Sunday, December 17, 2017

మల్లన్న_జాతర



మల్లన్న_జాతర

సర్వకాల సర్వావస్థల్లో జీవకోటికి చైతన్యం కలిగించే రూపమే శివుడని ‘శివపురాణం’ చెబుతుంది. నిశ్చలంగా ప్రకాశించే మహా ప్రాణదీపం మహేశ్వరుడు. జీవశక్తిగా వెలిగే పరంజ్యోతి. ఆయన జలనిధిగా గోచరమయ్యే అపరిమిత ఆనంద సాగరుడన్నది ‘శివజ్ఞానామృతోపనిషత్‌’ వాక్యం.
సమస్త జీవరాశి ఏ విధంగా సంభావిస్తే, ఆ విధంగా అనుగ్రహించే భగవచ్ఛక్తి- శివపరమాత్మ. హృదయ కమలాన్ని వికసింపజేసే భగవానుడాయన. సులభ ప్రసన్న దైవం. అందరి మనోమందిరాల్లోనూ కొలువుతీరే అంతర్యామిగా శివుణ్ని ‘స్కాందపురాణం’ వర్ణిస్తుంది. నిర్గుణ నిరాకారుడైన ఆ పరంధాముడికి అనేక నామాలున్నాయి. అవన్నీ విభిన్న కోణాల్లో శివమహిమ వైభవ సూచకాలంటుంది ‘హరివంశం’.
దైవారాధనకు సంబంధించి మంత్ర సహితమైన శిష్ట సంప్రదాయానికి ఎంత ప్రత్యేకత ఉందో, జానపదుల ఆరాధనా రీతికీ అంతే విశిష్టత ఉంది. శివ మహాదేవుణ్ని అందరివాడిగా, ఆదుకునే దైవంగా భక్తులు కొలుస్తారు. జానపదులు వివిధ రూపాల్లో, పలు నామధేయాలతో ఆరాధిస్తుంటారు. ఆ సంవిధానంలోని విలక్షణ స్వరూపమే కొమరవెల్లి మల్లికార్జునస్వామి. భక్తులు ‘కొమరెల్లి మల్లన్న’ అని వ్యవహరిస్తూ, ఆ స్వామి పట్ల అచంచల విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు.
మార్గశిర మాసం ఆదివారంనాటి మల్లన్న జాతరలో భాగంగా కల్యాణోత్సవాన్ని కనువిందుగా నిర్వహిస్తారు. ఫాల్గుణ మాసం చివరి సోమవారంనాడు నిర్వహించే అగ్నిగుండాలతో జాతర ముగుస్తుంది. మూడు నెలలు కొనసాగే ఈ ఉత్సవాల్లో లక్షలాది భక్తులు పాల్గొంటారు. ప్రతి ఆదివారం, బుధవారం కొలుపులు చేస్తారు. తెలంగాణలోని సిద్దిపేట జిల్లా కొమరవెల్లి గ్రామంలోని ఇంద్రకీల పర్వతంపై మల్లన్న ఆలయముంది. కాకతీయుల కాలం నుంచి ఆ వైభవం కొనసాగుతోంది.
మల్లన్న ఆవిర్భావం గురించి పలు జానపద సంప్రదాయ గాథలు ప్రచారంలో ఉన్నాయి. ఒగ్గు కథ, చిందు భాగవతం, కన్నడ యక్షగాన కళారూపాల్లోనూ కొమరెల్లి మల్లన్న కథలకు అత్యంత ప్రాశస్త్యం ఉంది. శివభక్తుడైన కొమురయ్య నాడు పరమేశ్వరుడి కోసం తపస్సు చేస్తాడు. మెచ్చిన స్వామి అతడికి తన ఉనికిని తెలియజెప్పాడని ప్రతీతి. మల్లెతోటలోని ఓ పుట్టలో మహాలింగంగా మృత్తికా రూపాన కొలువై ఉన్నానంటాడు స్వామి. ఆ మట్టితో తన విగ్రహ రూపాన్ని తయారుచేసి ఆరాధించాలంటాడు. శివాజ్ఞ మేరకు కొమురయ్య ఆ స్థలాన్ని గుర్తించి, పుట్టమన్నుతో శివ స్వరూపాన్ని రూపొందించి, ఇంద్రకీల గుట్టపై ప్రతిష్ఠించాడనేది స్థలపురాణ గాథ. మల్లెపొదల పాదుల్లోని పుట్టలో ఉద్భవించిన మహేశుణ్ని అప్పటినుంచీ భక్తులు మల్లికార్జునుడిగా పూజించుకుంటున్నారు.
కొమురయ్య భక్తికి స్వామి ప్రసన్నుడైన ప్రదేశం కాబట్టి ‘కొమరవెల్లి’ అయింది. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని ‘కుమారవల్లి’గా పిలిచేవారు. మల్లెతోటలో పుట్టలో ఉన్న మహాలింగాకృతిని, శివ తనయుడైన కుమారస్వామి సర్పరూపంలో తన ఇరు దేవేరులతో సదా పరిరక్షించాడంటారు. అందుకే వల్లీ సమేతమైన ఈ క్షేత్రానికి కుమారవల్లి అనే పేరు వచ్చిందని చెబుతారు.
కొమరవెల్లి మల్లన్నను ఈశ్వర స్వరూపమైన మార్తాండ భైరవుడిగా భావిస్తారు. ఈ భైరవుణ్ని మహారాష్ట్రీయులు ‘ఖండోబా’ పేరిట అర్చిస్తారు. కర్ణాటకలో మల్హార దేవుడిగా ఆరాధించుకుంటారు. ఇదే మల్హార దేవుణ్ని తెలుగునాట మల్లన్నగా పేర్కొంటారు.
మల్లన్నకు ఇరువైపులా శక్తిస్వరూపాలైన కేతమ్మ, మేడలమ్మ విగ్రహాలు ఉంటాయి. మహాశివరాత్రి, సంక్రాంతి, ఉగాది పర్వదినాల్లో జాతర మరెంతో వైభవంగా సాగుతుంది. తంటాలు తీరితే టెంకాయ బంధనం కడతామని, పంటలు పండితే పట్నాలు (పాయసం) చేస్తామని భక్తులు మొక్కుకుంటారు. కష్టాలు తీర్చి కోరికలు నెరవేరిస్తే కోడెను అర్పిస్తామని, చల్లగా కాపాడితే చల్లకుండలెత్తుతామని వేడుకుంటారు. బోనాలు ఇస్తామనీ మొక్కి చెల్లించుకుంటారు. జానపదుల భక్తివిశ్వాసాలకు సమున్నత సూచిక- కొమరవెల్లి మల్లన్న వేడుక!
- డాక్టర్‌ కావూరి రాజేశ్‌ పటేల్‌

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS