మార్గశిర మాస శుక్లపక్ష అష్టమి రోజున కాలభైరవస్వామి జయంతి దీనినే భైరావాష్టమి అని అంటారు. సాక్షాత్ పరమ శివుని అవతారం కాలభైరవుడు.ఈ స్వామి వాహనం శునకం(కుక్క)అందుచేత ఈ రోజును కుక్కలను పూజించి ఆహారం సమర్పిస్తారు.ఈ భైరవావతారానికి గల ఒక కారణం ఉంది అని పెద్దలు చెబుతారు. ఒకానొక సందర్భంలో బ్రహ్మ ,విష్ణువు మధ్య వివాదాంశం తలెత్తింది.విశ్వాన్ని ఎవరు కాపాడుతున్నారు? పరతత్వం ఎవరు? ఇది చర్చకు దారి తీసింది.
అప్పుడు మహర్షులు ఇలా చెప్పారు-సమస్త విశ్వానికి మూలమైన పరతత్వం తెల్చిచెప్పాడానికి వీలుకానిది ఈ సమస్య దీనికి కారణం మీరిద్దరూ ఆశక్తి విభూతి నుండే ఏర్పడిన వారే కదా! అన్నారు ఋషులు. ఈ వాదనను అంగీకరించిన శ్రీ మాహావిష్ణువు మౌనం వహించాడు.కాని బ్రహ్మ అందుకు అంగీకరించలేదు. ఆ పరతత్వం మరెవరోకాదు ,నేనే అని బ్రహ్మ అహంను ప్రదర్శించాడు. అప్పుడు వెంటనే పరమశివుడు భైరవ స్వరూపాన్ని చూపి బ్రహ్మకు గర్వభంగం కలిగించాడు.ఈ బైరవ అవతారానికి కారణమైన రోజు మార్గశిర మాస శుద్ధ అష్టమి కావటంతో "కాలభైరవాష్టమి" గా ప్రసిద్ధి చెందింది.
మన పురాణాల ప్రకారం రౌద్ర స్వరూపుడు ,అసితాంగ భైరవుడు, రురు భైరవుడు, చండ భైరవుడు, క్రోథ భైరవుడు, ఉన్మత్త భైరవుడు, కపాల భైరవుడు, భీష్మ భైరవుడు, శంబర భైరవుడు అని ఎనిమిది రకాలు.
వీరు కాక మహాభైరవుడు, స్వర్ణాకర్షణ భైరవుడు మరో ఇద్దరు కనబడతారు. స్వర్ణాకర్షణ భైరవుడు చూడడానికి ఎర్రగా ఉంటాడు. బంగారు రంగు దుస్తులు ధరిస్తాడు. తలపై చంద్రుడు ఉంటాడు. నాలుగు చేతులు ఉంటాయి. ఒక చేతిలో బంగారు పాత్ర ఉంటుంది.
స్వర్ణాకర్షణ భైరవుడు సిరి సంపదలు ఇస్తాడని చెబుతారు.
ఇతర భైరవుల విషయానికి వస్తే సాధారణంగా భైరవుడు భయంకరాకారుడుగా ఉంటాడు. రౌద్రనేత్రాలు, పదునైన దంతాలు, మండే వెంట్రుకలు, దిగంబరాకారం, పుర్రెల దండ, నాగాభరణం ఉంటాయి.
నాలుగు చేతులలో పుర్రె, డమరుకం, శూలం, ఖడ్గం ఉంటాయి.
దుష్ట గ్రహబాధలు నివారించగల శక్తి మంతుడు రక్షాదక్షుడు ఈ కాలభైరవుడు.కాలస్వరూపం తెలిసిన వాడు.కాలంలాగే తిరుగులేనివాడు.
ఎంత వ్యయమైనా తరిగిపోని వాడు. శాశ్వతుడు, నిత్యుడు. కాలభైరవుడు.
భక్తిశ్రద్ధలతో కొలిచే వారు "ఓం కాలాకాలాయ విద్మహే కాలాతీతాయ ధీమహే తన్నో కాలభైరవ ప్రచోదయాత్" అని ప్రార్థిస్తారు.
గ్రహబలాలను అధిగమించి అదృష్ట జీవితాన్ని,సంకల్ప సిద్ధిని పొందడం భైరవ ఉపాసనతో సాధ్యమని శాస్త్రాలు చెబుతున్నాయి.
కాలభైరవుడిని కాశీ క్షేత్ర పాలకుడిగా కీర్తించారు. ఏది సాధించాలన్నా ముందుగా ఆయన అనుమతి తీసుకోవాలని కాశీక్షేత్ర మహిమ చెబుతుంది.
సాక్షాత్తు శివుడే కాలభైరవుడే సంచరించాడని శాస్త్రాలు చెబుతున్నాయి.
హోమ కార్యాలలో అష్టాభైరవులకు ఆహుతులు వేసిన తరువాతే ప్రధాన హోమం చేస్తారు.
భక్తులకు అనుగ్రహాన్ని, అతీంద్రమైన శక్తులను ఆయన ప్రసాదిస్తారు.
దేవాలయంలో ఆయనకి గారెలతో మాల వేస్తారు. కొబ్బరి, బెల్లం నైవేద్యంగా పెడతారు.
ఈశ్వరుడు ఆయుష్షుని ప్రసాదిస్తాడు. ఆయనకు పరమ విధేయుడైన కాలభైరవుడిని ఆరాదిస్తే ఆయుష్షు పెరుగుతుందని ప్రతీతి.
కాలభైరవుని 'క్షేత్రపాలక' అని కూడా అంటారు. క్షేత్రపాలకుడంటే ఆలయాన్ని రక్షించే కాపలాదారు అని అర్ధం.
రాష్ట్రంలో, మన దేశంలోనే కాక విదేశాలలోను కాలభైరవస్వామి దేవాలయాలు చాలానే ఉన్నాయి.
-> కామారెడ్డి జిల్లాలోని రామారెడ్డి ఊరులో కాలభైరవ స్వామి దేవాలయం ఉంది. ఈ దేవాలయాన్ని రెండవ కాశీగా భావిస్తారు. ఇక్కడ నిత్యపూజలు, విశేష పూజలు,రధోత్సవం మొదలగునవి ఘనంగా జరిపిస్తారు,నిత్య అన్నదానం జరుగుతుంది, భక్తుల సౌఖర్యం కొరకు దేవాలయ వసతి సత్రాలు కూడా ఉన్నాయి.
-> శ్రీ కాళహస్తిలో కాలభైరవుడు, బట్టల భైరవుడుగా కోలువు దీరాడు.భక్తులు తమ ఒంటిమీది బట్టలలో కోన్ని పోగులను తీసి స్వామిపై వేస్తారు ఇలా చెయడం వలన అరిష్టాలు తోలగి ఏ లోటు లేకుండా ఉంటుందని విశ్వసిస్తారు.
-
> విశాఖపట్నంలో భైరవకోన ఎంతో ప్రముఖమైనది.
-> జగ్గయ్యపేటలో శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి దేవాలయములో క్షేత్రపాలకుడు కాలభైరవుడే ఇక్కడ ప్రత్యేకముగా మందిరము కూడా ఉన్నది.
-> న్యూఢిల్లిలో పురానా ఖిల్లా దగ్గరున్న భైరవాలయం అతి ప్రాచీనమైంది.
-> పాండవుల రాజధాని ఇంద్ర ప్రస్త నగరంలో ప్రశస్తమైన కాలభైరవ ఆలయం ఉంది.
-> తమిళనాడులో అరగలూరులోని శ్రీకామనాథ ఈశ్వరాలయంలో అష్ట భైరవుడున్నాడు.
-> కరైకుడి,చోళపురం,అధియమాన్ కొట్టయ్, కుంభకోణాల్లో భైరవస్వామి దేవాలయాలు ఉన్నాయి.
-> మధ్యప్రదేశ్ ఉజ్జయినీలో కాల భైరవాలయం ఉంది.
-> కర్ణాటక రాష్ట్రంలోని అడిచున్‌చనగిరి, మంగళూరు కద్రి ప్రాంతాల్లో కాలభైరవ దేవాలయాలు ఉన్నాయి.
ఈ క్షేత్రాలలో ఉండే కాలభైరవుని క్షేత్రపాలకుడు అంటారు.మన దేశంలో కాలభైరవ ఆలయాలు ఎక్కువగా లేకున్నా కాలభైరవ క్షేత్రాలు చాలా ఉన్నాయి. నేపాల్, ఇండోనేసియా, థాయ్‌లాండ్ దేశాలలో కాలభైరవ పూజ విశేషంగా జరుగుతుంది.
ఇక్కడ ఆలయాలలో కాలభైరవుడు ప్రధాన దైవంగా ఉంటాడు. నేపాల్ దేశానికి జాతీయ దైవంగా కాలభైరవుడు పూజలందుకుంటున్నాడు.భక్తులు తమకు క్రమశిక్షణ అలవడాలని, ప్రయాణాల్లో రక్షకుడుగా తోడుండాలని, నిరంతరం ఆపదలనుండి కాపాడాలని భక్తి ప్రపత్తులతో కాలభైరవుని విశేషించి పూజిస్తుంటారు.
డా. యం. ఎన్. చార్య- శ్రీమన్నారాయణ
No comments:
Post a Comment