*ప్రకాశం జిల్లా*
*త్రిపురాంతకం*
*బాల త్రిపుర సుందరి దేవి*
తారకాసురులను సంహరించే సమయంలో సాక్షాత్తు ఆ పరమశివుడికి బాల త్రిపుర సుందరి సహాయం చేసింది. ఇందు కోసం ఓ యాగ కుండం నుంచి ఆ బాలత్రిపుర సుందరి స్వయంభువుగా ఉద్భవించింది. ఆ ఘటన జరిగిన ప్రాంతం నేడు ఓ పుణ్యక్షేత్రంగా మారి విరాజిల్లుతోంది. పూర్వం ఇక్కడ ఎక్కువ జంతుబలులు ఉండేవి. అందుకు నిదర్శనంగా ఇక్కడ దాదాపు అర్థ అడుగు లోతు, 2 అడుగుల వ్యాసం గల రాతి పాత్ర ఉంది. జంతు బలుల ఎంత రక్తం ఇందులో వేసినా ఇక్కడ ఇది నిండేది కాదని చెబుతారు.
తారకాసుని కుమారులైన తారాక్షుడు, విద్యున్మాలి, కమలాక్షుడు తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకొంటాడు. ఇందు కోసం బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేసి అమిత బలవంతులుగా మారుతారు. అంతేకాకుండా వారు బంగారం, వెండి, ఇనుముతో మూడు నగరాలు నిర్మించుకొని ఆకాశయానం చేస్తూ ఉంటారు. అవి మూడు ఒకే వరుసలో వచ్చినప్పుడు ఒకే సారి మూడు బానులను ప్రయోగించి వాటిని ధ్వంసం చేస్తేనే వారికి చావు ఉంటుంది.
ఇలాంటి విచిత్ర వర గర్వంతో వారు లోక కంఠకులుగా మారిపోతారు. దేవతలను, బుుషులను నానా బాధలు పెడుతుంటారు. దీంతో దేవతలు, మునులు ఈశ్వరుడిని ప్రార్థించి తమను రక్షించాల్సిందిగా వేడుకొంటారు. బ్రహ్మ వరం పొందిన ఆ రాక్షసులను సంహరించాలంటే తనకు అపూర్వ రథమూ, అపూర్వ బాణాలు కావాలని చెబుతారు
దీంతో విశ్వకర్మ జగత్తత్వంతో రథాన్ని, వేద తత్త్వంతో గుర్రాలను, నాగతత్త్వంతో పాగ్గాలను, మేరు శిఖర తత్త్వంతో ధనుస్సుని, వాసుకి తత్త్వంతో వింటినారిని, సోమ, విష్ణు, వాయు తత్త్వాలతో మూడు బానాలను తయారుచేస్తాడు. ఇక ఆ రథానికి బ్రహ్మ స్వయంగా రథసారథి అవుతాడు. దీంతో పరమశివుడు తారాక్షుడు, విద్యున్మాలి, కమలాక్షుల పై యుద్ధానికి వెలుతాడు.
అయితే భీకర యుద్ధంలో ఎంత ప్రయత్నించినా ఆ ముగ్గురు రాక్షసులను పరమేశ్వరుడికి చేతకాదు. విల్లు నుంచి సంధించిన బాణాలు ఆకాశంలో ఎగురుతున్న నగరాలను ఛేదించలేకపోతాయి. అంతే కాకుండా ఆ రాక్షసుల తప:ప్రభావంతో ఆ రథం భూమిలోకి కుంగి పోతుంది. దీంతో పరమశివుడు ఆదిపరాశక్తిని ప్రార్థిస్తాడు. అప్పుడు ఆ పరాశక్తి తన ప్రతిరూపమైన బాల త్రిపుర సుందరిని అక్కడికి వెళ్లి పరమశివుడికి యుద్ధంలో సహాయం చేయాల్సిందిగా ఆదేశిస్తుంది.
దీంతో బాలత్రిపుర సుందరి ఒక యాగ కుండం నుంచి బయటికి వచ్చి శివుడు ధరించిన విల్లులోకి ప్రవేశిస్తుంది. దీంతో శివుడు ఆకాశంలో ఎగురుతున్న మూడు నగరాలను ఛేదించి ఆ రాక్షసులను సంహరిస్తాడు. అటు పై బాల త్రిపుర సుందరి ధనస్సు నుంచి బయటికి వస్తుంది. తనకు యుద్ధంలో సహాయం చేసినందుకు ఏదైనా వరం కోరుకోవాల్సిందిగా పరమశివుడు బాల త్రిపుర సుందరికి చెబుతారు.
దీంతో ఈ సృష్టి ఉన్నంత వరకూ మీరు ఇక్కడ త్రిపురాంతకుడిగా ఉండిపోవాలని కోరురుకొంటుంది. ఈ క్షేత్రం త్రిపురాంతకంగా ప్రసిద్ధి చెందాలని కూడా కోరుకొంటుంది. ఇందుకు పరమేశ్వరుడు సంతోషంగా అంగీకరిస్తాడు. అంతే కాకుండా యుద్ధంలో తనకు సహాయంచేసిన బాల త్రిపురసుందరిని సేవిస్తే అన్నింటా విజయం కలుగుతుందని చెబుతాడు. అందుకే ఏదైనా ఒక కార్యం ప్రారంభించే ముందు ఇక్కడకు చాలా మంది వచ్చి అమ్మవారిని సేవిస్తూ ఉంటారు.
శ్రీశైలం నాలుగు ద్వారాల్లో త్రిపురాంతకం తూర్పుద్వారం. ఇక్కడ ఆలయం చిన్న కొండ పై ఉంటుంది. నాలుగు వైపులా నాలుగు గోపురాలు ఉంటాయి. గర్భగుడిలో స్వామివారు లింగ రూపంలో ఉంటారు. ఇక్కడ శివలింగం పై భాగంలో ఒక అంగులం లోతు గుంట ఉంటుంది. ఆ గుంటలో నీరు ఎల్లవేలలా ఉండటం విశేషం. ఇక ఆలయం ప్రాంగణంలో ఒక చీకటి గుహ ఉంది. ఇక్కడి నుంచి శ్రీశైలానికి సొరంగ మార్గం ఉండేదని చెబుతారు.
ఈ ఆలయానికి దగ్గరగా ఉన్న చెరువులో బాల త్రిపుర సుందరి ఆలయం ఉంది. ఈ ఆలయం శ్రీ చక్ర ఆకారంలో ఉంటుంది. ఇక బాల త్రిపుర సుందరి ఆవిర్భవించిన యాగకుండాన్ని ప్రస్తుతం నడబావి అంటారు. అమ్మవారిని దర్శించాలంటే 9 మొట్లు దిగి వెళ్లాలి. స్కాంద పురాణంలో శ్రీ శైలఖండంలో ఈ క్షేత్ర ప్రస్తావన ఉంది.
పూర్వం ఇక్కడ ఎక్కువ జంతుబలులు ఉండేవి. అందుకు నిదర్శనంగా ఇక్కడ దాదాపు అర్థఅడుగు లోతు, 2 అడుగుల వ్యాసం గల రాతి పాత్ర ఉంది. జంతు బలుల ఎంత రక్తం ఇందులో వేసినా ఇక్కడ ఇది నిండేది కాదని చెబుతారు. ఇది ఇక్కడ విశేషం. అమ్మవారి ఆలయం బయట, చెరువు కట్టమీద కదంబ వృక్షాలు కనిపిస్తాయి. వారణాసి తర్వాత కదంబ వ`క్షాలు కనిపించే పుణ్యక్షేత్రం ఇది మాత్రమే. అందువల్లే అమ్మవారిని కదంబ వనవాసిని అని పిలుస్తారు.
ప్రకాశం జిల్లాలోని మార్కాపురానికి 40 కిలోమీటర్ల దూరంలో గుంటూరు కర్నూలు జాతీయ రహదారి పై త్రిపురాంతకం ఉంటుంది. శ్రీ శైలం నుంచి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంటుంది. బస్సు సౌకర్యం ఉందిది. ఇక్కడ ఉండటానికి వసతి అంతగా బాగుండదు.
హిందూ సాంప్రదాయాలు ఆచరిద్దాం-పాటిద్దాం.
*శ్రీ మాత్రే నమః*
No comments:
Post a Comment