Saturday, October 17, 2020

తెలుగు రాష్ట్రాలలో ఉన్న నవగ్రహ క్షేత్రాల నవగ్రహ ఆరాధన: తెలుగు రాష్ట్రాలలో కూడా నవగ్రహ సంబంధిత క్షేత్రాలు చాలా ఉన్నాయి

 నవగ్రహ ఆరాధన:

తెలుగు రాష్ట్రాలలో ఉన్న నవగ్రహ క్షేత్రాల గురించి తెలుసుకుందాం. చాలామంది నవగ్రహ క్షేత్రాలకు వెళ్లాలంటే తమిళనాడు వెళ్లాలి, తమిళనాడులోనే నవగ్రహ క్షేత్రాలు చూడాలని చెబుతారు. కానీ తెలుగు రాష్ట్రాలలో కూడా నవగ్రహ సంబంధిత క్షేత్రాలు చాలా ఉన్నాయి. ఈ విషయాలన్నీ కూడా "నవగ్రహ ఆరాధన" అనే పుస్తకంలో ఉన్నాయి. భక్తులు ఆ పుస్తకాన్ని చదవడానికి ప్రయత్నం చేయండి. నవగ్రహ క్షేత్రాలలో మొట్టమొదటిది.....
1). రవి:- రవికి సంభందించిన క్షేత్రాలు:
1). అరసవెల్లి:- శ్రీకాకుళం జిల్లా అరసవిల్లిలో ఆదివారం రోజు సూర్యనారాయణుడి దర్శనం కోసం కొన్ని వేల మంది వస్తారు. ఇక్కడ రథసప్తమి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయి. అరసవెల్లి క్షేత్రంలో సూర్య నమస్కారం పూజ చేయించుకోవచ్చు. ఆరోగ్యం, ఐశ్వర్యం కావాలన్నా రవి అనుగ్రహం కావాలి. రవి అనుగ్రహం కావాలంటే అరసవెల్లి క్షేత్రం దర్శించాలి. ముఖ్యంగా ఆదివారం దర్శిస్తే ఆరోగ్యం, ఐశ్వర్యం లభిస్తాయి. ఈ క్షేత్రం శ్రీకాకుళానికి కొద్ది దూరంలో ఉంది. రైలు, బస్సు ద్వారాగాని శ్రీకాకుళం చేరుకుని, అక్కడి నుండి అరసవెల్లి క్షేత్రం చేరుకోవచ్చు. అక్కడ సూర్య నమస్కార పూజ చేయించుకోవాలంటే చాలా అదృష్టం ఉండాలి. ఈ పూజ చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి.
2). గొల్లల మామిడాడ:- తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న దీనినే జి.మామిడాడ అంటారు. ఈ క్షేత్రంలో కూడా వైష్ణవ సంప్రదాయంగా రవిని అర్చిస్తూ ఉంటారు. ఆదివారం కానీ, మిగిలిన రోజులలో కానీ దర్శించవచ్చు. ఈ క్షేత్రానికి రాజమండ్రి నుండి బస్సులో వెళ్ళవచ్చు.
3). తిరుచానూరు:- తిరుపతి తిరుచానూరు పద్మావతి అమ్మవారి దేవస్థానంలో కొలను పక్కనే, చిన్న సూర్య దేవాలయం ఉంది. ఇందులో స్వామి నిల్చొని దర్శనమిస్తారు.
4). విజయవాడ:- విజయవాడ పోరంకిలో సూర్య దేవాలయం ఉంది. చిన్నదే అయినా మహిమగల దేవాలయం. పెద్దాపురంలో కూడా రవికి సంబంధించిన దేవాలయం వుంది.
రవికి సంబంధించిన అధిష్ఠాన దేవత శ్రీ మహావిష్ణువు. శ్రీ మహావిష్ణువుకి సంబంధించిన క్షేత్రాలు చాలా ఉన్నాయి. నారాయణ అనే పేరుతో మూడు క్షేత్రాలు ఉన్నాయి. అవే భావన్నారాయణ స్వామి క్షేత్రాలు. ఒక్క భావనతో స్వామి ప్రత్యక్షమయ్యే క్షేత్రాలు.
ఈ భావన్నారాయణ స్వామి క్షేత్రాలు, పొన్నూరు, బాపట్ల, సర్పవరంలో ఉన్నాయి. గుంటూరు జిల్లాలో పొన్నూరు, బాపట్ల 30 కి.మీ. దూరంలో దగ్గర దగ్గరగా ఉన్నాయి. కనుక ఈ రెండు క్షేత్రాలు ఒకేసారి దర్శించుకోవచ్చు. సర్పవరం తూర్పుగోదావరి జిల్లా కాకినాడ దగ్గరలో ఉంది. సర్పవరం భావన్నారాయణ స్వామి అద్భుతమైన క్షేత్రం. కృష్ణాజిల్లాలో శ్రీకాకుళం అనే ఊరు ఉంది (శ్రీకాకుళం జిల్లా కాదు..). ఇక్కడ శ్రీకాకుళంలో శ్రీకాకుళాంధ్ర మహావిష్ణు దేవాలయం ఉంది. సాలగ్రామ దండతోటి అలరారుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా రవి గ్రహానికి సంబంధించిన క్షేత్రాలు.
2). చంద్రుడు:- చంద్ర గ్రహానికి సంబంధించిన క్షేత్రాలు.
1). భీమవరం: పశ్చిమ గోదావరి జిల్లా గునిపూడిలో భీమారామ క్షేత్రం ఉంది. ఇక్కడి శివలింగం పౌర్ణమి నాటికి తెలుపుగాను, అమావాస్య నాటికి నలుపుగాను మారుతూ ఉంటుంది. గునిపూడిలో ఉన్న స్వామిని పూజిస్తే, మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఎవరైనా చంద్రుడితో బాధపడుతున్నవారు పౌర్ణమికి గాని, అమావాస్యకి గాని అభిషేకం చేయించుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి. చంద్రుడికి అధిష్టాన దేవతగా శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, శ్రీ మహాలక్ష్మిగా చెప్తారు. ఎందుకంటే! "శ్రీరామచంద్ర మహాప్రభో!!" అని పిలుస్తాం. చంద్రుడి నామం రాముడులోనే ఉంది.
శ్రీరామ క్షేత్రాలు:
1). భద్రాచలం:- భద్రాచలం తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో ఉంది. దీనినే భద్రాద్రిగా కూడా పిలుస్తారు. ఈ క్షేత్రాన్ని సోమవారం దర్శిస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి.
2). ఒంటిమిట్ట:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కడప జిల్లాలో ఈ క్షేత్రం ఉంది. ఈ క్షేత్రంలో ఆంజనేయస్వామి ఆలయం బయట ఉంటారు.
3). రామతీర్థం:- విజయనగరం దగ్గర ఉన్న రామతీర్థం జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన క్షేత్రం.
4). గొల్లల మామిడాడ:- వైష్ణవ సాంప్రదాయం అనుసరించే రవిక్షేత్రం ఉంది. ఈ క్షేత్రంలో శ్రీరామచంద్ర పట్టాభిస్వామి ఉన్నారు. ఎత్తయిన పెద్ద గాలిగోపురం ఉంది. ఇక్కడ శ్రీరామనవమికి ఉత్సవాలు జరుపుతారు. ఈ క్షేత్రంలో వారంరోజుల పాటు స్వామివారికి బంగారు నగలు వేస్తారు. ఆరోజుల్లోనే స్వామివారిని దర్శించుకుంటే మంచిది. ఆ దర్శన భాగ్యం అందరికీ దక్కదు.
2). శ్రీ కృష్ణుడి క్షేత్రాలు:
1). నెమలి:- కృష్ణాజిల్లా గంపలగూడెం మండలంలో శ్రీ కృష్ణుడి క్షేత్రం ఉంది. సోమవారం రోజు దర్శించండి. 2). మొవ్వ:- మహాకవి క్షేత్రయ్య అర్చించి ఆరాధించిన క్షేత్రం. ఇక్కడ కూడా శ్రీ కృష్ణుని దర్శించవచ్చు.
3). హంసలదీవి:- కృష్ణానది, సముద్రుడు కలిసే చోటు (సాగర సంగమం) ఇక్కడ శ్రీ కృష్ణుడి దేవస్థానం ఉంది. చాలామంది పండరీపురం వెళ్లి పండరినాథుని దర్శింప లేకపోయామే!! అని బాధపడతారు. పండరీనాథుని దర్శించుకోలేనివారు మచిలీపట్నం దగ్గరలోనే, కీర పండరీపురం క్షేత్రాన్ని చూడవచ్చు. పండరీపురంలో పండరీనాథుడు ఎలా ఉంటాడో!! కీర పండరీపురంలో కూడా స్వామి అలానే ఉంటారు. భక్త నరసింహంగారు స్థాపించారు. ఇప్పటికీ పండరీపురంలో ఎలా సేవలు జరుగుతాయో!! ఇక్కడ కూడా అలాగే సేవలు జరుగుతూ ఉంటాయి. మచిలీపట్నంలో సముద్ర స్నానం చేసి కీర పండరీపురం దర్శించండి.
3). మహాలక్ష్మి క్షేత్రాలు:
1). విశాఖపట్నం:- విశాఖపట్నం కనకమహాలక్ష్మి దేవాలయం బురుజు పేటలో ఉంటుంది. అమ్మవారికి శుక్రవారం ఉత్సవాలు చేస్తారు. మార్గశిర మాసంలో అమ్మవారికి చేసే ఉత్సవాలు జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే. స్వయంగా మనమే అభిషేకం చేసుకోవచ్చు. కేవలం సేవా కార్యక్రమాలకే పూజారులు ఉంటారు.
2). తిరుచానూరు:- తిరుపతిలోని తిరుచానూరులో కూడా మహాలక్ష్మి కొలువై ఉంది. ఇంకా నరసింహ క్షేత్రాలన్నింటిలోనూ అమ్మవారు కొలువై ఉంటుంది. ఎందుకంటే!! నరసింహ క్షేత్రాలు లక్ష్మీ నరసింహ క్షేత్రాలుగా ప్రసిద్ధి. వేదాద్రి, యాదాద్రి, వాడపల్లి, సింహాచలం ఇవన్నీ కూడా లక్ష్మీ క్షేత్రాలుగా దర్శించవచ్చు. అంతేకాదు వెంకటేశ్వరస్వామి క్షేత్రాలైన తిరుమలగిరి, తెనాలిలో కూడా లక్ష్మీదేవి కొలువై ఉంది. మంగళగిరిలోని పానకాల లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో, నరసింహస్వామి కొండ మీద ఉంటారు. క్రింద లక్ష్మీ నరసింహస్వామి గుడిలో చక్కని లక్ష్మీదేవి విగ్రహం పెద్దది ఉంటుంది. భక్తులు వీటిని దర్శించడానికి ప్రయత్నం చేయండి.
3). కుజుడు:- కుజుడికి సంబంధించిన క్షేత్రాలు: కుజుడికిసంబంధించిన క్షేత్రాల గురించి చెప్పాలంటే, ఆంజనేయస్వామిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. ఏకాదశరుద్రులులలో ఆంజనేయ స్వామి ఒకరు. ఆంజనేయ స్వామి క్షేత్రాలు చాలాచోట్ల ఉన్నాయి. ఆంజనేయస్వామి రుద్ర స్వరూపుడు కనుక, సాధ్యమైనంతవరకు ఆంజనేయస్వామి క్షేత్రాలని దర్శించడానికి ప్రయత్నం చేయండి. అదీ కుదరని పక్షంలో మీ ఊరిలోనే ఉన్న దక్షిణాభిముఖం ..ఎరుపు రంగు ఉన్న ఆంజనేయస్వామిని (దక్షిణ దిక్కు కుజుడు కాబట్టి..) దర్శించండి. ఆంజనేయ స్వామి క్షేత్రాలు.... గుంతకల్ దగ్గరలో ఉన్న కసాపురంలో, విజయవాడ పక్కనే ఉన్న సీతానగరం, వినుకొండలో గుంటి ఆంజనేయ స్వామి, గుంటూరు జిల్లా పొన్నూరులో అత్యంత పెద్దదైన పొడవైన ఆంజనేయ స్వామి, పావులూరు ఆంజనేయ స్వామి, ఇంకొల్లులో ఆంజనేయస్వామి, విజయవాడ మాచవరంలో సమర్థ రామదాసు స్వామి క్షేత్రం, అన్నిటికంటే ప్రకాశం జిల్లా అద్దంకి దగ్గర సింగరకొండలో ఆంజనేయస్వామి క్షేత్రం, కాణిపాకం దగ్గర అర్ధగిరిలో ఆంజనేయస్వామి క్షేత్రాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఆంజనేయ స్వామి క్షేత్రాలు చెప్పనక్కరలేదు. చాలాచోట్ల ఉన్నాయి. ఈ క్షేత్రాలను మంగళవారం దర్శించడానికి ప్రయత్నం చేయండి.
అంతేకాకుండా కుజుడికి కొంతమంది దైవజ్ఞులు ఆంజనేయస్వామే కాకుండా, వీరభద్రుడిని కూడా పూజించమని చెప్తారు.
వీరభద్ర క్షేత్రాలు: వీరభద్ర క్షేత్రాలలో చెప్పుకోదగ్గ క్షేత్రం కురివి. ఈ క్షేత్రానికి మహబూబాబాద్ నుండి వెళ్లాలి. ఖమ్మం నుంచి కూడా వెళ్ళవచ్చు. ఆ క్షేత్రంలో స్వామికి సోమవారం రోజు విశేష కరమైన పూర్ణాభిషేకం (రూ.1,100/- ) ఉంటుంది. విడి రోజులలో రూ.200/- ఉంటుంది. వరంగల్ దగ్గర ఉన్న బొంతపల్లిలో, పశ్చిమ గోదావరి జిల్లా పట్టిసీమలో, కడప దగ్గర రాయచోటిలో అద్భుతమైన వీరభద్ర క్షేత్రాలు ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాదు బర్కత్ పురాలో వీరభద్ర స్వామి క్షేత్రాన్ని దర్శించవచ్చు. వీరభద్రుడిని దర్శిస్తే కుజదోషాలు నివృత్తి అవుతాయి. మంగళవారం రోజు వీరభద్రుడి అష్టోత్తరంగాని, అభిషేకంకాని చేసుకోవడానికి ప్రయత్నం చేయండి.
4). బుధుడు:- బుధుడికి సంబంధించిన క్షేత్రాలలో ఏకైక క్షేత్రం ర్యాలీ. ర్యాలీ జగన్మోహనస్వామి ముందు పురుషాకారం, వెనక స్త్రీ ఆకారం ఉన్న ఏకైక స్వామి. ఈ క్షేత్రం మందపల్లి శని క్షేత్రం ఎదురుగా 45 కి.మీ. దూరంలో ర్యాలీ ఉంటుంది. రావులపాలెంకి దగ్గరగా ఉంటుంది. ఈ క్షేత్రాన్ని దర్శిస్తే బుధగ్రహ దోషాలు తొలగిపోతాయి. ఎవరికైతే బుధ అంతర్దశ, మహర్దశ జరుగుతుందో! ర్యాలీ వెళితే చాలా మంచిది. బుద్ధి బలం పెరగాలంటే బాసర సరస్వతీ దేవాలయాన్ని ఖచ్ఛితంగా సందర్శించాలి. దీనిలో ఎలాంటి సందేహం లేదు. ఇక్కడ తిథి-వార-నక్షత్రాలతో సంబంధం లేకుండా అక్షరాభ్యాసాలు జరిగే ఏకైక క్షేత్రం. సరస్వతి క్షేత్రాలలో ఉన్న మరొక క్షేత్రం కాళేశ్వరం. కరీంనగర్ జిల్లాలో ఉన్న కాళేశ్వరంలో ముక్తేశ్వరస్వామి. ఇక్కడ కూడా సరస్వతిదేవి ఉంది. ఈ క్షేత్రాన్ని దర్శిస్తే అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. గుంటూరు జిల్లా సత్తెనపల్లి వేణుగోపాలస్వామి దేవాలయంలో సరస్వతి దేవిని దర్శించుకోవచ్చు. హైదరాబాద్ దగ్గరలో మెదక్ జిల్లా వర్గల్ లో, విద్యా శనేశ్వర దేవాలయంలో చదువుల తల్లి సరస్వతిదేవిని దర్శించుకోవచ్చు. సరస్వతీ క్షేత్రాలని బుధ గ్రహ క్షేత్రాలుగా దర్శించుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి...
5). గురువు:- గురువు సంబంధించిన క్షేత్రాలు:
గురు క్షేత్రాల గురించి చెప్పాలంటే! గుంటూరు జిల్లాలో రెండు క్షేత్రాలు ఉన్నాయి 1). కోటప్పకొండ... వేద దక్షిణామూర్తి (పార్వతి దేవి లేని శివుడు... శివ కళ్యాణం జరగని ఏకైక క్షేత్రం) శివరాత్రి పర్వదినాన ప్రభలు కట్టుకుని కొన్ని లక్షల మంది భక్తులు వస్తారు. కోటప్పకొండలో పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ చేసినవారికి విశేషకరమైన ఫలితాలు వస్తాయని భక్తుల నమ్మకం. పౌర్ణమినాడు గిరి ప్రదక్షిణకి ఆడ, మగ తేడా లేకుండా ఎంతోమంది వస్తారు. కాలినడకన 8 కి.మీ దూరం గిరి ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించుకుంటారు. విడిరోజులలో కూడా విశేషంగా గిరి ప్రదక్షిణ చేస్తారు. కోటప్పకొండలో వేంచేసి ఉన్న దక్షిణామూర్తి శివుడుని జీవితకాలంలో తప్పనిసరిగా దర్శించుకోవలసిన క్షేత్రం. 2). చేబ్రోలు:- గుంటూరు జిల్లా చేబ్రోలులో చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర ఆలయం ఉంది. రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు కొలను మధ్యలో కట్టించారు. గురువారం వెళితే అభిషేకం చేసుకోవచ్చు. గురువారం రోజు కోటప్పకొండ, చేబ్రోలు బ్రహ్మ లింగేశ్వర ఆలయాన్ని దర్శించుకోండి. గురు అనుగ్రహం లభిస్తుంది.
అంతేకాకుండా నాగార్జునసాగర్ దగ్గర ఎత్తిపోతల జలపాతం వద్ద దత్తక్షేత్రం ఉంది. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో కుక్కుటేశ్వర స్వామి దేవాలయం ఉంది. అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన పురుహూతికా దేవి దగ్గర కుక్కుటేశ్వర స్వామి దేవాలయంలో కూడా దత్తాత్రేయుడు ఉన్నారు. స్వయంభూ క్షేత్రం. దత్తక్షేత్రం కనుక దీనిని కూడా గురు క్షేత్రంగా భావించవచ్చు. కర్నూలు జిల్లా అలంపూర్ లో బాల బ్రహ్మేశ్వర స్వామి క్షేత్రంలో ఎవరైనా అభిషేకాలు చేయించుకోవచ్చు. శక్తిపీఠాలలో ఒకటైన అలంపురం జోగులాంబ క్షేత్రంలో నవబ్రహ్మలు ఉన్నారు. ఇది కూడా గురుగ్రహానికి సంబంధించిన క్షేత్రమే. దీనిలో ఎలాంటి సందేహం లేదు. గురు మహర్దశ, అంతర్దశ జరుగుతున్నవారు, గురువు నీచస్థితిలో ఉన్న వారందరూ, గురు సంబంధిత క్షేత్రాలను దర్శించవచ్చు. చాలామందికి గురువుకి సంబంధించి అనగానే షిర్డీసాయిబాబా, సాకోరి క్షేత్రాలు దర్శిస్తారు. అంతేకాకుండా గొలగమూడి వెంకయ్య స్వామి, మంత్రాలయ రాఘవేంద్రస్వామి, కందిమల్లయ్యపల్లె పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, కాశీ క్షేత్రంలో కాశీ నాయన, చిత్తూరు దగ్గర సొరకాయలస్వామి, ఆదోని తిక్క మహాలక్ష్మమ్మ, నర్సీపట్నం దగ్గర పాకాలపాటి గురువుగారి ఆశ్రమం, ఎవరి ఇష్టానుసారంగా గురుక్షేత్రాలుగా భావించి దర్శిస్తుంటారు. గురు పరంపర ఎలాగైతే వస్తుందో! ఆ కురుక్షేత్రానికి వెళ్లి నిద్ర చేసిన, సందర్శించిన మంచి ఫలితం వస్తుంది. అవధూతలకి సంబంధించిన క్షేత్రాలన్నీ కూడా గురుక్షేత్రాలు. పిఠాపురంలో శ్రీపాద శ్రీవల్లభడు ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఉన్న 3 దేవస్థానాలు దర్శిస్తారు. వారి వారి ఇష్టానుసారం గురు క్షేత్రాలు దర్శించుకోవచ్చు.
6). శుక్రుడు:- శుక్ర గ్రహానికి సంబంధించిన క్షేత్రాలు: శుక్రగ్రహం అమ్మవారి క్షేత్రాలు. అమ్మవారి క్షేత్రాలుగా అష్టాదశ శక్తిపీఠాలు. తెలుగు రాష్ట్రాలలో ఉన్న అష్టాదశ శక్తి పీఠాలలో 1). శ్రీశైలం... శ్రీశైల మల్లికార్జున స్వామి, భ్రమరాంబికాదేవి. ఇక్కడ అమ్మవారిని దర్శించి చండీయాగం చేయించుకోవడానికి ప్రయత్నించండి. కుదరలేనివారు శ్రీ చక్రార్చన.. (కుంకుమార్చన) అయినా చేయించుకోండి. 2). అలంపురం... కర్నూలు జిల్లాలోని జోగులాంబను కూడా దర్శించండి. రెండు కర్నూలు జిల్లాలోనే ఉన్నాయి గనుక, దర్శించుకుంటే శుక్రగ్రహ ఫలితాలు బాగుంటాయి. తూర్పు గోదావరిజిల్లా పిఠాపురంలో పురుహూతికా దేవి. ఇక్కడ గురుక్షేత్రం కూడా ఉన్నది. కనుక రెండు దర్శించుకోవచ్చు. రామచంద్రాపురంలోని ద్రాక్షారామంలో కొలువైన అమ్మవారు మాణిక్యాంబ. పంచారామాల్లో ద్రాక్షారామం కూడా ఒకటి. అంతేకాకుండా అమ్మవారి క్షేత్రాలు చాలా ఉన్నాయి. విజయవాడ కనకదుర్గమ్మ, వరంగల్ భద్రకాళి, త్రిపురాంతకం బాలా త్రిపుర సుందరీదేవి (ఇక్కడ దశమహావిద్యలలో ఒకటైన... చిన్నమస్తాదేవి కూడా ఉంది). అమావాస్య, పౌర్ణమి రోజున భక్తులు విపరీతంగా వచ్చి కుంకుమార్చన చేసుకుని 108 నిమ్మకాయల దండను అమ్మవారికి అలంకరిస్తారు. గుంటూరు జిల్లాలోని నరసరావుపేట దగ్గర ఇసప్పాలెం, ఫిరంగిపురంలోని మూలాంకురేశ్వరి దేవి, చందోలు బండ్లమ్మ తల్లి (దశమహావిద్యలలో ఒకటైన... బగళాముఖీ క్షేత్రం), మోపిదేవి దగ్గరలోని పెదకళ్ళేపల్లి దుర్గాదేవి క్షేత్రాలు ఉన్నాయి. అమ్మవారు పార్వతిదేవి క్షేత్రాలన్నీ కూడా శుక్రగ్రహ క్షేత్రాలే. ఈ విధంగా శుక్రగ్రహ క్షేత్రాలన్నీ దర్శించుకోవచ్చు.

7). శని:- శని గ్రహ క్షేత్రాలు:
శని గ్రహానికి ఏలిననాటి శని జరుగుతున్నవారు, అర్థాష్టమ శని, అష్టమ శని, శని మహర్దశ, శని అంతర్దశ జరుగుతున్నవారు ఖచ్చితంగా దర్శించాలి. రవి మహర్దశలో శని అంతర్దశ, శని మహర్దశలో రవి అంతర్దశ, శని మహర్దశలో కేతు అంతర్దశ, కేతు మహర్దశలో శని అంతర్దశ, ముఖ్యంగా కుజ అంతర్దశలో శని మహర్దశ, శని అంతర్దశలో కుజ మహర్దశ జరుగుతున్న వారు మాత్రం ఖచ్చితంగా దర్శించాలి. ఎందుకంటే ఎక్కువ ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంది. శని గ్రహానికి సత్వరమే పరిహారం చేసుకుంటే మంచిది. శని గ్రహ క్షేత్రాలు:
1). మందపల్లి:- తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం దగ్గర మందపల్లి ఉంది. ఇక్కడ మందేశ్వరస్వామిని శనీశ్వరుడు స్వయంగా స్థాపించిన శివలింగం. ఈ క్షేత్రాన్ని దర్శించడినికి వెళ్లేవారు, పాత బట్టలు ధరించి తలారా స్నానం చేసి, ఆ తడి బట్టల మీద కూర్చుని 11 కొబ్బరికాయల తోటి ఏకాదశ రుద్రాభిషేకం చేయించుకుంటారు. ఈ క్షేత్రంలో శనికి నువ్వులు దానం పడతారు. నువ్వులు దానం ఇచ్చి, శనీశ్వరునికి తైలాభిషేకానికి తైలం ఇవ్వండి. కొంతమంది భక్తులు స్వయంగా స్వామివారికి తైలాభిషేకం (అభిషేకం చేసుకోడానికి ఒక పక్కగా అవకాశం ఉంది) చేస్తారు. తైలాభిషేకం పూర్తవగానే ఆ పాత బట్టలు అక్కడనే విసర్జించి వస్తారు. శని త్రయోదశి రోజు కొన్ని లక్షల మంది వస్తారు. అర్థరాత్రి 12 గంటల నుంచి అభిషేకాలు ప్రారంభమవుతాయి. అక్కడ బ్రాహ్మణోత్తములు భక్తులతో విధివిధానంగా పూజ, అభిషేకాలు చేస్తారు. ముఖ్యంగా అమావాస్య ముందు వచ్చే శని త్రయోదశికి ఎక్కువగా వస్తారు. పౌర్ణమి ముందు వచ్చే త్రయోదశి కూడా వస్తారు, కానీ అమావాస్య ముందు వచ్చే శని త్రయోదశికి విశేషకరమైన ఫలితాలు ఉంటాయని ఈ క్షేత్రాన్ని సందర్శిస్తారు. మందపల్లి దర్శనం వల్ల శనిగ్రహ దోష నివారణ కలుగుతుంది. కొంతమంది భక్తులు 52 శనివారాలు, శని త్రయోదశి కని ముందుగా పోస్టులో డబ్బు కట్టి పూజ చేయించుకుంటున్నారు. దానికంటే స్వయంగా వెళ్ళి చేయించుకోవడం చాలా మంచిది.
2). నర్శింగోలు:- ప్రకాశం జిల్లాలో ఉన్న నర్సింగోలులో శని క్షేత్రం శివలింగ రూపంలో ఉంటుంది. నర్సింగోలు సింగరాయకొండ కందుకూరు మధ్యలో ఉంటుంది. విజయవాడ కృష్ణమ్మ పాదాలవద్ద, అమరావతిలో మెట్లు పక్కనే, పాలకొల్లులో శనికి ప్రత్యేక క్షేత్రాలు ఉన్నాయి. హైదరాబాద్ వర్గల్ లో కూడా శని క్షేత్రం ఉంది. కడప ఒంటిమిట్ట దగ్గర పొలిమేరలో ఒక శని క్షేత్రం ఉంది. అంతేకాకుండా శ్రీకాకుళం జిల్లాలో ఉన్న శ్రీకూర్మం (తాబేలు) దర్శించి, సాలగ్రామ దానం చేస్తే, శని గ్రహ దోషనివారణ పొందవచ్చు. అరసవిల్లి, శ్రీకూర్మం, సంపత్ వినాయక గుడి దగ్గరలోనే కాబట్టి, ఒకేసారి దర్శించవచ్చు. శనీశ్వరుని ప్రత్యేక దేవాలయాలు దర్శించిన, శనిగ్రహదోష నివారణ జరుగుతుంది. శనికి సంబంధించిన అధిష్టాన దేవత కాలభైరవ స్వామి: కాలభైరవుడు అన్ని దేవాలయాలలో దర్శనమిస్తారు. తెలంగాణ కామారెడ్డిలో ఇసప్పల్లిలో కాలభైరవ క్షేత్రము ఉంది. కాలభైరవుడిని దర్శించి, శనిగ్రహ దోష నివారణ చేసుకోండి. శివాలయంలో ఉన్న కాలభైరవుడిని కానీ, కాలభైరవ క్షేత్రాలు కాని దర్శించవచ్చు. నల్ల వత్తులతో దీపారాధన చేసి, నల్ల నువ్వులు దానం ఇవ్వండి. ఉప్పు, ఇనుము, మేకలు కూడా దానం చేస్తారు. 8). రాహువు:-
రాహువు అనగానే సర్పగ్రహమని అందరూ భయపడతారు. రాహు గ్రహ నివారణకు రాహుకాలంలో దీపారాధన చేయడం, అమ్మవారిని దర్శించి పూజించడం చేయండి. సుబ్రహ్మణ్య స్వామి దర్శనం వల్ల రాహు, కుజ గ్రహ దోషాలు నివృత్తి అవుతాయి. రాహువుకి సంబంధించిన క్షేత్రాలు.... మోపిదేవి సుబ్రహ్మణ్య క్షేత్రంలో ఆదివారం, మంగళవారం వేలమంది భక్తులు వచ్చి అభిషేకాలు చేయించుకుంటారు. పెదనందిపాడు దగ్గరలో ఉన్న నాగులపాడు, విజయవాడ దగ్గరలో ఉన్న నవులూరు పుట్ట, పొన్నూరు దగ్గర ఉన్న కట్టెంపూడి పుట్ట, తెనాలి వైకుంఠపురంలో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కూడా పుట్ట ఉంది, పెదకూరపాడులో నాగమల్లేశ్వర స్వామి దేవాలయం. ఇవన్నీ కూడా సుబ్రహ్మణ్య క్షేత్రాలుగా ప్రసిద్ధి కనుక దర్శించుకోవాలి. ముఖ్యమైన సుబ్రహ్మణ్య క్షేత్రం తిరుత్తణి. తిరుపతి వెళ్ళిన వారు కంచి పక్కనే ఉన్న తిరుత్తణి దర్శించడానికి ప్రయత్నం చేయండి. సుబ్రహ్మణ్య క్షేత్రాలు దర్శించడానికి ఆదివారం వెళ్ళండి. కుదరకపోతే మంగళవారం దర్శించి, స్వామివారికి ఎర్రటి వస్త్రాలు సమర్పించి, స్వామివారికి ప్రీతికరమైన అరటిపండు, సజ్జలతో కూడిన నైవేద్యం సమర్పించండి. వెళ్ళలేని వారు శివాలయంలో ఉన్న జంట నాగ ప్రతిమల మీద అభిషేకం చేసినా, ప్రతి ఆదివారం రోజు శివాలయంలో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేయించినా దోష నివృత్తి జరుగుతుంది. రాహు మహర్దశ, రాహు అంతర్దశ, రాహువు నీతి స్థితిలో ఉన్న వారందరూ ముఖ్యంగా, రాహు మహర్దశలో బుధ అంతర్దశ జరుగుతున్నవారు, ఖచ్ఛితంగా సుబ్రమణ్య స్వామి ఆరాధనవల్ల విశేషకరమైన ఫలితాలు పొందుతారు.
9). కేతువు:- కేతు గ్రహానికి సంబంధించిన అధిష్టాన దేవత గణపతి: గణపతి క్షేత్రాలు: 1). కాణిపాకం:- చిత్తూరు జిల్లాలో ఉన్న కాణిపాకం గణపతి క్షేత్రం మహిమాన్వితమైన క్షేత్రం. ఇక్కడ లక్ష్మీ గణపతి హోమం చేస్తారు. వీలైతే ఇక్కడ అభిషేకంగాని, లక్ష్మీ గణపతి హోమం కానీ చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి. 2). ఐనవోలు:- తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ఐనవోలులో ఉన్న గణపతి క్షేత్రంలో లక్ష్మీ గణపతి హోమం అత్యద్భుతంగా నిర్వహిస్తారు. ఈ క్షేత్రాన్ని ఒక్కసారి దర్శించుకుంటే జన్మ ధన్యం అయినట్లే. 3). బిక్కవోలు:- బిక్కవోలు గణపతి స్వామి క్షేత్రంలో స్వామికి కోరికల చెవిలో చెబుతారు. అమరావతి ధరణికోటలో, విశాఖపట్నం సంపత్ వినాయకుడు (కోరిక అనుకుంటే కచ్చితంగా జరుగుతుంది) ఇలాంటి గణపతి క్షేత్రాలు దర్శించి, కేతుగ్రహ దోషనివారణ చేసుకోండి. నవగ్రహ దోష నివారణకి దర్శించవలసిన క్షేత్రాలు తెలియజేయడం జరిగింది. క్షేత్ర దర్శనంకు, దోష నివారణకు మీకు దగ్గరలో ఉన్న క్షేత్రాలనైనా దర్శించండి. ముఖ్యంగా స్వయంభూ, పురాతనమైన క్షేత్రాలు, నదీతీరాన ఉన్నావి, సముద్ర తీరాన, ఋషి ప్రతిష్ట చేసినవి, దేవతా ప్రతిష్ట చేసినవి, ముఖ్యంగా పర్వతాలమీద ఉన్నవి (ఉదా:- లక్ష్మీ నరసింహ స్వామి... మంగళగిరి) ఇంకా ప్రసిష్ఠమైనవి కనుక, ఇలాంటి క్షేత్రాలు దర్శించి దోషనివారణ చేసుకోండి. కాలసర్ప దోష నివారణకి:
కుజదోష నివారణకు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి పూజ చేసుకోండి. కనీసం 7 ఆదివారాలు గాని, 7 మంగళవారాలు కాని, సుబ్రహ్మణ్య క్షేత్రాలు దర్శించి అభిషేకం చేయండి. కుజ దోష నివారణ చేసుకోండి. క్షేత్ర దర్శనం చేయడం వలన నవ గ్రహ దోషానికి సంబంధించిన ఫలితాలు వస్తాయి. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమంటే!! దోష నివారణ కోసం చేసే క్షేత్ర దర్శనం అంత సులువు కాదు. ఎంతో యోగ్యత, అర్హత ఉంటే తప్ప క్షేత్ర దర్శనం చేయలేము. ఒక చోటికి వెళ్లాలంటే చాలా అడ్డంకులు వస్తాయి. వాటిని అధిగమించి వెళితేనే ఏదైనా సాధించగలరు. ఇష్ట దేవతా దర్శనం, సందర్శనం వేరు. మనం ఒక దేవుడిని, దేవతని ఇష్టదైవంగా పూజిస్తాం. ఇష్టదేవతా దర్శనానికి ఎలాంటి అడ్డంకులు రావు. ( ఉదా:- తిరుపతి , షిరిడి , శ్రీశైలం) ఇలాంటి క్షేత్రాలు ఎప్పుడు వెళ్లాలన్నా, కొంతమంది భక్తులు సంవత్సరానికి ఒకసారి, లేదా నెలకు ఒకసారి కానీ వెళ్తారు. ఎలాంటి ఇబ్బందులు రావు. కానీ నవగ్రహ దోష నివారణకి ఒక క్షేత్రానికి వెళ్లాలంటే, ఎన్నో అడ్డంకులు వస్తాయి. ఎందుకంటే! భవిష్యత్తులో రాబోయే అడ్డంకుల్ని జయించి వెళ్లినట్లే. అందుకే నవగ్రహ దోష నివారణ కోసం చేసే క్షేత్ర దర్శనానికి సాధ్యమైనంతవరకు అడ్డంకులు తొలగించుకుని క్షేత్రాలను దర్శించి, పూజించి దోష నివారణ తీసుకోవడానికి ప్రయత్నం చేయండిhttps://youtu.be/8N2e5ISfwR8
కాలసర్ప దోష నివారణకి శ్రీకాళహస్తిలో, నవగ్రహ కవచంతో వున్న వాయు లింగేశ్వర స్వామిని దర్శిస్తే మంచిది. ఇక్కడ కాలసర్ప దోష నివారణకి ప్రతి నిత్యం పూజ జరుగుతుంది కాబట్టి, పూజ చేయించుకోండి. దోష నివారణ జరుగుతుంది. చాలామంది కాలసర్ప దోషనివారణకు ఒకసారి పూజ చేయించామని చెబుతారు. కానీ అది వాస్తవం కాదు, ముఖ్యంగా కాలసర్ప దోషం ఉండి రాహు మహర్దశ, కేతు మహర్దశ జరగతుంటే ప్రతి సంవత్సరం వెళ్లి స్వామిని దర్శించి, కాలసర్ప దోష పూజ చేయాల్సిందే. ఇందులో ఎలాంటి సంశయం లేదు. ఎందుకంటే!! ఆ ప్రభావం అంత గట్టిగా ఉంటుంది. ఒకవేళ రాహు అంతర్దశ, కేతు అంతర్దశ జరుగుతున్నాసరే, ప్రతి సంవత్సరం వెళ్లి తీరాల్సిందే, దోష నివారణ పూజ చేసుకోవాల్సిందే. గుంటూరు జిల్లా పెదకాకానిలో కూడా కాలసర్ప దోష నివారణ క్షేత్రం ఉంది. ఇక్కడ మల్లిఖార్జునుడు భ్రమరాంబికా దేవి సమేత స్వామి కొలువై ఉన్నారు. ఇక్కడ కూడా కాలసర్ప దోష నివారణ పూజ చేస్తారు. (రూ. 250/-) రాహుకాలంలో ఎక్కువ మంది భక్తులు వస్తారు. శ్రీకాళహస్తికానీ, పెదకాకానికానీ దర్శించి కాలసర్ప దోష నివారణ చేయించుకోండి. ముఖ్యంగా కాలసర్ప దోషం ఉన్నవారు జంట నాగులని ఎక్కువగా పూజించండి. జంట నాగుల క్షేత్రాలు ఎక్కువగా కర్ణాటకలో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలలో అయితే సుబ్రహ్మణ్యస్వామి క్షేత్రాలలో ఉంటాయి కనుక, పూజ చేస్తే మంచిది. కాలసర్ప దోషం ఉన్నవారు వీలైతే స్తోమత ఉంటే కనుక, జంట నాగుల ప్రతిష్ఠ చేయడానికి ప్రయత్నం చేయండి. నాగ ప్రతిష్ట చేస్తే కనుక కాలసర్ప దోష నివారణ ఖచ్ఛితంగా జరుగుతుంది. కాలసర్ప దోషం అనేది పెద్ద దోషం కాదు, కానీ అందరూ భయపడతారు.

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS