Tuesday, October 20, 2020

నవదుర్గా వైభవం:నవరాత్రులలో ఏడవ రోజు తిథి సప్తమి సరస్వతి దేవి.


నవదుర్గా వైభవం:


   నవదేవి, నవదుర్గా వైభవంలో భాగంగా ఏడవ రోజు తిథి సప్తమి.   ఈ రోజు విజయవాడలో అలంకారం సరస్వతి దేవి.   మైసూరులో ఇంద్రాణిగా పూజిస్తారు. ఉత్తర భారతదేశంలో శాంభవిగా పూజిస్తారు.  ఈ తల్లిని పూజిస్తే,  శోక, దారిద్ర్య నాశనం జరుగుతుంది. సమరంలో (భవసాగరంలో) విజయం కలుగుతుంది.  శ్రీశైలంలో కాళరాత్రిగా పూజిస్తారు.   

        నవదేవి వైభవంలో భాగంగా విజయవాడలో సప్తమి తిథి, మూలా నక్షత్రం, సరస్వతి దేవి అలంకారం. ఈ సరస్వతి అలంకారం కోసం దసరా నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమవుతాయా!! అని ఎదురు చూస్తాం. నవరాత్రులలో చేసే అలంకారాలలో అత్యంత ప్రాధాన్యత కలిగిన అలంకారం సరస్వతి అలంకారం.   విజయవాడలో ఏ రోజు అమ్మవారిని దర్శించడానికి రానివారు, ఈరోజు ఖచ్ఛితంగా వస్తారు.   సరస్వతి అలంకారం బహు అరుదైన అలంకారం.  శైవంలో పార్వతి ఆలయాలు,  వైష్ణవంలో లక్ష్మి ఆలయాలు చాలా ఉంటాయి.   కానీ సరస్వతి ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయి. (ఉదా:- బాసర). కాబట్టి సరస్వతి దేవి అలంకారం దర్శించడానికి ఎక్కువమంది వస్తారు. విజయవాడలో సరస్వతి అలంకరణలో భాగంగా, అమ్మవారు ధవళ వస్త్రాలతో, స్వర్ణమయ వీణను ధరించి,  అత్యంత అద్భుతంగా కన్నుల పండుగగా దర్శనమిస్తుంది.   ఈ అలంకరణలో అమ్మవారిని ఒక్క క్షణం దర్శించిన,  జన్మ ధన్యం అయినట్లుగా భక్తులు భావిస్తారు.   అందుకోసమే ఎన్నో గంటలు క్యూలైన్లో నిలబడి మరి,  అమ్మవారిని దర్శించుకుంటారు.   ఈరోజు కుమారి పూజలో 8 సంవత్సరాల బాలికని పూజిస్తారు.   వృక్షాలలో బూరుగ వృక్షాన్ని పూజించాలి. నైవేద్యంగా శాకాన్నం (కూరగాయలతో వండినది.) నివేదించాలి.  ఈరోజు చదువుకోవలసిన స్తోత్రాలు సరస్వతి దేవి అష్టోత్తరం,  సహస్ర నామావళి,  కవచం, అష్టకం,  శతనామ స్తోత్రం.   ఈ రోజు అమ్మవారు పరాశక్తిగా 'నిషింబాసురుడు' అనే రాక్షసుడిని సంహరించింది.   లలితా సహస్రనామాల్లోని "సరస్వతీ శాస్త్రమయి గుహాంబా గుహ్యరూపిణి" అనే శ్లోకం చదువుకోవాలి.   జపించవలసిన నామం "ఓం శ్రీ సరస్వతి దేవతాయై నమః".   సరస్వతీ గాయత్రి మంత్రం "వాగ్ధేవ్యైచ విద్మహే! బ్రహ్మపత్నైచ ధీమహి తన్నో వాణి ప్రచోదయాత్!! అనే మంత్రాన్ని జపించాలి.  వీలుంటే "ఓం ఐం సరస్వత్యైనమః" అనే మూల మంత్రాన్ని జపించండి. విజయవాడలో మూలా నక్షత్రం రోజు, మహా సరస్వతి అలంకారం.   ఈ తల్లి సకల విద్యలను ప్రసాదిస్తుంది.   శాక్తేయులు విద్యల కొరకు సరస్వతిని, వైష్ణవులు హయగ్రీవుడిని,  శైవులైతే దక్షిణామూర్తిని ప్రార్ధిస్తారు.   శాక్తేయారాధన జరుగుతున్న నవరాత్రులలో సరస్వతిని ప్రార్థించాలి.   ఈ తల్లి జ్ఞాన దీపం వెలిగించే విద్యాశక్తి.   ఈ తల్లిని ఏడు రూపాలతో పూజిస్తారు. 1. చింతామణి సరస్వతి.. 2. జ్ఞాన సరస్వతి.. 3. నీలా సరస్వతి.. 4. ఘట సరస్వతి.. 5. ఖిణి సరస్వతి.. 6. అంతరిక్ష సరస్వతి.. 7. మహా సరస్వతి.. అని ఏడు రూపాలున్నాయి.  మూడవ అవతారం నీలా సరస్వతిని ఆరాధించేవారు చాలామంది ఉన్నారు.   ఈ తల్లిని తారాదేవి అంటారు.   ఆపదలు కలిగినప్పుడు ఉగ్రతారా రూపంలో కాపాడుతుంది.   నీలా సరస్వతి స్తోత్రం చదివితే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి.   నీలా సరస్వతి స్తోత్రం పారాయణం చేసి,  కవిత్వ సంపదలు, వాక్సుద్ధి పొందినవారు చాలామంది ఉన్నారు.   ఈ తల్లి ఏడు రూపాల గురించి మేరుతంత్రంలో ఉంటుంది.   "అమ్మలగన్నయమ్మ! ముగురమ్మల మూలపుటమ్మ!చాలపెద్దమ్మ! సురారులమ్మ! కడుపారెడి బుచ్చిన యమ్మ! తన్నులో నమ్మిన వేల్పుటమ్మల! మనంబున యుండెడి అమ్మ! దుర్గమాయమ్మ! కృపాబ్ది నిచ్చుత!మహిత్వ! కవిత్వ! పటుత్వ! సంపదల్ ! అనే పద్యం పోతన భాగవతంలోనిది.   ఈ ముగ్గురమ్మలలో మహా సరస్వతిని కలిపి మూలపుటమ్మ అన్నారు.   మహా సరస్వతి దేవి శంభు, నిశంభులనే రాక్షసులను సంహరించింది.  సరస్వతి రూపంలో దుర్గాదేవి వధించుట చేత, కనకదుర్గాదేవికి మహా సరస్వతిదేవి అలంకరణ చేస్తారు.   అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం రోజున, సరస్వతి అలంకారం జరుగుతుంది.  స్కాంద మహాపురాణంలో శరత్కుమార సంహితలో,  సకల విద్యా ప్రదాయిని సరస్వతి అష్టోత్తరం (సరస్వతి మహాభద్ర) ఉంది.   దీనిని రోజూ చదువుకున్నా మంచి ఫలితాలు వస్తాయి.   సకల విద్యలను,  పుత్రపౌత్రాభివృద్ధిని, వాక్సుద్ధిని, కవిత్వ రచనాశక్తిని అమ్మవారు ప్రసాదిస్తుంది.   నవరాత్రులలో మూలా నక్షత్రం రోజు నుండి (సప్తమి, అష్టమి, మహర్నవమి) మిగిలిన మూడు రోజులు ఎవరైతే అమ్మవారిని ఆరాధిస్తారో!  (ప్రతిరోజు చేయటానికి వీలు కుదరని వారు) వారికి తొమ్మిది రోజులు అమ్మవారిని ఆరాధించిన ఫలితం దక్కుతుంది.   అందుకే మూలా నక్షత్రం రోజు నుండి, విశేష పర్వదినాలుగా పరిగణిస్తారు.   ఈరోజు సప్త రూపాలలో ఉన్న అమ్మవారిని,  సప్త నామాలతో (చింతామణి, జ్ఞాన, నీలా, ఘట, ఖిణి, అంతరిక్ష, మహా సరస్వతి) పూజించాలి.   ప్రాణుల నాలుకపై నర్తించే బుద్ధి ప్రదాయిని.   వ్యాస మహర్షి ప్రతిష్ఠించిన సరస్వతీ క్షేత్రం బాసర క్షేత్రం.   బాసరలో తెల్లవారుజామున నాలుగు గంటలకే అభిషేకాలు చేస్తారు.   ఈ అభిషేకాన్ని దర్శించిన వారందరికీ సరస్వతీ కటాక్షం లభిస్తుంది.   ఇక్కడ చిన్న పిల్లలకి అక్షరాభ్యాసం చేస్తారు.   ఒకవేళ అక్కడ చేయించుకోలేకపోయినా (మరెక్కడైనా చేయించిన) సంవత్సరంలోపు బాసర దర్శించుకోవచ్చు. సరస్వతి ఆలయాలు గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో వేణుగోపాలస్వామి ఆలయంలో,  గుంటూరు గోరంట్లలో వెంకటేశ్వర స్వామి ఆలయం.. ఎదురు వీధిలో సాయిబాబా ఆలయ ప్రక్కన ఉన్నాయి.   బ్రాడీపేటలో, అగ్రహారంలో శారద (సరస్వతి) ఆలయాలు ఉన్నాయి.

       నవదుర్గా వైభవంలో భాగంగా,  శ్రీశైలంలో కాళరాత్రిగా పూజిస్తారు.   కాళరాత్రి అమ్మవారు నలుపు రంగులో ఉంటుంది.   కేశములు చెల్లాచెదురై (విరబోసుకుని) ఉంటుంది.   మెడలో హారం విద్యుత్ కాంతులు విరజిమ్ముతూ ఉంటుంది.   కన్నులు బ్రహ్మాండాలుగా ఉంటాయి.   నాసిక యొక్క శ్వాస, నిశ్ఛ్వాసలలో అగ్నిజ్వాలలు వస్తూ ఉంటాయి.   ఈమె వాహనం గార్ధభం(గాడిద).  నాలుగు చేతులతో ఉంటుంది.   కుడి చేతులలో వరముద్ర, అభయ ముద్ర, ఎడమచేతిలో ఇనుప ముళ్ళు కలిగిన ఆయుధం ఉంటుంది.   మరొక చేతిలో ఖడ్గం ఉంటుంది.   ఈ తల్లి స్వరూపం మిక్కిలి భయంకరంగా ఉంటుంది.   ఈ తల్లిని శుభంకరి అంటారు (ఎల్లప్పుడూ శుభాలను కలిగిస్తుంది.).  "దక్షిణ కాళీ" అని కూడా పిలుస్తారు.   ఈ తల్లి రూపాన్ని చూసి భయపడవలసిన అవసరంలేదు. కాళీమాతను స్మరించగానే భూత, ప్రేత, పిశాచాలు భయంతో పారిపోతాయి.   ఈమె అనుగ్రహంతో గ్రహ బాధలు దూరమవుతాయి (ముఖ్యంగా శనిగ్రహ బాధ.) ముఖ్యంగా కాళీ హృదయం స్తోత్రం చదువుకున్నా, శని గ్రహ దోషాలు తొలగిపోతాయి.   ఈ తల్లి కృప చేత సర్వ బాధలనుండి విముక్తులవుతారు.   ఈమె ఉపాసకులకి అగ్ని, జల, జంతువుల, శత్రువు, రోగాలు, రాత్రి భయాలు ఉండవు.   భయం లేకుండా అభయమిచ్చే తల్లి.   కాళరాత్రి మృత్యువుకే భయహారిణి.   యముడిని కూడా స్తంభింప చేయగలదు.   ఈ తల్లి మూలశక్తి కాల స్వరూపిణి.   పుట్టుక చేతనే నలుపు వర్ణం కలిగిన దేవత.  పరమేశ్వరుడు ఈ తల్లిని చూడగానే "కాళీ" అని సంభోదించారు.   అప్పుడే తల్లి (శివాని) శంభునితో పంతం పట్టి తపస్సు చేస్తే,  ఆ తపః ఫలితంగా తెల్లని స్వరూపం వచ్చింది.   ఆ తెల్లని స్వరూపమే మహా గౌరీదేవి..

      అమ్మ దయ వుంటే అన్నీ ఉన్నట్లే!!

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS