నాగదేవతల గురించి.....
పవిత్రమైన కార్తికమాస శుక్ల పక్ష చవితికి 'నాగుల చవితి' పేరుతో అనేక చోట్ల నాగదేవతలను ఆరాధన చేస్తుంటారు.
నాగదేవతలంటే ఎవరు అనేది తెలుసుకోవాలి. ఈశ్వరుడు ఒక్కడే. కానీ దేవతలు అనేక రూపాలతో ఉంటారు. సిద్ధ, చారణ, గంధర్వ, యక్ష, నాగ మొదలైనవన్నీ దేవతాజాతి విశేషాలు. మానవ భూమిక కంటే ఉత్కృష్టమైన దేవతా గణాలు చాలా ఉన్నాయి. అందునా మానవులకు మొట్టమొదటగా విజ్ఞానాన్ని అందించిన జాతి నాగజాతి అనేది ప్రాచీనంలో కనబడుతున్న ఒకానొక విజ్ఞానం. ఈ రహస్యం నేటికీ కొంతమంది యోగులు తమ అనుభవంతో తెలియజేశారు.
నరులకు, నాగులకు ఏదో దగ్గర అనుబంధం ఉంది. నాగులు దేవతాకోటికి చెందినవారు. అనేక రకాల దేవతలని ఆరాధించాలి గానీ, సర్వ దేవతలూ ఒకరే అన్న భావం కూడా కలిగి ఉండాలి. అయితే ఇన్ని రకాల దేవతలని ఆరాధించడం అంటే బహుదేవతా ఆరాధన లేదా చిల్లర దేవుళ్ళ ఆరాధన అనే కువిమర్శ తగదు. ఎందుకంటే దేవతలనేవారు మన భావానికి చెందినవారు కారు.... దేవతలు అనేవారు ఉంటారు. ఆ దేవతల అనుగ్రహం పొందడానికి మనం ఆరాధన చేయాలి.
అలాగే 'నాగ దేవతలు' అనే దాని గురించి చాలా విస్తారమైన అంశములు పురాణ వాఙ్మయంలోనే కాకుండా వేద వాఙ్మయంలో, ఆగమాలలో, ఇతిహాసాదుల్లో కూడా గోచరిస్తున్నాయి. యోగ శాస్త్రాలలో కూడా కనబడుతున్నాయి. నేటికీ నాగజాతులు ఇచ్చా రూపాలతో సంచరిస్తూ ఉంటారు అనే విషయాన్ని ఇటీవలి కాలంలో కొంతమంది యోగులు అనుభంతో రచించిన గ్రంథాలు కూడా కనబడుతున్నాయి.
నాగ అంటే మనం సాధారణంగా చూసే సర్పములు కావు. దేవతా మహిమ కలిగిన దివ్య సర్పములు. అలాంటి సర్పాలు నేటికీ భారతదేశంలో దుర్గమ అరణ్య ప్రాంతాల్లో సంచరిస్తూ ఉంటాయి. అవి మనకు కనబడక పోవచ్చు కానీ, ఉంటాయి. అటువంటి నాగదేవతలను ఉద్దేశించి పుట్టలో పాలు పోయడం ఉన్నది. కొందరు, "పుట్టలో పాలు పోస్తే పాములు తాగుతాయా” అని అంటుంటారు. ఆపాటి జ్ఞానం మన పూర్వీకులకు లేదా?! ఇందులో గ్రహించవలసింది - పుట్ట కేవలం ఒక ఆలంబన మాత్రమే. అక్కడ మనం నాగదేవతలను ఉద్దేశించి పొసే క్షీరములు దివియందు, భువియందు కూడా అదృశ్యరూపాలతో ఉండే నాగదేవతలు చూసి సంతోషిస్తారు. దేవతలకు నైవేద్య రూపంలో సమర్పిస్తే ఆ భావాన్ని అనుగ్రహంతో వారు చూస్తారు. ఆ అనుగ్రహ దృష్టి పడగానే అది ప్రసాదంగా మారుతుంది. ఇది పద్ధతి.
అందుకు సర్ప దేవతల్ని ఉద్దేశించి క్షీరం పోయాలి. అంతేగానీ, మనం పోస్తూ ఉంటే పుట్టలో పాము నోరు తెరుచుకుని తాగుతుంది అనే భావం సమంజసం కాదు. అందుకు పుట్టలో పాలు పోయడం అనేది వచ్చింది. అయితే కొన్ని చోట్ల ప్రత్యక్ష సర్వములు కనబడడం ఉంటుంది. ఆ ప్రత్యక్ష సర్పములలో దేవతకోటికి చెందిన సర్పాలు కనబడడమే అరుదు. కనబడితే భాగ్యమే. వాటిని దేవతారూపంతో భావించిన వారిని సర్పదేవతలు అనుగ్రహిస్తారు కూడా. “నమో ఆస్తు సర్పేభ్యో ఏకేచ పృథివీ మను యే దివి యే అంతరిక్షే తేభ్య స్సర్పేభ్యో నమః” అనే వేద మంత్రముంది.
అంతేకాక కేతువు రాహువు మొదలైన కొన్ని గ్రహాలకు సర్పములను ప్రధానంగా చెప్తారు. నక్షత్రాల్లో ఆశ్లేష నక్షత్రానికి అధిపతిగా ఆదిశేషువైన సర్పదేవతనే చెప్పారు. 'ఏ దివి ఏ అంతరిక్షే' అన్నారు. అంటే.... భూమియందు మాత్రమే కాకుండా దివియందు కూడా సర్పములు ఉన్నాయి. విజ్ఞాన శాస్త్రం ఇంకా కొంతకాలానికి ఎదిగినట్లైతే ఈ భావాలను అంగీకరిస్తుంది. కానీ వేదవిజ్ఞానశాస్త్రం పురాణాది రూపాలతో మనకు ఇస్తున్నది.
సర్పజాతుల్లో దేవతా సర్పముల గురించి మహాభారతంలో ఆదిపర్వంలో కొన్ని వందల పేర్లున్నాయి. అవన్నీ దేవతాజాతికి సంబంధించిన సర్పములు. జనమేజయుని సర్పయాగ విశేషం ఉంది.
అనంతుడు, వాసుకి, తక్షకుడు, కర్కోటకుడు, శంఖ, కుళిక, పద్మ, మహాపద్మ, ధార్తరాష్ట్ర, ధనంజయ, శంఖపాల.... ఇలా చెప్పబడుతూ సర్పదేవతల పేర్లు చాలా వర్ణించారు. అంతేకాదు, భీముడు నాగలోకంలో సర్పదేవతల చేత సన్మానితుడైనట్టు వర్ణించారు. ఇవి కేవలం అభూత కల్పనలు కావు; అవి ఉన్నాయి. ప్రతి దివ్యత్వమూ అందరికీ అనుభూతిలోకి, అనుభవంలోకి రాదు. అందుకే మహాత్ముల అనుభవంలోకి వచ్చిన దివ్యత్వాన్ని మనం విశ్వసించి ఆరాధించినట్లైతే అనుగ్రహాన్ని పొందగలం.
కార్తికమాసంలో మనం ఆరాధించే పరమేశ్వరుడు కూడా దివ్యసర్పభూషితుడే. కార్తికం కృత్తికా నక్షత్రంతో ఉన్న పౌర్ణమి కలది. అంటే కార్తికేయుడైన సుబ్రహ్మణ్యునికి ప్రధానం. ఆ సుబ్రహ్మణ్యుని కూడా మనం సర్పరూపంలోనే ఆరాధిస్తాం. యోగపరంగా, అంతరిక్ష విజ్ఞానపరంగా, దేవతాపరంగా కూడా సర్పదేవతలకు విశేష ప్రాధాన్యం ఉంది.
పూజ్య గురుదేవులు సమన్వయ సరస్వతి డాక్టర్ బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారి ప్రవచనం నుండి సేకరణ
🙏🙏🙏🙏🙏

No comments:
Post a Comment