Friday, August 28, 2020

షోడశ కళల కాళి

 షోడశ కళల కాళి



లలితాదేవి నామావళిలో పద్మనాభ సహోదరి అని ఉంది. ఆమె విష్ణుమూర్తి సహోదరిగా ఎప్పుడు అవతరించింది అంటే కాళీగాథలలో ఆ విశేషం కనిపిస్తుంది. సృష్టి ప్రారంభవేళ అండాల నుండి సమస్త సృష్టి మొదలు అయింది. ఒక అండం నుండి బ్రహ్మ, లక్ష్మీదేవి; మరొక అండం నుండి శివుడు, సరస్వతీదేవి; ఇంకొక అండం నుండి నారాయణుడు, నారాయణి (కాళి) ఉదయించారు. ఒకే అండం నుండి ఉద్భవించినవారు ఒకే తల్లి పిల్లలు. అందుకే ఒకే వర్ణంతో ప్రకాశిస్తారు. అందుకే నారాయణుడు, అతని సహోదరి అయిన నారాయణి నల్లగా ఉంటారు. అలాగే కాళీదేవి పద్మనాభ సహోదరిగా ఈ భూమి మీద అవతరించింది. బృందావనంలో యశోదానందులకు కాళీదేవి ఆడపిల్లగా పుట్టింది, మగపిల్లవాడు కూడా పుట్టాడట. వసుదేవుడు తీసుకువచ్చిన మగశిశువు యశోదకు పుట్టిన మగశిశువు ఒకేలాగ ఉన్నారుట. యశోద ప్రక్కన పడుకున్న మగశిశువులో వసుదేవుడు తెచ్చిన పిల్లవాడు కలిసిపోయాడట (గోలోక కృష్ణుడు ప్రేమస్వరూపుడు. నారాయణ కృష్ణుడు రాక్షససంహారి. ఇద్దరూ ఒకే శరీరంలో 12 ఏళ్లపాటు ఉన్నారని బృందావన సంప్రదాయ పురాణాలు చెబుతున్నాయి.) నందుని కుమార్తెగా పుట్టిన యోగమాయ కాళీదేవిని నందా, నందిని అని అంటారు. ఆమెనే పద్మనాభ సహోదరిగా చెబుతారు. అంతే కాక దేవీభాగవతంలో కాళీదేవి అవతరణ విశేషాలను చెపుతూ ఆమెను యోగమాయగా, మహామాయగా చెప్పారు.


లలితానామాలలో ఆమెను మహామాయ అని అన్నారు. అంతేకాక యుద్ధరంగంలో కాళీదేవి చండముండాసురులను సంహరించింది. చండముండాసుర నిషూదిని, మహాకాళి అని లలితానామాలలో కనిపిస్తాయి. ఇంకా ఎన్నో నామాలలో కాలస్వరూపిణిగా లలితాదేవిని వివరించారు. ఇలా లలితా సహస్రనామాలలో కాళీదేవికి చెందినఎన్నో విశేషాలు, నామాలు కనిపిస్తున్నాయి. కనుక ఎందరో భక్తులు లలితాదేవి, కాళీదేవి యిద్దరూ ఒక్కరే అని విశ్వసించి ఆరాధిస్తున్నారు. ఇద్దరూ/అంతకన్నా ఎక్కువ దేవతల మంత్రాలను ఒకే మంత్రంగా సాధన చేసే విధానాన్ని మంత్రశాస్త్రంలో మంత్ర సంపుటీకరణ అంటారు. లలితాదేవి, కాళీదేవి మంత్రాలను సంపుటీకరించి కొందరు శాక్తేయులు సాధన చేస్తున్నారు. షోడశ కళలతో ప్రకాశించే చంద్రస్వరూపిణిగా లలితాదేవిని, చంద్రకాళి, చంద్రస్వరూపిణిగా కాళీదేవిని ఆరాధిస్తారు. ఇద్దరూ చంద్రస్వరూపమే కాబట్టి ఈ మంత్రాలను సంపుటీకరించి లలితా (చంద్ర)కాళిగా మనశ్శాంతి కోసం (విశేషించి పౌర్ణమి వేళ) అర్చిస్తున్నారు. లలితాకాళి మంత్రం సాధన చేసి ఎటువంటి కష్టాన్ని అయినా పోగొట్టుకోవచ్చు. అందుకే ఎందరో కాళీభక్తులు లలితాకాళిగా ఆమెను ఉపాసించి సత్ఫలితాపొందుతున్నారు.

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS