Wednesday, October 22, 2025

చిత్రగుప్త దేవాలయం - కాంచీపురం.

చిత్రగుప్త దేవాలయం - కాంచీపురం.



చిత్రాయ చిత్రగుప్తాయ యమాయనమః.




భగినీ హస్త భోజనం. యమద్వితీయ. కార్తీక శుద్ధ విదియ. అన్నలందరూ  చెల్లెలు ఇంటికి వచ్చేరోజు.  చెల్లెలు తన చేతి వంట అన్నకు తినిపించి తన అన్న జోలికి రావద్దని యములోరిని అడిగే రోజు. 

మనకు దక్షిణ భారతంలో ఎక్కడా యమధర్మరాజు ఆలయాలు లేవనుకుంటా. వున్నా అటు తొంగి చూడటానికే మనకు భయం.

పోనీ ఆయన కుడి భుజాన్నయినా చూసొద్దామా.

ఆ కుడి భుజమే చిత్ర గుప్తుడు.

ఈ చిత్రగుప్తుని పుట్టిన రోజే యమ ద్వితీయ.

చిత్రగుప్త ఆలయం.

చిత్రగుప్తుడు అనంగానే తలపాగాతో వ్రాత బల్ల (writing table) ముందు బాసింపట్లు వేసుకుని కూచుని చేత కలం పట్టుకుని లెక్కలు చూస్తున్న వ్యక్తి కనిపిస్తాడు.

యమధర్మరాజు  "సమవర్తి"త్వానికి కారకుడు, సహాయకుడు ఈ చిత్ర గుప్తుడే. ఒక్క మాటలో చెప్పాలంటే యమధర్మరాజుకు కుడిభుజమన్నమాట. వీరిద్దరూ ఒకరు కారు కానీ వారే వీరు వీరే వారు.

మన పాపపుణ్యాలు బేరీజు వేసి చూసి చెప్పే మనిషి. అందుకే ఆయనంటే ప్రతివారికీ కొద్దో గొప్పో భయం వుండి తీరుతుంది.

మనకు తెలుగునాట చిత్రగుప్తునికి, యమధర్మరాజుకీ పెద్దగా ఆలయాలు కనిపించవు. 

కానీ తమిళనాడులో వీళ్ళు  చాలా ప్రశస్తి. ప్రతి ప్రసిద్ధ దేవాలయంలోను వీళ్ళిద్దరూ కనిపిస్తూనే వుంటారు. 

కంచిలో కామాక్షి అమ్మవారి ఆలయానికి సమీపంలోనే చిత్రగుప్తునికి ప్రత్యేకంగా ఒక ఆలయం వుంది.

బహుశా దక్షిణ భారతదేశంలోనే చిత్ర గుప్తునికి  ప్రత్యేకంగా వున్న ఏకైక దేవాలయమేమో.

మరీ పెద్ద ఆలయమేమీ కాదుకానీ మెయిన్ రోడ్డు మీదనే వుంటుంది. రాజగోపురం దగ్గరకు రాగానే కుడివేపు వినాయకుడు, ఎడమప్రక్క  వల్లల్లార్ కనిపిస్తారు.

ప్రధాన దేవత చిత్రగుప్తుడు. ఒళ్లంతా బంగారు తొడుగు వేసుకుని వెండి తాపడం చేసిన గర్భాలయంలో కుడి చేతిలో గంటం, ఎడమ చేతిలో పుస్తకం పట్టుకుని ఎదురుగా వున్న నూనెదీపాల కాంతి ఒంటి మీద పడి ధగధగా మెరిసిపోతూ హాయిగా తీరికగా కూచుని  వుంటాడు. 

కానీ ఆయన కనిపిస్తున్నంత తీరికేం కాదులేండి.

ఈయన భార్య కర్ణికాంబాళ్.

గర్భాలయంలో ఒంటరిగానే వుంటాడు కానీ ఉత్సవ మూర్తి భార్య  సమేతుడై వుంటాడు.

కర్ణికాంబాళ్ కు ఆలయంలో ఒక ప్రక్క ఉపాలయం.

ఆలయ నలుమూలలా విష్ణుదుర్గ, అయ్యప్ప, నవగ్రహాలు.

చిత్రగుప్తుడు కేతుగ్రహ అదిష్ఠాన దైవం. 

అమ్మవారి నడుముకు వుండే వడ్డాణం కేతుగ్రహ వడ్డాణం. అందుకే అమ్మను దర్శిస్తే అమ్మకు పెట్టిన నమస్కారంతో తాను కూడా  తృప్తి చెంది మనల్ని అనుగ్రహిస్తాడట. అలా ఈయన దయ కూడా పొందినట్లే మరి.

అందుకేనేమో ఇక్కడ అమ్మ ఆలయానికి అతి దగ్గరగా ఈయనకూ ప్రత్యేకంగా ఒక ఆలయం వుంది.

చిత్రి మాస పున్నమి రోజున  ఇక్కడ ఘనంగా ఉత్సవాలు జరుగుతై. చిత్రగుప్తునికి, "కర్ణికాంబాళ్" కు ఆ రోజున కళ్యాణము జరిపిస్తారు.

చైత్ర మాసం పౌర్ణమి చిత్ర గుప్తుడు జన్మించాడట. 

అదేమిటి మొదట్లోనేమో యమద్వితీయ నాడు అని చూసినట్లున్నాము అనేకదూ......అవును అదీ నిజమే. ఇదీ నిజమే. ఉత్తరాదిన అలా అంటారు దక్షణాదిన ఇలా అంటాము.

గర్భాలయ వెనుక భాగాన చిత్రగుప్తుని మూర్తి ఒకటి వుంటుంది. ఆలయానికి వచ్చిన భక్తులు ఇక్కడ దీపాలు వెలిగించి 

"వత్తి ముక్తిగాచు 
కొడి గండంగాచు 

వత్తిచేసి  వత్తి వెలిగించిన వనితలకు ఏమి ఫలము  కద్దంటే ....నూరు నోముల ఫలం కద్దు. నిక్షేపమంటి నలకలేని దీపం పెట్టితిని. పరమాత్మా ఈ దీపం నా ఇంట వెలుగు నింపాలి. రక్షింపుము పరమేశ్వరా పాలింపుము దీనబంధు  యమలాత్మ రక్షింపుము".

అని దణ్ణం  పెట్టుకుంటారు. 

అక్కడే వత్తి నూనె వేసిన ప్రమిదలు అమ్ముతూ వుంటారు.

మనం తెలిసీ తెలియక చేసిన తప్పిదాలను మన్నించమని  "చిత్రగుప్త నోము" అని చిత్రగుప్తునికి ఒక నోము నోస్తాము. 


నోము పట్టి ఒక ఏడాది పాటు రోజూ చిత్ర గుప్తునికి పూజ చేసి అక్షతలు తలపై వేసుకుంటాము. ఏడాది తరువాత ఒక మంచి రోజు చూసి కట్లులేని కొత్త గంప తెచ్చి అందులో  తెల్లని కొత్త వస్త్రం పరచి ఎడ్లు తొక్కని వడ్లు అయిదు కుంచాలు పోసి 

(మరి ఆ రోజుల్లో వ్యవసాయం అంటే ఎద్దులు లేకుండా జరిగేది కాదు కదా. అందుకని అలా చెప్పారు లేండి.  ఇపుడు ఎడ్లు ఎక్కడా ?? అలాగే  కుంచాలు అంటే ఎవరికి తెలుస్తుంది చెప్పండి. 25 కిలోలు)  

మరియొక తెల్లని వస్త్రంలో అడ్డెడు తవ్వెడు బియ్యం పోసి (10 కిలోలు)  మూటకట్టి పెట్టి వాటిమీద మంచి గుమ్మడి పండు నొకదానిని వుంచి ఒక వెండి పుస్తకము బంగారు గంటం చేయించి పట్టు వస్త్రాలు తెచ్చి చిత్రగుప్తుని ముందు వుంచి  ఆయనను యథావిథిగా పూజిస్తాము.

తరువాత సోదరుని కానీ సోదర సమానులను గానీ మన ఇంటికి పిలిచి ఈ వస్తువులు అన్నీ వారికి దక్షిణ తాంబూలాలతో ఇచ్చి భోజనం పెడతాము. 

మన పాప పుణ్యాల పట్టిక ఈయన దగ్గరే వుంటుంది కదూ మరి ఆ మాత్రమయినా చేయవద్దా.  

ఇక ఆలయం విషయానికి వస్తే ఉలగళంద పెరుమాళ్  ఆలయంలో నించి బయటకు వచ్చి ఎడమవేపు తిరిగి నడుస్తూ వెళితే వచ్చే రెండో ఎడమకు తిరిగితే చిత్రగుప్త దేవాలయం ఉంటుంది. గట్టిగా 5 నిముషాల నడక. బస్టాండుకి బాగా దగ్గర.

వీలయితే కాదు వీలుచేసుకుని అమ్మను చూసిన తరువాత ఒక్క అడుగు వేసి ఈయన్నూ చూస్తేసరి.

అన్నట్లు మనకు హైదరాబాదులో కూడా చాంద్రాయణగుట్ట దగ్గరలో చిత్రగుప్తునికి ఒక ఆలయం వున్నది తెలుసా.


ఫలాశపుష్ప సంకాశం తారకా గ్రహమస్తకం
రౌద్రం రౌద్రాత్మకం  ఘోరం తం కేతుం ప్రణమామ్యహం !!


🙏🙏🙏🙏🙏

No comments:

Post a Comment

RECENT POST

చిత్రగుప్త దేవాలయం - కాంచీపురం.

చిత్రగుప్త దేవాలయం - కాంచీపురం. చిత్రాయ చిత్రగుప్తాయ యమాయనమః. భగినీ హస్త భోజనం. యమద్వితీయ. కార్తీక శుద్ధ విదియ. అన్నలందరూ  చెల్లెలు ఇంటికి వ...

POPULAR POSTS