Monday, February 12, 2018

మహాశివరాత్రి ఉత్సవాలు



మహాశివరాత్రి రోజు ఉపవాసం, జాగారం ఖచ్చితంగా ఎందుకు చేయాలో తెలుసా..?

ప్రతి సంవత్సరం మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చే మహాశివరాత్రి అత్యంత ప్రాధాన్యంగల పవిత్రదినం. ప్రతి నెలా బహుళ చతుర్దశి నాడొచ్చేది మాస శివరాత్రి. ఉపవాసం, శివార్చన, జాగరణ… శివరాత్రి నాడు ఆచరించవలసిన ప్రధాన విధులు. సమస్త జగత్తును దహించివేసేందుకు సిద్ధమైన హాలాహలాన్ని తన గొంతుకలో దాచుకున్న నీలకంఠుడు. సహధర్మచారిణికి తన శరీరంలో అర్ధ‌భాగమిచ్చిన అర్ధ‌నారీశ్వరుడు. తనను యముని బారినుంచి రక్షించమని కోరిన భక్త మార్కండేయను చిరంజీవిగా జీవించమని వరాన్ని ప్రసాదించిన భక్తజన బాంధవుడు. మహేశ్వరుడిని, పరమేశ్వరుడి అనుగ్రహం లభించాలంటే, మహా శివరాత్రి రోజున పూజ చేసుకోవడం ఉత్తమమైన మార్గం. ‘శివ’ అను పదానికి మంగళకరం, శుభప్రదం అని అర్ధం. కైలాసనాథుడైన శంకరుడు మహాశివరాత్రి నాడు లింగంగా ఆవిర్భవించిన రోజునే మహాశివరాత్రిగా పరిగణించబడుతోంది. యావత్‌ ప్రపంచాన్ని నడిపించే ఆ ఈశ్వరుడే… మాఘ మాసం బహుళ చతుర్ధశి రోజు అనంత భక్త కోటి కోసం “శివలింగంగా” ఆవిర్భవించాడని పురాణాలు చెప్తున్నాయి.

శివరాత్రి యొక్క మహాత్మ్యాన్ని చాటి చెప్పే కథ ఒకటి బాగా ప్రాచుర్యంలో ఉంది. వారణాసిలో ఉండే సుస్వరుడనే బోయవాడు ఒకరోజు అడవిలో తిరుగుతూ దారి తప్పి పోతాడు. చీకటి పడే సమయానికి ఒక బిల్వ వృక్షాన్ని ఆశ్రయంగా చేసుకుని దాని మీద ఎక్కి కూర్చొని, ఆకలితో ఆ రోజంతా నిద్ర లేకుండా జాగారం చేస్తూ…. తన రాక కోసం ఎదురుచూసే భార్యాబిడ్డల్ని తలుచుకుని కన్నీటి పర్యంతం అవుతాడు. ఆ రాత్రి ఏం చేయాలో…? ఎటు వెళ్లాలో తోచక ఆలోచిస్తూ కొమ్మలకున్న ఆకుల్ని ఒక్కొక్కటిగా తుంచి కిందకి పడేస్తాడు. ఆ ఆకులు నేరుగా వెళ్లి చెట్టు కింద కొలువైన శివలింగం మీద పడతాయి. తెల్లవారగానే ఆ బోయవాడు ఇంటికి చేరుకుంటాడు. కాలాంతంలో అతను మరణించి శివసాయుజ్యం చేరుకున్నాడు. బోయవాడు అడవిలో దారితప్పిన రోజు మహాశివరాత్రి అవటం, ఆ రాత్రంతా భోజనం చేయకుండా జాగారం చేయడమే కాకుండా, తన కన్నీటితో శివలింగానికి అభిషేకం చేసి, బిల్వపత్రాలతో అర్చించడం వల్ల బోయవాడు శివసాయుజ్యం చేరుకున్నాడు. బోయవాడు శివరాత్రి మహాత్మ్యం గురించి తెలియకపోయినా యాదృచ్ఛికంగా జరిగిన పూజా ఫలాన్ని అతను మరణానంతరం పొందగలిగాడు.

మహా శివరాత్రి రోజు ఉపవాసం, జాగరణ ఉండటం హిందువుల సంప్రదాయం. ఉపవాసం ఉండే ముందు రోజు, ఉపవాసం మరుసటి రోజు మాంసాహారం, గుడ్డు మొదలైనవి తినకూడదు. మద్యపానం చేయకూడదు. ఎలాగూ ఉపవాసం చేస్తున్నాం కదా, ఉదయం లేస్తే ఆకలి తట్టుకోవడం కష్టమని, ఆలస్యంగా లేస్తారు కొందరు.. అలా చేయకూడదు. ఉపవాసం ఉండేరోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి, తలపై నుంచి స్నానం చేసి శివదర్శనం చేసుకొని, శివనామస్మరణతో ఉపవాసం వుండాలి. రాత్రివేళలో శివలింగానికి పూజలు చేస్తూ జాగారం చేయాలి. పూజా విధానం, మంత్రాలు తెలియక పోయినప్పటికీ ఉపవాసం, జాగరణం, బిల్వార్చన, అభిషేకంలాంటి వాటిలో పాల్గొంటే చాలు శివానుగ్రహం లభిస్తుందని వేద పండితులు చెప్తున్నారు. ఇలా చేస్తే అనుకున్న కార్యాలు జరుగుతాయి. శివరాత్రి రోజు ఉపవాసం, జాగరణ చేయటం వల్ల సకలసంపదలు చేకూరుతాయని వారు సూచిస్తున్నారు. శివరాత్రి మొత్తం శివనామంతో, ఓం నమః శివాయ అనే పంచాక్షరీ మహామంత్ర జపం/స్మరణతో జాగరణ మీలో నిక్షిప్తమై ఉన్న అనంతమైన శక్తిని జాగృతం చేస్తుంది.

శివరాత్రి మరునాడు ఉదయం శివాలయాన్నిసందర్శించి, ప్రసాదం తీసుకుని, ఇంటికి వచ్చి భోజనం చేసి ఉపవాస వ్రతం ముంగించాలి. అందరూ గుర్తుపెట్టుకోవలసిన ముఖ్య విషయం, శివరాత్రి నాడు ఉపవాసం, జాగరణ చేసినవారు, తరువాతి రోజు రాత్రి వరకు నిద్రించకూడదు. అప్పుడే సంపూర్ణఫలం దక్కుంతుదని చెప్తారు.''ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్''

అనే మహామృత్యుంజయ మంత్రాన్ని మహాశివరాత్రి రోజున పఠిస్తే అనుకున్న కార్యాలు విజయంవంతంగా పూర్తవుతాయి.

ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా పునర్జన్మంటూ వుండదు.

మహాశివరాత్రి రోజున ''ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి.. తన్నో రుద్ర: ప్రచోదయాత్'' అనే శివ గాయత్రి నామంతో శివునిని పూజించే వారికి సకలసంపదలు చేకూరుతాయి.

ఈ మంత్ర జపంతో శివుని అనుగ్రహం పొందవచ్చు. ఈ రెండు మంత్రాలను శివరాత్రి రోజున 108 సార్లు జపించినట్లైతే దీర్ఘాయువు, ఆరోగ్యం చేకూరుతుంది. ప్రశాంతత, ఆనందం చేకూరుతుంది. భయం తొలగిపోతుంది. శరీరానికి బలం చేకూరుతుంది. ఏకాగ్రతను పెంచుతుంది. మహాశివరాత్రి రోజునే కాకుండా ఓ రోజైనా పగలు లేదా రాత్రి పూట ఈ మంత్ర జపంతో పరమేశ్వరుడి అనుగ్రహం పొందవచ్చు.ఓం నమశ్శివాయ _/"\_
శివరాత్రి :

"శివ'' అంటే "శివుడు;; - "రాత్రి'' అంటే "పార్వతి''

వీరిద్దరి కలయికే "శివరాత్రి''. వీరిద్దరికీ వివాహమైన రాత్రే "శివరాత్రి''. వీరికి పూర్వం వివాహమైన దంపతులు పురాణాలలో కనిపించరు. అందుకే పార్వతీపరమేశ్వరులను "ఆదిదంపతులు'' అన్నారు. వీరి కళ్యాణం, జగత్కల్యాణానికి నాంది అయినది కనుకనే "శివరాత్రి'' విశ్వానికికంతటికీ పర్వదినం అయింది. అంతేకాదు, తమలో ఎవరు గొప్ప అనే విషయంలో బ్రహ్మ, విష్ణువులకు మధ్య వాగ్వివాదం జరిగినప్పుడు, పరమేశ్వరుడు తెజోలింగముగా ఉద్భవించి, వారికి జ్ఞామోపదేశం చేసినది ఈ "శివరాత్రి'' నాడే. అందుకే మాఘబహుళ చతుర్దశి తిథినాడు అర్థరాత్రి సమయాన్ని "లింగోద్భవ'' కాలంగా భావించి శివరాధనలు, శివార్చనలు చేయడం ఆచారమైంది. ఈ శివరాత్రి పర్వదినంనాడే "శివపార్వతులకు'' కళ్యాణం చేసి ఆనందించడం అలవాటైపోయింది.

అభిషేకం ఎందుకు చేయాలి ?
"అభిషేక ప్రియం శివః'' అన్నారు. శివుడు అభిషేకప్రియుడు. నిర్మలమైన నీటితో అభిషేకమంటే శివునలు చాలా యిష్టం. ఇందులో అంతరార్థం ఏమిటంటే -
"నీరము'' అంటే "నీరు'' నీరమునకు ఆధారుడు కనుకనే శ్రీమహావిష్ణువును "నారాయణుడు'' అన్నారు. నీరు సాక్షాత్తు విష్ణుస్వరూపం. అందుకే శివునకు "నీరు'' అంటే చాలా యిష్టం. అందుకే శివునికి జలాభిషేకం చేస్తున్నప్పుడు ఆ నీటిస్పర్శతో నారాయణ స్పర్శానుభూ

"శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే
శివస్య హృదయం విష్ణుర్ విష్ణోశ్చ హృదయం శివః''

శివునకు అభిషేకం చేసే ప్రక్రియలో క్షీరాభిషేకమనీ, గందాభిషేకమనీ, తేనెతో అభిషేకమనీ ... చాలా రకాల అభిషేకాలు చోటు చేసుకున్నాయి. కానీ ఈ అభిషేకాలన్నింటికన్న "జలాభిషేకం'' అంటేనే శివునకు ప్రీతికరం. అందులోనూ "గంగాజలాభిషేకం'' అంటే మహా యిష్టం. ఎందుకంటే "గంగ'' "విష్ణుపాదోద్భవ'' విష్ణు పాదజలమైన గంగ అంటే శివునకు ఆనందకరం, అన్డుకేం శివుడు, గంగను తన శిరసున ధరించి గౌరవించాడు.

ఆ తర్వాత శివుడు ఇష్టపడే అభిషేకం "చితాభాస్మాభిషేకం'' ఎందుకంటే ఆయన "చితాభస్మాంగదేవుడు'' కదా! ఈ అభిషేకం, ఉజ్జయినిలో "మహాకాలేశ్వరునికి'' ప్రతినిత్యం ప్రాతఃకాలంలో తొలి అభిషేకంగా జరుగుతుంది. ఏది ఏమయినా, శివాభిషేకం ... సంతతధారగా జలంతో అభిషేకించడమే ఉత్తమం ...ఎందుకంటే "జలధార శివః ప్రియః'' అన్నారు కదా! ఈ అభిషేకాన్ని "రుద్రైకాదశిని'' అనబడే నమక, చమకాలతో చేయాలి. అనంతరం మారేడుదళాలతో, తుమ్మిపూలతో అర్చించాలి. నమకంలోని "నమశ్శివాయ'' అను పంచాక్షరీ మంత్రంలో "శివ'' అనే రెండు అక్షరాలు "జీవాత్మ'' అనే హంసకు రెండు రెక్కలవంటివి. జీవుని తరింపజేయడానికి "శివాభిషేకం'' అత్యంత ఉత్తమైన సులభమార్గమని, "వాయుపురాణం'' చెబుతుంది. "వేదేషు శతరుద్రీయం, దేవతాను మహేశ్వరః'' అనునది సూక్తి. దేవతలలో మహేశ్వరుడు ఎంత గొప్పవాడో, వేదాలలో శతరుద్రీయం అంత గొప్పది. నమక, చమకాలు గల ఈ రుద్రంతో శివునకు అభిషేకం చేస్తే, సంతాన రాహిత్య దోషాలు, గ్రహబాధలు తొలగిపోతాయని ఆవస్తంబు ఋషి చెప్పాడు.

అందుకే, శివుని ప్రతినిత్యం అభిషేకించాలి. అలా ప్రతినిత్యం అభిషేకం చెయ్యడం కుదరని వారు ఈ మహాశివరాత్రి నాడయినా భక్తిగా అభిషేకిస్తే అనంతపుణ్యం పొందుతారు.

"శివరత్రౌ అహోరాత్రం నిరాహారో జితేంద్రియ: |
ఆర్చయేద్వా యధాన్యాయం యధాబలమ చకం ||
యత్ఫలం మమమ పూజాయాం వర్షమేకం నిరంతరం |
తత్ఫలం లభతే సద్యః శివరాత్రౌ మదర్చానాత్ ||

శివరాత్రినాడు పగలు, రాత్రి ఉపవాసముండి, ఇంద్రియనిగ్రహంతో శక్తివంచన లేకుండా, శాస్త్రం చెప్పిన విధంగా నన్ను అర్చించినవారికి, సంవత్సరమంతా నన్ను అర్చించిన ఫలం ఒక్క "శివరాత్రి'' అర్చనవలన లభిస్తుందని'' "శివపురాణంలో సాక్షాత్తు శివుడే దేవతలకు చెప్పాడు.
శివరాత్రికి ముందురోజున, అనగా మాఘబహుళ త్రయోదశినాడు ఏకభుక్తం చేసి, ఆ రాత్రి శివాలయ ప్రాంగణంలో నిదురించాలి. మరునాడు "మాఘబహుళ చతుర్దశి'' శివరాత్రి పర్వదినం కనుక, ప్రాతఃకాలాన్నేలేచి, స్నానాదికాలు పూర్తిగావించుకుని, శివాలయానికి వెళ్ళి ఆ రోజు మొత్తం శివుని అభిషేకించాలి. రాత్రంతా జాగరణ చేస్తూ, శివుని అర్చించాలి. లింగోద్భవకాలంలో అభిషేకం తప్పనిసరిగా చేయాలి. తరువాత శివపార్వతులకు కళ్యాణం చేసి, చతుర్దశి ఘడియలు పోకుండా అన్నసమారాధన చేయాలి.

నమక, చమకాలతో అభిషేకం చేయలేనివారు, "ఓం నమశ్శివాయ'' అనే మంత్రాని పఠిస్తూ చేసినా అదే ఫలాన్ని అనుగ్రహిస్తాడు సాంబశివుడు.

బిల్వపత్రాల విశిష్టత :
శివపూజకు బిల్వపత్రాలు [మారేడుదళాలు] సర్వశ్రేష్టమైనవి. మారేడువనం కాశీక్షేత్రంతో సమానం ... అని శాస్త్రప్రమాణం. మారేడుదళాలతో శివార్చన చేయడంవల్ల కాశీక్షేత్రంలో శివలింగ ప్రతిష్ట చేసిన ఫలం లభిస్తుంది. సాలగ్రామ దానఫలం,శాత అశ్వమేధయాగాలు చేసిన ఫలం, వేయి అన్నదానాలు చేసిన ఫలం, కోటి కన్యాదానాలు చేసిన ఫలం. ఒక బిల్వాదళంతో శివార్చన చేయడం వలన లభిస్తుంది అని "బిల్వాష్టకం''లో చెప్పబడింది. "ఏకబిల్వం శివార్పణం'' అని శివుని అర్చిస్తే, అనేక జన్మల పాపాలు నశిస్తాయి.
బిల్వదళంలోని మూడు ఆకులూ, సత్త్వ, రజ, స్తమోగుణాలకూ, శివుని త్రినేత్రాలకూ, త్రిశూలానికి ప్రతీకలు. ఆ మూడు ఆకులే త్రిమూర్తులు. బిల్వాదళం ముందు భాగంలో అమృతం, వెనుక భాగంలో యక్షులు ఉంటారు కనుక. బిల్వాదళం ముందు భాగాన్ని శివునకు చూపిస్తూ పూజించాలి. ఒకసారి కోసిన బిల్వదళాలు 15 రోజుల వరకూ పూజార్హతను కలిగి ఉంటాయి. ఆలోపు ఆ బిల్వదళాలు వాడినా దోషం లేదు. కానీ, మూడు దళాలు మాత్రం తప్పనిసరిగా ఉండాలి.

జాగరణ ఎందుకు చేయాలి?

క్షీరసాగర మధన సమయంలో జనించిన హాలాహలాన్ని భక్షించిన శివుడు ... మైకంతో నిద్రలోకి జారుకుని ఎక్కడ మరణిస్తాడో ... అన్న భయంతో సకలదేవ, రాక్షస గణాలూ, శివునకు నిద్రరాకుండా ఉండాలనీ తెల్లార్లూ శివసంకీర్తనం చేస్తూ జాగరణం చేసారట. ఆ జాగరణే "శివరాత్రి''నాడు భక్తులు ఆచారమైంది. "జాగరణ'' అంటే నిద్రపోకుండా సినిమాలు చూస్తూ, పేకాట ఆడుతూ గడపడం కాదు. జాగరూకతో శివుని భక్తిగా అర్చించడం.
మీ అవధాని రాజేష శర్మ
*ॐ* *ఓం నమః శివాయ* *ॐ*
శివరాత్రి మహాత్మ్యం
శివరాత్రులు సంవత్సరానికొకసారో నెలకొకసారో కాక ప్రతి రాత్రి శివరాత్రిగానే భావించే సాంప్రదాయముంది. ఉదయాన్నే లేచి (శ్రీ హరి అని మూడుసార్లు తలచి లేవాలి ఎందుకంటే నిద్రలేచినది మొదలు నిద్ర కుపక్రమించేవరకు(జాగ్రదావస్థకు) ఉన్న కాలమునకు విష్ణువే అధిపతి ఆయన అనుగ్రహముతో ఆ రోజు కార్యములన్నీ శుభప్రదంగా జరగడాని కొరకు, మీరు చేసే మొదటి సంకల్పమే బ్రహ్మతత్వమైన సృష్టికి గుర్తు). నిత్య కర్మానుష్టనములు చేసుకొని శివలింగము నారాధించి, తను చేసే ప్రతి పనిలో ప్రతి ఒక్కరిలో శివును చూస్తూ సాత్వికాహార బద్ధుడై తిరిగి సాయంత్రం శివారాధన చేసి నివేదన చేయబడిన పదార్థములను ప్రసాద బుద్ధితో తీసుకొని రాత్రి నిద్రకు ఉపక్రమించడం. ఈ నిద్రనే శివుని స్వల్పకాలిక లయం అంటారు. ఈ నిద్రను పొందటను గమనిస్తూ శివుని పదకొండు సార్లు తలచుకొని నిద్రపోవాలని శాస్త్ర వచనం / పెద్దల వచనం . ఇలా రోజూ త్రిమూర్తులను తన అవస్థలలో గుర్తిస్తూ సాధన ద్వారా జ్ఞానం వేపుకి అడుగులేయడం. ప్రతి రోజు శివరాత్రి.

ఇక త్రయోదశి తిథి పరమ శివుని తిథిగా శాస్త్రాలు పెద్దలు గుర్తించారు. శుక్ల పక్షంలో వచ్చే త్రయోదశి తిథితో కూడుకుని ఉన్న చతుర్థశిని శుక్లపక్ష శివరాత్రి అని పిలుస్తూ ఉంటారు ఇది సంపూర్ణ జ్ఙానం వైపు వెళ్ళేసాధకునికి గుర్తు (చాలా వరకు శుక్ల పక్ష శివరాత్రిని ఉపాసన చేయడమన్నది ఈమధ్య కాలంలో కనబడడంలేదు, దీనికి తగిన ఆఖ్యానాలు కూడా ప్రచారంలో లేవు. ఉన్నవేమో తెలీదు.) ఇక కృష్ణ పక్షంలో త్రయోదశి తిథిని కూడిన చతుర్దశీ తిథిని మాస శివరాత్రి అని పిలుస్తారు అదే కృష్ణ పక్ష శివరాత్రి. ఒక రోజులో అసుర సంధ్య వేళ కేవలం శివ పూజకు ఎంత విశిష్టమో అలా ఒక నెలలో మాస శివరాత్రి అటువంటిది. ఈరోజు కూడా మహాశివరాత్రి లాగానే శివారాధనలూ, శివాభిషేకాలు, బిల్వ పత్రి పూజలూ, శివాలయ సందర్శనలూ, భజనలూ, ఉపవాసాలు, జాగరణలూ చేయడం పరిపాటి. ఆరాధనలో ఎటువంటి తేడాలేదు. ఐతే రోజూ చేసే ఉపాసనకన్నా ఈ రోజు చేసే ఉపాసన కొంత అధికం.

అలాగే మాఘమాసంలో వచ్చే కృష్ణ పక్ష చతుర్దశిని మహా శివరాత్రి అని నిర్ధారించారు. ఆరోజే రాత్రే శివలింగము ఆవిర్భవించిందని శాస్త్ర వాక్కు. ఆనాడు పగలంతా శివ పూజలతో, శివ కథా కాలక్షేపములతో సాత్విక ఆహారము లేదా ఉపవాసము (ఉపవాసమంటే లంఖణం కాదు ఉప= దగ్గర, వాసము= ఉండుట, భగవంతునికి దగ్గరగా ఉండుట. వీలైనంత తక్కువైన ఆహారము సాత్వికమైనది తీసుకొని భగవంతుని గుణములను కొలుస్తూ, స్తోత్ర పాఠాలను చేస్తూ, ఆ లీలా మూర్తి అనుగ్రహాలను తలచుకొంటూ భగవత్కార్యక్రమాలలో పాల్గొనుట).

శివలింగం అర్థ రాత్రి ఆవిర్భవించడం అంటే ఏదో ఒక రాయిలానో శిల గానో ఆవిర్భవించటం అని కాదు. మాఘ మాసం వచ్చేసరికి, (ఆషాడ మాసంనుంచి వర్షాలవల్ల లోకంలో సృష్టి ప్రతి సృష్టి జరిగుతుంది. భౌతికంగా అన్ని జీవాలు అంధకారంలోఉంటాయి, సరిగ్గా కనపడదు అందునా మాఘ మాసం చతుర్దశి అర్థ రాత్రి అమావాస్య ఘడియలలో లేదా అమావాస్య వస్తుందనగా ఉన్న చీకట్లను తొలగించడానికి జ్యోతి రూపంలో శివుడు ఆవిర్భవించాడు అదే అజ్ఙానరూపంలో ఉన్న చీకట్లను తొలగించడానికి జ్యోతి రూపంలో ఆవిర్భవించాడు. అవ్యక్తమైన పరమాత్మ వ్యక్తమైనాడు. ఆరోజు రాత్రి జాగరణ చేసి లింగావిర్భావ సమయమున ఒక జ్యోతి (దీపమును లేదా కర్పూర దీపమునుగాని) గాని ఈ క్రింది శ్లోకము చదువుతూ చూడవలెను అప్పుడు శివరాత్రి వ్రత పూర్ణ ఫలము.

కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః , జలేస్థలే యే నివసంతి జీవాః |
దృష్ట్వా ప్రదీపం నీచజన్మభాగినః , భవన్తి త్వం శ్వపచా హి విప్రాః ||

మన సనాతన ధర్మ గొప్పదనమెంతో చూడండి. ఈ శ్లోకం చదివి, ఆ దీపాన్ని వెలిగించిన యజమానే కాక, దానిని చూస్తున్న వారందరే కాక, కీటకములు, పక్షులు, దోమలు, చెట్లు, జల నివాసములు, ఏ ఏ జీవములు ఆ దీపమును చూచుచున్నవో లేదా ఏ ఏ జీవములపై ఆ దీపపు కాంతి పడుతున్నదో అవన్నీ ఉద్ధరణ పొందవలెను అని ఆ యజమాని భావన చేయాలి. దీనితోనే ఆ శివరాత్రి వ్రతం సంపూర్ణం. (ఇదే శ్లోకం కార్తీక పౌర్ణమి దీపాన్ని చూస్తూ కూడా చెప్పవలెను)

ఈ విషయాన్ని మీకు తెలిసినవారందరకీ తెల్పండి. [పూర్తిగా శివరాత్రి, కార్తీక పౌర్ణమి వ్రతాలు చేయకపోయినా (ఏ అస్వస్తత వల్లనో) అ నాటి రాత్రి జ్యోతి స్వరూపుడైన శివుని దీపము లో చూస్తూ ఈ శ్లోకం చెప్పినా చాలు.

ఇన్ని విషయాలు ఉన్నాయి కాబట్టి, స్వయంగా ఆ పరమేశ్వరుడే మన అజ్ఙానపు చీకట్లను తొలగించడానికి జ్యోతీరూప శివలింగంగా ఆవిర్భవించిన రోజు కాబట్టీ, ప్రతి రోజూ అంత గొప్పగా ఉపాసన చేయడం అందరికీ సాధ్యం కాబట్టీ, కనీసం ప్రతి సంవత్సరం మహా శివరాత్రైనా జరుపుకోవాలని(జన్మానికో శివరాత్రి అని నానుడి) పెద్దలు నిశ్చయం చేశారు.
మీకు మీ కుటుంబ సభ్యుల కు మహాశివరాత్రి శుభాకాంక్షలు......
మందపాటి. వెంకటేశ్వర రెడ్డి.

మహా శివరాత్రి వృత్తాంతం

మహాశివ రాత్రి మహాత్మ్య వృత్తాంతం శివ పురాణములోని విద్యేశ్వర సంహితలో చెప్పబడింది.

గంగా యమునా సంగమ స్థానమైన ప్రయాగలో(నేటి అలహాబాదు) ఋషులు సత్రయాగం చేస్తున్నసమయంలో రోమర్షణమహర్షి అని పేరు గాంచిన సూతమహర్షి అక్కడకు వస్తాడు. ఆలా వచ్చిన సూతమహర్షికి అ ఋషులు నమస్కరించి సర్వోత్తమమైన ఇతిహాస వృత్తాంతాన్ని చెప్పమనగా అతను తన గురువైన వేదవ్యాసుడు తనకు చెప్పిన గాథను వివరించడం ప్రారంభిస్తాడు. ఒకసారి పరాశర కుమారుడైన వ్యాస మహర్షి సరస్వతి నదీ తీరమున ధ్యానం చేస్తుంటాడు. ఆ సమయంలో సూర్యుని వలె ప్రకాశించే విమానంలో సనత్కుమారుడు వెళ్ళుతుంటాడు. దానిని గమనించిన వ్యాసుడు బ్రహ్మ కుమారుడైన సనత్కుమారునకు నమస్కరించి ముక్తిని ప్రసాదించే గాథను తెలుపుమంటాడు.

అప్పుడు మందర పర్వతం మీద బ్రహ్మ కుమారుడైన సనత్ కుమారుడు తనకు, నందికేశ్వరునికి మధ్య జరిగిన సంవాదాన్ని వ్యాసునికి చెప్పగా, వ్యాసుడు సూతునికి చెప్పిన వృత్తాంతాన్ని సత్రయాగంలో ఋషులకు చెబుతాడు. సనత్కుమారుడు నందికేశ్వరుడిని శివుని సాకారమైన మూర్తిగా, నిరాకారుడైన లింగంగా పూజించడానికి సంబంధించిన వృత్తాంతాన్ని చెప్పమంటాడు. దానికి సమాధానంగా నందికేశ్వరుడు ఈ వృత్తాంతాన్ని చెబుతాడు.

బ్రహ్మ, విష్ణువుల యుద్ధం

విద్యుద్దీపపు కాంతుల్లో నటరాజ స్వరూపుడైన పరమశివుడు

ఒకప్పుడు ప్రళయ కాలం సంప్రాప్తము కాగా మహాత్ములగు బ్రహ్మ, విష్ణువులు ఒకరితో ఒకరు యుద్ధానికి దిగారు. ఆ సమయంలోనే మహాదేవుడు లింగరూపంగా ఆవిర్భవించాడు. దాని వివరాలు ఇలాఉన్నాయి. ఒకప్పుడు బ్రహ్మ అనుకోకుండా వైకుంఠానికి వెళ్ళి, శేష శయ్యపై నిద్రిస్తున్న విష్ణువును చూసి, "నీవెవరవు, నన్ను చూసి గర్వముతో శయ్యపై పడుకున్నావులే, నీ ప్రభువును వచ్చి ఉన్నాను నన్ను చూడు. ఆరాధనీయుడైన గురువు వచ్చినప్పుడు గర్వించిన మూఢుడికి ప్రాయశ్చిత్తం విధించబడుతుంది " అని అంటాడు. ఆ మాటలు విన్న విష్ణువు బ్రహ్మను ఆహ్వానించి, ఆసనం ఇచ్చి, "నీచూపులు ప్రసన్నంగా లేవేమి?" అంటాడు. దానికి సమాధానంగా బ్రహ్మ "నేను కాలముతో సమానమైన వేగం తో వచ్చాను. పితామహుడను. జగత్తును, నిన్ను కూడా రక్షించేవాడను" అంటాడు. అప్పుడు విష్ణువు బ్రహ్మతో "జగత్తు నాలో ఉంది. నీవు చోరుని వలె ఉన్నావు. నీవే నా నాభిలోని పద్మమునుండి జన్మించినావు. కావున నీవు నా పుత్రుడవు. నీవు వ్యర్థముగా మాట్లాడుతున్నావు" అంటాడు.

ఈ విధంగా బ్రహ్మ విష్ణువు ఒకరితోనొకరు సంవాదము లోనికి దిగి, చివరికి యుద్ధసన్నద్దులౌతారు. బ్రహ్మ హంస వాహనం పైన, విష్ణువు గరుడ వాహనం పైన ఉండి యుద్ధాన్ని ఆరంభిస్తారు. ఈ విధంగా వారివురు యుద్ధం చేస్తూ ఉండగా దేవతలు వారివారి విమానాలు అధిరోహించి వీక్షిస్తుంటారు. బ్రహ్మ, విష్ణువుల మధ్య యుద్ధం అత్యంత ఉత్కంఠతో జరుగుతూ ఉంటే వారు ఒకరి వక్షస్థలం పై మరొకరు అగ్నిహోత్ర సమానమైన బాణాలు సంధించుకొన సాగారు. ఇలా సమరం జరుగుతుండగా, విష్ణువు మాహేశ్వరాస్త్రం, బ్రహ్మ పాశుపతాస్త్రం ఒకరిమీదకు ఒకరు సంధించుకొంటారు. ఆ అస్త్రాలను వారు సంధించిన వెంటనే సమస్త దేవతలకు భీతి కల్గుతుంది. ఏమీ చేయలేక, దేవతలందరు శివునికి నివాసమైన కైలాసానికి బయలు దేరుతారు. ప్రమథగణాలకు నాయకుడైన శివుని నివాసస్థలమైన కైలాసంలో మణులు పొదగబడిన సభా మద్యలో ఉమాసహితుడై తేజస్సుతో విరాజిల్లుతున్న మహాదేవునికి పరిచారికలు శ్రద్ధతో వింజామరలు వీచుతుంటారు. ఈ విధంగా నున్న ఈశ్వరునికి దేవతలు ఆనందబాష్పాలతో శ్హస్త్రంగమ్ ప్రణమిల్లుతారు. అప్పుడు ప్రమథ గణాలచేత శివుడు దేవతలను దగ్గరకు రమ్మని అహ్వానిస్తాడు. అన్ని విషయాలు ఎరిగిన శివుడు దేవతలతో "బ్రహ్మ, విష్ణువుల యుద్ధము నాకు ముందుగానే తెలియును. మీ కలవరము గాంచిన నాకు మరల చెప్పినట్లైనది " అంటాడు. బ్రహ్మ, విష్ణువులకు ప్రభువైన శివుడు సభలో ఉన్న వంద ప్రమథ గణాలను యుద్ధానికి బయలుదేరమని చెప్పి, తాను అనేక వాద్యములతో అలంకారములతో కూడిన వాహనం పై రంగు రంగుల ధ్వజముతో, వింజామరతో, పుష్పవర్షముతో, సంగీతము నాట్యమాడే గుంపులతో, వాద్య సముహంతో, పార్వతీదేవితో బయలుదేరుతాడు. యుద్ధానికి వెళ్ళిన వెంటనే వాద్యాల ఘోషను ఆపి, రహస్యంగా యుద్ధాన్ని తిలకిస్తాడు.మాహేశ్వరాస్త్రం, పాశుపతాస్త్రం విధ్వంసాన్ని సృష్టించబోయే సమయంలో శివుడు అగ్ని స్తంభ రూపంలో ఆవిర్భవించి ఆ రెండు అస్త్రాలను తనలో ఐక్యం చేసుకొంటాడు. బ్రహ్మ, విష్ణువులు ఆశ్చర్య చకితులై ఆ స్తంభం యొక ఆది, అంతం కనుగొనడం కోసం వారివారి వాహనాలతో బయలు దేరుతారు. విష్ణువు అంతము కనుగొనుటకు వరాహరూపుడై, బ్రహ్మ ఆది తెలుసుకొనుటకు హంసరూపుడై బయలుదేరుతారు. ఎంతపోయినను అంతము తెలియకపోవడం వల్ల విష్ణుమూర్తి వెనుకకు తిరిగి బయలుదేరిన భాగానికి వస్తాడు. బ్రహ్మకు పైకి వెళ్ళే సమయంలో మార్గమధ్యంలో కామధేనువు క్రిందకు దిగుతూను, ఒక మొగలి పువ్వు (బ్రహ్మ, విష్ణువు ల సమరాన్ని చూస్తూ పరమేశ్వరుడు నవ్వినప్పుడు ఆయన జటాజూటం నుండి జారినదే ఆ మొగలి పువ్వు) క్రింద పడుతూనూ కనిపించాయి. ఆ రెంటిని చూసి బ్రహ్మ 'నేను ఆది చూశాను అని అసత్యము చెప్పండి. ఆపత్కాలమందు అసత్యము చెప్పడము ధర్మ సమ్మతమే" అని చెప్పి కామధేనువు తోను, మొగలి పువ్వుతోను ఒడంబడిక చేసుకొంటాడు. వాటితో ఒడంబడిక చేసుకొన్న తరువాత బ్రహ్మ తిరిగి స్వస్థానానికి వచ్చి, అక్కడ డస్సి ఉన్న విష్ణువు ని చూసి, తాను ఆదిని చూశానని, దానికి సాక్ష్యం కామధేనువు, మొగలి పువ్వు అని చెబుతాడు. అప్పుడు విష్ణువు ఆ మాటను నమ్మి బ్రహ్మ కి షోడశోపచారా లతో పూజ చేస్తాడు. కాని,శివుడు ఆ రెండింటిని వివరము అడుగగా, బ్రహ్మ స్తంభం ఆదిని చూడడం నిజమేనని మొగలి పువ్వు చెపుతుంది. కామధేనువు మాత్రం నిజమేనని తల ఊపి, నిజం కాదని తోకను అడ్డంగా ఊపింది. జరిగిన మోసాన్ని తెలుసుకున్న శివుడు కోపోద్రిక్తుడైనాడు.మోసము చేసిన బ్రహ్మ ను శిక్షించడంకోసం శివుడు అగ్ని లింగ స్వరూపం నుండి సాకారమైన శివుడి గా ప్రత్యక్షం అవుతాడు. అది చూసిన విష్ణువు, బ్రహ్మ సాకారుడైన శివునకు నమస్కరిస్తారు. శివుడు విష్ణువు సత్యవాక్యానికి సంతసించి ఇకనుండి తనతో సమానమైన పూజా కైంకర్యాలు విష్ణువు అందుకొంటాడని, విష్ణువు కి ప్రత్యేకంగా క్షేత్రాలు ఉంటాయని ఆశీర్వదిస్తాడు.

బ్రహ్మకు శిక్ష మరియు వరము

శివ పురాణం, విద్వేశ్వర సంహితలోని ఏడవ ఎనిమిదవ అధ్యాయములలో ఉన్నదీ విషయం.

ఈశ్వర ఉవాచ

అరాజ భయమేతద్వైజగత్సర్వం నశిష్యతి! తతస్త్వం జహి దండార్హం వహ లోకథురం శిశో!!
వరందదామి తే తత్ర గృహాణ దుర్లభం పరమ్! వైతానికేషు గృహ్యేషు యజ్ఙేషు చ భవాన్గురుః!!
నిష్ఫలస్త్వదృతే యజ్ఙః సాంగశ్చ సహ దక్షిణః! ........

శివుడు బ్రహ్మ గర్వము అణచడానికి తన కనుబొమ్మల నుండి భైరవుడిని సృష్టించి పదునైన కత్తి తో ఈ బ్రహ్మ ను శిక్షించుము అని చెబుతాడు. ఆ భైరవుడు వెళ్లి బ్రహ్మ పంచముఖాల లో ఏ ముఖము అయితే అసత్యము చెప్పిందో ఆ ముఖాన్ని పదునైన కత్తి తో నరికి వేస్తాడు. అప్పుడు మహావిష్ణువు శివుడి వద్దకు వెళ్లి, పూర్వము ఈశ్వర చిహ్నం గా బ్రహ్మ కు ఐదు ముఖాలు ఇచ్చి ఉంటివి. ఈ మొదటి దైవము అగు బ్రహ్మ ను ఇప్పుడు క్షమించుము అన్నాడు. ఆ మాటలు విన్న శివుడు శరణు జొచ్చిన బ్రహ్మను (పిల్లవానిని తప్పుడు చేతకై దండించి తప్పు తెలుసుకొన్న తరువాత కారుణ్యమును ప్రకటించిన తండ్రిలా) ఉద్దేశించి గొప్ప వరమును ప్రసాదించెను. బ్రహ్మని క్షమించి, "ఓ బ్రహ్మా నీకు గొప్పనైన దుర్లభమైన వరమును ఇస్తున్నాను, అగ్నిష్టోమము, దర్శ మొదలగు యజ్ఙములలో నీది గురుస్థానము. ఎవరేని చేసిన యజ్ఙములలో అన్ని అంగములు ఉన్నా అన్నింటినీ సరిగా నిర్వర్తించినా, యజ్ఙనిర్వహణముచేసిన బ్రాహ్మణులకు దక్షిణలు ఇచ్చినా, నీవు లేని యజ్ఙము వ్యర్థము అగును" అని వరమిచ్చెను.

మొగలి పువ్వుకు శాపము

ఆతరువాత కేతకీపుష్పము వైపు చూసి, అసత్యము పల్కిన నీతో పూజలు ఉండకుండా ఉండు గాక అని అనగానే దేవతలు కేతకీపుష్పాన్ని దూరంగా ఉంచారు. దీనితో కలతచెందిన కేతకీపుష్పము పరమేశ్వరుడవైన నిన్ను చూసిన తరువాత కూడా అసత్య దోషము ఉండునా అని మహాదేవుడిని స్తుతించింది. దానితో ప్రీతి చెందిన శివుడు అసత్యము చెప్పిన నిన్ను ధరించడం జరగదు, కాని కేతకీ పుష్పాన్ని నా భక్తులు ధరిస్తారు. అదేవిధంగా కేతకీ పుష్పము ఛత్ర రూపములో నాపై ఉంటుంది అని చెబుతాడు.

కామధేనువుకు శాపము

అసత్యాన్ని చెప్పిన కామధేనువును కూడా శివుడు శిక్షించదలచాడు. అసత్యమాడినందుకు పూజలు ఉండవని శివుడు కామధేనువుకు శాపమిచ్చాడు. తోకతో నిజం చెప్పాను కనుక క్షమించుమని కామధేనువు శివుని ప్రాధేయపడింది. భోలాశంకరుడు కనుక, కోపమును దిగమ్రింగి, " మొగము తో అసత్యమాడితివి కనుక నీ మొగము పూజనీయము కాదు; కాని సత్యమాడిన నీ పృష్ఠ భాగము పునీతమై, పూజలనందుకొనును" అని శివుడు వాక్రుచ్చెను. అప్పటి నుండి గోముఖము పూజార్హము కాని దైనది; గోమూత్రము, గోమయము, గోక్షీరములు పునీతములైనవై, పూజా, పురస్కారములలో వాడబడుచున్నవి.

మహాశివరాత్రి వ్రత కథ

ఒకనాడు కైలాసపర్వత శిఖరముపై పార్వతీపరమేశ్వరులు సుఖాసీనులై ఉండగా పార్వతి శివునితో అన్ని వ్రతములలోను ఉత్తమమగు వ్రతమును భక్తి ముక్తి ప్రదాయకమైన దానిని తెలుపమని కోరెను. అప్పుడు శివుడు శివరాత్రి వ్రతమనుదాని విశేషాలను తెలియజేస్తాడు. దీనిని మాఘబహుళచతుర్దశి నాడు ఆచరించవలెనని, తెలిసికాని, తెలియకగాని ఒక్కమారు చేసినను యముని నుండి తప్పుంచుకొని ముక్తి పొందుదురని దాని దృష్టాంతముగా ఈ క్రింది కథను వినిపించెను.[4]

ఒకప్పుడు ఒక పర్వతప్రాంతమున హింసావృత్తిగల వ్యాధుడొకడు వుండెను. అతడు ప్రతి ఉదయం అడవికి వేటకు వెళ్ళి సాయంత్రం ఏదేని మృగమును చంపి తెచ్చుచు కుటుంబాన్ని పోషించేవాడు. కానీ ఒకనాటి ఉదయమున బయలుదేవి అడవియంతా తిరిగినా ఒక్క మృగము కూడా దొరకలేదు. చీకటిపడుతున్నా ఉత్తచేతులతో ఇంటికి వెళ్ళడానికి మనస్కరించక వెనుతిరిగెను. దారిలో అతనికొక తటాకము కనిపించెను. ఏవైనా మృగాలు నీరు త్రాగుట కోసం అచ్చటికి తప్పకుండా వస్తాయని వేచియుండి వాటిని చంపవచ్చునని ఆలోచించి దగ్గరనున్న ఒక చెట్టెక్కి తన చూపులకు అడ్డముగా నున్న ఆకులను, కాయలను విరిచి క్రింద పడవేయసాగెను. చలికి "శివ శివ" యని వణుకుచూ విల్లు ఎక్కిపెట్టి మృగాల కోసం వేచియుండెను.

మొదటిజామున ఒక పెంటిలేడి నీరు త్రాగుటకు అక్కడికి వచ్చెను. వ్యాధుడు దానిపై బాణము విడువబోగా లేడి భయపడక "వ్యాధుడా! నన్ను చంపకుము" అని మనుష్యవాక్కులతో ప్రార్థించెను. వ్యాధుడు ఆశ్చర్యపడి మనుష్యులవలె మాట్లాడు నీ సంగతి తెలుపుమని కోరెను. దానికి జింక "నేను పూర్వజన్మమున రంభయను అప్సరసను. హిరణ్యాక్షుడను రాక్షసరాజును ప్రేమించి శివుని పూజించుట మరచితిని. దానికి రుద్రుడు కోపించి కామాతురయైన నీవు, నీ ప్రియుడును జింకలుగా పన్నెండేళ్లు గడిపి ఒక వ్యాధుడు బాణముతో చంపనుండగా శాపవిముక్తులౌదురని సెలవిచ్చెను. నేను గర్భిణిని, అవధ్యను కనుక నన్ను వదలుము. మరొక పెంటిజింక ఇచటికి వచ్చును. అది బాగుగా బలిసినది, కావున దానిని చంపుము. లేనిచో నేను వసతికి వెళ్ళి ప్రసవించి శిశువును బంధువుల కప్పగించి తిరిగివస్తాను" అని అతన్ని వొప్పించి వెళ్ళెను.

రెండవజాము గడిచెను. మరొక పెంటిజింక కనిపించెను. వ్యాధుడు సంతోషించి విల్లెక్కుపెట్టి బాణము విడువబోగా అదిచూచిన జింక భయపడి మానవవాక్కులతో "ఓ వ్యాధుడా, నేను విరహముతో కృశించియున్నాను. నాలో మేదోమాంసములు లేవు. నేను మరణించినా నీ కుటుంబానికి సరిపోను. ఇక్కడికి అత్యంత స్థూలమైన మగజింక యొకటి రాగలదు. దానిని చంపుము, కానిచో నేనే తిరిగివత్తును" అనెను. వ్యాధుడు దానిని కూడా విడిచిపెట్టెను.

మూడవజాము వచ్చెను. వ్యాధుడు ఆకలితో జింక కోసం వేచియుండెను. అంతలో ఒక మగజింక అక్కడికి వచ్చెను. వింటితో బాణము విడువబోగా ఆ మృగము వ్యాధుని చూచి మొదటి రెండు పెంటి జింకలు తన ప్రియురాలుల్ని తానే చంపెనా అని ప్రశ్నించెను. అందుకు వ్యాధుడు ఆశ్చర్యపడి రెండు పెంటిజింకలు మరలివచ్చుటకు ప్రతిజ్ఞచేసి వెళ్ళినవి, నిన్ను నాకు ఆహారముగా పంపుతాయని చెప్పాయని అన్నాడు. ఆ మాట విని "నేను ఉదయాన్నే మీ ఇంటికి వచ్చెదను నా భార్య ఋతుమతి. ఆమెతో గడిపి బంధుమిత్రుల అనుజ్ఞపొంది మరలివత్తును అని ప్రమాణములు చేసి వెళ్ళెను.

ఇట్లు నాలుగు జాములు గడిచి సూర్యోదయ సమయంలో వ్యాధుడు జింకల కొరకు ఎదురుచూచుచుండెను. కొంతసేపటికి ఆ నాలుగు జింకలును వచ్చి నన్ను మొదట చంపుము, నన్నే మొదట చంపుమని అనుచు వ్యాధుని ఎదుట మోకరిల్లెను. అతడు మృగముల సత్యనిష్టకు ఆశ్చర్యపడెను. వానిని చంపుటకు అతని మనసు ఒప్పలేదు. తన హింసావృత్తిపై జుగుప్స కలిగెను. "ఓ మృగములారా ! మీ నివాసములకు వెళ్ళుము. నాకు మాంసము అక్కరలేదు. మృగములను బెదరించుట, బంధించుట, చంపుట పాపము. కుటుంబము కొరకు ఇక నేనా పాపము చేయను. ధర్మములకు దయ మూలము. దమయు సత్యఫలము. నీవు నాకు గురువు, ఉపదేష్టవు. కుటుంబ సమేతముగా నీవు వెళ్ళుము. నేనిక సత్యధర్మము నాశ్రయించి అస్త్రములను వదలిపెట్టుదును." అని చెప్పి ధనుర్బాణములను పారవేసి మృగములకు ప్రదక్షిణ మాచరించి నమస్కరించెను.

అంతలో ఆకాశమున దేవదుందుభులు మ్రోగెను. పుష్పవృష్టి కురిసెను. దేవదూతలు మనోహరమగు విమానమును తెచ్చి యిట్లనిరి : ఓ మహానుభావా. శివరాత్రి ప్రభావమున నీ పాతకము క్షీణించింది. ఉపవాసము, జాగరమును జరిపితివి, తెలియకయే యామ, యామమునను పూజించితివి, నీవెక్కినది బిల్వవృక్షము. దానిక్రింద స్వయంభూలింగమొకటి గుబురులో మరుగుపడి యున్నది. నీవు తెలియకయే బిల్వపత్రముల త్రుంచివేసి శివలింగాన్ని పూజించితివి. సశరీరముగా స్వర్గమునకు వెళ్ళుము. మృగరాజా! నీవు సకుటుంబముగా నక్షత్రపదము పొందుము."

ఈ కథ వినిపించిన పిదప పరమేశ్వరుడు పార్వతితో నిట్లనెను: దేవీ! ఆ మృగకుటుంబమే ఆకాశమున కనిపించు మృగశిర నక్షత్రము. మూడు నక్షత్రములలో ముందున్న రెండూ జింకపిల్లలు, వెనుకనున్న మూడవది మృగి. ఈ మూడింటిని మృగశీర్ష మందురు. వాని వెనుక నుండు నక్షత్రములలో ఉజ్జ్వలమైనది లుబ్ధక నక్షత్రము.

శివరాత్రి పూజా విధానాలు

ఆ తరువాత బ్రహ్మ, విష్ణువు ఆదిగా గల దేవతలు శివుడిని ధూపదీపాలతో అర్చించారు. దీనికి మెచ్చి శివుడు అక్కడి వారితో "మీరీనాడు చేసిన పూజకు సంతసించితిని. ఈ రోజు నుండి నేను అవతరించిన ఈ తిథి శివరాత్రి పర్వదినముగా ప్రసిద్ధి చెందుతుంది.

ఈ రోజున ఉపవాసము చేసి భక్తితో నన్ను లింగ రూపముగా, సాకార రూపముగా ఎవరు అర్చిస్తారో వారికి మహాఫలము కలుగుతుంది" అని చెబుతాడు. తాను ఈ విధంగా అగ్నిలింగరూపముగా ఆవిర్భవించిన ప్రదేశము అరుణాచలముగా ప్రసిద్ధిచెంద గలదని చెబుతాడు.

జాగరణము

జాగరణము అనగా ప్రకృతిలో నిద్రాణమైయున్న శివశక్తిని, శివపూజా భజన లీలా శ్రవణాదులతో మేల్కొలిపి, తాను శివుడై, సర్వమును శివస్వరూపముగా భావించి, దర్శించుటయే నిజమైన జాగరణము. అప్పుడు శివపూజలో సాయుజ్యము, శివభజనలో సామీప్యము, శివభక్తులతో కూడి, శివ విషయములు ప్రసంగించుటలో సలోక్యము, శివధ్యానములో సారూప్యము సిద్ధించునని ఆదిశంకరాచార్యులుమాట ప్రత్యక్ష సత్యమగును. ఈ నాలుగింటిని శివరాత్రి నాడు ప్రత్యక్షముగా సాధించుటయే శివరాత్రి జాగరణము. జాగరణ దినమున UUపవాసము ఉంటారు.
ఈ జాగరణ సమయంలో తామున్న గృహ ఆవరణలోనో, తమ స్వంత పంటపొలాల్లోనో అక్కడి మట్టితో అక్కడే శివలింగాన్ని తయారుచేస్తూ జాముకొక శివలింగం తయారుచేసి పూజిస్తారు. సుభమ్

రుద్రాభిషేకం

వేదాలలోనుండి ప్రత్యేకమైన మంత్రాలను రుద్ర సూక్తంగా పండితులచే పఠించబడుతుంది. దీనిని శివలింగానికి ప్రాతఃకాలంలో పవిత్రస్నానం చేయిస్తారు. దీనినే రుద్రాభిషేకం అంటారు. శివలింగంతో బాటు గండకీ నదిలో మాత్రమే లభించే సాలిగ్రామం కూడా పూజలందుకుంటుంది. దీనిద్వారా మనసులోని మలినాల్ని తొలగించుకోవడమే ఇందులోని పరమార్ధం.

పంచాక్షరి మంత్రం

పంచాక్షరి మంత్రం శివస్తోత్రాలలో అత్యుత్తమమైనది. ఈ మంత్రంలోని పంచ అనగా అయిదు అక్షరాలు "న" "మ" "శి" "వా" "య" (ఓం నమశ్శివాయ) నిరంతరం భక్తితో ఈనాడు పఠిస్తే శివసాయుజ్యం ప్రాప్తిస్తుంది.

మహామృత్యుంజయ మంత్రం

ప్రధాన వ్యాసము: మహామృత్యుంజయ మంత్రం

మహామృత్యుంజయ మంత్రం ఋగ్వేదం(7.59.12)లోని ఒక మంత్రము. దీనినే "త్రయంబక మంత్రము", "రుద్ర మంత్రము", "మృత సంజీవని మంత్రము" అని కూడా అంటారు. ఇదే మంత్రం యజుర్వేదం (1.8.6.i; 3.60)లో కూడా ఉంది. ఈ మంత్రాన్ని మృత్యుభయం పోగొట్టుకోవడానికి, మోక్షం కొరకు జపిస్తారు.

ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం ఊర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS