Wednesday, July 12, 2023

సప్త ముక్తి స్థలాలు


                   సప్త ముక్తి స్థలాలు 

పురాణాల ప్రకారం అయోధ్య, మధుర, హరిద్వార్, వారణాశి, కాంచీపురం, ఉజ్జయిని మరియు ద్వారకఅను సప్తపురులు (పురములు లేదా పట్టణములు) సప్తముక్తి స్థలాలుగా, సప్త ధామములుగా ప్రసిద్ధిచెందాయి. సప్త ముక్తిస్థలాలు నదీతీరాల్లో ఉండటం విశేషం అయోధ్య (అయోద్యపురి) నందు రాముడిగా మహావిష్ణువు, మధుర (మధురాపురి) నందు కృష్ణుడిగా మహా విష్ణువు కృష్ణుడిగా, హరిద్వార్ (మాయాపురి) నందు మాయాదేవిగా శక్తి, వారణాశి (కాశిపురి) నందు విశ్వనాథుడుగా శివుడు, కాంచీపురం (కాంచీపురి) నందు కామాక్షిగా దుర్గాదేవి, ఉజ్జయిని (అవంతికా పురి) మహా కాళేశ్వరుడుగా శివుడు, ద్వారక (ద్వారకాపురి) నందు కృష్ణునిగా మహావిష్ణువు ముక్తినిచ్చే దైవాలుగా పురాణాల్లో తెలుపబడ్డారు. సప్తపురి అనేవి దేవతలు అవతరించిన ప్రదేశాలు మరియు యుగాలనుండి ఆధ్యాత్మికశక్తులతో నిత్యతీర్థాలుగా పరిగణించ బడుతున్న ప్రదేశాలు.                                     హరిద్వార్ మరియు  కాంచీపురం శక్తిరూపములైన మాయాదేవి మరియు  కామాక్షీదేవి ఆలయాలకు ప్రసిద్ధి. వారణాశి మోక్షస్థానం. వారణాశిలో మరణిస్తే మోక్షం లభిస్తుందని ప్రజలు ప్రగాఢంగా విశ్వసిస్తారు. మోక్షస్థలాల్లో శివపురం అనిపిలువబడు వారణాశి అన్నింటికంటే పవిత్రమైనదేకాక శివునికి ఇష్టమైనది. హిందువులు వారణాశిలో ప్రధానఆలయాలను వారిజీవితంలో ఒకసారి అయినా సందర్శించాలని కోరుకుంటారు. అవంతిక అనేపేరుతో పిలువబడు ఉజ్జయినినందలి మహాకాళేశ్వర ఆలయం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. సప్తపురాలు అద్భుతమైన మేళాలు లేదా ఉత్సవాలకు ప్రసిద్ధి చెందాయి. 

హరిద్వార్ మరియు ఉజ్జయిని 12 సం.లకు ఒకసారి జరిగే కుంభమేళాకు ప్రసిద్ధి. కాంచీపురంలో కామాక్షి కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహిస్తారు. ఆగస్టునెలలో వచ్చు కృష్ణ జన్మాష్టమినాడు ద్వారక మరియు మధురలో ప్రత్యేకమైన ఉత్సవం జరిపుతారు. ద్వారక భాగవత పురాణ ప్రకారం జన్మస్థలమైన మథురను విడిచిపెట్టిన తరువాత, కృష్ణుడు గడిపిన ప్రదేశం.శివుడు మరియు మహావిష్ణువుల పవిత్ర ఆలయాలున్న హరిద్వార్ హిమాలయాల్లోని పుణ్యక్షేత్రములకు ప్రవేశద్వారం. హిమాలయాల్లో ప్రవహించిన గంగానది హరిద్వార్ నుండి మైదానప్రాంతంలోకి ప్రవహిస్తుంది. ఏడు క్షేత్రాలు మనదేశంలోనే ఉన్నాయి. అన్నిక్షేత్రాలు దేశంలోని ఇతర పట్టణాలతో రోడ్డు, రైలు మరియు వాయు రవాణాద్వారా కలుపబడి ఉన్నాయి.
                          అయోధ్య                   
త్రేతాయుగంలో రామాయణ మహాకావ్యానికి మూలపురుషుడైన రాముడు జన్మించిన అయోధ్యను రామజన్మభూమి లేదా రామ జన్మస్థలం అనికూడా పిలుస్తారు. అయోధ్యలో వందకుపైబడి దేవాలయాలున్నాయి. ఆలయాల్లో కనక్ భవన్ అనిపిలుబడు సీతారాముల ఆలయం, కొండపై కూర్చున్న భంగిమలోఉన్న హనుమాన్ విగ్రహమున్న హనుమాన్ గర్హి అనిపిలువబడు హనుమాన్ దేవాలయం, సీత క్షీరేశ్వరనాథ్ ఆలయం, కౌసల్య ఆలయం ముఖ్యమైనవి. పౌరాణిక పాత్రలపేర్లతో అనేకకొనేర్లు, స్నానఘట్టాలు  ఉన్నాయి. ఇక్కడ బ్రహ్మపేరుతో నిర్మించిన బ్రహ్మకుండ్, సీతాకుండ్, భరత్ కుండ్,  లక్ష్మణుడు స్నానంచేసిన లక్ష్మణ్ ఘాట్, స్వర్గద్వారం అనే రామఘాట్ ముఖ్యమైనవి. 
                             మథుర                                                        మథుర మథురజిల్లా కేంద్రంలో యమునానది కుడి ఒడ్డున ఉంది, మధురను  బ్రిజ్ భూమి అని పిలుస్తారు, శ్రేకృష్ణ జన్మస్థలమైన మధుర భారతీయ సంస్కృతికి గుండెకాయ వంటిది. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని అయోధ్య, ప్రయాగ, వారణాశి మరియు మధుర పుణ్యక్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి. కృష్ణుడు జన్మించిన మధురను 'కృష్ణ జన్మభూమి' అంటారు. యమునానది ఒడ్డున విశ్రాం ఘాట్ నందు ప్రతిరోజూ సాయంత్రం యమునకు హారతి సమర్పిస్తారు. విశ్రాం ఘాట్ కృష్ణుడు తనమామ అయిన కంసుడిని వధించినపిమ్మట విశ్రాంతి తీసుకున్న ప్రదేశం. యమున మరియు ఆమెసోదరుడు మృత్యుదేవత యముని విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి. యాత్రికులు మథురలో చూడతగ్గ అనేక ఇతర ఆలయాల్లో  ప్రేమమందిర్ బృందావనం, గోవింద్జీ ఆలయం, మదన్ మోహన్ ఆలయం, రాధాదామోదర్ ఆలయం, రాధాగోపీనాథ్ ఆలయం, బంక్ బిహారీ ఆలయం, కృష్ణ బలరామ ఆలయం, రంగాజీ ఆలయం. మరియు సేవా కుంజా ముఖ్యమైనవి. కృష్ణుడు చిన్నతనంలో గడిపిన మధుర మరియు సమీపంలోని బృందావన్‌లో, సుమారు అయిదువేల ఆలయాల సమూహం ఉంది. మధుర మరియు బృందావన్ ఆలయ ప్రాంగణాల్లో యాత్రికులు నిర్దేశించిన మార్గంలో  ప్రదక్షిణలు చేస్తారు. భక్తులు గోవర్ధన్ కొండ చుట్టూకూడా ప్రదక్షిణ చేస్తారు.                               
                             హరిద్వార్
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్ లేదా హర్ ద్వార్ విష్ణు (హరి) క్షేత్రమైన బద్రీనాధ్  మరియు శివ (హర్) క్షేత్రమైన కేదార్నాధ్ పుణ్య క్షేత్రములకు ప్రవేశద్వారం. హిందూపురాణాల ప్రకారం సముద్రమథనం పిమ్మట గరుఢుడు అమృతం తీసుకువెల్లునప్పుడు అనుకోకుండా కలశం తొణికిసలాడి చిందినప్పుడు అమృతంచుక్కలు పడిన నాలుగుక్షేత్రాలు ఉజ్జయిని, నాసిక్, అలహాబాద్ మరియు హరిద్వార్. ఈక్షేత్రం  గురించి మరొపురాణం ప్రకారం కపిలమహర్షి భగీరథుని పూర్వీకులను శపించాడని. వారి పాపాలను పోగొట్టాలి ఆనుకున్న భగీరథుడు ఇక్కడ శివునికి తపస్సుచేసి శివుడు భగీరథుని ప్రార్థనలకు సంతోషించి గంగను స్వర్గంనుండి జటలపైనుండి ప్రవహింపచేసి భూమిపై పడేలా చేశాడు.
                              వారణాసి                              ఋగ్వేదంలో పూర్వం వారణాశిని కాశీ లేదా "శివపురి" అనేవారని పేర్కొనబడినది. ప్రస్తుతం కాశీ, బెనారస్ అని పిలువబడుచున్న వారణాశిని గతంలో అవిముక్తక, ఆనందకానన, మహాశ్మశాన, సురంధన, బ్రహ్మవర్ధ, రమ్య మరియు సుదర్శన అని పిలువబడ్డ పురాతననగరం. వారణాసి అనే పేరు 'వరుణ' మరియు 'అసి' అనే నదుల పేర్లను కలపడం నుండి ఉద్భవించింది. వారణాశిలో సుమారు ఇరవైమూడు వేల ఆలయాలు, గంగానది తీరంవెంబడి 81 స్నానఘట్టాలు ఉన్నవి.వారణాశినందు మణికర్ణిక, హరిశ్చంద్ర,, దశాశ్వమేధ, అస్సీ మరియు పంచగంగా ఘాట్‌ స్నానఘట్టాలు భక్తులు ఎక్కువగా సందర్శించే స్నానఘట్టాలు. మణికర్ణిక మరియు హరిశ్చంద్ర ఘాట్‌లవద్ద హిందువులు తమ బంధువుల మృతశరీరాలు దహనం చేయడంతోపాటు వార్కి తీర్ధవిధులు, పిండప్రధాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. అందువల్ల వారణాశి శివునినివాసంగా కైలాసపర్వతం తరువాత అత్యంతఇష్టమైన క్షేత్రంగా తలుస్తారు. మహాభారత ఇతిహాసంలో కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు చేసిన సోదరహత్య మరియు బ్రాహ్మణహత్య పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోడానికి శివుడిని వెతుకుతూ కాశీకి వెళ్లారని చెప్పబడింది. వారణాశిలోకల అసంఖ్యాక ఆలయాలలో డూండీ వినాయక్, కాశీవిశ్వనాథ అన్నపూర్ణ, విశాలాక్షి, కాలభైరవ్, వ్యాసకాశీ, ఆలయాలు, సంకట్ మోచన్ హనుమాన్ మందిరంతోపాటు నవదుర్గఆలయాలు ప్రసిద్ధి చెందాయి. అసంఖ్యాక ఆలయాలలో తులసీమానస మందిరం, బెనారస్ యూనివర్సిటీ నందు నూతనంగా నిర్మించిన విశ్వనాధఆలయం కూడా  ప్రముఖమైనవి.                                                                             
                            కాంచీపురం                             సుమారు పదహారువందల సంవత్సరములకు పూర్వం పల్లవుల పాలనలో పాలార్ నదిఒడ్డున నిర్మించబడి గతంలో కంజీవరంగా పిలువ బడిన కాంచీపురంలో సుమారుగా 108 శైవ మరియు 18 వైష్ణవ ఆలయాలున్నాయి. అద్వైతతత్వాన్ని ప్రచారంచేసిన జగద్గురు  శ్రీఆది శంకరాచార్యులు పద్నాలుగువందల సంవత్సరములకు పూర్వం ఇక్కడ నివసించి అద్వైతతత్వాన్ని బోధించారు. కామాక్షిదేవి ఆలయం కాంచీపురం అన్ని దేవాలయాలలో పురాతనమై అత్యంత ప్రసిద్ధమైన ఆలయం. కామాక్షీదేవి ఆలయం ఆదిశంకరుల చరిత్రతో ముడిపడింది. పురాణాలు పార్వతీదేవి కామాక్షిరూపంలో ఇసుకతోచేసిన శివలింగంపూజించి శివుని ఏకాంబరేశ్వర రూపంలో వివాహం చేసుకొన్నట్లు చెబుతున్నాయి. సుమారు, 5 ఎ విస్తీర్ణంలోఉన్న ఆలయప్రాంగణంలో  గర్భగుడిపై బంగారుపూత పూసిన విమానం(గోపురం) కలిగి  ఉంది. ఆలయంలో త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు మరియు పరమేశ్వరులతో కూడిన పరబ్రహ్మ స్వరూపిణి రూపంలో కామాక్షి కూర్చున్నభంగిమలో ప్రతిష్టించబడింది. 
                                ఉజ్జయిని                          రాక్షస రాజు త్రిపురాసురునిపై విజయంసాధించి అహంకారంపై శివుని విజయానికి చిహ్నంగా గతంలో అవంతికఅని పిలువబడిన ఉజ్జయిని శివక్షేత్రాలలో ముఖ్యమైనది. శైవులు, వైష్ణవులు మరియు శక్తి భక్తులకు ఉజ్జయిని ఒక ముఖ్యమైన తీర్థయాత్ర స్థలం. 12 సం.లకు ఒకసారి జరుగు కుంభమేళా నందు లక్షలాదిమంది నాగసాధువులు, అఘోరాలు, దేశంలోని అన్నిప్రాంతాల భక్తులతోపాటు విదేశీ సందర్శకులు పాల్గొనే ప్రసిద్ధపుణ్యక్షేత్రం. మహాకాళేశ్వరుని విగ్రహం దక్షిణాభి ముఖంగా ఉండుటవల్ల మహాకాళేశ్వరుడు దక్షిణాముఖి అని పిలువబడు చున్నాడు. ఉజ్జయినిక్షేత్రంలో మరొక ప్రసిద్ధఆలయం కాలభైరవ ఆలయం. షిప్రానది ఒడ్డునఉన్న క్షేత్ర సంరక్షకదైవం కాలభైరవ ఆలయానికి  రోజూ వేలాదిమంది భక్తులు దర్శిస్తారు. కాలభైరవునికి సమర్పించు నివేదనల్లో భైరవునికి ప్రియమైన మద్యంఒకటి. కాలభైరవునికి మధ్యం నివేదనగా సమర్పించు ఆలయం దేశంలో ఇదిఒకటే. కాలభైరవదర్శనం కానిదే యాత్ర సంపూర్ణంకాదని తెలుపబడింది.                                     
                                ద్వారక                                        ద్వారక గుజరాత్ రాష్ట్రంలో అరేబియా సముద్ర తీరంలో బెట్ ద్వారక అనబడు ద్వీపకల్పంనకు పశ్చిమంగాఉన్న పట్టణం. భాగవతపురాణం ప్రకారం ద్వారక సుమారు 5000 సంవత్సరాలకు పూర్వం మహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణుడు జన్మస్థలమైన మధురనుండి తరలివెల్లి గోమతీనది ఒడ్డుననిర్మించి తనరాజ్యమునకు రాజధానిగా చేసుకొని పరిపాలించిన నగరమని చెప్పబడింది. గాంధారి శాపంవల్ల శ్రీకృష్ణుని మరణం అటుపిమ్మట, కృష్ణుని వంశస్థులతోపాటు యాదవులండరు వారిలోవారు కలహించిపతనమయ్యారు. అటుపిమ్మట సంభవించిన వరదల వల్ల ద్వారకలో అఃదికభాగం అరేబియా సముద్రంలో మునిగిపోయి ప్రస్తుతం చిన్నపట్టణంగా మాత్రమేమిగిలింది. జగత్ మందిరం అని త్రిలోక్ సుందర్ అనిపిలువబడు నూటనలభై అడుగులఎత్తుతో ఏడు అంతస్తుల ద్వారకాధీష్ ఆలయం అరేబియా సముద్రమట్టంకంటే ఎత్తుగా కనిపిస్తుంది. కృష్ణుని భార్య రుక్మిణిఆలయం, ద్వారక నుండి 2 కి.మీ. దూరంలోఉన్న బెట్ ద్వారకలో ఉంది. మరొకధనంనందు  శ్రీకృష్ణుడు బెట్ ద్వారక నందు నివసిస్తూ ద్వారకనుండి రాజ్యపాలన చేశాడని చెప్పబడింది.                


No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS