అమ్మవారి రూపాలలో ముఖ్యమైన నవదుర్గలు
నవదుర్గల ఆవిర్భావం రూప వర్ణన
భారతీయులు తమ కులదేవతగా నవదుర్గలను పూజిస్తారు. ముఖ్యంగా నవరాత్రి ఉత్సవాలలో ఈ తొమ్మిది రూపాలను ఆరాధిస్తారు. ఈ తొమ్మిది రూపాల పేర్లను సాక్షాత్తూ బ్రహ్మ దేవుడే చెప్పాడని దేవీకవచంలో ఉంది.
*నవదుర్గలు అంటే శ్రీ దుర్గాదేవి తొమ్మిది రూపాలు*
*శక్తి సర్వస్య దేవత*
దేవతలకు సైతం శక్తిని ఇచ్చే దేవత కాబట్టి అది శక్తి అంటారు యావత్ ప్రపంచం లో అమ్మవారికి మించిన శక్తి ఎక్కడ ఉండదు , శ్రీ దేవియే అత్యున్నత శక్తి అనే నిర్ధారణ ఋగ్వేద దేవీ సూక్తం ఇతర వేదాలలో మరియు పురాణాలలో చెప్పబడింది.
మహిషాసుర సంహార వృత్తాంత సమయం లో మహిషాసురుడు అనే రాక్షసుడిని సంహరించడానికి జగన్మాత దుర్గాదేవిగా అవతరించింది.
ఈ తొమ్మిది రూపాలు దేవాసుర యుద్ధం లో అమ్మవారికి సహాయంగా నవదుర్గలుగా అవతరించాయి, అమ్మవారి ముఖ్య ఘట్టాలు అన్ని తపస్సుకు, శక్తికి ప్రతీక.
శరన్నవరాత్రులలో తొమ్మిది రోజులు ఈ తొమ్మిది రూపాలలో నవదుర్గలుగా ఆవిర్భవించాయి , మహిషాసురుడితో యుద్ధం చేసి, విజయదశమి రోజున అతన్ని సంహరించిందని దేవీ భాగవతం ,
మార్కండేయ పురాణం ,సప్తశతీ లో వివరణ చూడవచ్చు.
*దుష్టశిక్షణ, లోక సంరక్షణ* కోసం శక్తి స్వరూపిణి ఎత్తిన అవతారాలే *నవదుర్గలు*
*ఆ రూపాలు ఈ విధంగా ఉంటాయి*
*ప్రథమం శైలపుత్రీ చ ద్వితీయం బ్రహ్మచారిణీ|
తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకం|
పంచమం స్కందమాతేతి షష్టం కాత్యాయనీ చ| సప్తమం కాళరాత్రీతి మహాగౌరీతి చాష్టమమ్| నవమం సిద్ధిధాత్రీ చ నవదుర్గాః ప్రకీర్తితాః*||
1 శైలపుత్రి ,2 బ్రహ్మచారిణీ ,3చంద్రఘంట
4 కూష్మాండ , 5 స్కందమాత,6 కాత్యాయనీ
7 కాళరాత్రి , 8 మహాగౌరీ , 9.సిద్ధిధాత్రి
*ఈ నవదుర్గా అమ్మవార్ల రూప వర్ణన +మహిమ*
1. *శైలపుత్రి*
సతీదేవి యోగాగ్నిలో శరీరాన్ని త్యజించి, ఆ తర్వాత పర్వతరాజు హిమవంతుని కుమార్తెగా (పుత్రిగా) జన్మించింది కాబట్టి *శైలపుత్రి* అని పేరు వచ్చింది.
స్వరూపం: వృషభం (ఎద్దు) వాహనం, కుడిచేతిలో త్రిశూలం, ఎడమచేతిలో కమలం (పద్మం) ఉంటాయి. తలపై చంద్రవంక ఉంటుంది.
మహిమ: వాంఛితాలను (కోరికలను) ప్రసాదించే తల్లి.
2. *బ్రహ్మచారిణి*
'బ్రహ్మచారిణి' అంటే తపస్సు చేసే తల్లి, బ్రహ్మమునందు చరించేది. శివుడిని భర్తగా పొందడానికి తీవ్రమైన తపస్సు చేసి ఉమ అని కూడా ప్రసిద్ధి చెందింది.
*స్వరూపం* : కుడిచేతిలో జపమాల, ఎడమచేతిలో కమండలం ధరించి ఉంటుంది. స్వరూపం ప్రకాశవంతంగా, శుభకరంగా ఉంటుంది.
*మహిమ* : ఈ దేవి ఆశీస్సుల వలన భక్తులకు నిశ్చలమైన దీక్ష, అన్నింటా విజయం లభిస్తాయి.
3. *చంద్రఘంట*
ఈ తల్లి శిరస్సుపై ఉన్న అర్ధచంద్రుడు గంట ఆకారంలో ఉండటం వలన 'చంద్రఘంట' అని పేరు వచ్చింది.
*స్వరూపం* : బంగారు కాంతితో మెరుస్తూ ఉంటుంది. సింహం వాహనం. పది చేతులలో ఖడ్గాలు, బాణాలు వంటి ఆయుధాలు ఉంటాయి. ఎల్లప్పుడూ యుద్ధానికి సిద్ధంగా ఉండే ముద్రలో ఉంటుంది.
*మహిమ* : ఈమె ఘంటా శబ్దం విని రాక్షసులు భయపడతారు. భక్తులకు మాత్రం శాంతంగా కనిపిస్తుంది. ఈమె ఆరాధన తక్షణమే ఫలాలను ఇస్తుంది. భక్తుల కష్టాలను వేగంగా నివారిస్తుంది. భక్తులు సింహం వలె పరాక్రమశాలురుగా, నిర్భయులుగా ఉంటారు.
4. *కూష్మాండ*
ఈ దేవి నవ్వుతూ (అవలీలగా) బ్రహ్మాండమును సృష్టించింది కాబట్టి 'కూష్మాండ'గా పిలవబడుతుంది.
*స్వరూపం* : సూర్యమండలంలో ఉంటుంది. తన తేజస్సుతోనే దశ దిశలు ప్రకాశిస్తాయి. ఈమె అష్టభుజా దేవి అని కూడా అంటారు. సింహం వాహనం. ఎనిమిది చేతులలో కమండలం, ధనుస్సు, బాణం, కమలం, అమృత కలశం, చక్రం, గద, మరియు సర్వసిద్ధులను ప్రసాదించే జపమాల ఉంటాయి.
*మహిమ* : ఈ దేవి భక్తుల రోగాలను, శోకాలను తొలగిస్తుంది. ఆయుష్షు, కీర్తి, బలం, ఆరోగ్యం, భాగ్యం పెరుగుతాయి.
5. *స్కందమాత*
స్కందుడి తల్లి కాబట్టి ఈమెను 'స్కందమాత' అంటారు. నవరాత్రులలో 5వ రోజు పూజిస్తారు.
*స్వరూపం* : నాలుగు భుజాలు ఉంటాయి. ఒక కుడిచేతితో బాల స్కందుని ఒడిలో పట్టుకొని, మరొక చేతిలో పద్మం ధరించి ఉంటుంది. ఎడమవైపున ఒక చేతిలో అభయముద్ర, మరొక చేతిలో కమలం ధరించి ఉంటుంది. సింహం వాహనం, పద్మాసనంలో కూర్చుంటుంది.
*మహిమ* : భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయి. ఈ లోకంలోనే శాంతి, సుఖాలు అనుభవిస్తారు. తను సూర్యమండలానికి అధిష్ఠాత్రి కాబట్టి, ఉపాసకులకు దివ్య తేజస్సు లభిస్తుంది.
6. *కాత్యాయనీ*
బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల తేజస్సుతో కాత్యాయన మహర్షి ఇంట పుత్రికగా అవతరించింది.
*స్వరూపం* : బంగారు వర్ణంలో ఉంటుంది. సింహం వాహనం. నాలుగు భుజాలు ఉంటాయి. కుడిచేతులలో అభయ ముద్ర, వరముద్ర; ఎడమచేతులలో ఖడ్గం, పద్మం శోభిస్తుంటాయి.
*మహిమ* : ఈమెను ఆరాధించి గోపికలు శ్రీ కృష్ణుడిని పొందారు. ఈమెను సేవించినవారికి ధర్మార్థ కామ మోక్షాలు అనే నాలుగు పురుషార్థాల ఫలం లభిస్తుంది. రోగాలు, భయాలు, పాపాలు నశిస్తాయి.
7. *కాళరాత్రి*
అమ్మవారు శరీర వర్ణం గాఢాంధకారం వలె నల్లనిది.
*స్వరూపం* : గాడిద (గార్దభము) వాహనం. కేశాలు చెల్లాచెదురుగా ఉంటాయి. మెడలోని హారం విద్యుత్ కాంతులు వెదజల్లుతుంది. మూడు కన్నులు ఉంటాయి. నాశిక నుండి అగ్ని జ్వాలలు వస్తుంటాయి. ఒక కుడిచేతితో వరముద్ర, మరొక చేతితో అభయ ముద్రను చూపిస్తుంది. ఒక ఎడమచేతిలో ఇనపముండ్ల ఆయుధం, మరొక చేతిలో ఖడ్గం ధరించి ఉంటుంది.
*మహిమ* : స్వరూపం భయానకంగా ఉన్నా, తను ఎల్లప్పుడూ శుభాలనే ప్రసాదిస్తుంది కాబట్టి ఈమెను "శుభంకరి" అని కూడా అంటారు. స్మరించినంత మాత్రాన దానవులు, భూత ప్రేత పిశాచాలు పారిపోతాయి. అగ్ని, జలము, జంతువుల భయాలు, శత్రు భయాలు తొలగిపోతాయి.
8. *మహాగౌరి*
ఎనిమిది సంవత్సరాల ప్రాయంలో ఉంటుంది. మేని రంగు మల్లెపూవు, శంఖము, చంద్రుని వలె తెల్లగా (గౌరవర్ణంగా) ఉంటుంది. అందుకే 'మహాగౌరి' అని అంటారు.
*స్వరూపం* : వృషభం (ఎద్దు) వాహనం. నాలుగు భుజాలు ఉంటాయి. కుడిచేతులలో అభయముద్ర, త్రిశూలం; ఎడమచేతులలో ఢమరుకం, వరముద్ర ఉంటాయి. దర్శనం ప్రశాంతంగా ఉంటుంది.
*మహిమ* : శివుడిని భర్తగా పొందడానికి తపస్సు చేసినప్పుడు శరీరం నలుపెక్కింది. శివుడు గంగాజలంతో అభిషేకించగా శ్వేత వర్ణశోభితయైంది. తన శక్తి అమోఘమైనది. ఈమెను ఉపాసించిన భక్తుల పాపాలన్నీ నశిస్తాయి. భవిష్యత్తులో కూడా దుఃఖాలు వారిని దరిచేరవు. కష్టాలు మాయమై, అసంభవమైన పనులు కూడా సులువుగా పూర్తవుతాయి.
9. *సిద్ధిధాత్రి*
అన్ని రకాల సిద్ధులను (శక్తులను) ప్రసాదించే తల్లి కాబట్టి 'సిద్ధిదాత్రి' అంటారు. శివుడు కూడా ఈ దేవి దయవలనే అన్ని సిద్ధులను పొందారని దేవీపురాణం చెబుతోంది.
*స్వరూపం* : సింహం వాహనం, పద్మంపై ఆసీనురాలై ఉంటుంది. నాలుగు భుజాలు ఉంటాయి. కుడివైపున చక్రం, గద; ఎడమవైపున శంఖం, కమలం ధరించి ఉంటుంది. శివుడి శరీరంలో అర్ధభాగమై నిలిచింది.
*మహిమ* : నిష్ఠతో ఆరాధించిన వారికి సకల సిద్ధులు లభిస్తాయి. లౌకిక, పారమార్థిక కోరికలన్నీ నెరవేరుతాయి. భక్తులకు ఇంక ఏ కోరికలు మిగిలి ఉండవు. అమ్మవారి ధ్యానం, పూజల ప్రభావం వలన ఈ సంసారం నిస్సారమైనదిగా బోధపడి, పరమానందాన్ని ఇచ్చే మోక్షపదం ప్రాప్తిస్తుంది.
ఈ నామాల స్మరణ అర్చన విశేషం ఏ అమ్మవారి యాగం లో అయినా ఈ దేవత పూజలు తప్పక చేస్తారు , ఒక్కో రోజు విడివిడిగా పూజలు చేయవచ్చు ,కానీ పూజ ఆవాహన మాత్రం 9 దుర్గాలను ఒకేసారి ఆవాహన చేసి పూజించాలని నియమం ఉన్నది.
*జయ దుర్గే హర దుర్గే*
*రాళ్ళబండి శర్మ * 🙏🙏🙏🙏🙏
No comments:
Post a Comment