Friday, April 13, 2018

*తెలుగు భాషలో అతిపెద్ద వాక్యం*

*తెలుగు భాషలో అతిపెద్ద వాక్యం*
ప్రపంచ బాషా సాహిత్యంలో అతి పెద్ద, సంకీర్ణమైన, అర్తవంతమైన వాక్యం ఏదైనా ఉందంటే బహుశా అది గజేంద్ర మోక్షంలోని ఈ క్రింది వాక్యం అనడం అతిశయోక్తి కాదేమో. ఖచ్చితంగా తెలుగు జాతి గర్వించదగ్గ అద్భుతమైన విశేషమిది. ఇంతకీ ఏమిటా వాక్యం? క్రింద చదవండి. మీకేతెలుస్తుంది..
.
వ|| అది మఱియును, మాతులంగ లవంగ లుంగ చూత కేతకీ భల్లాతచి కామ్రాతక సరళ పనస బదరీ వకుళ వంజుల వట కుకటజ కుందకురవక కురంటక కోవిధార-ఖర్జూర నారికేళ సింధూవార చందన పిచు-మంద-మందార జంబు జంబీర మాధవీ మధూక తాల తక్కోల తమాల హింతాల రసాల సాల ప్రియాళు బిల్వామలక క్రముక కదంబ కరవీర కదళీ కపిత్థ-కాంచన కందరాళ శిరీష పాంశు పాశోక పలాశ నాగ పున్నాగ చంపక శతపత్ర మరువక మల్లికామతల్లికా ప్రముఖ నిరంతర వసంతసమయ సౌభాగ్య సంపదం కురిత పల్లవిత కోరకిత కుసుమిత ఫలిత లలిత విటప విటపి వీరున్నివహాలంకృతంబును, మణివాలు కానేక విమల పులిన తరంగిణీ సంగత విచిత్ర విద్రుమలతా మహోద్యాన శుకపిక నికర నిశిత సమంచిత చంచూపుట నిర్ధశిత శాఖిశాఖాంతర పరిపక్వ ఫలరంధ్ర ప్రవర్షిత రసప్రవాహ బహుళంబును, కనకమయ సలిల కాసార కాంచన కుముద కల్హార కమల పరిమళ మిళిత కబళాహార సంతతాంగీకార భార పరిశ్రాంత కాంతా సమాలింగిత కమారమత్త మధుకర విటసముదాయ సమీప సంచార సముదంచిత శకుంత కలహంస కారండవ జలకుక్కుట చక్రవాక బలాహక కోయష్టిక ప్రముఖ ముఖర జలవిహంగ విసర వివిధ కోలాహల బధిరీభూత భూనభోంతరాళంబును, తుహిన కరకాంత మరకత మనోహర కనక కలధౌత మణిమయానేన శిఖర తట దరీ విహరమాణ విద్యాధర విబుధ సిద్ధ చారణ గరుడ గంధర్వ కిన్నర కింపురుష మిథున సంతత సరససల్లాప సంగీత ప్రసంగ మంగళాయతనంబును, గంధగజగవయ గండభేరుండ ఖడ్గ కంఠీరవ శరభ శార్దూల చమర శల్య భల్ల సారంగ సౌలావృక వరాహ మహిష మర్కట మహోరగ మార్జాలాది నిఖిల మృగనాధ సమూహ సమర సన్నాహ సంరంభ సంచకిత శరణాగత శమనకింకరంబును నై యొప్పు సప్పర్వత సమీపమునందు.
.
ఇది ఒక పర్వతం యొక్క వర్ణన. ఒక సాధారణ పర్వతాన్ని కవి ఎంత గొప్పగా, ఎంత పెద్ద వాక్యంలో వర్ణించాడో చూశారా? ఈ వాక్యం యొక్క టీకా, తాత్పర్యాన్ని చదివి, అర్థం చేసుకుని ఆశ్వాదించండి. ఆనందిస్తూ, ఆశ్చర్యపోతూ తెలుగు భాష గొప్పతనానికి గర్వపడండి..
.
టీ|| అది-ఆ పర్వతము, మఱియు-మఱిన్ని, మాతులుంగ-మాదీఫలపు చెట్లు, లవంగ-లవంగ చెట్లు, చూత-మామిటి చెట్లు, కేతకీ-మొగలి, భల్లాతక-జీడి, ఆమ్రాతక-అంబాళపు చెట్లు, సరళ-తెల్ల తెగడ, పనస-పనస చెట్టు, బదరీ-రేగు, వకుళ-పోగడ, వంజూళ ప్రబ్బలివట-మఱ్ఱి, కుటజ-కొండమల్లె, కుంద-మల్లె, కురవక-ఎర్రగోరంట, కరంటక-పసుపు గోరింట, కోవిదార-ఏర్రకాంచనపు చెట్లు, ఖర్జూర-ఖర్జూరపు చెట్లు, నారికేళ-కొబ్బరి చెట్లు, సింధునార-వావిలి, చందన-మంచిగంధపు చెట్లు, పించుమంద-వేప, మందార-మందారపు చెట్లు, జంబూ-నేరేడు, జంబీర-నిమ్మ, మాధవి-గురివింద, మాధుక-ఇప్ప, తాళ-తాడి, తక్కోల-కక్కోలపు చెట్లు, తమాల-ఉలిమిరి, హింతాల-గిరకతాడి, రసాల-తియ్యమామిడి, అమలక-ఉసిరిక, క్రమక-పోక, కదంబ-కడిమ, కరవీర-గన్నేరు, కదళీ-అరటి, కపిత్థ-వెలగ, కాంచన-కాంచనపు చెట్లు, కందరాళ-జువ్వి, శిరీష-దిరినేన, శింశుపా-విరుగుడు, అశోక-అశోకము, పలాశ-మోదుగ, నాగ-నాకేశరము, పున్నాగ-సురపొన, చంపక-సంపెంగ, శతపత్ర-తామర, మరువక-మరువము, మల్లికామతల్లికా-మంచిమల్లెలు, ప్రముఖ-మున్నగునవి, నిరంతర-తెరపిలేని, వసంతనమయ-వసంత ఋతువునందలి, సౌభాగ్యసంపత్-సౌందర్యముతో గూడిన, అంకురిత-మొలకెత్తుచున్న, పల్లవిత-చిగుర్చుచుండిన, కుసుమిత-పూలు పూసినవియు, ఫలిత-పండ్లు గలవియునైన, లలిత-అందముగల, విటప-కొమ్మలు, విటపి-చెట్లును, వీరుల్-పొదలు, నివహ-గుంపులచే, అలంకృతంబును-శృంగారించునట్లు, మణివాలుకా-రత్నాల రజను వంటి, అనేక-అనేకములగు, విమల-తేటయగు, పులిన-ఇసుక దిబ్బలున్న, తరంగిణీ-నదులయందు, సంగత-కలయికతో, విచిత్రవిద్రుమలతా-వింతలగు పగడపు తీగలతో, మహోధ్యాన-శృంగారమగు పెద్ద వనములతోడను, శుకపిక-చిలుకలు, కోయిలలు, నికర-గుంపు యొక్క, నిశిత-వాడియగు, సమంచిత-ఒప్పుచున్న, చంచూపట-పక్షి ముక్కలచేత, పరిపక్వఫల-మిగుల మ్రుగ్గినపండ్లు, రంధ్రప్రవర్తిత-చిల్లుల నుండి స్రవించుచున్న, రసప్రవాహ-రసధారలచేత, బహుళంబును-నిండినదియు, కమనీయ-మనోహరము, సలిల-నీరుగల, కాసార-కొలనులందలి, కాంచన-బంగారపు, కుముద-తెల్లగలువ, కల్హార-చెంగల్వ, కమల-తామరపువ్వు, పరిమళమిళిత-సువాసనతో గూడిన, కబళాహార-తినుటకయిన ఆహరమును, సంతతాంగీకార-ఎల్లప్పుడును పుచ్చుకొనుటయందు, భార-ఆయసముచే, పరిశ్రాంత-అలసిన, కాంత సమాలింగిత-భార్యలచేత కౌగిలించుకోబడిన, కుమారమత్త-మదించిన పిన్నవయస్సునందున్న, మధుకర-తుమ్మెద, విట-జారుల, సముచయ-సమూహములు, సమీప సంచార-దగ్గరగా తిరుగుచుండుటచే, సముదంచిత-మిగుల అందముగల, శకుంత-శకుంతములు, కలహంస-రాజహంస, కారండవ-కారండవ పక్షులు, జలకుక్కుట-నీటికోళ్ళు, చక్రవాక-చక్రవాక పక్షులు, కోయష్టిక-గుడ్డికొక్కెర, ప్రముఖ-మున్నగునవి, ముఖరజలవిహంగ-కూయుచున్న నీటి పక్షుల యొక్క, విసర-గుంపుల, వివిధ-అనేకములయిన, కోలాహల-గొప్ప శబ్దముచేత, బధిరీభూత-చెముడుగలుగునట్లుగా చేయుచుండిన, భూనభ-భూమి-ఆకాశం, అంతరాళంబును-మధ్యభాగముతో కూడిన, తుహినకరకాంత-చక్రకాంతమణులు (చంద్రుని వెలుగున ప్రకాశించు మణులు), మరకత-పచ్చలు, కమలరా-కెపులు, వజ్ర-వజ్రములు, వైఢూర్యములు, నీల-ఇంద్రనీలమణులు, గోమేధిక-గోమేధికములు, పుష్యరాగములు-పుష్యరాగములు, మనోహర-సుందరములయిన, కనక కలధౌత మణిమయ-బంగారు, వెండి రత్నములు గల, అనేక శిఖర-అనేక శృంగమలయందు, తలదరీ-చరియలందు, గృహాలయందు, విహారమాణ-సంచారముచేయుచుండు, విద్యాధర-నిద్వాధరులు, విబుధులు-దేవతలు, సిద్ధులు, చారణులు, గరుడులు, గంధర్వులు, కిన్నరులు, కంపురుషులు అనే దేవతా సమాహములగల (అను దేవతలు పదుగురు సంతానము అని భావము), మిథున-దంపతులు. సంతత సరససల్లాప-మితిలేని సరసమగు సంభాషణచే, సంగీత ప్రసంగ-గానమాధుర్యముచే, మంగళాయతనంబును-శుభములు చేకూర్చునదే, గంధగజ-మదించిన ఏనుగులు, గవయ-కాఱెనుఁబోతులు, గండభేరుండ, ఖడ్గ-గంఢభేరండు ఖడ్గమృగములు, కంఠీరవ-సింహములు, శరభ-మీగండ్లమెకములు, (ఎనిమిది కాళ్ళుగలవి. ఇవి సింహములను జంపునువి.), శార్దూల-పులులు, చమర-నవరపు మృగములు, శల్య-మండ్ల ఏదుపందులు, భల్ల-ఎలుగుబంట్లు, సారంగ-జింకలు, సాలావృక-తోడేళ్ళు, వరాహ-అడవిపందులు, మహిష-అడవి దున్నలు (గేదెలు), మర్కట-కోతులు, మహా+ఉరగ-మహోరగ-సమస్త మృగముల, సమరసన్నాహ-యుద్ధ ప్రయత్నముల, సంరంభ-ఆడంబరముతో, సంచకిత-యమకింకరులుగలవై, ఒప్పఅతిశయించు, ఆ పర్వతము దగ్గర (ఇది పై పద్యాన్వయం).
.
తా|| ఆ పర్వతమందు అనేక గుల్మలతాదులు ఋతుభేదంబులేక ఫలపుష్పభరితంబులై యుండును. ఆ పర్వతము వసంత సౌభాగ్య సంపదచే శోభిల్లుచుండును. రత్నమయములగు యిసుకతిన్నెలు, నదీనదంబులందలి పగడపుదీవుల వంటి లతలతో నుండు వనములు, అందు విహరించు పక్షిగణంబులు తమ ముక్కులతో మాగినపండ్లును పొడవగా స్రవించు రసప్రవాహములు కనపడుచూ, నచటి తామరకొలనులందు వివిధ పుష్పములు పరిమళించునవై, ప్రియులతో నిమగ్నులైన రాజహంస చక్కవాక పక్షుల సమూహములు జలవిహంగముల కలకలధ్వనులు భూమ్యాకాశంబుల నిండియుండేను. నానారత్నశోభితంబులగు నాయా శృంగములందు విహరించు విద్యాధరాధి దేవయోనుల సరసల్లాప సంగీత ధ్వనులచే ఆ పర్వతము శుభప్రదంబై జూపట్టుచు అఁదలి శార్దూలాది క్రూరమృగంబుల పొరులకు యమకింకరులు సైతము భయపడి అట్టి ఆ పర్వత సమీపమునందు, ఆట శరణు జొచ్చుచుందురట.

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS