నవదుర్గా వైభవం:
నవదుర్గా వైభవంలో భాగంగా 10వ రోజు విజయదశమి పర్వదినం. విజయదశమి అనగానే ప్రతి ఒక్కరూ, ముహూర్తంతో సంబంధం లేకుండా పనులు ప్రారంభిస్తారు. ఎందుకంటే!! దసరా మహోత్సవాలలో 10 రోజు ఆశ్వయుజ శుద్ధదశమి (దశ అంటే పది). ఈరోజు పనులు ప్రారంభించినవారికి దశ తిరుగుతుందని, వారి జీవితాల్లో, వారిపనిలో దశ తిరిగి, విజయం పొందడానికి విజయదశమి చాలా మంచిరోజు. కాబట్టి మీ జీవితానికి సంబంధించి ఏదైనా చిన్న పని ప్రారంభించండి. మీకు అన్ని విజయాలు కలుగుతాయి.
ఈరోజు మైసూర్ లో, ఉత్తర భారతదేశంలో అపరాజితగా (పరాజయం లేనిది---నిత్యం విజయ స్వరూపిణి) పూజిస్తారు. శ్రీశైలంలో త్రిపుర సుందరిదేవిగా దర్శనమిస్తుంది.
నవదేవి వైభవంలో భాగంగా విజయవాడలో రాజరాజేశ్వరి దేవి అలంకారం. వృక్షాలలో జమ్మి చెట్టుని (శమీవృక్షం) పూజిస్తారు. నైవేద్యంగా చిత్రాన్నం, (పులిహోర) లడ్డూలు సమర్పించాలి. చదువుకోవలసిన స్తోత్రాలు: రాజరాజేశ్వరి దేవి అష్టోత్తరం, సహస్ర నామావళి, కవచం, అష్టకం, (అంబా-- శాంభవి-- చంద్రమౌళి--) శతనామ స్తోత్రం, రాజరాజేశ్వరి సహస్రనామ స్తోత్రం చదువుకోవాలి. లలితా సహస్రనామాల్లో "రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభా"అనే శ్లోకం చదువుకోవాలి. "ఓం శ్రీ రాజరాజేశ్వరి దేవతాయై నమః" అనే మంత్రం జపించుకోవచ్చు. రాజరాజేశ్వరి దేవి గాయత్రి మంత్రం "ఓం రాజరాజేశ్వరి రూపాయ విద్మహే! అంబికాయై ధీమ హి తన్నోమాతః ప్రచోదయాత్ "అనే మంత్రాన్ని జపించుకోవాలి. అమ్మవారు సింహాసనం మీద ఆసీనురాలై ఉంటుంది. షోడశ మహావిద్యా స్వరూపిణీ... మహా త్రిపురసుందరి... శ్రీచక్ర అధిష్టాన దేవత... శ్రీరాజరాజేశ్వరి అమ్మవారిని కొలిస్తే, శ్రీచక్రార్చన చేసినట్లే. విజయదశమి పండుగ అపరాజిత పేరుమీద వస్తుంది. పరాజయం లేకుండా విజయాన్ని సాధించేది కాబట్టి, విజయదశమి అయింది. విజయదశమి రోజు పరాజయంలేని అపరాజితాదేవిని.. శ్రీ రాజరాజేశ్వరీదేవిని... శ్రీచక్ర అధిష్టాన దేవత... షోడశ మహావిద్యా స్వరూపిణిని ఎవరైతే పూజిస్తారో! వారందరికీ ఖచ్చితంగా విజయం లభిస్తుంది. అమ్మవారు పరమశాంత స్వరూపంతో, సమస్త నిత్యామ్నయ పరివార సమేతంగా, మహా కామేశ్వరుడుని అంకంగా చేసుకొని, ఆది పరాశక్తి... మహా త్రిపురసుందరి... రాజరాజేశ్వరి దేవి... పరాభట్టారికాదేవి... శాంత స్వరూపంతో చిరునవ్వులు చిందిస్తూ, చెరకుగడను (ఇక్షుఖండం) ధరించి, ఒక చేతితో అభయ ముద్రతో దసరా మహోత్సవాలలో కన్నుల పండుగగా దర్శనమిస్తుంది. మణిద్వీప వర్ణనలో "శ్రీపురంలో చింతామణి "అనే గృహంలో నివసిస్తూ ఉంటుంది. శ్రీ రాజరాజేశ్వరీ దేవి అష్టోత్తరం, శతనామ స్తోత్రం "బ్రహ్మ యామణ తంత్రంలో" ఉంది. ఇది నిత్యం పారాయణ చేస్తే భోగభాగ్యాలు కలుగుతాయి. మీ దగ్గరలోని రాజరాజేశ్వరీ మాతని దర్శించిన, అష్టోత్తరం చదువుకున్నా అన్నింటా విజయం పొందుతారు. చెడుపై సాధించే విజయమే విజయదశమి. ముఖ్యంగా మన మనసులో ఉన్న చెడు ప్రవర్తన మార్చుకుని (చెడుపై సాధించిన విజయంగా..) విజయదేవిని, విజయదశమి రోజు పూజిస్తే సర్వ శుభాలూ కలుగుతాయి. ఈమె ఆది ప్రకృతి స్వరూపిణి. దుర్గ అయిన దుర్గాదేవి వివిధ కల్పాలలో, వివిధ రూపాలు ధరించి నానా దుష్టజనులని సహకరించి, లోకాలకి ఆనందం కలిగించింది. మహిమాన్విత అయిన శ్రీచక్ర అధిష్టాన దేవతయే... లలితా దేవతయే... శ్రీరాజరాజేశ్వరీ దేవి. ఈ తల్లి నివాసం "శ్రీమణిద్వీప-- శ్రీనగరస్థిత-- చింతామణి గృహం". ఈ తల్లి ఎక్కడ నివసిస్తుందో! అక్కడ అన్నీ శుభాలే!!!
అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే!!https://youtu.be/-soaNik6PAI
No comments:
Post a Comment