Saturday, October 24, 2020

నవ దుర్గావైభవం:నవరాత్రులలో 9వ రోజు నవమి, మహర్నవమి మహిషాసుర మర్దిని


నవ దుర్గావైభవం:   

 
   నవదేవి, నవదుర్గా వైభవంలో  9వ రోజు నవమి, మహర్నవమి అంటారు.   మహర్నవమి చాలా పవిత్రమైన రోజు.   ఎందుకంటే?  దేవి ఉపాసకులు ఉపవాసాలుండి,  శ్రద్ధతో అమ్మవారిని అర్చించి, ధ్యానించి,  ఈ 9వ రోజున అమ్మవారి కృపా కటాక్షాలు కోసం ఎదురుచూసే రోజు.   9 రోజులలో ఏ రోజు చేయకపోయినా!! ఈ 3 రోజులు పూజ చేసినా (మూలా నక్షత్రం-- దుర్గాష్టమి-- మహర్నవమి--) అమ్మవారు కరుణిస్తుంది.   విజయవాడలో ఈ రోజు "మహిషాసుర మర్దిని" అవతారం.   శ్రీశైలంలో "సిద్ధిధాత్రిగా" పూజిస్తారు. ఈరోజు మైసూర్ లో అమ్మవారు "చాముండా దేవతగా" దర్శనమిస్తుంది.   ఉత్తర భారతదేశంలో సుభద్రగా (శ్రీకృష్ణుని సోదరి సుభద్ర కాదు..) దర్శనమిస్తుంది.   ఈమెని పూజించడం వల్ల వాంఛితార్థ సిద్ధి కలుగుతుంది.   కుమారి పూజలో 10 సం:ల వయస్సు గల బాలికని పూజిస్తారు. 
      నవదేవి వైభవంలో భాగంగా,  ఈ రోజు విజయవాడలో మహిషాసుర మర్దిని అవతారం.   ఈ తల్లి దర్శనం వల్లేకాదు, మనసులో ఒక్కసారి స్మరించుకున్నా శత్రు వినాశనం జరుగుతుంది.   వృక్షాలలో దేవగన్నేరు వృక్షాన్ని పూజిస్తారు.   నైవేద్యంగా పాయసం (చిట్టచివరి రోజు కనుక..) నివేదించాలి. చదువుకోవలసిన స్తోత్రాలు:  మహిషాసుర మర్దిని అష్టోత్తరం, సహస్ర నామావళి,  కాళీ కవచం,  కాళీ అష్టకం, (మహాకవి కాళిదాసు రచించిన..) కాళీ శతనామస్తోత్రం,  కాళీ స్తోత్రం (ఋషులు, దేవతలు రచించిన..) కాళీ సహస్రనామ స్తోత్రం, ( 'క' కార కాళీ మాత్రం కాదు..) మహిషాసుర మర్దిని స్తోత్రం (అయిగిరి నందిని..) పారాయణ చేసుకోవాలి.   ఈ రోజు లలితా సహస్రనామాల్లోని "అపర్ణా చండికా చండముండాసుర నిషూదిని" శ్లోకాన్ని పారాయణ చేసుకోవాలి.  " ఓం శ్రీ మహిషాసురమర్ధిని దేవతాయై నమః" అనే నామాన్ని జపించుకోవచ్చు.   మహిషాసుర మర్దిని గాయత్రి మంత్రం "ఓం మహిషాసురమర్ధిని రూపాయ విద్మహే! పరమాత్మికాయై ధీమహి తన్నో పూర్ణః ప్రచోదయాత్" అనే మంత్రాన్ని జపించుకోవాలి.   సప్తశతిలో దుర్గాదేవి అష్ట భుజాలతో మహిషాసురుణ్ణి సంహరించి,  సింహవాహిని శక్తిగా వికటాట్టహాసం చేసింది.   మహిషాసురుడి సేనాధిపతులైన చిక్షిలుడు, చామరుడు, ఉదదృడు, బాష్కలుడు, విడాలుడు అనే సైన్యాధ్యక్షులందరిని సంహరించి,  చివరగా మహిషాసురుణ్ణి సంహరించి,  మహిషాసురమర్దిని అయింది.   సింహవాహనం మీద "ఆలీడా పాదపద్ధతిలో", ఒక చేతిలో త్రిశూలాన్ని ధరించి, మహిషాసురుని సంహరించింది.   ఈమె అష్టోత్తర శతనామ స్తోత్రం భక్తులు పారాయణం చేస్తే,  శత్రు బాధలు,  దత్త గ్రహబాధలనుండి విముక్తి కలగటమే కాక, మనసులో ఉన్న భయాన్ని పోగొట్టి,  ధైర్యాన్ని ప్రసాదిస్తుంది.   ఇంద్రాది దేవతలు మహిషాసురుడి వల్ల అనేక కష్టాలు అనుభవించారు.   అప్పుడే ఇంద్రాది దేవతలు తమ తమ శరీరాల్లోని దివ్యతేజస్సు లన్నింటిని బయటికి తీసుకొచ్చి,  ఆ తేజస్సుకి ఒక రూపాన్నిచ్చారు. ఆ మూర్తి యొక్క రూపమే మహిషాసురమర్దిని.   ఆ తేజోమూర్తికి తమ ఆయుధాలను సమర్పించారు.  తండ్రిగారైన హిమవంతుడు ఒక సింహాన్ని సమర్పించాడు.   (దుర్గాదేవి శార్దూల వాహినిగా (పులి) దుర్గముడు అనే రాక్షసుడిని సంహరించింది... మహిషాసురమర్దిని సింహవాహినిగా మహిషాసురుని సంహరించింది...) ఈ తల్లి మహిషాసురుడి సైన్యాధిపతులను సంహరించి,  ఆ తర్వాత మహిషాసురుడిని అవలీలగా సంహరించి,  అదే స్వరూపంతోటి ఇంద్రకీలాద్రి మీద వెలసింది.   కాలక్రమంలో "కనకదుర్గగా" భక్తులకు కొంగుబంగారం అయింది.   అందుకే ఈ శరన్నవరాత్రులలో మహిషాసుర మర్దిని అవతారం,  సింహవాహనం మీద ఆలీడా పాదపద్ధతిలో, ఒక చేతిలో త్రిశూలాన్ని ధరించి, మహిషాసురుడిని సంహరిస్తున్న రూపంలో దర్శనమిస్తుంది.   గుంటూరు జిల్లాలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి.   కంఠంరాజు కొండూరులో మహంకాళిగా,  చందోలులో బండ్లమ్మ తల్లిగా (భగళాముఖి),  అమీనాబాద్ లో కొండపైన మూలాంకురేశ్వరిగా (వరంగల్ లో భద్రకాళిగా) దర్శనమిస్తుంది.   వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయాల్లో ఈ అవతారంతో దర్శనమిస్తుంది.   ఇవన్నీ మహిషాసురమర్ధిని స్వరూపాలే.   మహిషాసుర మర్దిని "కాళీగా" ఉద్భవించిన తల్లి. 
     నవదుర్గా వైభవంలో భాగంగా,  ఈరోజు శ్రీశైలంలో అమ్మవారు సిద్ధిధాత్రిగా దర్శనమిస్తుంది.   ఈ తల్లి సర్వ సిద్ధులను ప్రసాదిస్తుంది.   పరమేశ్వరుడు సర్వసిద్ధులను దేవికృప వల్లనే పొందాడని దేవీపురాణంలో ఉంటుంది. ఈ తల్లి శివుని పతిగా పొందడమే కాక!  తన శరీరంలోని అర్ధభాగాన్ని ఆ పరమేశ్వరుడుకిచ్చి "అర్ధనారీశ్వరిగా" అవతరించింది.   ఈ తల్లి చతుర్భుజి,  సింహవాహిని.  కుడివైపు చేతిలో చక్రం, గద ధరిస్తుంది.   ఎడమచేతిలో శంఖాన్ని, కమలాన్ని ధరిస్తుంది.   ఈ తల్లి కమలం మీద కూర్చొని ఉంటుంది.   ఈమెని ఆరాధించేవారికి సర్వ సిద్ధులు కరతలామలకం.   ఈమె కృపచేతనే భక్తుల--, సాధకుల--,  లౌకిక, పారమార్థిక, మనోరథాలు తీరతాయి.   ఈ తల్లి కృపకు పాత్రుడైన భక్తుడికిగానీ, ఉపాసకుడుకిగాని కోరికలు ఏవి మిగలవు? (కుంతీదేవి కోరికలు లేని స్థితిని,  కష్టాలనే ప్రసాదించమని శ్రీకృష్ణుని అర్థించింది.. ఎందుకంటే!! కష్టాల్లోనే భగవంతుడు చెంతనే ఉంటాడు కనుక...) అలాంటివారికి అమ్మవారి సన్నిధే సర్వసోపానం.   ఈ అమ్మవారి స్మరణ,  ధ్యాన, పూజ వల్ల సంసారం నిస్సారమన బోధపడుతుంది. పరమానంద పరమైన అమృత పదాన్ని (మోక్షాన్ని) పొందుతారు.   ఈ తల్లి అణిమాది అష్టసిద్ధులనే కాక మోక్షాన్ని ప్రసాదించేది.   లౌకిక, అలౌకిక, సర్వార్థ సిద్ధులకు అధిష్టాన ధాత్రి... "సిద్ధిధాత్రి"..
       అమ్మ దయ వుంటే అన్నీ ఉన్నట్లే!!https://youtu.be/3SCUrkAqMwk

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS