Saturday, October 24, 2020

నవదుర్గా వైభవం నవరాత్రులలో 10వ రోజు విజయదశమి రాజరాజేశ్వరి దేవి


నవదుర్గా వైభవం:  

       నవదుర్గా వైభవంలో భాగంగా 10వ రోజు విజయదశమి పర్వదినం.   విజయదశమి అనగానే ప్రతి ఒక్కరూ,  ముహూర్తంతో సంబంధం లేకుండా పనులు ప్రారంభిస్తారు.   ఎందుకంటే!! దసరా మహోత్సవాలలో 10 రోజు ఆశ్వయుజ శుద్ధదశమి (దశ అంటే పది). ఈరోజు పనులు ప్రారంభించినవారికి దశ తిరుగుతుందని, వారి జీవితాల్లో, వారిపనిలో దశ తిరిగి,  విజయం పొందడానికి విజయదశమి చాలా మంచిరోజు. కాబట్టి మీ జీవితానికి సంబంధించి ఏదైనా చిన్న పని ప్రారంభించండి.   మీకు అన్ని విజయాలు కలుగుతాయి.
     ఈరోజు మైసూర్ లో,  ఉత్తర భారతదేశంలో అపరాజితగా (పరాజయం లేనిది---నిత్యం విజయ స్వరూపిణి) పూజిస్తారు.   శ్రీశైలంలో త్రిపుర సుందరిదేవిగా దర్శనమిస్తుంది.  
        నవదేవి వైభవంలో భాగంగా విజయవాడలో రాజరాజేశ్వరి దేవి అలంకారం.   వృక్షాలలో జమ్మి చెట్టుని (శమీవృక్షం) పూజిస్తారు.   నైవేద్యంగా చిత్రాన్నం, (పులిహోర) లడ్డూలు సమర్పించాలి.   చదువుకోవలసిన స్తోత్రాలు:  రాజరాజేశ్వరి దేవి అష్టోత్తరం, సహస్ర నామావళి, కవచం, అష్టకం, (అంబా-- శాంభవి-- చంద్రమౌళి--) శతనామ స్తోత్రం, రాజరాజేశ్వరి సహస్రనామ స్తోత్రం చదువుకోవాలి.   లలితా సహస్రనామాల్లో "రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభా"అనే శ్లోకం చదువుకోవాలి.   "ఓం శ్రీ రాజరాజేశ్వరి దేవతాయై నమః" అనే మంత్రం జపించుకోవచ్చు.   రాజరాజేశ్వరి దేవి గాయత్రి మంత్రం "ఓం రాజరాజేశ్వరి రూపాయ విద్మహే! అంబికాయై ధీమ హి తన్నోమాతః ప్రచోదయాత్ "అనే మంత్రాన్ని జపించుకోవాలి.   అమ్మవారు సింహాసనం మీద ఆసీనురాలై ఉంటుంది.   షోడశ మహావిద్యా స్వరూపిణీ... మహా త్రిపురసుందరి... శ్రీచక్ర అధిష్టాన దేవత... శ్రీరాజరాజేశ్వరి అమ్మవారిని కొలిస్తే,  శ్రీచక్రార్చన చేసినట్లే.   విజయదశమి పండుగ అపరాజిత పేరుమీద వస్తుంది.   పరాజయం లేకుండా విజయాన్ని సాధించేది కాబట్టి,  విజయదశమి అయింది.   విజయదశమి రోజు పరాజయంలేని అపరాజితాదేవిని.. శ్రీ రాజరాజేశ్వరీదేవిని... శ్రీచక్ర అధిష్టాన దేవత... షోడశ మహావిద్యా స్వరూపిణిని ఎవరైతే పూజిస్తారో! వారందరికీ ఖచ్చితంగా విజయం లభిస్తుంది.   అమ్మవారు పరమశాంత స్వరూపంతో,  సమస్త నిత్యామ్నయ పరివార సమేతంగా,  మహా కామేశ్వరుడుని అంకంగా చేసుకొని,  ఆది పరాశక్తి... మహా త్రిపురసుందరి... రాజరాజేశ్వరి దేవి... పరాభట్టారికాదేవి... శాంత స్వరూపంతో చిరునవ్వులు చిందిస్తూ,  చెరకుగడను (ఇక్షుఖండం) ధరించి,  ఒక చేతితో అభయ ముద్రతో దసరా మహోత్సవాలలో కన్నుల పండుగగా దర్శనమిస్తుంది.   మణిద్వీప వర్ణనలో "శ్రీపురంలో చింతామణి "అనే గృహంలో నివసిస్తూ ఉంటుంది.   శ్రీ రాజరాజేశ్వరీ దేవి అష్టోత్తరం,  శతనామ స్తోత్రం "బ్రహ్మ యామణ తంత్రంలో" ఉంది.   ఇది నిత్యం పారాయణ చేస్తే భోగభాగ్యాలు కలుగుతాయి.   మీ దగ్గరలోని రాజరాజేశ్వరీ మాతని దర్శించిన, అష్టోత్తరం చదువుకున్నా అన్నింటా విజయం పొందుతారు.   చెడుపై సాధించే విజయమే విజయదశమి.   ముఖ్యంగా మన మనసులో ఉన్న చెడు ప్రవర్తన మార్చుకుని (చెడుపై సాధించిన విజయంగా..) విజయదేవిని, విజయదశమి రోజు పూజిస్తే సర్వ శుభాలూ కలుగుతాయి.   ఈమె ఆది ప్రకృతి స్వరూపిణి. దుర్గ అయిన దుర్గాదేవి వివిధ కల్పాలలో,  వివిధ రూపాలు ధరించి నానా దుష్టజనులని సహకరించి, లోకాలకి ఆనందం కలిగించింది.   మహిమాన్విత అయిన శ్రీచక్ర అధిష్టాన దేవతయే... లలితా దేవతయే... శ్రీరాజరాజేశ్వరీ దేవి.   ఈ తల్లి నివాసం "శ్రీమణిద్వీప-- శ్రీనగరస్థిత-- చింతామణి గృహం".   ఈ తల్లి ఎక్కడ నివసిస్తుందో! అక్కడ అన్నీ శుభాలే!!!
         అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే!!https://youtu.be/-soaNik6PAI

నవ దుర్గావైభవం:నవరాత్రులలో 9వ రోజు నవమి, మహర్నవమి మహిషాసుర మర్దిని


నవ దుర్గావైభవం:   

 
   నవదేవి, నవదుర్గా వైభవంలో  9వ రోజు నవమి, మహర్నవమి అంటారు.   మహర్నవమి చాలా పవిత్రమైన రోజు.   ఎందుకంటే?  దేవి ఉపాసకులు ఉపవాసాలుండి,  శ్రద్ధతో అమ్మవారిని అర్చించి, ధ్యానించి,  ఈ 9వ రోజున అమ్మవారి కృపా కటాక్షాలు కోసం ఎదురుచూసే రోజు.   9 రోజులలో ఏ రోజు చేయకపోయినా!! ఈ 3 రోజులు పూజ చేసినా (మూలా నక్షత్రం-- దుర్గాష్టమి-- మహర్నవమి--) అమ్మవారు కరుణిస్తుంది.   విజయవాడలో ఈ రోజు "మహిషాసుర మర్దిని" అవతారం.   శ్రీశైలంలో "సిద్ధిధాత్రిగా" పూజిస్తారు. ఈరోజు మైసూర్ లో అమ్మవారు "చాముండా దేవతగా" దర్శనమిస్తుంది.   ఉత్తర భారతదేశంలో సుభద్రగా (శ్రీకృష్ణుని సోదరి సుభద్ర కాదు..) దర్శనమిస్తుంది.   ఈమెని పూజించడం వల్ల వాంఛితార్థ సిద్ధి కలుగుతుంది.   కుమారి పూజలో 10 సం:ల వయస్సు గల బాలికని పూజిస్తారు. 
      నవదేవి వైభవంలో భాగంగా,  ఈ రోజు విజయవాడలో మహిషాసుర మర్దిని అవతారం.   ఈ తల్లి దర్శనం వల్లేకాదు, మనసులో ఒక్కసారి స్మరించుకున్నా శత్రు వినాశనం జరుగుతుంది.   వృక్షాలలో దేవగన్నేరు వృక్షాన్ని పూజిస్తారు.   నైవేద్యంగా పాయసం (చిట్టచివరి రోజు కనుక..) నివేదించాలి. చదువుకోవలసిన స్తోత్రాలు:  మహిషాసుర మర్దిని అష్టోత్తరం, సహస్ర నామావళి,  కాళీ కవచం,  కాళీ అష్టకం, (మహాకవి కాళిదాసు రచించిన..) కాళీ శతనామస్తోత్రం,  కాళీ స్తోత్రం (ఋషులు, దేవతలు రచించిన..) కాళీ సహస్రనామ స్తోత్రం, ( 'క' కార కాళీ మాత్రం కాదు..) మహిషాసుర మర్దిని స్తోత్రం (అయిగిరి నందిని..) పారాయణ చేసుకోవాలి.   ఈ రోజు లలితా సహస్రనామాల్లోని "అపర్ణా చండికా చండముండాసుర నిషూదిని" శ్లోకాన్ని పారాయణ చేసుకోవాలి.  " ఓం శ్రీ మహిషాసురమర్ధిని దేవతాయై నమః" అనే నామాన్ని జపించుకోవచ్చు.   మహిషాసుర మర్దిని గాయత్రి మంత్రం "ఓం మహిషాసురమర్ధిని రూపాయ విద్మహే! పరమాత్మికాయై ధీమహి తన్నో పూర్ణః ప్రచోదయాత్" అనే మంత్రాన్ని జపించుకోవాలి.   సప్తశతిలో దుర్గాదేవి అష్ట భుజాలతో మహిషాసురుణ్ణి సంహరించి,  సింహవాహిని శక్తిగా వికటాట్టహాసం చేసింది.   మహిషాసురుడి సేనాధిపతులైన చిక్షిలుడు, చామరుడు, ఉదదృడు, బాష్కలుడు, విడాలుడు అనే సైన్యాధ్యక్షులందరిని సంహరించి,  చివరగా మహిషాసురుణ్ణి సంహరించి,  మహిషాసురమర్దిని అయింది.   సింహవాహనం మీద "ఆలీడా పాదపద్ధతిలో", ఒక చేతిలో త్రిశూలాన్ని ధరించి, మహిషాసురుని సంహరించింది.   ఈమె అష్టోత్తర శతనామ స్తోత్రం భక్తులు పారాయణం చేస్తే,  శత్రు బాధలు,  దత్త గ్రహబాధలనుండి విముక్తి కలగటమే కాక, మనసులో ఉన్న భయాన్ని పోగొట్టి,  ధైర్యాన్ని ప్రసాదిస్తుంది.   ఇంద్రాది దేవతలు మహిషాసురుడి వల్ల అనేక కష్టాలు అనుభవించారు.   అప్పుడే ఇంద్రాది దేవతలు తమ తమ శరీరాల్లోని దివ్యతేజస్సు లన్నింటిని బయటికి తీసుకొచ్చి,  ఆ తేజస్సుకి ఒక రూపాన్నిచ్చారు. ఆ మూర్తి యొక్క రూపమే మహిషాసురమర్దిని.   ఆ తేజోమూర్తికి తమ ఆయుధాలను సమర్పించారు.  తండ్రిగారైన హిమవంతుడు ఒక సింహాన్ని సమర్పించాడు.   (దుర్గాదేవి శార్దూల వాహినిగా (పులి) దుర్గముడు అనే రాక్షసుడిని సంహరించింది... మహిషాసురమర్దిని సింహవాహినిగా మహిషాసురుని సంహరించింది...) ఈ తల్లి మహిషాసురుడి సైన్యాధిపతులను సంహరించి,  ఆ తర్వాత మహిషాసురుడిని అవలీలగా సంహరించి,  అదే స్వరూపంతోటి ఇంద్రకీలాద్రి మీద వెలసింది.   కాలక్రమంలో "కనకదుర్గగా" భక్తులకు కొంగుబంగారం అయింది.   అందుకే ఈ శరన్నవరాత్రులలో మహిషాసుర మర్దిని అవతారం,  సింహవాహనం మీద ఆలీడా పాదపద్ధతిలో, ఒక చేతిలో త్రిశూలాన్ని ధరించి, మహిషాసురుడిని సంహరిస్తున్న రూపంలో దర్శనమిస్తుంది.   గుంటూరు జిల్లాలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి.   కంఠంరాజు కొండూరులో మహంకాళిగా,  చందోలులో బండ్లమ్మ తల్లిగా (భగళాముఖి),  అమీనాబాద్ లో కొండపైన మూలాంకురేశ్వరిగా (వరంగల్ లో భద్రకాళిగా) దర్శనమిస్తుంది.   వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయాల్లో ఈ అవతారంతో దర్శనమిస్తుంది.   ఇవన్నీ మహిషాసురమర్ధిని స్వరూపాలే.   మహిషాసుర మర్దిని "కాళీగా" ఉద్భవించిన తల్లి. 
     నవదుర్గా వైభవంలో భాగంగా,  ఈరోజు శ్రీశైలంలో అమ్మవారు సిద్ధిధాత్రిగా దర్శనమిస్తుంది.   ఈ తల్లి సర్వ సిద్ధులను ప్రసాదిస్తుంది.   పరమేశ్వరుడు సర్వసిద్ధులను దేవికృప వల్లనే పొందాడని దేవీపురాణంలో ఉంటుంది. ఈ తల్లి శివుని పతిగా పొందడమే కాక!  తన శరీరంలోని అర్ధభాగాన్ని ఆ పరమేశ్వరుడుకిచ్చి "అర్ధనారీశ్వరిగా" అవతరించింది.   ఈ తల్లి చతుర్భుజి,  సింహవాహిని.  కుడివైపు చేతిలో చక్రం, గద ధరిస్తుంది.   ఎడమచేతిలో శంఖాన్ని, కమలాన్ని ధరిస్తుంది.   ఈ తల్లి కమలం మీద కూర్చొని ఉంటుంది.   ఈమెని ఆరాధించేవారికి సర్వ సిద్ధులు కరతలామలకం.   ఈమె కృపచేతనే భక్తుల--, సాధకుల--,  లౌకిక, పారమార్థిక, మనోరథాలు తీరతాయి.   ఈ తల్లి కృపకు పాత్రుడైన భక్తుడికిగానీ, ఉపాసకుడుకిగాని కోరికలు ఏవి మిగలవు? (కుంతీదేవి కోరికలు లేని స్థితిని,  కష్టాలనే ప్రసాదించమని శ్రీకృష్ణుని అర్థించింది.. ఎందుకంటే!! కష్టాల్లోనే భగవంతుడు చెంతనే ఉంటాడు కనుక...) అలాంటివారికి అమ్మవారి సన్నిధే సర్వసోపానం.   ఈ అమ్మవారి స్మరణ,  ధ్యాన, పూజ వల్ల సంసారం నిస్సారమన బోధపడుతుంది. పరమానంద పరమైన అమృత పదాన్ని (మోక్షాన్ని) పొందుతారు.   ఈ తల్లి అణిమాది అష్టసిద్ధులనే కాక మోక్షాన్ని ప్రసాదించేది.   లౌకిక, అలౌకిక, సర్వార్థ సిద్ధులకు అధిష్టాన ధాత్రి... "సిద్ధిధాత్రి"..
       అమ్మ దయ వుంటే అన్నీ ఉన్నట్లే!!https://youtu.be/3SCUrkAqMwk

Tuesday, October 20, 2020

నవరాత్రి ఉత్సవాలు 2020 ఏ రోజు ఏ అలంకారం ఏ నైవేద్యం ఏ స్తోత్ర పారాయణ ఏ పూజ చెయ్యాలి?

నవదుర్గా వైభవం:నవరాత్రులలో ఏడవ రోజు తిథి సప్తమి సరస్వతి దేవి.


నవదుర్గా వైభవం:


   నవదేవి, నవదుర్గా వైభవంలో భాగంగా ఏడవ రోజు తిథి సప్తమి.   ఈ రోజు విజయవాడలో అలంకారం సరస్వతి దేవి.   మైసూరులో ఇంద్రాణిగా పూజిస్తారు. ఉత్తర భారతదేశంలో శాంభవిగా పూజిస్తారు.  ఈ తల్లిని పూజిస్తే,  శోక, దారిద్ర్య నాశనం జరుగుతుంది. సమరంలో (భవసాగరంలో) విజయం కలుగుతుంది.  శ్రీశైలంలో కాళరాత్రిగా పూజిస్తారు.   

        నవదేవి వైభవంలో భాగంగా విజయవాడలో సప్తమి తిథి, మూలా నక్షత్రం, సరస్వతి దేవి అలంకారం. ఈ సరస్వతి అలంకారం కోసం దసరా నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమవుతాయా!! అని ఎదురు చూస్తాం. నవరాత్రులలో చేసే అలంకారాలలో అత్యంత ప్రాధాన్యత కలిగిన అలంకారం సరస్వతి అలంకారం.   విజయవాడలో ఏ రోజు అమ్మవారిని దర్శించడానికి రానివారు, ఈరోజు ఖచ్ఛితంగా వస్తారు.   సరస్వతి అలంకారం బహు అరుదైన అలంకారం.  శైవంలో పార్వతి ఆలయాలు,  వైష్ణవంలో లక్ష్మి ఆలయాలు చాలా ఉంటాయి.   కానీ సరస్వతి ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయి. (ఉదా:- బాసర). కాబట్టి సరస్వతి దేవి అలంకారం దర్శించడానికి ఎక్కువమంది వస్తారు. విజయవాడలో సరస్వతి అలంకరణలో భాగంగా, అమ్మవారు ధవళ వస్త్రాలతో, స్వర్ణమయ వీణను ధరించి,  అత్యంత అద్భుతంగా కన్నుల పండుగగా దర్శనమిస్తుంది.   ఈ అలంకరణలో అమ్మవారిని ఒక్క క్షణం దర్శించిన,  జన్మ ధన్యం అయినట్లుగా భక్తులు భావిస్తారు.   అందుకోసమే ఎన్నో గంటలు క్యూలైన్లో నిలబడి మరి,  అమ్మవారిని దర్శించుకుంటారు.   ఈరోజు కుమారి పూజలో 8 సంవత్సరాల బాలికని పూజిస్తారు.   వృక్షాలలో బూరుగ వృక్షాన్ని పూజించాలి. నైవేద్యంగా శాకాన్నం (కూరగాయలతో వండినది.) నివేదించాలి.  ఈరోజు చదువుకోవలసిన స్తోత్రాలు సరస్వతి దేవి అష్టోత్తరం,  సహస్ర నామావళి,  కవచం, అష్టకం,  శతనామ స్తోత్రం.   ఈ రోజు అమ్మవారు పరాశక్తిగా 'నిషింబాసురుడు' అనే రాక్షసుడిని సంహరించింది.   లలితా సహస్రనామాల్లోని "సరస్వతీ శాస్త్రమయి గుహాంబా గుహ్యరూపిణి" అనే శ్లోకం చదువుకోవాలి.   జపించవలసిన నామం "ఓం శ్రీ సరస్వతి దేవతాయై నమః".   సరస్వతీ గాయత్రి మంత్రం "వాగ్ధేవ్యైచ విద్మహే! బ్రహ్మపత్నైచ ధీమహి తన్నో వాణి ప్రచోదయాత్!! అనే మంత్రాన్ని జపించాలి.  వీలుంటే "ఓం ఐం సరస్వత్యైనమః" అనే మూల మంత్రాన్ని జపించండి. విజయవాడలో మూలా నక్షత్రం రోజు, మహా సరస్వతి అలంకారం.   ఈ తల్లి సకల విద్యలను ప్రసాదిస్తుంది.   శాక్తేయులు విద్యల కొరకు సరస్వతిని, వైష్ణవులు హయగ్రీవుడిని,  శైవులైతే దక్షిణామూర్తిని ప్రార్ధిస్తారు.   శాక్తేయారాధన జరుగుతున్న నవరాత్రులలో సరస్వతిని ప్రార్థించాలి.   ఈ తల్లి జ్ఞాన దీపం వెలిగించే విద్యాశక్తి.   ఈ తల్లిని ఏడు రూపాలతో పూజిస్తారు. 1. చింతామణి సరస్వతి.. 2. జ్ఞాన సరస్వతి.. 3. నీలా సరస్వతి.. 4. ఘట సరస్వతి.. 5. ఖిణి సరస్వతి.. 6. అంతరిక్ష సరస్వతి.. 7. మహా సరస్వతి.. అని ఏడు రూపాలున్నాయి.  మూడవ అవతారం నీలా సరస్వతిని ఆరాధించేవారు చాలామంది ఉన్నారు.   ఈ తల్లిని తారాదేవి అంటారు.   ఆపదలు కలిగినప్పుడు ఉగ్రతారా రూపంలో కాపాడుతుంది.   నీలా సరస్వతి స్తోత్రం చదివితే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి.   నీలా సరస్వతి స్తోత్రం పారాయణం చేసి,  కవిత్వ సంపదలు, వాక్సుద్ధి పొందినవారు చాలామంది ఉన్నారు.   ఈ తల్లి ఏడు రూపాల గురించి మేరుతంత్రంలో ఉంటుంది.   "అమ్మలగన్నయమ్మ! ముగురమ్మల మూలపుటమ్మ!చాలపెద్దమ్మ! సురారులమ్మ! కడుపారెడి బుచ్చిన యమ్మ! తన్నులో నమ్మిన వేల్పుటమ్మల! మనంబున యుండెడి అమ్మ! దుర్గమాయమ్మ! కృపాబ్ది నిచ్చుత!మహిత్వ! కవిత్వ! పటుత్వ! సంపదల్ ! అనే పద్యం పోతన భాగవతంలోనిది.   ఈ ముగ్గురమ్మలలో మహా సరస్వతిని కలిపి మూలపుటమ్మ అన్నారు.   మహా సరస్వతి దేవి శంభు, నిశంభులనే రాక్షసులను సంహరించింది.  సరస్వతి రూపంలో దుర్గాదేవి వధించుట చేత, కనకదుర్గాదేవికి మహా సరస్వతిదేవి అలంకరణ చేస్తారు.   అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం రోజున, సరస్వతి అలంకారం జరుగుతుంది.  స్కాంద మహాపురాణంలో శరత్కుమార సంహితలో,  సకల విద్యా ప్రదాయిని సరస్వతి అష్టోత్తరం (సరస్వతి మహాభద్ర) ఉంది.   దీనిని రోజూ చదువుకున్నా మంచి ఫలితాలు వస్తాయి.   సకల విద్యలను,  పుత్రపౌత్రాభివృద్ధిని, వాక్సుద్ధిని, కవిత్వ రచనాశక్తిని అమ్మవారు ప్రసాదిస్తుంది.   నవరాత్రులలో మూలా నక్షత్రం రోజు నుండి (సప్తమి, అష్టమి, మహర్నవమి) మిగిలిన మూడు రోజులు ఎవరైతే అమ్మవారిని ఆరాధిస్తారో!  (ప్రతిరోజు చేయటానికి వీలు కుదరని వారు) వారికి తొమ్మిది రోజులు అమ్మవారిని ఆరాధించిన ఫలితం దక్కుతుంది.   అందుకే మూలా నక్షత్రం రోజు నుండి, విశేష పర్వదినాలుగా పరిగణిస్తారు.   ఈరోజు సప్త రూపాలలో ఉన్న అమ్మవారిని,  సప్త నామాలతో (చింతామణి, జ్ఞాన, నీలా, ఘట, ఖిణి, అంతరిక్ష, మహా సరస్వతి) పూజించాలి.   ప్రాణుల నాలుకపై నర్తించే బుద్ధి ప్రదాయిని.   వ్యాస మహర్షి ప్రతిష్ఠించిన సరస్వతీ క్షేత్రం బాసర క్షేత్రం.   బాసరలో తెల్లవారుజామున నాలుగు గంటలకే అభిషేకాలు చేస్తారు.   ఈ అభిషేకాన్ని దర్శించిన వారందరికీ సరస్వతీ కటాక్షం లభిస్తుంది.   ఇక్కడ చిన్న పిల్లలకి అక్షరాభ్యాసం చేస్తారు.   ఒకవేళ అక్కడ చేయించుకోలేకపోయినా (మరెక్కడైనా చేయించిన) సంవత్సరంలోపు బాసర దర్శించుకోవచ్చు. సరస్వతి ఆలయాలు గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో వేణుగోపాలస్వామి ఆలయంలో,  గుంటూరు గోరంట్లలో వెంకటేశ్వర స్వామి ఆలయం.. ఎదురు వీధిలో సాయిబాబా ఆలయ ప్రక్కన ఉన్నాయి.   బ్రాడీపేటలో, అగ్రహారంలో శారద (సరస్వతి) ఆలయాలు ఉన్నాయి.

       నవదుర్గా వైభవంలో భాగంగా,  శ్రీశైలంలో కాళరాత్రిగా పూజిస్తారు.   కాళరాత్రి అమ్మవారు నలుపు రంగులో ఉంటుంది.   కేశములు చెల్లాచెదురై (విరబోసుకుని) ఉంటుంది.   మెడలో హారం విద్యుత్ కాంతులు విరజిమ్ముతూ ఉంటుంది.   కన్నులు బ్రహ్మాండాలుగా ఉంటాయి.   నాసిక యొక్క శ్వాస, నిశ్ఛ్వాసలలో అగ్నిజ్వాలలు వస్తూ ఉంటాయి.   ఈమె వాహనం గార్ధభం(గాడిద).  నాలుగు చేతులతో ఉంటుంది.   కుడి చేతులలో వరముద్ర, అభయ ముద్ర, ఎడమచేతిలో ఇనుప ముళ్ళు కలిగిన ఆయుధం ఉంటుంది.   మరొక చేతిలో ఖడ్గం ఉంటుంది.   ఈ తల్లి స్వరూపం మిక్కిలి భయంకరంగా ఉంటుంది.   ఈ తల్లిని శుభంకరి అంటారు (ఎల్లప్పుడూ శుభాలను కలిగిస్తుంది.).  "దక్షిణ కాళీ" అని కూడా పిలుస్తారు.   ఈ తల్లి రూపాన్ని చూసి భయపడవలసిన అవసరంలేదు. కాళీమాతను స్మరించగానే భూత, ప్రేత, పిశాచాలు భయంతో పారిపోతాయి.   ఈమె అనుగ్రహంతో గ్రహ బాధలు దూరమవుతాయి (ముఖ్యంగా శనిగ్రహ బాధ.) ముఖ్యంగా కాళీ హృదయం స్తోత్రం చదువుకున్నా, శని గ్రహ దోషాలు తొలగిపోతాయి.   ఈ తల్లి కృప చేత సర్వ బాధలనుండి విముక్తులవుతారు.   ఈమె ఉపాసకులకి అగ్ని, జల, జంతువుల, శత్రువు, రోగాలు, రాత్రి భయాలు ఉండవు.   భయం లేకుండా అభయమిచ్చే తల్లి.   కాళరాత్రి మృత్యువుకే భయహారిణి.   యముడిని కూడా స్తంభింప చేయగలదు.   ఈ తల్లి మూలశక్తి కాల స్వరూపిణి.   పుట్టుక చేతనే నలుపు వర్ణం కలిగిన దేవత.  పరమేశ్వరుడు ఈ తల్లిని చూడగానే "కాళీ" అని సంభోదించారు.   అప్పుడే తల్లి (శివాని) శంభునితో పంతం పట్టి తపస్సు చేస్తే,  ఆ తపః ఫలితంగా తెల్లని స్వరూపం వచ్చింది.   ఆ తెల్లని స్వరూపమే మహా గౌరీదేవి..

      అమ్మ దయ వుంటే అన్నీ ఉన్నట్లే!!

నవదుర్గా వైభవం:నవరాత్రులలో ఆరవ రోజు తిథి షష్ఠి. శ్రీ మహాలక్ష్మీ దేవి


నవదుర్గా వైభవం:


నవదేవి,  నవదుర్గా వైభవంలో భాగంగా ఆరవ రోజు తిథి షష్ఠి.   ఈ రోజు విజయవాడలో అమ్మవారి అలంకారం శ్రీ మహాలక్ష్మీ దేవి.  శ్రీశైలంలో కాత్యాయనిగా పూజిస్తారు.    దసరా ఉత్సవాల్లో భాగంగా మైసూర్ లో కూడా లక్ష్మీదేవిగా పూజిస్తారు.   ఉత్తర భారతదేశంలో చండికగా పూజిస్తారు.   చండికాదేవిని పూజించడం వల్ల ఐశ్వర్యం (లక్ష్మి) కలుగుతుంది.   కుమారి పూజలో ఏడు సంవత్సరముల వయస్సుగల బాలికను పూజిస్తారు.

     నవదేవి అలంకారాల లో భాగంగా విజయవాడలో ఈ రోజు అమ్మవారి అలంకారం శ్రీ మహాలక్ష్మీదేవి.  "ధనం మూలం ఇదమ్ జగత్" అంటారు.   ధనాన్ని ప్రసాదించే దేవత లక్ష్మీదేవి.   తనని అగౌరవ పరచని చోట లక్ష్మీదేవి నివసిస్తుంది.   లక్ష్మీదేవికి మరొక పేరు చంచల. (స్థిరంగా ఉండనిది).  ఏకాగ్ర బుద్ధితో ఉంటే అమ్మ కరుణిస్తుంది.  ధనం ఉంది కదా! అని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, భవిష్యత్తులో బాధపడాలి.   వృక్షాలలో రావిచెట్టును పూజించాలి.   నైవేద్యంగా కేసరిబాత్ నివేదన చేయాలి. చదువుకోవలసిన స్తోత్రాలు, లక్ష్మీ అష్టోత్తరం,  లక్ష్మీ సహస్రనామ స్తోత్రం (లక్ష్మీ సహస్రనామాలు రెండు రకాలు ఉన్నాయి... మీకు నచ్చినవి చదువుకోవచ్చు..) కవచం, అష్టకం, (ఇది ప్రతిరోజూ 3సార్లు చదివితే దరిద్రం పోతుంది.) అష్టోత్తర శతనామ స్తోత్రం, లక్ష్మీ స్తోత్రం, లక్ష్మీ సూక్తం,  శ్రీసూక్తం చదువుకోవాలి.   ఈ రోజు అమ్మవారు కాళికాశక్తిగా చంఢముండాసురుని సంహరించింది. లలితా సహస్రనామాల్లో "మాహేశ్వరి మహాదేవి మహాలక్ష్మీ ర్మృఢప్రియా" అనే శ్లోకాన్ని చదువుకోవాలి.  "ఓం శ్రీ మహాలక్ష్మీ దేవతాయై నమః" అనే నామాన్ని జపించాలి.   దశమహావిద్యలలో కమలాత్మిక దశావతారాల్లో శ్రీకృష్ణుడిగా,  నవగ్రహాల్లో చంద్రుడిగా పూజిస్తారు.   లక్ష్మీదేవి గాయత్రీ మంత్రం "మహాదేవ్యైచ విద్మహే! విష్ణుపత్నైచ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్!!"  మహిషాసురుడు అనే రాక్షసుని సంహరించడం వల్ల 'మహిషమర్దనిగా' పేరు పొందింది. అష్టలక్ష్ముల రూపంల్లో వరాలిస్తుంది.   విజయవాడ కనకదుర్గ ఆలయంలో కూడ్య కోఫ్టాలలో చుట్టూరా అష్టలక్ష్మీ దేవతా విగ్రహాలు ప్రతిష్ఠించారు.   తలచినంతనే శరన్నవరాత్రులలో,  అష్టరూపాల్లో అష్టసిద్ధులు ప్రసాదించే తల్లి.   రెండు చేతులలో కమలాలు ధరించి, వరద, అభయ ముద్రలతో,  గజరాజులు తనను సేవించుచుండగా,  కమలం మీద ఆసీనురాలై దర్శనమిస్తుంది.   ఎవరి ఇంటి వాకిటి ముందైనా! ఆకుపచ్చ రంగు చీర ధరించి ఉన్న,  లక్ష్మీదేవి అమ్మవారి చిత్రపటాన్ని తలుపు పైన పెట్టుకోవాలి.   బయటకు వెళ్తున్నప్పుడు అమ్మవారు క్రింది నుండి వెళ్ళాలి.  దానివలన బయటకు వెళ్ళేటప్పుడు,  ఎటువంటి శకునం అడ్డు వచ్చినా సమస్య ఉండదు.   పూజామందిరంలో లక్ష్మీదేవి విగ్రహం గజరాజులు తొండాలతో ఎత్తి ఉన్నవి వుండాలి.   ఈ విగ్రహం ఇంట్లోకి చూస్తూ ఉండాలి. (బయటకి చూడకూడదు..) లక్ష్మీదేవి విగ్రహం పాలరాతిగాని,  వెండిది కానీ పెట్టుకుంటే ఇంకా మంచిది.   ఆదిదేవుడు పరమేశ్వరుడు చెప్పిన లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం,  ఇంద్రుడి చెప్పిన అష్టకం చదువుకోవాలి.   మానవుల దుఃఖాల్ని, దరిద్రాన్ని పోగొట్టి,  అష్టైశ్వర్యాలు ప్రసాదించే తల్లి.   అష్ట దరిద్రాలు పోవాలంటే! అష్టలక్ష్ముల రూపంలో (ధన- ధాన్య- ధైర్య- విజయ- విద్యా- సౌభాగ్య- సంతాన- గజలక్ష్ములు..) ఉన్న అమ్మవారిని పూజించాల్సిందే!   పూజామందిరంలో లక్ష్మీదేవి చిత్రపటం పక్కన,  తప్పనిసరిగా నారాయణుడి  పటం ఉంచాలి.   ఏ రూపంలో ఉన్నా పరవాలేదు.  (వెంకటేశ్వరుడు, విష్ణు).  అమ్మవారి ప్రక్కన అయ్యవారు లేకుండా,  పూజా మందిరంలో చిత్రపటం వుండకూడదు. దంపత సమేతంగా పూజిస్తేనే ఫలితం కలుగుతుంది.  లక్ష్మీ అష్టకం వారానికి 80 సార్లు పారాయణం చేస్తే,  అష్ట కష్టాలు తొలగిపోతాయి.  (రోజుకి 12 సార్లు) శని ప్రభావం నుంచి విముక్తి లభిస్తుంది.   శ్రీసూక్తం పారాయణం చేసి,  108 తామరపూలతో లక్ష్మీ అష్టోత్తరం చేయగలిగితే! చాలా మంచిది.  లక్ష్మీ దేవాలయాలు మన ఆంధ్రప్రదేశ్ లో ఒక్కటే ఉంది.   అది విశాఖపట్నం కనకమహాలక్ష్మి ఆలయం.   వైష్ణవ క్షేత్రాలు అన్నింటిలో అయ్యవారి ప్రక్కన అమ్మవారు ఉంటుంది. కాబట్టి లక్ష్మీదేవిని ఆయా ఆలయాల్లో కూడా పూజించవచ్చు. 

     నవదుర్గా వైభవంలో భాగంగా,  శ్రీశైలంలో కాత్యాయనిగా పూజిస్తారు.   (పూర్వకాలంలో కాత్యాయని అన్న నామాన్ని, చాలామంది తమ యింటి ఆడపిల్లలకి పెట్టేవారు..) ఈ తల్లి చతుర్భుజి, సింహవాహిని,  కుడిచేతిలో అభయముద్ర,  ఎడమచేతిలో ఖడ్గము, పద్మము,  వరముద్రతో విరాజిల్లుతూ ఉంటుంది.   కతుడు అనే ముని పుంగవుని ఆశ్రమంలో పుట్టి పెరగడం వల్ల,  కాత్యాయని అంటారు.   బ్రహ్మవేత్తల మనస్సు నందు సదా నివసించుట చేత,  కాత్యాయని అని పేరు.   సమస్త దేవతల తేజస్సు చేత ఆవిర్భవించినది కావున,  ఈ తల్లిని ఆరాధించే వారికి,  వేదవిజ్ఞాన సర్వస్వం లభిస్తుంది.   భాద్రపద బహుళ చతుర్దశి నాడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల తేజస్సుతో,  మహర్షి ఇంట కాత్యాయినీ ఉద్భవించింది.  ఆశ్వయుజ శుక్ల సప్తమి, అష్టమి, నవమి, తిథులయందు కాత్యాయని,  మహర్షి పూజలందుకుంది. మహిషాసురుడు అనే రాక్షసుడిని సంహరించింది.శ్రీకృష్ణుని పొందడం కోసం గోపికలు కాత్యాయనిని పూజించేవారు.   ఈ తల్లిని ఆరాధించిన వారికి అమోఘ ఫల ప్రదాయని.   చతుర్విధ పురుషార్ధాలు (ధర్మ- అర్థ- కామ- మోక్షాలు..) ప్రసాదించే ఫలదాయిని.   ఈ తల్లిని ఆరాధించడం వలన రోగం, శోకం, సంతాపం, భయం,  తొలగుటయే గాక జన్మజన్మాంతర పాపాలు నశిస్తాయి..

      అమ్మ దయ వుంటే అన్నీ ఉన్నట్లే!!

నవదుర్గా వైభవం:నవరాత్రులలో అయిదవరోజు తిథి పంచమి.లలితా త్రిపుర సుందరీ దేవి'

నవదుర్గా వైభవం:


నవదేవి,  నవదుర్గా వైభవంలో అయిదవరోజు తిథి పంచమి.   ఈ రోజు విజయవాడలో 'లలితా త్రిపుర సుందరీ దేవి' అలంకరణ.   మైసూర్ లో 'వారాహిదేవిగా' పూజిస్తారు.   వారాహిదేవి మహిమాన్వితమైన దేవత.  వారాహి చేసేవారి వాకిట ముందు నిలబడకూడదు అంటారు.   ఉత్తర భారతదేశంలో 'కాళికగా' పూజిస్తారు.  'క'కార కాళీ అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది.  కాళికా దేవిని పూజిస్తే, శత్రు వినాశనం జరుగుతుంది.

       నవదేవీ వైభవంలో భాగంగా ఈ రోజు విజయవాడలో "లలితా త్రిపుర సుందరీదేవి" అలంకారం.   లలిత త్రిపుర సుందరి అంటే,  లలితా సహస్రనామ పారాయణం గుర్తుకొస్తుంది.   దీనిని పారాయణం చేయమని ఎవ్వరూ చెప్పకపోయినా!! సహస్రనామ పారాయణం మహిళా మణులు అత్యంత భక్తి, శ్రద్ధలతో చదువుకుంటారు.   తొమ్మిదిరోజులు లలితా సహస్రనామ పారాయణం చేసేవారున్నారు.  అలా చేయలేకపోయినా (సమయం లేక) కనీసం ఈ రోజైనా లలితా సహస్రనామ పారాయణం చేయండి. సామూహికంగా పారాయణం చేస్తే చాలా మంచిది.  సామూహిక పారాయణానికి చాలా శక్తి ఉంటుంది,  మంచి ఫలితాలు ఉంటాయి.   ఈ రోజు అమ్మవారిని వృక్షాలలో చెరుకుగడను పూజించాలి.   నైవేద్యంగా "పెరుగన్నం" నివేదించాలి.   కుమారి పూజలో ఆరు సంవత్సరాల వయస్సు గల బాలికను పూజిస్తారు. నవరాత్రులలో మూలా నక్షత్రానికి--సరస్వతి: దుర్గాష్టమికి-- దుర్గాదేవి, మహిషాసురమర్దిని: మహర్నవమి,దశమికి-- రాజరాజేశ్వరీ దేవిని ఎలా పూజిస్తామో! ఈరోజు లలితా పంచమి కనుక,  లలితాదేవిని పూజించాలి.   బ్రహ్మాండపురాణంలో హయగ్రీవుడు అగస్త్య మహర్షికి చెప్పిన లలితా సహస్రనామ స్తోత్రం,  అష్టోత్తరం చదువుకోవాలి.  అంతేకాదు లలితా కవచం,  అష్టకం,  శతనామ స్తోత్రం, లలితా త్రిశతి నామ స్తోత్రం చదువుకోవాలి.   ఈ రోజు అమ్మవారు మంత్రశక్తిగా "అసురాసురుడు" అనే రాక్షసుడిని సంహరించింది.   లలితా సహస్రనామాల్లోని "ఓం శ్రీ శివా శివశక్త్యైక్య రూపిణీ లలితాంబిక" అనే శ్లోకం చదువుకోవాలి.   "ఓం శ్రీ లలితాసుందరి దేవతాయై నమః"  అనే మంత్రాన్ని జపించుకోవచ్చు.   దశమహావిద్యలలో త్రిపుర సుందరిగా (షోడశిదేవిగా), నవగ్రహాల్లో సూర్యునిగా, దశావతారాల్లో శ్రీరాముడిగా, శ్రీకృష్ణుడిగా పూజిస్తారు.   ఈరోజు చదువుకోవలసిన గాయత్రి మంత్రం "ఓం లలితా రూపాయ విద్మహే! మహాదేవ్యై చ ధీమహీ తన్నో దేవీ ప్రచోదయాత్!!" ఈ మంత్రాన్ని పారాయణ చేసుకోండి.   త్రిపుర త్రయంలో రెండవ శక్తి లలితాదేవి.   మొదటి శక్తి బాలా త్రిపుర సుందరిదేవి.   బ్రహ్మ, శివ, విష్ణు కన్నా పూర్వంనుంచి ఉంది కాబట్టి, త్రిపుర సుందరి అంటారు.   లలితా త్రిపుర సుందరిని "శ్రీచక్రానికి" అధిష్టాన దేవతగా పూజిస్తారు. పంచదశాక్షరీ మాత్రానికి దేవతగా కొలుస్తారు.  (పంచదశాక్షరీ మంత్రం చెప్పకూడదు... గురువు ద్వారా ఉపదేశం పొందాలి...) పూర్వకాలంలో విజయవాడలో అమ్మవారికి వామాచార పద్ధతిలో పూజలు చేసేవారు.   శంకరాచార్యులవారు "శ్రీచక్రాన్ని" ప్రతిష్టించిన తరువాత (శ్రీచక్రానికి అధిష్టాన దేవతగా... లలితాత్రిపురసుందరి) అప్పటివరకూ వామాచార పద్ధతిలో జరుగుతున్న పూజలు తొలగించి, దక్షిణాచార పద్ధతిలో పూజించడం ప్రారంభించారు.   అప్పటినుండి "శ్రీచక్రార్చన" ప్రారంభమైంది.   శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించక మందు "ఉగ్రచండిలా" ఉన్న దుర్గాదేవి,  "లలితాదేవిగా" పరమ శాంతమూర్తిగా పూజలందుకుంటుంది. (ఉగ్రచండిలా ఉన్న అమ్మవారిని చూడాలంటే భయపడేవారు.) అందువలన ప్రతినిత్యం లలితా అష్టోత్తరం,  లలితా సహస్రనామ పూజ చేస్తారు.   ఈ తల్లిని "సచామర రమావాణి విరాజిత" అంటారు.   అమ్మవారికి అటు లక్ష్మిదేవి, ఇటు సరస్వతిదేవి వింజామరతో విసురతూ ఉంటే,  చెరుకుగడ ధరించి అమ్మవారు, శివుని హృదయం మీద కూర్చొని ఉంటుంది.   గణపతి, సుబ్రహ్మణ్య స్వామి నమస్కరిస్తూ ఉంటారు.   త్రిపుర త్రయంలో రెండో శక్తిగా, ఇష్టసిద్ధిని ప్రాప్తింపచేసే లలిత అష్టోత్తర శతనామ స్తోత్రం ఉంది.   దీనిని పారాయణం చేస్తే ఇష్టసిద్ధి కలుగుతుంది. స్త్రీలు ప్రభుత్వ ఉద్యోగాల్లో, మంచి మంచి ఉన్నత హోదాల్లో ఉన్నవారు లలితా సహస్రనామ స్తోత్రం, ఖడ్గమాలా స్తోత్రం పారాయణం చేస్తే,  వారి కనుసైగలతోనే పనులు జరుగుతాయి.   క్రింది స్థాయి ఉద్యోగులు వీరి మాటకి విలువనిస్తారు.   ఎటువంటి భయం, భీతి ఉండదు.   ఉద్యోగం చేస్తున్న మహిళలు ఖచ్చితంగా లలితా సహస్రనామ పారాయణం చేయాల్సిందే!!  లలితా పరమేశ్వరి అనుగ్రహం వుంటే కనుక,  ఎటువంటి ఇతిబాధలు ఉండవు..

      నవదుర్గా వైభవంలో భాగంగా శ్రీశైలంలో ఈరోజు అమ్మవారిని "స్కందమాతగా" పూజిస్తారు.   స్కందుడు అనగా సుబ్రహ్మణ్యస్వామి, కార్తికేయుడు, శక్తిధరుడు, షణ్ముఖుడు అని అనేక పేర్లు ఉన్నాయి.   స్కందుడికి మాత కనుక, స్కందమాతగా దర్శనమిస్తుంది.   బాల స్కందుడిని (బాల సుబ్రహ్మణ్యస్వామిని)  కుడిచేతితో పట్టుకొని ఉంటుంది.   పిల్లలు పుట్టనివారికి, సర్పదోషం ఉన్నవారిని బాల సుబ్రహ్మణ్యుని పూజించమని చెప్తారు. ఈ తల్లికి నాలుగు చేతులు ఉంటాయి.   ఒక చేతిలో బాల సుబ్రహ్మణ్యుడు, ఒక చేతిలో పద్మం, కమలం, మరొక చెయ్యి అభయ ముద్ర కలిగి ఉంటుంది. ఈ తల్లి వాహనం సింహం (సింహవాహిని).  ఈ తల్లిని పూజించినవారికి సత్సంతానం కలుగుతుంది.  సర్పభీతి ఉండదు.   గర్భశుద్ధి కలుగుతుంది. 

           అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే!!

నవ దేవి(9 )అష్టోత్తరములు అమ్మవారి మొదటి అక్షరము తో 108 నామములు ఎక్కడ దొరకని 9 అష్టోత్తరములు పుస్తకాలు లో లభ్యం కానివి.

నవ దేవి(9 )అష్టోత్తరములు అమ్మవారి మొదటి అక్షరము తో 108 నామములు ఎక్కడ దొరకని 9 అష్టోత్తరములు పుస్తకాలు లో లభ్యం కానివి.

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS