కురవి వీరభద్రుడు
అభ్రంలిహాదభ్ర విభ్ర మాభ్రభ్రమ;
కృన్నీలదీర్ఘ శరీర మమరఁ
బ్రజ్వలజ్జ్వలన దీప్తజ్వాలికా జాల;
జాజ్వల్యమాన కేశములు మెఱయఁ
జండ దిగ్వేదండ శుండాభ దోర్దండ;
సాహస్ర ధృత హేతిసంఘ మొప్ప
వీక్షణత్రయ లోకవీక్షణ ద్యుతి లోక;
వీక్షణతతి దుర్నిరీక్ష్యముగను
గ్రకచ కఠిన కరాళ దంష్ట్రలు వెలుంగ
ఘన కపాలాస్థి వనమాలికలును దనర
నఖిలలోక భయంకరుఁ డగుచు వీర
భద్రుఁ డుదయించె మాఱట రుద్రుఁ డగుచు.
(పోతన భాగవతంలో వీరభద్రుడి వర్ణన)
నల్లని రూపం, కోర మీసాలు, పదునైన చూపులు! కుడివైపున ఒక చేతిలో ఖడ్గం, ఒక చేతిలో త్రిశూలం, ఒక చేతిలో పుష్పం, ఒక చేతిలో గద, ఒక చేతిలో దండం. ఎడమవైపున ఒక చేతిలో డమరుకం, ఒక చేతిలో సర్పం, ఒక చేతిలో విల్లు, ఒక చేతిలో బాణం, ఒక చేతిలో ముద్దరం. మొత్తంగా ఐదు జతల చేతులు! స్వామి పాదాలకింద వినయంగా నంది వాహనం. ఎడమవైపున భక్తులకు అభయమిస్తూ భద్రకాళిక. వీరభద్రుడి రౌద్ర రూపం భూతప్రేత పిశాచాలకు వణుకుపుట్టిస్తుందని భక్తుల విశ్వాసం. కాబట్టే దుష్టశక్తుల పీడ తొలగించుకోడానికి ఎక్కడెక్కడి జనమో ఇక్కడి దేవుడిని శరణువేడతారు.
వరంగల్ జిల్లాలోని కురవిలో భద్రకాళీ సమేతుడై కొలువుదీరాడు వీరభద్రుడు! కురవి అంటే ఎరుపు... ఆ రంగు వీరభద్రుడి రుధిర నేత్ర జ్వాలకు ప్రతీక కావచ్చు. ఇక్కడే పరమశివుడూ పూజలందుకుంటున్నాడు. ప్రధాన ద్వారం నుంచి ఆలయంలోకి ప్రవేశించగానే...అనుజ్ఞ గణపతి దర్శనమిస్తాడు. గణపయ్య ఆనతి తీసుకున్నాకే వీరభద్రుడికి పూజలు చేయడం ఆనవాయితీ. అనుమతి ఇచ్చేవాడు కాబట్టే, ‘అనుజ్ఞ’ గణపతి అన్న పేరొచ్చింది. ఆలయ ఉత్తర భాగంలో రామలింగేశ్వరస్వామి, దక్షిణంలో చంద్రమౌళీశ్వరుడూ ఉన్నారు. ఇంకా ఇక్కడ నవగ్రహాల్నీ సప్తమాతృకల్నీ ప్రతిష్ఠించారు. ఆలయానికి అనుబంధంగా ఆంజనేయుడి గుడి ఉంది. నాగేంద్రుడి విగ్రహమూ కొలువుదీరింది.
పురాణాల్లో...
తండ్రి కాదని అన్నా, వద్దని చెప్పినా వినకుండా...దక్ష ప్రజాపతి కూతురు సతీదేవి పరమేశ్వరుడిని పరిణయమాడింది. ఆతర్వాత కొంతకాలానికి, దక్షుడు మహాయజ్ఞాన్ని తలపెట్టాడు. ముల్లోకాలకూ పిలుపులు వెళ్లాయి. ఒక్క... కైలాసానికి తప్ప. అయినా, పుట్టింటి మీద మమకారంతో సతీదేవీ ప్రయాణమైంది. భార్యను చిన్నబుచ్చడం ఇష్టం లేక, పరమేశ్వరుడూ సరేనన్నాడు. బిడ్డ వచ్చిన సంతోషం దక్షుడిలో మచ్చుకైనా కనిపించలేదు. సరికదా, అజ్ఞానంతో అహంకారంతో ఆ ఆలూమగల్ని చిన్నచూపు చూశాడు. ఈశ్వరుడిని నానా మాటలూ అన్నాడు. ఆ అవమానాన్ని భరించలేక సతీదేవి అగ్నికి ఆహుతైంది. పరమేశ్వరుడు...ఆ ఘోరాన్ని చూడలేకపోయాడు. మహోగ్రరూపం దాల్చాడు. ప్రళయ తాండవం చేశాడు. దుష్టశిక్షణ కోసం తన జటాజూటంలోంచి వీరభద్రుడిని సృష్టించాడు. ఆ వీరుడు ‘హరహర మహాదేవ’ అంటూ వెళ్లి దక్షుడి తల తెగనరికాడు. అంతలోనే, ‘పరమేశ్వరా, శాంతించు! యజ్ఞాన్ని మధ్యలోనే ఆపేయడం క్షేమం కాదు’ అని దేవతలంతా వేడుకున్నారు. శివుడు శాంతించాడు. దక్షుడి మొండేనికి మేక తలను తగిలించి...కార్యాన్ని పరిసమాప్తి చేయించాడు. శివుడైతే శాంతించాడు కానీ, వీరభద్రుడి క్రోధాగ్ని చల్లారలేదు. దీంతో మహాశక్తి... తనలోని పదహారు కళలలో ఒక కళని భద్రకాళిగా పంపింది. ఆమె సమక్షంలో వీరభద్రుడు చల్లబడ్డాడు. ముక్కోటి దేవతల సమక్షంలో భద్రకాళీ వీరభద్రుల వివాహం ఘనంగా జరిగింది.
ఎన్నో నమ్మకాలు...
వీరభద్రుడి ఆలయంలోని ధ్వజస్తంభం మహిమాన్వితం. పూర్వం, సరిగ్గా దీని కింద ఓ శక్తియంత్రం ఉండేదట. స్తంభాన్ని ఆలింగనం చేసుకోగానే...ఎంతటివారైనా, అప్రయత్నంగా సత్యాన్నే పలికేవారట. నిజం నిప్పులాంటిది. ఆ తీక్షణతను సామాన్యులు భరించలేరు. ఫలితంగా, ప్రజల మధ్య అపనమ్మకాలు పెరిగాయి, ఘర్షణలు చెలరేగాయి. దీంతో... శక్తియంత్రాన్ని ధ్వజస్తంభానికి కాస్త పక్కగా జరిపినట్టు స్థానికులు చెబుతారు. సంతానభాగ్యాన్ని కోరుకునేవారు, తడిబట్టలతో పాణసరం పెట్టే (పొర్లుదండాలు వేసే) సంప్రదాయమూ ఉందిక్కడ. శివరాత్రికి ఈ క్షేత్రం కైలాసగిరిని తలపిస్తుంది. అంగరంగవైభవంగా భద్రకాళి-వీరభద్రుల కల్యాణం జరుపుతారు. పదహారు రోజుల పాటూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఘనంగా రథోత్సవం జరుగుతుంది. ప్రభ బండ్లని ప్రదర్శిస్తారు.
No comments:
Post a Comment