Wednesday, September 3, 2025

ఇంట్లో ఎవరైనా మరణిస్తే ఏడాది వరకు పూజలు చేయకూడదా?దైవకార్యాలకు విరాళాలు ఇవ్వకూడదా? అని కొందరి అనుమానం

ఇంట్లో ఎవరైనా మరణిస్తే ఏడాది వరకు పూజలు చేయకూడదా?దైవకార్యాలకు విరాళాలు ఇవ్వకూడదా? అని కొందరి అనుమానం* 

* కుటుంబసభ్యులు ఎవరైనా మరణిస్తే, ఏడాదివరకు ఎటువంటి పూజలు చేయకూడదని,దైవ సంబంధ కార్యాలకు విరాళాలు, చందాలు ఇవ్వకూడదని  ప్రచారం చేస్తున్నారు.*
 *కొందరైతే కనీసం దీపం కూడా వెలిగించరు. దేవతలందరిని ఒక బట్టలోచుట్టి, అటక మీదపెట్టేస్తారు. సంవత్సరీకాలన్నీ అయిపోయాక  మరుసటి ఏడాది దేవుళ్ళ చిత్రపటాలను క్రిందకు దింపి, శుభ్రంచేసి పూజచేస్తారు. అంటే ఆ వ్యక్తి మరణించిన ఇంట్లో ఏడాదిపాటు దీపారాధాన, దైవానికిపూజ, నివేదన ఉండవన్నమాట. 
ఇది సరైన పద్ధతి కాదు. శాస్త్రం ఇలా చెప్పలేదు.*

*దైవ సంబంధిత కార్యాలకు సేవా కార్యక్రమాలకు ఈ ఏటి సూతక సమయంలో ఇచ్చిన విరాళాలకు అత్యంత విశేష ఫలితాలు కలుగుతాయి. అందుకే పూర్వకాలంలో శాశ్వత ఉభయాలు,సేవలు ఏర్పాటు చేసికొన్నారు.ఏ విపత్తులు సంభవించినా ఈ కార్యక్రమాలు ఆపకూడదనే ఉద్దేశంతో..ఈ సమయం లో చేసిన దానధర్మాలు,దైవకార్య విరాళాల వలన పైలోకాన ఉన్న పితృదేవతలకు శాంతి కలుగుతుంది.. వారికి, వారి ద్వారా మనకు దైవానుగ్రహం తో విశేషఫలితాలు కలుగుతాయి.వంశ వృద్ధి కలుగుతుంది.*

* దీపంలేనిఇల్లు స్మశానంతోసమానం. దీపం శుభానికిసంకేతం. దీపం ఎక్కడ వెలిగిస్తే అక్కడకు దేవతలొస్తారు. ప్రతిఇంట్లోను నిత్యదీపారాధాన  జరగాలి. మరణం సంభవించిన ఇంట్లో 11 వరోజు తర్వాత శుద్ధి కార్యక్రమం జరుగుతుంది. 12 వరోజు శుభస్వీకారం జరుగుతుంది. ఆ కుటుంబం ఆ 11 రోజులు మాత్రమే ప్రత్యేకంగా పూజచేయకూడదు. అంతవరకే శాస్త్రంలో చెప్పబడింది. అంతేకానీ ఏడాదిపాటు దీపం వెలిగించకూడదని, పూజలు చేయకూడదనికాదు.*

* నిజానికి సూతకంలో ఉన్న సమయంలో కూడా సంధ్యావందనం చేయాలని, అర్ఘ్యప్రధానం వరకు బాహ్యంలోచేసి, మిగితాది మానసికంగా చేయాలని శాస్త్రంచెప్పింది.*ఆదిత్యయోగీ*
*ఏడాదిపాటు  ఆలయాలకు వెళ్ళకూడదని కూడా చెప్పలేదు.*
*మనం నిత్యం ఇంతకముందు ఏదైతే చేస్తున్నామో, అది నిరభ్యంతరంగా చేసుకోవచ్చు.* 
కొత్త పూజలు అనేవి ప్రారంభించకూడదు.*
*ఇంతకముందు,రోజూ ఆలయానికి వెళ్తుంటే, సూతకం అయ్యాకకూడా యధావిధిగా ఆలయదర్శనం చేయవచ్చు.*

* మనం నిత్యం అర్చించడంవలన మనం పూజించే చిత్రపటాల్లో దేవతలు వచ్చి కూర్చుంటారు. అలా ఏడాదిపాటు వారికి ధూప, దీప, నైవేధ్యాలు మొదలైన ఉపచారాలు చేయకుండా, బట్టలోచుట్టి పక్కనపెట్టడమే తప్పు. అది దోషము, అరిష్టము కూడా. కనుక తప్పకుండా ఇంట్లో నిత్య దీపారాధన, దైవారాధన జరగాలి. ఇంటికిగానీ, ఇంటి సభ్యులకు కానీ ఎలాంటి దోషాలున్నా, వాటిని అన్నిటిని ఆపే శక్తి ఆ ఇంట్లోచేసే దైవారాధనకు ఉంటుంది. కనుక ఎన్నడూ దైవారాధన, దీపారాధన మానకూడదు. పూజలు తప్పకుండా చేసితీరాలి..*

రక్త సంబంధాల గొప్పతనం ఇదే.!

బంధాలలో రక్త సంబంధాలు చాలా గొప్పవి. తల్లిదండ్రులు, బిడ్డల తరువాత ఆ బంధం తోబుట్టువుల రూపంలో ఉంటుంది. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, అన్నా చెల్లెళ్ళు.. ఈ బంధాల విలువ వెలకట్టలేనిది. జీవితాల్లో వివాహాలు, వృత్తి, సంపాదన, ఆర్థిక విషయాల కారణంగా తోబుట్టువులు ఒకరికొకరు దూరం అవుతారేమో.. కానీ తోబుట్టువుల మద్య బంధం దృఢంగా ఉంటే ప్రపంచంలో దానికి మించిన గొప్ప బంధం మరొకటి ఉండదు. దీనికి నిలువెత్తు ఉదాహరణగా రామాయణంలో ఒక చిన్న సంఘటన తెలియజేస్తుంది.ఆదిత్యయోగీ.

శ్రీరామచంద్రుడు తండ్రి మాట మీద అడవులకు వెళుతున్నప్పుడు ఓ  సంఘటన జరిగింది. రాముడు సీతమ్మతో కలసి అడవులలో... రాళ్ళూరప్పలతో నిండిన, కఠినాతికఠినమయిన దారుల్లో నడుచుకుంటూ ఓ చోట దిగాలుపడి కూర్చుంటాడు . అన్యమనస్కుడయి బాధపడుతున్న రాముడిని చూసి కారణమేంటని అడుగుతుంది ఆయన భార్య సీతాదేవి. అప్పుడు రామచంద్రుడు “దేవీ! తమ్ముడు భరతుడు మనస్సులో మెదులుతున్నాడు. మన వనవాసం విషయం తెలిసిన వెంటనే, మనను వెతుక్కుంటూ భరతుడు తప్పక వస్తాడు. అలా అన్వేషిస్తూ ఈ అడవుల్లో ఎంత మానసికక్షోభ అనుభవిస్తాడో కదా!” అంటాడు బాధగా.

అప్పుడు సీతమ్మ రాముడితో  "మీ తమ్ముడు స్థితప్రజ్ఞుడనీ, కష్టనష్టాలకు చలించడనీ ప్రశంసిస్తూంటారు కదా! ఈ మాత్రం బాధను కూడా ఓర్చుకోలేడా?" అంటూ రాముడి పక్కనే  కూర్చుంటుంది. 

సమాధానంగా శ్రీరాముడు “ఓ జానకీ! భరతుడు తాను కష్టాలు అనుభవిస్తున్నందుకు కుంగిపోయేంత బలహీనుడు కాడు. కానీ తన వల్ల అన్నావదినలు అడవుల పాలై, ఈ మార్గంలోనే నడుచుకుంటూ అయ్యో! ఎన్ని బాధలు పడ్డారోనని కుమిలిపోతాడు" అంటూ కన్నీరు పెట్టుకుంటాడు. 

అదీ ఆ అన్నదమ్ముల ఆత్మీయబంధం. తమ్ముడికి పట్టం కట్టడం కోసం అడవులు పట్టిన అన్న ఒకరైతే.... అన్న పాదుకలకు పట్టాభిషేకం చేసి వైభోగాలకు దూరంగా వనవాసిలా జీవించిన తమ్ముడు మరొకరు. అందుకే ఆ అనుబంధం అజరామరం... ఆదర్శ నీయం... గజం స్థలం పంపకంలో తేడా వస్తేనే గొంతు కోయడానికి కూడా వెనకాడని తోబుట్టువులున్న ఈ కాలానికి ఆ ఆదర్శం అతిశయోక్తిగానే కనిపిస్తుంది. కానీ సాక్షాత్తూ భగవంతుడు అన్నగా అవతరించి తోబుట్టువుల మధ్య నెలకొనవలసిన త్యాగనిరతిని ఆచరించి చూపించిన భూమి మనది. ఆర్థిక సంబంధాల కంటే మానవ సంబంధాలు గొప్పవని తెలుసుకున్నప్పుడు మనిషి వ్యక్తి అనిపించుకుంటాడు..*
.
#పూజలో ప్రధానంగా 64 ఉపచారాలు చేయాలి. ప్రతిరోజూ కష్టం అంటే షోడశోపచారములు చేయాలి. ఈ పదహారు ఉపచారాలు ఎలా ఉంటాయి అంటే మీకు అత్యంత ప్రీతిపాత్రమైన వ్యక్తి మీ ఇంటికి వస్తున్నారనుకోండి. మీ ఉత్సాహం ఎలా ఉంటుందో పూజ అలా ఉండాలి. అది యాంత్రికంగా చేసేది కాదు. ఉమా మహేశ్వరులను రోజూ పూజ చేస్తారనుకోండి. ఆవాహయామి - అక్కడే ఉందిగా విగ్రహం. క్రొత్తగా రమ్మనడమేమిటి? కాదు. స్వామీ! రండి కూర్చొండి. మీ మంటపంలోకి ఆయన ఎక్కుతున్నారు అన్న భావన. ఆసనం సమర్పయామి - సింహాసనంలో కూర్చోండి. ఈ ఉపచారాలు చేస్తున్నప్పుడు మీరు విగ్రహానికి కాదు చేస్తున్నది మనస్సులో ఎదురుగా పరమేశ్వరునికే ఇస్తున్నానన్న భావన చేత పారవశ్యాన్ని పొందారు. అంతసంతోషాన్ని పొంది చిట్టచివర నీరాజనం ఇచ్చి మంత్రపుష్పం చెప్పి పీటమీదనుంచి లేచి బయటికి వచ్చారు. మనిషి పుట్టుకనుంచి శరీరం విడిచి పెట్టడం వరకు పదహారు సంస్కారాలు. చంద్రుడికి పదహారు కళలు. పూజలో పదహారు ఉపచారాలు. పదహారు చేయడానికి సమయం లేకపోతే కనీసంలో కనీసం అయిదు చేయాలి. గంధపుష్పధూపదీపనైవేద్యాలు. "పంచసంఖ్యోపచారిణీ". అనంతకోటి సుఖాలు మనం అనుభవిస్తున్నాము అంటే అయిదు ఇంద్రియాలలోనుంచే. ఈ అయిదు ఇంద్రియాలు పరమేశ్వరుడిచ్చాడు. విచ్చలవిడిగా వాడుకున్నావు. నిద్రాకాలిక సుఖాన్ని ఇచ్చాడు. నిద్రలో మళ్ళీ ఈ ఇంద్రియాలకీ శక్తినిచ్చాడు. నిద్రలేవగానే నువ్వు సుఖాలన్నీ అనుభవించే ముందు ఎవరికి కృతజ్ఞత చెప్పాలి? ఇచ్చినందుకు ఈశ్వరుడికి చెప్పాలి. అందుకే పూజ ప్రాతఃకాలంలో. దీపంతో పూజ ప్రారంభం. ధూపం వేసి కృతజ్ఞత చెప్తున్నావు. సాత్త్విక భావనతో ఉన్నావు కాబట్టి సాత్త్విక పదార్థాలని ఈశ్వరుడికి నైవేద్యం చేస్తున్నావు. స్పర్శను ఇచ్చినందుకు కృతజ్ఞతగా చల్లటి చందనాన్ని అనులేపనం చేస్తున్నాను. చెవులతో ఎన్నో విని మురిసిపోతున్నావు. వీటికి కృతజ్ఞత చెప్తూ పువ్వులతో ఉపచారం చేస్తున్నావు. అన్నింటికన్నా పెద్ద గౌరవం ప్రసాదానికి ఇస్తారు. ప్రసాదం ఇచ్చినప్పుడు వెంటనే కళ్ళద్దుకొని నోట్లో వేసుకోవాలి. పువ్వులకొరకే తుమ్మెదలు ధ్వని చేస్తాయి. పువ్వు కనపడితే ధ్వని ఆపి మకరందం త్రాగుతుంది. ఆ నామములు చెప్పడం చేత మనస్సు వికసనాన్ని పొందాలి. అందుకే వినేటటువంటి చెవులు ఇచ్చిన ఈశ్వరుడికి కృతజ్ఞత చెప్పడానికి నామంతో పువ్వులు వేస్తారు. అనంతమైన సుఖాలు అనుభవించడాని ఈ అయిదు ఇంద్రియాలే కారణం. ఈ అయిదు ఇంద్రియాలు నాకిచ్చి అవి బడలిపోతే మళ్లీ శక్తినిచ్చినందుకు ఈశ్వరా! ముందు నీకు కృతజ్ఞత చెప్పి వాడుకుంటాను ప్రసాదంలాగా. ప్రొద్దున పూజ చేసి ఇంద్రియాలను వాడుకోవడం మొదలుపెడతాడు. అంటే ఈ శరీరాన్ని ప్రసాదంగా వాడుకుంటున్నావు. ఎవడు పూజ చేస్తాడో వాడు పూజనీయుడౌతాడు. ఎవడు పూజ చేయడో వాడు పూజకి అర్హుడు కాకుండా పోతాడు. మీరు భగవంతుడికి కృతజ్ఞతావిష్కారం చేస్తే మీరు పూజ చేసినట్లే మీరుకూడా పూజనీయులౌతారు. లోకంచేత గౌరవింపబడే శీలవంతులౌతారు. భగవంతుడిచ్చినవి కృతజ్ఞత చెప్పకుండా వాడుకుంటే కృతఘ్నతా దోషం వస్తుంది. అందుకని పూజలో అయిదు ఉపచారాలు. ఆయనకి లేక కాదు. మనయొక్క మర్యాద చూపించుకోవడానికి ఈశ్వరుడికి ఈ పంచోపచారాలు చేస్తాం..*
.

#దానం చేస్తే నాకు ఈ ధనం ఎక్కడి నుండి వచ్చింది? నేను వ్యాపారం చేసి సంపాదించాను. ఇది నాదే, ఇది నా కష్టార్జితం. నా కొడుకులకు కూడా అడిగే అధికారము ఎవరికీ లేదు. నా ఇష్టం వచ్చినట్టుగా దానం చేస్తాను అని దానం చేశాడు అనుకోండి, ఇతడు మర్చిపోయిన విషయం ఏమిటి? ఈశ్వరుడు ఇచ్చాడు అన్నమాట మరచిపోయాడు. వ్యాపారం చేస్తే రావాలి అని ఏమి ఉంది? ఉన్నది పోవచ్చు కదా! అది ఎప్పుడైతే మర్చిపోయాడో అహంకారంతో నేనే సంపాదించి దానం చేస్తున్నాను అని అనుకుంటాడు. మరొక్క మనిషి ఇచ్చిన దానినే మర్చిపోకుండా ఉండాలి అని చెబుతున్నప్పుడు, ఈశ్వరుడు ఇచ్చాడు అన్న మాట మరచిపోకూడదు కదా! అందరూ అస్వతంత్రులే! ఆదిత్యయోగీ.

ఈశ్వర ఆధీనమై జగత్తు నడుస్తోంది. ఇచ్చిన ఐశ్వర్యం ఈశ్వరుడు ఇచ్చాడు, ఆయనను సంతోషపెట్టడానికే సమస్త జీవులకు పనికి వచ్చేటట్టుగా నేను దానం చేస్తాను. ఆయన ఇచ్చిన ధనం ఆయనకు అవసరం లేదు కదా! గుడి గోపురం కట్టించుకోవడానికి కూడా ఆయనకు ఏమి కోరిక లేదు. మరి, ఎవరికి ఇస్తే ఆయన సంతోషిస్తాడు? ఎవరి లోపల ఆయన ఉన్నాడో వాళ్లు తింటే ఆయన సంతోషిస్తాడు. ఎవరికి అవసరమై తీసుకొని తింటారో, ఆనందంతో స్వీకరించి తింటారో వారి ఆనందం చూసి సాక్షిగా లోపల తాను ఉండి సంతోషిస్తాడు. "అంతర్యామిగా ఉండి" కాబట్టి, వచ్చిన అతిథికి అన్నం పెడితే అతిధి లోపల ఉండే అగ్ని దేవుడు సాక్షిగా ఉండి ఈ శరీరంలో ఈ మనిషికి లోపల ఉండేటటువంటి జఠరాగ్ని స్వరూపుడైన ఈశ్వరుడు తాను తీసుకుంటాడు. ఈశ్వరుడు తినేదంత జీవుడిలోని ఆహారాన్నే, వాళ్లు తీసుకునే ఆహారాన్ని సాక్షిగా తీసుకుంటాడు. వాళ్లు సంతోషిస్తారు అనుకుని అతడు ఇచ్చిన దాన్ని తనకి కైంకర్యం కోసం నేను ఖర్చు పెడతాను అనడం చేత ఐశ్వర్యం అనుభవించిన వాడు అవుతున్నాడు, దాతృత్వం చేసినవాడు అవుతున్నాడు, ఈశ్వరుడిని సంతోషపెట్టిన వాడు అవుతున్నాడు, ఐశ్వర్యాన్ని సద్వినియోగం చేసినవాడు అవుతున్నాడు, అహంకారాన్ని నిర్మూలించినవాడు అవుతున్నాడు. ఈశ్వరుడిని తనలోను, తనకు దానం ఇచ్చిన కర్తగా, తన ధనానికి భోక్తగా రెండింటికి తననే గుర్తించినవాడు అవడం చేత ఆద్యంతం మొదటి నుంచి చివరి వరకు ఈశ్వరుడి యందే భావన కలిగిన వాడు అవుతున్నాడు. మోక్ష విద్యే అవుతుంది. క్రియ మాములే దాని వెనకాల భావన ఇంత గొప్పది....*

                 #శివాయ గురువే నమః *

No comments:

Post a Comment

RECENT POST

ఆర్ధిక పరిస్థితి మెరుగుపడి , అఖండ ధన రాజయోగం కోసం మీకోసం.

ఆర్ధిక పరిస్థితి మెరుగుపడి , అఖండ ధన రాజయోగం కోసం మీకోసం.............!!  కుబేర మంత్రం : (ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యదీప్తాయै ధనధాన్య...

POPULAR POSTS