శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానం- పిఠాపురం
పరమపవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ దత్తావతార శ్రీ పాదవలభస్వామి జన్మించిన పావనక్షేత్రం శ్రీపాదవల్లభ క్షేత్రం. సామర్లకోట కు 15కిలోమీటర్ల దూరం లో తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. లో వుంది.
ఇక్కడ ప్రతినిత్యం శ్రీదత్తాత్రేయపారాయణలలో క్షేత్రo పునీతమవుతోంది.స్వామి వారికి నిత్యం గణపతి, చండీ హోమాలతో అర్చనలు జరుగుతాయి.
అన్నదానం,గోసేవా ఈ క్షేత్రమరో విశేషం.
పాదగయా క్షేత్రంకూడా అతిసమీపంలో వుంది
దత్తాత్రేయ స్వామి మొదలుకొని షిర్డీ సాయిబాబా వరకు ఉన్న గురు పరంపర లో, శ్రీ పాద వల్లభ స్వామి అవతారం విశేషం అయినది. పిఠాపురం లో దత్తాత్రేయ అంశగా ఒక పుణ్య దంపతులకి జన్మించి, గురు స్వరూపమై ఎందరో సామాన్యులను ఉద్ధరించి, వేదోక్తమైన జీవనాన్ని - ధర్మాన్ని నిలిపి, జీవుల కర్మలను బాపి, గానుగా పురం లో నివశించిన స్వామి ఆయన. స్వామి జన్మించిన ఇల్లు ఇప్పటి మహా సంస్థానం.
శ్రీపాద శ్రీవల్లభుల అవతారం :
మానవులను తరింపజేయదలచిన భగవంతుడు, వారికి ధర్మ మార్గం పై ఆసక్తి కలుగజేయడానికి ధర్మాన్ని ముందు తానే ఆచరించి చూపాలి కనుక, మానవరూపంలో భూమిపై అవతరిస్తాడు.ఈ కలియుగంలో కూడా అలాగే పవిత్ర గోదావరీ తీర సమీపంలో పిఠాపురం అనే గ్రామంలో ఆయన అప్పలరాజు శర్మ, సుమతి మాత అనే పుణ్యదంపతులకు శ్రీపాద శ్రీవల్లభునిగా 1330 వ సం|| భాద్రపద శుక్ల చతుర్ధినాడు ఉదయం శుభముహూర్తంలో జన్మించారు.
ఈ దంపతులకు మొదట కొంత మంది పిల్లలు పుట్టి చనిపోయారు.వీరు నిత్యమూ భిక్షకై వచ్చేవారిని శ్రీదత్త రూపాలుగా భావించి భిక్ష సమర్పించేవారు. ఒక అమావాశ్యనాడు వారింట్లో బ్రాహ్మణులను పిలిచి శ్రాద్ధకర్మ ప్రారంభించారు.కానీ ఆనాడు బ్రాహ్మణులకు భోజనం వడ్డించకముందే వారింటికి దండకమండలములు ధరించిన సన్యాసి వచ్చి భిక్ష కోరాడు. శ్రాద్ధ కలాపంలో ఉన్న ఆమె భర్తకు ఈ విషయం తెలియదు. వచ్చిన భిక్షువు శ్రాద్ధ భోక్తయైన పరమేశ్వరుడేనని తలచి ఆయనకు భిక్ష ఇచ్చింది. ఆమె భక్తి విశ్వాసాలకు సంప్రీతుడైన ఆ యతీంద్రుడు యదార్ధమైన తన దత్తాత్రేయ రూపంలో దర్శనమిచ్చి - "తల్లీ నీ అచంచలమైన విశ్వాసానికి సంప్రీతుడనయ్యాను, " శ్రాద్ధ బ్రాహ్మణులు భోజనం చెయ్యకమునుపే నేను పరమేశ్వరుడినన్న విశ్వాసంతో భోజనం పెట్టావు. నీ అభీష్టమేమిటో చెప్పు. నేను తప్పక నెరవేర్చగలను అన్నాడు." అప్పుడు సుమతీ మాత "పరమాత్మా నీవు భక్తుల కోరికలీడేర్చే కల్పవృక్షానివి. నీవు నన్ను తల్లీ అని సంబోధించావు. కనుక నేను ప్రత్యేకంగా వరమడుగవలసిన పనిలేదు. నీవిచ్చిన మాట నిలుపుకోచాలు అన్నది."
భక్తిశ్రద్ధల వలన జాగృతమైన ఆమె బుద్ధిశక్తికి ఆశ్చర్యచకితుడైన స్వామి - "అమ్మా నాతో సమానమైన పుత్రుడే నీకు జన్మిస్తాడు, కానీ నువ్వు చెప్పినట్లే అతను చెయ్యాలని నువ్వు నిర్బంధించకూడదు. అతడు చెప్పినదే అక్షరాలా అమలుజరపాలి. " అప్పుడు మాత "స్వామి నేను మానవమాత్రురాలిని పుత్రవ్యామోహం కలుగడం సహజం, కనుక సమయానుకులంగా అట్టి వివేకాన్ని నీవే కలుగజేయాలి అన్నది. " ఆమె సమయస్ఫూర్తికి మెచ్చి స్వామి నవ్వి, ఆశీర్వదించి అంతర్హితులయ్యరు.
ఆ విధంగా ఆ పుణ్యదంపతులకు జన్మించిన శ్రీపాద వల్లభులు 16 సంIIల ప్రాయం వరకూ పిఠాపురంలో వుండి, అటు తర్వాత సన్యసించి పాదచారియై ద్వారక, కాశీ, బృందావనం మొ|| క్షేత్రాలు దర్శిస్తూ బదరీ వెళ్లి, అటు తర్వాత గోకర్ణం వెళ్లారు.అక్కడ మూడు సంవత్సరాలుండి ఆ క్షేత్రమహాత్మ్యాన్ని పునరుద్ధరించి తర్వాత కృష్ణాతీరంలోని కురువపురానికి వెళ్లి అక్కడ 14 సంవత్సరాలు తపస్సు చేసి అక్కడే తమ స్థూలరూపాన్ని మరుగుపరచారు.
శ్రీపాద శ్రీ వల్లభ మహా సంస్థానం:
సంపూర్ణ శ్రీ పాద శ్రీ వల్లభ చరితామృతం లో శ్రీపాద శ్రీ చరణుల వారు అనేక చోట్ల చెప్పినట్లు గా వారి మహా సంస్థానం ఏర్పడినది. పిఠాపురంలో శ్రీపాద శ్రీ వల్లభ భక్తులందరూ దర్శింపదగ్గ దివ్య ప్రదేశం “శ్రీపాద శ్రీ వల్లభ మహా సంస్థానం”. ఇది పెద్ద బజారు సమీపం లో, వేణుగోపాల స్వామి వారి గుడి వీధిలొ గలదు. ఇచ్చటనే శ్రీపాద శ్రీ వల్లభుల వారి పాదుకలు ప్రతిష్టించబడినవి. ఇచ్చట గల పాదుకల దర్శనం మనలోని అణువణువును గురుభక్తి తో నింపుతుంది.
శ్రీపాద శ్రీ వల్లభ మహా సంస్థానం – ఆవిర్భావం
కర్నాటక రాష్ట్రం లోని సజ్జనగడ ప్రాంతం లో నివసించే శ్రీ రఘువీర రామస్వామి వారు, మరియు వారి తల్లిగారైన శ్రీమతి కమలమ్మ గారు ఇరువురు 1966వ సంవత్సరంలో మొట్టమొదటి సారిగా పిఠాపురం రావడం జరిగింది. వారు కుక్కుటేశ్వర స్వామి వారి ప్రాంగణంలో గల స్వయంభూ దత్తాత్రేయుడిని పూజించి, గురుచరిత్ర ఒకసారి సప్తాహపారాయణ చేసిరి. అప్పటినుండి 11 సంవత్సరాల పాటు ప్రతీ సంవత్సరం వారిరువురు వచ్చి వెళుతుండేవారు. ఒకానొక సంవత్సరం వారి తీర్ధయాత్ర లో భాగంగా నర్సోబావాడి చేరారు. అక్కడ నర్సోబావాడి నరిసింహ సరస్వతి సంస్థానం అధ్యక్షులు వారికి “ఇటువంటి సంస్తానమే పిఠాపురంలో కూడా ఉంటే బాగుంటుందని” సలహా ఇచ్చిరి. తరువాత రఘువీర రామస్వామి వారు, శ్రీమతి కమలమ్మ గారు పిఠాపురం వచ్చి కొంత మంది సభ్యులతో “శ్రీపాద శ్రీ వల్లభ మహా సంస్థానం” అనే ఒక కమిటిని ఏర్పరిచిరి. శ్రీపాద శ్రీ వల్లభ మహా సంస్థానంనకు కొంత స్థలమున్న బావుంటుందనే ఆలోచనతో శ్రీమతి కమలమ్మ గారు అనేక స్థలములను చూసిరి. అందరికి ఆమోదయోగ్య మైన స్థలమొకటి (పాత శిధిలావస్థలో ఉన్న ఇల్లు మరియు స్థలం) దొరికింది. కాని దానిని అమ్ము వారు ఆ స్థలం యొక్క ధర రూ. 35000/- చెప్పిరి. అంత డబ్బు కమిటి వద్ద లేకపోవడం చేత ఆ ప్రయత్నమును విరమించుకొనిరి. ఇదంతా సుమారు 1978-79 ప్రాంతాలలో జరిగింది. కొద్ది సంవత్సరముల తరువాత శ్రీమతి కమలమ్మ గారు అప్పుచేసైనా సరే ఆ స్థలాన్ని కొనవలెనని శ్రీపాదుల వారిచే ప్రేరేపింపబడినారు. అంతట 1983 వ సంవత్సరంలో అప్పు చేసి ఆ స్థలాన్ని కమిటి వారు కొన్నారు. అందులో గల పాత ఇంటిని శుబ్రం చేసి ఒక చిన్న ఆసనం వేసి దాని పై దత్తాత్రేయుడు, శ్రీ పాదుడి పటాలతో పాటుగా శ్రీధరస్వామి (ముందు జన్మలో శ్రీపాదుల వారి సహోదరులు) మరియు సమర్ధ రామదాసు పటములను ఉంచిరి. ఆచిన్న ప్రాంగణం లోనే ఆ చిన్న ఇంటి పక్కనే 1985వ సంవత్సరంలో ఔదుంబరమును నాటిరి (నేడు ఆలయ ప్రాంగణం లోపల కనిపించే ఔదుంబరం) ఆవిధంగా దినదిన ప్రవర్ధమానం చెందుతూ 1987వ సంవత్సరంలో మందిర నిర్మాణం జరిగినది. ఆ మందిరంలో 22-02-1988 లో మనం ఇప్పుడు చూస్తున్న శ్రీపాదుల వారి శ్రీ గురు చరణాలు (పాదుకలు) శ్రీ రఘువీర రామస్వామి (సజ్జనగడ రామస్వామి) వారి చేతుల మీదుగా ప్రతిష్టింపబడినవి. 06-02-1992 లో ఇప్పుడు మనం చూస్తున్న శ్రీ పాద వల్లభ , దత్తాత్రేయ , నృసింహ సరస్వతి పాలరాయి విగ్రహాలు ప్రతిష్టించబడినవి.
No comments:
Post a Comment