నవదుర్గా వైభవం రెండో రోజు విదియ బాలాత్రిపుర సుందరి NAVARATRI NAVADEVI VAIBHAVAM DASARA Part-2
నవదుర్గా వైభవంలో రెండో రోజు తిథి విదియ. ఈ రోజు విజయవాడలో అమ్మవారు బాలాత్రిపుర సుందరిగా దర్శనమిస్తుంది. మైసూర్ లో మహేశ్వరిగా, శ్రీశైలంలో బ్రహ్మచారిణిగా, ఉత్తర భారతదేశంలో త్రిపురగా దర్శనమిస్తుంది. బ్రహ్మచారిణి అంటే శివుని వివాహమాడుటకు ఎన్నో యుగాలుగా తపమాచరించడం వల్ల బ్రహ్మచారిణి అని పేరు. కుడిచేతిలో జపమాల, ఎడమ చేతిలో కమండలం ఉంటుంది. ఈ తల్లిని పూజించడంవల్ల సర్వత్ర విజయం లభిస్తుంది. ఎవరికైతే ఏకాగ్రత కుదరడంలేదో! దీక్షగా పనులు చేసుకోలేకపోతున్నారో! వారందరూ ఈరోజు బ్రహ్మచారిణిని పూజించడం చాలా మంచిది. ఈ రోజు మామిడి వృక్షాన్ని పూజించాలి. కంచి ఏకాంబరేశ్వరాలయంలో మామిడి చెట్టు ప్రక్కనే అమ్మవారు ఉంటుంది. ప్రసాదంగా పులిహోర నైవేద్యంగా పెట్టాలి. కుమారి పూజలో మూడు సంవత్సరముల వయస్సుగల బాలికను పూజిస్తారు. చదువుకోవలసిన స్తోత్రాలు బాలా త్రిపుర సుందరికి సంబంధించిన, అష్టోత్తరం, సహస్ర నామావళి, బాలా త్రిపుర సుందరి కవచం, అష్టకం, శతనామ స్తోత్రం, సహస్రనామ స్తోత్రం చదువుకోవాలి. శివశక్తిగా ఈ రోజు అమ్మవారు ముఖాసురుడు అనే రాక్షసుడిని సంహరించింది. లలితా సహస్రనామాల్లో "భండపుత్ర వధోద్యుక్త బాలావిక్రమ నందితా" అనే నామాలు పారాయణం చేసుకోవాలి. కుదరని వారు "ఓం శ్రీ బాలా త్రిపుర సుందరి దేవతాయై నమః" అనే నామాన్ని స్మరించుకోండి. దశమహావిద్యలలో త్రిపుర సుందరిగా, దశావతారాల్లో బలరాముడిగా, నవగ్రహాల్లో బుధ గ్రహంగా కొలుస్తారు. ఉత్తర భారతదేశంలో త్రిపుర దేవిగా పూజించడంవల్ల పుత్రపౌత్రాభివృద్ధి, ధనధాన్యాభివృద్ధి పొందుతారు. బాలా త్రిపుర సుందరి యొక్క గాయత్రి మంత్రం "త్రిపుర సుందర్యైచ విద్మహే! కామేశ్వరైచ ధీమహి తన్నో బాలః ప్రచోదయాత్!!" బాలాత్రిపురసుందరిని స్మరించడం వల్ల మన కోరికలన్నీ నెరవేరుతాయి. సప్తదేవి మంత్రాలలో గొప్పదైన మంత్రం బాలా మంత్రం. శ్రీ విద్యా ఉపాసకులు మొట్టమొదటగా బాలా మంత్రాన్నే ఉపదేశిస్తారు. ఉపాసకులు శ్రీచక్రార్చన చేసుకోవాలి శ్రీవిద్యని ఉపదేశించమంటే! బాలా మంత్రాన్నే ఉపదేశిస్తారు. గుంటూరు జిల్లా చేబ్రోలు కొత్తరెడ్డిపాలెంలో లక్ష్మీకాంత యోగీంద్రులు అనేవారు ఉన్నారు. వారి బాలా మంత్రం ఉపాసన చేసేవారు. గాయత్రీ నేర్పించేవారు. వారు ముందు నడుస్తుంటే! వెనక చిన్నపిల్లగా అమ్మవారు అనుసరించేది. వీరు పొలాల గట్ల మీద నడుస్తుంటే! దారిన వెళ్ళేవాళ్ళు "అయ్యా!! అంత చిన్నపిల్లను నడిపిస్తున్నారు ఎత్తుకో వచ్చుగా" అనేవారు. ఆయన వెనుతిరిగి చూస్తే ఎవ్వరు కనిపించేవారు కాదు. బాలా మంత్రం అంత గొప్పది, అనుక్షణం అంటిపెట్టుకొని ఉంటుంది. కొత్తరెడ్డి పాలెంలో లక్ష్మీకాంత యోగేశ్వరుని ఆశ్రమం కూడా ఉంది. అటువంటి మహనీయులు నడయాడిన పుణ్యభూమి. బాలా మంత్రోపదేశం లేనివారు శ్రీ చక్ర ఉపాసనకి అనర్హులు. శ్రీ విద్యా ఉపాసనకి మొదటి మెట్టు బాలా మాత్రమే. బాలా మంత్రానికే అంత విశేషమైన స్థానం ఉంది. శ్రీ చక్రంలో మొదటి ఆమ్నాయములో ప్రథమ దేవత, బాలా త్రిపుర సుందరి. బాలాదేవిని గట్టిగా పట్టుకొని అనుగ్రహం పొందితే, త్రిపుర సుందరి అనుగ్రహం పొందటం చాలా సులభం. బాలాదేవి ఉపాసన వల్ల ఆమె అనుగ్రహం పొందిన వారందరూ, శ్రీచక్ర విద్యలో రాణించడమే కాదు, అద్భుతమైన ఫలితాలు పొందుతారు. జగద్గురు ఆది శంకరాచార్యులవారు విజయవాడ సందర్శించి, అప్పటి వరకు అమ్మవారికి వామాచార పద్ధతిలో జరుగుతున్న పూజని మార్చి, దక్షిణాచారం పద్ధతిలో పూజ చేయాలని అమ్మవారిని ప్రవేశపెట్టారు. అక్కడ "శ్రీచక్రాన్ని" కూడా స్థాపించారు. ఆ శ్రీచక్రానికి అర్చనలు చేయాలన్నా, దర్శించాలన్నా బాలాదేవి అనుగ్రహం కావాలి. ముందుగా బాలాదేవిని పూజిస్తే దుర్గాదేవి అమితంగా సంతోషిస్తుంది. బాలాదేవికి రూపం లేదు. (ఈ మధ్యనే చిన్నపిల్లగా అమ్మవారు పద్మం మధ్యలో కూర్చొన్నట్లుగా ఫోటోలలో చూపిస్తున్నారు.) బాలాదేవి అలంకరణ కోసం, ఎలా ఉంటుందో తెలియజేయడం కోసం, సామాన్యులు తెలుసుకోవడానికి, బాలా త్రిపుర సుందరి రూపాన్ని అలంకరణ చేస్తారు. విజయవాడ కనకదుర్గ అమ్మవారి బాలాదేవి అలంకరణకు, సంబంధించిన పురాణగాథ ఒకటి ఉంది. హిమకీర్తి, రత్నావళి అనే రాజదంపతులు దుర్గాదేవిని స్మరించగానే, బాలాదేవి రూపంలో అమ్మవారు సాక్షాత్కరించి, సత్సంతానాన్ని ప్రసాదించింది. అప్పటినుండి నవరాత్రి అలంకరణలో బాలా త్రిపుర సుందరి అలంకరణకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. బాలాదేవి అలంకరణ రోజు ఎవరైతే దర్శించి, పూజిస్తారో వారికి సంవత్సరమంతా చేసిన పూజా ఫలితం లభిస్తుంది. బాలాదేవిని జగదేక సౌందర్యవతి అంటారు. ఈ తల్లి యొక్క అష్టోత్తర శతనామ స్తోత్రము రుద్రయమ యామళంలో తంత్ర గ్రంథంలో ఉంది. శ్రీ విద్యా స్వరూపిణి అయిన బాలాదేవి అనుగ్రహం పొందితే, లోకంలో సాధించలేనిదంటూ ఏది! ఉండదు. త్రిపుర త్రయంలో మొట్టమొదటి దేవత బాలా త్రిపుర సుందరి దేవి.
అమ్మ దయ వుంటే అన్నీ ఉన్నట్లే:
బాల మంత్రం ఎలా పొందడం
ReplyDelete