Friday, October 24, 2025

రామతపస్వి రంగన్న బాబు గారు

"రామతపస్వి" 
రంగన్న బాబు గారు!

*****************
#ధ్యానం:- వక్షమున కోదండ రాములవారిని నిక్షిప్తపరచుకున్న రామావధూత రంగన్న బాబు గారిని ధ్యానించెదము 
#తల్లిదండ్రులు:- బూరెల జాలమ్మ - పుల్లయ్య 
#జననం:- 1895- ప.గో జిల్లా ఏలూరులో..
#వైకుంఠగమనం:- కార్తిక శుద్ధ విదియ -22-10-1979- సోమవారం - సిద్ధార్థి నామ సం.
#తిథి& తేదీ కలిసొచ్చిన రోజు నేడే)!
(దీపావళి మర్నాడు కార్తిక పాడ్యమి నాడు గుంటూరు ఏటీ అగ్రహారం 14 వ లేన్ లో వాసిరెడ్డి కనకమ్మ మాతాజీ ఆశ్రమంలో బాబుగారి ఆరాధనోత్సవం నిర్వహిస్తారు. ఇంతకన్నా బాబుగారి స్మారక కేంద్రం/ మందిరం ఎక్కడా లేకపోవడం శోచనీయం!)
**********
బాబుగారు చదువుకోలేదు. రామనామ స్మరణ తప్ప ఏ సాధనా చేసినట్టు కనపడదు. అయినా వారిలో అద్భుతమైన దైవిక శక్తులు, సర్వజ్ఞత, సర్వసమర్థత, సర్వాంతర్యామిత్వం లాంటి పరిపూర్ణ అవతార పురుషుల సామర్థ్యం వ్యక్తమవుతూ ఉండేది! 
తండ్రి జూట్ మిల్లులో కార్మికుడు. బాబుగారి బాల్యంలో ఒక సాధువు కనపడి తనతో తీర్థయాత్రలకు రమ్మని పిలిచి తీసుకెళ్ళి సంవత్సరం తర్వాత తీసుకొచ్చి ఏలూరులో వదిలాడుట. కూతురి వివాహానికి తండ్రి పెట్టెలో దాచి ఉంచిన 700/ తీసుకుని బాబుగారు ఆ సాధువుతో వెళ్ళిపోయారు. బర్మా, రంగూన్, కలకత్తా, అనేక పుణ్యక్షేత్రాలు తిరిగి వచ్చారు. తమ గురువు రాములవారే అని చెప్పేవారు. నృసింహ శతకం అంటే బాబుగారికి చాలా ఇష్టం!
తమ శక్తి సామర్థ్యాలు గుప్తంగా ఉంచుకున్న బాబుగారు జీవనోపాధిగా జూట్ మిల్లుకి, హోటళ్ళకి కావిడితో నీరు మోసేవారు. ప్రారబ్ధవశులైన జీవుల పాపాగ్నిని తమ నీటితో ఆర్పివేస్తామనేదే బాబుగారి నీటి కావిడి సంకేతం కావచ్చు! ఏలూరులో మున్సిపల్ నీటి కుళాయిలు రావడంతో బాబుగారికి పని లేకుండా పోయింది. తర్వాత పోలవరం, చీరాలలో కొన్నాళ్ళు నీళ్ళు మోసారు. చివరి 9 సంవత్సరాలు గుంటూరులో ఉన్నారు. 
ఎక్కిరాల వేద వ్యాస ఐఎస్, ఎక్కిరాల భరద్వాజ ఐఎఎస్, బడా పారిశ్రామికవేత్తలు, పండితులు, యోగులు, సామాన్య భక్తులు, ధనికులు, విద్యావేత్తలు కూడా బాబుగారిని ఆశ్రయించారు. 
బాబుగారు తువ్వాలు పట్టుకుని చేతులు చాచి "రామచంద్ర ప్రభూ" అనగానే ఆయన కోరినవి చేతుల్లోకొచ్ఛి పడేవి! వాటిని రాములవారి ప్రసాదంగా పంచిపెట్టేవారు. అవి ఆకులైనా పండ్లైనా పిండి వంటలైనా అసాధారణమైన సైజులో ఉండేవి! భక్తులు తమ సమస్యలను చీటీల్లో రాసి బాబుగారికి ఇచ్చేవారు. "రాములవారిని అడిగి రేపు చెబుతాను!" అనేవారు బాబుగారు. మర్నాడు పరిష్కారం చెప్పేవారు. 
ఒకసారి బీహార్ లోని ఒక పెద్ద కంపెనీలో ఒక యంత్రం చెడిపోయింది. ఇంజినీర్లకి అంతు చిక్కక తలలు పట్టుకుంటున్నారు. ఒక అధికారి బాబుగారిని సంప్రదించాడు. బాబుగారు మర్నాడు ఇలా చెప్పారు:- "గవర్నర్ అనే యంత్ర భాగంలో ఒక ఇనప గోళీ ఇరుక్కుపోయింది. దాన్ని తీసేస్తే యంత్రం బాగుపడుతుంది అని రాములవారు చెప్పమన్నారు!" ఈ పరిష్కారం నిజంగానే సరిపోయింది. మన మనసులలో కూడా గవర్నర్లూ గోళీలూ ఉంటాయి. సద్గురు భక్తితో మనసుని రామమయం చేసుకోవాలి అని బాబుగారి సంకేతం! 
బాబుగారి వక్షం మీద కోదండ రామ స్వామిని స్పష్టంగా చూపించే ఫోటో కూడా తీయబడింది! 
అందుకే వీరు "రామరంగన్న గారు!"
గుంటూరులో బాబు గారిని భోజనానికి పిలిచేవారు చాలా మంది. పిండి వంటలతో హంగామా చేస్తారని ఎవరికీ ముందు మాట ఇచ్చేవారు కాదు బాబుగారు. ఆ టైం కి ఎవరో ఒకరి ఇంటికి వెళ్ళి ఏముంటే అది పెట్టమని అడిగి భోజనం చేసేవారు. రామాలయంలో హల్వా, పాయసం, ద్రాక్షపండ్లు లాంటి నైవేద్యాలు పెట్టి బాబుగారు తలుపులు మూసేవారు. తర్వాత చూస్తే వాటిలో కొంత నైవేద్యం సీతారాములు స్వీకరించిన ఆనవాళ్లు కనిపించేవి! పండ్ల సంఖ్య తగ్గేది. బాబుగారికి చుట్ట కాల్చడం అలవాటు. ఏలూరు నుండి లంక చుట్టలు పార్సెల్ పంపేవారు భక్తులు. 20 చుట్టల పార్సెల్ లో 21 ఉండేవి. "ఒకటి రాములవారు అదనంగా పెడతారు బాబూ!" అనేవారు బాబుగారు. 
ఒక భక్తుడితో "మీకు త్వరలోనే రాములవారు ప్రసాదం స్వయంగా ఇస్తారుట బాబూ!" అన్నారు బాబుగారు. కొన్నాళ్ళకు ఆ భక్తుడికి సత్యసాయి బాబా తొలిసారిగా స్వయంగా ప్రసాదం ఇచ్చారు. అంటే సత్యసాయి/ శిరిడీ సాయి/ రాములవారు ఒకటే అని బాబుగారి సంకేతం! 
బాబుగారు భార్యా పిల్లలను చూడడానికి ఏలూరు రైలులో వెళ్ళేవారు. ఏలూరి కి ఒక స్టేషన్ కి ముందు వరకే టికెట్ తీసుకొని అక్కడ దిగి ఏలూరు నడిచి వెళ్ళేవారు. అలా ఆదా చేసిన పావలానో అర్థరూపాయో బిచ్చగాళ్ళకు ఇచ్చేవారు! ఇది మనకోసం సంకేత బోధ. నిజానికి ఆయనకి డబ్బు ఎంత కావాలన్నా చేతుల్లోకి వచ్చేది. ఒక మెడికల్ షాపులో పనిచేసే సేల్స్ మన్ భార్యని బాధపెట్టేవాడు.  ఆ ఇల్లాలు బాబుగారికి చెప్పుకుంది. "అమ్మగారిని బాధపెట్టకండి బాబూ;" అని అతనికి చెప్పారు బాబుగారు. "మీరేంటి? సత్యసాయి బాబా లాగ ఏదైనా సృష్టించగలరా ?" అన్నాడు అతను. "ఏంకావాలి బాబూ?" అన్నారు ఈయన. "డబ్బు! డబ్బు కావాలి నాకు!" అన్నాడతను. "రామచంద్ర ప్రభూ!" అని చేతులు చాచారు బాబుగారు! నోట్ల కట్ట వచ్చిపడింది. అతనికి ఇచ్చారు.. "వద్దు బాబుగారూ!" అంటూ అతను ఆయన కాళ్ళమీద పడ్డాడు. అది లెక్క చూస్తే నలభై వేలుంది.. వెంటనే పక్కనే ఉన్న వర్తకుడి దుకాణానికి వెళ్లి ఆ డబ్బు ఇచ్చేసారు బాబుగారు. "ఏమైంది బాబుగారూ! ఇప్పుడే తీసుకుని ఇప్పుడే ఇచ్చేస్తున్నారు?" అన్నాడు ఆ వర్తకుడు.. బాబుగారు అడిగితే ప్రాణాలైనా ఇచ్చేలా ఉన్నారు ఇప్పటికీ ఎందరో వ్యాపారస్తులు. 
గుంటూరులో చుండూరు కామేశ్వరమ్మ గారు సాయిబాబాను చూపించమని అడుగుతుంటే ఒకరోజు ఆమెను చాలా దూరం తీసుకుని వెళ్ళి దారిలో ఒక నదీ ప్రవాహాన్ని దాటించి ఒక మందిరంలో సాయిబాబాను దర్శింపజేసారు బాబుగారు. "నాకు ఏం తెచ్చావ్?" అని అడిగారు బాబా. ఆమె ఏమీ తేకుండా వచ్చింది. వెంటనే బాబుగారు తమ బొడ్డున ఉన్న పొగాకు కాడ తీసి ఆమెకిచ్చి బాబాకి ఇప్పించారుట! ఎక్కిరాల వేద వ్యాస గారు చీటీ రాయకుండా తన సందేహం తీర్చమని అడిగారు 1960 దశకంలో. మర్నాడు వేదవ్యాస గారికి ఇలా చెప్పారు బాబుగారు:- "ఆ శిరిడీలో ఉండే సాయిబాబా, తానూ ఒకటేనని, ఆయన తురక ఫకీరు కాదని రాములవారు చెప్పమన్నారు బాబూ!" 
#రాములవారు రంగన్న 
-- శ్రీనివాసరావు వడ్డూరి

No comments:

Post a Comment

RECENT POST

నాగదేవతల గురించి..... పవిత్రమైన కార్తికమాస శుక్ల పక్ష చవితికి 'నాగుల చవితి' పేరుతో అనేక చోట్ల నాగదేవతలను ఆరాధన చేస్తుంటారు.

నాగదేవతల గురించి..... పవిత్రమైన కార్తికమాస శుక్ల పక్ష చవితికి 'నాగుల చవితి' పేరుతో అనేక చోట్ల నాగదేవతలను ఆరాధన చేస్తుంటారు.  నాగదేవత...

POPULAR POSTS