కలలో దేవతాదర్శనం దేనికి సంకేతం
మనలో చాలామందికి కలలు రావడం సహజం. కలలలో మంచి కలలు రావచ్చు, చెడు చూడవచ్చు, కానీ కలలు కేవలం కలవరకు మాత్రమె నిజం. నిజ జీవితంలో వాటి ప్రభావం ఎంత అన్నది పరిస్థితులనుబట్టి వుంటుంది.
అసలీ కలలు రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. మనం ఎప్పుడో చూసిన విషయాలు, మనుషులు, స్థలాలు దానికి సంబంధించిన విశేషాలతో ఒకానొక సన్నివేశం సృష్టించి ఇతఃపూర్వం మనం అనుకున్న ప్రక్రియనో లేక అనుకుని చెయ్యలేకపోయిన వైనాన్నో మనముందు ఆవిష్కరిస్తుంది మనస్సు. కానీ మనకు సంబంధం లేని విషయాలు, స్థలాలు, పరిస్థితులు కూడా మనకు కలల్లో కనబడడం కద్దు.
ఒకానొక పరిశోధన ప్రకారం ఏ ఏ విషయాలు మనం మన పంచేద్రియాలతో మనం ఏ విషయాలను గ్రహిస్తామో దాన్ని అనుసంధానించి మన మెదడు ఒక ప్రపంచాన్ని సృష్టించి ఆ విషయాలను తిరిగి మనకు అందిస్తాయి అన్నది నేటి శాస్త్రం. మరి మనం చూడని విషయాలు ఎలా మనం ఎప్పుడో చూసినట్టు ఎందుకు కనబడుతున్నాయి? అంటే దానికి కొన్ని కొన్ని సార్లు మెదడు అలాగే పని చేస్తుంది అని చెబుతుంది నేటి శాస్త్రం.
ఈ విషయమై మన వాంగ్మయం ఏమి చెబుతోందో ఒక్కసారి అవలోకించుకుందాం. మన జీవుడు జాగ్రదావస్థలో ఉన్నప్పుడు విశ్వాన్ని స్వయంగా తెలుసుకుంటున్న వాడిని విశ్వుడు అని పిలుస్తుంది. స్వప్నావస్థలో ఉండే జీవుడికి తైజసుడని పేరు. తన తేజస్సుతో అన్నీ తెలుసుకుంటాడు. Deep Sleep అంటే సుషుప్తి అవస్థలో ఉండే జీవుడికి ప్రాజ్ఞుడని పేరు. ఇతడు హృదయ స్థానంలో ఉండి తన పనులు చేసుకుంటాడు.
ఇక ఇవి కాక మరొక అవస్త వుంది. తురీయం: ఇది అవస్థ గాని అవస్థ – తురీయావస్థ, 3 అవస్థలు ఉండటాన్ని - లేకపోవటాన్ని చూసే సాక్షి గాను; స్వయంగా తాను ఒకప్పుడుండటం గాని, లేకపోవటం గాని లేకుండా నిత్యంగా - నిరంతరంగా, అనుస్యూతంగా, ఎడ తెగకుండా, అఖండంగా జ్ఞాన రూపంగా, ఏది ఉంటున్నదో అదే తురీయం. ఇవన్నీ కూడా ప్రాణం ఉన్న మనలోనే ఉంటాయి. ఒకొక్కరి స్థాయిని బట్టి వారికి ఆయా అవస్థలు కరతలామలకాలు.
మనలో ఉన్న విశ్వుడు ఎప్పుడెప్పుడు ఏ ఏ విషయాలను ఈ లోకం నుండి గ్రహిస్తూ ఉంటాడో ఆ విషయాలన్నీ మనస్సులో నిక్షిప్తం అవుతూ వుంటాయి. అవి ఈ జన్మలోనివే కాక ఎన్నో జన్మజన్మల వాసనలను మనస్సుపొరలలో నిక్షిప్తం చేసి ఉంచుతుంది. అందుకే ఎన్నడూ ఈ జన్మలో చూడని విషయాలు కూడా మనకు ఎంతో పరిచయం ఉన్న విషయాలగా కనబడుతూ వుంటాయి. అటువంటి సన్నివేశాలు, ప్రదేశాలు మనకు బాగా తెలిసినవిగా కనబడుతూ వుంటాయి. వాటిలో తాదాత్మ్యం చెందుతూ ఉంటాడు జీవుడు.
అన్నమయ్య చెప్పినట్టు “ కలలోని సిరులెల్ల కనుకూర్కులే కాక మెలకువ జూడనవి మెరసీనా” అన్నట్టు కలలోని సుఖం అక్కడితో ఆఖరు. మన కర్మసిద్ధాంతాన్ని అనుసరించి ఎన్నడో నీవు చేసిన చాలా చిన్నపాటి పుణ్యం నీకు ఆ ప్రశాంతతను ఇచ్చేది నీకు కలలో వచ్చి మనస్సును ఆహ్లాదపరుస్తుంది. అలాగే నువ్వేప్పుడో చేసిన పాపం నీవు భౌతికంగా అనుభవించవలసిన అవసరం లేకుండా కలలో నిన్ను కలతబెట్టి నీ పాపప్రక్షాళన జరుగుతుంది.
కొంత కొంత మంది యోగులు తమ భక్తుల పాపాలను పరిహరించి అటువంటి పెద్ద పాపాన్ని భౌతికంగా కాక కలలో తీర్చెట్టు అనుగ్రహించగలరు. ఒకానొక యోగి తమ శిష్యుని బాధ వ్యాధి రూపంలో వచ్చినప్పుడు అతడి కలలో బండరాయి అతడి గుండెమీద పోనిచ్చి అదిమి అతడిని ఎంతో బాధకు గురి చేసి ఒక్కరాత్రి కలలో ఆ పాపాన్ని తీసి వేసారు. ఇటువంటి విషయాలు గురుచరిత్రలో అనేకం మనకు కనబడతాయి.
అలాగే నీ కర్మ పరిపక్వస్థితికి వచ్చినప్పుడు నీకు దిశానిర్దేశం చెయ్యడం కొరకు అనో లేక దేవుడిని నమ్ముకున్న నీకు ఆ దేవతా అనుగ్రహం నీకు వస్తున్న సూచనగానో, లేక నువ్వు పడుతున్న బాధను తాను దగ్గరుండి తీసివేస్తున్నానన్న భరోసా ఇవ్వడానికో నీకు ఆ దేవతామూర్తులు కలలో కనబడి అనుగ్రహిస్తూ వుంటారు.
నారదుని పూర్వజన్మలో ఎంతో తపస్సు చేసిన మీదట ఆయనకు కలలో లీలగా విష్ణుమూర్తి దర్శనం అనుగ్రహించి తదుపరి జన్మలలో పరమభాగావతోత్తముని చేసాడు. నువ్వు చేసిన పుణ్యఫలం వలన మాత్రమె నీకు దైవదర్శనం కలుగుతుంది. ఒకొక్కప్పుడు నువ్వు ఇతహ్పూర్వం జన్మలలో చూసిన దేవాలయాలు, దేవతామూర్తులు ఇప్పుడు నీకు కనబడతాయి.
నిన్ను సూదంటురాయిలా తమవైపు తిప్పుకోవడానికి, నువ్వు సరైన మార్గంలో నడవడానికి నీకు దోహదపడేలా వారి అనుగ్రహం నీకు కలలో కనిపించి మాంసనేత్రంతో మనోనేత్రంతో నువ్వు దర్శించేలా అనుగ్రహించి నువ్వు మాంసనేత్రాలతో సాక్షాత్కరించుకోమని అటువంటి సాధన చెయ్యమని చెప్పడానికి అన్నట్టు దర్శనం అనుగ్రహించి నిన్ను సరైన దారిలో నడిపిస్తారు.
అటువంటి సాధన చెయ్యడం అన్నది మన కర్తవ్యంగా భావించి గురువుల పాదములు పట్టుకుని అటువైపు ప్రయాణం చెయ్యవలసిన బాధ్యత నీది అని గుర్తేరిగేలా అనుగ్రహం వర్షిస్తారు. మనం అందరం కూడా మనకు కలల్లో కనబడ్డ దేవతా స్వరూప అనుగ్రహానికి పాత్రులయ్యేలా సాధన చేసి వారిని నిజనేత్రాలతో దర్శించుకునే భాగ్యం సంపాదిద్దాం.
ఓం నమో వేంకటేశాయ..!!
సర్వే జనా సుఖినో భవంతు..!!
సర్వే జనా సుఖినో భవంతు..!!
శ్రీ మాత్రే నమః
No comments:
Post a Comment