Tuesday, October 20, 2020

నవదుర్గా వైభవం:నవరాత్రులలో అయిదవరోజు తిథి పంచమి.లలితా త్రిపుర సుందరీ దేవి'

నవదుర్గా వైభవం:


నవదేవి,  నవదుర్గా వైభవంలో అయిదవరోజు తిథి పంచమి.   ఈ రోజు విజయవాడలో 'లలితా త్రిపుర సుందరీ దేవి' అలంకరణ.   మైసూర్ లో 'వారాహిదేవిగా' పూజిస్తారు.   వారాహిదేవి మహిమాన్వితమైన దేవత.  వారాహి చేసేవారి వాకిట ముందు నిలబడకూడదు అంటారు.   ఉత్తర భారతదేశంలో 'కాళికగా' పూజిస్తారు.  'క'కార కాళీ అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది.  కాళికా దేవిని పూజిస్తే, శత్రు వినాశనం జరుగుతుంది.

       నవదేవీ వైభవంలో భాగంగా ఈ రోజు విజయవాడలో "లలితా త్రిపుర సుందరీదేవి" అలంకారం.   లలిత త్రిపుర సుందరి అంటే,  లలితా సహస్రనామ పారాయణం గుర్తుకొస్తుంది.   దీనిని పారాయణం చేయమని ఎవ్వరూ చెప్పకపోయినా!! సహస్రనామ పారాయణం మహిళా మణులు అత్యంత భక్తి, శ్రద్ధలతో చదువుకుంటారు.   తొమ్మిదిరోజులు లలితా సహస్రనామ పారాయణం చేసేవారున్నారు.  అలా చేయలేకపోయినా (సమయం లేక) కనీసం ఈ రోజైనా లలితా సహస్రనామ పారాయణం చేయండి. సామూహికంగా పారాయణం చేస్తే చాలా మంచిది.  సామూహిక పారాయణానికి చాలా శక్తి ఉంటుంది,  మంచి ఫలితాలు ఉంటాయి.   ఈ రోజు అమ్మవారిని వృక్షాలలో చెరుకుగడను పూజించాలి.   నైవేద్యంగా "పెరుగన్నం" నివేదించాలి.   కుమారి పూజలో ఆరు సంవత్సరాల వయస్సు గల బాలికను పూజిస్తారు. నవరాత్రులలో మూలా నక్షత్రానికి--సరస్వతి: దుర్గాష్టమికి-- దుర్గాదేవి, మహిషాసురమర్దిని: మహర్నవమి,దశమికి-- రాజరాజేశ్వరీ దేవిని ఎలా పూజిస్తామో! ఈరోజు లలితా పంచమి కనుక,  లలితాదేవిని పూజించాలి.   బ్రహ్మాండపురాణంలో హయగ్రీవుడు అగస్త్య మహర్షికి చెప్పిన లలితా సహస్రనామ స్తోత్రం,  అష్టోత్తరం చదువుకోవాలి.  అంతేకాదు లలితా కవచం,  అష్టకం,  శతనామ స్తోత్రం, లలితా త్రిశతి నామ స్తోత్రం చదువుకోవాలి.   ఈ రోజు అమ్మవారు మంత్రశక్తిగా "అసురాసురుడు" అనే రాక్షసుడిని సంహరించింది.   లలితా సహస్రనామాల్లోని "ఓం శ్రీ శివా శివశక్త్యైక్య రూపిణీ లలితాంబిక" అనే శ్లోకం చదువుకోవాలి.   "ఓం శ్రీ లలితాసుందరి దేవతాయై నమః"  అనే మంత్రాన్ని జపించుకోవచ్చు.   దశమహావిద్యలలో త్రిపుర సుందరిగా (షోడశిదేవిగా), నవగ్రహాల్లో సూర్యునిగా, దశావతారాల్లో శ్రీరాముడిగా, శ్రీకృష్ణుడిగా పూజిస్తారు.   ఈరోజు చదువుకోవలసిన గాయత్రి మంత్రం "ఓం లలితా రూపాయ విద్మహే! మహాదేవ్యై చ ధీమహీ తన్నో దేవీ ప్రచోదయాత్!!" ఈ మంత్రాన్ని పారాయణ చేసుకోండి.   త్రిపుర త్రయంలో రెండవ శక్తి లలితాదేవి.   మొదటి శక్తి బాలా త్రిపుర సుందరిదేవి.   బ్రహ్మ, శివ, విష్ణు కన్నా పూర్వంనుంచి ఉంది కాబట్టి, త్రిపుర సుందరి అంటారు.   లలితా త్రిపుర సుందరిని "శ్రీచక్రానికి" అధిష్టాన దేవతగా పూజిస్తారు. పంచదశాక్షరీ మాత్రానికి దేవతగా కొలుస్తారు.  (పంచదశాక్షరీ మంత్రం చెప్పకూడదు... గురువు ద్వారా ఉపదేశం పొందాలి...) పూర్వకాలంలో విజయవాడలో అమ్మవారికి వామాచార పద్ధతిలో పూజలు చేసేవారు.   శంకరాచార్యులవారు "శ్రీచక్రాన్ని" ప్రతిష్టించిన తరువాత (శ్రీచక్రానికి అధిష్టాన దేవతగా... లలితాత్రిపురసుందరి) అప్పటివరకూ వామాచార పద్ధతిలో జరుగుతున్న పూజలు తొలగించి, దక్షిణాచార పద్ధతిలో పూజించడం ప్రారంభించారు.   అప్పటినుండి "శ్రీచక్రార్చన" ప్రారంభమైంది.   శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించక మందు "ఉగ్రచండిలా" ఉన్న దుర్గాదేవి,  "లలితాదేవిగా" పరమ శాంతమూర్తిగా పూజలందుకుంటుంది. (ఉగ్రచండిలా ఉన్న అమ్మవారిని చూడాలంటే భయపడేవారు.) అందువలన ప్రతినిత్యం లలితా అష్టోత్తరం,  లలితా సహస్రనామ పూజ చేస్తారు.   ఈ తల్లిని "సచామర రమావాణి విరాజిత" అంటారు.   అమ్మవారికి అటు లక్ష్మిదేవి, ఇటు సరస్వతిదేవి వింజామరతో విసురతూ ఉంటే,  చెరుకుగడ ధరించి అమ్మవారు, శివుని హృదయం మీద కూర్చొని ఉంటుంది.   గణపతి, సుబ్రహ్మణ్య స్వామి నమస్కరిస్తూ ఉంటారు.   త్రిపుర త్రయంలో రెండో శక్తిగా, ఇష్టసిద్ధిని ప్రాప్తింపచేసే లలిత అష్టోత్తర శతనామ స్తోత్రం ఉంది.   దీనిని పారాయణం చేస్తే ఇష్టసిద్ధి కలుగుతుంది. స్త్రీలు ప్రభుత్వ ఉద్యోగాల్లో, మంచి మంచి ఉన్నత హోదాల్లో ఉన్నవారు లలితా సహస్రనామ స్తోత్రం, ఖడ్గమాలా స్తోత్రం పారాయణం చేస్తే,  వారి కనుసైగలతోనే పనులు జరుగుతాయి.   క్రింది స్థాయి ఉద్యోగులు వీరి మాటకి విలువనిస్తారు.   ఎటువంటి భయం, భీతి ఉండదు.   ఉద్యోగం చేస్తున్న మహిళలు ఖచ్చితంగా లలితా సహస్రనామ పారాయణం చేయాల్సిందే!!  లలితా పరమేశ్వరి అనుగ్రహం వుంటే కనుక,  ఎటువంటి ఇతిబాధలు ఉండవు..

      నవదుర్గా వైభవంలో భాగంగా శ్రీశైలంలో ఈరోజు అమ్మవారిని "స్కందమాతగా" పూజిస్తారు.   స్కందుడు అనగా సుబ్రహ్మణ్యస్వామి, కార్తికేయుడు, శక్తిధరుడు, షణ్ముఖుడు అని అనేక పేర్లు ఉన్నాయి.   స్కందుడికి మాత కనుక, స్కందమాతగా దర్శనమిస్తుంది.   బాల స్కందుడిని (బాల సుబ్రహ్మణ్యస్వామిని)  కుడిచేతితో పట్టుకొని ఉంటుంది.   పిల్లలు పుట్టనివారికి, సర్పదోషం ఉన్నవారిని బాల సుబ్రహ్మణ్యుని పూజించమని చెప్తారు. ఈ తల్లికి నాలుగు చేతులు ఉంటాయి.   ఒక చేతిలో బాల సుబ్రహ్మణ్యుడు, ఒక చేతిలో పద్మం, కమలం, మరొక చెయ్యి అభయ ముద్ర కలిగి ఉంటుంది. ఈ తల్లి వాహనం సింహం (సింహవాహిని).  ఈ తల్లిని పూజించినవారికి సత్సంతానం కలుగుతుంది.  సర్పభీతి ఉండదు.   గర్భశుద్ధి కలుగుతుంది. 

           అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే!!

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS