Friday, December 25, 2020

మహాభారతం తరువాత ఇక ఏ కథలోనూ దివ్యాస్త్రాల ప్రస్తావన రాలేదేమిటి..?

 మహాభారతం తరువాత ఇక ఏ కథలోనూ దివ్యాస్త్రాల ప్రస్తావన రాలేదేమిటి..? ఆ పరిజ్ఞానం తరువాత కాలానికి సంబంధించిన కథానాయకులకు ఎందుకు లేకుండాపోయింది..? కురుక్షేత్రం తరువాత ఈ దివ్యాస్త్రాలు ఏమయ్యాయి..? ఇంట్రస్టింగు ప్రశ్న కదా… అప్పుడప్పుడూ ఈ అంశంపై కూడా నెట్‌లో కొన్ని చర్చలు, వ్యాఖ్యలు కనిపిస్తుంటాయి… ఓసారి పరిశీలిద్దాం… దివ్యాస్త్రాలు అంటే నాగాస్త్రం, ఆగ్నేయాస్త్రం, వారుణాస్త్రం, గరుడాస్త్రం, సమ్మోహనాస్త్రం, పాశుపతాస్త్రం, బ్రహ్మాస్త్రం, నారాయణాస్త్రం… ఇలాంటివి…



కురుక్షేత్ర కాలానికే ధర్మం క్షీణదశకు చేరుకుంది… ఆ ద్వాపర యుగం దాటి ఇక కలియుగం ప్రారంభమైతే ఇంకా ధర్మం ఒంటికాలితో కుంటక తప్పదని కృష్ణుడి భావన… ధర్మ పరిరక్షణ పేరుతోనే కురుక్షేత్ర సమరం జరిపించినా సరే, ఒక్కసారి కలియుగం ఆరంభమైతే ఇక ధర్మక్షీణత అనివార్యమని తనకూ తెలుసు… మనుషుల్లో కక్షలు, కార్పణ్యాలు పెరుగుతాయి… విచక్షణ, సంయమనం మరింత అదుపు తప్పుతాయి… అందుకని దివ్యాస్త్రాలు కలియుగంలోకి ప్రవేశించొద్దు అనేది కృష్ణుడి నిర్ణయం… ఓసారి ఆ దివ్యాస్త్రాల పరిజ్ఞానం ఎవరెవరికి ఉన్నదో, ఎవరి ద్వారా అవి కలియుగంలోకి కూడా వచ్చే అవకాశాలున్నాయో పరిశీలిస్తాడు…


1) కృష్ణుడు… అంటే తనే… తను ఎలాగూ కలియుగంలోకి రాడు… అప్పటికే అవతారం చాలిస్తాడు…



2) అర్జునుడు… తన జీవనం చివరి అంకంలో స్వర్గం వైపు సాగే మహాప్రస్థానంలో ఏ హిమాలయ పర్వతంపైనో రాలిపోతాడు… ఆ భవిష్యత్తు కృష్ణుడికీ తెలుసు…


3) అభిమన్యుడు…అర్జునుడి ద్వారాా కొన్ని దివ్యాస్త్రాల పరిజ్ఞానం నేర్చుకున్నాడు సరే, కానీ కురుక్షేత్రంలోనే కుట్రవ్యూహాలకు హతుడైపోయాడు…


4) భీష్ముడు… ప్రతి దివ్యాస్త్రం మీద పట్టు ఉన్న యోధుడు… కురుక్షేత్రంలోనే, అంపశయ్యపై వేచీ వేచీ, చివరకు ప్రాణాలొదిలాడు…


5) ద్రోణుడు… దృష్టద్యుమ్నుడి చేతలో శిరోఖండనానికి గురై, కురుక్షేత్ర సమరంలోనే ప్రాణాలు వదిలేశాడు…


6) అశ్వత్థామ… తండ్రి ద్వారా అన్నిరకాల దివ్యాస్త్రాల జ్ఙానాన్ని సంపాదిస్తాడు… కానీ పాండవులు అనుకుని, కురుక్షేత్రం చివరిరోజు ఉపపాండవులను సంహరించి, ఆ దివ్యస్త్ర పరిజ్ఞానాన్ని మరిచిపోయే శాపం కృష్ణుడి నుంచి పొందుతాడు… పిచ్చివాడై ఏ అడవుల్లో పడి ఎలా బతికాడో ఎవరికీ తెలియదు…


7) పరుశురాముడు… తను యోగనిద్రలోకి వెళ్లిపోతాడు… ఈ ప్రాపంచిక ధ్యాస నుంచే దూరమవుతాడు… ద్వాపర యుగం అనంతరం ఈయన ప్రస్తావన మరే పురాణంలోనూ కనిపించదు…


8) సాత్యకి… యాదవులు పరస్పరం సంఘర్షించుకుని, అందరూ మరణిస్తారు… అందులో సాత్యకి కూడా… ఏ ఇతర యాదవ వీరుడికీ ఈ విద్య తెలియదు…


9) కర్ణుడు… పరుశురాముడి నుంచి దివ్యాస్త్రాల పరిజ్ఞానం పొందినవాడే… కానీ కురుక్షేత్రంలో మరణించాడు… తను ఎవరికీ తన విద్యను బోధించలేదు…


10) దృష్టద్యుమ్నుడు… తనకు కొన్ని దివ్యాస్త్రాలు తెలుసు… కానీ కురుక్షేత్రం చివరిరోజున అశ్వత్థామ చేతుల్లో హతుడైపోయాడు…


11) ధృతరాష్ట్రుడు… తను ఏ యుద్ధంలోనూ పోరాడకపోయినా తను దివ్యాస్త్రాల పరిజ్ఞానం కలిగిన వాడే,.. కురుక్షేత్రం తరువాత సన్యాసాశ్రమం తీసుకుని, అడవుల్లో నివసిస్తాడు… ఓరోజు దావానలం చుట్టుముట్టి ఆ మంటల్లోనే పడి మరణిస్తాడు…


12) బర్బరీకుడు… ఘటోత్కచుడి కొడుకు… దివ్యాస్త్ర సంపన్నుడు… అంతులేని గందరగోళంలోకి నెట్టేసి, కృష్ణుడు ఈ పాత్రను కురుక్షేత్రానికి ముందే ముగించేస్తాడు…


13) బభ్రువాహనుడు… అర్జునుడి చిత్రాంగద వల్ల పుట్టిన కొడుకు… అర్జునుడిని మించిన యోధుడు…


14) పరీక్షిత్తు… అభిమన్యుడి కొడుకు… అశ్వత్థామ ప్రయోగించిన దివ్యాస్త్రం దెబ్బకు తల్లి గర్భంలోనే మరణిస్తే, క‌ృష్ణుడు బతికిస్తాడు,,, తనే ధర్మరాజు అనంతరం అఖండ ఆర్యావర్తానికి చక్రవర్తి అవుతాడు…


15) వృషకేతు… కర్ణుడి చిన్నకొడుకు… కురుక్షేత్రం అనంతరం అర్జునుడు అమితంగా ప్రేమిస్తాడు ఇతన్ని… అన్నిరకాల విద్యలూ నేర్పిస్తాడు…


అంటే… ఈ చివరి ముగ్గురూ మిగిలారు… ఈ ముగ్గురూ ద్వాపర యుగం అనంతరం కలియుగంలోకి ప్రవేశించే పాత్రలు… అందుకని కృష్ణుడు వేర్వేరు సందర్భాలలో ఆ ముగ్గురి నుంచీ మాట తీసుకుంటాడు… ఎవరికీ ఈ విద్యల్ని నేర్పించవద్దు అని… దానికి కట్టుబడి ఉంటారు… ఇక వారి తరువాత ఎవరికీ ఆ విద్య దక్కలేదు… ఆ పరంపర వారితోనే ఆగిపోయింది… తమ వారసులకు కూడా ఆ విద్యను బోధించలేదు… వారితోనే దివ్యాస్త్రాల కథ ముగిసిపోయింది…

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS