Sunday, February 20, 2022

తారాబలం దోష పరిహారాలు

 తారాబలం దోష పరిహారాలు


తారాబలం వివాహ సంబంద విషయాలలో ముఖ్యంగా చూస్తారు. అమ్మాయి నక్షత్రం నుండి అబ్బాయి నక్షత్రానికి తారాబలం సరిపోతే ఇద్దరు ఒకరి మనస్సుని ఒకరు అర్ధం చేసుకుంటూ అన్యోన్యంగా ఉంటారు.

చంద్రుడు మనకు ఏ తార ద్వారా కనపడతాడో ఆ తార మనకు జన్మ తార అవుతుంది. చంద్రుడు మనస్సుకి, నీటికి కారకుడు. నక్షత్రాన్ని బట్టి మనకు ప్రకృతి తెలుస్తుంది. మన జన్మతార మన మనస్సును నిర్ణయిస్తుంది. దాదాపుగా ఒకే నక్షత్రంలో ఉన్నవారు ఒకే విధమైన మానసిక చంచలత్వం కలగి ఉంటారు. చంద్రుడు 1, 3, 6, 7, 10, 11 స్ధానాలలో ఉన్నప్పుడు బలంగా ఉంటాడు.

జన్మ నక్షత్ర మారభ్య నిత్య నక్షత్ర గణ్యతే ı

నవ సంఖ్యా హరద్భాగం శేషం ఫల మిదం శృణు ıı

జన్మ సంపద్విపత్ క్షేమ ప్రత్యక్సాధన నైధన ı

మిత్రం పరమ మైత్రం చ నవతారాఃప్రకీర్తితాః

జన్మ నక్షత్రం లేదా నామ నక్షత్రం నుండి లెక్కించి వచ్చిన దానిని తొమ్మి దిచే భాగించగా మిగిలిన శేషాన్ని బట్టి తొమ్మిది తారలు నిర్ణయిస్తారు.

శేషం 1 అయితే జన్మతార అని, శేషం 2 అయితే సంపత్ తార అని, శేషం 3 అయితే విపత్ తార అని, శేషం 4 అయితే క్షేమతార అని, శేషం 5 అయితే ప్రత్యక్ తార అని, శేషం 6 అయితే సాధనతార అని, శేషం 7 అయితే నైధన తార అని, శేషం 8 అయితే మిత్రా తార అని, శేషం 9 అయితే పరమమిత్ర తార అని నిర్ణయిస్తారు.

నవతారల ఫలాలు

జన్మనో దేహ పీడాచ సంపత్సంపద మేవాచ

విపదే ప్రీతి నాశాయ క్షేమం క్షేమ కరోభవేత్

ప్రత్యక్కార్య వినాశాయ సాధన కార్య సాధనం

నైధనే నిధనం చైవ మిత్రేణ సుఖ సంపదాః

పరమ మైత్రే ధనం లాభం ఇత్యేతే తార లక్షణమ్

జన్మతార దేహ నాశనాన్ని, సంపత్తార సంపదను, విపత్తార కష్టాలను, క్షేమతార క్షేమాన్ని, ప్రత్యక్తార కార్య నాశనాన్ని, సాధనతార కార్య సాధనాన్ని, నైధన తార మరణాన్ని, మిత్రతార సుఖసంపదలను, పరమ మైత్ర తార ధన లాభాన్ని కలిగిస్తాయి.

వివాహానికి ప్రత్యక్తారలలో ముహూర్తం పెట్టుకోవచ్చు. అను జన్మ తారలలోను పెట్టుకోవచ్చును. విపత్, నైధన తారలను వదిలిపెట్టాలి.

ప్రధమ నవకంలో జన్మతారను, ద్వితీయ నవకంలో విపత్తారను, తృతీయ నవకంలో ప్రత్యక్తారను, మూడు నవకాలలో నైధనతారను విడిచిపెట్టాలి.

తారాదోష పరిహారార్దం దానాలు

తారా దోష పరిహారానికి అంటే తారల వల్ల కలిగే నష్టాలు పోవటానికి ఈ క్రింది దానాలు చేయాలి.

శాకం గుడంచ లవణం సతిలం కాంచనం తధా ı

అరిష్ట పరిహారాయ దద్యాద్దానం సమాచరేత్ ıı

జన్మతార, విపత్తార, ప్రత్యక్తార, నైధనతారలు అశుభాన్ని కలిగిస్తాయి. ఆ తారల దోష పరిహారార్ధం ఈ క్రింది దానాలు చేయాలి. జన్మతారకు ఆకుకూరలు, విపత్తారకు బెల్లం, ప్రత్యక్ తారకు ఉప్పు, నైధనతారకు నువ్వులతో కూడిన బంగారం దానంగా ఇవ్వాలి.

దానం ప్రకృతికి చేస్తే మంచిది. ఉదా:-ఉప్పును కొబ్బరి చెట్టుకి పోస్తే మంచిది. దానం చేసేది వ్యక్తులకు ఉపయోగపడాలి. దానం పొందిన వారి ద్వారా మనకు పుణ్యబలం వస్తుంది. దానం చేసే స్ధోమత లేనప్పుడు మనస్సులోనే దానం చేసినట్లు భావించాలి.

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS