నామినంది ఆడిగళ్ నాయనారు
చోళరాజ్యంలో ఏమాపెరూరు (ఇప్పుడు తిరుమప్పత్రు లేక నైప్పెరు) గ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో నామినంది ఆడిగళ్ జన్మించాడు. ఈ ఊరు నుంచి తిరువారూరునకు 2 గంటల నడక దూరముంది. పరమశివుడే నామినంది రక్షకుడు. ప్రతిదినము తిరువారూరు వెళ్లి శివుని అర్చించి వచ్చేవాడు. మనుష్యునకు పరమశివుని పదకమలముల పూజయే సార్థకతని ఇస్తుందని తలచేవాడు. ఒక రోజున తిరువారూరు శివునికి ఏ విధమైన అర్చన చేసిన బాగుండునోనని ఆలోచిస్తే దేవునికి దీపారాధన ఉత్కృష్టమైనదని అనిపించింది.
సూర్యుడస్తమించబోతున్నాడు. పట్టణంలోనికి వెళ్లి దీపారాధనకు నెయ్యి తీసుకురావడానికి ఆలస్యమవుతుందని తోచింది. అందుకని దగ్గరలో నున్న ఇంటికి వెళ్లి శివునికి దీపారాధనకు కొంచెం నేయి ఇమ్మని ప్రార్థించాడు. ఆ ఇల్లు శివారాధనకు వ్యతిరేకులైన జైనుల ఇల్లని అతనికి తెలియదు. వారు ఇతనిని హేళన చేశారు. చేతిలో అగ్నిని ఉంచుకొన్న పరమశివునికి దీపం పెట్టడం సూర్యుని ముందు దివిటీ అని వెక్కిరించి, నీవు దీపాలు వెలిగిగించ దలచుకుంటే నీళ్లతో దీపాలను వెలిగించాలని మొరటుగా జవాబు ఇచ్చారు. ఈ మాటలు వినగానే నంది ఆడిగళ్ కు చిన్నతనమనిపించినది. హృదయావేదన కలిగింది. దుఃఖిస్తూ గుడిలోనికి వెళ్లి దేవుని పాదాలమీద పడ్డాడు. దేవుని హృదయ విదారకంగా ప్రార్థించాడు. ఇంతలో ఒక అశరీర వాణి వినిపించింది. నీరు తెచ్చి ఆ నీటితో దీపాలు వెలిగించమన్న మాటలు వినబడ్డాయి. పరమానందభరితుడై నామినంది ఆడిగళ్, నీళ్ళతో దీపాలన్నీ వెలిగించాడు. ఈ అద్భుతాన్ని చూచి వెక్కిరించిన జైనులందరూ ఆశ్చర్య చకితులైయ్యారు. నంది ఆడిగళ్ - ఇలా - చాలారోజులు దీపాలను వెలిగించాడు.
చోళరాజు నామినంది ఆడిగళ్ గూర్చి చాలా గొప్పగా విన్నాడు. విని అతనిని ఆ ఆలయానికి అధికారిగా నియమించాడు. రాజు దేవునికి పంగుణి ఉత్తరం పండుగను ఘనంగా జరిపేవాడు. గంగను శిరసున ధరించిన శివుని మాటలుగా ఆపని చేయ నిశ్చయించి తన కలశంలో అంతటా నీరుని నింపి దీపారాధన కుందిలో ఆ నీరు పోసి వత్తివేసి వెలిగించాడు. వత్తి దేదీప్యమానంగా వెలిగింది. అవిచూసి ఆ నీరుతో దేవాలయంలోని దీపాల నన్నిటిని వెలిగించాడు. జ్యోతులు ప్రజ్వరిల్లినవి. దేవుని ఊరేగిస్తూ తిరువారూరులికి తీసికొని వెళ్ళేవారు. అక్కడ అన్ని కులాలవారు చుట్టూ మూగి ఆయనను అర్చించేవారు. అలా జరిగిన ఒక రోజున నామినంది దేవాలయం పనులన్నీ పూర్తయాక ఇంటికి వచ్చాడు. తిరువావూరులో అన్ని కులాల వారిని ముట్టుకొని వచ్చానని, అందుకే అపవిత్రుడయినట్లుగా భావించి, ఇంటిలోనికి వెళ్లి దేవుని అర్చించకుండ నిద్రకుపక్రమించాడు. తన భార్యను పిలిచి స్నానానికి నీళ్ళు తెప్పించి స్నానము చేసి ఇంట్లోకి వెళ్దామనుకున్నాడు. కాని చాలా అలసిపోవటంతో నిద్ర ముంచుకువచ్చింది. కలలో శివుడు కనిపించి, అతనితో ఇలా అన్నాడు. "నందీ! తిరువావూరులో పుట్టిన వాళ్లంతా నా గణాలే (నా సేవకులే) వాళ్లని నీవు అపవిత్రంగా భావించకూడదు ఇది నువ్వే నీ కళ్ళతో చూస్తావు" అన్నాడు. నంది అడిగళ్ నిద్రలేచాడు. ఇదంతా భార్యకు చెప్పాడు. తనలోని చెడ్డ తలంపుకు విచారించాడు. వెంటనే ఇంట్లోకి వెళ్లి దేవుని అర్చించాడు. మరునాటి వేకువన తిరువారూరు వెళ్లాడు. అక్కడ అతనికి అంతా శివమయంగా కనిపించింది. అక్కడ పుట్టిన వాళ్లంతా శివ స్వరూపులుగా కనబడ్డారు. అందరూ శివరూపంలోనే పున్నారు. ఇదంతా పరమేశ్వరుని లీల అని నంది గ్రహించాడు.
నంది ఆడిగళ్ తిరువారూరును స్థిరనివాసం చేసుకున్నాడు. అచ్చట శివుని, శివభక్తులను నిష్టతో కొలిచేవాడు. అతని భక్తి తత్పరతను చూచి అందరూ అనిపోన్ (మేలిమి బంగారము) అనిపిలిచేవారు. అంత్యమున శివసాయుజ్యమును పొందినాడు.
***
No comments:
Post a Comment