నవదుర్గా వైభవం:
నవదేవి, నవదుర్గా వైభవంలో భాగంగా ఆరవ రోజు తిథి షష్ఠి. ఈ రోజు విజయవాడలో అమ్మవారి అలంకారం శ్రీ మహాలక్ష్మీ దేవి. శ్రీశైలంలో కాత్యాయనిగా పూజిస్తారు. దసరా ఉత్సవాల్లో భాగంగా మైసూర్ లో కూడా లక్ష్మీదేవిగా పూజిస్తారు. ఉత్తర భారతదేశంలో చండికగా పూజిస్తారు. చండికాదేవిని పూజించడం వల్ల ఐశ్వర్యం (లక్ష్మి) కలుగుతుంది. కుమారి పూజలో ఏడు సంవత్సరముల వయస్సుగల బాలికను పూజిస్తారు.
నవదేవి అలంకారాల లో భాగంగా విజయవాడలో ఈ రోజు అమ్మవారి అలంకారం శ్రీ మహాలక్ష్మీదేవి. "ధనం మూలం ఇదమ్ జగత్" అంటారు. ధనాన్ని ప్రసాదించే దేవత లక్ష్మీదేవి. తనని అగౌరవ పరచని చోట లక్ష్మీదేవి నివసిస్తుంది. లక్ష్మీదేవికి మరొక పేరు చంచల. (స్థిరంగా ఉండనిది). ఏకాగ్ర బుద్ధితో ఉంటే అమ్మ కరుణిస్తుంది. ధనం ఉంది కదా! అని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, భవిష్యత్తులో బాధపడాలి. వృక్షాలలో రావిచెట్టును పూజించాలి. నైవేద్యంగా కేసరిబాత్ నివేదన చేయాలి. చదువుకోవలసిన స్తోత్రాలు, లక్ష్మీ అష్టోత్తరం, లక్ష్మీ సహస్రనామ స్తోత్రం (లక్ష్మీ సహస్రనామాలు రెండు రకాలు ఉన్నాయి... మీకు నచ్చినవి చదువుకోవచ్చు..) కవచం, అష్టకం, (ఇది ప్రతిరోజూ 3సార్లు చదివితే దరిద్రం పోతుంది.) అష్టోత్తర శతనామ స్తోత్రం, లక్ష్మీ స్తోత్రం, లక్ష్మీ సూక్తం, శ్రీసూక్తం చదువుకోవాలి. ఈ రోజు అమ్మవారు కాళికాశక్తిగా చంఢముండాసురుని సంహరించింది. లలితా సహస్రనామాల్లో "మాహేశ్వరి మహాదేవి మహాలక్ష్మీ ర్మృఢప్రియా" అనే శ్లోకాన్ని చదువుకోవాలి. "ఓం శ్రీ మహాలక్ష్మీ దేవతాయై నమః" అనే నామాన్ని జపించాలి. దశమహావిద్యలలో కమలాత్మిక దశావతారాల్లో శ్రీకృష్ణుడిగా, నవగ్రహాల్లో చంద్రుడిగా పూజిస్తారు. లక్ష్మీదేవి గాయత్రీ మంత్రం "మహాదేవ్యైచ విద్మహే! విష్ణుపత్నైచ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్!!" మహిషాసురుడు అనే రాక్షసుని సంహరించడం వల్ల 'మహిషమర్దనిగా' పేరు పొందింది. అష్టలక్ష్ముల రూపంల్లో వరాలిస్తుంది. విజయవాడ కనకదుర్గ ఆలయంలో కూడ్య కోఫ్టాలలో చుట్టూరా అష్టలక్ష్మీ దేవతా విగ్రహాలు ప్రతిష్ఠించారు. తలచినంతనే శరన్నవరాత్రులలో, అష్టరూపాల్లో అష్టసిద్ధులు ప్రసాదించే తల్లి. రెండు చేతులలో కమలాలు ధరించి, వరద, అభయ ముద్రలతో, గజరాజులు తనను సేవించుచుండగా, కమలం మీద ఆసీనురాలై దర్శనమిస్తుంది. ఎవరి ఇంటి వాకిటి ముందైనా! ఆకుపచ్చ రంగు చీర ధరించి ఉన్న, లక్ష్మీదేవి అమ్మవారి చిత్రపటాన్ని తలుపు పైన పెట్టుకోవాలి. బయటకు వెళ్తున్నప్పుడు అమ్మవారు క్రింది నుండి వెళ్ళాలి. దానివలన బయటకు వెళ్ళేటప్పుడు, ఎటువంటి శకునం అడ్డు వచ్చినా సమస్య ఉండదు. పూజామందిరంలో లక్ష్మీదేవి విగ్రహం గజరాజులు తొండాలతో ఎత్తి ఉన్నవి వుండాలి. ఈ విగ్రహం ఇంట్లోకి చూస్తూ ఉండాలి. (బయటకి చూడకూడదు..) లక్ష్మీదేవి విగ్రహం పాలరాతిగాని, వెండిది కానీ పెట్టుకుంటే ఇంకా మంచిది. ఆదిదేవుడు పరమేశ్వరుడు చెప్పిన లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం, ఇంద్రుడి చెప్పిన అష్టకం చదువుకోవాలి. మానవుల దుఃఖాల్ని, దరిద్రాన్ని పోగొట్టి, అష్టైశ్వర్యాలు ప్రసాదించే తల్లి. అష్ట దరిద్రాలు పోవాలంటే! అష్టలక్ష్ముల రూపంలో (ధన- ధాన్య- ధైర్య- విజయ- విద్యా- సౌభాగ్య- సంతాన- గజలక్ష్ములు..) ఉన్న అమ్మవారిని పూజించాల్సిందే! పూజామందిరంలో లక్ష్మీదేవి చిత్రపటం పక్కన, తప్పనిసరిగా నారాయణుడి పటం ఉంచాలి. ఏ రూపంలో ఉన్నా పరవాలేదు. (వెంకటేశ్వరుడు, విష్ణు). అమ్మవారి ప్రక్కన అయ్యవారు లేకుండా, పూజా మందిరంలో చిత్రపటం వుండకూడదు. దంపత సమేతంగా పూజిస్తేనే ఫలితం కలుగుతుంది. లక్ష్మీ అష్టకం వారానికి 80 సార్లు పారాయణం చేస్తే, అష్ట కష్టాలు తొలగిపోతాయి. (రోజుకి 12 సార్లు) శని ప్రభావం నుంచి విముక్తి లభిస్తుంది. శ్రీసూక్తం పారాయణం చేసి, 108 తామరపూలతో లక్ష్మీ అష్టోత్తరం చేయగలిగితే! చాలా మంచిది. లక్ష్మీ దేవాలయాలు మన ఆంధ్రప్రదేశ్ లో ఒక్కటే ఉంది. అది విశాఖపట్నం కనకమహాలక్ష్మి ఆలయం. వైష్ణవ క్షేత్రాలు అన్నింటిలో అయ్యవారి ప్రక్కన అమ్మవారు ఉంటుంది. కాబట్టి లక్ష్మీదేవిని ఆయా ఆలయాల్లో కూడా పూజించవచ్చు.
నవదుర్గా వైభవంలో భాగంగా, శ్రీశైలంలో కాత్యాయనిగా పూజిస్తారు. (పూర్వకాలంలో కాత్యాయని అన్న నామాన్ని, చాలామంది తమ యింటి ఆడపిల్లలకి పెట్టేవారు..) ఈ తల్లి చతుర్భుజి, సింహవాహిని, కుడిచేతిలో అభయముద్ర, ఎడమచేతిలో ఖడ్గము, పద్మము, వరముద్రతో విరాజిల్లుతూ ఉంటుంది. కతుడు అనే ముని పుంగవుని ఆశ్రమంలో పుట్టి పెరగడం వల్ల, కాత్యాయని అంటారు. బ్రహ్మవేత్తల మనస్సు నందు సదా నివసించుట చేత, కాత్యాయని అని పేరు. సమస్త దేవతల తేజస్సు చేత ఆవిర్భవించినది కావున, ఈ తల్లిని ఆరాధించే వారికి, వేదవిజ్ఞాన సర్వస్వం లభిస్తుంది. భాద్రపద బహుళ చతుర్దశి నాడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల తేజస్సుతో, మహర్షి ఇంట కాత్యాయినీ ఉద్భవించింది. ఆశ్వయుజ శుక్ల సప్తమి, అష్టమి, నవమి, తిథులయందు కాత్యాయని, మహర్షి పూజలందుకుంది. మహిషాసురుడు అనే రాక్షసుడిని సంహరించింది.శ్రీకృష్ణుని పొందడం కోసం గోపికలు కాత్యాయనిని పూజించేవారు. ఈ తల్లిని ఆరాధించిన వారికి అమోఘ ఫల ప్రదాయని. చతుర్విధ పురుషార్ధాలు (ధర్మ- అర్థ- కామ- మోక్షాలు..) ప్రసాదించే ఫలదాయిని. ఈ తల్లిని ఆరాధించడం వలన రోగం, శోకం, సంతాపం, భయం, తొలగుటయే గాక జన్మజన్మాంతర పాపాలు నశిస్తాయి..
అమ్మ దయ వుంటే అన్నీ ఉన్నట్లే!!
No comments:
Post a Comment