Sunday, December 17, 2017



ముక్కోటి ఏకాదశి రోజున ఏమి చేయాలి..? ముక్కోటి ఏకాదశి కోటి పుణ్యాలకు సాటి Vaikunta Ekadasi

Vaikunta Ekadasi Vratha Vidhanam Significance of Mukkoti Ekadasi కోటి పుణ్యాలకు సాటి – ఈ ముక్కోటి ఏకాదశి
హైందవుల పండుగలన్నీ అయితే చంద్రమానం ప్రకారమో లేక సౌరమానం ప్రకారమో జరుపుకొంటారు. కానీ ఈ రెండింటి కలయికతో ఆచరించే పండుగ ఒకే ఒక్కటి. అదే ముక్కోటి! సూర్యుడు ధనుసు రాశిలో ప్రవేశించిన తరువాత (సౌరమానం) వచ్చే శుద్ధ ఏకాదశి (చంద్రమానం) రోజున ముక్కోటి ఏకాదశిని వైభవంగా జరుపుకొంటారు. ఈ పుణ్యతిథి గురించి మరిన్ని విశేషాలు…

ఈ రోజున ముక్కోటి దేవతలందరూ విష్ణుమూర్తిని దర్శించుకున్నారని ఓ గాథ. అందుకనే ఈ రోజుకి ముక్కోటి ఏకాదశి అన్న పేరు వచ్చిందట. ఇక ఈనాడే మధుకైటభులనే రాక్షసులకి శాపవిమోచనం కలిగించి, వారికి తన వైకుంఠ ద్వారం వద్ద దర్శనాన్ని అనుగ్రహించాడు విష్ణుభగవానుడు. తమలాగే ఈరోజున ఎవరైతే వైకుంఠ ద్వారాన్ని పోలిన ఉత్తరద్వారాన్ని నిర్మించి స్వామిని దర్శించుకుంటారో, వారికి మోక్షాన్ని ప్రసాదించమని వేడుకున్నారట వారిరువురూ. అప్పటినుంచీ ఉత్తర ద్వారం గుండా శ్రీవారిని దర్శించుకునే ఆచారం మొదలైంది. ఈ ఏకాదశినాడే వైకుంఠంలోని విష్ణుమూర్తివారి ఆంతరంగిక ద్వారాలు తెరుచుకున్నాయి కాబట్టి దీనికి ‘వైకుంఠ ఏకాదశి’ అన్న పేరూ స్థిరపడింది.

అసలు ఏకాదశి అంటేనే హిందువులకి పరమ పవిత్రమైన రోజు. పూర్వం మురాసురుడనే రాక్షసుని సంహరించేందుకు, విష్ణుమూర్తి నుంచి ఒక అంశ వెలువడిందట. ఆమే ఏకాదశి అనే దేవత! ఏకాదశి సేవకు మెచ్చిన విష్ణుమూర్తి, తిథులలోకెల్లా ఏకాదశి గొప్ప తిథిగా ఎంచబడుతుందనీ, ఎవరైతే ఆ రోజు నిష్ఠగా ఏకాదశి వ్రతాన్ని చేస్తారో వారు వైకుంఠాన్ని చేరుకుంటారనీ వరాన్ని ఒసగాడు. అందుకనే ప్రతి ఏకాదశినాడూ మన పెద్దలు క్రమం తప్పకుండా ఉపవాసం చేసేవారు. దీని వల్ల ఏకాదశి ఫలం అనే పుణ్యమూ, ఆరోగ్యమనే పురుషార్థమూ రెండూ లభించేవి. అయితే సూర్యడు ఉత్తరాయణంలోకి ప్రవేశించే ఈ ధనుర్మాసంలోని ముక్కోటి ఏకాదశినాడు కనుక ఉపవాసం చేస్తే, మిగతా ఏకాదశి రోజులలన్నింటిలోనూ ఉపవాసం ఉన్నంత ఫలం దక్కుతుందని నమ్మకం.
వైకుంఠ ఏకాదశినాడు తప్పకుండా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రత విధానం ప్రకారం దశమినాటి రాత్రి నుంచే ఉపవాసానికి ఉపక్రమించాలి. ఏకాదశినాడు కేవలం తులసితీర్థాన్ని మాత్రమే సేవిస్తూ ఆహారానికి దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఏకాదశినాడు బియ్యంలో మురాసురుడు నివసిస్తాడని చెబుతారు. బియ్యంతో చేసిన ఆహారం పూర్తిగా నిషిద్ధం అని కరాఖండిగా చెప్పేందుకే ఈ మాట అని ఉంటారు. ఏకాదశినాడు కేవలం ఉపవాసం ఉండటమే కాదు… ధ్యానంతోనూ, జపతపాలతోనూ కాలం గడపమని సూచిస్తారు పెద్దలు. ఇక ఆ రాత్రి కూడా భగవన్నామస్మరణతో జాగరణ చేయాలి. ఆకలి రుచి ఎరుగదు, నిద్ర సుఖమెరుగదు అన్నారు కదా! ఆ ఆకలి, నిద్రలు రెంటినీ తట్టుకుని, వాటిని అదుపులో ఉంచుకోవడమే ఏకాదశి వ్రత విశిష్ఠత. ఇక మరునాడు ద్వాదశినాడు ఎవరికన్నా అన్నదానం చేసి ఆ తరువాత ఉపవాసాన్ని విరమించాలి.
వైకుంఠ ఏకాదశినాడు వైష్ణవాలయాల్లో ప్రత్యేకంగా తెరిచి ఉంచే వైకుంఠ ద్వారంగుండా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు ఎదురుచూస్తారు. కలియుగ వైకుంఠమైన తిరుమలలో కూడా ఈనాడు, శ్రీవారి గర్భాలయాన్ని ఆనుకుని ఉన్న వైకుంఠప్రదక్షిణ మార్గం ద్వారా భక్తులు నడిచే భాగ్యం లభిస్తుంది. ఏకాదశినాడు తిరుమలలో జరిగే మలయప్ప స్వామివారి ఊరేగింపు, ద్వాదశినాడు స్వామివారి పుష్కరణిలో జరిగే చక్రస్నానాలను దర్శించిన భక్తులు పుణీతులవుతారు.
ముక్కోటి ఏకాదశి మార్గశిర మాసంలో వస్తే కనుక ఆ ఏకాదశిని మోక్షదైకాదశి అని కూడా అంటారు. వైఖానసుడు అనే ఒక రాజు తన తండ్రిని నరకలోకం నుంచి తప్పించేందుకు ఏకాదశి వ్రతాన్ని నిష్ఠాగా ఆచరించాడట. ఆతని వ్రత ఫలితంగా తండ్రి నరకం నుంచి విడుదలై స్వర్గలోకానికి చేరుకున్నాడట. అందుకని ఈ ఏకాదశికి మోక్షదైకాదశి అన్న పేరు వచ్చింది.వైకుంఠ ఏకాదశి నాడు జరిపే ఉత్తర ద్వారా దర్శనం ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా?:
అసుర బాధలు భరించలేక దేవతలు బ్రహ్మతో సహా వైకుంఠం వెళ్లి ఉత్తర ద్వారం దాటి శ్రీమన్నారాయణుని దర్శించి తమ బాధలను విన్నవించి, స్వామి అనుగ్రహం పొంది, రాక్షస పీడ వదిలించుకున్నారు.
ఉత్తరద్వారం గుండా వెళ్లి వైకుంఠ దర్శనం చేసుకోవడం వల్ల వైకుంఠ ఏకాదశిగాను, దివి నుంచి భువికి దిగి వచ్చిన మూడు కోట్ల దేవతలకు గరుడ వాహనరూఢుడైన మహావిష్ణువు దర్శనాను గ్రహం ప్రాప్తించడం వల్ల ముక్కోటి ఏకాదశిగాను ఈ పర్వదినం ప్రాశస్త్యాన్ని సంతరించుకుంది. దీన్నే హరివాసరమని, హరిదినమని వైకుంఠ దినమని అంటారు.

ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానమంటున్నారు పండితులు. ధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశే సంవత్సరంలోని ఇరవై నాలుగు ఏకాదశులలో శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. ఈ వైకుంఠ ఏకాదశి నాడు "వైకుంఠ ఏకదశీ వ్రతం" ఆచరించిన వారికి శుభఫలితాలుంటాయి. పర్వత సలహా మేరకు వైఖానసుడనే రాజు ఈ వ్రతాన్ని ఆచరించి నరక బాధలు అనుభవిస్తున్న పితృదేవతలకు విముక్తి కలిగించాడని పురాణాలు చెబుతున్నాయి.

అలాగే కృత యుగంలో "ముర" అనే రాక్షసుడు దేవతులను, సాధువులను క్రూరంగా హింసించే వాడు. ముర అక్రమాలను భరించలేక దేవతలు నారాయణ స్వామి వద్ద మొరపెట్టుకున్నారు. భగవంతుడు మురాసురుడి మీదికి దండెత్తి, అతని వధించాడు. ముర వెళ్లి సాగర గర్భంలోకి వెళ్లి దాక్కుంటే, అతన్ని బైటికి రప్పించేందుకు ఉపాయం పన్ని గోవిందుడు గుహలోకి వెళ్లి నిద్రపోతున్నట్లు నటిస్తూ పడుకున్నాడు.

అదే అదననుకున్న మురాసురుడు గుహలోకి వచ్చి, విష్ణువును వధించేందుకు కత్తి ఎత్తగానే, మహాలక్ష్మి దుర్గ రూపంలో ప్రత్యక్షమై మురను సంహరించగా, ప్రసన్నుడైన పరమాత్మ ఆమెకు ఏకాదశి అన్న బిరుదు ప్రసాదించాడు. నాటి నుంచి ఏకాదశీ వ్రతం పేరుతో అమ్మవారిని అర్చిస్తామని పురోహితులు అంటున్నారు.

వైష్ణవ ఆళ్వారుల్లో శ్రీనమ్మాళ్వారులీ రోజున పరమపదించడం వల్ల శ్రీ వైష్ణవులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఏకాదశీ వ్రత మాచరిస్తారు. ప్రసిద్ధ వైష్ణవ దేవాలయాలతో సహా శ్రీ తిరుమల వేంకటేశ్వరుని ఆలయంలోను ప్రాత: కాలం నుంచీ ప్రత్యేక ఉత్తర ద్వార దర్శనం కలుగుతుంది. దీనికి వైకుంఠ ద్వారమని ప్రతీతి. సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశానికి ఉత్తర ద్వారం శుభ సంకేతం. దక్షిణాయనంలో మరణించిన పుణ్యాత్ములందరూ వైకుంఠ ద్వారం తెరిచినప్పుడు దాని గుండా స్వర్గంలోని ప్రవేశిస్తారని పురాణాలు చెబుతున్నారు.

అందుకే ఈ పర్వదినాన ఉపవాసముండి లక్ష్మీ సమేతుడైన శ్రీ మహావిష్ణువును షోడశోపచార విధితో ఆరాధించాలి. నిష్ఠతో దీక్షను ఆచరించి రాత్రి జాగరణ చేయాలి. ద్వాదశి రోజున మళ్లీ భగవదారాధన ముగించుకుని పారాయణ చేసి బ్రాహ్మణులను దక్షిణ తాంబూలాదులతో సత్కరించాలి.

ఉపవసించలేని వారు నెయ్యి, నీరు, పాలు, నువ్వులు, పండ్లు భుజించి ఉండవచ్చును. ముక్కోటి ఏకాదశి నడు చేసే విష్ణు పూజ, గీతా పారాయణం, గోవింద నామ స్మరణం, పురాణ శ్రవణం మోక్ష ప్రాప్తి కలిగిస్తాయి. ఇంకా ఏకాదశి వ్రతముండే వారికి మరు జన్మంటూ ఉండదని పురోహితులు చెబుతున్నారు.డా. దెందుకూరి విద్యానాథ్

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS