తిరుమలేశుని భక్తులకు తిరునామధారణ.
తిరు అంటే ‘శ్రీ’, నామం అంటే ‘తిలకం’. తిరునామాన్ని శ్రీనామం అని కూడా అంటారు. సనాతన ధర్మంలో తిరునామాన్ని శుభసూచికంగా భావిస్తారు. తిరునామం సాక్షాత్తు శ్రీవేంకటేశ్వరస్వామివారికి ప్రతీక. తిరునామాన్ని ధరించిన భక్తులకు భగవంతుడు మనకు తోడుగా, అండగా ఉన్నాడన్న భావన కలుగుతుంది. సత్ప్రవర్తనతో, భక్తిభావంతో మెలగుతారు. ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన తిరుమలలో ఇలాంటి భక్తిసంప్రదాయాన్ని పెంచేందుకు టిటిడి భక్తులకు తిరునామధారణ చేయిస్తోంది.
తిరునామంలో ఎర్రటికాంతిలా కనిపించే ఆకారం ఆత్మను సూచిస్తుంది. కొంత మంది భక్తులు భుజాలు, ఛాతిపైన, వీపుపై కింది భాగాన తిరునామం ధరిస్తారు. భక్తులు కనుబొమల మధ్య నుంచి నుదుటిపై వరకు ధరిస్తారు. తిరునామం ధరించినవారు శ్రీవేంకటేశ్వరుని సేవకులని సులువుగా గుర్తించవచ్చు. నుదుటన గల ఆగ్నేయచక్రంలో తిలకధారణ చేసుకుంటే చెడుదృష్టి పడకుండా ఉంటుందని భక్తుల నమ్మకం. తిరునామం కోసం నామకోపు, ఎర్రసింధూరం వినియోగిస్తున్నారు. తిరునామం పెట్టుకుంటే చలువ చేస్తుందని కూడా కొందరు భక్తుల అభిప్రాయం. ఈ నామకోపు, ఎర్రసింధూరం భక్తుల నుండి విరాళంగా టిటిడికి అందుతోంది. తిరునామధారణ కోసం ప్రత్యేకంగా రాగితో తయారుచేసిన కప్పు, మూడు నామాల ముద్రను ఉపయోగిస్తారు. వీటిని తూర్పుగోదావరి జిల్లా మండపేట నుండి టిటిడి కొనుగోలుచేసింది.
తిరుమలలోని సర్వదర్శనం కాంప్లెక్స్, దివ్యదర్శనం కాంప్లెక్స్, రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం కాంప్లెక్స్, కల్యాణకట్ట కాంప్లెక్స్, వరాహస్వామివారి ఆలయంతో పాటు శ్రీవారి ఆలయ మాడవీధులు, సహస్రదీపాలంకార సేవ మండపం, అన్నప్రసాదం కాంప్లెక్స్ పరిసర ప్రాంతాలు, శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయం ప్రాంతాల్లో భక్తులకు తిరునామధారణ జరుగుతోంది. ఇందుకోసం రోజుకు రెండు షిప్టుల్లో 130 మంది శ్రీవారి సేవకులు సేవలందిస్తున్నారు.
• శ్రీవారి తిరునామం :
శ్రీవారి మూలమూర్తికి శుక్రవారం అభిషేకం తరువాత వారానికి ఒకసారి మాత్రమే చందనం పొడి, కర్పూరం, మధ్యలో కస్తూరితో తిరునామం దిద్దుతారు. గురువారం సడలింపు(ఆభరణాలు తొలగించే) సమయంలో కళ్లు కనిపించేలా తిరునామాన్ని కొంతమేర తగ్గిస్తారు. పవిత్రతకు ప్రతీకగా కనిపించే ఈ తిరునామం శ్రీవారి ముఖారవిందాన్ని మరింత తేజస్సుతో ఆవిష్కరిస్తూంటుంది. ఈ నామాన్ని ‘తిరుమణికాప్పు’ అని అంటారు. ఇందుకుగాను 16 తులాల పచ్చ కర్పూరం, ఒకటిన్నర తులం కస్తూరిని ఉపయోగిస్తారు.
సేకరణ:--
లాయర్ సాయి ప్రసాద్ పోతిన, డెహ్రాడూన్, ఉత్తరఖాండ్ / ఉత్తరాంచల్
సేకరణ:--
లాయర్ సాయి ప్రసాద్ పోతిన, డెహ్రాడూన్, ఉత్తరఖాండ్ / ఉత్తరాంచల్
No comments:
Post a Comment