Wednesday, May 26, 2021

శ్రీ కూర్మ జయంతి శ్రీ కూర్మనాథస్వామి దేవస్థానం

_*🚩26-05-2021శ్రీ కూర్మ జయంతి🚩*_ 

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*కూర్మ  జయంతిపై ముఖ్యమైన సమయాలు*

సూర్యోదయం మే 26, 2021 5:45 ఉదయం
సూర్యాస్తమయం మే 26, 2021 7:01 అపరాహ్నం
పూర్ణిమ తిథి ప్రారంభమైంది మే 25, 2021 8:30 అపరాహ్నం
పూర్ణిమ తితి ముగుస్తుంది మే 26, 2021 4:43 అపరాహ్నం

*శ్రీ కూర్మ జయంతి నాడు "శ్రీకూర్మం" క్షేత్రాన్ని దర్శించుకోండి!*

దుష్టశిక్షణ , శిష్టరక్షణ కోసం శ్రీ మహావిష్ణువు దశావతారాలెత్తాడు. అందులో రెండో అవతారం కూర్మావతారం. కృతయుగంలో దేవ , దానవులు అమృతం కోసం క్షీరసాగరం చిలకడం మొదలు పెట్టారు. మందరగిరిని కవ్వంగా , వాసుకుని తాడుగా చేసుకుని దేవాసురులు పాలసముద్రాన్ని చిలుకుతుండగా మందరగిరి సముద్రంలోకి జారిపోతూ సముద్ర మధనానికి ఆటంకం కలిగింది. ఈ ఆటంకం నుంచి బయటపడేలా అనుగ్రహించమని దేవతలు మహావిష్ణువు వేడుకున్నారు. 

అప్పుడు నారాయణుడు కూర్మరూపం దాల్చి సముద్రంలోకి మందరగిరిని మునిగిపోకుండా చేశాడు. అలా ఉద్భవించినదే కూర్మావతారం. కూర్మవతారాన్ని కొలిచే ఆలయాలు దేశంలోనే కాదు ప్రపంచంలోనూ చాలా తక్కువ. కానీ ప్రపంచంలోనే ఏకైక కూర్మదేవాలయంగా చెప్పబడుతున్న పుణ్యక్షేత్రం శ్రీకూర్మం. అరుదైన శిల్పకళతో రూపుదిద్దిన ఈ ఆలయం శివకేశవ అబేధాన్ని సూచించే క్షేత్రంగా విరాజిల్లుతోంది. 

శ్రీకాకుళం జిల్లాలోని గార మండలంలో శ్రీకాకుళం నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో వంశధారా నది ఒడ్డున ఈ ఆలయం ఉంది. కళింగరాజైన అనంగభీముడు కూర్మనాధస్వామి ఆలయాన్ని పునర్‌నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. కర్పూరేశ్వరుడు , హఠకేశ్వరుడు , సుందేశ్వరుడు , కోటేశ్వరుడు , పాతాళ సిద్దేశ్వరుడు అనే అయిదుగురు ఈశ్వరులు క్షేత్రపాలకులుగా వున్న ఈ క్షేత్రం కళింగరాజుల కాలంలో ఓ వెలుగు వెలిగిందనీ , కళింగ రాజుల కాలంలో అత్యంత విశిష్టతను చేకూర్చిందని చరిత్ర చెబుతోంది. 

కూర్మావతారుడు తన భక్తుని కోరికపై స్వయంగా వెలసిన క్షేత్రమే శ్రీకూర్మం. కృతయుగంలో శ్వేతరాజు , అతని భార్య వంశధారల తపస్సుకు , భక్తికి మెచ్చుకున్న కూర్మనాధుడు వారి కోరిక ప్రకారం ఈ క్షేత్రంలో పశ్చిమ ముఖంగా వెలిశాడట. ఈ క్షేత్ర ప్రస్తావన కూర్మ , బ్రహ్మాండ , పద్మ పురాణాలలో వుంది. 

శ్రీరాముడు , బలరాముడు , జమదగ్ని మొదలైన పురాణ పురుషులెందరో ఈ క్షేత్రాన్ని దర్శించి స్వామిని ఆరాధించారని పురాణాలు చెబుతున్నాయి. ఎన్నో విశిష్టతలు కలిగిన ఈ ఆలయంలో శిల్ప సౌందర్యం అందరినీ ఆకట్టుకుంటుంది. మరే దేవాలయంలోను లేనివిధంగా ఇక్కడ రెండు ధ్వజస్తంభాలను ఈ ఆలయంలో చూడవచ్చు. 

ఈ స్తంభాలు రెండూ శివ కేశవులకు ప్రతీకలుగా చెప్తారు. చెప్పడానికి ఇది వైష్ణవ క్షేత్రమే. అయినా శివ కేశవులకు చిహ్నాలుగా చెప్పే ఈ ధ్వజస్తంభాలు శివకేశవుల అభేద తత్వాన్ని సూచిస్తున్నాయి. ఈ క్షేత్రం కృతయుగం నాటిది. దేవాలయంలోని మూలవిరాట్టు సాక్షాత్తు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి చేత ప్రతిష్టించబడిందట. 

దేవతలచే నిర్మించబడిన ఆలయం ప్రతిరోజు రాత్రివేళల్లో దేవతలు వచ్చి దేవాలయ నిర్మాణం చేసి సూర్యోదయం అయ్యే వేళకు అదృశ్యం అయిపోయేవారట. అందుకనే ఆలయంలోని స్తంభాలు ఒకదానికి మరొకటి పోలికలేని విధంగా వుంటాయని ఒక కథనం. 

శ్రీ కూర్మంలోని స్వామి వారి పుష్కరిణిని శ్వేతగుండం అని పిలుస్తారు. ఇది అత్యంత విశిష్టమైంది. ఆ స్వామి చేతిలోని సుదర్శనచక్రం చేత పుష్కరిణి ఆవిష్కరించబడిందనీ , అందుకే ఈ గుండంలో స్నానం చేస్తే కలిదోషాలు తొలగిపోతాయని చెప్తారు. మరణించినవారి అస్థికలను ఈ గుండంలో నిమజ్జనం చేస్తారు. 

ఈ గుండంలో స్నానం చేసి ఇక్కడ వున్న విష్ణుపాదాల దగ్గర పిండప్రదానం చేస్తే పితరులకు ఉత్తమ గతులు కలుగుతాయని విశ్వాసం ఇక్కడ చేసిన పితృకర్మలకు గయలో పితృకర్మలు చేసిన ఫలితం లభిస్తుందని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు. 

ఇక శ్రీ కూర్మ జయంతి రోజున స్వామివారిని దర్శించుకునే వారికి సకల పాపాలు హరింపవేయబడుతాయని విశ్వాసం. అలాగే ప్రతి సంవత్సరం మార్చిలో హోళీ పున్నమినాడు పెద్దఎత్తున ఈ ఆలయంలో ఉత్సవాలు జరుగుతాయి. వైశాఖ శుద్ధ ఏకాదశినాడు స్వామికి కల్యాణోత్సవం ,  కూర్మ జయంతి నాడు జరిగే ఉత్సవాల్లో పాల్గొంటే సకల సంతోషాలు చేకూరుతాయని పురోహితులు చెబుతున్నారు.

*🌹కూర్మావతార వర్ణిన🌹*

అగ్ని దేవుడు వశిష్ఠునితో *"వశిష్ఠా ! ఇప్పుడు కూర్మావతారమును వర్ణించుచుంటిని వినుము. దీనిని వినిన సమస్త పాపములు నశించును. పూర్వము దేవాసుర సంగ్రామమున దైత్యులు దేవతలను ఓడించిరి. వీరికి దుర్వాసుని శాపము వలన లక్ష్మికూడ తొలగిపోయెను. సమస్త దేవతలు క్షీరసాగరమందు శయనించి యున్న విష్ణు భగవానుని చెంతకేగి "భగవాన్ ! తమరు దేవతలను రక్షించవలెను"* అని ప్రార్థించిరి.

శ్రీహరి , బ్రహ్మాది దేవతలతో *"దేవగణములారా ! మీరు క్షీర సముద్రమును మధించుడు. అమృతమును పొందుటకును , లక్ష్మీప్రాప్తి గలుగుటకును మీరు అసురులతో సంధి చేసికొనవలెను. ఏదైననూ ఒక మహత్కార్యము నిర్వహించవలెనన్న ఒక మహత్ప్రయోజనము పొందగోరినను , శత్రువులైనను సంధి చేసికొనవలెను. నేను మిమ్ములను అమృతమునకు హక్కుదారులను చేసి దైత్యులను వంచితులను గావించెదను. మీరు దైత్యరాజు బలి చక్రవర్తిని నాయకునిగా నియమించుకొని మందరాచలమును కవ్వముగచేసి , వాసుకి సర్పమును కవ్వపు త్రాడుగచేసి , నా సహాయమును కూడ పొంది , క్షీరసాగరమును మధించుడు"* అని చెప్పగా దేవతలు , దైత్యులతో సంధి చేసికొని , క్షీర సముద్రమును చిలుకుట ప్రారంభించిరి. వాసుకి సర్పము తోకవైపు దేవతలు నిలచిరి. వాసుకి సర్ప నిఃశ్వాసములకు దానవులు బలహీనులగుచుండిరి. దేవతలు భగవానుని కృపాదృష్టితో బలవంతులగుచుండిరి.

సముద్ర మథనము ప్రారంభమయ్యెను. ఏమియు ఆధారము లేకపోవుటచే మందరాచలము సముద్రమున మునిగిపోయెను. అప్పుడు విష్ణు భగవానుడు కచ్ఛపరూపము (కూర్మరూపము) ధరించి మందరాచలమును తన వీపుపై ఉంచెను. అప్పుడు తిరిగి సముద్రమును మధించసాగిరి. దానినుండి హాలహల ప్రకటమయ్యెను. దానిని శంకర భగవానుడు తన కంఠమందు ధరించెను. దీనిచేత కంఠమున నల్లని మచ్చ ఏర్పడుటచే శంకర భగవానుడు నీలకంఠ నామముతో ప్రసిధ్ధుడయ్యెను.

ఆ తరువాత సముద్రము నుండి వారుణీదేవి , పారిజాత వృక్షము , కౌస్తుభమణి , గోవులు , అప్సరసలు , లక్ష్మీదేవి విష్ణుభవానుని చేరగా, సమస్త దేవతలు దర్శించి స్తుతించిరి , దీనివలన అందరూ లక్ష్మీ సంపన్నులయిరి.

అనంతరము అయుర్వేద ప్రవర్తకుడైన ధన్వన్తరి భగవానుడు అమృత కలశముతో ప్రకటమయ్యెను. దైత్యులా కలశమును లాగుకొని దాని నుండి సగము దేవతల కిచ్చి మిగిలినది తీసికొని జంభాది దైత్యులు వెళ్ళుచుండిరి. వీరు వెళ్ళుట గాంచిన విష్ణు భగవానుడు మోహినీ రూపము ధరించెను. రూపవతి అయిన ఈ స్త్రీని గాంచిన దైత్యులు మోహితులై *"సుముఖీ ! నీవు మాకు భార్యవై ఈ అమృతమును మాచే త్రాగించుము"* అని కోరగా అట్లే అని మోహినీ రూపమున నున్న భగవానుడు ఆ అమృత కలశము గ్రహించి దేవతలచే త్రాగించుచుండెను. ఆ సమయమున రాహువు చంద్రుని రూపము ధరించి అమృతమును త్రాగుచుండెను. అప్పుడు సూర్య , చంద్రులు వాని కపట వేషమును ప్రకటించిరి. ఇది గాంచిన శ్రీహరి చక్రముతో వాని శిరస్సును ఖండించెను. కాని దయగలిగి మరల జీవింపజేసెను.

అప్పుడు రాహువు, శ్రీహరితో *"ఈ సూర్యచంద్రులను నేను అనేక మారులు గ్రహణముగా పట్టెదను , ఆ గ్రహణ సమయమున జనులు ఏ కొద్ది దానము చేసినను , అది అక్షయమగును"* అని చెప్పగా శ్రీహరి *"తథాస్తు"* అనెను.

ఆ తరువాత స్త్రీ రూపమును విష్ణు భగవానుడు త్యజించెను. కాని శంకర భగవానుడు *"ఆ మోహినీ రూపమును మరల దర్శింపజేయు"* మని కోరుకొనెను. అప్పుడు శ్రీహరి మరల మోహినీ రూపమును ధరించగా , శంకర భగవానుడు మాయతో మోహితుడై పార్వతిని విడిచి మోహిని వెంటపడెను. శంకరుడు ఉన్మత్తుడై మోహిని కేశములను పట్టుకొనెను. మోహిని కేశములని విడిపించుకొని వెళ్ళిపోయెను. శంకర భగవానుని వీర్యము పడినచోట శివలింగక్షేత్రములు మరియు బంగారు గనులు ఏర్పడెను. అనంతరము శంకర భగవానుడు ఇది మాయ అని గ్రహించి తన స్వరూపమున స్థితుడయ్యెను.

అప్పుడు శ్రీహరి శంకరునితో *"రుద్రా ! నీవు నా మాయను జయించితివి. నామాయను జయించిన వాడవు నీవు ఒక్కడివే. దైత్యులకు అమృతము లభించనందువలన దేవతలు యుద్ధమందు వారిని జయించి తిరిగి స్వర్గమును పొంది"* రనెను. దైత్యులు పాతాళమున ప్రవేశించి అచ్చట నుండి సాగిరి. దేవతల విజయ గాధను చదివెడివారు స్వర్గలోకమునకు వెళ్ళుదురు.

*🌹శ్రీ కూర్మ స్తోత్రం🌹*

నమామి తే దేవ పదారవిందం
ప్రపన్న తాపోప శమాతపత్రం |
యన్మూలకేతా యతయోఽంజసోరు
సంసారదుఃఖం బహిరుత్క్షిపంతి||1||

ధాతర్యదస్మిన్భవ ఈశ జీవా-
స్తాపత్రయేణోపహతా న శర్మ |ఆత్మన్లభంతే భగవంస్తవాంఘ్రి-
చ్ఛాయాం స విద్యామత 
ఆశ్రయేమ || 2 ||

మార్గంతి యత్తే ముఖపద్మనీడై-
శ్ఛన్దస్సుపర్ణైరృషయో వివిక్తే |
యస్యాఘమర్షోదసరిద్వరాయాః
పదం పదం తీర్థపదః ప్రపన్నాః || 3 ||

యచ్ఛ్రద్ధయా శ్రుతవత్యా చ భక్త్యా
సంమృజ్యమానే హృదయేఽవధాయ |
జ్ఞానేన వైరాగ్యబలేన ధీరా
వ్రజేమ తత్తేఽంఘ్రి సరోజపీఠమ్ || 4 ||

విశ్వస్య జన్మస్థితిసంయమార్థే
కృతావతారస్య పదాంబుజం తే |
వ్రజేమ సర్వే శరణం యదీశ
స్మృతం ప్రయచ్ఛత్యభయం స్వపుంసామ్ || 5 ||

యత్సానుబంధేఽసతి దేహగేహే
మమాహమిత్యూఢ దురాగ్రహాణాం |
పుంసాం సుదూరం వసతోపి పుర్యాం
భజేమ తత్తే భగవన్పదాబ్జమ్|| 6 ||

తాన్వా అసద్వృత్తిభిరక్షిభిర్యే
పరాహృతాంతర్మనసః పరేశ |
అథో న పశ్యన్త్యురుగాయ నూనం
యేతే పదన్యాస విలాసలక్ష్మ్యాః || 7 ||

పానేన తే దేవ కథాసుధాయాః
ప్రవృద్ధభక్త్యా విశదాశయా యే |
వైరాగ్యసారం ప్రతిలభ్య బోధం
యథాఞ్జసాన్వీయురకుంఠధిష్ణ్యమ్ || 8 ||

తథాపరే చాత్మసమాధియోగ-
బలేన జిత్వా ప్రకృతిం బలిష్ఠాం |
త్వామేవ ధీరాః పురుషం విశన్తి
తేషాం శ్రమః స్యాన్న తు సేవయా తే || 9 ||

తత్తే వయం లోకసిసృక్షయాద్య
త్వయానుసృష్టాస్త్రిభిరాత్మభిః స్మ |
సర్వే వియుక్తాః స్వవిహారతంత్రం
న శక్నుమస్తత్ప్రతిహర్తవే తే || 10 ||

యావద్బలిం తేఽజ హరామ కాలే
యథా వయం చాన్నమదామ యత్ర |
యథో భయేషాం త ఇమే హి లోకా
బలిం హరన్తోఽన్న మదన్త్యనూహాః |11||

త్వం నః సురాణామసి సాన్వయానాం
కూటస్థ ఆద్యః పురుషః పురాణః |
త్వం దేవశక్త్యాం గుణకర్మయోనౌ
రేతస్త్వజాయాం కవిమాదధేఽజః |12 ||

తతో వయం సత్ప్రముఖా యదర్థే
బభూవిమాత్మన్కరవామ కిం తే |
త్వం నః స్వచక్షుః పరిదేహి శక్త్యా
దేవ క్రియార్థే యదను గ్రహాణామ్|13 ||

*ఇతి శ్రీమద్భాగవతే కూర్మస్తోత్తం*
🙏🙏🕉️🙏🙏🕉️🙏🙏🕉️🙏🙏💥 *నేడు శ్రీ కూర్మ జయంతి* సందర్భంగా...
💥:
*🐢అత్యంత అరుదైన శ్రీ కూర్మనాథ స్వామివారి నిజరూప దర్శనం🐢*


*🙏🏻స్థలపురాణం🙏*


*🐢శ్రీ కూర్మనాథస్వామి దేవస్థానం🐢*

 శ్రీకాకుళం నుండి 15 కి.మీ. దూరానగల శ్రీకూర్మం గ్రామంలో ఉంది.
శ్రీమహావిష్ణువు కూర్మావతారం రూపంలో ఇక్కడ పూజింపబడుతాడు. భారతదేశంలో ఈ మాదిరిగా కల కూర్మావతారం మందిరం ఇదొక్కటే. ఈ మందిరం శిల్పకళాశైలి విశిష్టమైనది. చిత్రంగా ఇక్కడి స్వామి పడమటి ముఖముగా ఉంటారు. మరొక విశేషం ఈ ఆలయంలో రెండు ధ్వజ స్తంభాలు గలవు. 11వ శతాబ్దం కాలం నాటి శాసనాలు ఇక్కడ లభించాయి. దీనితో పాటు శ్రీరామానుజాచార్యుల, శ్రీ వరదరాజస్వామి, శ్రీ మధ్వాచార్యుల, కోదండరామస్వామి వారల ఆలయాలు గలవు.

*🐢స్థలపురాణము*

శ్రీకూర్మం లోని ఆలయ ముఖద్వారము శ్రీకాకుళం, గార మండలంలో ఉన్న ఆలయం 2 వ శతాబ్దానికి ముందు నిర్మించినట్లు చాలా మంది నమ్ముతారు. నిజానికి ఆలయము నిర్మించిన వారు ఇప్పటికీ తెలియదు. అయితే, ఈ ఆలయం చోళ, కళింగ రాజా రాజవంశం సమయంలో అభివృద్ధి చేశారు.7 వ శతాబ్దం నుండి ఈ ఆలయం ప్రాముఖ్యత తెలుసునని ఉంది.తరువాత ఈ ప్రాంతాన్ని పాలించిన వివిధ రాజ వంశాలు వివిధ దశలలో అభివృద్ధి చేశారు. ఎక్కువగా కళింగ, ఆంధ్ర, చోళుల రాజవంశం పాలనలో చేశారు. దేవాలయ మొత్తం నిర్మాణం లో గాంధర్వ శిల్ప సంపాద అని పిలవబడే స్తంభాలు ఈ రాజవంశాల పేరు, కీర్తిని చాటి చెప్తాయి. గంగరాజ రాజవంశం యొక్క వారసుడు అనంగభీముడు ఆలయం చుట్టూ నేల, పైభాగాన్ని నిర్మించారు.

దక్షిణ సముద్ర తీరమున శ్వేతపురమనే పట్టణమును శ్వేతచక్రవర్తి పరిపాలించే వాడు. ఆయనకు విష్ణుప్రియ అనే భార్య ఉండేది. ఆమె మహా విష్ణు భక్తురాలు. ఆమె ఒకనాటి ఏకాదశి వ్రత దీక్షలో ఉండగా ఆమె భర్త అయిన శ్వేతమహారాజు కామమోహితుడై ఆమె వద్దకు వచ్చెను. అప్పుడు విష్ణుప్రియ భర్తను సాదరంగా ఆహ్వానించి, కూర్చుండబెట్టి, పూజా మందిరానికి పోయి విష్ణువును ధ్యానించి, స్వామీ! అటు నా భర్తను కాదనలేను, ఇటు నీ వ్రతమును భంగపడనివ్వలేను. నువ్వే నన్ను రక్షించమని పరిపరి విధముల వేడుకొంది. స్వామీ! కూర్మరూపమున భూమిని ధరించలేదా? అట్లే నన్ను ఆదుకోమని ప్రార్థించింది. శ్రీమన్నారాయణుడు దర్శనమిచ్చి, అక్కడనే గంగను ఉద్భవింపజేసెను. ఆ గంగ మహా ఉదృతంగా రాజు వేపు రాగా మహారాజు భయంతో పరుగిడి ఒక పర్వతము మీదకు చేరి తమ మంత్రిని విషయము అడుగగా, ఆతను రాజుకు విషయమంతా వివరించెను.

అప్పుడు రాజు పశ్చాతాపంతో మరణమే తన పాపమునకు ప్రాయశ్ఛిత్తమని తలచి, శ్రీమహా విష్ణువును ధ్యానించుచుండెను. అప్పుడు నారదుడు అటుగా వచ్చి, రాజును విషయమడుగగా, రాజు తన బాధను వివరించెను. అప్పుడు నారదుడు రాజుకు శ్రీకూర్మ మంత్రమును ఉపదేశించి దీక్షతో ధ్యానించమని చెప్పెను. ఈ గంగా ప్రవాహము వంశధార అను పేరుతో సాగరములో లీనమగునని, ఇది సాగరసంగమ ప్రదేశమని చెప్పెను. రాజు వంశధారలో స్నానమాచరించి, అక్కడే వెలసి ఉన్న జ్ఞానేశ్వరుని, సోమేశ్వరుని పూజించి, ఘోర తపస్సు చేసినా, మహానిష్ణువు కరుణించలేదు. అప్పుడు నారదుడు కూడా స్వామిని ప్రార్థించి రాజుకు దర్శనమివ్వవలసిందిగా కోరగా శ్రీమహావిష్ణువు, కూర్మావతారంలో చక్రతీర్థగుండము నుండి వెలువడి, శ్వేతమహారాజుకు దర్శనమిచ్చెను. స్వామి నాలుగు చేతులతో, శంఖము, చక్రము, గద, పద్మములు ధరించి ఉన్నాడు. రాజు స్వామిని వేడి అక్కడ కొలువై ఉండుమని ప్రార్ధింపగా శ్రీమహావిష్ణువు కొలువై ఉండేందుకు తనకు తగిన మంచి స్థానమునకై రాజు, నారదునితో కలసి ఒక వటవృక్షము వద్దకు వచ్చి, ఆవృక్షముపై చక్ర ప్రయోగము చేసెను. అక్కడ క్షీర సమానమైన జలము ఉద్భవించెను. ఈ గుండమునే కూర్మగుండము లేక శ్వేత గుండము అంటారు. చక్రము వెళ్ళిన మార్గము నుండి శ్రీమహాలక్ష్మి ప్రత్యక్షమై, స్వామివారి వామభాగములో వసించెను. అంత శ్రీకూర్మనాధుడు లక్ష్మీ సమేతుడై అక్కడనే నిత్య నివాసమేర్పరుచుకొనెను.

ఒకనాడు అటుగా వచ్చిన ఒక కిరాత స్త్రీ కూర్మగుండములో దాహముతీర్చుకొని, శ్రీకూర్మనాథుని దర్శించుకొని, తన భర్త అయిన భిల్లురాజుకు ఈ విషయము తెలుపగా, ఆతను వచ్చి చూడగా ఆ గుండముపైన చక్రాకారములో తేజము కనుపించెను. ఆ వెలుగు క్రమముగా కూర్మనాథుని ఆకృతిని దాల్చెను. భిల్లురాజు ఆశ్చర్యముగా ఆ స్వామిని చూస్తూ, మహాపురుషుడా లేక ఏదైనా విచిత్ర జలచరమా అని ఆలోచిస్తుండగా, అక్కడకు వచ్చిన శ్వేతమహారాజు, నీ పూర్వపుణ్యమున శ్రీమన్నారాయణుడు, కూర్మరూపములో నీకు సులభముగానే దర్శనమిచ్చాడు అని చెప్పెను. అంత భిల్లురాజు సంతోషముతో స్వామిని పూజించెను. స్వామి సంతోషించి, భిల్లురాజును కూర్మగుండమునకు కట్టడము, సోపానములు కట్టించవలసిందిగానూ, శ్వేతమహారాజును దేవాలయ నిర్మాణము గావించవలసింది గానూ ఆజ్ఞాపించెను. వారట్లే చేసిరి. భిల్లురాజును, స్వామి, పశ్చిమదిక్కుగా సదంగ మహాముని ఆశ్రమ సమీపములో నివాసమేర్పరుచుకోమని ఆజ్ఞాపించెను. అంతట భిల్లురాజు, తనవైపు ఎల్లప్పుడూ కరుణాదృష్టితో చూస్తూ ఉండమని స్వామిని వేడుకొనెను. శ్రీకూర్మనాథుడు అట్లే ఆభిల్లురాజుకు వరమిచ్చెను. అప్పటినుండి స్వామి పశ్చిమాభిముఖుడుగా తిరిగెను.

ఒకనాడు నారదుడు కూర్మనాథుని సేవించుటకు రాగా, శ్వేతమహారాజు, స్వామిని అర్చారూపమున ఆరధించుటకు ఏ మంత్రము తో ప్రతిష్ఠించవలెనని అడిగెను. అంతట నారదుడు, బ్రహ్మదేవుని కోరగా బ్రహ్మదేవుడే శ్రీకూర్మనాథుని, సుదర్శన మంత్రముతో ప్రతిష్ఠించెను. అప్పుడు స్వామి అగ్నిజ్వాలలచే భయంకరముగా ప్రకాశిస్తున్న శ్రీకూర్మనాథుని చూసి దేవతలందరూ భయకంపితులైరి. అప్పుడు శ్వేతమహారాజు, స్వామిని, గోపాలమంత్రంతో ప్రతిష్ఠించవలసిందిగా బ్రహ్మను కోరగా, బ్రహ్మదేవుడు అట్లే శ్రీకూర్మనాథుని గోపాలమంత్రంతో పునహ ప్రతిష్ఠచేసెను. అప్పుడు స్వామి శాంతరూపములో దర్శనమిచ్చి, తనకు నారాయణ మంత్రముతో అభిషేకము, సంకర్షణ మంత్రముతో వస్త్ర సమర్పణ, వాసుదేవ మంత్రముతో ఏక హారతి, అనంత మంత్రముతో ధూపము, పద్మనాభ మంత్రముతో పంచహారతి సమర్పించవలెనని బ్రహ్మకు చెప్పగా, బ్రహ్మ స్వామిని అట్లే ఆరాధించెను. శ్రీకూర్మనాథుడే ప్రాకారాది దేవతా స్థాపనకు ఆజ్ఞనిస్తూ, తూర్పున పార్వతీ సమేతంగా శివుని, ఆగ్నేయమున నరశింహుని, దక్షణమున గోపాలమూర్తిని, నైరుతి దిక్కున వైకుంఠనాథుని, వాయువ్యమున వైష్ణవీ దుర్గను, ఆమెకు ముందు భాగమున విశ్వక్షేసులను, తరువాత అనంతుని స్థాపించమనగా, బ్రహ్మ అట్లే చేసెను.

తిలోత్తమ స్వర్గము నుండి శ్రీకూర్మనాథుని పూజించుటకు వచ్చి అక్కడనే ఉండిపోయింది. బ్రహ్మ, స్వామికి నివేదించిన ప్రసాదము ఆమెకు లభించకపోవుటచే దుఖితురాలై, వక్రాంగ మహామునిని ఆశ్రయించగా, ఆయన, తిలోత్తమకు నారశింహమంత్రమును ఉపదేశించెను. ఆమె ఆమంత్రముతో తపమాచరించగా, ఆమె కాలిబొటనవ్రేలు దగ్గర ఒక గుండమేర్పడింది. అందుండి, శ్రీకూర్మనాథుడు, నరశింహరూపమున ఉద్భవించి, ఆమెకు దర్శనమిచ్చెను. తిలోత్తమ ఆనందంతో స్వామిని అక్కడ అట్లే వెలయవలసిందిగా కోరగా స్వామి అక్కడ అలాగే వెలసెను. ఆకుండము, నరసింహతీర్థమని, అక్కడ వెలసిన స్వామి, పాతాళ నరసింహుడని అందురని స్వామి చెప్పెను. అంత తిలోత్తమ తనకు ప్రసాదము లభించలేదని వివరించగా స్వామి ఆమె భక్తికు మెచ్చి, తన ప్రసాదముపై శాశ్వత ఆధిపత్యమును ఆమెకు ప్రసాదించెను. అప్పటినుండి స్వామివారి ప్రసాదమును తిలోత్తమే అందరికీ పంచేదట.

పద్మపురాణము లోని శ్వేతగిరి మహత్యమను 30 అధ్యాయములో చెప్పబడిన విశేషముల ప్రకారము
శ్రీకూర్మక్షేత్రమునకు వంశధారానదీ తీరములో శ్రీకూర్మశైలమను పర్వతము ఉంది. ఇది శ్రీకూర్మనాథుని విరాడ్రూపమని నమ్మకము. క్షేత్రమునకు దక్షిణమున ప్రేతశిల అను పర్వతముంది. ఇక్కడ కౌటిల్యతీర్థముంది. ఈ తీర్థములో స్నానమాచరించి, ప్రేతశిల యందున్న విష్ణుపాదాలపై పిండప్రదానము చేసి కౌటిల్య తీర్థములో పితృతర్పణము చేసిన గయలో శ్రాద్ధము వలన కలుగు ఫలమే లభంచును.ఇక్కడ ఉన్న అష్టతీర్థములందు స్నానముచేసి, శ్రీకూర్మనాథుని కొలుచుట ఒక ఆచారముగా వస్తున్నది. ఇక్క డ ఉన్న చక్రతీర్థము, నారదతీర్థము, కౌటిల్యతీర్థము, మాధవతీర్థము, నరసింహతీర్థము, కూర్మతీర్థము, వంశధార నది, లాంగలీనది, సముద్రములో మూడురోజులుగానీ, ఎనిమిదిరోజులు గానీ ఈ క్షేత్రములో ఉండి, స్నానములాచరిస్తూ, స్వామిని కొలుచుట ఒక ఆచారము.

ఈ శ్రీకూర్మక్షేత్రము పంచలింగారాధ్యక్షేత్రము (ఐదుగురు శివులు క్షేత్రపాలకులుగా ఉన్న క్షేత్రము) తూర్పున వంశధారాసాగర సంగమ ప్రదేశములో కళింగ పట్టణములో కర్పూరేశ్వరుడు, ఉత్తరమున సింధూర పర్వతమున (సింగుపురపుకొండ) హటకేశ్వరుడు, పశ్చిమమున నాగావళీ తీరమున శ్రీకాకుళ పట్టణములో కోటీశ్వరుడు, ఉత్తరమున (పిప్పల) ఇప్పిలి గ్రామమున సుందరేశ్వరుడు, శ్రీకూర్మక్షేత్రమున సుధాకుండతీరమున సిద్ధేశ్వరుడు వేంచేసి ఉన్నారు. శ్రీకూర్మక్షేత్ర ముఖద్వారమున భైరవుడు, ఆలయ ప్రాకారమున అష్టదిక్పాలురును క్షేత్రపాలకులై స్వామిని సేవిస్తున్నారు.

*🐢ఆలయ విశిష్టత*

ఈ ఆలయం యొక్క పెద్ద ప్రాకారా నికి వెలుపల ‘శ్వేత పుష్కరిణి’ ఉంది. క్రీస్తు శకం నాలుగో శతాబ్ది నాటికే ఈ ఆలయం ఇక్కడ ఉందని చారిత్రిక ఆధారాలు స్పష్టం చేస్తు న్నాయి. ఈ ఆలయం లోని ప్రతీ శిల్పం ఒక అపూరూప కళాఖండంగా చెప్పవచ్చు. ఎంతో మంది రాజులు వేసిన శిలాశాసనాలు శిథిలమై పోకుండా ఇప్పటికీ లభిస్తాయి. ఇవి కళింగాంధ్ర చరిత్రకు అమూల్యా ధారాలుగా నిలుస్తాయి. అత్యద్భుతమైన వాస్తు కళతో ఆలయం అలరా రుతూ ఉంటుంది. ఈ ఆలయ మండపంలోని 108 రాతి స్తంభాలు అన్నీ ఏకశిలతో రూపు దిద్దుకున్నవే. ఒకదానికి ఒకటి పోలిక లేకుండా విభిన్నంగా వీటిని శిల్పులు అత్యంత రమ ణీయంగా మలిచారు.

ప్రతీ ఆలయంలోనూ గర్భగుడిలో ఎదురుగా మూలవిరాట్‌ ఉంటే ఈ ఆలయంలో మాత్రం గర్భ గుడిలో ఎడమవైపు గోడ మూలగా శ్రీకూర్మనాధుని ఆవతారంలో శ్రీమహావిష్ణువు భక్తులకు సాక్షాత్కరి స్తారు. భక్తులు నేరుగా గర్భగుడిలోకి వెళ్తే అడుగు ఎత్తు, ఐదడు గుల పొడవు, నాలుగడుగులు వెడల్పు కొలతలు గల రాతిపీఠం పై కూర్మనాథ స్వామి దర్శనమిస్తారు. రెండున్నర అడుగుల పొడవు, అడుగు ఎత్తులో మొదట తల మధ్యలో శరీరం చివరిగా పశ్చిమా భిముఖంగా తోకతో మూడు భాగాలుగా శ్రీకూర్మం కన్పిస్తుంది. మధ్య తక్కు వ ఎత్తులో శిరస్సుకలిపి ఒకటిగా కన్పిస్తా యి. చివర తాటి పండు పరిమాణంలో తోక వేరే శిలగా ఉంటుంది.

విగ్రహ మంతా దట్టంగా గంధపు పూతను పూసి అలంకరిస్తారు. గర్భగుడిలోకి భక్తులు నేరుగా వెళ్లడం వైష్ణవ సంప్రదాయానికి భిన్నమైనా ఇక్కడ మాత్రం నేరుగా గర్భగుడిలోనే స్వామిని దర్శించుకోవచ్చు.

*🐢బలరాముని శాపం*

ఆలయంలో శ్రీకూర్మనాథుని విగ్రహం పశ్చిమాభిముఖంగా దర్శనమిస్తూ ఉంటుంది. ద్వాపర యుగంలో శ్రీకాకుళంలో ఉమారుద్ర కోటేశ్వర లింగ ప్రతిష్ఠ చేసిన బలరాముడు శ్రీకూర్మం వచ్చాడు. అక్కడ క్షేత్రపాలకుడైన భైరవుడు అతనిని అడ్డగిం చాడు. దాంతో అతడు భైరవుని పై ఆగ్రహంతో ఆతనిని గిరగిరా తిప్పి విసిరేశాడు. ఇది తెలిసిన కూర్మనాధ స్వామి బలరామునికి దర్శన భాగ్యాన్ని కలిగించాడు. ఆయినప్పటికీ తనకు జరిగిన అవమానంతో ఆగ్రహాగ్ని చల్లారని బలరాముడు ‘కూర్మావతారం’లో ఆలయం భూమి పై మరెక్కడా ఉండకూడదని శపించాడు. అందువల్లే ప్రపంచంలోనే ఇది ఏకైక కూర్మనాధస్వామి ఆలయంగా విరాజిల్లుతోంది. ఈఆలయా నికి రెండు ధ్వజ స్తంభాలు ఉండడం మరో ప్రత్యేకత. శ్రీకూర్మంలోని పుష్కరిణి అడుగుభాగం నీరుతో కలిసిన మట్టి తెల్లగా తళతళలాడుతూ ఉండడం విశేషం. ఒక మహర్షికి శ్రీకృష్ణుడు గోపికలతో సహా వచ్చి ఈ పుష్కరిణీలో జలక్రీడలాడుతూ కన్పించాడట. అందు వల్లే ఆ పుష్క రిణిలోని మట్టి తెల్లగా మారిందని చెబుతారు. దీనిని ‘గోపీ చందనం’ అని కూడా అంటారు.

పుణ్యక్షేత్రం యొక్క ప్రధాన ఆకర్షణలు సవరించు
కూర్మ, విష్ణు, పద్మ, బ్రహ్మాండ పురాణాలలో మూలాలు.

మహావిష్ణువు కూర్మావతారము రూపంలో పూజ్యమైన ప్రపంచంలో ఏకైక స్వయంభు ఆలయం (తాబేలు) అవతారం.

విష్ణు ప్రముఖ దశావతారాలలో 2 వ అవతారం. విగ్రహం పశ్చిమ ముఖంగా ఉంది, రెండు ద్వజస్థంబాలతో ప్రపంచంలో ఉన్న కొన్ని దేవాలయాలులో ఒకటి.

రోజువారీ అభిషేకం నిర్వహించే ప్రపంచంలో కొన్ని విష్ణు దేవాలయాలులో ఒకటి.
అజంతా ఎల్లోరా గుహలు మాదిరిగా శతాబ్దాల అరుదైన కుడ్య చిత్రాలతో ఉన్న దేవాలయాలులో ఒకటి.

దుర్గా మాత వైష్ణోదేవి రూపంలో ఉన్న ప్రపంచ రెండవ ఆలయం., ఇతర వైష్ణోదేవి ఆలయం, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఉంది.
దీని శిఖరం రాతి శిల్పం - గాంధార శిల్పకళా అని అంటారు., ఇతర స్తంభాలతో పోలిక లేకుండా కొన్ని స్తంభాలు క్రింద వృథాగా లేకుండా పైకప్పు నిర్మాణానికి వేలాడుతూ అద్భుతంగా చెక్కిన 108 రాతి స్తంభాలు ఉన్నాయి.

వారణాసి (కాశి) వెల్లడానికి సొరంగ మార్గం ఉంది, ప్రస్తుతం దీన్ని మూసివేసారు.

వారణాసి / పూరీ (ఒడిషా) ల వలె, మరణించినవారి అంతిమ కర్మలు, మోక్ష స్థానం ఇక్కడ నిర్వహిస్తారు .
ఆది శంకరాచార్య, రామానుజాచార్య, నరహరి తీర్థ, చైతన్య మహా ప్రభు అనేక గొప్ప రాజులు, సెయింట్స్ ఋషులు దేవాలయాన్ని సందర్శించారు

*🐢ప్రయాణ సదుపాయం*

శ్రీకాకుళం పట్టణం పాత బస్ స్టాండు నుండి ప్రతి 15 నిమిషాలకు అరసవిల్లి మీదుగా ఆర్టిసి వారి బస్సులు ఉన్నాయి.ఉదయం 6.00గంటలనుండి, రాత్రి 8.00గంటల వరకు నడుస్తాయి.అంతేకాక ఆటోలు, టాక్సిలు ఉన్నాయి.వసతి మాత్రం శ్రీకాకుళం పట్టణం లోనే.

*ఓం శ్రీ కూర్మనాథాయ నమః*🙏🏻

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS