Friday, June 29, 2018

కొండగట్టు ఆంజనేయస్వామి

కొండగట్టు ఆంజనేయస్వామి

తెలంగాణలో పేరెన్నిక గన్న పుణ్యక్షేత్రాలలో కొండగట్టు ఒకటి. కరీంనగర్ జిల్లాలోని మల్యాల మండల కేంద్రంలోని ముత్యంపేట గ్రామానికి దాదాపు 35 కి.మీ.లు దూరమున ఉన్న ఒక ఆంజనేయ స్వామి దేవాలయము. ఇది జిల్లాలో జగిత్యాల నుండి 15 కెలోమీటర్ల దూరములో ఉంది. కొండలు, లోయలు మరియు సెలయేరుల మధ్యన ఉన్న కొండగట్టు చాలా ప్రకృతి సౌందర్యము కలిగిన ప్రదేశము. జానపదాల ప్రకారము, ఈ గుడిలో 40 రోజుల పాటు పూజ చేస్తే సంతానము లేని వారికి సంతానము కలుగుతుందని భక్తుల నమ్మకము.
చరిత్ర:
--------
పూర్వము రామ రావణ యుద్ధము జరుగు కాలమున లక్ష్మణుడు మూర్చనొందగా సంజీవనిని తెచ్చేందుకు హనుమ బయలుదేరుతాడు. అతడు సంజీవనిని తెచ్చునపుడు ముత్యంపేట అనెడి ఈ మార్గమున కొంతభాగము విరిగిపడుతుంది. ఆ భాగమునే కొండగట్టుగా కల పర్వతభాగముగా పిలుస్తున్నారు.
దేవాలయ చరిత్ర:
------------------------
సుమారు నాలుగువందల సంవత్సరాల క్రితం కొడిమ్యాల పరిగణా లలో సింగం సంజీవుడు అనే యాదవుడు ఆవులు మేపుతూ, ఈ కొండ ప్రాంతానికి వచ్చాడు. ఆ ఆవుల మందలోని ఒక ఆవు తప్పిపోయింది. సంజీవుడు వెతకగా పక్కన ఒక పెద్ద చింతచెట్టు కనబడగా, సేదతీరడనికై ఆ చెట్టు కింద నిద్రపోయాడు. కలలో స్వామివారు కనిపించి, నేనిక్కడ కోరంద పొదలో ఉన్నాను. నాకు ఎండ, వాన, ముండ్ల నుండి రక్షణ కల్పించు, నీ ఆవు జాడ అదిగో అని చెప్పి అదృశ్యమయ్యాడు. సంజీవుడు ఉలిక్కిపడి లేచి, ఆవును వెతకగా, 'శ్రీ ఆంజనేయుడు' కంటపడ్డాడు. సార్థకనాముడు సంజీవునికి మనస్సులో నిర్మల భక్తిభావం పొంగి పొరలింది. ఆనంద బాష్పజలాలు రాలి, స్వామివారి పాదాలను తడి పాయి. చేతులెత్తి నమస్కరించాడు. దూరం నుండి ఆవు 'అంబా' అంటూ పరిగెత్తుకు వచ్చింది. సంజీవుడు చేతి గొడ్డలితో కోరంద పొదను తొలగించగా, శంఖు చక్ర గదాలంకరణతో శ్రీ ఆంజనేయ స్వామివారు విశ్వరూపమైన పంచముఖాలలో ఒకటైన నారసింహ వక్త్రంతో ఉత్తరాభిముఖంగా ఉన్న రూపాన్ని చూసి ముగ్ధుడయ్యాడు. తన సహచరులతో కలిసి స్వామివారికి చిన్న ఆలయం నిర్మించాడు. నారసింహస్వామి ముఖం (వక్త్రం) ఆంజనేయస్వామి ముఖం, రెండు ముఖాలతో వేంచేసి యుండటం ఈ క్షేత్రం ప్రత్యేకత. ఇలా ద్విముఖాలతో స్వామివారు ఎక్కడ వెలసినట్లు లేదు. నరసింహస్వామి అంటే సాక్షాత్తు విష్ణు స్వరూపం కాబట్టి కొండగట్టు ఆంజనేయస్వామి వారికి స్వయంగా నారసింహవక్త్రం, శంఖం, చక్రం, వక్షస్థలంలో రాముడు, సీతలతో కలిగిన స్వరూపం కలిగి ఉండటం విశేషం. ఈ గుడిని 300 సంవత్సరాల క్రితం ఒక ఆవులకాపరి నిర్మించాడు. ప్రస్తుతము ఉన్న దేవాలయము 160 సంవత్సరాల క్రితము కృష్ణారావు దేశ్‌ముఖ్‌ చే కట్టించబడింది.
శ్రీ ఆంజనేయ స్వామి క్షేత్ర పాలకుడిగా శ్రీబేతాళ స్వామి ఆలయం కొండపైన నెలకొని ఉంది.
విగ్రహంలోని విశేషం:
--------------------------------
ఓ వైపు నృసింహస్వామి మరో వైపున ఆంజనేయస్వామి ముఖాలు కలిగిన ఆ విగ్రహాన్ని గ్రాస్తులంతా కలిసి ప్రతిష్ఠించారు. ఇక్కడ ఆంజనేయుడు రెండు ముఖాలతో కనిపించడం శంఖు చక్రాలు హృదయంలో సీతారాములను కలిగి ఉండటాన్ని విశేషంగా చెప్పుకుంటారు
ఐతిహాసిక చరిత్ర:
------------------------
త్రేతాయుగంలో ఈ ప్రాంతంలోని ఋషులు తపం యజ్ఞయాగా దులు చేసుకొంటున్న సమయంలో హనుమంతుడు లక్ష్మణుడి రక్షణార్థం సంజీవని పర్వతం తీసుకొని వెళ్ళసాగాడు. అది గమనించిన ఋషులు, రామదూతను సాదరంగా ఆహ్వానించారు. మీ మర్యాద బాగుంది. ఇది ఆగవలసిన సమయం కాదు కదా! శ్రీరాముడి కార్యానికై త్వరగా వెళ్ళాలి, తిరిగి వస్తాను అని చెప్పి వాయుసుతుడు వేగంగా వెళ్ళి పోయాడు. కొన్నిరోజులకు అవ్యక్త దుష్టగ్రహ శక్తులు ఆ ఋషుల దైవకార్యాలను ఆటంకపర్చసాగారు. తిరిగి వస్తానన్న హనుమ రాలేదు. వారిలో కొంతమంది ఋషులు గ్రహనాథులకు వైరియైన భూతనాథుడి భేతా ళాన్ని ప్రతిష్ఠించారు. లాభం లేకపోయింది. వారి ఉపాసనా తపశ్శక్తిని ధారపోయగా, వారి తపస్సుకు మెచ్చి పవిత్రమూర్తి పవనసుతుడు 'శ్రీ ఆంజనేయుడు' స్వయంభువుగా వెలిసాడు. నాటినుండి ఋషులు శ్రీ స్వామివారిని ఆరాధిస్తూ, వారి దైవకార్యాలను నిర్విఘ్నంగా చేసుకో సాగారు.
దగ్గరలోని ఆలయాలు, దర్శనీయ స్థలాలు:
-------------------------------------------------
ఈ దేవాయలయంతో పాటు కొండగట్టు దగ్గర కొండల రాయుని స్థావరం, మునుల గుహ, సీతమ్మ కన్నీటి ప్రదేశం, తిమ్మయ్యపల్లె శివారులోని బోజ్జ పోతన గుహలు, అటవీ మార్గం గుండా కొండపైకి పురాతన మెట్లదారి, భేతాళుడి ఆలయం, పులిగడ్డ బావి,, కొండలరాయుని గట్టు, శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం, శ్రీవేంకటేశ్వర ఆలయం, అమ్మ వారు, శ్రీరామ పాదుకలు, అందమైన ఆకృతులతో కనువిందు చేసే బండరాళ్లు, హరిత వర్ణంతో స్వాగతం పలికే వృక్షాలు కనువిందు చేస్తాయి. దేవాలయానికి సమీపంలో గుట్ట కింద నిర్మించిన అతి పెద్ద ఆంజనేయస్వామి విగ్రహాలు చూపరులను ఆకర్శిస్తాయి.
ప్రత్యేక ఉత్సవాలూ, పండుగలు
-----------------------------------------
శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం, కృష్ణాష్టమి, విజయ దశమి, వైకుంఠ ఏకాదశి, ఉత్తర ద్వార దర్శనం, ధనుర్మాసోత్సవం, గోదాకళ్యాణం, పవిత్రోత్సవం, శ్రావణ మేళా ఉత్సవం శ్రీ సుదర్శన యాగం మొదలగు ఉత్సవాలను ఈ క్షేత్రంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు.

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS