Sunday, May 5, 2024

రుద్ర నమకం చమకం అంటే ఏమిటి?

రుద్ర నమకం చమకం అంటే ఏమిటి?

"రుద్రం, నమకం, చమకం అంటే ఏమిటి?" - ఇది చాలా పెద్ద సమాధానం అవుతుంది.

రుద్రం గురించిన వివరాలు వీలైనంత క్లుప్తంగా వ్రాస్తాను. విభాగాలకు ఉప శీర్షికలు పెట్టాను. కనుక ఓపిక లేని వారు ఎంత కావాలో అంతవరకే చదువుకోవచ్చు.

శ్రీ రుద్రాన్ని ప్రత్యేకించి ఒక ఉపనిషత్తుగా భావిస్తారు కొందరు. దీనినే 'శత రుద్రీయం' అని కూడా అంటారు. ఇందులో నమకం మరియు చమకం అని పిలువబడే రెండు స్తోత్రాలు కలిసి ఉంటాయి. నమకంలో, ప్రతి మంత్రం "నమః" లేదా నమస్కారయుతమైన పిలుపుతో ప్రారంభమవుతుంది. చమకంలో ప్రతి మంత్రమూ "చ మే" అనే పద బంధాన్ని కలిగి ఉంటుంది, అంటే 'మరియు నేను' లేదా 'నాతో' అని అర్థం.

కృష్ణ యజుర్వేద తైత్తిరీయ సంహితలోని 4 వ కాండ, 5వ ప్రశ్నలోని 11 అనువాకాలలో మొత్తం 167 మంత్రాల నమకంతో బాటు, అదే కాండలో 7వ ప్రశ్నలోని 11 అనువాకాల చమకంను కలిపి 'శ్రీ రుద్రం' అంటారు. శ్రీ రుద్రంలో పేర్కొన్న రుద్రుడు ఋగ్వేదంలో చెప్పబడిన సాధారణ వైదిక దేవత కాదు. సర్వోన్నతుడైన భగవంతుడు. అనేక రూపాలలో అతని సర్వ వ్యాపకత్వం, సర్వ శక్తిత్వం, సర్వజ్ఞత, ఒక స్థాయి నుండి మరో ఉన్నత స్థాయికి విశ్వాన్ని నిరంతరం పరిణామం చెందేలా శాసించే ఈశత్వం వంటివి వర్ణించబడినాయి.

ప్రపంచంలోని మత పరమైన సాహిత్యంలో ఈ రకమైన స్తోత్రం బహుశ ఇది ఒక్కటే అనిపిస్తుంది. ఈ స్తోత్రాలలో దైవం అనే భావన కేవలం ఆహ్లాదకరమైన, శుభకరమైన విషయాలతో మాత్రమే కాకుండా భయానకం, విధ్వంసం వంటి విషయాలతో కూడా సంబంధించి ఉంటుంది. అంటే, సాధారణంగా భక్తులు అనైతికంగా భావించే అంశాలతో సహా, దేవుడు ప్రతి చోటా, ప్రతి దానిలోనూ వ్యాపించి ఉంటాడని ఈ మంత్రాలు చెబుతాయి.

శ్రీ రుద్ర నమకంలోని 11 అనువాకాలనూ కలిపి 11 పర్యాయాలు పారాయణం చేస్తే ( 112
= 121 పర్యాయాలు) దాన్ని "రుద్ర ఏకాదశి" అని, రుద్ర ఏకాదశిని 11 సార్లు పారాయణం చేస్తే ( 113 = 1331 పర్యాయాలు) "మహా రుద్రం" అని, మహా రుద్రాన్ని 11 సార్లు పారాయణం చేస్తే ( 114

= 14641 పర్యాయాలు) దాన్ని "అతి రుద్రం" అని అంటారు.

రుద్ర మంత్రాల గురించి వివరాలు:

రుద్రుని ఋగ్వేదంలో, యజుర్వేదంలో కూడా అతడి శౌర్యం, అతడి శక్తివంతమైన బాణాలు, విల్లులు, అతడి స్వస్థత చేకూర్చే శక్తి, మానవులను పాపాలు, దుఃఖాల నుండి తరింపజేసే సామర్థ్యం గురించి ప్రశంసించారు. యజుర్వేదంలోని రుద్రం(నమకం) లో 1, 10, 11 అనువాకాల్లో వివిధ ఛందాల్లో 37 ఋక్కులు, అనువాకం 2 నుండి 9 వరకు, ఇంకా 11వ అనువాకంలోని చివరి మంత్రం కలుపుకొని మొత్తం 130 యజుస్సులు ఇంకొన్ని అదనపు మంత్రాలు కలిసి ఉన్నాయి. మొత్తం రుద్ర ప్రశ్నకు ఋషి రుద్ర భగవానుడు, కాండ ఋషి అగ్ని, చంధస్సు లహవిరాట్, దేవత చంబు. ఇది కాకుండా, వివిధ ఋక్కులకు వాటి వాటి స్వంత ఋషులు, ఛందస్సులు, దేవతలు ఉన్నారు. యజుస్ భాగంలో 2 వ అనువాకం నుండి 4వ అనువాకం వరకు ఉన్న మొదటి 47 యజుస్సులు ప్రారంభంలో, అంతంలో "నమః" అనే పదాన్ని కలిగి ఉన్నాయి. 5 నుండి 9 వరకు ఉన్న మిగిలిన అనువాకాలలోని యజుస్సులు "నమః" తో మొదలవుతాయి కానీ "నమః" తో ముగియవు.

రుద్రం యొక్క ప్రశస్తి:

అభ్యాస వనరులలో వేదాలు అత్యున్నతమైనవి. వేదాలలో రుద్ర ప్రశ్న సర్వోన్నతమైనది. రుద్రంలో పంచాక్షరి మంత్రమైన "నమశ్శివాయ" అన్నది అత్యున్నతమైనది. ఆ మంత్రంలోని "శివ" అనే రెండు అక్షరాల పదం అత్యున్నతమైనది అని వేద పండితులు చెబుతారు.

రుద్రం లేదా నమకం యొక్క సారాంశం:

మొదటి అనువాకం రుద్రుని దయను కోరుతుంది. 2 నుండి 9 వరకు ఉన్న అనువాకాల్లో, అతడు అత్యున్నత దైవంగా నమస్కరించబడ్డాడు. 10వ అనువాకంలో, అతన్ని వివిధ వరాల కోసం ప్రార్థించారు. 11వ అనువాకంలో, రుద్రుని యొక్క వివిధ అభివ్యక్తులను ప్రార్థించారు.

*** సమాధానం ఇప్పటికే బోరు కొట్టి ఉంటే ఇక్కడితో చదవడం ఆపేయవచ్చు. క్రింద ఇచ్చిన అదనపు వివరాలు చదవకపోయినా విషయం అర్థమైనట్లే***

రుద్ర నమకం వివరాలు క్లుప్తంగా:

మొదటి అనువాకంలో రుద్రుని భయంకరమైన కోప తీవ్రతను వర్ణిస్తూ శాంతించమని కోరే 15 మంత్రాలు ఉన్నాయి. భక్తుని పాపాలు నశింప జేయగల దేవుని దయ కోసం, జ్ఞానం కోసం ప్రార్థనలు ఉన్నాయి. ఇందులోని 3 వ మంత్రాన్ని "రుద్ర గాయత్రి" అని పిలుస్తారు, ఇది చాలా మందికి తెలియదు.

రెండవ అనువాకంలో 13 యజుస్సులు ఉన్నాయి. మధ్యలో శ్వాస తీసుకొనే వ్యవధానం కూడా లేనంత వేగంగా ఉచ్చాటన చేసే ఈ మంత్రాలు (9 వ అనువాక వరకు అదే టెంపో ఉంటుంది) రుద్రుని విశ్వ రూపాన్ని వర్ణిస్తాయి.

మూడవ అనువాకంలో 17 యజుస్సులు ఉన్నాయి. రుద్రుని వివిధ రూపాలు, రకరకాల ఉపాధులలో ఉన్న రుద్రుని లక్షణాలను వర్ణిస్తాయి.

నాల్గవ అనువాకంలో కూడా 17 యజుస్సులు ఉన్నాయి. ఇవి రుద్రుని యొక్క రెండు తీవ్రమైన వైరుధ్యం గల రూపాలను వర్ణిస్తాయి. అతడు ఉన్నతుడు మరియు శుభంకరుడు, కానీ అదే సమయంలో హీనుడు మరియు నీచుడు. అంతేగాక అతడు కళాకారుడు అన్ని రకాల పనులలోనూ నేర్పరి అని చెబుతాయి.

ఐదవ అనువాకంలో 15 యజుస్సులు ఉన్నాయి. వీటిలో అతని ప్రత్యేక లక్షణాలు, ప్రవహించే నీటిలో అతని ఉనికి గురించిన వర్ణనలు ఉన్నాయి.

ఆరవ అనువాకంలోనూ 15 యజుస్సులు ఉన్నాయి, ఇవి సమయం, కాలం వంటి భావనలతో రుద్రునికి ఉన్న సంబంధాన్ని గురించి, వివిధ రకాల ప్రపంచాలలో, నాలుగు రకాల పుట్టుకల గురించి, అతని లోని యోధుని లక్షణాల గురించి, అతని సైన్యం గురించి తెలుపుతాయి.

ఏడవ అనువాకంలో 16 యజుస్సులు ఉన్నాయి. ఇవి రుద్రుడిని రాయబారిగా, దూతగా వర్ణించాయి. నిశ్చలమైన నీరు, వర్షం, తుఫాను, మేఘాలలో అతని ఉనికిని వివరించాయి.

ఎనిమిదవ అనువాకంలో 17 యజుస్సులు ఉన్నాయి, ఈ అనువాకాన్ని చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఎందుకంటే దీనిలోనే "నమః శివాయ" అనే పంచాక్షరీ మంత్రం ఉంది, ఇంకా "శివతరాయ" అన్న మాట కూడా. అంటే ఇంతకన్న శుభప్రదమైన వాడు ఎవరూ లేదు అని అతనిని స్తుతిస్తుంది. అతడు ఉమతో కూడి ఉన్నాడు. అతడు రాగి మరియు సూర్యుడి వలె ఎరుపు రంగులో ఉన్నాడు. అతడు ఒక్కడే ఆనందాన్ని ప్రసాదించగలడు. అతడు భయంకరుడు మరియు భయానకమైనవాడు, అతడు పాపాలను అధిగమించే సాధనం, మొదలైనవి ఈ అనువాక వర్ణిస్తుంది. రుద్రుడు కేవలం శివుడు మాత్రమే కాదు, శివతరమైన వాడు, శివతమమైన వాడు కూడా అని ఈ అనువాకం స్పష్టం చేస్తున్నది.

తొమ్మిదవ అనువాకంలో 19 యజుస్సులు ఉన్నాయి. రుద్రుడు సర్వవ్యాపి అని వర్ణిస్తాయి. అతడు అడవులు, పర్వతాలు, ఎడారులు, గడ్డి మైదానాలలోనూ ఉన్నాడు. ఆయనను ప్రార్థించినప్పుడు అతడు భక్తుల వద్దకు వెంటనే వస్తాడు, ఎవరూ ప్రవేశించలేని గుహల్లో, లోతైన నీళ్ళలో, మంచు బిందువులలోనూ, కంటికి కనిపించే మరియు కనిపించని దుమ్ము కణాలలోనూ నివసిస్తాడు వంటి వర్ణనలు ఉన్నాయి.

పదవ అనువాకంలో 12 మంత్రాలు ఉన్నాయి. ఇవి మొదటి అనువాకంలోని ప్రార్థనలకు కొనసాగింపు వంటిది. మమ్మల్ని, మా పశువులను బాధించకు. గ్రామాన్ని ఎలాంటి హాని జరగకుండా కాపాడు. మమ్మల్ని రోగ విముక్తులను చేయగల మందులను అందించు. మమ్మల్ని సంతోషంగా ఉంచు. మాకు దీర్ఘాయువు ఇవ్వు. మా పిల్లలకు, మా యువ, వృద్ధ బంధువులకు హాని కలగకుండా చూడు. పినాకమనే నీ విల్లును ఒక ఆభరణంగా కైగొని, పులి చర్మం ధరించి, మా వద్దకు ప్రసన్న వదనంతో, దయగల మనసుతో రావాలని అభ్యర్థిస్తున్నారు.

పదకొండవ అనువాకంలో 10 ఋక్కులు, 1 యజుస్సు ఉన్నాయి. భూమి మీద, ఆకాశంలో, అంతరాళంలో ఇంకా తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ, ఎగువ దిక్కులలో నిండి ఉన్న రుద్ర గణాలను ప్రార్థిస్తున్నారు.
సేకరణ

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS