నల్గొండ జిల్లాలో వాడపల్లి, మట్టపల్లి. గుంటూరు జిల్లాలో మంగళగిరి. కృష్ణాజిల్లాలో కేతవరం, వేదాద్రి పంచ నరసింహక్షేత్రాలుగా ప్రసిద్ధి. ఈ పంచ నరసింహ క్షేత్రాలు ప్రత్యేకత ఏమిటంటే!.. వాడపల్లి మట్టపల్లిలో ఓకే నరసింహస్వామి కనిపిస్తారు. మంగళగిరిలో కొండ క్రింద, కొండపైన రెండు చోట్ల లక్ష్మీనరసింహస్వామి కనిపిస్తారు. కేతవరంలో కొండపైన, కొండ క్రింద, నదీతీరాన మూడు చోట్ల లక్ష్మీనరసింహస్వామి కనిపిస్తారు. వేదాద్రిలో ఐదు చోట్ల ఐదు రూపాయలలో కనిపిస్తారు. స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రంలో సమయంలో ఈ స్వామి వారిని దర్శిస్తే శత్రు వినాశనం, నరఘోష నివారణ జరుగుతుంది. రాహు మహర్దశ, రాహు అంతర్దశ జరుగుతున్నవాళ్ళు తప్పనిసరిగా ఈ క్షేత్రాలు దర్శించాలి. రాహువు నీచస్థితిలో ఉన్న, నవగ్రహాలలో ఏ గ్రహంతోనైనా కలిసి ఉన్నా, (ఒక్క కేతు గ్రహంతో కలవరు) ఈ నరసింహ క్షేత్ర దర్శనం చాలా మంచిది. లక్ష్మీ నరసింహస్వామి ఉగ్ర అవతారం. భక్తుల రక్షణ నిమిత్తం అవతరించిన అవతారం...
శ్లో: ఉగ్రం, వీరం, మహావిష్ణుం, జలంతం సర్వతో ముఖం!... నృసింహ, భీషణం, భద్రం, మృత్యోర్ముత్యు నమామ్యహం!!...ఈ శ్లోకాన్ని నిత్యం చదువుకునే భక్తులు (108 సార్లు) ఉన్నారు. ఈ శ్లోకానికి బీజాక్షరాలు కలిపితే నృసింహ మంత్రం అవుతుంది.
1.) వాడపల్లి:- ఇది నల్గొండ జిల్లా దామరచర్ల మండలం మిర్యాలగూడ దక్షిణ భాగాన సుమారు 20 కి.మీ. దూరంలో వాడపల్లి గ్రామం ఉంది. దీనినే "వజీరాబాద్" అని కూడా పిలుస్తారు. వాడపల్లి బస్ స్టేషన్ నుంచి ఒకటిన్నర కి.మీ. దూరంలో కృష్ణా, మూసీ నదీ సంగమం ఉంది. ఆ మధ్యలోనే లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంది. ఇక్కడ ఈ ఆలయం దక్షిణాభిముఖంగా ఉంటుంది. ప్రధానాలయం, ప్రవేశమండపం, ముఖమండపం, అంతరాలయం, గర్భాలయాలను కలిగివుంది. గర్భాలయంలో స్వామివారిని దర్శించుకుంటారు. లక్ష్మీ నరసింహ స్వామి చతుర్భుజుడు. ఉగ్రావతారంగా దర్శనమిస్తారు. స్వామివారి వామిఖ భాగంలో లక్ష్మీదేవిని దర్శించగలం. ఇక్కడ విశేషమేమంటే! గర్భాలయంలోని మూలవిరాట్టుకు దగ్గరలో రెండు దీపాలు ఉంటాయి. ఒక దీపం బొడ్డు దగ్గర నిశ్చలంగా వెలుగుతుంది. మరొక వైపు ముక్కు దగ్గర మిణుకుమిణుకు మంటూ చలిస్తూ ఉంటుంది. స్వామివారి ఉచ్ఛ్వాస,నిశ్ఛ్వాసల ప్రక్రియలో భాగంగానే జ్యోతి కదులుతుందని భక్తుల విశ్వాసం. అందుకే ఈ ప్రాంతంవారు స్వామిని "దీపాలయ్య" అని పిలుస్తారు. స్వామివారికి నిత్య ఉత్సవాలతో పాటు మాఘమాసంలో కల్యాణోత్సవం, నృసింహజయంతి, తొలిఏకాదశి, వైకుంఠ ఏకాదశి, భీష్మ ఏకాదశి మొదలైన పర్వదినాలలో విశేషమైన పూజలు జరుగుతాయి. ఇక్కడ కృష్ణా, మూసీనదుల సంగమంలో ఉన్న స్వామికి దగ్గరలో "మీనాక్షి అగస్తేశ్వరాలయం" ఉంది. నరసింహ క్షేత్రాలు అన్నింటి దగ్గర ఒక్కొక్కచోట ఒక్కొక్క పేరుతో శివాలయాల వుండటం విశేషం. పిడుగురాళ్ళ, మిర్యాలగూడ మధ్యలో వాడపల్లి ఉంది. ఇండియన్ సిమెంట్ ఫ్యాక్టరీ వైపు తూర్పు భాగాన వాడపల్లి గ్రామం వస్తుంది. దాచేపల్లి, నడికుడి జంక్షన్ నుండి కూడా రవాణా సదుపాయం ఉంది. దాచేపల్లి నుండి 15 కి.మీ. దూరంలో ఉంది.
2.) మట్టపల్లి:- నల్గొండ జిల్లాలో హుజూర్ నగర్ పట్టణానికి 25 కి.మీ. దూరంలో కృష్ణానదీ తీరాన మట్టపల్లి ఉంది. ఇక్కడ స్వామిని "యోగానంద లక్ష్మీ నరసింహస్వామి" అంటారు. స్వామి నదియందు గుహలో స్వయంభూగా వెలిశారు. ఇక్కడ విగ్రహం లేదు. స్వామి యొక్క చతుర్భుజాలలో శంఖు,చక్రాలు వరద, అభయ ముద్రలు ఉంటాయి. మూలవిరాట్టు శిరస్సుపై ఆదిశేషుడుని కూడా దర్శించుకోవచ్చు. నరసింహస్వామి ఎడమవైపు రాజ్యలక్ష్మీ తాయారు అమ్మవారు కొలువై ఉంది. స్వామివారి గుహాలయం పశ్చిమాభిముఖంగా ఉంటుంది. అద్దాల మండపం, పవళింపు సేవా మందిరం, కల్యాణకట్ట, ప్రసాద విక్రయశాల, సామాన్లు భద్రపరిచే గదులు ఉన్నాయి. స్వామివారికి నిత్య అర్చనలతో పాటు నృసింహ జయంతి, వైశాఖ శుద్ధ చతుర్దశినాడు కల్యాణోత్సవం చేస్తారు. వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం రోజు విశేషమైన పూజలు నిర్వహిస్తారు. ఈ వైష్ణవ క్షేత్రంలో అన్ని రకాల కులాల వారికి సత్రాలు ఉన్నాయి. నిత్యాన్నదానం, వృద్ధాశ్రమం, టీటీడీ కల్యాణమండపం మొదలగు వసతి సదుపాయాలు అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఉన్న శివాలయం రామలింగేశ్వరాలయం. మట్టపల్లిలో ఉన్న స్వామివారికి ప్రదక్షిణలకే ప్రాముఖ్యత ఇస్తారు. ఇక్కడ 11 సార్లు ప్రదక్షిణలు చేస్తే కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. కొంతమంది 108 ప్రదక్షిణలు చేస్తారు.3.) వేదాద్రి:- కృష్ణాజిల్లాలో ఉన్న వేదాద్రికి ఒక విశేషం ఉంది. ఇక్కడ 5 రూపాలలో లక్ష్మీనరసింహస్వామి కనిపిస్తారు. కృష్ణాజిల్లా జగ్గయ్యపేటకి 18 కి.మీ. దూరంలో పవిత్రమైన కృష్ణానదీ తీరాన వేదాద్రి ఉంది. పురాణకాలం నుంచీ నదీగర్భంలో వేంచేసిన పురాణ పురుషులు కలియుగమునందు వేదాచలం రూపంలో బహిర్గతమయ్యారు. వేదపురుషుల కోరిక మన్నించి శ్రీమన్నారాయణుడు పంచ నారసింహ మూర్తులుగా వేదాద్రిలో వెలిసారు. వేదాద్రి శిఖరమునందు జ్వాలా లక్ష్మీ నరసింహస్వామిగా, శిఖరం పాదాలవద్ద యోగానంద లక్ష్మీ నరసింహస్వామిగా, కృష్ణానదీ గర్భమునందు సాలగ్రామ లక్ష్మీనరసింహస్వామిగా, యోగానంద లక్ష్మీ నరసింహస్వామివారి పీఠంపై భోగాంశ లక్ష్మీనరసింహస్వామిగా, గరుడాచలంనందు వీర లక్ష్మీ నరసింహస్వామిగా 5 రూపాలలో దర్శనమిస్తారు. పంచ లక్ష్మీ నరసింహమూర్తుల దర్శనభాగ్యం మోక్ష ప్రదాయకం. వేదాద్రి శిఖర ముందు జ్వాలా లక్ష్మీ నరసింహమూర్తి స్వయంభూమూర్తి. వీరిని దర్శించుకోవాలంటే కొండపైకి 250 మెట్లు ఎక్కాలి. క్షేత్రపాలకుడైన విశ్వేశ్వరాలయం పక్కనుండి కొండపైకి మెట్లకి దారి ఉంది. స్వామికి నిత్యం ధూప, దీప, నైవేద్యాలు జరుగుతూ ఉంటాయి. స్వామివారి ఉత్సవాలు కొండక్రింది భాగంలో యోగానంద లక్ష్మీ నరసింహ ఆలయంలో నిర్వహిస్తూ ఉంటారు. కొండ దిగువున ఆలయప్రాంగణం చాలా విశాలంగా తూర్పు, పశ్చిమాభిముఖంగా 5 అంతస్థుల గాలిగోపురంతో ఉంటుంది. మధ్యలో యోగానంద లక్ష్మీ నరసింహ ఆలయం పశ్చిమాభిముఖంగా ఉంటుంది. ఆలయ ప్రవేశ మార్గం దక్షిణాభిముఖంగా ఉంటుంది. గర్భాలయం, అంతరాలయం, ముఖమండపం కూడా కనిపిస్తాయి. రాజ్యలక్ష్మీతాయారు అమ్మవారు మరియు ఆండాళ్ అమ్మవార్ల సన్నిధులు కనిపిస్తాయి. ధ్వజస్తంభం, గరుడ ఆళ్వార్లని కూడా దర్శించుకోవచ్చు. గర్భాలయంలో చతుర్భుజుడై స్వామి శంఖు,చక్రాలతో రెండు చేతులూ మోకాళ్ళ మీద ఉంచుకొని, యోగముద్రలో ఉంటారు. అందుకే యోగానంద లక్ష్మీనరసింహస్వామిగా పిలుస్తారు. వైఖానస ఆగమశాస్త్ర ప్రకారం నిత్య అర్చనలు, హోమాలు జరుగుతూ ఉంటాయి. వైశాఖ శుద్ధఏకాదశి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమై, పౌర్ణమినాడు కల్యాణోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. పశ్చిమలో గాలిగోపురం ఎదురుగా సాలగ్రామ లక్ష్మీనరసింహస్వామి తీర్థంఉంది. భక్తులు ముందుగా తీర్థంలో స్నానమాచరించి నదీగర్భంలో ఉన్న సాలగ్రామ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుంటారు. వాయుమూలములో ఉన్న పార్వతి సమేత విశ్వేశ్వర ఆలయాన్ని దర్శించుకోవచ్చు. మెట్ల ద్వారా కొండపైన ఉన్న జ్వాలా లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవచ్చు. ఆ తర్వాత యోగానంద లక్ష్మీ నరసింహ స్వామిని అర్చిస్తారు. పీఠంపై గల భోగాంశ లక్ష్మీనరసింహ స్వామిని కూడా దర్శించుకోవచ్చు. వేదాద్రికి 5 కి.మీ. దూరంలో గరుడాచలం ఉంది. ఇక్కడ వీర లక్ష్మీనరసింహ స్వామిని దర్శిస్తారు. ఎక్కువ మంది భక్తులు ఈ నాలుగు లక్ష్మీనరసింహస్వామి మూర్తులనే దర్శించుకుంటారు. గరుడాచలం ప్రయాసతో కూడినది కనుక, ఎక్కువమంది దర్శించుకోరు. భక్తులు గరుడాచలంలో ఉన్న ఈ వీర లక్ష్మీ నరసింహస్వామిని కూడా దర్శించుకోవడానికి ప్రయత్నం చేయండి. వేదాద్రి లో విశ్రాంతి కొరకు సత్రాలు, టి.టి.డి వారి సత్రాలు ఉన్నాయి. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి మీద, విజయవాడకు 70 కి.మీ దూరంలో చిల్లకల్లు జంక్షన్ నుండి, 3 కి.మీ. దూరంలో వేదాద్రి ఉంది. జగ్గయ్యపేట నుండి 18 కి.మీ. దూరంలో వేదాద్రిని దర్శించుకోవచ్చు. వేదాద్రిని దర్శించుకున్నవారు తిరుమలగిరి, పెనుగంచిప్రోలు లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారిని కూడా దర్శించుకుంటారు. ఈ మూడు క్షేత్రాలను ఏకకాలంలో దర్శించుకోవచ్చు..
5.) కేతవరం:- కేతవరం బెల్లంకొండ అటవీ ప్రాంతంలో నిర్మానుష్య ప్రాంతంలో ఉంటుంది. కనుక కొంతమంది భక్తులు మాత్రమే దర్శిస్తారు. ఇక్కడ మూడు రూపాలలో లక్ష్మీ నరసింహస్వామి దర్శనమిస్తారు. ఈ 5 క్షేత్రాలని పంచ నారసింహ క్షేత్రాలుగా పిలుస్తారు. భక్తులు ఈ క్షేత్రాలను దర్శించుకోవావాలని,... ఆ లక్ష్మీనరసింహ స్వామివారి ఆశీస్సులు మీకు లభించాలని కోరుకుంటూ......https://youtu.be/g7obFMEgXDw
No comments:
Post a Comment