Friday, December 1, 2017

మధ్వాచార్యులు

మధ్వాచార్యులు
             ( ముఖ్య అంశాల సేకరణ-- డి. నారాయణ రావు, విద్యానగర్, హైదరాబాద్ , తెలంగాణా రాష్ట్రం)

                    మధ్వాచార్యులు 13వ శతాబ్దం వారు. వీరు క్రీస్తు శకం 1238 లో విజయదశిమి రోజున కర్నాటక రాష్టం లోని ఉడిపికి దగ్గరగా ఉన్న పాజక అనే స్థలం లో తుళు భాష మాట్లాడే బ్రాహ్మణ వంశంలో నారాయణ భట్టు (మధ్యగేహ భట్టు) మరియు వేదవతి అనే దంపతులకు జన్మించారు. వీరి పేరు వాసుదేవుడు. వీరి కాలం క్రీస్తు శకం 1238 నుండి 1317 వరకు. వీరు వాయుదేవుని ( ముఖ్యప్రాణుడి) మూడవ అవతారం అనీ  అందువల్లే 79 ఏళ్ల వయసులో వీరికిష్టమైన 'ఐతరీయోపనిషత్తు' ను పారాయణం చేస్తూ వారి శిష్యులకు వినిపిస్తూండగా కురిసిన పుష్ప వృష్టి మధ్య అదృశ్య మయ్యారనీ ప్రతీతి.   మొదటి రెండు అవతారాలు వరుసగా హనుమంతుడు మరియు భీమసేనుడు. 
                     వీరు 10 సంవత్సరాల వయసులో అచ్యుత ప్రేక్షకాచార్యుని అధ్వర్యంలో సన్యసించారు.  ఒక సారి వీరి గురువుగారైన అచ్యుత ప్రేక్షకాచార్యులు వీరికి అద్వైత గ్రంథమగు 'ఇష్ఠ సిద్ధి' ని బోధించే ప్రయత్నం చేయగా, అందులోని మొదటి ప్రకరణం లోనే 30 దోషాలను ఎత్తి చూపారు. వారి తర్కానికి గురువు గారి వద్దగానీ మరి ఇతరులవద్ద గాని సమాధానం లేకపోయినది. తరువాతి కాలంలో వీరి గురువైన అచ్యుత ప్రేక్షకాచార్యులు వీరి అపారమైన జ్ఞాన సంపద మరియు తార్కికత లకు అబ్బురపడి, వీరికి బోధించడానికి బదులు తనే వీరి శిష్యులై పురుషోత్తమ తీర్థులుగా పేరు మార్చుకున్నారు.   వీరు అట్టి ప్రతిభావంతులు.  
                    శ్రీ రామానుజులది 'శ్రీవైష్ణవం' అయితే వీరిది 'సద్వైష్ణవమ్'.  ఆనంద స్వరూపుడైన విష్ణువు, చైతన్యంతో గల జీవుడు, చైతన్యం లేని జడపదార్థాలు వేరువేరని వీరి సిద్ధాంతం.  ద్వైత సిద్ధాంతం లో వీరు పంచ భేదాలను నిరూపించారు. 1. దేవుడు, జీవుడు వేరని (జీవ ఈశ్వర భేదం), 2. దేవుడు, జడపదార్థం వేరని (ఈశ్వర జడ భేదం), 3. జీవుడు, జడపదార్థం వేరని(జీవ జడ భేదం) , 4. ఒక జీవుడు మరొక జీవుడు వేరని (జీవ జీవ భేదం), 5. ఒక జడ పదార్థం మరొక జడ పదార్థం వేరని (జడ జడ భేదం) ఇలా అయిదు రకాల భేదాలను బోధించారు.  ఇదియే ద్వైత సిద్దాంతం. తన ద్వైత వేదాంత తత్త్వాన్ని 'తత్త్వవాదం ' గా అభివర్ణించారు. వీరి ప్రధాన బోధనలు 1. హరి సర్వోత్తముడు వాయు జీవోత్తముడు 2.జగత్తు మిథ్య కాదు సత్యమే 3. హరి (విష్ణువు) సర్వోత్తముడేకాదు స్వతంత్రుడుకూడా .  4.దేవుడు, జీవుడు మరియు జడములలో పంచ భేదాలు అక్షర సత్యమైనవి. 5. జీవులు, జడ పదార్థములు అస్వతంత్రములు, వాటి మనుగడకై విష్ణువుపై ఆధారపడినవి. 6.కక్షా తారతమ్యము శాశ్వతమైనది.
                      ఒకసారి వీరు దక్షిణ కన్నడ లోని మాల్పే తీరం సమీపంలో మునిగిపోతున్నఒక ఓడను రక్షించగా ఆ ఓడలోని ముఖ్య నావికుడు భక్తిభావంతో వీరికి ఒక గోపీచందనం మూటను బహూకరించాడు.    
శ్రీ మహావిష్ణువు యొక్క వివిధ అవతారాలను స్తుతిస్తూ ఆ మూటను వీరు ఉడిపికి తెచ్చారు. ఆ స్తోత్రమే తరువాతి కాలంలో 'ద్వాదశ స్తోత్రం' గా పిలువబడింది. ఆ గొపీచందనం మూటను మధ్వ సరోవరం లో శుద్ధి చేసి దానిని విప్పిన వీరికి ఆ గోపీచందనం కణికల మధ్య ఒక చిన్న కృష్ణ విగ్రహం లభించింది. ఆ విగ్రహాన్నే 800 ల సంవత్సరాల పూర్వం ఉడిపిలో ప్రతిష్టించారని అంటారు.  తనను అమితంగా కొలిచే అంత్యకులజుడైన కనకదాసుని కరుణించి తూర్పు ముఖంగా ఉన్న శ్రీకృష్ణుడు పశ్చిమ ముఖుడై గవాక్షం గుండా అతడికి దర్శనం అనుగ్రహించాడు. ఇప్పటికి కూడా ఉడిపిలో శ్రీకృష్ణుడు పశ్చిమాభిముఖుడై ఉండే మనల్ని అనుగ్రహిస్తున్నాడు.
                       మధ్వాచార్యులనే 'పూర్ణప్రజ్ఞులనీ', 'ఆనందతీర్థులనీ' వ్యవహరిస్తారు.  సన్యసించినపుడు వీరి గురువగు అచ్యుత ప్రేక్షకాచార్యులు వీరిని ' పూర్ణ ప్రజ్ఞుడు ' అని పిలిచారు. వీరు అద్వైత వాదియైన వాసుదేవ పండితుడితో వాదంలో జయించినపుడు వీరి గురువు వీరిని ' ఆనంద తీర్థుడు ' అని పిలిచారు. వీరు సంస్కృత భాషలో బ్రహ్మ సూత్రాలపై  4 గ్రంథాలు, భగవద్గీతపై 2 గ్రంథాలు, ఉపనిషత్తులపై 10 గ్రంథాలు, ఋగ్వేద భాష్యం పై 1, అరణ్యకం పై 1, మహాభారత తాత్పర్యం పై 2, భాగవత తాత్పర్యంపై 1, తత్త్వశాస్త్రంపై 9, మంత్ర శాస్త్రం, తంత్ర శాస్త్రం, ఆచారకాండ, కర్మకాండ, ధర్మ శాస్త్రం ఇత్యాది విషయాలపై 7 ఇలా మొత్తం37 ఉత్కృష్ట గ్రంధాలను రచించి లోకానికి మహోపకారం చేశారు.
                        వీరికి నలుగురు ముఖ్య శిష్యులు. వీరు 1) పద్మనాభ తీర్థులు, 2) నరహరి తీర్థులు, 3) మాధవ తీర్థులు మరియు 4) అక్షోభ్య తీర్థులు. వీరు ఎనిమిది మంది శిష్యులకు దీక్షనిచ్చి, ఎనిమిది మఠాలను స్థాపించి, ఆయా మఠాలకు అధిపతులుగా వారిని నియమించారు. అవి క్రింది విధంగా.
    1. పలుమార మఠాన్ని స్థాపించి మఠాధిపతిగా శ్రీ హృషీకేశ తీర్థులను నియమించారు.  ఇక్కడ శ్రీ రాముని
    విగ్రహాన్ని స్థాపించారు.2. అదమారు మఠాన్ని స్థాపించి మఠాధిపతిగా శ్రీ నరసింహ తీర్థులను
    నియమించారు.   ఇక్కడ శ్రీ కృష్ణుడి విగ్రహాన్ని స్థాపించారు 3. కృష్ణాపుర మఠాన్ని స్థాపించి మఠాధిపతిగా
    శ్రీ జనార్దన తీర్థులను నియమించారు. ఇక్కడ కూడా శ్రీ కృష్ణుడి విగ్రహాన్నే స్థాపించారు.4. పుత్తిగెయ
    మఠాన్ని స్థాపించి మఠాధిపతిగా శ్రీ ఉపేంద్ర తీర్థులను నియమించారు. ఇక్కడ శ్రీ విఠలుడి విగ్రహాన్ని
    స్థాపించారు5. శిరూర మఠాన్ని స్థాపించి మఠాధిపతిగా శ్రీ వామన తీర్థులను నియమించారు. ఇక్కడ కూడా
    శ్రీ విఠలుడి విగ్రహాన్నే స్థాపించారు.6. సోరెయ మఠాన్ని స్థాపించి మఠాధిపతిగా శ్రీ విష్ణు తీర్థులను
    నియమించారు. ఇక్కడ శ్రీ వరాహ విగ్రహాన్ని స్థాపించారు.7. కాణూర మఠాన్ని స్థాపించి మఠాధిపతిగా
    శ్రీ రామ తీర్థులను నియమించారు. ఇక్కడ శ్రీ నరసింహ విగ్రహాన్ని స్థాపించారు.8. పేజావర మఠాన్ని స్థాపించి
    మఠాధిపతిగా శ్రీ అధోక్షజ తీర్థులను నియమించారు. ఇక్కడ కూడా శ్రీ విఠలుడి
     విగ్రహాన్నే స్థాపించారు.    
                          ఈ ఎనిమిది మఠాల వారి అధ్వర్యంలో 2 సంవత్సరాలకు ఒకరి వంతుగా ఉడిపిలో పూజాది కార్యక్రమాలు నిర్వహించవలెనని నిర్ణయించారు. ఇలా ఒక మఠం నిర్వహణనుండి మరొక మఠం నిర్వహణ లోనికి మారే కార్యక్రమాన్నే 'పర్యాయ మహోత్సవం' అంటారు. ఉడిపిలో జరిగే 'మధ్వ సరోవర మహోత్సవం' కూడా చాలా ముఖ్యమైనది.

                  "శ్రీ భారతీ రమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీ పద్మావతీ సమేత శ్రీ వేంకటేశ్వరో విజయతే"

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS