నవరాత్రి వైభవం: NAVARATRI NAVADEVI VAIBHAVAM Part-1నవరాత్రి వైభవం పాడ్యమి స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి శైలపుత్రి నవరాత్రి వైభవం: NAVARATRI NAVADEVI VAIBHAVAM Part-1నవరాత్రి వైభవం పాడ్యమి స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి శైలపుత్రి
నవరాత్రి పర్వదినాలలో మొట్టమొదటి రోజు పాడ్యమి తిథి. శ్రీవిద్యాఉపాసకులు ఈ పర్వదినాలను ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ తొమ్మిది రోజులూ అత్యద్భుతంగా భక్తి,శ్రద్ధలతో అమ్మవారి పూజలు చేస్తారు. తొమ్మిది రోజులు చేయలేనివారు చివరి మూడు రోజులు (మూలా నక్షత్రం రోజు, దుర్గాష్టమి, మహర్నవమి) ఖచ్చితంగా అమ్మని ఆరాధిస్తారు. కనీసం మూడు రోజులు ఎవరైతే చేస్తారో! వారికి అమ్మవారి కటాక్షం తప్పకుండా లభిస్తుంది.
మొదటి రోజైన పాడ్యమి తిథి రోజు విజయవాడలో అమ్మవారు "స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా" దర్శనమిస్తుంది. ఈ దర్శనం యొక్క వైశిష్ట్యం ఏమిటంటే! మనకు ఒక్కొక్క పర్వతం మీద ఒక్కొక్క దేవతా శక్తులు వెలిసాయి. (ఉదా:- అన్నవరం సత్యనారాయణ, భద్రాచలం శ్రీరాముడు) విజయవాడలో కూడా కీల పర్వతుడు అనే ఋషి తపస్సు చేసాడు. మహిషాసుర సంహారానంతరం అమ్మవారు కీల పర్వతుడి యొక్క తపస్సుకు మెచ్చి ఈ పర్వతం పైన కనకవర్ణం తోటి వెలిసింది. అప్పటినుండి అమ్మవారు "కనకదుర్గాదేవిగా" ప్రసిద్ధి. నిత్యం ఇంద్రాది దేవతలు ఇక్కడ అమ్మవారిని కొలుస్తారు. కీల పర్వతుడు తపస్సు చేయుట వలన, నిత్యం ఇంద్రుడు వచ్చి అమ్మవారిని కొలవడం వలన "ఇంద్రకీలాద్రిగా" ప్రసిద్ధి చెందింది. స్వర్ణ వర్ణంతో మెరిసిపోయే అమ్మవారిని పూజించి, ఈరోజు కనకధారా స్తోత్రం మూడు సార్లు పారాయణం చేయండి. ఇంద్రకీలాద్రికి సంబంధించిన పురాణగాథ ఉంది. పూర్వం ఈ ఇంద్రకీలాద్రి ప్రాంతాన్ని, మాధవవర్మ అనే రాజు పరిపాలిస్తుండేవాడు. ఆయన అపారమైన దేవి భక్తుడు. ఈయనకి ఒక కుమారుడు ఉన్నాడు. ఈ రాజకుమారుడు ఒకరోజు రథాన్ని తీసుకుని బయటకు వెళతాడు. రాజకుమారుడు అవడంవల్ల, యుక్తవయసులో ఉండటంవల్ల, రథాన్ని అతివేగంగా రాజ్యంలో తోలుతూ ఉంటాడు. అప్పుడే ఒక ఇంటి నుండి ఒక చిన్న బాలుడు బయటకు వచ్చి, ప్రమాదవశాత్తు రథం క్రిందపడి మరణిస్తాడు. వెంటనే రాజకుమారుడు తండ్రి దగ్గరకు వెళ్లి, తన తప్పును ఒప్పుకుని మీరు ఏశిక్ష విధించినా స్వీకరిస్తాను అంటాడు. రాజు మరణించిన ఆ బిడ్డ తల్లిని పిలిపించి "అమ్మా!! నీ కుమారుడు నా కుమారుడి వల్ల మరణించాడు. అయినా సరే నా కుమారుడికి మరణ శిక్ష విధిస్తున్నాను" అంటాడు. రాజకుమారుడికి మరణశిక్ష విధించిన వెంటనే, రాజు యొక్క ధర్మనిరతికి అమ్మవారు మెచ్చి, ప్రమాదవశాత్తు మరణించిన ఆ బాలునికి ప్రాణం పోసి బ్రతికిస్తుంది. అమ్మవారి దయకు పాత్రుడైన ఆ రాజు యొక్క భక్తికి మెచ్చిన అమ్మవారు, కొన్ని ఘడియల పాటు కనక వర్షాన్ని కురిపిస్తుంది. అదే విజయవాటిక. ఆనాటి నుండే అమ్మవారిని "స్వర్ణ కవచాలంకృత అమ్మవారిగా" పూజిస్తారు. స్వర్ణ కవచాలంకృత అమ్మవారి దర్శనం వల్ల దారిద్ర్యం తొలగిపోతుంది.
నవరాత్రి పర్వదినాలలో మొదటిరోజైన పాడ్యమి తిథి రోజు మైసూర్ లో అమ్మవారు "బ్రాహ్మీదేవిగా" దర్శనమిస్తుంది. మన ఆంధ్రదేశంలో అష్టాదశ శక్తి పీఠాలు 4 ఉన్నాయి. (శ్రీశైలం, పిఠాపురం, ద్రాక్షారామం, అలంపురం) శ్రీశైలానికి ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. ఎందుకంటే! భారతదేశానికి నాభిస్థానంలో ఉంది. ద్వాదశ జ్యోతిర్లింగం, ప్రవహించే నది, కొండపైన ఉండటం, స్వయంభు, ఇన్ని ప్రత్యేకతలు గల భ్రమరాంబికాదేవి కన్నుల పండువుగా దర్శనమిస్తుంది. ఈరోజు భ్రమరాంబికాదేవిని "శైలపుత్రిగా" పూజిస్తారు. శైలపుత్రి అనే నామం ఎలా వచ్చిందంటే! సతీదేవి యోగాగ్నిలో దగ్ధం చెందిన తర్వాత, హిమవంతుని పత్రికగా జన్మిస్తుంది. ఆమెనే శైలపుత్రి అంటారు. శైలపుత్రి కుడిచేతిలో త్రిశూలం, ఎడమచేతిలో కమలం, తలపైన చంద్రవంకతో అద్భుతంగా దర్శనమిస్తుంది. ఈ శైలపుత్రినే పార్వతి, హైమావతి (హిమవంతుని పుత్రిక కనుక) అని కూడా పిలుస్తారు. శైలపుత్రిని ధ్యానించి, పూజిస్తే వాంఛితాలు (కోరికల) నెరవేరుతాయి. ఉత్తర భారతదేశంలో ఈ రోజు కుమారిగా పూజిస్తారు. కుమారి పూజ అంటే!! ఒక సంవత్సరం నిండిన బాలిక నుండి, 10 సంవత్సరాలలోపు బాలిక వరకు పూజిస్తారు. మొదటిరోజు ఒకరిని, రెండో రోజు ఇద్దరిని, మూడోరోజు నలుగురిని, నాలుగో రోజూ ఎనిమిది మందిని, ఈ విధంగా పెంచుకుంటూ పోతారు. ఈ కుమారి పూజ చేసేవారికి అమ్మవారి అనుగ్రహం అమితంగా లభిస్తుంది. కుమారి పూజ చేస్తే దుఃఖ దారిద్ర్యాలు, శత్రు క్షయం నశిస్తాయి. ఆయుష్సు కలుగుతుంది. దసరారోజు జమ్మిచెట్టును పూజిస్తారు. ఈ తొమ్మిది రోజులు ఒక్కొక్క చెట్టును పూజించాలి. మొదటిరోజు అరటి పెట్టను పూజించాలి. అమ్మవారికి నైవేద్యంగా కట్టుపొంగలి పెట్టాలి. ఈరోజు చదువుకోవలిసిన అష్టోత్తరం 'ద'కార దుర్గాదేవి స్తోత్రం, 'ద'కార దుర్గా సహస్ర నామావళి, దుర్గా కవచం, దుర్గాష్టకం, 'ద'కార దుర్గ శతనామస్తోత్రం, అర్జునకృత దుర్గా స్తోత్రం (ధనుంజయ కృత అని ఉంటుంది.) ధర్మరాజ కృత దుర్గా స్తోత్రం, 'ద' కార సహస్ర నామావళి చదువుకుంటే మంచిది. శివశక్తిగా (శివునితో ఉన్న శక్తి) అమ్మవారు చేసింది ఏమిటంటే! ఈ తొమ్మిది రోజులు, తొమ్మిది మంది రాక్షసులని సంహరించింది. ఈరోజు గజముఖాసురుడు అనే రాక్షసుడుని సంహరించినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. "తారాకాంతి తిరస్కారి, నాసాభరణ భాసురా" అనే శ్లోకం (లలితా సహస్ర నామావళి) చదువుకుంటే చాలా మంచిది. సమయం లేనివారు "ఓం శ్రీ కనకదుర్గా దేవతాయై నమః" అనే నామాన్ని మనసారా స్మరించుకోండి. (కనీసం 108 సార్లు చదువుకోండి) అదీ కుదరనివారు పనులు చేసుకుంటూనే, మానసికంగా జపం చేసుకోండి. దశమహావిద్యలలో భువనేశ్వరీదేవిగా, దశావతారాలలో శ్రీకృష్ణుడిగా, నవగ్రహాలలో చంద్రుడిగా కొలుస్తారు. అమ్మవారి గాయత్రి మంత్రం "కాత్యాయనాయ విద్మహే! కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గః ప్రచోదయాత్" ఈ గాయత్రి మంత్రాన్ని మనసారా స్మరించుకోండి.
అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే!!
No comments:
Post a Comment