటుంది.

🌺6.   *ధైర్యలక్ష్మి...*
భౌతికమైన సంపదలు లేకపోవచ్చు, మూడుపూటలా నిండైన తిండి లేకపోవచ్చు, పరువుప్రతిష్ట మంటగలసి ఉండవచ్చు.
కానీ ధైర్యం లేనిదే మనిషి అడుగు ముందుకు వేయలేడు. రేపటి గురించి ఆశతో జీవించలేడు. అందుకే ఈ ధైర్యలక్ష్మిని తమతో ఉండమని భక్తులు మనసారా కొలుచుకుంటారు.
ఈమెనే వీరలక్ష్మి అని కూడా అంటారు.
పేరుకి తగినట్లుగానే శంఖము, చక్రము, త్రిశూలము వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది.
జ్ఞానం కూడా ఒక ఆయుధమే కాబట్టి కొన్ని సందర్భాలలో పుస్తకాన్ని ధరించినట్లు కూడా ఈ అమ్మను చూపుతుంటారు.

🌺7.   *విద్యాలక్ష్మి...*
జీవితాన్ని సుసంపన్నం చేసుకునేందుకు.... అటు ఆధ్మాత్మికమైన, ఇటు లౌకికమైన జ్ఞానాన్ని ఒసగే తల్లి ఈ విద్యాలక్ష్మి.
ఒకరకంగా సరస్వతీదేవికి ప్రతిరూపం అనుకోవచ్చు. ఆ సరస్వతిలాగానే విద్యాలక్ష్మి కూడా శ్వేతాంబరాలను ధరించి, పద్మపు సింహాసనంలో కనిపిస్తారు.

🌺8.   *విజయలక్ష్మి ...*
విజయమంటే కేవలం యుద్ధరంగంలోనే కాదు... యుద్ధానికి ప్రతిబింబమైన జీవితపోరాటంలోనూ అవసరమే! 
చేపట్టిన ప్రతి కార్యంలోనూ, ఎదుర్కొన్న ప్రతిసవాలులోనూ తమకు విజయాన్ని అందించమంటూ భక్తులు ఈ తల్లిని వేడుకుంటారు. వారి అభీష్టానికి అనుగుణంగా ఈ తల్లి ఎర్రని వస్త్రాలను ధరించి, అభయ వరదహస్తాలతో పాటుగా....
ఆరు రకాలైన ఆయుధాలను కలిగి ఉంటుంది.

🌺.  వీరే మనం ప్రముఖంగా ఎంచే అష్టలక్ష్ములు. వీరే కాకుండా భక్తుల అభీష్టం మేరకు ఆ తల్లిని రాజ్యలక్ష్మి, వరలక్ష్మి వంటి వివిధ పేర్లతో కూడా కొలుచుకుంటారు. ఏ రూపులో కొలిచినా... ఆ తల్లి తమ బిడ్డలను కాచుకుంటుంది అనడంలో అతిశయోక్తి లేదు కదా!!! 🌷🙏🌷jai goumata 🙏🙏

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS