Saturday, October 18, 2025

తాళపత్రాలలో నిక్షిప్తమై ఉన్న సనాతన సాంప్రదాయ, శాస్త్రీయ, సంస్కృతి, విశ్వాసాల సమాహార గోపురం

 తాళపత్రాలలో నిక్షిప్తమై ఉన్న సనాతన సాంప్రదాయ, శాస్త్రీయ, సంస్కృతి, విశ్వాసాల సమాహార గోపురం  


               *1.  సూర్యుని ఏఏ సమయాల్లో చూడరాదు?*

                *ప్రభాతవేళ, సూర్యాస్తమయవేళ, మిట్టమధ్యాహ్న సమయమున రవిని సూటిగా చూడరాదు. అలాగే సూర్య మరియు చంద్రగ్రహణ సమయాల్లోనూ చూడరాదు. అట్టి సమయాల్లో సూర్యుని నుంచి వెలువడే కిరణాలు మానవ శరీర నిర్మాణానికి కీడును కల్గిస్తాయి.*

                *2.  శ్రీకృష్ణపరమాత్ముడు నెమలి పింఛాన్ని తలపై ఎందుకు ధరిస్తాడు?*

                *సకల చరాచర సృష్టిలో సంభోగం చెయ్యని ఏకైక ప్రాణి నెమలి మాత్రమే. శ్రీకృష్ణునికి 16,000 వేలమంది గోపికలు. అన్ని వేలమంది గోపికలతో శ్రీకృష్ణుడు సరససల్లాపాలు మాత్రమే ఆడాడు. అల్లరిచేసి గెలిచే వాడు. ఆ విషయాన్ని తెలియచేయటానికే శ్రీకృష్ణుడు నెమలి పింఛం ధరిస్తాడు. శ్రీకృష్ణుడు ఒట్టి అల్లరి కృష్ణుడు మాత్రమే.*

             *3.  మాతృ, పితృ, ఆచార్య, దైవ, ఋషి రుణాలంటే?*

             *పశుపక్షాదుల్లా పుట్టగానే, కాళ్ళు రాగానే బైటికి తరిమెయ్యరు. తల్లీ, తండ్రీ ఇద్దరూ జీవితకాలం సంపాదించిన ధనాన్ని పోగు చేసి ఇచ్చి, పెళ్ళి కూడా చేసి ధర్మ, అర్ధాలతో సుఖించే పరిస్థితులని సృష్టిస్తారు. ప్రేమతో పెంచుతారు. తల్లీ, తండ్రీ రుణం, ఎంత సేవచేసినా తీరదు. చేయాల్సిందల్లా ముసలితనంలో వార్ని బిడ్డల్లా చూసుకోవటమే.*

             *మల మూత్రాలను కడిగి పెంచి పెద్ద చేసినందుకు ఆ సమయంలో తల్లి ఋణం తీర్చుకోవాలి. తాను సంపాదనతో నిస్వార్ధముతో పెంచి పెద్ద చేసిన తండ్రి ఋణం తీర్చుకోవాలి. లోకజ్ఞానాన్నీ, విజ్ఞానాన్నీ, నేర్పినందుకు గురు ఋణాన్నీ, మనకి బుద్ధినీ, కర్మనీ ఇస్తున్న దైవ ఋణాన్ని భక్తి ద్వారా ధర్మ మార్గం ద్వారా, సకల శాస్త్రాలనూ, ధర్మాలనూ గ్రంథాల ద్వారా మనకు అందచేసినందుకు ఋషి రుణాన్ని తీర్చుకోవాలి. వివాహం ద్వారా అన్ని రుణాలన్ని తీర్చి, తిరిగి తాను ఋణ పడటమే మానవ జన్మ.*

              *4.  హారతి వల్ల లాభము ఏమిటి ?*

              *గృహములోను, పూజాగదిలోనే కాదు, గుడిలోను, శుభకార్యాలప్పుడూ.... పిల్లల పుట్టిన రోజుల వేడుకలలోను, క్రొత్త పెళ్ళికూతురు గృహములోకి ప్రవేశించేటప్పుడూ హారతి ఇస్తుంటారు. ఎక్కడ హారతి పట్టినా '' ఓ ఆరోగ్య సూత్రం ఉంది. శుభకార్యాల్లో ఎన్నో కుటుంబాలకు సంబంధించిన వారు ఒకేచోట చేరుతారు. అలాగే దేవాలయలలో అనేక మంది భక్తులు దేవుడ్ని దర్శిస్తుంటారు. దానివలన పరిసర ప్రాంతపు గాలి అపరిశుభ్రం అవుతుంది. అనేక క్రిములు చేరతాయి. కనుక హారతి కర్పూరం వెలిగించి హారతి ఇవ్వడం ద్వారా అనేక సూక్ష్మక్రిములు కర్పూర పొగకు నశిస్తాయి. ముక్కుకు సంబంధించిన వ్యాధులూ, అంటువ్యాధులూ ప్రబల కుండా ఉంటాయి. కర్పూరహారతి ఎలాగైతే క్షీణించి పోతుందో, అలాగే మనం తెలిసీ తెలియక చేసిన పాపాలు సమసిపోవాలని కోరుకుంటూ హారతిని కళ్ళకద్దుకోవటమే అసలు సిసలు ఆధ్యాత్మిక అర్థం, పరమార్ధం.*

           *5.  చిన్న పిల్లలకి దిష్టి ఎందుకు తీస్తారు?*

           *చిన్నారుల పుట్టిన రోజు పండగ వేడుకలలో అలాగే అనేక శుభకార్యాల్లో పాల్గొన్న పెద్దలకీ, పిల్లలకీ దిష్టిని విభిన్న పద్ధతుల్లో తీస్తూ ఉంటారు. పిల్లలూ, పెద్దలూ ఘనవిజయాలు సాధించినప్పుడూ, బాగా ప్రశంసలు పొందినప్పుడు అతిగా నీరసించి డీలాపడినప్పుడు దిష్టితీస్తారు. అలాగే పిల్లలకి పసుపూ, సున్నం కలిపిన నీటితో దిష్టితీస్తూంటారు. బయటజనుల దృష్టిదోషం తగలకుండా ఉండాలని దిష్టితీస్తే చిన్నపిల్లవాడు కలవరింతలు లేకుండా నిద్రపోవటమూ, నిద్రలో ఉలిక్కిపడుతూ లేవటం వంటి అవలక్ష ణాలు లేకుండా ఉంటాడు.*

           *చిన్నపిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చూ అనేక వేడుకల్లో పాల్గొనటం వల్ల చుట్టూ అంతా చేరటంవల్ల, చిన్నపిల్లలూ లేదా పెద్దలూ కొంత అస్వస్థతకు గురి అవుతారు. అందుకే వివాహ వేడుకలలోను, పుట్టినరోజు వేడుకలలోను విధిగా హారతి ఇచ్చి చివరలో ఎర్ర నీళ్ళతో దిష్టి తీస్తారు. ఎర్రరంగు పదేపదే చూడటం వల్ల అనేక రోగాలు సమసిపోతాయి. మనసుకి ప్రశాంతతోపాటు ధైర్య గుణంవస్తుంది.*

             *6.  ఎలాంటివేళల్లో భోజనాన్ని తినకూడదు?*

             *గ్రహణం సమయమున అనగా సూర్యగ్రహణానికి 12 గంటల ముందుగా, అలాగే చంద్రగ్రహణానికి 9 గంటల ముందుగా ఎటువంటి పదార్థాన్ని ఆహారంగా తీసుకోకూడదు.*

        *సర్వేజనాః సుఖినోభవంతు*

*🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Thursday, October 16, 2025

పితృదేవతలకు ముక్తినిచ్చే స్మశాన నారాయణస్వామి ఆలయం, అలంపురం

పితృదేవతలకు ముక్తినిచ్చే స్మశాన నారాయణస్వామి ఆలయం, అలంపురం


*పితృదోషం:* మన తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తిపాస్తులను వంశపారంపర్యంగా అనుభవించటానికి మనం ఎలాగ హక్కు అర్హత పొందుతామో  అలాగే... తాతలు తండ్రులు చేసిన పాపపుణ్యాలు కూడా ఆ వంశానికి వర్తిస్తాయి. మన పెద్దలు పుణ్యాలు మంచిపనులు చేస్తూ ఉంటే వారి వంశం సుఖ సంతోషాలతో ఉంటుంది. అలాగే అదే పూర్వికులు పాపాలు గనుక చేసి ఉంటే అది తెలుసు కావచ్చు తెలియక కావచ్చు ఏదైనా గాని వారు చేసిన పాప కర్మలు ఆ వంశపారంపర్యంగా ఆ కుటుంబంలోని వారు అనుభవించక తప్పదు..

మేము తెలిసి తెలియక ఏ తప్పు చేయలేదు కానీ బాధలను కర్మలను అనుభవిస్తున్నాను అనే బాధ పడేవారు ముఖ్యంగా తెలుసుకోవలసినది ముఖ్యమైనది ఒక్కటే. అదే *పితృదోషం*.

(ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విషయం. అందుకే ఈ పోస్టు పెడుతున్నాను)

🔹పితృ దోషం ఉన్నవారు ఈ జన్మలో వారు ఏ పాప కర్మలను చేయకపోయినా కుటుంబం ఇబ్బందులపాలు అవుతూ కష్టాలకు లోనవుతూ ఉంటుంది.

🔹ఎందుకంటే మన పెద్దలు చేసిన పాప ఫలాలు. వారి ఆస్తులను పంచుకున్నప్పుడు వారి పాపాలను కూడా కచ్చితంగా పంచుకొని తీరవలసిందే.

*పితృదోష వలన కలిగే దుష్పరిణామాలు కొన్ని చర్చించుకుందాము...*

- చిన్న వారు అకాలమరణం పొందడం. 

- శరీరంలోని ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యి ఆస్పత్రి పాలవడం.

- అప్పులపాలు అవ్వడం, లేనిపోని అపనిందల పాలు అవ్వడం.

- మన ప్రమేయం లేకుండా ప్రమాదాలకు గురయ్యే జీవితాంతం కర్మలను అనుభవించడం.

- మన కళ్ళ ముందు మన పిల్లలు చెడు వ్యసనాలకు బానిస అయ్యి కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగించడం

*🔹ఇలా వీటన్నిటికీ కారణం పితృ దోషం కారణం. దీని నుండి విముక్తి పొందడానికి ఏకైక పరిష్కారం. స్మశాన నారాయణుడిని ప్రసన్నం చేసుకోవడమే* ... అయితే ఈ స్మశాన నారాయణుడి ఆలయాలు ఈ భారతదేశంలో రెండే రెండు ఉన్నాయి.

1 కాశీ
2 పాపనాశి  (అలంపురం 'జోగుళాంబ గద్వాల జిల్లా)

🔹అలంపురంలోని ఈ స్మశాన నారాయణుడి ఆలయం గురించి కేరళ తాంత్రిక శాస్త్రంలో చెప్పడం జరిగింది.

🔹 విచిత్రం ఏమిటంటే ఈ స్మశాన నారాయణ ఆలయం అలంపురంలో ఉన్నదన్న విషయం ఎవరికీ తెలియదు.

🔹అయితే ఈ స్మశాన నారాయణుడిని ప్రసన్నం చేసుకుని మన బాధల నుండి విముక్తి పొందాలంటే ఏమి చేయాలి ఇప్పుడు తెలుసుకుందాం...

🔹స్మశాన నారాయణుని ప్రసన్నం చేసుకోవాలంటే... పాలు అన్నముతో చేసిన పాయసం, అన్నము, ముద్దపప్పు, నేయి, వడ ఇవి నైవేద్యంగా పెట్టాలి ! ఈ విధంగా స్మశాన నారాయణుడికి నైవేద్యం పెడతారో ఆ ప్రసాదాన్ని వారి ఇంటి పేరు గల వంశస్థులు మాత్రమే దానిని  స్వీకరించాలి. ఇతరులకు ఇవ్వరాదు. 

🔹స్వామికి తెల్లటి కండువా అలంకరించాలి.  ఈ వంటలను స్వయంగా వండుకొని తీసుకొని వెళ్ళి నివేదన చేయాలి లేదా (వెళ్ళడానికి వీలు లేనివారు ఖర్చులను ఇచ్చి అక్కడి పూజారి చే చేయించ వచ్చును).

🔹అలంపురం తెల్లవారుజామునే వెళ్లి తుంగభద్రా నదీ స్నానం చేసి అమ్మవారిని అయ్యవార్లను దర్శనం చేసుకున్న తరువాత ఈ  స్మశాన నారాయణుడిని సేవించుకొని ఇంక వేరే చోటకి వెళ్లకుండా ఇంటికి చేరుకోవాలి.

🔹ఈ ఆలయ ప్రాముఖ్యము  తంత్ర గురు "వేణు మాధవ నంబూద్రి" ద్వారా తెలుసుకోవడం జరిగింది ' ఈ అలంపుర స్మశాన నారాయణుడి దాని ప్రాముఖ్యము కేరళ తంత్ర శాస్త్రంలో లిఖించబడి ఉన్నదట !

🔹ఎంతోమంది పితృదోషం తో బాధపడే వారు ఉన్నారు. అలాంటివారికి ఈ విషయం ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం.

*చేరుకొనే విధానం:*

💚అలంపూర్ "హరిత హోటల్ " కు ప్రక్కన ఒక చిన్న దారి ఉంటుంది . ఆ చిన్న దారి ఎడమవైపున 1.2 కిలోమీటర్ల దూరంలో పాపనాశేశ్వర ఆలయ సముదాయం ఉంటుంది . ఆలయ సముదాయంలో ఒక ప్రత్యేక ఆలయం "స్మశాన నారాయణుని ఆలయం".

*💚ఇంకొక ముఖ్య విషయం :* స్మశాన నారాయణుడి ఆలయ సమూహాలలో ప్రధాన దైవం శ్రీ పాపనాశేశ్వరుడు ' 7వ శతాబ్దం నాటి అతి పురాతన ' అతిపెద్ద మరకత లింగం ' దక్షిణ కాశి అంటారు. ఈ స్వామిని దర్శించుకున్న నంతనే పాపాలు నాశనం అవుతాయని ప్రతీతి!

కార్తీకమాసంలో ఏ తిథి రోజున ఏం చేయాలి? విధానాలు తెలుసుకుందా..!!

కార్తీకమాసంలో ఏ తిథి రోజున ఏం చేయాలి? విధానాలు తెలుసుకుందా..!!


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

🌸దీపావళి మరుసటిరోజు నుంచి మొదలయ్యే కార్తీక మాసం అన్ని మాసాల్లో కెల్లా విశిష్టమైనదని మొట్టమొదట వశిష్ట మహర్షి జనక మహారాజుకు చెప్పాడని పురాణోక్తి.

🌿న కార్తీక సమో మాసో
న శాస్త్రం నిగమాత్పరమ్ |
నారోగ్య సమముత్సాహం న దేవః కేశవాత్పరః||

🌸అంటే కార్తీక మాసంలోని ప్రతీ రోజు పుణ్యప్రదమే. ఒక్కో రోజుకు ఒక్కో రకమైన విశిష్టత ఉంది. 

🌷 ఈ మాసంలో ఏ తిథిలో ఏమి చేయాలో తెలుసుకుందాం. 🌷

🌿కార్తీక శుద్ధ పాడ్యమి :
తెల్లవారుజామునే లేచి, స్నానం చేసి, గుడికి వెళ్లాలి. కార్తీక వ్రతాన్ని నిర్విఘ్నంగా చేసేట్టుగా అనుగ్రహించమని ప్రార్థించి, సంకల్పం చెప్పుకొని, ఆకాశదీపాన్ని సందర్శించుకోవాలి.

🌸విదియ :
సోదరి ఇంట ఆమె చేతి భోజనం చేసి, కానుకలు ఇచ్చి రావాలి. ఇలాంటివారికి యమగండం తప్పుతుందంటారు.

🌿తదియ :
అమ్మవారికి కుంకుమ పూజ చేయాలి.

🌸చవితి :
నాగుల చవితి సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించాలి. పుట్టలో పాలు పోయాలి.

🌿పంచమి :
దీన్ని జ్ఞాన పంచమి అంటారు. ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వరుని పూజిస్తే జ్ఞానవృద్ధి కలుగుతుంది.

🌸షష్ఠి :
ఈరోజున బ్రహ్మచారికి ఎర్ర గడుల కండువాను దానం చేస్తే సంతానప్రాప్తి కలుగుతుంది.

🌿సప్తమి :
ఎర్రని వస్త్రంలో గోధుమలు పోసి దానం ఇస్తే ఆయుఃవృద్ధి ప్రాప్తిస్తుంది.

🌸అష్టమి :
ఈరోజున చేసే గోపూజ మంచి ఫలితాలను ఇస్తుంది. దీన్ని గోపాష్టమి అని కూడా అంటారు.

🌿నవమి :
నేటి నుంచి మూడు రోజుల పాటు విష్ణు త్రిరాత్ర వ్రతాన్ని ఆచరించాలి.

🌸దశమి :
నేడు రాత్రిపూట విష్ణుపూజ చేయాలి.

🌿ఏకాదశి :
దీన్నే బోధనైకాదశి అంటారు. ఈరోజున విష్ణుపూజ చేస్తే సద్గతులు కలుగుతాయి.

🌸ద్వాదశి :
ఈరోజు క్షీరాబ్ధి ద్వాదశి అంటారు. సాయంకాలం ఉసిరి, తులసి మొక్కల వద్ద విష్ణుపూజ చేసి, దీపాలను వెలిగించాలి. దీంతో సర్వపాపహరణం అవుతుంది.

🌿త్రయోదశి :
సాలగ్రామ దానం చేస్తే కష్టాలు దూరమవుతాయి.

🌸చతుర్దశి :
పాషాణ చతుర్దశి వ్రతం చేసుకుంటే మంచిది.

🌿కార్తీక పూర్ణిమ :
కార్తీక మాసంలోకెల్లా అతి పవిత్రమైన రోజు. ఈరోజున నదీస్నానం చేసి, శివాలయం వద్ద జ్వాలాతోరణ దర్శనం చేసుకోవాలి. ఈరోజున సత్యనారాయణ వ్రతం చేస్తే సర్వపాపాలూ తొలగిపోతాయి.

🌸కార్తీక బహుళ పాడ్యమి :
ఆకుకూర దానం చేస్తే మంచిది.

🌿విదియ :
వనభోజనాలు చేయడానికి అనువైన రోజు.

🌸తదియ :
పండితులు, గురువులకు తులసిమాలను సమర్పిస్తే తెలివితేటలు పెరుగుతాయి.

🌿చవితి :
రోజంతా ఉపవాసం చేసి, సాయంకాలం గరికతో గణపతిని పూజించాలి. ఆ గరికను దిండు కింద పెట్టుకుని పడుకుంటే పీడకలలు పోతాయి.

🌸పంచమి :
చీమలకు నూకలు చల్లడం, శునకాలకు అన్నం పెట్టడం మంచిది.

🌿షష్ఠి :
గ్రామదేవతలకు పూజ చేయాలి.

🌸సప్తమి :
జిల్లేడు పూల దండను శివునికి సమర్పించాలి.

🌿అష్టమి :
కాలభైరవాష్టకం చదివి, గారెల దండను భైరవుడికి (శునకం) సమర్పిస్తే ధనప్రాప్తి కలుగుతుంది.

🌸నవమి :
వెండి లేదా రాగి కలశంలో నీరు పోసి, పండితునికి దానమిస్తే పితృదేవతలు సంతోషిస్తారు.

🌿దశమి :
అన్నదానం చేస్తే విష్ణువు సంతోషించి, కోరికలు తీరుతాయి.

🌸ఏకాదశి :
విష్ణు ఆలయంలో దీపారాధన, పురాణ శ్రవణం, పఠనం, జాగరణ చేస్తే మంచి ఫలితాలుంటాయి.

🌿ద్వాదశి :
అన్నదానం లేదా స్వయంపాకం సమర్పిస్తే శుభం.

🌸త్రయోదశి :
ఈరోజున నవగ్రహారాధన చేస్తే గ్రహదోషాలు తొలగిపోతాయి.

🌿చతుర్దశి :
ఈరోజున మాస శివరాత్రి. కాబట్టి శివారాధన, అభిషేకం చేస్తే అపమృత్యు దోషాలు, గ్రహబాధలు తొలగుతాయి.

🌸అమావాస్య :
పితృదేవతల పేరుతో అన్నదానం చేస్తే పెద్దలకు నరక బాధలు తొలగుతాయి..స్వస్తి..🙏🌹🎻

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

Saturday, October 11, 2025

వాడపల్లి_వెంకటేశ్వరస్వామి_ఆలయ_చరిత్ర

వాడపల్లి_వెంకటేశ్వరస్వామి_             ఆలయ_ చరిత్ర


ఏడు శనివారాల వెంకన్న దేవుడిగా ప్రసిద్ధి చెందిన స్వామి వాడపల్లి ఏడు కొండలవాడు. కోనసీమ తిరుపతిగా ఖ్యాతి పొందింది వాడపల్లి. తిరుపతి తర్వాత వెంకటేశ్వర స్వామి క్షేత్రాల్లో ముఖ్యమైన ఆలయంగా భక్తుల నమ్మకం పొందింది వాడపల్లి వేంకటేశ్వరుడి ఆలయం. ఈ ఆలయానికి ఎన్నో విశేషాలు ఉన్నాయి. వాడపల్లి క్షేత్రం లోని మూలవిరాట్టు రాతితో చేయబడింది కాదు ఇక్కడ వెంకటేశ్వరడు రాయితో కాకుండా నల్లని చెక్కలో స్వయంభుగా కొలువై ఉన్నాడు. సాక్షాత్తు నారద మహర్షి విష్ణువుకు ఇక్కడ వెంకటేశ్వరడిగా పేరు పెట్టినట్లు చెబుతారు. వరుసగా ఏడు శనివారాలు క్రమం తప్పకుండా స్వామివారి ఆలయం చుట్టూ ప్రదర్శనలు చేసి స్వామిని దర్శించుకుంటే మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయి అని భక్తుల నమ్మకం అందువల్లే ఈ కేత్రానికి శనివారాల్లో వేల సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు.

శ్రీకృష్ణుడు తన అవతారం చాలించి వైకుంఠానికి చేరుకుంటారు. దీంతో ద్వాపర యుగం ముగిసి కలియుగం ప్రారంభమవుతుంది. కలియుగంలోని ప్రజలు దైవచింతన మరిచిపోయి డబ్బు సంపాదన పై ఎక్కువ దృష్టి సారిస్తూ ఉంటారు దీంతో భూమండలంపై పాపాలు పెరిగిపోతూ ఉంటాయి. ఈ విషయమై మునులు తీవ్రంగా భయపడతారు నారదుడి ఆధ్వర్యంలో వైకుంఠానికి వెళ్లి ఈ భూమండలంపై జరుగుతున్న విషయాలను విష్ణువుకు తెలియజేసి ప్రజలను చెడు మార్గం వైపు వెళ్లకుండా రక్షించాల్సిందిగా వేడుకుంటారు. దీంతో వారికి విష్ణువు అభయమిస్తాడు ఈ కలియుగంలో తాను కలియుగ దైవంగా వెలసి నిత్యం ప్రజలతో పూజలు అందుకుంటానని చెబుతాడు దీనివల్ల మనుషుల్లో భక్తి భావం పెరుగుతుందని అభయమిస్తాడు. వాడపల్లిలో స్వయంభుగా వ్యవస్థానని వారికి వివరిస్తాడు దీనితో మునులు సంతోషంతో అక్కడ్నుంచి వెని తిరుగుతారు.

కొన్ని రోజుల తర్వాత వాడపల్లి వద్ద ఉన్న గౌతమీ నదిలో ఓ చందనం పెట్టే తీరం వైపు వస్తున్నట్లు కనిపిస్తుంది అయితే దానిని గుర్తించి తీసుకురావడానికి వెళితే నదిలో ఆ పెట్ట కనిపించదు. చివరికి వాడపల్లి గ్రామంలో, ఓ వృద్ధ బ్రాహ్మణుడి కలలో ఆ పెట్టెలో మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై ఉన్నాడని, సుచిగా వెళితే కనిపిస్తాడని వినిపిస్తుంది. దీంతో ఆ తీరంలో ఉన్న ప్రజలు మంగళ స్నానాలు చేసి నదిలోకి వెళితే ఓ పక్షినీడలో ఉన్న పెట్టే కనిపిస్తుంది. భక్తిశ్రద్ధలతో ఆ పెట్టిన ఒడ్డుకు చేరుస్తారు. దానిని తెరిచి చూడగా అందులో శంఖం చక్రం గదతో పాటు లక్ష్మీదేవితో శ్రీమహావిష్ణువు కనిపిస్తాడు ఇంతలో అక్కడికి చేరుకున్న నారదుడు మహావిష్ణువు అవతారం గురించి చెబుతాడు. అంతేకాకుండా ఆ మూర్తికి వేమ్ అంటే పాపాలను కట అంటే పోగొట్టేవాడు అని నామకరణ చేసి గోదావరి నది తీరంలో విగ్రహాన్ని ప్రతిష్టింప చేస్తాడు. అలా ఇక్కడ కొలువైన స్వామికి వెంకటేశ్వరగా పేరు వచ్చింది. స్థానికులు ఆలయాన్ని చిన్నగా నిర్మిస్తారు అయితే కాలక్రమంలో ఈ దేవాలయం నదిలో మునిగిపోతుంది ఇది ఇలా ఉండగా ఈ ప్రాంతంలో పెనుబోతుల గజేంద్రుడు అనే క్షత్రియుడు ఉండేవాడు. అతడు చాలా ఓడలకు అధిపతి. ఒకసారి తుఫాను సంభవించి అతని ఓడలన్నీ సముద్రంలో ఎక్కడికో కొట్టుకుపోతాయి. దీంతో తన ఓడలు సురక్షితంగా ఒడ్డుకు తీసుకువస్తే నదిలో మునిగిపోయిన దేవాలయంలోని విగ్రహాన్ని తిరిగి ఒడ్డుకు చేర్చి దేవాలయాన్ని నిర్మిస్తానని మొక్కుకుంటాడు. తుఫాను వెలిశాక ఓడలు భద్రంగా ఒడ్డుకు చేరాయి. దీంతో గజేంద్రుడు వాడపల్లిలో ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని కట్టించాడని స్థానిక శాసనాలు చెబుతున్నాయి

వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి నిలువెత్తు రూపం చూడగానే ఆకట్టుకుని తిరుమలేశాన్ని దర్శించిన అనుభూతి కలుగుతుంది. భారతదేశంలో అశేష భక్తజనం సందర్శించే ఆరాధ్య దేవాలయాలలో వాడపల్లి ఒకటి ప్రతి ఏటా చైత్ర శుద్ధ ఏకాదశి నాడు శ్రీ స్వామివారి తీర్థం కల్యాణోత్సవం వైభవంగా జరుగుతాయి వాటిలో భాగంగా జరిగే రథోత్సవం గ్రామంలో అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ ఉత్సవాలు చూడడానికి ఉభయ తెలుగు రాష్ట్రాలు భక్తులు తరలివచ్చను.

Friday, October 10, 2025

శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవాలయం : అయినవిల్లి

శ్రీ  విఘ్నేశ్వర స్వామి దేవాలయం :  అయినవిల్లి


#స్వయంభూ గణపతి క్షేత్రాలలో 'అయినవిల్లి' ఒకటి.
కృతయుగం నుండే నెలకొని ఉన్నట్లుగా చెప్పబడుతున్న ఈ స్వయంభూ గణపతి అత్యంత మహిమాన్వితుడు. #పవిత్రకోనసీమలో అయినవిల్లి గ్రామంలో స్వయంభువుగా నెలకొనియున్నది శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవాలయం. #దక్షప్రజాపతి దక్షయజ్ఞం నిర్వర్తించేముందు విఘ్న వినాయకుడైన ఈ వినాయకుని పూజించి, పునీతుడైనట్లు క్షేత్రపురాణం తెలుపుతోంది. #వ్యాసమహర్షి దక్షిణ దేశయాత్ర ప్రారంభంలో పార్వతీ తనయుణ్ణి ప్రతిష్టించాడని మరొక కథ వ్యాప్తిలో ఉంది. 

#అమలాపురానికి 12 కి.మీ దూరంలో ఉన్న అయినవిల్లి గ్రామంలో వెలపి ఉన్న సిద్ధివినాయకస్వామి గురించి ఆంధ్రప్రదేశ్‌లో తెలియని వారుండరు. 

 #ఈ సిద్ధివినాయకుని భక్తిగా తలచుకుని ఏ కార్యం తలపెట్టినా జయప్రదంగా నెరవేరుతుందని భక్తుల నమ్మకం. #ఈ అయినవిల్లి గణపతికి గరిక పూజలన్నా, కొబ్బరికాయ మొక్కులన్నా ఎంతో ఇష్టం. #అందుకే ఈ క్షేత్రం గరిక పూజలకు, కొబ్బరికాయ మొక్కులకు పెట్టిన పేరయింది. #ఏటా ఇక్కడకొచ్చే భక్తులు తమ మొక్కుల రూపంలో స్వామికి సమర్పించే కొబ్బరికాయల సంఖ్య దాదాపు ఇరవై లక్షలు దాటే ఉంటుందంటే నమ్మబుద్ధి కాదు. #కానీ ఇది నిజం అని ఈ సిద్ధివినాయకుడు తన కృపాకటాక్షాలతో భక్తుల కోరికలు తీరుస్తూ ప్రతి సంవత్సరం నిరూపిస్తూనే ఉన్నాడు. 

#దక్షిణాంధ్రలో 'కాణిపాకం' ప్రసిద్ధి చెందినట్లు ఉత్తరాంధ్రలో అయినవిల్లి ప్రసిద్ధి చెందింది. #కృతయుగం నుండే నెలకొని ఉన్నట్లుగా చెప్పబడుతున్న ఈ స్వయంభూ గణపతి అత్యంత మహిమాన్వితుడు. #అయినవిల్లిలోని సిద్ధివినాయకుడు స్వయంభువుడు. #ఈయన కాణిపాకం వినాయకుడి కంటే ముందే ఇక్కడ కొలువై ఉన్నాడని చెబుతారు. #అసలు కాణిపాకం  పుణ్యక్షేత్రం కావడానికి ఈ అయినవిల్లి సిద్ధివినాయకుడే కారణమని స్థలపురాణం చెబుతుంది.

#ఇక్కడ నిత్యం లక్ష్మీగణపతి హోమం చాలా ఏళ్లుగా జరుగుతూ ఉంది. అదే విధంగా ప్రతి ఏడాది లక్షల సంఖ్యలో స్వామివారికి పెన్నులతో అభిషేకం చేయించి వాటిని విద్యార్థులకు అందజేస్తారు.

#సర్వేజనా సుఖినోభవంతు 

@highlight

Thursday, October 9, 2025

ఆయుష్షును హరించే అగంతక మృత్యువులు అంటే ఏంటి*??? కాలమృత్యువు అన్న ఏంటి??? జ్యోతిష శాస్త్రం లో కొన్ని కారణాలు*???

ఆయుష్షును హరించే అగంతక మృత్యువులు అంటే ఏంటి*??? కాలమృత్యువు అన్న ఏంటి???
జ్యోతిష శాస్త్రం లో కొన్ని కారణాలు*???


*అగంతక మృత్యువులు*
ఏకోత్తరం మృత్యుశత మస్మిస్ ప్రతిష్ఠితం! 
తత్రైకః కాలసంయుక్త శేషాస్తాగంతవః స్మృతాః॥

మనిషి శరీరంలో మొత్తం 101 రకాల   మృత్యువులు ఉంటాయని చెప్పబడింది. 
వీటిలో *100 అగంతు మృత్యువులు* అనేవి అనుకోకుండా, బయటి కారణాల (ప్రమాదాల)వల్ల లేదా వ్యాధుల రూపంలో వచ్చేవి. మిగిలిన ఒకే *కాలమృత్యువు*.

*కాలమృత్యువు* అంటే మనిషికి నిర్ణయించబడిన ఆయుష్షు తీరిపోయి, సమయం వచ్చినప్పుడు సంభవించే మరణం. దీనిని ఆపడానికి లేదా నివారించడానికి ఎలాంటి మార్గమూ (ఉపాయం) లేదు.

మిగతా 100 అగంతు మృత్యువులు రోగాల రూపంలో లేదా ముందు చేసిన కర్మల (ఆగామి కర్మలు) ఫలితంగా వస్తాయి.

ఈ 100 రకాల మృత్యువులు జపాలు, దానాలు, హెూమాలు (యాగాలు), మందులు (ఔషధాలు) వంటి వాటి ద్వారా నివారించవచ్చు.

*కాలమృత్యువు*
ఆయుష్యే కర్మణి క్షీణే లోకేయాందూయతేమయా నౌషథాని న మంత్రాశ్చన హెూమ నపునర్జపాః। త్రాయంతే మృత్యునోవేతం జరయాపిచ మానవమ్||     జ్యోతిస్తత్వము 

ఆయుష్యము, కర్మము క్షీణించి మహామృత్యువు చేతను, ముసలితనము చేతను ఆవరించబడిన మనుష్యుని ఔషధములుగాని, మంత్రములుగాని హెూమజపాదులు కాని రక్షించవు.

ఒక మనిషి యొక్క ఆయుష్షు మరియు కర్మఫలం బలం పూర్తిగా క్షీణించిపోయి, అతను మహామృత్యువు (పెద్ద మరణం లేదా కాలం తీరిన మరణం) మరియు ముసలితనం (వృద్ధాప్యం) చేత పూర్తిగా ఆవరించబడినప్పుడు (పట్టుబడినప్పుడు), అతడిని మందులు (ఔషధములు) గానీ, మంత్రాలు గానీ, హెూమాలు, జపాలు వంటి పూజా కార్యక్రమాలు గానీ రక్షించలేవు (కాపాడలేవు)

వేదాంగ జ్యోతిష శాస్త్రం లో 
మృత్యుకారక గ్రహములెవరు?????

రంధేశ్వరో రంధ్రయుక్తో రంధ్రదృష్టా ఖగేశ్వరః రంధ్రాధిపతియుతశ్చైవ చతుఃషష్ఠ్యాంశనాయకః॥ రంధేశ్వరాతి శత్రుశ్చ సప్త ఛిద్రగ్రహాః స్మృతాః తేషమధ్యే బలీయస్తు తస్యదాయే మృతింవదేత్|| జా.పా 5-52/53

 అష్టమాధిపతి, అష్టమంలో ఉన్న గ్రహం, అష్టమాన్ని చూసేగ్రహం, 22వ ద్రేక్కాణాధిపతి,అష్టమాధిపతితో కలసిన గ్రహం, 64వ నవాంశాధిపతి (చంద్రుని నుండి) అష్టమాధిపతికి అతిశత్రుగ్రహము వీరిలో బలవంతుడు మృత్యుకారకుడు అవుతాడు.
(ఇది ఒక ఉదాహరణ మాత్రమే ఇంకా చాలా ఉంటాయి పరిశీలన లో)
తరువాత మృత్యుంజయ దేవతలు?????
*మహాదేవ మహాదేవ మహాదేవ*
*రాళ్ళబండి శర్మ*

Wednesday, October 8, 2025

రాహుకాలంలో దుర్గ పూజ విశిష్టత ............!!

రాహుకాలంలో దుర్గ పూజ విశిష్టత  ............!!

రాహువుకు శరీరమంతా విషమైతే.. 
తోకలో మాత్రం అమృతం ఉంటుందట..!!
మహిళలు మంగళ, శుక్రవారాల్లో దుర్గాపూజ చేస్తుంటారు. 
దుర్గాదేవిని మంగళ, శుక్రవారాల్లో భక్తిశ్రద్ధలతో పూజించి.. 
కోరిన కోరికలు నెరవేరాలని సంకల్పించుకుంటారు. యువతులైతే వివాహ ప్రాప్తి కోసం.. 
వివాహితులైతే దీర్ఘసుమంగళీ ప్రాప్తం కోసం అమ్మవారిని పూజించడం విశ్వాసం. 

ముఖ్యంగా వారంలోని ఈ రెండు రోజుల్లో 
దుర్గాపూజ చేయడం ద్వారా మహిళలు కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం.

ఇందులో మంగళవారం రాహుకాల పూజకు 
ప్రత్యేక విశిష్టత ఉంది. 
రాహు దోషాలు నివృత్తి కావాలంటే మంగళవారం రోజున రాహు కాలంలో దుర్గాదేవిని స్మరిస్తూ పూజ చేయాలని పురోహితులు అంటున్నారు. 

దుర్గాదేవి శ్రీకృష్ణుడికి సోదరి కావడంతో 
విష్ణు అవతార తిథులైన అష్టమి, నవమి 
తిథుల్లోనూ అమ్మవారిని పూజించడం 
విశేష ఫలితాలను ఇస్తుంది. 
ఇంకా అమ్మవారిని..
అమావాస్య, 
పౌర్ణమి, 
మంగళ, 
శుక్ర, 
ఆదివారాల్లో 
పూజించడం ద్వారా ఈతిబాధలు తొలగిపోతాయి.

రాహు దోషం తొలగిపోవాలంటే....!!

రాహు గ్రహానికి, దుర్గాదేవికి ఓ సంబంధం ఉంది. రాహు గ్రహానికి అధిదేవత దుర్గాదేవి. 
అందుచేత రాహు కాలంలోనే దుర్గాపూజ జరుగుతోంది. 

ఆదివారం రాహు కాల పూజ విశిష్టమైనది. రాహువుకు శరీరమంతా విషంతో నిండివుంటుంది. కానీ తోకలో మాత్రం అమృతం ఉంటుంది. అందుచేత ఆదివారం సూర్యుడు అస్తమించే సంధ్యాకాలానికి ముందు వచ్చే రాహుకాలంలో ఆయన తోక అమృతంగా మారివుంటుంది. 
అంటే ఆదివారం సాయంత్రం 4.30 గంటల నుంచి 
6 గంటలలోపు దుర్గాదేవిని పూజించినట్లైతే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని విశ్వాసం.

అనారోగ్య సమస్యలు, 
ఈతిబాధలు, 
రుణబాధలు 
తొలగిపోవాలంటే.. ఆదివారం సాయంత్రం రాహుకాలంలో దుర్గాదేవి కంటూ ప్రత్యేకంగా 
గల ఆలయంలో ఒక నిమ్మపండును సగంగా కోసి.. నిమ్మరసాన్ని పిండేసి.. 
నిమ్మపండును ప్రమిదల్లా తిప్పి.. 
అందులో నెయ్యి పోసి ఐదు వత్తులతో దీపమెలిగించాలి. 
ఈ దీపాలు అమ్మవారిని చూసేట్లు వెలిగించాలి. 
ఈ పూజ చేసేటప్పుడు అమ్మవారికి మల్లెపువ్వులు లేదా పసుపు చామంతులను మాత్రమే సమర్పించాలి.

అర్చన చేయాలనుకుంటే అమ్మవారి పేరు మీదే 
పూజ చేయాలి. 
దీపం వెలిగించాక అమ్మవారిని మూడుసార్లు ప్రదక్షణ చేసుకుని నమస్కరించుకోవాలి. 
దుర్గాస్తుతి చేయాలి. 
దుర్గాపూజ తర్వాత నవగ్రహ ప్రదక్షణలు కూడదు. 

ఇంటికొచ్చాక పూజగదిలో నెయ్యిదీపమెలిగించి.. ఐదు అగరవత్తులు, కర్పూరంతో పూజ చేయాలి. ఇలా తొమ్మిదివారాల పాటు దుర్గాదేవిని పూజిస్తే.. కుజదోషాలు పటాపంచలవుతాయని పండితులు చెప్తున్నారు

ఓం శ్రీ దుర్గాయై నమః

Tuesday, October 7, 2025

శ్రీశైలంలో హాటకేశ్వరము అని ఒక దేవాలయం ఉంది

శ్రీశైలంలో హాటకేశ్వరము                                అని ఒక దేవాలయం ఉంది.   

                                                అది చిత్రమయిన దేవాలయం. ఒక బంగారు లింగం తనంత తాను కుండపెంకునందు ఆవిర్భవించిన హాటకేశ్వర దేవాలయము క్షేత్రము కనుక దానిని ‘హాటకేశ్వరము అని పిలుస్తారు. అక్కడ మెట్లు బాగా క్రిందికి వస్తే ఫాల దారాలు, పంచ దారాలు అని అయిదు ధారలు పడుతుంటాయి. పరమశివుని లలాటమునకు తగిలి పడిన ధారా ఫాలధార. అనగా జ్ఞానాగ్ని నేత్రమయిన ఆ కంటినుండి, పైనుండి జ్ఞానగంగ మరింతగా తగిలి క్రింద పడిన ధార. ఇది శివుడి లలాటమును తగిలి వస్తున్నధార అని లోపలికి పుచ్చుకుంటే ఉత్తర క్షణం మీరు గొప్ప ఫలితమును పొందుతారు. ఎందుచేత ఇలా ఏర్పడింది? ఈశ్వరాలయంలో తీర్థం ఇవ్వరు కాబట్టి సాక్షాత్తు సాకార రూపుడయిన శంకరునికి తగిలి పడిన ధార ఫాలధార. పంచధారలు అయిదు రకములుగా ప్రకాశిస్తున్న భగవంతుని శిరస్సులకు తగిలి పడిన ధారలు. ఆ తీర్థం తీసుకునేటప్పుడు మర్యాద పాటించాలి. చెప్పులతో వెళ్ళకూడదు. శంకర భగవత్పాదుల వారు తపస్సు చేసి అక్కడే శివానందలహరి చెప్పారు. అక్కడ ఆయనకు భ్రమరాంబికా దేవి ప్రత్యక్షం అయింది. చంద్రశేఖర పరమాచార్య స్వామి తపస్సు చేసుకుంటూ ఉండిపోతాను అన్న ప్రదేశం అదే. అంత పరమమయిన ప్రదేశంలో పంచధారలు పడతాయి. అందులో ఒకటి బ్రహ్మధార. ఒకటి విష్ణు ధార, ఒకటి రుద్రధార, ఒకటి చంద్రధార, ఒకటి దేవధార. ఈ పంచధారలను స్వీకరించడం సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త లోక సాక్షులయిన సూర్యచంద్రులు ఈ అయిదు తీర్థములను అక్కడ తీసుకోవచ్చు. అంత పరమ పావనమయిన క్షేత్రం శ్రీశైల క్షేత్రం.

శ్రీశైలంలో ఉండే భ్రమరాంబా అమ్మవారి దేవాలయం వెనకాతల నిశ్శబ్దంగా ఉన్నప్పుడు వెళ్లి చెవిని బాగా నొక్కిపెట్టి ఉంచి మీరు చాలా జాగ్రత్తగా కళ్ళు మూసుకుని వింటే ఒక తుమ్మెద చేసిన ఝుంకారము వినపడుతుంది. దానిని భ్రామరీ నాదము అంటారు. అమ్మవారిని ఇప్పటికీ అక్కడ తుమ్మెదరూపంలో ఉన్న రెక్కలతో అలంకారం చేస్తారు. ఆ తల్లిముందు శంకరాచార్య స్వామి వారు శ్రీచక్రములను వేశారు. అక్కడికి వెళ్లి అమ్మవారి శ్రీచక్రం ముందు కూర్చుని ఏ తల్లి అయినా కుంకుమార్చన చేస్తే ఆమె పూర్ణంగా మూడు తరములు చూసి హాయిగా పదిమంది చేత పండు ముత్తైదువ అని అనిపించుకుని వార్ధక్యంలో హాయిగా ఆవిడ భర్తగారి తొడమీద తల పెట్టుకొని ప్రాణం విడిచిపెట్టగలిగిన అదృష్టం కలుగుతుంది. శ్రీశైలలింగమునకు పట్టు తేనెతో అభిషేకం చేస్తే ఉత్తర జన్మలలో గంధర్వగానం వస్తుంది. భ్రమరాంబికా అమ్మవారి దగ్గర కూర్చుని కుంకుమార్చన చేసుకోవాలి. నాలుగు మారేడు దళములు పట్టుకెళ్ళి ఆ శివలింగమును తడిమి తడిమి అభిషేకం చేసుకోవాలి. తల తాటించి నమస్కరించుకోవాలి.

పూర్వం అరుణాసురుడనే రాక్షసుడొకడు బయలుదేరాడు. వాడు బ్రహ్మ ఇచ్చిన వరముల వల్ల మిక్కిలి గర్వమును పొంది లోకముల నన్నిటిని క్షోభింపజేస్తున్నాడు. ఆ సమయంలో అమ్మవారు భ్రామరీ రూపమును పొందింది. భయంకరమయిన యుద్ధం చేసిన తరువాత భ్రామరీ రూపంతో వెళ్ళి ఆ అరుణాసురుణ్ణి సంహారం చేసింది. ఇప్పటికీ శాస్త్రంలో శ్రీశైల మల్లికార్జునుడు మల్లెపూవు అయితే అమ్మవారు సారగ్రాహి అని చెప్తారు. తుమ్మెద ఎప్పుడూ పువ్వుచుట్టూ తిరుగుతుంది. ఆయన మల్లికార్జునుడు. ఆవిడ భ్రమరాంబికా దేవి. ఎక్కడ శివుడు ఉన్నాడో అక్కడ ఆవిడ భ్రమర రూపంతో తిరుగుతూ ఉంటుంది. అక్కడ శివుడు ఉన్నాడు. పైన శక్తి రూపంతో ఆవిడ ఉన్నది. అందుకే ఇప్పటికీ ఆనాదం వినపడుతూ ఉంటుంది. ఈ నాదమును ఆలిండియా రేడియో హైదరాబాద్, కర్నూల్, విజయవాడ స్టేషన్లు రికార్డుచేశాయి. శ్రీశైలం వెళ్లి అమ్మవారిని చూసినట్లయితే అమ్మవారి కనుగుడ్లు స్పష్టంగా కనపడుతుంటాయి. ఆమె ముందు గల శ్రీచక్రం ముందు కూర్చుని కుంకుమార్చన చేసుకుని “అవిద్యానామంతస్తిమిర మిహిరద్వీపనగరీ” అని సౌందర్యలహరి లోని నాలుగు శ్లోకములు చెప్పుకుని వస్తే జన్మ ధన్యం అయిపోతుంది.

అక్కడ ఉన్న స్వరూపములలో వీరభద్రుడు ఒకడు. శ్రీశైల మల్లికార్జునుని దర్శనం చేసి బయటకు వచ్చి ఎడమ పక్కకు వెళ్ళినప్పుడు అక్కడ వీరభద్రుడు కనపడతాడు. అక్కడ బయలు వీరభద్రుడు అని క్షేత్ర పాలకుడు ఒకాయన ఉన్నాడు. రక్త సంబంధమయిన వ్యాధులు శరీరంలో పొటమరిస్తే అటువంటి వారు శ్రీశైల క్షేత్రంలో ఉన్న వీరభద్ర స్వరూపం దగ్గర కూర్చుని ప్రతిరోజూ ఒక గంట సేపు శివనామములు చెప్పుకుని కొద్దిరోజులు అక్కడ ఉండి వస్తే ఆ వ్యాధులు నయం అవుతాయి. అలా నయమయిన సందర్భములు ఎన్నో ఉన్నాయి. అక్కడ ఉన్న వీరభద్ర మూర్తిలోంచి అటువంటి శక్తి ప్రసారం అవుతుంది అని పెద్దలు చెప్తారు. చంద్రవతి అనే రాజకుమార్తె ఒక భయంకరమయిన గడ్డు కాలమును ఎదుర్కొంది. తన తండ్రే తనను మోహించాడు. ఆమె పరుగెత్తి శ్రీశైల క్షేత్రమును చేరుకొని గుళ్ళోకి వెళ్ళిపోయింది. రాజు ఆమె వెనుక తరుముకు వస్తున్నాడు. గుళ్ళోకి వెళ్ళిన ఆమె శివలింగమును చూసి దానిని శివలింగమని అనలేదు. అక్కడ మల్లికార్జునుడు ఉన్నాడు అని ఆమె చేతిలో ఉన్న మల్లెపూల దండను సిగకు చుట్టుకుని ‘మల్లికార్జున నేను నీకు ఇవ్వగలిగింది ఇదే – ఇది నీ సిగకు చుట్టుకుని నన్ను నీవు కాపాడు’ అని ప్రార్థించింది. అపుడు లింగోద్భవ మూర్తి స్వామి వచ్చి ఆమెను తరుముకు వస్తున్నా రాజును చూసి నీవు పచ్చలబండవగుదువుగాక అని శపించాడు. అంతటి దుష్కృత్యమునకు ప్రయత్నించిన ఆ రాజు పచ్చలబండ అయి ఇప్పటికీ అలా పడి ఉన్నాడు. ఈవిడ ఇచ్చిన మల్లికా పుష్పముల మాలను తన సిగకు చుట్టుకుని స్వామి మల్లికార్జునా అని మరొకమారు పిలిపించుకున్నాడు.

శ్రీశైలంలో వృద్ధ మల్లికార్జునుడు అని ఉన్నాడు. ఆ శివలింగం ముడతలు పడిపోయి ఉంటుంది. ఆ ముడతలు బాగా దగ్గరగా వచ్చేసి ఉంటాయి. ఈ మల్లికార్జునుడు ఎప్పుడు వెలసినదీ సాధికారికంగా చెప్పలేము. కానీ అక్కడ జరిగిన విచిత్రం ఒకటి ఉంది. మహీధర మహారాజు అని ఒక రాజుగారు ఉండేవారు. ఆయనకు ఒక కుమార్తె. ఆమె శంకరుని సౌందర్యమును ఉపాసన చేసింది. సాధారణంగా ఈశ్వరుని తండ్రిగా ఉపాసన చేస్తారు. కానీ ఆమె శివుణ్ణి మోహించింది. తనకి శివుడి వంటి భర్త కావాలంది. ఈ పిల్ల ఏమి చేస్తుందో అని శంకరుడు ఆమె కలలోకి వచ్చి “నీకు నన్ను వివాహం చేసుకోవాలని ఉంటే శ్రీగిరి పర్వతం మీద ఉన్న తెల్ల మద్దిచెట్టు కిందవున్న మల్లెపొదలో ఉన్నాను. అక్కడకు రా నిన్ను వివాహం ఆడతాను’ అన్నాడు. ఆమె శంకరుడు చెప్పిన చోటికి వచ్చి ఆ చెట్టును, పొదను వెతుకుతోంది. అపుడు పార్వతీ దేవి “జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని చెప్తారు. కానీ మీకు ఈ బుద్ధి ఎప్పటినుంచి వచ్చింది అని శంకరుని అడిగింది. అపుడు శంకరుడు ఆమె నన్ను భక్తితో ఆరాధన చేసింది. ఇక్కడ వివాహం అనగా నేను ఆవిడను నాలోకి తీసుకోవడం అని చెప్పాడు. అపుడు పార్వతీ దేవి అయితే ఆమెకు ఉపాసనలో అంత భక్తి ఉన్నదా? అని అడిగింది. అపుడు శంకరుడు ఆమె ఎంత భక్తి తత్పరురాలో చూపిస్తాను చూడు అని వెంటనే 96 సంవత్సరముల వృద్ధునిగా మారి వెతుకుతున్న పిల్ల దగ్గరకు వెళ్ళి పిల్లా నీవు ఇక్కడ ఎవరి కోసం వెతుకుతున్నావు? అని అడిగాడు. ఆమె తాను శివుడి కోసం వెతుకుతున్నాను అని జవాబు చెప్పింది. అపుడు ఆయన నేనే శివుడిని, ఇంత వృద్ధుడిని కదా నన్ను పెళ్ళాడతావా? అని అడిగాడు. నీవు వృద్దుడవో యౌవనంలో ఉన్నవాడివో నాకు తెలుసు. నాకు నీవే భర్త. వేరొకరిని ఈ లోకంలో నేను భర్తగా అంగీకరించను అని చెప్పింది. ఆవిడకు కావలసింది ఆయనలో ఐక్యమవడం. చూశావా పార్వతీ, ఈమె భక్తి ఈమెను నాలో ఐక్యం చేసుకుంటున్నాను అని శివుడు ఆమెను తనలో ఐక్యం చేసుకుని ఈ పిల్లను స్మరించి ఇటువంటి భక్తి తత్పరురాలికోసం సృష్టిలో లేని విధంగా ముడతలు పడిపోయిన శివలింగమని, వృద్ధ మల్లికార్జున లింగమని తలచుకున్న వాళ్ళని, పొంగిపోతూ నేను చూస్తాను అని వృద్ధ మల్లికార్జునుడై వెలిశాడు. అందుకే ఇప్పుడు అక్కడ కళ్యాణములు చేస్తున్నారు. ఈవిధంగా శ్రీశైలం ఎన్నో విశేషములతో కూడుకున్న క్షేత్రం. ఈ క్షేత్రంలోనే శంకరాచార్యుల వారు శ్రీశైల శిఖరం మీద ఉండగా ఒక కాపాలికుడు వచ్చి శంకరాచార్యుల వారి శిరస్సు కావాలని అడిగాడు. అపుడు శంకరాచార్యుల వారు ‘నా శిరస్సును ఇవ్వడానికి నాకేమీ అభ్యంతరం లేదు. కానీ నీవు నా శిరస్సును తీసుకుంటే నా శిష్యులు బాధపడతారు. నా శిష్యులు ఉదయముననే పాతాళగంగ దగ్గరకు వెడతారు. అప్పుడు వచ్చి నా శిరస్సు ఉత్తరించి పట్టుకు వెళ్ళు’ అని చెప్పారు. మరునాడు ఉదయం ఆ కాపాలికుడు వచ్చి ధ్యానం చేసుకుంటున్న శంకరాచార్యుల వారి శిరస్సును ఉత్తరించడం కోసమని చేతిలో ఉన్న కత్తి పైకెత్తిన సమయంలో స్నానం చేస్తున్న పద్మపాదాచార్యుల వారికి ఏదో అమంగళం గోచరించి అక్కడి నుండే నరసింహ మంత్రోపాసన చేశారు ఆయన. ఎక్కడి నుండి వచ్చాడో మహానుభావుడు నరసింహుడు గబగబా వచ్చి కత్తినెత్తిన కాపాలికుడి శిరస్సును త్రుంచి అవతల పారేసి నిలబడ్డాడు. ఆ తేజోమూర్తిని శంకరాచార్యుల వారు నరసింహ స్తోత్రంతో ప్రార్థన చేశారు. ఈవిధంగా నరసింహ స్వామీ దర్శనం ఇచ్చిన క్షేత్రం. శివకేశవ అభేదంగా శంకర భగవత్పాదులు రక్షించబడిన క్షేత్రం శ్రీశైల క్షేత్రం. అది జగద్గురువులను రక్షించుకున్న కొండ. అది మన తెలుగునాట ఉన్న కొండ.

అక్కడ ప్రవహించే కృష్ణానదిని కృష్ణానది అని పిలవరు. కృష్ణా నది శ్రీశైల పర్వతశిఖరమును పామువలె చుట్టుకొని ప్రవహిస్తుంది. శివుడిని విడిచి పెట్టలేక భక్తుల పాపములను తొలగించడానికి ఉత్తరమున ఉన్న గంగ దక్షినమునకు వచ్చి కృష్ణ పేరుతో అక్కడ ప్రవహించింది కాబట్టి దానిని ‘పాతాళ గంగ అని పిలుస్తారు. ఆలయ ప్రాంగణంలో పంచపాండవులు అరణ్య వాసం చేసేటప్పుడు శ్రీశైలంలో ప్రతిష్ఠ చేసిన లింగములు అయిదు ఉంటాయి. దేవాలయంలో తూర్పున కృష్ణ దేవరాయలు నిర్మించిన గోపురం దక్షిణమున హరిహర రాయలవారు నిర్మించిన గోపురములు కనపడతాయి. ఆ ఆలయ ప్రాంగణంలోనే త్రిఫల వృక్షమని ఒక పెద్ద వృక్షం ఒకటి ఉంటుంది. అది మేడి, జువ్వి, రావి – ఈ మూడూ కలిసి పెరిగిన చెట్టు. ఆ చెట్టు నాలుగు వేల సంవత్సరములు బ్రతికింది. అక్కడికి సమీపంలోనే వృద్ధ మల్లికార్జునుడు ఉంటాడు/ ఆ వెనుక రాజరాజేశ్వరీ దేవాలయం. సమీపంలో భ్రమరాంబ అమ్మవారి త్రిఫల వృక్షం ఉంటాయి. ఉత్తరమున శివాజీ గోపురం, కళ్యాణమంటపం, నందనవనం అనే పుష్పవాటిక ఉంటాయి. ఆ వనంలో సుబ్రహ్మణ్య స్వామీ నెమలితో ఉంటారు.

శివాజీ మహారాజు అక్కడికి వెళ్లి అమ్మవారి ప్రార్థన చేశాడు. ఆ దృశ్యం శివాజీ గోపురం మీద యిప్పటికీ చెక్కబడి ఉంటుంది. భవానీమాత ప్రత్యక్షమై ‘ఈ చంద్రహాసమును చేత పట్టుకో నీకు ఎదురు లేదు’ అని అనుగ్రహించి శివాజీకి చంద్రహాసమును బహూకరించింది. ఆ కత్తి పట్టుకునే మహానుభావుడు హిందూ ధర్మ సామ్రాజ్యమును స్థాపించాడు. అంత గొప్ప క్షేత్రం శ్రీశైల క్షేత్రం.
శ్రీ మహాగణాధిపతయే నమః

                            శుభం భూయాత్

కాశీనాయన క్షేత్రాలు

కాశీనాయన క్షేత్రాలు

ఈ కాశీనాయన క్షేత్రాలు నిజమైన అన్నదాన స్ఫూర్తిని మనకు తెలియజేస్తాయి.. ఏదో మొక్కుబడిగా కాకుండా అన్ని రకాల అల్పాహారాలు మరియు స్వీటు తో సహా ఎన్నో రకాల భోజనాలు పండ్లు అక్కడకు వచ్చిన భక్తులకు సమర్పిస్తారు.. అంతేకాకుండా అక్కడ వృద్ధాశ్రమాలను కూడా నడుపుతూ ఉంటారు.. చాలామంది వృద్ధులు అక్కడనే నివాసం ఉంటారు..

నేను నంద్యాల దగ్గరలోని ఓంకార క్షేత్రంలో ఉన్న కాశీనాయన ఆశ్రమాన్ని చూశాను.. అసలు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ ఐతుంది ఆ భోజనాలు చూస్తే.. వేడివేడిగా మనకు ఎంతో ఆప్యాయంగా వడ్డిస్తారు..

నేను వెళ్ళినప్పుడు అక్కడ నేను ఆపరేషన్ చేసిన ఒక పేషెంట్ అక్కడ సేవకుడిగా ఉన్నాడు .. అతను నన్ను గుర్తుపట్టి ఎంతో గౌరవంగా ఆప్యాయంగా పలకరించి అక్కడ అందరికీ పరిచయం చేశాడు..

కాశి నాయన ఆశ్రమాలు అనేవి ప్రధానంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో మరియు పుణ్యక్షేత్రాల్లో స్థాపించబడ్డాయి. 

ఈ ఆశ్రమాలు కాశి నాయన గారి భక్తుల ఆధ్వర్యంలో నిత్యాన్నదానాలు, గోసేవ, దేవాలయాల పునర్నిర్మాణం మరియు అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.

ముఖ్యమైన ఆశ్రమాలు మరియు క్షేత్రాలు

• జ్యోతి క్షేత్రం: కడప జిల్లా, బద్వేలు నియోజకవర్గంలో ఉన్న ఈ ఆశ్రమం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ కాశి నాయన గారి సమాధి స్థలం ఉంది.

• సీతారామపురం ఆశ్రమం: నెల్లూరు జిల్లా సీతారామపురంలో ఉంది. ఇక్కడ శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి, శ్రీ సీతారాముల దేవాలయం వంటి అనేక దేవాలయాలు ఉన్నాయి.

• ఆత్మకూరు ఆశ్రమం: నెల్లూరు జిల్లా, తిరునల్ల తిప్ప ప్రాంతంలో ఉంది. ఇందులో శివుడు, గాయత్రీ మాత, అయ్యప్ప స్వామి, సరస్వతి మాత విగ్రహాలు ఉన్నాయి. ప్రతి రోజు నిత్యాన్నదానం జరుగుతుంది.

• ఇతర ప్రాంతాలు: తెలుగు రాష్ట్రాల్లో మొత్తం రెండు వందలకు పైగా ఆశ్రమాలు మరియు గుళ్ళు పనిచేస్తున్నాయి. ఇవి గోసమర్పణ, నిత్యాన్నదానం, పాడుబడిన ఆలయాల జీర్ణోద్ధరణ వంటి సేవలు అందిస్తున్నాయి.

ఆశ్రమాల ప్రత్యేకతలు..

• ప్రతి ఆశ్రమంలో నిత్యాన్నదానం జరుగుతోంది, అనేక మంది భక్తులు ప్రతి రోజు భోజనం చేస్తున్నారు.

• గోసంరక్షణ, పాడుబడిన దేవాలయాలకు జీర్ణోద్ధరణ, దత్త జయంతి సందర్భంగా ప్రత్యేక ఆరాధనలు నిర్వహిస్తున్నాయి.

• అనాధ వృద్ధులకు ఆశ్రయంగా ఉండేందుకు కూడా కాశి నాయన ఆశ్రమం సేవలు అందిస్తోంది.

మానవత్వం అనేది ఇంకా మనలో ఉంది.. ఇంకా ఈ భూమి పైన విరాజిల్లుతుంది అనేకి ఈ క్షేత్రాలే నిదర్శనం...

మీ దగ్గరలో ఉన్న క్షేత్రం ఏమిటి? మీరు ఎప్పుడైనా నిజంగా దర్శించారా? లేదా దర్శించాలని అనుకుంటున్నారా అయితే తప్పకుండా దర్శించండి..

మీరు ఎప్పుడైనా ఈ కాశీనాయన క్షేత్రాల దర్శనం చేశారా?

 మీకు వీలుంటే తప్పకుండా ఒక్కటి అయినా గాని సందర్శించండి...

మరి దర్శిస్తే నాకేంటి? నాకేంటి? అని అడగకండి...

మనలో సేవా భావం అనేది కలుగుతుంది.. జస్ట్ ఆ అనుభూతిని పొందండి..

అది మీకు సమయం వచ్చినప్పుడు మార్గదర్శనం చేస్తుంది...

డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి MS MCh
గుండె మరియు ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు
ప్రభుత్వ సర్వజన వైద్యశాల కర్నూలు

SOME PICS FROM FB.. COURTESY BY OUR FRIENDS

Monday, October 6, 2025

దుర్గాదేవి తొమ్మిది అవతారాలలో ఎక్కడ వెలిశారో తెలుసా

దుర్గాదేవి తొమ్మిది అవతారాలలో ఎక్కడ వెలిశారో తెలుసా?


1. #శైలపుత్రి 

ఉత్తరప్రదేశ్ లో వారణాసిలో శైలపుత్రి ఆలయం ఉంది. నవదుర్గలలో దుర్గాదేవి మొదటి అవతారం శైలపుత్రి అని చెబుతారు. దుర్గామాత, శైల రజగు హిమవంతుని కుమార్తెగా జన్మించినది. ఈ అమ్మవారు వృషభ వాహనం పైన ఉండి కుడి చేత త్రిశూలం, ఎడమ చేత పద్మం ధరించి ఉంటుంది. శరన్నవరాత్రులలో ఈ దేవిని ఉత్సవ మూర్తిగా అలంకరించి తొలినాడైన పాడ్యమి నాడు పూజించి, ఉపవాస దీక్షలు చేసి భక్తులు తరిస్తారు.

2. #బ్రహ్మచారిని

ఈ ఆలయం ఉత్తరప్రదేశ్ లోని వారణాసి లో ఉంది. దుర్గామాత రెండవ అవతారం ఇదేనని చెబుతారు. ఈ అమ్మవారు తెల్లటి వస్త్రాలను ధరించి ఉంటారు. శివుడిని భర్తగా పొందటం కోసం నారదుడి ఆదేశానుసారం ఘోర తపస్సు చేసినది. ఈ అమ్మవారిని ఆరాదిస్తే విజయం లభిస్తుందని చెబుతారు.

3. #చంద్రఘంట 

శ్రీ దుర్గామాత మూడవ అవతారం చంద్రఘంట అవతారం. ఈ అమ్మవారు గంటాకృతితో ఉన్న అర్ద చంద్రుడిని శిరస్సున ధరించి ఉంటుంది. ఈ అవతారంలో దర్శనమిచ్చే అమ్మవారి ఆలయం వారణాసి లో ఉంది. ఈ అమ్మవారు దశ భుజాలతో దర్శనం ఇస్తుంది. ఈ అమ్మవారిని ప్రార్థిస్తే భయం, అపజయం దరికి రావు అని నమ్మకం.

4. #కూష్మాండ 

శ్రీ దుర్గామాత నాలుగవ అవతారం కూష్మాండ. ఈ అమ్మవారు సింహ వాహనం పైన అష్టభుజాలతో దర్శనం ఇస్తుంది. అందుకే ఈ అమ్మవారిని అష్టభుజి దేవి అని కూడా అంటారు. ఈ అమ్మవారి ఆలయం కాన్పూర్ లో ఉంది. ఈ అమ్మవారిని ఆరాదిస్తే శీఘ్రంగా కటాక్షించి రక్షిస్తుంది.

5. #స్కందమాత

నవదుర్గలలో ఐదవ అవతారం స్కందమాత. స్కందుడు అంటే కుమారస్వామి అని అర్ధం. స్కందుడి తల్లి కనుక ఈ దేవిని స్కందమాత అని అంటారు. ఈ దేవి బాలస్కందుడిని తన ఒడిలో కూర్చుబెట్టుకొని మాతృమూర్తిగా భక్తులకి దర్శనం ఇస్తుంది. ఈ దేవిని ఆరాదిస్తే పతనం లేకుండా కనుకరిస్తుంది.

6. #క్యాత్యాయని

నవదుర్గలలో ఆరవ అవతారం క్యాత్యాయని. కోత్స అనే ఒక ఋషి పార్వతీదేవి తనకి కూతురిగా జన్మించాలంటూ ఘోర తపస్సు చేయగా అతడి కూతురిగా జన్మించింది. అందువలనే ఈ దేవికి క్యాత్యాయని అనే పేరు వచ్చింది. ఈ అవతారంలో దర్శనం ఇచ్చే ఆ దేవి ఆలయం కర్ణాటక రాష్ట్రంలో ఉంది.

7. #కాళరాత్రి 

నవదుర్గలలో ఏడవ అవతారం కాళరాత్రి. ఈ దేవి శరీరం ఛాయా చీకటి తో నల్లగా ఉంటుంది. అందుకే ఈ దేవికి కాళరాత్రి అనే పేరు వచ్చినది. ఈ దేవి వాహనం గాడిద. ఎల్లప్పుడూ శుభ ఫలితాలు ఇస్తుంది కనుక ఈ దేవిని శుభకరీ అని కూడా అంటారు. ఈ దేవి ఆలయం కూడా వారణాసి లో ఉంది.

8. #మహాగౌరి 

నవదుర్గలలో ఎనిమిదవ అవతారం మహాగౌరి. ఈ దేవి హిమాచలం కంటే తెల్లని ధవళ కాంతితో శోభిస్తుంటుంది. అయితే శివుడిని భర్తగా పొందాలని పార్వతీదేవి ఘోర తపస్సు చేయగా ఆమె శరీరం నల్లబడుతుంది. ఇక ఆ దేవి భక్తికి మెచ్చిన స్వామివారు గంగా జలంతో ఆమె శరీరాన్ని ప్రక్షాళన చేస్తారు. అప్పటినుండి ఆమె మహాగౌరి గా ప్రసిద్ధి చెందింది.

9. #సిద్ధిధాత్రి

శ్రీ దుర్గా మాత అవతారాలలో తొమ్మిదవ అవతారం సిద్ధిధాత్రి. ఈ దేవతని దేవతలు, సిద్దులు, మనుషులు ప్రతి ఒక్కరు కూడా ఆరాధిస్తారు. ఈ దేవి బుద్ది, విద్య, భోగ భాగ్యాలను ప్రసాదిస్తుంది.

ఈవిధంగా శ్రీ దుర్గాదేవి తొమ్మిది అవతారాలు ఉండగా.... ఈ తొమ్మిది అవతారాలకు సంబంధించిన ఆలయాలు అన్ని కూడా వారణాసి లో ఉన్నాయి.

Sunday, October 5, 2025

కౌముదీపూర్ణిమ, అక్షక్రీడ, కోజాగరీ వ్రతం, శరత్పూర్ణిమ

కౌముదీపూర్ణిమ, అక్షక్రీడ, కోజాగరీ వ్రతం, శరత్పూర్ణిమ


*కోజాగౌరీ వ్రతం*

శ్రీ లక్ష్మీదేవి అనుగ్రహం కోసం - *కోజాగరీ వ్రతాన్ని*

 ఆచరించాలని వాలఖిల్య మహర్షి తోటి మునులకు తెలియజేసినట్లు పురాణ కథనం.

ఉభయ సంధ్యలలో లక్ష్మీదేవిని పూజించి, క్షీరాన్నమును నైవేద్యంగా సమర్పించాలి. రాత్రి జాగరణ చేస్తూ ఆ సమయంలో పాచికలు లేదా గవ్వలను ఆడుతూ గడపాలి. మరునాడు పునఃపూజ చేసి వ్రతాన్ని ముగించాలి.  ఈ వ్రతము చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులవుతారు.

*కౌముదీ పూర్ణిమ, శరత్‌పూర్ణిమ*

శరత్కాల పూర్ణిమనాడు అమ్మవారిని పూజించడం చాలా విశేషం♪. నవరాత్రులే కాక, పాడ్యమి నుండి పూర్ణిమ వరకు అమ్మవారి ఆరాధన వల్ల అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది♪. ఈ పూర్ణిమయే శ్రీవిద్యా సంప్రదాయంలో 'ముఖ్యరాకా' గా చెప్పబడింది.

*శరత్ పూర్ణిమ విశిష్టత*

 ఆశ్వీయుజ పూర్ణిమకే శరత్ పూర్ణిమ అని పేరు.. ఇది అమ్మవారి ఆరాధనకు చాలా విశేషమైన రోజు.

 మామూలు ప్రజలు అమ్మవారి ఆరాధనను దేవీనవరాత్రులు 9 రోజులు చేస్తే , దేవీ ఉపాసకులు అమ్మవారి ఆరాధన ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నుంచి పూర్ణిమ వరకు 15 రోజుల పాటు చేస్తారు. 

 ఏడాదిలో ఈ పూర్ణిమ నాడు మాత్రమే చంద్రుడు పూర్తి 16 కళలతో ప్రకాశిస్తాడు. అందువలన ఈ శరత్ పూర్ణిమ రోజున చంద్ర కిరణాలకు విశేషమైన శక్తి ఉంటుంది... అవి శారీరక , మానసిక రుగ్మతలను దూరం చేస్తాయి.  అందువలన చంద్రకాంతిలో కూర్చుని లలితా సహస్ర నామ పారాయణ చేయడం , ఆవుపాలతో చేసిన పరమాన్నం చంద్రుడికి నివేదన చేసి రాత్రంతా చంద్రకాంతిలో ఉంచి , ఉదయాన్నే దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారు. 

*చంద్రకాంతి నుంచి ఈ పౌర్ణమి రోజున అమృతం కురుస్తుందని శాస్త్రం చెప్తోంది.*

 చంద్రకాంతిలో ఉంచిన పరమాన్నం చంద్ర కిరణాలలో ఉన్న ఔషధీ తత్త్వాన్ని తనలో ఇముడ్చుకుంటుంది. మరునాడు ఉదయం ఆ పరమాన్నాన్ని కుటుంబసభ్యులందరూ నైవేద్యంగా స్వీకరించాలి.

*ఈ పూర్ణిమకే కోజాగరి పూర్ణిమ అనే పేరు కూడా ఉంది.*  కోజాగరీ పూర్ణిమ రోజున లక్ష్మీదేవిని పూజిస్తారు.

*కోజాగిరి పౌర్ణమి*

*లక్ష్మీదేవికి ప్రియమైన వ్రతం ఈ  "కోజాగిరి వ్రతం''.... "కోజాగిరి వ్రతం'' గురించి తెలుసుకొందాము...?*

సంపదలను , సౌభాగ్యాన్ని ప్రసాదించే చల్లని తల్లిగా శ్రీ లక్ష్మీదేవి ని పూజిస్తాము

లక్ష్మీదేవికి అత్యంత ప్రియమైన వ్రతం , దారిద్ర్య వినాశక వ్రతం *"కోజాగిరి వ్రతం''*

దారిద్ర్యం తొలగిపోయి , లక్ష్మీదేవి ప్రసన్నం  లభించే వ్రతాన్ని వివరించమని మహర్షులు వాలిఖిల్య మహర్షిని కోరగా , వాలిఖిల్య కోజాగిరి వ్రతాన్ని వివరించినట్లు పురాణాలలో ఆధారం ఉంది.

పూర్వం మగధదేశంలో  *"వలితుడు''* అనే బ్రాహ్మణుడు నివశిస్తూ ఉండేవాడట , అతను గొప్ప పండితుడు , భక్తుడు... కానీ అతను కటిక పేదవాడు.. , ఆయన భార్య అయిన చండి పరమ గయ్యాళి.. , తనకు బంగారం , పట్టు వస్త్రాలు కొని ఇవ్వలేదని వలితుడి మాటలను ధిక్కరించి వ్యతిరేకంగా ప్రవర్తించేది.

వలితుడి స్నేహితుడైన గణేశ వర్మ వలితుడి బాధ చూసి. , ఆలోచించి *" నీవు ఏ పని చేయించుకోవాలని అనుకుంటున్నావో  దానికి వ్యతిరేకంగా పని చేయమని నీ భార్యకు చెప్పు.. , అప్పుడు ఆమె నీకు అనుకూలమైన విధంగా పని చేస్తుంది.. , కాబట్టి నీ పని జరుగుతుంది''* అని సలహా ఇచ్చాడు...

కొంతకాలానికి వలితుడి తండ్రి ఆబ్ధికం వచ్చింది. స్నేహితుడు చెప్పినట్టుగా వలితుడు *"రేపు మా తండ్రిగారి ఆబ్ధికం.. , అయినా నేను ఆబ్ధికం పెట్టదలచుకోలేదు''* అని భార్య చండితో అన్నాడు.

భర్త మాటలు విన్న చండి మామ గారి ఆబ్దికాన్ని వలితుడితో చేయించింది. అన్నీ సవ్యంగా జరుతున్నాయన్న సంతోషంలో వలితుడు భార్య చండితో  *"పిండాలను తీసుకువెళ్ళి నదిలో పడేసి''* రమ్మన్నాడు.
వెంటనే చండి పిండాలను ఊరిలోని కాలువలో పడేసి వచ్చింది.

ఇది చూసిన వలితుడి మనస్సు విరక్తి చెందడంతో  ఇల్లు వదిలి అరణ్యానికి వెళ్ళిపోయాడు..  కొంతకాలం తరువాత ఆశ్వీయుజ పౌర్ణమి వచ్చింది.. , సాయంకాలం అయింది.. , నాగకన్యలు ముగ్గురు వచ్చి నదిలో స్నానం చేసి లక్ష్మీదేవిని పూజించారు...

పాచికలు ఆడడానికి సిద్ధమయ్యి నాలుగో మనిషి లేకపోవడంతో ఎవరైనా ఉన్నారేమోనని చుట్టుపక్కలా గాలించారు. వారికి వలితుడు కనిపించాడు... వలితుడిని పాచికలు ఆడడానికి రమ్మని కోరారు.  అది జూదం కాబట్టి తాను ఆడనని వారికీ వివరించాడు... ఈ రోజు పాచికలు ఆడటం నియమమని నాగకన్యలు వలితుడిని ఒప్పించి పాచికలు ఆడడానికి ఒప్పించారు.

లక్ష్మీ సమేతుడైన విష్ణువు భూలోకంలో ఎవరు మేలుకొని వున్నారో చూడడానికి రాగా , వారికి ఈ ముగ్గురు నాగకన్యలు మరియు వలితుడు పాచికలు ఆడుతూ కనిపించారు.  దీనికి సంతోషించిన లక్ష్మీదేవి వారికి సర్వసంపదలు ప్రసాదించారని వాలిఖిల్య  మహర్షి వివరించాడట..
 
 కాబట్టి ఆశ్వీయుజ పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని పూజించి , ఆ రాత్రి జాగరణ చేస్తూ , పాచికలు ఆడేవారికి సర్వసంపదలు చేకూరుతాయని పురాణాలూ చెబుతున్నాయి.

Friday, October 3, 2025

శనిత్రయోదశి :

శనిత్రయోదశి :

సర్వసాక్షి అయిన సూర్యదేవునికి ఇద్దరు కుమారులున్నారు. వారిలో యముడు వ్యక్తులు మరణించిన తరువాత వారి కర్మఫలాన్ని బట్టి శిక్షిస్తే, శని మానవుడు బతికి ఉండగానే సంచిత పాపాలను బట్టి దండన విధిస్తాడు. ఈ కారణంగా వ్యక్తుల సంచిత పాపభారం తగ్గిపోతుంది. ద్రోహం, వెన్నుపోటు, హింస, పాపమార్గాలు, అన్యాయ మార్గాలను అనుసరించేవారికి శనిదేవుడు మిక్కిలి అపాయకారి అని శాస్త్రాలు చెబుతున్నాయి. శని చెడు కార్యాల్లో నిమగ్నమైనవారినే పీడిస్తాడు. ఎంత దైవాంశసంభూతులైనా తప్పులు చేస్తే వారి కర్మల ఫలితాలను నిర్దేశిస్తాడు. సత్కార్యాలు చేసేవారికి మహోన్నతమైన భాగ్యాన్ని అనుగ్రహిస్తాడు. ఆయన తన బాధ్యతలను నిజాయితీగా, కచ్చితత్వంతో సమవర్తిగా నిర్వహిస్తాడు. ఇందులో ఎటువంటి పక్షపాతబుద్ధి లేదు. దీనికోసం ఆయనను పూజించాలే కానీ, భయపడకూడదు. ఈ వాస్తవాన్ని గ్రహించిన మన పూర్వీకులు శనిత్రయోదశి నాడు శనైశ్చరుని ఆరాధించాలని నిర్దేశించారు. జ్యోతిష శాస్తర్రీత్యా ఆయన శనివారానికి అధిపతి. వ్యక్తి జీవితంలో శని దశ జరిగే సమయంలో పూర్వజన్మలో చేసిన దుష్కర్మలకు శిక్ష అనుభవించాల్సివస్తుంది. పైకి అవి శిక్షలుగా కనబడినా వాస్తవానికి అవి సన్మార్గంలో మనమెంతలా నిలబడుతున్నామో తెలుసుకునేందుకు పెట్టే పరీక్షలే.

శనికి నువ్వులనూనె, నల్లని వస్త్రం, బెల్లం, నల్లనువ్వులు, నీలపు వర్ణం కలిగిన పువ్వులతో పూజలు చేస్తే మృత్యుభయం తొలగిపోయి ఆరోగ్యం, ఆర్ధికం, ప్రశాంతత, అభివృద్ధిని ఇస్తాడు. జాతకచక్రంలో శని ప్రతి రాశిలోనూ రెండున్నర సంవత్సరాలు సంచరిస్తాడు. శని ఉన్న రాశికి వెనకరాశి, ముందురాశికి ఏలినాటి శని దోషం సంప్రాప్తిస్తుంది. అలాగే చంద్రుడున్న రాశి నుంచి శని నాలుగో రాశిలో సంచరిస్తుంటే అర్ధాష్టమ శని దోషం, చంద్రుడున్న రాశి నుంచి శని ఎనిమిదో రాశిలో సంచరిస్తుంటే అష్టమ శనిదోషం కలుగుతాయని శాస్త్రం. ఇలా ఏర్పడే అర్థాష్టమ, అష్టమ, ఏలినాటి శనిదోషాల వల్ల వ్యక్తులకు ఏకాగ్రత లోపం, వాహన ప్రమాదాలు, పెద్దల గురించి ఆందోళన, చంచలత్వం పెరిగిపోవడం, ఆరోగ్యంలో చికాకులు వంటివి ఏర్పడతాయి. ఇలా ఏలినాటిశని, అర్ధాష్టమశని, అష్టమశని పీడితులు ఈ శనిత్రయోదశి నాడు పరిహారక్రియలు చేసి ఆ గ్రహబాధల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఏడాది పాటు త్రయోదశి వ్రతం చేస్తే శని కరుణకు పాత్రులు కావచ్చు. న్యాయవివాదాలు, శత్రు, రోగ, రుణబాధలు తగ్గుతాయి. ఈ వ్రతం చేసేవారు త్రయోదశులలో ప్రదోషకాలంలో శివపూజ, నక్తభోజనం విధిగా చేయాలి.


శివపూజ లో లింగార్చన ఏ స్థానం లో పూజిస్తే ఏ ఫలం* ???? రుద్రాభిషేకం లో రుద్రముల సంఖ్యలు ఫలాలు*???

శివపూజ లో లింగార్చన ఏ స్థానం లో పూజిస్తే ఏ ఫలం* ????
రుద్రాభిషేకం లో రుద్రముల సంఖ్యలు ఫలాలు*???


 గృహేత్వేక గుణంప్రోక్తం, నదీతీరే సహస్రకం|         దేవతాయతనేలక్షం శతలక్షం   హరేర్గృహే ||

శివాలయే కోటిగుణం స్వాయంభవే పునః । అనంతం పూజనంశంభోః ఋతం వచ్మిద్విజోత్తమ||

*స్థలాన్ని బట్టి శివార్చన లో లభించే ఫలాలు*

ఇంట్లో లింగార్చన చేస్తే, ఒక భాగం  ఫలితం వస్తుంది.

నదీ తీరంలో పూజిస్తే, వేయి రెట్లు ఫలితం.

దేవాలయాలలో పూజిస్తే, లక్ష రెట్లు ఫలితం.

విష్ణు ఆలయంలో పూజిస్తే, కోటి గుణాలు ఫలితం.

శివాలయంలో అర్చిస్తే, కోటి రెట్లు ఫలితం.

పర్వత గుహలలో పూజిస్తే, పది కోట్ల రెట్లు ఫలితం.

ఆ గుహ ఋషుల ఆశ్రమమైతే, కోటానుకోట్ల రెట్లు లింగార్చన ఫలం లభిస్తుంది.

బ్రహ్మక్షేత్రంలో శివార్చన చేస్తే, అనంత ఫలితం కలుగుతుంది.( రాజస్థాన్ లో పుష్కర్ బ్రహ్మ క్షేత్రం లేక స్వయంభూ శైవ క్షేత్రాలు )

*పైన చెప్పినవి అన్ని శాస్త్రీయంగా అర్చన చేస్తూ 
మానవ ప్రయత్నం వల్ల నిష్ఠ నియమాలు ఉన్న దైవానుగ్రహం తో కార్య సిద్ధి ఉంటుంది*

********
*రుద్రాభిషేక సంఖ్యా ప్రమాణములు*

*రుద్రకల్పే విష్ణవీశ్వర సంవాదే* *విష్ణు:*

విష్ణు భగవానుల అడుగుతున్నారు 
రుద్ర అభిషేకం ఏ సంఖ్యలు చేస్తే యెంఫలము అని

శ్లో॥ మహారుద్రార్చనవిధిం పరమేశదయానిథే మహ్యం కధయ సర్వజ్ఞ భక్తాయ పరిపృచ్చ్యతే

తేన పృష్టస్స గౌరీశోభగవాన్భక్త వతత్సలః *
ఇత్యాహ భగవాంచ్ఛంభుః శృణువక్ష్యామి కేశవ ॥

*శివోవాచ*
మహాదేవుడు ఇలా అంటారు ....
అభిషేకాశ్చష్ట విధాశ్చా దౌవారమితీరితం అవృత్తినామకంచైవ తతోరుద్రం ప్రకీర్తితం 
ఆధైకాదశరుద్రంచ శతరుద్రంతతఃపరం లఘురుద్రం మహారుద్రం చాతిరుద్రం ప్రకీర్తితం చమకై కానువాకశ్చ రుద్రాధ్యాయేన సంయుకం పునః పునః క్రమేణై వ కృతం చేద్ద్వారమీరితం తాన్యేకాదశవారాణిచావృత్తిరితి కీర్తిత

 ఏకమేకాదశావృత్తే రుద్రమిత్యభిధీయతే తాన్యేకాదశరుద్రాణి శతరుద్రం ప్రకీర్తితః శతరుద్రాణితాన్యేవ లఘు దముదాహృతం లఘువ్యైకాదశరుద్రాణి మహారుద్రం ప్రకీర్తితo ఏకాదశమహారుద్రై రతిరుద్రః ప్రకీర్తితః
 విష్ణవీశ్వర సంవాదే రుద్రాభిషేకవిధిః 
         ఇత్యాహబోధాయనః

*రుద్రాభిషేకము 8 విధములు*

నమస్తే రుద్రమన్యవ ఇత్యేకాదశానువాకానాం ఆగ్నా విష్ణూసజోషస ఇత్యేకైక మనువాకం జపేదితి సర్వ నమకాన్ పఠిత్వా ఏకైకం చమకానువాకం పఠేదిత్యర్ధ: ॥
అన్యత్ర 
*నమకం ఏక పాఠస్తు చమకం అనువాకం చరేత్* 

నమకము 11 అధ్యాయాలు చెప్పి చమకములో ఒక్కొ అనువాకం చెప్పాలి ఈ విధముగా నమకము 11 సార్లు చెప్పిన చమకము 11 అధ్యాయములు పూర్తి చేసిన పూర్తి అవుతుంది .

 ఒకరుద్రం ఒక చమక అనువాకo వరుసగా మళ్ళీ రుద్రం చమక అనువాకాలు చెప్పడం సూత్రం.

1. ఈ విధoగాచేసిన అభిషేకమునకు వారమని పేరు. *వారాభిషేకం*

2. ఆవృత్తి అభిషేకం  :- నమకము 121 సార్లు ,చమకము 11 సార్లు సంఖ్యలు.

3. రుద్రాభిషేకం :- నమకము 1,331 సార్లు,చమకము 121 సార్లు సంఖ్యలు.

4. ఏకాదశరుద్రం :- నమకము 14641 సార్లు,చమకము 1,331 సంఖ్యలు.

5. శతరుద్రం :- నమకము 1,61,051 సార్లు, చమకము 14,641 సంఖ్యలు.

6. లఘురుద్రం :- నమకము 17,71,561 సార్లు, చమకము 1,61,051 సంఖ్యలు.

7. మహారుద్రం :- నమకము 194,87, 171 సార్లు , చమకము 17,77,561 సంఖ్యలు.

8. అతిరుద్రo - నమకము 21,13,58,881 సార్లు , చమకము 194,87,171 సంఖ్యలు.

పై విధానాలలో వారి వారి మనోభీష్టము అనుసరించి శక్తిని అనుసరించి ఏదో ఒక పద్ధతిగా చేయవచ్చు.

*అష్టవిధాభిషేక ఫలాని*

 సర్వపాపాని నశ్యంతి శంభోర్వారాభిషేకతః | ఆవృత్త్యాచ భవేత్సౌఖ్యం రుద్రేణాఖిలసంపదః ॥ 

స్యాదేకాదశరుద్రేణ  సశ్రియం లభతే ధ్రువం | శతరుద్రాభిషేకేన   పుత్రపౌత్రాదిసంపదః ||

అప్లైశ్వర్యాది సిద్ధిశ్చ లభతేనాత్ర సంశయః | లఘురుద్రాభిషేకేన పునర్జన్మ నవిద్యతే ॥ 

మహారుద్రాతి రుద్రాదిఫలం వక్తుంనశక్యతే ॥ తద్విధానం ప్రవక్ష్యామి సావధానమనాశ్శృణు |

 శ్రావణ్యాం కార్తికేవాధ మాఘమాసే విషేషతః
 సుక్షేత్రేవా నదీతీరే పర్వతాగ్రే మనోహరే ॥ పశ్చిమాభిముఖద్వారయుక్తే శంకరమందిరే | యజమాన స్సమాగమ్య రుద్ర సంఖ్యాద్భిసృహ అభిషేకం ప్రకుర్వీత సముక్తోనాత్ర సంశయం : 

(ఇతి రుద్రకల్పే విష్ణ్వశ్వర సంపాదే)

1. వారాభిషేకము :- సృధివీరూపధారియగు రుద్ర ప్రీతి సర్వ పాపహరము.

2. ఆవృత్త్యభిషేకము :- జలరూపధారియగు శివప్రీతి, సర్వ సుఖప్రదము.

3. రుద్రాభిషేకము :- తేజోరూపధారియగు శంకర ప్రీతి సర్వసంపద్వృద్ధి.

4. ఏకదశరుద్రాభిషేకము : వాయురూపధారియగు పరమేశ్వర ప్రీతి, లక్ష్మీప్రాప్తి .

5 శతరుద్రాభిషేకము :- ఆకాశరూపధారియగు మహేశ్వర ప్రీతి, పుత్రపౌత్రాద్యష్టైశ్వర్యసిద్ధి.

6. లఘు రుద్రాభిషేకము :- సూర్యరూపధారియగు ఈశ్వర ప్రీతి, పునర్జన్మ నివృత్తి.

7. మహా రుద్రాభిషేకము :- చంద్ర రూపధారియగు రుద్రునకు ప్రీతి, జ్ఞానవృద్ధి.

8. అతిరుద్రాభిషేకము : సర్వరూపియగు పరమేశ్వర ప్రీతి, చెప్పశక్యముగాని మహాఫలము కల్గును. సందేహము లేదు.

శ్రావణ కార్తీకమాసములలో , విశేషముగ మాఘ మాసo సుక్షేత్రము (పుణ్యక్షేత్రం),  నదీతీరo లేక పర్వతo పై భాగము , పశ్చిమ అభిముఖ ద్వారముగల శివాలయమునగాని యజమాని
 11 గురు బ్రాహ్మణులతో అభిషేకము చేసిన 
తప్పక ముక్తి పోoదగలరు.
**********
మహన్యాస అనే ప్రత్యేక న్యాసాలు చేసి పై రుద్రముల సంఖ్య బ్రాహ్మణుల సంఖ్యలు గణన చేసి పూర్తి చేస్తుంటారు.
రుద్రాల సంఖ్య పాఠ్యoతరములు కొన్ని ఉన్నవి.
*మహాదేవ మహాదేవ రాళ్ళబండి శర్మ*

RECENT POST

తాళపత్రాలలో నిక్షిప్తమై ఉన్న సనాతన సాంప్రదాయ, శాస్త్రీయ, సంస్కృతి, విశ్వాసాల సమాహార గోపురం

  తాళపత్రాలలో నిక్షిప్తమై ఉన్న సనాతన సాంప్రదాయ, శాస్త్రీయ, సంస్కృతి, విశ్వాసాల సమాహార గోపురం                  *1.  సూర్యుని ఏఏ సమయాల్లో చూడర...

POPULAR POSTS