నవదుర్గా వైభవం:
నవదేవి, దుర్గా వైభవంలో మూడవరోజు తిథి తదియ. అందరికీ తెలిసిన విషయమేటంటే! నవదేవి అంటారు. నవదేవి అలంకరణలన్నీ విజయవాడలోనే జరుగుతాయి. నవదుర్గ అలంకారాలు శ్రీశైలంలో జరుగుతాయి. నవదేవి వేరు, నవదుర్గలు వేరు. ఈ రోజు విజయవాడలో అలంకరణ వేదమాత గాయత్రి దేవి. గాయత్రి మాత గురించి చెప్పాలంటే! ఈ తల్లి వేదమాత. ముక్తా,విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలతో ప్రకాశిస్తూ, పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన దేవత. వాంగ్మయ గాయత్రి అంటారు. సమస్త దేవతా మంత్రాలతో గాయత్రీ మంత్రానికి అనుబంధం ఉంది. సకల మంత్రాలకు అధిష్ఠానదేవత గాయత్రి మాత. రుద్ర, విష్ణు, లక్ష్మి గాయత్రి అని, ఏ మంత్రం అయినా సరే! గాయత్రి మంత్రంతో అనుసంధానం చేసే చెప్పాల్సిందే!!. సమస్త దేవతలకు నివేదన చేసేటప్పుడు, గాయత్రి మంత్రంతోనే సంప్రోక్షణ చేసి నివేదన చేస్తారు. "గాయతాం రయతీతి గాయత్రి" (గానం చేసే వారిని రక్షించేది... గానం అంటే మంత్ర జపం..) గాయత్రి మంత్రాన్ని యజ్ఞోపవీతం ధరించినవారు 108 సార్లు జపం చేస్తారు. కొంతమంది మహనీయులు సహస్రం కూడా జపం చేస్తారు. గాయత్రి మాతని మొట్టమొదట సందర్శించినవారు విశ్వామిత్రుడు. ఈరోజు మోదుగ వృక్షాన్ని పూజిచాలి. నైవేద్యంగా కొబ్బరి అన్నం నివేదించాలి. నవరాత్రి పూజలు ఎప్పుడు చేయాలి? అని కొంతమంది సందేహం. నవరాత్రి కనుక రాత్రి సమయంలో చేస్తేనే శ్రేష్టం. ప్రముఖ దేవాలయాలలో రాత్రిపూట దర్శనానికి వస్తారు. (శివరాత్రి... రాత్రి పూట చేసే పండగ..) ఈ రోజు గాయత్రీ అష్టోత్తరం, సహస్ర నామాలు, కవచం, గాయత్రి అష్టకం చదువుకోవాలి. అంతేకాదు శ్రీరాముడికి విశ్వామిత్రుడు ఉపదేశించిన గాయత్రి శతనామ స్తోత్రం, అష్టోత్తరం చదవడం వలన, మానవులు సర్వపాపాలనుండి విముక్తులై, మోక్షాన్ని పొందుతారు. ఈ రోజు అమ్మ జ్ఞానశక్తిగా కురుంభాసురుడు అనే రాక్షసుడిని సంహరించింది. లలితా సహస్రనామాల్లోని "గాయత్రీ వ్యాహృతిస్సంధ్యా ద్విజబృంద నిషేవితా" అనే నామాల్ని చదువుకోవాలి. దశమహావిద్యలలో తారాదేవిగా, దశావతారాల్లో శ్రీరాముడిగా, నవగ్రహాల్లో గురుగ్రహంగా ఆరాధిస్తారు. గాయత్రి మంత్రం "ఓం భూర్భువస్సువః... (ఈ మంత్రం చెప్పకూడదు... అందరికీ తెలిసినదే..) గాయత్రీ మంత్రాన్ని విశ్వవ్యాప్తం చేసినవారు శ్రీరామశర్మ గారు. ఆంధ్రదేశంలో గాయత్రి పరివార్ స్థాపించి వేల, లక్షల గృహాలలో గాయత్రీ హోమాలు, యజ్ఞాలు చేసి, గాయత్రి మంత్రాన్ని జపించేవారు. ఈనాటికీ వారి శిష్యులు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. హరిద్వార్ లో (శ్రీరామశర్మ గారు స్థాపించిన) ఓంకారేశ్వరంలో గాయత్రీ పీఠం ఉంది. గుంటూరు శ్యామలానగర్ లో కూడా గాయత్రి పీఠం ఉంది. దసరా ఉత్సవాలలో భాగంగా మైసూరులో కౌమారిదేవిగా పూజిస్తారు. ఉత్తర భారతదేశంలో కళ్యాణిగా పూజిస్తారు. నాలుగు సంవత్సరాలు వయస్సు గల పాపకి కుమారి పూజ చేస్తారు. కళ్యాణి పేరుతో కుమారి పూజ చేస్తే, విద్యలో విజయము, రాజ్య సుఖము లభిస్తాయి. నవదుర్గ అలంకారాలలో భాగంగా శ్రీశైలంలో చంద్రఘంటాదేవిగా పూజిస్తారు. చంద్రఘంటాదేవి అనగా, శిరమున అర్ధ చంద్రాకారంలో ఉన్న చంద్రుడిని ధరించడం వలన చంద్రఘంటాదేవి అంటారు. ఈ తల్లికి పది చేతులు ఉంటాయి. సింహవాహనం ఉంటుంది. యుద్ధానికి సన్నద్ధమైనట్లుగా ఉంటుంది. ఈ తల్లి యొక్క గంటల శబ్దానికి రాక్షసులు గడగడలాడతారు. ఉపాసకులకు మాత్రం సౌమ్యంగా దర్శనమిస్తుంది. చంద్రఘంటాదేవి భక్తుల కష్టాలను అతిశీఘ్రంగా నెరవేరుస్తుంది. ఈ తల్లిని ఆరాధించేవారు పరాక్రమం కలిగి, నిర్భయంగా ఉంటారు. ఈ తల్లి క్రూర స్వభావాన్ని నశింపచేస్తుంది..
అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే!!
No comments:
Post a Comment