Thursday, August 27, 2020

ఆపద్బాంధవులు #అశ్వినీదేవతలు!

ఆపద్బాంధవులు
      #అశ్వినీదేవతలు!

మానవులకు, మానవ సమాజానికి హితవు చేకూర్చే వారినే ‘దేవతలు’ అంటారు. ‘కర్మ’ అంటే పని. కృషి, నైపుణ్యం వల్ల మనిషికి దైవత్వం సిద్ధిస్తుందని నిరూపించింది వేదం. కర్మ వల్ల దేనినైనా సాధించగలమని నమ్మిన దేశం మనది. కాబట్టే, భారతదేశం ‘కర్మభూమి’గా పరిఢవిల్లుతున్నది. కర్మ అనేది అదృష్టంపై కాక అకుంఠిత విశ్వాసంపైనే ఆధారపడి ఉంటుందని నిరూపించిన దేవతాద్వ యం అశ్వినులు. అశ్వినీ దేవతల వర్ణన వేదంలో చాలా గొప్పగా ఉంటుంది. దేవతలు అంటేనే విశ్వాసం. ‘సత్యం కనిపించనప్పుడు విశ్వాసమే మహత్తు’ అని తెలియపరిచినవారే ఈ అశ్వినులు.

ఇద్దరు అశ్వినీ దేవతలది విడదీయరాని అద్భుతమైన జంట. 50 సూక్తాలలో 400 సార్లు అశ్వినులను వేదం స్తుతించింది. అశ్వినులు దర్శనీయులు. ప్రపంచానికి అభ్యుదయాన్ని కలిగించే వీరు జీవజాతిని చీకటి నుంచి వెలుగులోకి నడిపిస్తారు. వీరు సర్వజ్ఞులు, మధుమయులు, సకల శుభాలకూ ప్రభువులు. ఒక్కో పనికి ఒక్కో విశిష్ఠ రూపాన్ని ధరిస్తారు. వీరు ప్రపంచ పోషకులే కాక ఉత్తమ పాలకులు కూడా. మనిషి జీవితయాత్రను పరిపుష్ఠం చేయగల దేవతలు. మనకు మూడుపూటలా భోజనంతో పాటు అభయం, ఔషధులు, సౌభాగ్యం అందించగల దయా స్వరూపులు. జీవితాలను నిలబెడుతూ, ఎలాంటి యుద్ధాలలోనైనా, కష్టాల్లోనైనా, అనిశ్చిత పరిస్థితులలోనైనా విజయాలను ప్రసాదించేవారుగా వేద విజ్ఞానం వీరిని ప్రశంసిస్తున్నది.

లోకంలోని ప్రాణుల కష్టాలను పోగొట్టి, వారిని రక్షించడం అశ్వినుల ప్రధాన కార్యం. అది కూడా అతి శీఘ్రంగా రక్షిస్తారన్న పేరు వీరికుంది. దేవతలలో ఎంతో ప్రావీణ్యం గల వైద్యులుగానూ వీరిని పండితులు చెప్తారు. ఔషధాలతో మనుషులను రోగవిముక్తుల్ని చేస్తారంటారు. అందుకే, వీరు ఆరోగ్య దేవతలుగా పేరు పడ్డారు. వీరి రథానికి గుర్రాలే ఉండవని, అది స్వయం చలనశక్తి గలదని చెప్తారు. వీరు చేసే ప్రతీ పని అద్భుతమని వేదం వర్ణించింది. వారి ఘనకార్యాలను వేనోళ్ల పొగిడింది కూడా. యావత్‌ ప్రపంచానికీ పురోభివృద్ధిని ప్రసాదించేవారుగా అశ్వినీ దేవతలను అభివర్ణిస్తారు.

అశ్వినీ దేవతలు ఏమేం చేశారు? అంటే అనేకం. వాటిలో కొన్ని: శర్యాతిని, పఠర్వుడనే రాజును యుద్ధంలో గెలిపించారు. మనువనే రైతుకు విత్తనాలిచ్చి వ్యవసాయానికి సహకరించారు. విమదుడనే రాజుకు, అతని భార్యకు మధ్య సఖ్యతను చేకూర్చి వారి కుటుంబాన్ని నిలబెట్టారు. వేదునికి అందమైన తెల్ల గుర్రాన్నిచ్చారు. ఊకనిప్పును చల్లటి నీటితో ఆర్పి ప్రాణులను రక్షించారు. చీకటి గృహంలో తలకిందులుగా పడున్న అత్రిని అవయవవంతుని చేసి ఆహారాన్ని, బలాన్ని చేకూర్చారు. చ్యవనుని వార్ధక్యాన్ని ‘కవచం వలె’ తొలగించి యవ్వనమిచ్చారు. బావిలో పడిన రేభరుషిని రక్షించారు. నీటిలో పడిన వందనుడిని బయటకు తీశారు. అంధకారంలో పడిన కణ్వమహర్షికి సూర్యతేజస్సును చూపించారు. సముద్రంలో కొట్టుకుపోతున్న భుజ్యుని, అతని సంపదనూ రక్షించారు. అత్రి కోరిక మేరకు ఘర్ముని అగ్నిలోంచి కాపాడారు. శుచరుతునికి మంచిసభలను పరిచయం చేసి ఉపాధి కల్పించారు. కుంటివాడైన పరావృతర్షికి నడకను ప్రసాదించారు. అంధర్షికి చూపునిచ్చారు. మోకాల్లే లేని శ్రోణర్షిని నడిచేట్లు చేశారు. తోడేలు మింగిన వర్తికపక్షిని విడిపించారు. నదుల జలాలను మధుర ఉదకంగా మార్చి వశిష్ఠుని లోకకళ్యాణ కాంక్షను నెరవేర్చారు.

#AyurvedaBooksInTelugu
https://devullu.com/book-category/ayurveda-vaidyam/

ధనాపేక్ష గల విశ్పలకు తెగిపోయిన కాలును అమర్చి, నడిచేటట్టుగా చేసి, ధనాన్నీ అందించారు. దీర్ఘశ్రవుని కోసం వర్షం కురిపించి కరువును పోగొట్టారు. ఎండిపోయిన నదిని పారేట్లు చేశారు. త్రిశోకుని జీవనాధారమైన గోవులను రక్షించారు. సూర్యుని రాహు గ్రహణం నుంచి తప్పించారు. మాంధాత యజ్ఞాన్ని కాపాడారు. గుర్రాలు పోగొట్టుకొన్న పృథిరుషిని ఆదుకొన్నారు. శయన ఋషికి దుఃఖం లేని మార్గం, మనువునకు బతుకుదారి, స్యూమరశ్మికి శత్రువులను ఎదుర్కొనే దోవ చూపించారు. గోతమహర్షి దాహం తీర్చడానికి ‘అడుగుభాగం పైకి, పైభాగం కిందికి’ ఉండే బావిని సృష్టించారు. మూడు భాగాలుగా నరకబడిన శ్యేవుని రక్షించి ప్రాణం పోశారు. రాక్షసులు రేభుడనే వాడిని తాళ్లతో కట్టి నీటిలో పడేస్తే, 10 రోజులు అలాగే పడివున్న అతనిని రక్షించారు అశ్వినులు.

ఇలా అనేకానేక విధాలుగా ఎందరినో కాపాడారు. రోగ విముక్తులను చేసేవారు, సంపదలను ప్రసాదించేవారు, అభయమిచ్చేవారు అయిన అశ్వినీ దేవతలు ప్రపంచానికే ఆపద్బాంధవులు.

ASWINI DEVATALU #ASWINIDEVATALU

No comments:

Post a Comment

RECENT POST

కాణిపాకం శ్రీశ్రీశ్రీ వరసిద్ధి వినాయక స్వామివారు

కాణిపాకం శ్రీశ్రీశ్రీ వరసిద్ధి వినాయక స్వామివారు ప్రతీరోజు ఈ స్తోత్రం కనీసం 4 సార్లుపఠిస్తేచాలామంచిది ఇంకా ఎక్కువ సార్లు పఠించే సమయము, శక్తి...

POPULAR POSTS